Women wing
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరుదు కల్యాణి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరుదు కల్యాణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, వైఎస్సార్సీపీకి చెందిన 22 అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
హాట్ టాపిక్‌గా నిర్మలా సీతారామన్ సెల్ఫీ
షిమ్లా: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ సెల్ఫీ దిగారు. అదీ తన కాన్వాయ్‌ను ఆపి మరి!. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం(నవంబర్ 10)తో ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆఖరిరోజు కీలక నేతల ప్రచారంతో ఆ రాష్ట్రంలో హడావిడి నెలకొంది. ఈ క్రమంలో.. షిమ్లాలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ నేత నిర్మలా సీతారామన్ ఉల్లాసంగా పాల్గొన్నారు. అయితే.. కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆమెకు తారసపడ్డారు. అప్పటికే వాళ్లంతా ప్రియాంక గాంధీ వాద్రా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను చూసి చేతులు, తమ మెడలోని కండువాలు ఊపారట. అది గమనించిన సీతారామన్ కాన్వాయ్‌ను ఆపించి.. వాళ్ల దగ్గరకు వెళ్లారు. వాళ్లతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి.. వాళ్ల కోరిక మేరకు సెల్ఫీలు కూడా దిగారు. ఈ విషయాన్ని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ కరణ్ నందా తెలియజేశారు. ఆ కాసేపటికే మాల్ రోడ్లో మధ్యాహ్నాం నిర్వహించిన జన్ సంపర్క్ ప్రచారంలో ప్రియాంక గాంధీ కార్యక్రమానికి ఆ కార్యకర్తలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. సీతారామన్‌తో సెల్ఫీలు దిగడంపై కాంగ్రెస్ గుస్సాగా ఉంది. అలా చేయడంపై కార్యకర్తలను షిమ్లా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ వివరణ కోరారు. సీతారామన్ మహిళలను తలెత్తుకునేలా చేశారని, అందుకే ఆమెతో సెల్ఫీలు దిగామని ఆ కార్యకర్తల ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్యపై పార్టీపరమైన చర్యలుంటాయా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!
‘ఒక సమాజపు ప్రగతిని, ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతితో కొలుస్తాను’ అన్నారు అంబేద్కర్. ఏ మార్పుకైనా మహిళలు ఎంత కీలకమో చెప్పే అరుదైన వ్యాఖ్య ఇది. మిగతా అన్ని సమూహాల మాదిరిగానే భారత మహిళల ప్రగతికి కూడా భిన్నత్వం ఉంది. ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుందని గురజాడ అంటే, ఆ చరిత్ర స్వేచ్ఛా సమానత్వాలతో అత్యంత ప్రజాస్వామికంగా ఉంటుంది అనుకున్నాము, ఆ వైపు కొన్ని ముందడుగులు పడ్డాయి. అయితే గత యాభై ఏళ్లుగా పాక్షికంగా, గత పదేళ్లుగా వడివడిగా కొన్ని మహిళా సమూహాలు కొత్తచరిత్రని వేగంగా నిర్మిస్తూ పోతున్నాయి. ఆ చరిత్ర ఫాసిస్ట్ భావజాలానికి బలమైన చేర్పుని ఇస్తూ ఉండటం కలవరపరిచే అంశం. ‘ఒక దేశపు ఫాసిస్టు భావజాల పురోగతిని, ఆ దేశపు రైట్ వింగ్ మహిళలు సాధించిన పురోగతితో కొలవాల్సి ఉంటుంది.’ ఇట్లా కొలిచినపుడు విభ్రాంతి కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కూడూ, గూడూ, చదువూ, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళూ– వీటిలో కాసింత స్వేచ్ఛకోసం జీవితమంతా పణంగా పెట్టి కొందరు స్త్రీలు పోరాటాలు చేస్తున్నారు. మరోవైపు దేశాన్ని హిందూవర్ణంతో నింపేయడానికి సాయుధ, భావజాల, ప్రచార శిక్షణలతో మరికొందరు స్త్రీలు దూసుకుపోతున్నారు. భారతదేశంలో ఫాసిజం ప్రధానంగా ‘హిందూత్వ బ్రాహ్మణీయ భావజాలరూపం’లో ఉందని విశ్లేషకుల అంచనా. ‘ఈ దుష్ట ఫాసిస్ట్ రాజ్యం నశించాలి’ అంటూ కేవలం అధికార వ్యవస్థలను శత్రువుల్లా చూస్తూ వచ్చిన కాలాన్ని దాటి ముందుకు వచ్చాము. ఇపుడు ఫాసిస్ట్ భావజాలం రాజ్యంలోనే కాదు... మన ఆఫీసుల్లో, ఎదురింట్లో, మనింట్లో, మనలోపలికి కూడా వచ్చేసింది. మొదటిదశలో రాజ్యవ్యవస్థలు ఎవరినైతే అణచివేస్తాయో, ఆయావర్గాల్లో నుంచే కొందరిని మచ్చిక చేసి, ప్రలోభపెట్టి తమకి అనుగుణంగా మలుచుకోవడం రెండోదశ. పైవర్గాలకి అనధికార బానిసలుగా మారడం, స్వీయవర్గాల మీదనే దాడి చేయడం, ఇదంతా దేశభక్తిగా పరిగణింపబడటం ఒక చట్రం. గుజరాత్ ముస్లిం జాతి హననకాండలో వాఘ్రీస్, చరస్ తెగల ఆదివాసీలు, పట్టణ దళితులు తీవ్రమైన హింసకి, లూటీలకి పాల్పడ్డారు. వారి వల్నరబిలిటీని అక్కడి మతతత్వశక్తులు గురిచూసి వాడుకున్నాయి. అగ్రవర్ణాల హిందూ మహిళలు, నాయకురాళ్ళు కొందరు దగ్గరుండి చప్పట్లు కొట్టి మరీ తమ మగవారు చేసే అత్యాచారాలను ప్రోత్సహించారు. తమలోతాము కొట్లాడుకునే బదులు ప్రతి హిందూ యువకుడూ– ఫలానా మైనార్టీ మతంలోని తలొక పురుషుడినీ చంపితే సంతోషిస్తామని మార్గనిర్దేశం చేశారు. ఉత్తర భారతదేశంలో ‘కొత్తమహిళ’ ఆవిర్భవించింది. మతతత్వపార్టీలకూ, సంస్థలకూ అనుబంధంగా మహిళా విభాగాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ‘మాత్రీ మండలులు’, ‘సేవికా సమితులు’, ‘మహిళా మోర్చాలు’ తమ కార్ఖానాల్లో స్త్రీలకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. స్త్రీలు మృదువుగా, సుకుమారంగా ఉండాలని భావించే పితృస్వామిక సమాజం వారిని మతసంస్థలు నిర్వహించే పారా మిలిటరీ తరహా సాయుధ శిక్షణకి ఎలా ఒప్పుకుంది? స్త్రీలు ఉద్యోగాల కోసమో, ఇతర సామాజిక కార్యకలాపాల కోసమో అడుగు బైటపెడితే చాలు అనేక అనుమానాలతో వేధించే కుటుంబం, వారిని ధార్మిక కార్యకలాపాల కోసం రోజుల తరబడి పుణ్యక్షేత్రాలకి ఎలా అనుమతిస్తోంది? పర్పుల్ అంచున్న తెల్లచీరలు కట్టుకుని మతప్రచారికలుగా, అధ్యాపికలుగా అవివాహిత స్త్రీలు ప్రతిగుమ్మం స్వేచ్చగా తిరుగుతూ ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఫాసిస్ట్ మతవ్యాప్తి కోసం అధికారవ్యవస్థలు స్త్రీలకి కాస్త కళ్ళాలు వదులు చేస్తాయి. తాము నిర్ణయించిన అంశాలలో స్త్రీలకి చరిత్రను పునర్లిఖించే బాధ్యతని అప్పగిస్తాయి. ‘స్త్రీ స్వేచ్ఛ అంటే, తమమీద జరిగే దాడులు, అత్యాచారాల నుంచి విముక్తి పొందడమే తప్ప భార్యలుగా, తల్లులుగా తమ సాంప్రదాయక విధుల నుంచి విముక్తి పొందడం కాద’ని ఒక మతతత్వ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి వ్యాఖ్యను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇంతకు ముందు మాత్రం స్త్రీలు అధికారం చలాయించలేదా అంటే చంఘిజ్ ఖాన్ నవలలో చెప్పినట్లు అధికారం వస్తే గడ్డిపరక కూడా తలెత్తి నిలబడుతుంది. రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారస్థు్థలు, సెలబ్రిటీ కళాకారులు, అగ్రవర్ణాలు, పదవులు హోదాల్లో ఉన్నవారి భార్యలు, తల్లులు, కూతుళ్ళు, అప్పచెల్లెళ్ళు కొందరు తమకి సొంతంగా పవర్ లేకపోయినా తమ మగవారి తరఫున వారికన్నా ఎక్కువ చలాయించడం వాస్తవం. ప్రాబల్యకులం, ధనికవర్గం, హోదా, అధికారం అంతిమంగా జత కడతాయి. అందులో స్త్రీలు ముఖ్యపాత్ర పోషిస్తారు. అయితే కనీసం మాటవరసకైనా – కులం అనాగరికం అనీ, పేద ఓటర్లే తమ దేవుళ్ళనీ, ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకేననీ – ఇలా బహిరంగంగా పవర్‌ని వ్యతిరేకించడం నైతికవిధిగా ఉండేది. ఇపుడు ఆ భారాన్ని తీసివేస్తూ పైవర్గాల స్త్రీల ఏకీకరణకి మతం అందివచ్చిన సాధనం అయింది. ఈ సాధనం మొదట సాంస్కృతిక రంగంలో బలమైన పునాదులు వేసుకుంటోంది. వర్గాల, కులాల, హోదాలవారీగా కొంతమంది స్త్రీలు ఏర్పాటు చేసుకునే కిట్టీపార్టీల్లో మత సంబంధ కార్యాచరణ ఏదో ఒకమేరకు సాగుతోంది. పట్టణ, ధనిక, మధ్యతరగతి మహిళలు మత కార్యకలాపాలు నిర్వహించడానికి అపార్ట్మెంట్ కల్చర్ చాలా అనువుగా ఉంటోంది. చందాల సేకరణ, ఉత్సవాల నిర్వహణ కమిటీలలో స్త్రీలు చురుకుగా పాల్గొంటున్నారు. దేశభక్తి ముసుగులో మతాన్ని ఉగ్గుపాలతో రంగరించి బిడ్డలకి పోయడానికి తల్లులు సమాయత్తమవుతున్నారు. బాలల వికాసం అంటే కాషాయ దుస్తులు తొడిగి, తలకి కాషాయపట్టీ పెట్టి ప్రతీ పండగలో పిల్లల చేత కోలాటాలు, డీజేలు ఆడించడం విధిగా మారిపోయింది. ఒకప్పుడు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడానికి తపన పడిన తల్లులు, ఇప్పుడు పురాణ స్త్రీలను అమ్మాయిలకి ఆదర్శంగా చూపిస్తున్నారు. పాతివ్రత్య నిరూపణ కోసం అగ్నిలో నిలబడి ఉన్న సీత క్యాలెండర్ లక్షలాది కాపీలు అమ్ముడుపోయి ఇంటి గోడలపై ప్రత్యక్షం కావడం ఆడపిల్లలకి ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది? మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంతవరకూ, దానినుంచి ప్రమాదం లేకపోవచ్చు, కానీ రాజకీయ ఆచరణగా ముందుకు వచ్చినపుడు అనేకమతాల భారతదేశంలో లౌకికతత్వం వెనక్కిపోయి మెజార్టీమతం అందరి నెత్తికెక్కి సవారీ చేస్తుంది. ఇంటి వరండా, హాలు వంటివి అందరూ వచ్చి పోవడానికి వీలైన లౌకికస్థలాలు. అక్కడ స్త్రీలు తమ చేతికళా నైపుణ్యాలతో తయారు చేసిన మత ప్రదర్శనా చిహ్నాలు, ఇతర మతస్థులు తమకి ఎంత పరాయివాళ్ళో చెబుతూ ఉంటాయి. రాజకీయాలకి ఏమీ సంబంధం లేదేమో అనిపించేంతగా ఈ కొత్త మహిళలు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసిపోతారు. పక్కింటి కొత్త కోడలికి వంట నేర్పడమో, ఎదురింటి పెద్దాయనకి అత్యవసర వైద్యసాయమో; ఆందోళన, అభద్రతల్లో ఉన్నవారికి మాటసాయమో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి చేతిసాయమో చేయడం ద్వారా చుట్టుపక్కల అందరికీ ముఖ్యులు అవుతారు. ఆయా సందర్భాల రోజువారీ చర్చల్లో భాగంగా తమ మత భావజాలాన్ని వ్యాప్తిలోకి తెస్తారు. భార్యాభర్తల సమస్యలకి న్యాయసహాయం తీసుకోకుండా ఈ మహిళలే మతసంఘాల ద్వారా పంచాయితీలు పెట్టి సర్దుకుపోవలసిన భారాన్ని స్త్రీల మీద వేస్తారు. ఎన్నికలు, పార్టీమీటింగుల సమయాల్లో వీరు ప్రచారకర్తలుగా మారి సాయాలు చేయడం ద్వారా తాము పట్టు పెంచుకున్న సర్కి ల్స్‌ని సమీకరించి రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారు. నాలుగు దశాబ్దాల కిందట స్త్రీలు తమ పిల్లల్నీ, ఇంటినీ చూసుకుంటే చాలన్న దృష్టితో ఉద్యోగాలలో మహిళా రిజర్వేషన్‌ను మూడుశాతానికి కుదించిన ఘనత ఉత్తర భారత రాష్ట్రాలకి ఉంది. అనుకరణలో ఆరితేరిన దక్షిణ భారతదేశం అక్కడి మత రాజకీయాలనే కాదు, అక్కడి కొత్త మహిళలను కూడా ఆవాహన చేసుకుంటోంది. మత రాజకీయాలు మనకి వద్దు అనుకుంటే ప్రజలకు అయిదేళ్ళకాలం చాలు. ఈ కొత్త మహిళలు సర్వరంగాల్లో తెస్తున్న తిరోగతి వద్దు అనుకుంటే పోవడానికి యాభై ఏళ్ల కాలం కూడా చాలదు! (క్లిక్: మానవ హక్కుల వకీలు బాలగోపాల్) - కె.ఎన్. మల్లీశ్వరి జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక malleswari.kn2008@gmail.com -
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్
ఒంగోలు: ‘విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్మోహన్రెడ్డి అయితే వెన్నుపోట్లకు పెట్టింది పేరు చంద్రబాబు’ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మ అంటూ జగన్మోహన్రెడ్డి పిలిచే పిలుపులోనే ఆప్యాయత, అనురాగాలు ఉట్టిపడతాయన్నారు. కానీ చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవంగా ఉండాలన్న కనీస జ్ఞానం కూడా లేని వ్యక్తని ధ్వజమెత్తారు. 2014లో డ్వాక్రా సంఘాల అప్పులు మొత్తం తీరుస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... గద్దెనెక్కాక రూ.14 వేల కోట్ల అప్పును తీర్చకుండా సంఘాలను రుణాల రొంపిలోకి నెట్టి డిఫాల్ట్ అయ్యేలా చేశాడని మండిపడ్డారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి హామీ మేరకు రెండు విడతలుగా డ్వాక్రా సంఘాల రుణాలను తిరిగి వారికి చెల్లించడంతో పాటు ఏటా సున్నా వడ్డీ కూడా అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తూ వారందరినీ లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాజ్యోతిరావు ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఆయన చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. ఈ ఆశయాలే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 175కు 175 స్థానాలు కట్టబెడతాయన్నారు. రెండేళ్లు కరోనా వెంటాడినా రూ.లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేసి సీఎం జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారన్నారు. అందుకే జగన్‌ను చూస్తే నమ్మకం, చంద్రబాబును చూస్తే వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి ప్రజలు విచ్చేసి జగన్మహన్రెడ్డి పట్ల కనబరిచిన విశ్వాసం దేశచరిత్రలోనే ప్రత్యేక రికార్డు అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పోతుల సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడితే సామాజిక న్యాయానికి పేటెంట్ అని చెప్పుకుంటారని, కానీ ఆయన భావజాలమే ప్రజా వ్యతిరేకమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటించారన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామంటూ హెచ్చరించిన ఘటనలు, దళితులపై చేసిన వ్యాఖ్యలు, చివరకు అమరావతిలో 55వేల మంది అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కోర్టుల కేసులు వేయించిన చంద్రబాబుకు సామాజిక న్యాయంపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే, ప్రజల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పోతుల సునీతకు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చింతగుంట్ల సువర్ణ, పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. (క్లిక్: బాబుకు మైండే కాదు.. చెవులూ పోయాయి) -
దావూద్ గ్యాంగ్‌లో లేడీస్ టీం
సాక్షి, ముంబై : అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తన చీకటి సామ్రాజాన్ని విస్తరించేందుకు మహిళలకూ ఎర వేస్తున్నాడు. మాఫియా గ్యాంగ్‌లు తమ కార్యకలాపాల్లో మహిళలు, కుంటుంబాలను దూరం పెడితే డీ గ్యాంగ్ మాత్రం ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. మహిళలు టార్గెట్‌గా ఉన్న ఆపరేషన్స్‌ను చక్కబెట్టేందుకు లేడీస్ వింగ్‌ను రంగంలోకి దించే వ్యూహంతో డీ కంపెనీ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిఘా సంస్థలు భావిస్తున్నాయి. మహిళా సభ్యుల ఫోన్ కాల్స్‌ను నిఘా వర్గాలు విశ్లేషించగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక విభాగం మహిళల నుంచి నిత్యం సొమ్ము వసూళ్లు చేస్తూ తమకు కేటాయించిన మిషన్స్‌పై ఎప్పటికప్పుడు దావూద్‌కు వివరాలు చేరవేస్తున్నట్టు తెలిసింది. దావూద్‌కు అత్యంత సన్నిహితుడైన చోటా షకీల్ లేడీస్ వింగ్ బాధ్యతను ఉస్మాన్ అనే తన సన్నిహితుడికి కట్టబెట్టాడు. లేడీస్ వింగ్‌కు సంబంధించిన సమాచారం, వారు సాగిస్తున్న కార్యకలాపాలపై మాజీ ఐపీఎస్ అధికారి పీకే జైన్ విస్తుపోయారు. పోలీస్ అధికారిగా తన హయాంలో ఇలాంటి అంశాలు ఎన్నడూ తన అనుభవంలోకి రాలేదని మాఫియా కార్యకలాపాలను నిర్వహించడంలో దావూద్ ఇబ్రహీం నిస్సహాయ స్థితిలో ఉన్నాడనేందుకు ఇది సంకేతమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ల నుంచి రూ కోటి డిమాండ్ చేస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని ముంబయి ఖర్ పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేయడంతో డీ కంపెనీ మహిళా విభాగం కార్యకలాపాలు వెలుగుచూశాయి. మరోవైపు పోలీస్ నిఘా, దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు దావూద్ ముఠా వ్యూహం మార్చిందని.. ఇప్పుడు దావూద్ బిట్‌కాయిన్స్‌లో లావాదేవీలు కొనసాగిస్తున్నాడని, సంప్రదాయ కరెన్సీ నుంచి ప్రత్యామ్నాయాలకు మళ్లాడని భావిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు. జి.వి.సునీత, అరుణారెడ్డి, టి.కామేశ్వరి, కొల్ల గంగాభవాని, వై.దమయంతి, ముగడ గంగమ్మ, చెన్ను విజయ, గంగడ సుజాతను రాష్ట్ర కమిటీలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి మంగళవారం తెలిపారు. వెన్నా సత్యనారాయణరెడ్డిని రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యునిగా నియమించినట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ టి.ఎస్.విజయచందర్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ లీగల్సెల్లోకి జయరాం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కమిటీలో గువ్వాజి జయరాంయాదవ్ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.