షిమ్లా: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ సెల్ఫీ దిగారు. అదీ తన కాన్వాయ్‌ను ఆపి మరి!. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం(నవంబర్ 10)తో ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆఖరిరోజు కీలక నేతల ప్రచారంతో ఆ రాష్ట్రంలో హడావిడి నెలకొంది. ఈ క్రమంలో..
షిమ్లాలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ నేత నిర్మలా సీతారామన్ ఉల్లాసంగా పాల్గొన్నారు. అయితే.. కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆమెకు తారసపడ్డారు. అప్పటికే వాళ్లంతా ప్రియాంక గాంధీ వాద్రా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను చూసి చేతులు, తమ మెడలోని కండువాలు ఊపారట. అది గమనించిన సీతారామన్ కాన్వాయ్‌ను ఆపించి.. వాళ్ల దగ్గరకు వెళ్లారు.
వాళ్లతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి.. వాళ్ల కోరిక మేరకు సెల్ఫీలు కూడా దిగారు. ఈ విషయాన్ని బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ కరణ్ నందా తెలియజేశారు. ఆ కాసేపటికే మాల్ రోడ్‌లో మధ్యాహ్నాం నిర్వహించిన జన్ సంపర్క్ ప్రచారంలో ప్రియాంక గాంధీ కార్యక్రమానికి ఆ కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. సీతారామన్‌తో సెల్ఫీలు దిగడంపై కాంగ్రెస్ గుస్సాగా ఉంది. అలా చేయడంపై కార్యకర్తలను షిమ్లా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ వివరణ కోరారు. సీతారామన్ మహిళలను తలెత్తుకునేలా చేశారని, అందుకే ఆమెతో సెల్ఫీలు దిగామని ఆ కార్యకర్తల ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్యపై పార్టీపరమైన చర్యలుంటాయా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment