submerged villages
-
జ్ఞాపకాల్లో మునిగి తేలారు!
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు. మునిగితేలిన ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి పాతూరు చూసేందుకు వచ్చిన.. పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక 60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం సాక్షి, నాగర్‌కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్‌లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం. కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు. -
నీట మునిగిన గ్రామాలలో పర్యటించిన జేసీ
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది మండలంలో నీటమునిగిన గ్రామాలను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే నీట మునిగిన గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గండిపడిన చెరువులకు మరమ్మత్తులు చేయడంతో పాటు, నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు నేడు, రేపు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వరదనీటితో నిండిపోయిన గ్రామాల్లో తక్షణ వైద్యసాయం అందించాలంటూ సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు ఆయన వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని, గ్రామ సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. -
మునిగిపో..తున్న చదువుల తల్లి
సాక్షి,రంపచోడవరం/దేవీపట్నం(తూర్పు గోదావరి): అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకం అమలుకు చర్యలు తీసుకోవడంతో.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని ప్రజలందరూ చదువుల వైపు దృష్టి సారిస్తున్నారు. మరో పక్క.. గత టీడీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కాఫర్ డ్యామ్ వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో పాఠశాలలు ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులకు పునరావాసాన్ని కల్పించే కాలనీలే ఇప్పటికీ పూర్తి కాలేదు. అక్కడ పాఠశాలల ఏర్పాటు విషయాన్ని అప్పటి పాలకులు పట్టించుకోలేదు. దీంతో ముంపు ప్రాంతాల్లో విద్య కొండెక్కినట్టేనా? అన్న అనుమానాలు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితుల్లో వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు అధికారులూ సిద్ధంగా లేరు. ఈ విషయంపై దేవీపట్నం గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ ముంపు ప్రాంతాల్లోని విద్యార్థులను చదువులకు దూరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 35 కాంటూర్ వరకు వరద వస్తే ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేసి నిర్వాసితులకు తాత్కాలికంగా టెంట్లు వేసి అక్కడకు తరలించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. అయితే ముంపు గ్రామాల్లో ఉన్న పాఠశాలల గురించి విద్యార్థుల విషయంపై మాత్రం అధికారులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. వరద సమయంలో ఈ ముంపు గ్రామాల్లో పాఠశాలల పరిస్ధితి ఏమిటనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఈ ఏడాది వరద సమయంలో తమ పిల్లలు పాఠశాలలకు దూరం కావాల్సిందేనా? అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా వరద వస్తే.. ఈసారి రెండు, మూడు రోజుల్లో నీటిమట్టం తగ్గి పరిస్థితి ఉండదు. సమీపంలోని పోశమ్మ గండి వద్ద గోదావరిపై కాఫర్ డ్యామ్ నిర్మాణమే ఇందుకు కారణం. చదువు ముందుకు సాగేనా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఐదు మండలాలు ముంపునకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో వచ్చే వరదలకు పాఠశాలలు నిర్వహించే పరిస్థితి లేదు. కాఫర్ డ్యామ్ వల్ల విలీన మండలాల్లోని పాఠశాలల్లో ఈ ఏడాది ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే దేవీపట్నం మండలంలోని సుమారు 37 ప్రాథమిక పాఠశాలలు, ఒక జెడ్పీ పాఠశాల, ఒక గిరిజన సంక్షేమ పాఠశాల, ఒక జూనియర్ కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. తాత్కాలిక పునరావాసం అందరకీ ఒకే చోట కల్పించే అవకాశం కనిపించడం లేదు. పలువురు మండలాన్ని వదిలి బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికారులు కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం కేవలం గ్రామాల్లో పునరావాసంపై దృష్టి సారించారు. అయితే నేటికీ ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం పూర్తి కాలేదు. అక్కడ పాఠశాలల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. అధికారులు తీరు ఎలా ఉందంటే.. ‘కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు. మీ చావు మీరు చావండి’ అన్న చందంగా ఉందని నిర్వాసితులు విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులు, ముంపు ప్రాంతాల్లోని విద్యార్థుల గురించి ఆలోచనే చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ వరదలు వస్తేనే పది రోజుల పాటు విద్యార్థులు చదువుకు దూరం అవుతుంటారు. కాఫర్ డ్యామ్ వల్ల వరద నీరు రోజుల తరబడి ఉండిపోతుంది. దీంతో 42 గ్రామాలు జలమయం అవుతాయి. దిగువకు నీరు వెళ్లే మార్గం లేదు పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం గోదావరి నీటిని మళ్లించేందుకు ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించారు. అయితే ఫీ డ్యామ్ వద్ద పైడిపాక వద్ద గొట్టాలతో ఏర్పాటు చేసిన మార్గం ద్వారానే నీరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. సాధారణంగా భద్రాచలం వద్ద 43 అడుగులుకు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నాలుగో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటారు. అయితే కాఫర్ డ్యామ్ 2,500 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. ప్రస్తుతం 1,850 మీటర్ల మేర ఎత్తు చేసి పనులు కొనసాగిస్తున్నారు. 35 అడుగుల ఎత్తున ఈ డ్యామ్‌ను నిర్మించారు. దీంతో గోదావరి వరదల సమయంలో బ్యాక్ వాటర్ గ్రామాలను ముంచేత్తుతుంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేసే పరిస్థితి లేదు. -
మునిగిపోతున్న జీవితం
అయినవారి త్యాగాలకు వేదికలపై సన్మానాలు.. పుల్లా పుడకా ఊడ్చి ఇచ్చేసి నిరాధారంగా నిలబడ్డ బడుగులపై భారీ ప్రొక్లైనర్ల ఉక్కుహస్తాలూ... ప్రజలు చేసే త్యాగాలను గుర్తించడంలో కూడా పక్షపాతమేనా! తవ్విపోసిన పోలవరం కొండల శిధిలాలను చూస్తున్నపుడు, 2018 కల్లా ప్రాజెక్ట్‌ని పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రకటన విన్నపుడూ నిర్మాణం ఆపేయాలన్న డిమాండ్ ఇక సరైంది కాదేమో. ఇప్పుడు మాట్లాడాల్సింది బాధితులకి జరగాల్సిన న్యాయం గురించి. కుండలూ తపేళాలతో సహా ఇళ్ళను, జీవికతో ముడిపడి ఉన్న అడవిని, దాహం తీర్చే నదిని దానం చేసేసిన నిర్వాసితుల గురించి మాట్లాడాలి. ఖాళీ అయిపోయిన జీవితాన్ని కళ్ళముందర పెట్టుకుని పాతూరు కొత్తూర్ల మధ్య గాల్లో అయోమయంగా గిరికీలు కొడుతున్న పిట్టల్లాంటి గిరిజ నులు, పల్లీయుల నిస్సహాయత గురించి మాట్లాడాలి. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నుంచి 30 మందికి పైగా రచయిత్రులం పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు, పునరావాస గ్రామాలను సందర్శించి నపుడు శూన్యంలో కొట్టుకుపోతున్న అనుభూతి కలిగింది. అమరావతి నిర్మాణం కోసం విదేశీ ప్రణాళికలు వేసి భూములను కోల్పోయిన అక్కడి ధనిక, మధ్యతర గతి రైతులను, నిర్మాణ ఫలాల్లో భాగస్వాములను చేసింది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అలాంటి నమూనా ఎందుకు రూపొందించడం లేదు? బహుళార్థ సాధక ప్రాజెక్టులయినా, రాజధాని నిర్మాణా లయినా ప్రజలు చేసే త్యాగాలను గుర్తించడంలో కూడా పక్షపాతమేనా! అయినవారి త్యాగాలు వేదికలపై సన్మానాలు పొందుతుంటే, తమకున్న పుల్లా పుడకా ఊడ్చి ఇచ్చేసి నిరాధారంగా నిలబడ్డ బడుగులపై భారీ ప్రొక్లై నర్లు ఉక్కుహస్తాలను విసురుతున్నాయి. మరణాన్ని కూడా గౌరవంగా చూడాలనే ఆధునిక సమాజంలో, జీవించి ఉన్నవారిని తరలించడంలో ఎంతటి మానవీయత చూపాలి? నిర్బంధ వలసల వల్ల అక్కడి ప్రజల్లో ప్రాజెక్ట్ పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ‘నవ్వాలో ఏడవాలో తెలీడం లేదండీ బాబో! వండుకున్న తపేళాలతో సహా అందరి సామాన్లు ఆళ్లే లారీల్లోకి విసిరేత్తన్నారు. మేము కిందకి దింపడం, వాళ్ళు లారీల్లో పెట్టడం, చివరాకరికి బాంబు లుపెట్టి పేల్చేత్తామని బెదిరించడంతో ఖాళీ చెయ్యక తప్పలేదు’ అని కొత్త రామయ్యపేట పునరావాస గ్రామంలో ఒక మహిళ వాపోయింది. నష్టపరిహారం విషయంలో కూడా పదోపరకో అంటగట్టి వదిలించుకోవాలన్న తాపత్రయం తప్ప పటిష్టమైన ప్రణాళిక అంటూ ఏమీలేదు. అగ్ర కులస్తు లకి ఇల్లుకి ఇల్లు, పొలానికి డబ్బు నష్టపరిహారం ఇచ్చారు. ఇంటికి పొలానికి ఇచ్చిన పరిహారంతో ఇల్లు మాత్రమే సాదాసీదాగా కట్టుకోగలిగారు. వారికిక ఏ ఆధారమూ లేదు. పునరావాస గ్రామాలకి చుట్టుపక్కల ఉపాధి అవకాశాలూ లేవు. ఆ గ్రామాలు కూరపాదులు వేసుకోడానికి కూడా వీలులేని రాతినేలలు. కోయ, దొరోళ్ల కొత్తల వంటి ఎస్టీలకి పొలానికి పొలం ఇచ్చారు కానీ పునరావాస గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. దానివల్ల గిరిజనులకి ఉపాధి దక్కదు. వాడీయులు, గూళ్ళొడ్డీలు, అగ్నికుల క్షత్రియులది మరొకరకం సమస్య. ఈ జాలర్లకి గోదావరి నదే ఏకైక ఆధారం. రాత్రి 2, 3 గంటల సమయంలో వేటకి వెళ్లి ఉదయం 8 గంటలకి తిరిగొచ్చి వలలో పడ్డ చేపల్ని అమ్ముకుంటారు. జాలర్లు తమ వృత్తిని దాటి వేరేపనిలో నైపుణ్యాన్ని పొందడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకే తమకి కేటాయించే ఇళ్ల స్థలాలు నదీ తీరప్రాంతాల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తమకి డబ్బూ అదీ వద్దని మా గోదారిని మాకు ఇస్తే చాలని ఒక యువకుడు ఆవేదనతో చెప్పాడు. అక్కడి ప్రజలంతా మూకుమ్మడిగా చెప్పింది ఒకటే మాట, చేయడానికి పనులేమీ లేవని. ఏ నష్టపరిహా రమూ ఈ లోటుని పూరించలేదు కాబట్టి ఉపాధి అవకా శాలని సత్వరం మెరుగుపరచాలి. ఈ పేరుతో మళ్ళీ పెద్ద కంపెనీలకి దార్లు తెరవడం కాకుండా ప్రజల భాగ స్వామ్యంతో వారి స్వావలంబన కోసం అక్కడి ప్రకృతి వనరుల వినియోగం జరగాలి. పునరావాస గ్రామాల్లో ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చే ఆర్థిక సంక్షోభాలు ప్రభుత్వ ప్రయోజనాల రీత్యా మంచివి కావు. కనుక నిర్వాసితులకి ముందుగా ఆర్థిక స్థిరత్వాన్ని హామీ ఇవ్వాలి. 36 వేల కోట్లకి చేరిన ప్రాజెక్ట్ వ్యయానికి వందల కోట్లలోనే నిధులు విడుదల కావడానికీ మధ్య ఉన్న అంతరాలను, వాటి కారణాలను ప్రభుత్వం వెల్లడించాలి. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎవరి నెత్తిమీద భారం రుద్దబోతుందో ప్రకటించాలి. తాళాలు లేని ఇళ్ళని కల గనే మేధావులకి తలుపులే లేని నిర్వాసితుల ఇళ్ళు అసంతృప్త వర్తమానం. బాధి తులకి అందించాల్సిన కూడూ గూడూ నీడల ఏర్పాట్ల లోనే అడుగడుగునా వైఫల్యం కనపడుతున్న చోట ప్రజల మానసిక, సాంస్కృతిక విధ్వంసాల గురించి మాట్లాడటం ఒక విలాసం. ఎరట్రి ఎండవేళ మొక్క యినా మొలవని ఒక పునరావాస గ్రామంలో చెల్లాచెదు రుగా పడున్న వస్తువుల మధ్య వంగిపోయిన నడుంతో కుక్కిమంచంలో కూరుకుపోయి కూచున్న 85 ఏండ్ల ముదుసలి స్త్రీ జనాంతికంగా అన్నమాట సన్నగా చెవిలో హోరెత్తుతోంది. ‘‘ ఏవుందీ ఇక్కడ! తీసుకొచ్చి అడవిలో పడేసారు.’’ అడవిలో జీవించి అడవిలో పడిపోయిన పోలవరం నిర్వాసితుల పుట్టి ములిగిపోతోంది. ఎత్తి ఒడ్డున పెట్టండి. -కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ) మొబైల్: 8885016788 -
ముంపు ప్రాంతాలపై కేసీఆర్ మౌనం దారుణం: మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం డివిజన్లోని 200 ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) అధినేత మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. శని వారం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పది జిల్లాల ఎంఎస్పీ నాయకుల, కార్యకర్తల సదస్సు జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ భూస్వాములు, సీమాంధ్ర పెట్టుబడిదారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ముంపు గ్రామాల్లో నివసిస్తున్న 3 లక్షల మంది ఆదివాసీలను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సీమాంధ్రులకు బలిచ్చారని పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాలపై కేసీఆర్ మౌనం వహించడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును నమస్తే తెలంగాణ ఎండీ సి.లక్ష్మీరాజానికి కట్టబెట్టడానికే ఆదివాసీలను బలిపశువులను చేశారని విమర్శించారు.