
ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పడానికే ర్యాంకులు
సాక్షి, అమరావతి: మంత్రుల్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పడానికి వారికి ర్యాంకులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఈ ర్యాంకులతో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడడంతో స్పందించినట్లు తెలుస్తోంది. ఎవరినీ ఎక్కువ చేయడానికి, ఎవరినీ తక్కువ చేయడానికి ఈ ర్యాంకులు ఇవ్వలేదని శుక్రవారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
ద్రస్తాల పరిష్కారంలో విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను కూడా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో తాను, తన కేబినెట్ సహచర మంత్రులు పనిచేస్తున్నారని తెలిపారు.
గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చగలుగుతామని, సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలుగుతామని పేర్కొన్నారు. ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.