ఐదు రోజులుగా నీటిలోనే పలు కాలనీలు
ఇప్పటికీ లోపలి ప్రాంతాలకు అందని ఆహారం
(విజయవాడ ముంపు ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు) : ఐదు రోజులు గడిచిపోయినా ముంపు నుంచి బెజవాడ బయటపడలేకపోతోంది. వరద కొంతమేర తగ్గినా లోతట్టు ప్రాంతాలు నీళ్లలోనే నానుతున్నాయి. ఏ బాధితుడిని కదిలించినా వ్యథా భరిత గాథలే. వరద తగ్గడంతో విజయవాడ–నూజివీడు రహదారిపై రాకపోకలు మొదలైనా అది కేవలం ప్రధాన రోడ్లకే పరిమితమైంది.
ఆ రోడ్డుకి అనుబంధంగా ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో ఇంకా మోకాల్లోతు నీరుంది. ఇంట్లో సరుకులు, వస్తువులు నీళ్లలో మునిగిపోవడంతో మొత్తం మళ్లీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ముంపు ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం రావడం, ఇళ్లను వెంటనే బాగు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వేలాది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వీడి వలస వెళ్లిపోతున్నాయి.
శుభ్రం చేసుకునేందుకు అవస్థలు
వరద ప్రాంతాల్లో అక్కడే ఉంటున్న వారు ఇళ్లలో నీరు బయటకు తోడేందుకు ప్రయతి్నస్తున్నారు. బురదను తొలగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు పెద్దఎత్తున ఫైరింజన్లు తెప్పించామంటూ ప్రభుత్వం చెబుతున్నా చాలా పరిమిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతాల్లో కొన్ని ఇళ్లల్లో నీళ్లు చల్లి వెళ్లిపోవడం మినహా ఫైరింజన్ల వల్ల పెద్దగా ఉపయోగం కనిపించడంలేదు. ముంపులో ఉన్న లక్షల ఇళ్లను ఎవరికి వారే శుభ్రం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
పునరావాసం ఉత్తిమాటే
విజయవాడలో ఇంకా నాలుగు లక్షల మందికిపైగా వరద ముంపులో ఉంటే.. కనీసం పది శాతం మందికి కూడా పునరావాసం క ల్పించలేదు. ప్రస్తుతం 42 పునరావాస కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అందులో సగం ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడం లేదు. అక్కడక్కడా కొన్ని కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను పునరావాస కేంద్రాలు మార్చినట్లు చెబుతున్నా అరకొరగానే ఉన్నాయి.
అధికారికంగా 14 వేల మందికి ఆశ్రయం కల్పించామని ప్రభుత్వం చెబుతుండగా వాస్తవానికి ఆ సంఖ్య రెండు, మూడు వేలు కూడా ఉండదని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. దీంతో బాధితులు ఎవరికి వారు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కొందరైతే దూర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోతున్నారు. పునరావాసం ఎలా ఉందో చెప్పడానికి ఇలా బయటకు వెళ్లిపోతున్న వారి సంఖ్యే నిదర్శనం.
అందని నిత్యావసరాలు..
ప్రతి బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఇంతవరకు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, ఆయిల్, బంగాళాదుంపలు, టమాట ఇస్తున్నట్లు చెబుతున్నా అది కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రజలు ఎవరి బాధలు వారే పడి నిత్యావసర వస్తువులు కొనుక్కుంటున్నారు. మరోవైపు బాధితుల రవాణా కోసం బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా అదీ ఎక్కడా కనిపించడంలేదు.
మహిళల బాధ వర్ణనాతీతం
వరద ప్రాంతాల్లో ఐదు రోజులుగా స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నెలసరితో ఇబ్బంది పడుతున్నవారికి శానిటరీ నాప్‌కిన్స్ కూడా దొరకడం లేదు. మార్చుకునేందుకు మరో చీరగానీ, డ్రస్‌గానీ లేక కట్టుబట్టలు పాడైపోయి నరకం అనుభవిస్తున్నారు.
చిన్న దుకాణాల పరిస్ధితి దారుణంగా ఉంది. వేలాది దుకాణాల్లో సరుకులు పనికిరాకుండా పోయాయి. బియ్యం, కిరాణా, నిత్యావసర సరుకులు, దుస్తులు, పుస్తకాలు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించే దుకాణదారులు ఆ సరుకంతా బయపడేయడం తప్ప వారికి వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో ఇంటికీ రూ.లక్షల్లో నష్టం
వరద భారీ నష్టం మిగిల్చింది. ఒక్కో ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ కేవలం సామాన్లకే నష్టం వాటిల్లింది. ఐదు రోజులుగా నీటిలోనే ఇంటిలో సామాన్లు ఉండిపోవడంతో తడిసి పాడైపోయాయి. అక్కడే ఉండక తప్పదనుకున్న వారు వరద నీరు తగ్గడంతో వస్తువులను రోడ్ల మీదకు తెచ్చి ఆరబెట్టుకుంటున్నారు. ఎండ రాకపోవడంతో బియ్యం, మంచాలు, పరుపులు, ఇతర సామగ్రి బురదతో నిండిపోయి పనికి రాకుండా పోయాయి.
వాహనాల మరమ్మతులకు పాట్లు
వరద నుంచి బయటపడ్డ వాహనాలను బాగు చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మెకానిక్‌లు లేక సొంతంగా రిపేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు వాహనాలను అక్కడి నుంచి అష్ట కష్టాలు పడి రబ్బరు ట్యూబుల సాయంతో మెకానిక్‌ల వద్దకు తరలిస్తున్నారు. మరమ్మతులకు ఒక్కో ద్విచక్ర వాహనానికి కనీసం రూ.20 వేలు అడుగుతున్నారు. కంపెనీ షోరూమ్‌కి తీసుకువెళితే రెట్టింపు బిల్లు వేస్తున్నారు.
మాది పల్నాడు జిల్లా చిలకలూరిపేట. నా భార్య రెండో కాన్పు కోసం సింగ్‌నగర్ వాంబే కాలనీలోని పుట్టింటికి వచ్చింది. వరదలకు మా మామ ఇల్లు మునిగిపోయింది. నేను మా ఊరి నుంచి రాలేక... ఆమె చంటి బిడ్డతో బయటపడలేక నరకయాతన అనుభవించాం. నాలుగు రోజుల తరువాత అతికష్టం మీద ఇక్కడికి వచ్చి చూస్తే ఇల్లంతా బురదతో నిండిపోయింది. సామానంతా పాడైపోయింది. దీంతో అందరం కలసి మా ఊరికి వెళ్లేందుకు వరద నీటిలో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చాం. ప్రభుత్వం ఎలాంటి వాహనాలను ఏర్పాటు చేయలేదు – వెంకటరత్నం
Comments
Please login to add a commentAdd a comment