గోడ కోసం 20 శాతం పన్ను!
► దిగుమతి సుంకం పెంపు ఆలోచనలో అమెరికా
► మెక్సికోతో వెంటనే అమలవుతుందని వెల్లడి
వాషింగ్టన్ : అమెరికాతో వాణిజ్య లోటు ఉన్న దేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 20 శాతం పన్ను విధించేందుకు వెనుకాడేదిలేదని అమెరికా హెచ్చరించింది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను మెక్సికోకు మాత్రమే అమలుచేయనున్నట్లు చెప్పిన శ్వేతసౌధ ప్రెస్ కార్యదర్శి స్పైసర్.. ఈ నిధులతోనే సరిహద్దుల్లో గోడ నిర్మాణం చేపడతామన్నారు. ‘ప్రస్తుతానికి మెక్సికోపైనే దృష్టిపెట్టాం. కానీ మా వాణిజ్య పరిస్థితిని చూస్తుంటే.. మిగిలిన దేశాలపైనా అమలు చేయాలా? వద్దా? అనే ఆలోచన వస్తోంది.’ అని అన్నారు. మెక్సికోతో వాణిజ్య లోటున్న 50బిలియన్ డాలర్లపై 20 శాతం దిగుమతి సుంకం విధిస్తే పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుందని, 160 దేశాలపై ఇదే విధానాన్ని వ్యవహరిస్తే ఏడాదికి 10 బిలియన్ డాలర్లను (రూ.68వేల కోట్లు) అమెరికా అదనంగా సంపాదించగలుగుతుందన్నారు.
విదేశాల్లోనూ అమెరికా వస్తువులు సమానంగా అమ్ముడయ్యేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. కాగా, అమెరికా ఒకవేళ వాణిజ్యలోటున్న అన్ని దేశాలతో ఇదే నిర్ణయాన్ని అమలుచేస్తే.. భారత్, చైనా వంటి దేశాలకూ ఇబ్బందులు తప్పవు. కాగా, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో అమెరికా పర్యటనను రద్దుచేసుకోవటమే మంచిదని.. ఒకవేళ నీటో పర్యటించినా అది వ్యర్థమే అయ్యేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘గోడ నిర్మాణ ఖర్చులను భరించే విషయంలో వారినుంచి సానుకూల స్పందన లేనప్పుడు.. ఎన్ని సమావేశాలు జరిగినా ఫలితం ఉండదు’ అని ఫిలడెల్ఫియాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ రిట్రీట్‌లో వెల్లడించారు.
కాగా, మెక్సికోతో 1600 కిలోమీటర్ల పొడవునా గోడ నిర్మించేందుకు 25 బిలియన్ డాలర్లు (రూ. 1.70లక్షల కోట్లు) అవుతుందని ఓ అధ్యయనం వెల్లడించగా.. 12 నుంచి 15 బిలియన్ డాలర్లు (దాదాపు లక్ష కోట్ల రూపాయలు) అవుతుందని అమెరికా సెనెట్ అంచనా వేసింది. కాగా, డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం బ్రిటీష్ ప్రధాని థెరీసా మేతో సమావేశమయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్‌కు విదేశీ నేతతో ఇదే తొలి భేటీ. ‘ప్రపంచం మార్పుదిశగా వెళ్తోంది. ఆ మార్పును మేం (అమెరికా, ఇంగ్లండ్) నడిపించేందుకు అవకాశం ఉంది. చైనా, భారత్‌ల ఎదుగుదలను స్వాగతిస్తున్నాం’ అని మే తెలిపారు.