పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో రూ.990 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్యాప్–2లో తొలుత ప్రతిపాదించిన డయాఫ్రం వాల్‌ను 29,585 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించారు.
ఆ పనులకు రూ.393.32 కోట్ల వ్యయం అవుతుందని పోలవరం సీఈ లెక్కగట్టారు. గ్యాప్–2లో సవరించిన ప్రతిపాదన ప్రకారం 63,656 చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్‌ను నిర్మించాల్సి ఉందని.. ఇందుకు రూ.990 కోట్ల వ్యయం అవుతుందని 2024 అక్టోబర్ 30న పోలవరం సీఈ పంపిన నివేదికపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి ఐదు షరతులతో అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆ షరతులు ఇవీ..
⇒ తొలి టెండర్ ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే ధరల సర్దుబాటును వర్తింపజేయాలి.
⇒ ఎల్‌ఎస్(లంప్సమ్) విధానంలో నిబంధనల ప్రకారం స్టాండర్డ్ డేటా ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశాకే పనులకు సాంకేతిక అనుమతి ఇవ్వాలి.
⇒ డిజైన్‌లు, డ్రాయింగ్‌లను అధీకృత సంస్థ ఆమోదించాకే పనులకు సాంకేతిక అనుమతి ఇవ్వడం ద్వారా పనుల్లో తేడాలు లేకుండా చూడాలి.
⇒ సవరించిన ప్రతిపాదనను.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలో పొందుపరిచి కేంద్ర ప్రభుత్వంతో రూ.990 కోట్లను రీయింబర్స్‌మెంట్ చేయించాలి.
⇒ టెండర్ ఒప్పందంలోని నిబంధనలకు లోబడే ధరల సర్దుబాటు విభాగం కింద చెల్లింపులు చేయాలి.
1న అంతర్జాతీయ నిపుణుల కమిటీ రాక
పోలవరం ప్రాజెక్టు పనులను గియాన్ ఫ్రాన్‌కో డి సిస్కో, డేవిడ్ బి పాల్‌తో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి డయాఫ్రం వాల్‌తో సహా నిర్మాణాల డిజైన్‌లు, పనుల నాణ్యతపై తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది.
డయాఫ్రం వాల్ నిర్మాణ విధానంపై ఈనెల 9, 15, 17 తేదీల్లో అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యులతో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యుడు భోపాల్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం తీసుకున్నారు. గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ఈనెల 18న కాంట్రాక్ట్ సంస్థలు మేఘా, బావర్‌లు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కమిటీకి సీడబ్ల్యూసీ సభ్యుడు భోపాల్‌సింగ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment