wall construction
-
Garisenda Tower: వాలుతున్న వెయ్యేళ్ల టవర్
ఇటలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పీసా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత లీనింగ్ టవరే. నాలుగు డిగ్రీల కోణంలో ఒకవైపు వాలిపోయి అందరికీ ఆకట్టుకుంటూ కని్పస్తుందా కట్టడం. అయితే ఇటలీలోనే మరో లీనింగ్ టవర్ కూడా ఉంది. అది కూడా కాస్త అటూ ఇటుగా పీసా టవర్ అంత ఎత్తు ఉంటుంది. అలాంటి టవర్ కాస్తా ఇప్పుడు ఏ క్షణమైనా కుప్పకూలేలా కని్పస్తూ గుబులు రేపుతోంది....! ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్ మాదిరిగానే ఇది కూడా నానాటికీ ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. అలా ఈ టవర్ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్టు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందని ధ్రువీకరించింది. అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బారియర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్ చుట్టూ మెటల్ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలినా పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి టవర్, దాని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్లాజాలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సందర్శనపై నిషేధం మరికొన్నేళ్ల దాకా (టవర్ కూలని పక్షంలో) కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. బారియర్ నిర్మాణ వ్యయం 37 లక్షల పౌండ్లు(దాదాపు రూ.39.10 కోట్లు)గా అంచనా వేశారు. దీనికోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుండటం విశేషం! ‘‘నగరవాసులతో పాటు బొలోగ్నా నగరాన్ని, దాని ప్రఖ్యాత పర్యాటక చిహా్నలను కాపాడాలని తపిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులందరూ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి’’ అంటూ నగర కౌన్సిల్ పిలుపునిచి్చంది. నిలబెట్టేందుకు తీవ్ర యత్నాలు గారిసెండా టవర్ కూలిపోకుండా కాపాడేందుకు ఇటలీ శాయశక్తులా ప్రయతి్నస్తోంది. పీసా టవర్ కూడా క్రమంగా మరింత పక్కకు వాలి త్వరలో కూలిపోవడం ఖాయమని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నానా ప్రయత్నాలూ చేసి దాని ఒంపును కొంతమేర సరిచేసింది. ప్రస్తుతానికి అది కుప్పకూలే ముప్పు లేదని తేలి్చంది. అలా పీసా టవర్‌ను కాస్త సురక్షితంగా మార్చిన అనుభవాన్నంతా గారిసెండా విషయంలో రంగరిస్తున్నారు. ఇందుకోసం సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తొలి దశలో దీన్ని వీలైనంత సురక్షితంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. సంబంధిత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెట్టింపు ఎత్తైన జంట టవర్ గారిసెండా నిజానికి బొలోగ్నా నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంట టవర్లలో ఒకటి మాత్రమే! పైగా చిన్నది. ఎందుకంటే, దీని పక్కనే ఉన్న అసినెల్లీ టవర్ దీనికంటే దాదాపు రెట్టింపు పొడవైంది! అంటే దాదాపు 90 మీటర్లన్నమాట. ప్రఖ్యాత పీసా టవర్ ఎత్తు 56 మీటర్లే. అంటే, ఇది పీసాను తలదన్నేంత ఎత్తుందన్నమాట! అసినెల్లీ టవర్ నిర్మాణం గారిసెండా తర్వాత పదేళ్లకే, అంటే 1,119లో జరిగింది. ఇది కూడా కాస్త పక్కకు ఒరిగే ఉండటం విశేషం. అయితే ఆ ఒంపు మరీ పీసా, గారిసెండా అంతగా లేదు గనుక ప్రస్తుతానికి దీనికి వచి్చన ముప్పేమీ లేనట్టే! దాదాపు వెయ్యేళ్ల నాటిది! ► గారిసెండా టవర్ ఇప్పటిది కాదు. మధ్య యుగానికి చెందినది. ►దీన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం, అంటే క్రీస్తుశకం 1,109 సంవత్సరంలో నిర్మించారు. ►టవర్ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు (154 అడుగులు). ►నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది. ►200 ఏళ్లకే టవర్ ఒక పక్కకు ఒరగడం మొదలైంది. ►దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తును బాగా తగ్గించారు. ►డాంటే 1321 సంవత్సరంలో ముగించిన అజరామర పద్య కావ్యం ‘ది డివైన్ కామెడీ’లో కూడా గారిసెండా టవర్ ప్రస్తావన ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉ.కొరియాలో ‘కరోనా గోడ’
సియోల్: ఉత్తర కొరియాలోకి కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవడానికి అక్కడ కిమ్ ప్రభుత్వం రష్యా, చైనా సరిహద్దుల్లో ఏకంగా ఒక గోడ కట్టింది. చైనా, రష్యా సరిహద్దుల నుంచి వైరస్ దేశంలోకి రాకుండా ఉండాలని 2020 నుంచి కొన్ని వేల కిలోమీటర్ల మేర కంచెల్ని వేసుకుంటూ వస్తోంది. సరిహద్దుల్లో కంచెలు, గోడలు, గార్డ్ శిబిరాలు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. కరోనాకి ముందు వరకు దేశానికి ఉత్తరాన ఉన్న ఈ సరిహద్దు ప్రాంతం నుంచే చాలా మంది కిమ్ ప్రభుత్వం అరాచకాలు భరించలేక పారిపోయేవారు. ఆ సరిహద్దు ప్రాంతాన్ని మూసివేస్తూ ఉండడంతో అలా పారిపోయే వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. 2019లో అలా దక్షిణ కొరియాకి పారిపోయిన వారి సంఖ్య 1,047 ఉంటే గత ఏడాది వారి సంఖ్య 67కి తగ్గిపోయింది. అయితే ఈ గోడ నిర్మాణంతో చైనాతో వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం పడింది. -
త్వరలో తీరనున్న కృష్ణా నది ముంపు కాలనీల కష్టాలు
-
ట్రంప్ సాక్షిగా గోడకు అటూ ఇటూ!
ట్రంప్ రాక సందర్భంగా పేదరికం ఆయన కళ్లబడకుండా అహ్మదాబాద్ కార్పొరేషన్ ‘గోడకట్టుడు’ ముసుగు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్థికంగా మనం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత దశలో మనల్ని వర్ధమాన దేశంగా కాక, అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించి ఆ మేరకు మన ఉత్పత్తులపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తోంది. తన సరుకులపై సుంకాలు తగ్గించాలని పట్టుబడుతోంది. ఈ ఒత్తిళ్లు సహించరానివి. ప్రపంచంలో నాలుగింట మూడువంతుల జనాభా వర్ధమాన దేశాల్లోనే ఉన్నదని, కనుక వాటికి ప్రపంచ పరిణామాలనే ప్రభావితం చేయగల సత్తా ఉంటుందని సౌత్ కమిషన్ ఏనాడో నొక్కిచెప్పింది. మన పాలకులందరూ దాన్ని విస్మరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల 24న అహ్మదాబాద్ నగరానికి వస్తున్న సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ట్రంప్ మెప్పుకోసం నగరంలోని రోడ్ల గతుకులు సరిచేసి అందంగా కనపడేలా మెరుగులు దిద్దుతోంది. ఆయన వచ్చే వీధుల వెంట కొబ్బరి చెట్లు నాటడంతోపాటు ఆ పొడవునా పెద్ద గోడ కడుతున్నారు. ఈ పనంతా ట్రంప్‌కు మన మురికివాడలు కనబడకుండా చేయడానికి. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్దార్ పటేల్(మోతేరా) స్టేడియం దాకా ఊరకుక్కలుగానీ, పశువులుగానీ కంటికి కనబడకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. –‘ది హిందూ’ రిపోర్టు 14.02.2020 మన ఇంటిని, మన దేశాన్ని పేదరికం లేకుండా చూడాలని, సర్వులకూ సుఖమయ జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, నలుగురికీ ఆదర్శంగా దాన్ని మలచాలని బుద్ధి, జ్ఞానం ఉన్నవారెవరైనా ఆశిస్తారు. అందుకోసం శ్రమిస్తారు! కానీ మన పాలకుల (అన్ని రంగులవారూ) ప్రవర్తన, మనస్తత్వం ఈ ఆదర్శానికి పరమ విరుద్ధంగా ఉంటోంది! పై వార్త విన్న తర్వాత ప్రజల మనస్సులు ఎక్కడ గాయపడతాయోనన్న భీతి, లజ్జ కూడా లేకుండా మురికివాడలు ట్రంప్ కళ్లకు కనబడకుండా ఉండేందుకు ‘‘గోడ కట్టుడు’’ ముసుగు వేయడానికి గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నించింది. ఈ సందర్భంగా కమిషనర్ విడుదల చేసిన ప్రకటన మరీ వింతగా, ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది–‘‘రోడ్డును ఆక్రమిస్తూ నిర్మాణాలు జరగకుండా చూసేందుకు గోడ నిర్మించాలని రెండు నెలలనాడే కార్పొరేషన్ నిర్ణయించింద’’ని ఆయన ప్రకటించారు. అయితే ట్రంప్ రాకతోనే మన పేదరికం తొలగిపోతుందా అన్నది వేరే ప్రశ్న! ట్రంప్‌కు కనబడకుండా ఉండేందుకు పేదవాళ్ల వాడల్ని, పొగచూరిన వారి గోడల్ని కనబడకుండా చేద్దామన్న ‘ఔదార్యం’తో పాలకులు తలపెట్టిన ‘‘గోడకట్టుడు’’ పూర్తి కాకుండానే దాదాపు అదే రోజున ఇండియాను అభివృద్ధి చెందిన లేదా వర్ధమాన దేశాల ప్రతిపత్తి జాబితానుంచి అమెరికా ప్రభుత్వం తొలగించి, భారత్ దిగుమతి చేసుకుంటున్న అమెరికన్ వస్తువులు, తదితర సరంజామాపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్న షరతు విధించుతూ ప్రకటించింది(13.02.20) అంటే మన దేశం పేద దేశం కాదు, ‘‘అభివృద్ధి చెందిన సంపన్న దేశమే’’నని అమెరికా వర్తక వాణిజ్య కార్యాలయం నిర్ధారణకు వచ్చింది. అమెరికా దిగుమతి చేసుకునే మన వస్తువులపై దాని ప్రకారం సుంకాలు గణనీయంగా తగ్గించివేయాల్సిందేనని పట్టుబడుతోంది! అమెరికా తన సమ ఉజ్జీగా దూసుకువెడుతున్న చైనాతో ఇలాంటి వాణిజ్య యుద్ధాన్నే చేస్తోంది. దాన్ని సమ ఉజ్జీల మధ్య పోటీగా భావించవచ్చు. కానీ అన్ని అంతర్జాతీయ మదింపు సంస్థలూ మన అభివృద్ధి రేటు గత పదేళ్ల వ్యవధిలోనే ఎలా దిగజారిపోతూ వస్తున్నదో చూపుతున్న వర్తమాన దశలో భారత్‌పై కూడా ఈ పిడుగును వదిలింది. ఇంకా వర్థమాన దశలోనే ఉంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న మన దేశంపై అమెరికా చేస్తున్న ఒత్తిడి సహించరానిది. పైగా ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ‘‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరే వ్యవహారం కాద’’ని అధికారికంగా ప్రకటించ సాహసించడం మన స్వతంత్ర ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని మరవరాదు. మన ప్రణాళికలుగానీ, వార్షిక బడ్జెట్లుగానీ, ఆర్థిక సర్వేక్షణలుగానీ ప్రజలకు దేశ వాస్తవిక పరిస్థితుల గురించి చెప్పకుండా దాచడం, మభ్యపరచడం కొత్తగాదు. వింత కూడా కాదు! మన ఆర్థిక వ్యవస్థా చట్రానికి సోకిన వైరస్ ఇప్పటిది కాదు. పైగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ పాలన నాటికన్నా బీజేపీ ఏలుబడిలోని ఎన్డీఏ సంకీర్ణ పాలన దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చే వైపుగా అడుగులువేస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వస్తుతహ ఎంత తెలివిగల మహిళో, బీజేపీ వరలోకి వెళ్లిన తరవాత తానే చెప్పుకున్నట్లు అంత ‘మితవాద శక్తి’గా మారి ‘‘నేను మితవాదినే కావచ్చుగానీ వాస్తవవాదిని’’ అనవలసివచ్చింది. ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణలకు 1990లలో ప్రధాని హోదాలో నరసింహారావు తలవూపారు. అంతకు చాలాముందుగానే చరిత్రాత్మకమైన ‘‘సౌత్ కమిషన్’’ వర్థమాన దేశాల స్వతంత్ర ప్రగతి బాటకు రూపకల్పన చేసింది. ఆ కమిషన్‌కు అప్పటి టాంజానియా అధ్యక్షుడు, ఆఫ్రికా దేశాల ఆరాధ్య నేత జూలియస్ నైరేరి అధ్యక్షుడు కాగా, మన్మోహన్సింగ్ ప్రధాన కార్యదర్శి. భారతదేశంలాంటి వర్ధమాన దేశాలు స్వావలంబన ద్వారా సొంతకాళ్లపై నిలబడి ఎంతటి అభివృద్ధి సాధించవచ్చునో , అదెంత ఆచరణ సాధ్యమో సౌత్ కమిషన్ నివేదిక తెలిపింది. అందులోని కీలకమైన ప్రతిపాదన– ‘‘వలస విధానాన్ని వలస దేశాల ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆ విధానాన్ని వారు పాతిపెట్టగలిగారు. ఆ అనుభవంతోనే విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వివిధ రూపాలలో అనుభవిస్తున్న దేశాలు కూడా అలాంటి దృఢచిత్తం తోనే, స్వావలంబన పైన ఆధారపడిన కార్యాచరణ ద్వారా మాత్రమే విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వదిలించుకోవచ్చునని ఆ నివేదిక హెచ్చరించింది. కానీ అదే మన్మోహన్ ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ప్రపంచబ్యాంకు వరలో ఇమిడిపోవలసి వచ్చింది. బీజేపీ పాలకులు అంతకన్నా పది అడుగులు ముందుకి దూకి స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులెత్తిన ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా వినాశనం వైపునకు నెడుతున్నారు. ఫలితంగా ఆర్థిక పరాధీన స్థితి మరింత పెరగడానికి మార్గం ఏర్పడింది. దేశ నిరంతర ఆర్థిక అభివృద్ధి ‘‘దిగుమతి చేసుకునే వస్తువు’’ కాదని, ఉత్పత్తి అయిన సంపద అనేది సామాజికుల మధ్య న్యాయబద్ధంగా పంపిణీ కావడం ద్వారానే ఆర్థికాభ్యుదయం సాధ్యమని సౌత్ కమిషన్ నొక్కి చెప్పింది! ఈ అభ్యుదయకర పాఠం మన పాలకుల చేతిలో ఆవిరైపోయింది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్లు నేటి ప్రధాని మోదీ పబ్లిక్ రంగ వ్యవస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ, బ్యాంకుల విలీనీకరణ పేరిట బడా ప్రయివేటు బ్యాంకుల ద్వారా దేశంలో రూ. 360 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని ఆశగొల్పుతున్నారు! ‘స్విస్ బ్యాంకు’ ఖాతాలు తెరిచి వాటిలో దాగిన భారత బడా సంపన్నుల 25 లక్షల కోట్లకుపైగా సంపద బయటకు లాగి మరీ ప్రతి కుటుంబానికీ రూ. 15 లక్షలు పంచుతానన్న మోదీ బాస కాస్తా గాలి కబురుగానే మిగిలిపోయింది! చివరకు భారీ యంత్రాలనుంచి పిన్నులకు, పెన్నులకు, ‘పిడుగుకూ, బియ్యానికీ’ విదేశీ కంపెనీల మీద, వాటి సరుకుల మీద బతకాల్సిన పరాధీన స్థితికి దేశ పాలకులు దేశాన్ని నెడుతున్నారు. ప్రజల దృష్టిని గుళ్లూ గోపురాలవైపు, మతం పేరిట కుహనా సంస్కృతుల వైపు మళ్లించి మూఢత్వాన్ని చేటలతో చెరిగే ప్రక్రియను పెంచి పోషిస్తూ తమ పనిని చడీచప్పుడూ లేకుండా చకచకా చేసుకుపోతున్నారు. అదేమని ప్రశ్నించిన వారి నోళ్లకు తాళాలు వేస్తున్నారు. నిర్బంధించి భిన్నాభిప్రాయాలను అణిచేస్తున్నారు. అందుకే ‘‘వర్ధమాన దేశాలు చేతులు ముడుచుకు కూర్చోరాదని, ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలే ఈ దేశాల ప్రాపంచిక దృష్టికి వెలుగు దివ్వెలు కావాలనీ, నాల్గింట మూడు వంతుల జనాభా(350 కోట్లుపైగా) వర్ధమాన దేశాల్లోనే ఉన్నందున ప్రపంచ పరిణామాలనే ప్రభావితం చేయగల హక్కు, సత్తా ఈ దేశాలకు ఉంది’’ అని కూడా సౌత్ కమిషన్ మూడు దశాబ్దాల నాడే చెప్పింది. కానీ మోదీ నినాదం ‘ఇండియాలోనే తయారీ’(మేక్ ఇన్ ఇండియా) కాస్తా క్రమంగా ‘‘ఇండియాలోనే తయారీ, కానీ దాని నిర్మాత అమెరికా’’ అన్న చందంగా మారిపోయింది! మరో మాటలో చెప్పాలంటే–అమెరికా, దాని జేబు సంస్థ ప్రపంచబ్యాంకు చేసిన, చేస్తున్న నిర్వాకమల్లా– ‘‘అరువులివ్వడం, కరువులు తేవడం, రుణం పెట్టడం, రణం పెంచడం’’ అందుకే యువకవి అలిశెట్టి ఏనాడో చాటాడు: ‘‘ అన్నం మెతుకునీ/ఆగర్భ శ్రీమంతుణ్ణీ/ వేరుచేస్తే/ శ్రమ విలువేదో తేలిపోతుంద’’ని! అది తేలకుండా ఉంచడానికే ఘరానా దేశాధిపతుల రాక పోకలప్పుడు పేదల గుడిసెలు కనబడకుండా ఎల్తైన గోడలు కట్టించడం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వెల్కమ్ ట్రంప్..గోడచాటు పేదలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీగా ఏర్పాట్లు చేస్తుండగా గుజరాత్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 24వ తేదీన అహ్మదాబాద్‌లో మోదీ–ట్రంప్ రోడ్ షో జరిగే మార్గంలో ఉన్న మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు గోడ నిర్మాణం చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడికి పేదరికం ఛాయలు కనిపించకుండా ఉండేందుకు గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న మార్గంలోని పేదల ఇండ్ల పొడవునా కిలోమీటర్ పొడవైన గోడను నిర్మిస్తోంది. ట్రంప్ ప్రయాణించే మార్గంలో ఉన్న 500 పూరిగుడిసెలు కనిపించకుండా చేసేందుకు సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు దాదాపు 7 అడుగుల ఎత్తైన ఈ గోడను నిర్మించడంతోపాటు, దాని పొడవునా ఖర్జూర మొక్కలు నాటి ఆ మార్గాన్ని అందంగా తయారుచేయనున్నారు. ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న 16 ప్రధాన మార్గాల్లో రోడ్లు వేస్తున్నారు. విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం వంటి పనుల్లో యంత్రాంగం బిజీగా ఉంది. ఈ మొత్తం పనుల కోసం అహ్మదాబాద్ అధికారులు రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు మీడియా పేర్కొంది. జపాన్ ప్రధాని షింజో అబే(2017), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(2014) పర్యటనలప్పుడు గుజరాత్ ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపట్టింది. 2017లో ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన సమయంలో హైదరాబాద్‌లో ఆమె పర్యటించే ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లందరినీ తెలంగాణ యంత్రాంగం వేరే చోటికి తరలించిన విషయం తెలిసిందే. భారత పర్యటనపై మెలానియా ఉత్సాహం భారత్‌లో పర్యటనకోసం తానెంతో ఉత్సుకతతో ఉన్నానని అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా చెప్పారు. అహ్మదాబాద్, న్యూఢిల్లీలో పర్యటనకు తమను సాదరంగా ఆహ్వానిస్తోన్న భారత ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బలపడనున్న బంధాన్నీ సెలబ్రేట్ చేసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నామని మెలానియా ప్రకటించారు. తమ ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనదనీ, ఇది భారత్–అమెరికాల మధ్య స్నేహ బంధాల్ని బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ ఆమె ట్విటర్లో వ్యాఖ్యానించారు. -
గోడ కోసం 20 శాతం పన్ను!
► దిగుమతి సుంకం పెంపు ఆలోచనలో అమెరికా ► మెక్సికోతో వెంటనే అమలవుతుందని వెల్లడి వాషింగ్టన్ : అమెరికాతో వాణిజ్య లోటు ఉన్న దేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 20 శాతం పన్ను విధించేందుకు వెనుకాడేదిలేదని అమెరికా హెచ్చరించింది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను మెక్సికోకు మాత్రమే అమలుచేయనున్నట్లు చెప్పిన శ్వేతసౌధ ప్రెస్ కార్యదర్శి స్పైసర్.. ఈ నిధులతోనే సరిహద్దుల్లో గోడ నిర్మాణం చేపడతామన్నారు. ‘ప్రస్తుతానికి మెక్సికోపైనే దృష్టిపెట్టాం. కానీ మా వాణిజ్య పరిస్థితిని చూస్తుంటే.. మిగిలిన దేశాలపైనా అమలు చేయాలా? వద్దా? అనే ఆలోచన వస్తోంది.’ అని అన్నారు. మెక్సికోతో వాణిజ్య లోటున్న 50బిలియన్ డాలర్లపై 20 శాతం దిగుమతి సుంకం విధిస్తే పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుందని, 160 దేశాలపై ఇదే విధానాన్ని వ్యవహరిస్తే ఏడాదికి 10 బిలియన్ డాలర్లను (రూ.68వేల కోట్లు) అమెరికా అదనంగా సంపాదించగలుగుతుందన్నారు. విదేశాల్లోనూ అమెరికా వస్తువులు సమానంగా అమ్ముడయ్యేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. కాగా, అమెరికా ఒకవేళ వాణిజ్యలోటున్న అన్ని దేశాలతో ఇదే నిర్ణయాన్ని అమలుచేస్తే.. భారత్, చైనా వంటి దేశాలకూ ఇబ్బందులు తప్పవు. కాగా, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో అమెరికా పర్యటనను రద్దుచేసుకోవటమే మంచిదని.. ఒకవేళ నీటో పర్యటించినా అది వ్యర్థమే అయ్యేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘గోడ నిర్మాణ ఖర్చులను భరించే విషయంలో వారినుంచి సానుకూల స్పందన లేనప్పుడు.. ఎన్ని సమావేశాలు జరిగినా ఫలితం ఉండదు’ అని ఫిలడెల్ఫియాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ రిట్రీట్‌లో వెల్లడించారు. కాగా, మెక్సికోతో 1600 కిలోమీటర్ల పొడవునా గోడ నిర్మించేందుకు 25 బిలియన్ డాలర్లు (రూ. 1.70లక్షల కోట్లు) అవుతుందని ఓ అధ్యయనం వెల్లడించగా.. 12 నుంచి 15 బిలియన్ డాలర్లు (దాదాపు లక్ష కోట్ల రూపాయలు) అవుతుందని అమెరికా సెనెట్ అంచనా వేసింది. కాగా, డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం బ్రిటీష్ ప్రధాని థెరీసా మేతో సమావేశమయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్‌కు విదేశీ నేతతో ఇదే తొలి భేటీ. ‘ప్రపంచం మార్పుదిశగా వెళ్తోంది. ఆ మార్పును మేం (అమెరికా, ఇంగ్లండ్) నడిపించేందుకు అవకాశం ఉంది. చైనా, భారత్‌ల ఎదుగుదలను స్వాగతిస్తున్నాం’ అని మే తెలిపారు. -
రోడ్డు ఆక్రమణ
రహదారికి అడ్డంగా గోడ, షెడ్డు నిర్మాణం టీడీపీ కార్యకర్త దాష్టీకం నోరుమెదపని నాయకులు, అధికారులు గాంధీనగర్ (కాకినాడ) : డెయిరీ ఫారం వద్ద వున్న రెవెన్యూ కాలనీలోని 5వ వీధి రోడ్డు అక్రమణకు గురైంది. ఓ టీడీపీ కార్యకర్త రోడ్డును ఆక్రమించి అడ్డంగా గోడ, షెడ్డు నిర్మించాడని ఈ కాలనీవాసులు వాపోతున్నారు. రెవెన్యూకాలనీలోని 1వ వీధి నుంచి డెయిరీఫారం మెయిన్‌రోడ్డుకు అనుసంధానం చేసి వుంటుంది. ఇలా ఒకటవ వీధి నుంచి 4వ వీధిలోని ప్రతి రోడ్డుకు డెయిరీ ఫారం మెయిన్‌రోడ్డు అనుసంధానం చేసి వుంది. 5వ వీధిలోని రోడ్డు మాత్రం మెయిన్‌రోడ్డుకు అనుసంధానం చేయకుండా మధ్యలో ఓ టీడీపీ కార్యకర్త అడ్డంగా ఒక షెడ్డును, గోడను నిర్మించాడు. రెవెన్యూకాలనీలో 1వ వీధిలోని, 3 వ, 4వ వీధిలోని డ్రైనేజీలు సరిగ్గా నిర్మించకపోవడం వల్ల ఈ మూడు కాలనీ రోడ్లపై మురుగునీరు నిలిచిపోతూవుంటుంది. అయితే ఈ ప్రాంత ప్రజలు ఈ మురుగునీటిలో నుంచి వెళ్లడం ఇబ్బందిగా వుండడంతో 2వ, 5వ వీధిలోని రోడ్లపై రెండు సంవత్సరాల క్రితం వరకు ప్రయాణాలు సాగించేవారు. ముఖ్యంగా 5వ వీధిలోని రోడ్డుపై మురుగునీరు నిలబడకుండా శుభ్రంగా వుండడంతో ఈ కాలనీవాసులు ఈ రోడ్డుపై తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే ఇదే కాలనీలో నివాసం వుంటున్న ఒక పాల వ్యాపారి రెండు సంవత్సరాల క్రితం 5వ వీధిలోని రోడ్డుపై గేదెలను అడ్డంగా కట్టాడు. పశువుల మేత రోడ్లపై అడ్డంగా వేసేస్తుండడంతో కాలనీవాసులు అందరూ కలిసి ఈ వ్యాపారిని నిలదీయగా నేను టీడీపీ కార్యకర్తననీ, తన జోలికి వస్తే ఖబడ్దార్ అని బెదిరించడంతో అతని జోలికి వెళ్లడానికి భయపడ్డారు. కొన్నిరోజుల తరువాత పశువుల పెంటను రోడ్లపై వేయడం, పశువులు వుండే ప్రదేశాన్ని శుభ్రం చేయకుడా వుంచడంతో ఇక ఈ రోడ్డుపై నుంచి ఈ కాలనీవాసులు సంచరించడం మానేశారు. ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి ఏడాది క్రితం 5వ వీధి రోడ్డుకు, డెయిరీఫారం మెయిన్ రోడ్డుకు మధ్యలో అడ్డంగా ఒక గోడను, తన పశువుల కోసం ఒక షెడ్‌ను కట్టాడు. దీంతో ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు తిరిగే రోడ్డును ఇలా ఆక్రమించడంతో ఈ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ వ్యక్తిని ఈ విషయమై అడగడానికి వెళితే దుర్భాషలాడాడనీ, తమను కొట్టబోయాడని ఈ కాలనీవాసులు వాపోతున్నారు. నాయకులు, అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సర్వే నిర్వహిస్తాం రోడ్డు మధ్యలో ఒక వ్యాపారి షెడ్డు, గోడను నిర్మించాడని నా దృష్టికి వచ్చింది. ఆ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తాం. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే అక్రమ నిర్మాణ దారునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –ఖాలేషా, అసిస్టెంట్ సిటీ ప్లానర్, కాకినాడ నగరపాలక సంస్థ