నగరంలో పలు ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లు
క్లాక్ టవర్ల నగరంగా హైదరాబాద్
చారిత్రక, వారసత్వ చిహ్నాలుగా ఏర్పాటు
నిరుపయోగ స్థితిలో పలు గడియారాలు
పునరుద్ధరణ చేపట్టాలని నగరవాసుల విజ్ఞప్తి
గొప్ప సాంస్కృతిక, వారసత్వ చరిత్ర కలిగిన హైదరాబాద్‌కు ఘడి చౌక్‌గానూ పేరుంది. చార్మినార్, గోల్కొండ వంటి వారసత్వ కట్టడాలకు నిలయమైన ఓల్డ్ సిటీ నుంచి సైబర్ టవర్స్, హైటెక్ సిటీ వంటి ఆధునిక నగరం మీదుగా.. నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందనున్న ఫ్యూచర్ సిటీకి విస్తరిస్తోంది. సిటీ ఏదైనా సరే అప్పటి సంస్కృతి, అభివృద్ధిని సూచించే విధంగా ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లను నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. నాడు ఓల్డ్ సిటీలో క్లాక్ టవర్లు వారసత్వ గుర్తింపుగా నిలిస్తే.. నేడు ఐటీ పార్క్‌లు హైటెక్ సిటీ ల్యాండ్ మార్క్‌గా మారిపోయాయి. ఇక, రానున్న ఫోర్త్ సిటీ భవిష్యత్తు తరాలకు ప్రతీకగా నిలిచిపోయేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు, ప్రదేశాలతో నిండిన భాగ్యనగరంలో.. నిర్లక్ష్యానికి గురవుతున్న చారిత్రక కట్టడాల్లో క్లాక్ టవర్లు కూడా ఉన్నాయి. నిజాం కాలంలో ఈ ఐకానిక్ నిర్మాణాలు వారసత్వ చిహా్నలగా విరాజిల్లాయి. నాటి చరిత్రకు ఇవే కీలకమైన మైలురాళ్లు. సమయ పాలనతో పాటు నగరంలోని రద్దీ వీధుల్లో దిక్సూచిగా నిలిచేవి. విస్తరణలో క్రమేణా వీటి ప్రాముఖ్యత తగ్గింది. కానీ, రాతితో చెక్కిన చారిత్రక గుర్తులు నేటికీ పూర్వ వైభవం కోసం వేచిచూస్తున్నాయి.
మోజమ్ జాహీ మార్కెట్..
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1935లో మోజమ్ జాహీ మార్కెట్‌లో క్లాక్ టవర్ నిర్మించారు. మార్కెట్‌లో అత్యంత ఎత్తయిన నిర్మాణం ఇదే. రెండు అంతస్తులు, అష్టభుజి ఆకారంలో ఉంటుంది. మార్కెట్‌లోని అన్ని దిక్కుల నుంచి వీక్షించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేశారు. విక్రేతలు, దుకాణదారులు సమాయానికి బస చేసేవారు.
ఒక్కో మతం.. ఒక్కో తీరు..
క్లాక్ టవర్లు దేనికవే ప్రత్యేకమైనవి.. చరిత్ర కలిగినవి. ఇవి గంటలను మాత్రమే కాకుండా భక్తి శ్రద్ధలు, రోజువారీ జీవిన విధానాన్నీ సూచిస్తాయి. వివిధ మతాల సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్నాయి. క్రైస్తవ సంప్రదాయంలో చర్చిల పైన ఉన్న బెల్ టవర్లు ప్రార్థన గంటలను సూచిస్తాయి. ఇస్లామిక్ సంస్కృతిలో ప్రార్థనలకు పిలుపుగా సూచిస్తారు. మసీదు మినార్ల నుంచి మోగుతూ ఆ సమాజాన్ని ఏకంచేసే కాల గమనాన్ని సూచిస్తుంది. హిందూ ఆచారంలో గంటలు, శంఖాల శబ్దం ప్రజలను ప్రార్థనలకు మేల్కొలుపుతాయి.
చౌమహల్లా ప్యాలెస్..
చౌమహల్లా ప్యాలెస్ పశ్చిమ దిక్కున ప్రధాన ద్వారం వద్ద ఉన్న టవరే ఖిలాఫత్ గడియారం. 1750లో నిర్మించిన టవర్ మూడు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మొఘల్ శైలికి చెందిన ఝరోకాలతో, హారాలజిస్ట్ నిపుణుల కుటుంబం ప్రతి వారం యాంత్రిక గడియారాన్ని మారుస్తూ ఉంటుంది. ఖిలాఫత్ గడియారం చారిత్రక మైలురాయిగా మాత్రమే కాదు.. నగర సాంస్కృతిక, ఆధ్యాతి్మక చిహ్నంగా గుర్తింపు పొందింది.
జేమ్స్ స్ట్రీట్..
సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లో జేమ్స్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో క్లాక్ టవర్ ఉంది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ వారు నిర్మించిన చారిత్రాత్మక టవర్. ఇది ఒకప్పుడు రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్‌కు నిలయంగా పనిచేసింది. దీని నిర్మాణానికి నిధులను అందించిన సేథ్ రాంగోపాల్ గౌరవార్థం ఆయన పేరే పెట్టారు. ఈ గడియారం వలస నిర్మాణ వారసత్వాన్ని సూచిస్తుంది.
చార్మినార్..
చార్మినార్ పై ఉన్న నాలుగు గడియారాలు 1889లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ఏర్పాటయ్యాయి. లండన్ నుంచి తీసుకొచి్చన నాలుగు గడియారాలనూ చార్మినార్‌కు నాలుగు వైపులా ఆర్చ్ మధ్యలో అమర్చారు. ఈ గడియారం ముళ్లుల గుండా గాలి ప్రసరించినా ఖచి్చతమైన సమయాన్ని సూచిస్తాయి. నాలుగిటిలో గుల్జార్ హౌజ్‌కు ఎదురుగా ఉన్న గడియారం ఒక్కటే ప్రతి గంటకూ ఒకసారి మోగుతుంది. అయితే నాలుగు గడియారాలకూ ప్రతి 48 గంటలకు ఒకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది.
మోండా మార్కెట్..
సికింద్రాబాద్‌లో సందడిగా ఉండే మోండా మార్కెట్‌లోని టవర్ పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 1920–40 ప్రాంతంలో రైస్, ఆయిల్ మిల్లు వ్యాపారంలో ఉన్న సంపన్న డూండూ కుటుంబం దీనిని నిర్మించింది. విలాసవంతమైన ఆర్ట్ డెకో శైలిలో దీని నిర్మాణం వాణిజ్య కేంద్రాల వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
మహబూబ్ చౌక్..
1892లో సర్ అస్మాన్ జా ఈ టవర్‌ను నిర్మించారు. చార్మినార్‌కు పశ్చిమాన మహబూబ్ చౌక్‌లో చిన్న తోటలో టర్కిష్ శైలిలో దీన్ని నిర్మించారు. స్థానిక ప్రజలకు సమయాన్ని సూచించేందుకు ఉద్దేశించిన ఈ క్లాక్ 72 అడుగుల ఎత్తులో
ఉంటుంది.
సుల్తాన్ బజార్..
నగరంలోని పురాతన క్లాక్ టవర్లలో ఇదొకటి. 1865లో బ్రిటిష్ పాలనలో చాదర్‌ఘాట్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆధునిక డిజైన్‌తో దినిని నిర్మించారు. అయితే ఇతర క్లాక్ టవర్స్ లాగా దీనికి అలంకరణ ఉండదు. చతురస్రాకారంలో ఆ సమయంలో ముస్లిం రాజైన అసఫ్ జాహీ నిర్మించిన భవనాల తరహాలోనే దీనిని తీర్చిదిద్దారు.
శాలిబండ..
ఈ గడియార స్థంభాన్ని రాజా రాయ్ రాయన్ ఘడియాల్ అని కూడా పిలుస్తారు. మూడో నిజాం సికిందర్ జా ఆస్థానంలో దఫ్తార్దార్ (రెవెన్యూ అధికారి) శాలిబండ ప్యాలెస్‌లో 1904లో ఈ క్లాక్ టవర్‌ను నిర్మించారు. యూరోపియన్ శైలిలో హిందు–అరబిక్, రోమన్, హిందీ, తెలుగు అంకెలు దీనిలో ఉంటాయి. టవర్ ప్రవేశ ద్వారం వద్ద గణేష్ ప్రతిమ ఉంటుంది. కాలక్రమేణా ప్యాలెస్ ధ్వంసమైనా.. క్లాక్ టవర్ అలాగే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment