సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరించినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. తానే స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు, వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు.
బడ్జెట్‌లో తెలంగాణ అనే పదం నిషేదించారని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలంగాణపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. వివక్ష అనుకున్నాం కానీ కక్ష పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుబట్టారని విమర్శించారు.
ఇది బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్..
‘ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగాం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోకి నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తవన లేదు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. ఏపీ, బిహార్‌లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మోదీకి గౌరవంవం తెచ్చిపెట్టదు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 35 శాతం ఓట్లు ఇచ్చారు
కిషన్ రెడ్డిదే బాధ్యత.. రాజీనామా చేయాలి..
తెలంగాణ కృతజ్ఞత చూపాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ పీఎం పదవిలో కూర్చున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్‌రెడ్డిదే బాధ్యత. కిషన్ రెడ్డి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బయ్యారం, కాజీపేట రైల్వేఫ్యాక్టరీ, ఐఐఎం ఊసేలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వట్లేమని నేరుగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగడం ఎందుకు?
క్విడ్ ప్రో కో అన్నట్లు ఉంది బడ్జెట్..
మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకున్నాం.. కానీ దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు. మోదీని పెదద్దన్నగా మేం బావించాం.. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సవరించే బడ్జెట్‌లో మా విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంటు సమావేశంలో మా నిరసన తెలియజేస్తాం. కేవలం క్విడ్ ప్రో కో అన్నట్లు ఈ బడ్జెట్ ఉంది.
కేంద్ర కక్షపూరిత వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపుతాం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. బండి కిషన్ రెడ్డి తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. ఐఐఎం ఇవ్వమని చెప్పారు.. ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా? ఎవరి దయాదక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు. విభజన చట్టం హామీలు ఏపీకేనా.. తెలంగాణకు వర్తించదా?. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ విక్ష చూపిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది మరో ఉద్యమానికి దారి తీస్తుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment