ఏడు టీఎంసీలకుపడిపోయిన మిడ్‌మానేరు
తేలిన ముంపుగ్రామాలు
పాత ఊళ్లను చూసేందుకు వస్తున్న నిర్వాసితులు
డెడ్ స్టోరేజీకి చేరువలో ‘ఎస్సారెస్పీ
బయటపడుతున్నగ్రామాల ఆనవాళ్లు
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు.
మునిగితేలిన ముంపు గ్రామాలు
బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి.
గుర్తుకొస్తున్నాయి
మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి
పాతూరు చూసేందుకు వచ్చిన..
పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక
60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు
బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి.
గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు.
జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం
సాక్షి, నాగర్‌కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్‌లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం.
కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment