Landmarks
-
జ్ఞాపకాల్లో మునిగి తేలారు!
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు. మునిగితేలిన ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి పాతూరు చూసేందుకు వచ్చిన.. పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక 60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం సాక్షి, నాగర్‌కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్‌లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం. కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు. -
దామరచర్లలో ఆదిమానవుల ఆనవాళ్లు
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామసమీపంలో ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. కృష్ణా తీరం వద్ద ఇటీవల బయటపడ్డ సమాధులు పరిశీలించడానికి వచ్చిన నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు ఈ ఆనవాళ్లు కనుగొన్నారు. తీర ప్రాంతంలో బయటపడ్డ కుండలు, పెంకులు, సమాధులను పరిశీలించి అవి సింధునాగరికథ కాలంనాటివని తేల్చారు. పరిశోధన నిమిత్తం కుండలను, పెంకులను స్వాధీనం చేసుకున్నారు. -
యమహా నగరి.. కోల్‌కతా పురి
'నేతాజీ పుట్టిన, గీతాంజలి పూసిన.. ఆ వంగ భూతలం.. భతరజాతికి మకుటం..' అంటూ కోల్ కతా ఉన్నతిని కీర్తించారు తెలుగు సినీ కవి వేటూరి. ఆయనలాగే మరెందరో కవులు, కళాకారులు.. ఆ మహానగర రసహృదయధారను ఒడిసిపట్టి చరితార్థులయ్యారు. ఇప్పుడు పాత ఘాటువాసనల నడుమ అదే కోల్ కతా శోభను సరికొత్త కోణంలో చూపే ప్రయత్నం చేశాడు యువ ఫొటోగ్రాఫర్ సందీప్ డే. అత్యాధునిక డ్రోన్ సహాయంతో గంగాతీరంలోని ఆ మహానగరాన్ని, అక్కడి కొండగుర్తుల్ని కొత్తగా చూపుతూ 'వాకింగ్ అప్ విత్ కల్ కతా' పేరుతో ఆయన రూపొందించిన వీడియో బెంగాలీలేకాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోల్ కతా అభిమానుల్ని అలరిస్తోంది. మొదట షహీద్ మినార్ ను అల్లంత ఎత్తునుంచి, ఆ తర్వాత విక్టోరియా మహల్, సెయింట్ పాల్స్ కాథడ్రల్, గంగానడిపైనున్న హౌరా వారధి, విద్యాసాగర్ సేతుల అందాలను మీరూ వీక్షించండి.. -
చెరిగిపోతున్న ఆనవాళ్లు..!
వేల ఏళ్లనాటి మానవ మనుగడకు చిహ్నం ఈరన్నగుండు గుహ గుహలో అరుదైన రేఖాచిత్రాలు.. అంతుబట్టని లిపి గుర్తులు పదేళ్ల క్రితమే గుర్తించినా పరిరక్షణ చర్యలు శూన్యం ఇదేపరిస్థితి కొనసాగితే అరుదైన చారిత్రక ఆనవాళ్లు మాయం వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించిన గుహ అది.. ఆ కాలంలోనే సాగు చేశారని చెప్పే ఆనవాళ్లు కూడా ఉన్నాయక్కడ.. పంటలపై పక్షులు వాలితే చెదరగొట్టేందుకు వాడే వడిశల రాళ్లు బయటపడ్డ ప్రాంతమది.. పాడికి సూచికగా ఆవులు, పంటలకు గుర్తుగా ఎడ్ల బొమ్మలు అద్భుత రీతిలో చెక్కిన గుహ అది.. ఇలా ఒక్కటేమిటి.. మానవ నాగరికత పరిణామక్రమంలో ఓ దశను కళ్లకు కట్టే సజీవసాక్ష్యాలవి.. కానీ, ఇవేవీ మన పురావస్తు శాఖ కళ్లకు కనిపించవు. నిపుణులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అద్భుత చరిత్రకు నిలువెత్తు నిదర్శనమని తేల్చినా గాలికొదిలేశారు. ఇప్పుడు రాళ్లు కొట్టుకునేవారు యథేచ్ఛగా ఆ గుట్టలను ధ్వంసం చేస్తూ మన చారిత్రక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ చారిత్రక గుహ ఎక్కడ.. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దొంగలగట్టు తండాలోని ఈరన్నగుండు గుహ. కల్వకుర్తి నుంచి జూపల్లికి వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంది. వేల ఏళ్ల నాటి మానవ మనుగడకు చెందిన అపురూప ఆనవాళ్లు ఉన్నది ఇక్కడే. అయితే స్థానిక తండావాసులకు వాటిపై అవగాహన లేదు. ఆ గుహను వారి పూర్వీకులు మైసమ్మ గుడిగా పేర్కొనటంతో ఇప్పటికీ వారు దాన్ని గుడిగా భావిస్తూ అప్పుడప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ గుహలో దాదాపు ఐదు వేల ఏళ్ల నాటివని భావిస్తున్న నాటి మానవులు గీసిన రేఖా చిత్రాలు (పెట్రోగ్లిఫ్స్) ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే.. భూ ఉపరితలానికి అడుగు ఎత్తున రెండు అడుగుల పొడవు, అంతే ఎత్తుతో మూపురం, వాడి కొమ్ములున్న ఎద్దు బొమ్మ, దాని పక్కన కొంచెం చిన్న పరిమాణంలో మరో రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. దీనికి ముందువైపు ఆరడుగుల ఎత్తులో అదే రాయిపై ఓ ఆవు దాని వెనుక రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. వీటి కింద చిన్నచిన్న లేగ దూడల బొమ్మలున్నాయి. వాటికింద నాటి లిపిగా భావిస్తున్న అక్షరాలు (గ్రాఫితీ మార్చ్) చెక్కి ఉన్నాయి. ఆ లిపిని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. దాదాపు వందేళ్ల క్రితం నాటి పురావస్తు నిపుణులు యాజ్దానీ ఇలాంటి లిపిని గుర్తించారు. ఆ పరిసరాల్లో కొత్త రాతి యుగంలో వినియోగించిన వడిశల రాళ్లు, నూరుడు రాళ్లు లభిస్తున్నాయి. పరిరక్షించేవారేరీ? ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ తాజాగా ఈ గుహను గుర్తించి పరిశీలించారు. అక్కడి రేఖా చిత్రాల్లోని ఎద్దుల కొమ్ములు ఈనాటి మైసూరు ఎద్దులను పోలి ఉన్నాయని, కానీ వాటి మూపురాలు, గంగడోలు సింధూ నాగరికత కాలానికి చెందిన వాటివిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితమే పురావస్తు నిపుణులు వచ్చి ఈ రేఖా చిత్రాల అచ్చులను శాస్త్రీయ పద్ధతిలో సేకరించారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఆ తర్వాత ఎవరూ వీటిని పట్టించుకున్న దాఖలాలులేవు. రాళ్లు కొట్టేవారు గుహను ధ్వంసం చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముంది.