సాక్షి, ముంబై : అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తన చీకటి సామ్రాజాన్ని విస్తరించేందుకు మహిళలకూ ఎర వేస్తున్నాడు. మాఫియా గ్యాంగ్‌లు తమ కార్యకలాపాల్లో మహిళలు, కుంటుంబాలను దూరం పెడితే డీ గ్యాంగ్ మాత్రం ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. మహిళలు టార్గెట్‌గా ఉన్న ఆపరేషన్స్‌ను చక్కబెట్టేందుకు లేడీస్ వింగ్‌ను రంగంలోకి దించే వ్యూహంతో డీ కంపెనీ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిఘా సంస్థలు భావిస్తున్నాయి.
మహిళా సభ్యుల ఫోన్ కాల్స్‌ను నిఘా వర్గాలు విశ్లేషించగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక విభాగం మహిళల నుంచి నిత్యం సొమ్ము వసూళ్లు చేస్తూ తమకు కేటాయించిన మిషన్స్‌పై ఎప్పటికప్పుడు దావూద్‌కు వివరాలు చేరవేస్తున్నట్టు తెలిసింది. దావూద్‌కు అత్యంత సన్నిహితుడైన చోటా షకీల్ లేడీస్ వింగ్ బాధ్యతను ఉస్మాన్ అనే తన సన్నిహితుడికి కట్టబెట్టాడు.
లేడీస్ వింగ్‌కు సంబంధించిన సమాచారం, వారు సాగిస్తున్న కార్యకలాపాలపై మాజీ ఐపీఎస్ అధికారి పీకే జైన్ విస్తుపోయారు. పోలీస్ అధికారిగా తన హయాంలో ఇలాంటి అంశాలు ఎన్నడూ తన అనుభవంలోకి రాలేదని మాఫియా కార్యకలాపాలను నిర్వహించడంలో దావూద్ ఇబ్రహీం నిస్సహాయ స్థితిలో ఉన్నాడనేందుకు ఇది సంకేతమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ల నుంచి రూ కోటి డిమాండ్ చేస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని ముంబయి ఖర్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేయడంతో డీ కంపెనీ మహిళా విభాగం కార్యకలాపాలు వెలుగుచూశాయి. మరోవైపు పోలీస్ నిఘా, దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు దావూద్ ముఠా వ్యూహం మార్చిందని.. ఇప్పుడు దావూద్ బిట్‌కాయిన్స్‌లో లావాదేవీలు కొనసాగిస్తున్నాడని, సంప్రదాయ కరెన్సీ నుంచి ప్రత్యామ్నాయాలకు మళ్లాడని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment