అహ్మదాబాద్‌లో డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించనున్న మార్గంలోని మురికివాడల వద్ద నిర్మిస్తున్న గోడ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీగా ఏర్పాట్లు చేస్తుండగా గుజరాత్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 24వ తేదీన అహ్మదాబాద్‌లో మోదీ–ట్రంప్ రోడ్ షో జరిగే మార్గంలో ఉన్న మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు గోడ నిర్మాణం చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడికి పేదరికం ఛాయలు కనిపించకుండా ఉండేందుకు గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న మార్గంలోని పేదల ఇండ్ల పొడవునా కిలోమీటర్ పొడవైన గోడను నిర్మిస్తోంది. ట్రంప్ ప్రయాణించే మార్గంలో ఉన్న 500 పూరిగుడిసెలు కనిపించకుండా చేసేందుకు సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు దాదాపు 7 అడుగుల ఎత్తైన ఈ గోడను నిర్మించడంతోపాటు, దాని పొడవునా ఖర్జూర మొక్కలు నాటి ఆ మార్గాన్ని అందంగా తయారుచేయనున్నారు.
ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న 16 ప్రధాన మార్గాల్లో రోడ్లు వేస్తున్నారు. విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం వంటి పనుల్లో యంత్రాంగం బిజీగా ఉంది. ఈ మొత్తం పనుల కోసం అహ్మదాబాద్ అధికారులు రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు మీడియా పేర్కొంది. జపాన్ ప్రధాని షింజో అబే(2017), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(2014) పర్యటనలప్పుడు గుజరాత్ ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపట్టింది. 2017లో ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన సమయంలో హైదరాబాద్‌లో ఆమె పర్యటించే ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లందరినీ తెలంగాణ యంత్రాంగం వేరే చోటికి తరలించిన విషయం తెలిసిందే.
భారత పర్యటనపై మెలానియా ఉత్సాహం
భారత్‌లో పర్యటనకోసం తానెంతో ఉత్సుకతతో ఉన్నానని అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా చెప్పారు. అహ్మదాబాద్, న్యూఢిల్లీలో పర్యటనకు తమను సాదరంగా ఆహ్వానిస్తోన్న భారత ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బలపడనున్న బంధాన్నీ సెలబ్రేట్ చేసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నామని మెలానియా ప్రకటించారు. తమ ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనదనీ, ఇది భారత్–అమెరికాల మధ్య స్నేహ బంధాల్ని బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ ఆమె ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment