విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత
ఒంగోలు: ‘విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అయితే వెన్నుపోట్లకు పెట్టింది పేరు చంద్రబాబు’ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి పిలిచే పిలుపులోనే ఆప్యాయత, అనురాగాలు ఉట్టిపడతాయన్నారు. కానీ చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవంగా ఉండాలన్న కనీస జ్ఞానం కూడా లేని వ్యక్తని ధ్వజమెత్తారు. 2014లో డ్వాక్రా సంఘాల అప్పులు మొత్తం తీరుస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... గద్దెనెక్కాక రూ.14 వేల కోట్ల అప్పును తీర్చకుండా సంఘాలను రుణాల రొంపిలోకి నెట్టి డిఫాల్ట్ అయ్యేలా చేశాడని మండిపడ్డారు. కానీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు రెండు విడతలుగా డ్వాక్రా సంఘాల రుణాలను తిరిగి వారికి చెల్లించడంతో పాటు ఏటా సున్నా వడ్డీ కూడా అందిస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తూ వారందరినీ లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాజ్యోతిరావు ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఆయన చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. ఈ ఆశయాలే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 175కు 175 స్థానాలు కట్టబెడతాయన్నారు. రెండేళ్లు కరోనా వెంటాడినా రూ.లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉన్నారన్నారు. అందుకే జగన్‌ను చూస్తే నమ్మకం, చంద్రబాబును చూస్తే వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి ప్రజలు విచ్చేసి జగన్‌మహన్‌రెడ్డి పట్ల కనబరిచిన విశ్వాసం దేశచరిత్రలోనే ప్రత్యేక రికార్డు అన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు పోతుల సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడితే సామాజిక న్యాయానికి పేటెంట్ అని చెప్పుకుంటారని, కానీ ఆయన భావజాలమే ప్రజా వ్యతిరేకమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటించారన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామంటూ హెచ్చరించిన ఘటనలు, దళితులపై చేసిన వ్యాఖ్యలు, చివరకు అమరావతిలో 55వేల మంది అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కోర్టుల కేసులు వేయించిన చంద్రబాబుకు సామాజిక న్యాయంపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే, ప్రజల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పోతుల సునీతకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చింతగుంట్ల సువర్ణ, పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. (క్లిక్: బాబుకు మైండే కాదు.. చెవులూ పోయాయి)
Comments
Please login to add a commentAdd a comment