రెండు సార్లు మిస్ అయ్యా, ఈ సారి క్రౌన్‌తోనే వస్తా
ముంబై, బెంగళూరు ప్రీ సెషన్స్‌లో ఫైనల్స్‌కు ఎంపిక
ఫెమినా మిస్ తెలంగాణగా నిలిచిన ప్రకృతి
సాక్షి’తో విశేషాలు పంచుకున్న మిస్ తెలంగాణ
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..
ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..
ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.
జీవితం నేర్పిన పాఠాలు..
నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు.
మల్టీ క్వీన్...
నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్‌తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్‌ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్‌గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్‌తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.
25 ఏళ్ల వయసులో..
ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్‌లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి.
Comments
Please login to add a commentAdd a comment