రచయితల రచయిత బాల్జాక్ | Authors writer Balzac | Sakshi
Sakshi News home page

రచయితల రచయిత బాల్జాక్

Published Fri, Dec 26 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

రచయితల రచయిత బాల్జాక్

రచయితల రచయిత బాల్జాక్

రచయితల రచయిత బాల్జాక్
 
‘ఫ్యాక్టరీలలో తయారైన వస్తువుల్ని ఉత్పత్తి ధరకన్నా రెండింతలకు అమ్మకపోతే వాణిజ్యమే ఉండదు అంటాడు బాల్జాక్ తన విలేజ్ ప్రీస్ట్ నవలలో. ఎలా ఉంది ఆయన పరిశీలన?’ అని అడిగాడు మార్క్స్ ఒకసారి ఎంగెల్స్‌కు లేఖ రాస్తూ.

దానికి జవాబు ఎంగెల్స్ ఏం రాశాడో తెలియదుగాని మార్క్స్ మాత్రం బాల్జాక్‌ను వదల్లేదు. ‘పెట్టుబడి’ మొదటి సంపుటం రాతప్రతిని ప్రచురణ కోసం పంపిస్తూ ఎంగెల్స్‌కు మళ్లీ బాల్జాక్‌ను రికమండ్ చేశాడు. ‘ఆయన రాసిన అన్‌నోన్ మాస్టర్‌పీస్ చదువు. గొప్ప వ్యంగ్య నవలిక’ అని రాశాడు. (పరిపూర్ణ వాస్తవికతని రంగుల్లో రేఖల్లో పట్టుకోవడానికి పదేళ్లు శ్రమించి ఒక పెయింటింగ్ పూర్తి చేస్తాడో ప్రముఖ చిత్రకారుడు. కాని చూసినవాళ్లకు అందులో కొన్ని గజిబిజి గీతలు రంగుల మరకలు తప్ప మరేమీ కనిపించవు. అదీ దాని కథావస్తువు). ‘పెట్టుబడి’ మూడో సంపుటిలో కూడా మార్క్స్ బాల్జాక్ ప్రస్తావన చేస్తాడు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు కానివాళ్లు కూడా దాని నియమాల ప్రకారమే నడుచుకోక తప్పదు. తన చివరి నవల ‘రైతులు’లో బాల్జాక్ ఆ విషయమే స్పష్టం చేస్తాడు’ అని రాశాడు.

మార్క్స్‌ను ఇంతగా ఆకర్షించినవాడూ బాల్జాక్‌లాంటి వాడూ మరో రచయిత లేడు. ఫ్రాన్స్‌లో 1799లో జన్మించిన బాల్జాక్ తన తండ్రి వల్ల బాల్యం నుంచి బాధలు పడ్డాడు. అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బాల్జాక్ తండ్రి కష్టపడి పైకి రావడమే కాక తన పెళ్లిని కూడా ‘జీవితంలో స్థిరపడటానికి’ ఒక నిచ్చెనగా ఆమె ఆస్తిపాస్తులను చూసి చేసుకున్నాడన్న అపవాదు ఉంది. అతడు బాల్జాక్‌ను ఖరీదైన బడిలో చేర్పించినా ‘రూపాయి విలువ తెలిసిరావాలి’ అనే ఉద్దేశంలో అతి తక్కువ పాకెట్ మనీ ఇవ్వడంతో చుట్టూ ఉన్న సంపన్నుల పిల్లల ఎదుట అనేక అవమానాలు పడ్డాడు బాల్జాక్. చదువు పెద్దగా వంటబట్టలేదు. పైగా చిన్నప్పటి నుంచి వదలని అనారోగ్యం. స్కూల్ నుంచి దాదాపు ‘కోమా’ స్థితిలో ఇల్లు చేరుకుని ఆ తర్వాత కొన్నాళ్లు ఇంకేదో చదివి చివరకు తండ్రి ప్రోద్బలం మీద లా ప్రాక్టీసులోకి వచ్చాడు. మూడేళ్లు  పని చేస్తే అదీ రుచించలేదు. ‘తినడం, తాగడం, నిద్రపోవడం... అందరూ ఇదే చేసి దానిని జీవించడం అనుకుంటున్నారు. ఈ రుబ్బురోలు బతుకు నాకక్కర్లేదు. నాకు వేరే చేయాలని ఉంది’ అని మిత్రుడికి రాశాడు బాల్జాక్. దాని ఫలితమే 1820లో రచయితగా అతడి ఆవిర్భావం.

మొదట నాటకాలతో మొదలుపెట్టి ఆ తర్వాత కథలు, నవలలు, విశేష అంశాల మీద పుస్తకాలు లెక్కలేనన్ని రాశాడు. దాదాపు వంద నవలలు ఉన్న తన సాహిత్యాన్నంతా కలిపి బాల్జాక్ ‘హ్యూమన్ కామెడీ’ అన్నాడు. 1850లో మరణించేవరకూ అంటే రచయితగా ఆయన జీవించిన కాలం 1820 - 1850 మధ్యన బాల్జాక్ రాసిన ప్రతీదీ ఫ్రెంచ్ సమాజ చరిత్రకు అద్దం పట్టింది అని విమర్శకుల అభిప్రాయం. ఆ కాలంలోనే ఫ్రాన్స్‌లో బూర్జువా వర్గం బలం పుంజుకుంది. అధికారం కోల్పోయిన రాజవంశీకుల మీద, కులీనుల మీద తన పట్టు బిగించింది. ఒకప్పటి పరువు మర్యాదలు, వంశ గౌరవాలు నడమంత్రపు సిరిగాళ్ల ముందు తల వంచుకున్నాయి. ఆనాటి ఉన్నత వర్గాల మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా అది గొప్పగా మార్చివేశారు. డబ్బు వెదజల్లి భర్తల్ని లొంగదీసుకున్నారు. ఈ పరిణామం, మార్పునంతా ఆర్థిక కోణం నుంచి విశ్లేషించినవాడు బాల్జాక్. అందుకే ‘చరిత్రకారులు, ఆర్థిక శాస్త్రజ్ఞులు, గణాంక నిపుణులు వగైరాల నుంచి నేర్చుకున్నదాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సమాచారం బాల్జాక్‌ను చదివి తెలుసుకున్నాము’ అని మార్క్స్, ఆయనతో పాటు ఎంగెల్స్ కూడా ఒప్పుకున్నారు.

బాల్జాక్ రాసినంత మరో రచయిత రాయగలడా అని సందేహం వస్తుంది. అతడు పని రాక్షసుడు. మధ్యాహ్నంవేళలో తేలికపాటి ఆహారం తీసుకొని నిద్రపోయి సాయంత్రం లేచి, బ్లాక్ కాఫీ పెట్టుకొని రాత్రి తెల్లవార్లూ రాస్తూ కూచునేవాడు. మరుసటి రోజు నడి మధ్యాహ్నం వరకూ ఇదే సాగేది. ‘ఒకసారి నేను మధ్యలో కేవలం 3 గంటలు విరామం పాటించి 48 గంటలపాటు రాస్తూనే ఉన్నాను’ అని బాల్జాక్ చెప్పుకున్నాడు.

 అయితే ఆయన ‘ప్రజా రచయిత’ అని చెప్పలేం. ‘రాజకీయ విశ్వాసాల పరంగా బాల్జాక్ సాంప్రదాయకుడు. రాజరిక వ్యవస్థ అంతమైనందుకు గుండెలవిసేటట్టు విలపించాడు. అయినా తనకు ఆరాధ్యులైన రాజవంశీకులను నిర్మొహమాటంగా ఎండగట్టాడు. ప్రజాస్వామ్యవాదుల పట్ల ఆయనకు సానుభూతి లేదు. అయినా వాళ్ల గురించి గొప్పగా రాశాడు. వాస్తవికతను చిత్రించాలనుకున్న రచయిత చేసే పని అదే’ అని ఎంగెల్స్ ఒకసారి పేర్కొన్నాడు.

 పెట్టుబడినీ బాల్జాక్‌నీ కలిపి చదివితే అది మరింత అర్థమవుతుంది అంటారు విమర్శకులు. బాల్జాక్ యాభై ఏళ్లకు మించి బతకలేదు. కాని రచయితగా వందల ఏళ్ల ఆయుష్షును పొందాడు. బాల్జాక్ రచనలకు విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో చైనీస్ ప్రభుత్వం ఆయన హ్యూమన్ కామెడీని చైనీస్‌లో అనువాదం చేయించింది. ఈ అపూర్వ గౌరవం పొందిన మరొక మహానుభావుడు షేక్స్‌పియర్ ఒక్కడే.
 ఇలాంటి రచయిత తెలుగు పాఠకులకు ’అపరిచితుడి’గా మిలిగిపోవడం సాహిత్య విషాదం.
 - ముక్తవరం పార్థసారథి, 9177618708
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement