The author
-
కంచికి చేరని కథ
పద్ధతిగా వండితే సినిమా కథ కూడా పులిహోర వండినంత తేలికే. అయితే సమస్యేమిటంటే ఒక్క పులిహోరకి వందమంది వంటవాళ్లు తయారవుతారు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉప్పు, కారం, పులుపు కలిపేస్తారు. చివరికి అది పులిసిపోతుంది. జనం పుట్‌బాల్ ఆడుతారు. వెనుకటికి ఒకాయన రామాయణం తీయబోయి పొరపాటున మహా భారతం తీసేశాడు. కథ మీద కూర్చోగానే బంధుమిత్రులంతా వచ్చి తలా ఒక వేషం వేస్తామన్నారు. ఏ ఒక్కరూ కూడా కోతుల వేషం కానీ, రాక్షసుడి వేషం కానీ వేయరట. దాంతో రామాయణాన్ని మార్చి మహాభారతాన్ని తీసారు. కథా చర్చలన్నీ ఇలాగే మంటెక్కువై పెనం మీది దోసెల్లా మాడిపోతుంటాయి. సినిమా కథలో వున్న సౌలభ్యమేమంటే కథలోకి ఎవరైనా ఇట్టే దూరిపోతారు. టీ ఇచ్చే అబ్బాయి కూడా ఒక యాక్షన్ సీన్ చెప్పి వెళ్లిపోతాడు. కామెడీ సీన్లన్నీ నిర్మాత బావమరిది చెపుతాడు. సెంటిమెంట్‌ని నిర్మాత కోడలు యాడ్ చేస్తుంది. పాటలు ప్రొడ్యూసర్ బాల్య స్నేహితుడు రాస్తాడు. ఎవడి పనులు వాళ్లు చేసేస్తూ వుంటే మూల దర్శకుడికి, రచయితకి ఏం చేయాలో తెలియక వీలైతే నీళ్లు లేదంటే బఠాణీలు నములుతుంటారు. వెనుకటికి ఒకాయన తన కుక్కని హీరోగా పెట్టి సినిమా తీద్దామనుకున్నాడు. దాని ప్రత్యేకత ఏమంటే అడిగిన వాళ్లకి షేక్‌హ్యాండ్ ఇస్తుంది. అడగని వాళ్ల మీద పడి కరుస్తుంది. అందువల్ల దానికి ఫైటింగ్‌లు బాగా వచ్చని యజమాని నమ్మకం. చెయ్యిని షేక్ చేసింది, కాలు కూడా షేక్ చేస్తుంది కాబట్టి డాన్స్ కూడా బాగా వచ్చినట్టే. అయితే కుక్కకి దేన్ని హ్యాండ్ అంటారో, దేన్ని లెగ్ అంటారో అని రచయితకి సందేహమొచ్చింది. డౌట్ అడిగేవాణ్ని డౌట్ లేకుండా తన్నాలని నిర్మాత ఫిలాసఫి. అందువల్ల ఆ రచయితని తన్ని తరిమేసి కొత్త రచయితని తెచ్చారు. అతను మూగవాడు. ఏదీ అడగడు, చెప్పడు. కుక్కతో ముహూర్తం షాట్ తీసి గ్రాఫిక్స్‌తో రెండు, గ్రాఫిక్స్ లేకుండా రెండు సీన్లు తీశారు. లైట్ల వేడికి కుక్కకి మంటపుట్టి కెమెరామన్ కండపట్టుకు లాగింది. ఆ రోజుకి ప్యాకప్.మరుసటిరోజు ఈ విషయం జీవకారుణ్య సంఘం వాళ్లకి తెలిసి కుక్కని ఏకాకిని చేసి మనుషులంతా హింసిస్తున్నారని అపార్థం చేసుకుని నిర్మాత దగ్గర నుంచి లైట్ బాయ్ వరకూ దుడ్డుకర్రలతో బాది కుక్కని పట్టుకుపోయారు. హీరో లేకుండా సినిమా తీయడం ఎలా అని నిర్మాత ఆలోచిస్తూ వుంటే ఒక జపాన్ టెక్నో వచ్చి రోబో కుక్కని తయారుచేసి ఇచ్చాడు. ఒరిజినల్ కుక్క బాడీ లాంగ్వేజీని అర్థం చేసుకోవడం ఈజీ. కానీ రోబోకి ఏ స్విచ్ నొక్కితే అరుస్తుందో, కరుస్తుందో తెలియలేదు. తెలుసుకునేలోపు నిర్మాత ఇల్లూవాకిలి, పిల్లామేక, గొడ్డూగోదా అన్నీ అమ్మేశాడు. చివరికి రోబోడాగ్ మిగిలింది. అయితే దానికి విశ్వాసం లేదు. ఛార్జింగ్ పెట్టకపోతే ఇష్టమొచ్చినట్టు కరిచేది. ఒళ్లంతా కట్లతో ఫిల్మ్‌నగర్‌లో ఎవరైనా కనిపిస్తే ఆయనే కుక్క నిర్మాత. - జి.ఆర్. మహర్షి -
యాసలు వేరైనా.. మనమంతా ఒక్కటే..
గాయకుడు గోరటి వెంకన్న కోస్తా, రాయలసీమ, తెలంగాణ.. ప్రాంతాలు, రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటేనని, తెలుగు భాషలోని భావం ఒక్కటేనని సినీ గేయ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. కుబుసం, బతుకమ్మ, ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, పీపుల్స్.. వంటి 80కుపైగా చిత్రాల్లో పాటలు రాశారాయన. ప్రజా సమస్యలపై తన వాణి వినిపించారు. నిద్రపోతున్న సమాజాన్ని తన కలం, గళంతో తట్టిలేపి, నూతనోత్తేజాన్ని కల్పించటంలో ఆయన తీరే ప్రత్యేకం. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న జెక్‌ఫెస్ట్-15కు వచ్చిన వెంకన్న శుక్రవారం కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. - గుడ్లవల్లేరు సాక్షి : గాంధీ సిద్ధాంతాలు ప్రస్తుతం అమలవుతున్నాయంటారా.? వెంకన్న : ఆధునిక యుగంలో గ్రామాలను నగరాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. దేశంలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రధానమంత్రులు బాగా కృషి చేస్తున్నారంటే అమలవుతున్నట్టే కదా.. సాక్షి : దేశాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వెంకన్న : అమెరికాలోని ఎక్కువ శాతంగా ఉన్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భారతీయులే. వారిని మనదేశానికి రప్పించాలి. అలాగే, వనరులను సమృద్ధి పరుచుకోవటంలోనూ ప్రభుత్వాలు ముందుకు సాగాలి. విద్య, వైద్య రంగాల్ని వ్యాపార ధోరణితో కాకుండా పవిత్రమైన బాధ్యతగా చేపట్టాలి. సాక్షి : నేటి సాంకేతిక పరిజ్ఞానంపై మీ కామెంట్.. వెంకన్న : దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ఆ పరిజ్ఞానమే నేడు పక్కదారి పడుతోంది. అంతర్జాలంలో అశ్లీలత పెరిగిపోతోంది. సాక్షి : నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? వెంకన్న : కులమత భావాలను తగ్గించుకుని మానవత్వాన్ని పెంచుకోవాలి. గురజాడ, శ్రీశ్రీ వంటి రచనల సారాన్ని అవపోసన పట్టాలి. సాక్షి : నేటి సమాజంపై సినిమా ప్రభావం ఉందంటారా.. వెంకన్న : సినిమా కల్చర్ వల్ల అంత ఉపయోగమేమీ లేదు. పిల్లల్లో అతి తగ్గాలి. ఎక్కువ సినిమాల్లో మానవీయత నశిస్తోంది. సాక్షి : తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం..... వెంకన్న : కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. రాష్ట్రాలు వేరైనా అంతా తెలుగువారమే. తెలుగు ప్రజల నుంచే పుట్టినట్టుగా నేను సినిమాల్లో పాటలు రాశాను. రాజకీయ ఉచ్చులో పడకూడదు. తెలుగు వారమంతా ఒక్కటే అనేది గుర్తుంచు కోవాలి. యాసలు తేడా ఉన్నా తెలుగు భాషలో భావం ఒక్కటే. సాక్షి : మీరు సానుకూలంగా, వ్యతిరేకంగా స్పందించే అంశాలు ఏమిటి? వెంకన్న : నేను శ్రమను గౌరవిస్తాను. మనుషుల ప్రాణాలను సైతం హరించే థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాలను వ్యతిరేకిస్తాను. వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. గోరటి వెంకన్న -
క్షణ క్షణం రాగం - అనుక్షణం అనురాగం
ఇంద్రగంటి జానకీ బాల, ప్రముఖ రచయిత్రి - గాయకురాలు ఏ సామాన్య గుణానికైనా కొన్ని మినహాయింపులుంటాయి. కళాకారులు - వారు గాయకులైనా, కవులైనా - వచన రచన చేసే రచయిత(త్రు)లైనా పరస్పరం అసహనం - కించిత్ ఈర్ష్య, స్పర్ధ కలిగి ఉంటారనేది లోకసహజంగా అనుకునే విషయం. ఈ లోకవాక్యానికి రజనీకాంతరావుగారు పూర్తిగా మినహాయింపు. రజనిగారు అనేక సాహిత్య ప్రక్రియల్లోనూ, రకరకాల సంగీత రీతులలోనూ నిష్ణాతులు. అయితే ఆయన పాటల గురించి, ప్రత్యేకంగా లలిత గీతాల గురించి ఇక్కడ మాట్లాడాలనిపిస్తోంది. ఆయన పాటరచన, దానికి ఆయన కూర్చే బాణీ చాలా విలక్షణంగా ఉంటాయి. ఒక ప్రత్యేకత గల లిరిసిస్ట్! అపారమైన సంగీతంతో మనసు నిండి ఉండడం వల్ల రాగం - భావం జంటగా ఒక పాటై బయటికి వచ్చి ఆయన గళంలో పలుకుతుంది. అది ఒక తిరుగులేని కళారూపమై అందర్నీ అలరిస్తుంది. ఆయన పాటలు చాలా సున్నితంగా, సులభశైలిలో ఉన్నట్లనిపిస్తాయి గానీ పాడి ఒప్పించటం కష్టంగానే అనిపిస్తాయి. అయినా రజని సినిమాల్లో చేసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. నాకు చిన్నప్పటి నుంచీ రజనీ గారి పాటలు వినడం, పాడడం అలవాటుంది. స్కూలు రోజుల్లో ‘మాదీ స్వతంత్ర దేశం...’, ‘ఇదె జోతా - నీకిదె జోతా...’, ‘పసిడి మెరుగుల తళతళలు...’ లాంటి పాటలు తరచూ పాడే సందర్భాలుండేవి. 1970లో ఆలిండియా రేడియో (విజయవాడ)లో లలిత సంగీతం పాడేందుకు ఆడిషన్ ప్యాసయ్యాను. అప్పటికి రజని విజయవాడ స్టేషన్ డైరక్టర్‌గా రాలేదు. రేడియోలో ‘గీతావళి’ కార్యక్రమం కోసం పాటలు ఎంపిక చేసుకోవాలంటే ఆయన పాటలు ఆకర్షణీయంగా ఉండేవి. ‘రజని’ పాటలుగా ఆయన గీతాలు రేడియోలో మారు మ్రోగుతూ ఉండేవి. సాలూరి రాజేశ్వరరావు పాడిన ‘ఓ విభావరీ...’ గ్రామ్‌ఫోన్ రికార్డు ఆనాటి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించింది. ఇందులో సమాసాలు, పదబంధాలు వినూత్నంగా ఉంటాయి. ‘‘ఓ విభావరీ - / నీ హార హీర నీలాంబర ధారిణీ/ మనోహా రిణీ - ఓ విభావరీ’’ అంటూంటే ఆ ఊహ మనకందని లోకాలలో విహరింప చేస్తుంది. దానికనుగుణంగా రాగం తీగెలు సాగుతుంది. అలాగే ‘చల్లగాలిలో యమునా తటిపై, శ్యామ సుందరుని మురళీ...’. ఇదీ సాలూరి రాజేశ్వరరావు పాడిన పాటే. ఇందులో - ‘‘తూలిరాలు వటపత్ర మ్ముల పయి/ తేలి తేలి పడు అడుగులవే/ పూల తీవ పొదరిండ్ల మాటగ / పొంచి చూడు శిఖి పింఛమదే -’’ అంటూ పాటలోనే బొమ్మకట్టి, కళ్ల ముందుంచి, అద్భుత దృశ్యాన్ని మనోఫలకంపై ముద్రిస్తారు. రజనీగారి పాటలో సాహిత్యం - సంగీతం చెట్టాపట్టాలేసుకుని నడిచే నర్తకీమణుల్లా మెరిసిపోతూంటాయి. శృంగారం, దేశభక్తి, ప్రకృతి, భక్తి - వేటికవే అందంగా పలుకుతాయి ఆయన లలిత గీతాల్లో. ‘‘హాయిగ పాడుదునా సఖీ -/ ఆకసమందున రాకా చంద్రుడు/ నా కౌగిలిలో నీ సౌందర్యము/ కాంచలేక నా మబ్బుల లోపల/ పొంచి చూసి సిగ్గున తలవంచగ - హాయిగ పాడుదునా!’’ ఇక, దేశభక్తి రజనీగారికి వెన్నతో పెట్టిన లక్షణం. దేశ స్వాతంత్య్రం ప్రకటించగానే పాట, ఆంధ్రరాష్ట్రం లభించగానే పాట, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాట - ఇలా అన్ని సందర్భాల లోనూ ఆయన పాటలు రాశారు. ‘‘పసిడి మెరుంగుల తళతళలు / పసిమి వెలుంగుల మిలమిలలు/ గౌతమి కృష్ణల గలగలలు/ గుడి జేగంటల గణగణలు -’’ అంటూ ఆ శుభ సమయాన్ని ఉత్తేజంగా ప్రకటిస్తారు. ‘‘మరునిముసము మనదో - కాదో/ మధువానవో - మధుపా మధుపా’’ అని మరొక్కసారి తాత్వికంగా అంటారు. ‘పోయిరావే కోయిలా’ అంటూ కోయిలకు వీడ్కోలు చెబుతారు. ఇలా చెప్పాలంటే రజనీ గారివి ఎన్ని భావాలు! ఎన్ని ఊహలు! ఎంత వేదన - ఎంత ఆవేదన! ఎంత ప్రేమ - ఎంత అభ్యుదయం - ఎంత సమ భావం! ఇవన్నీ కలిసి ‘రజని’, ఆయన పాటలూ!! మళ్లీ మొదటికొస్తే, 1980లలో రజనీగారి పుట్టిన రోజు ఉత్సవంగా విజయవాడలో జరిగి నప్పుడు నేను ఆయన పాటలు రెండు పాడాను. ఆ రెండూ మా తమ్ముడు సూరి కుమారస్వామి ట్యూన్ చేశాడు. ఒకటి ‘నటన మాడవే మయూరి’. రెండోది ‘పోయి రావే కోయిలా.’ అవి విని రజని గారు బాగున్నాయని నన్ను అభినందించారు. నా లాంటి సామాన్య గాయకురాలు పాడిన పాటలు కూడా ఆనందంగా స్వీకరించి, బాగా పాడాననడం ఆయన హృదయ సంస్కారం. -
వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!
పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పత్రికా సంపాదకులు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి రాయడానికీ, చెప్పడానికీ నాకున్న అర్హత ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు సంగీతం రాదు. అయితే, సంగీతాన్నీ, మంచి పాటనూ ఆస్వాదించడం వచ్చు. నేను టీనేజ్‌లో ఉండగా విన్న ఒక సినిమా గీతం ఆయన పట్ల నాకు ఆరాధనను పెంచింది. అది - ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట. ఆయన స్వరకల్పన చేసిన ఆ పాట తలుచుకుంటే, ఇవాళ్టికీ భలేగా ఉంటుంది. ముఖ్యంగా, ఆ పాటకు ముందుగా వచ్చే ఆ ‘హమ్మింగ్’ లాంటిది భానుమతి పాడిన తీరు, ఆ రకంగా దానికి వరుస కట్టిన రజనీ గారి ప్రావీణ్యం ఇప్పటికీ నిత్యనూతనమే. ఆ రకంగా ఆ రోజుల నుంచే నేను ఆయన సంగీతానికీ, పాటకూ అభిమానిని. ఆ తరువాత జర్నలిజమ్‌లోకి వచ్చాక బెజవాడకు వెళ్ళినప్పుడు జర్నలిస్టు మిత్రులు నండూరి రామమోహనరావు, సి. రాఘవాచారి, ఉషశ్రీ లాంటి వారితో కలుస్తుండేవాణ్ణి. అలా రజనీగారిని కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా కలిశాను. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. పైగా అప్పట్లో నేను ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో పనిచేసేవాణ్ణి. అందువల్ల కొంత వెసులుబాటు ఉండేది. రజనీ గారిని ఎప్పుడు కలిసినా, కేవలం పది నిమిషాలే మాట్లాడుకున్నా సరే, అందులోనూ సంగీతం వినిపించకుండా, మాట్లాడేవారు కాదు. సామాన్య సంభాషణల్లో కూడా అలా సంగీతాన్ని ప్రస్తావించడం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. నిజం చెప్పాలంటే, సంగీతం లేని రజనీని ఊహించలేమంటే నమ్మండి. మనకున్న కళాకారుల్లో, సాహిత్యవేత్తల్లో ఇటు సంగీతం, అటు సాహిత్యం - రెండింటిలోనూ ప్రావీణ్యం ఉన్నవారు ఈ తరంలో, నాకు తెలిసినంత వరకు రజనీ ఒక్కరే! ఒక తరం వెనక్కి వెళ్ళి చూస్తే, సంగీత, సాహిత్యాల్లో అంతటి మహానుభావుడు - హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు. రజనీ గారిలో మరో గొప్పదనం - ప్రకృతిలో, పశుపక్ష్యాదులలో కూడా సౌందర్యాన్నీ, కవిత్వాన్నీ చూసే విభిన్నమైన చూపు. పశువులు, పక్షుల అరుపులో కూడా సంగీతం చూశారాయన. అందుకు ఆయన చేసిన సంగీత రూపకం ‘కొండ నుంచి కడలి దాకా’ ఒక ఉదాహరణ. కీచురాళ్ళ చప్పుడులోనూ సౌందర్యం, సంగీతం, శ్రావ్యతను చూడడం రజనీ ప్రత్యేకత. 1970లలో అనుకుంటా... ఆ సంగీత రూపకానికి గాను ఆయనకు జపాన్ వాళ్ళదనుకుంటా... అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ నాకు ఎదురైన ఒక స్వీయానుభవం ప్రస్తావించాలి. ఒకరోజు మాటల సందర్భంలో ఆయన మా ఇంట్లోని కుక్కకు కూడా సంగీతం వచ్చు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకొకసారి వినిపించండి అన్నాను. సరే అన్నారు. వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఆ పెంపుడు కుక్కను పక్కనపెట్టుకొని, ‘సా’ అని రాగం తీశారు. గమ్మత్తుగా అది కూడా ‘సా’ అంటూ ఆ ఫక్కీలోనే అంది. అలాగే, ‘రి’. ఎక్కడా ఎగుడుదిగుళ్ళు లేకుండా రజనీ గారి ఇంటి పెంపుడు కుక్క ‘సరిగమ పదనిస’లు అన్నీ పలికినట్లు నాకు అనిపించింది. పాటలైతే పాడలేదు కానీ, ఆ కుక్క స్వరాలు పలుకుతున్నట్లు గ్రహించాను. ఆ వెంటనే ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో ఆ ‘సంగీతం పాడే కుక్క’ గురించి ప్రత్యేకంగా ఒక ఫీచర్ రాసి, ప్రచురించాను. ‘ఏ గూటి చిలక ఆ గూడి పలుకు’ అని మనకో జాతీయం ఉంది. సరిగ్గా అలాగే, ఇక్కడ సంగీతపు గూటి కుక్క, ఆ గూటిలోని సంగీతాన్నే పలికిందన్నమాట. ఇవాళ ఒక్కసారి తెలుగునాట సంగీత పరిణామక్రమాన్ని సింహావలోకనం చేసుకుంటే, శాస్త్రీయ సంగీతం కాస్తా లలితసంగీతంగా రూపం మార్చుకొని, ప్రవర్తిల్లడం ఒక పరిణామ దశ. ఆ పరిణామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రితో సహా కొందరు సాహిత్యకారులు, సంగీతజ్ఞుల పాత్ర ఉంది. వారితో పాటు రజనీ గారిది కూడా లలిత సంగీతావిర్భావంలో ఒక ముఖ్యపాత్ర. అలాగే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం డెరైక్టర్‌గా కూడా ఆయన నూతన పథగామి అయ్యారు. ఆకాశవాణిలో మామూలు స్థాయిలో మొదలైన ఆయన కేంద్ర సంచాలకుడి స్థాయి వరకు ఎదిగారు. సాధారణంగా ఆ స్థాయికి వచ్చాక, చాలామంది మునుపు చేసినవారి మార్గాన్నే అనుసరిస్తూ, ఒక మూసలో వెళ్ళిపోతుంటారు. కానీ, రజనీ గారు అలా కాదు. వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ‘భక్తి రంజని’ లాంటివెన్నో రజని గారి కంట్రిబ్యూషనే! అలాగే, యువకులు, కొత్తవాళ్ళలోని ప్రతిభను పసిగట్టి, వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేక లక్షణం ఆయన సొంతం. అలా ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి ఆయన ఒరవడి పెట్టారు. ఇతరులకు కూడా ఆ విషయంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వ్యక్తిగతంగా చూస్తే, వయసులో నా కన్నా రజనీ గారు చాలా పెద్ద. అయినా, నన్నెప్పుడూ ఆయన స్నేహదృష్టితో చూసేవారు. ఆయన, రచయిత మహీధర రామమోహనరావు, నేను కలిసి, సరదాగా మాట్లాడుకున్న క్షణాలు, ఫోటోలు దిగిన క్షణాలు నాకిప్పటికీ గుర్తే! ఆయనకు వయసు మీద పడ్డాక ఎప్పుడైనా కలిసినప్పుడు, ‘కులాసాగా ఉన్నారా’ అని నేను అడిగితే, ఆయన నన్ను గుర్తుపట్టానని చెప్పడానికి బదులుగా కావాలని - ‘నేను... పొత్తూరి వెంకటేశ్వరరావును’ అంటూ ఉంటారు. నేను వెంటనే, ‘అవును. మరి నేనేమో బాలాంత్రపు రజనీకాంతరావును’ అని నమస్కరిస్తుంటా. ఆ మాటతో ఇద్దరం హాయిగా నవ్వుకుంటాం. నిండు చంద్రుడి లాంటి ఆయన నవ్వుకు మరో వసంతం నిండుతున్నందుకు ఆనందిస్తున్నాను. స్నేహసంగీతం పరిమళించే ఈ శతాయువు తెలుగు లలిత సంగీత ప్రపంచంలో చిరాయువు! (సంభాషణ - రెంటాల జయదేవ) -
అలా ఆ కథలు రాశాను...
జ్ఞాపకం 1988 నాటి మాట. అప్పుడు నేను రాసిన ‘అగ్ని సరస్సు’ కథాసంపుటి ఆవిష్కరణ సభకు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం, విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వచ్చారు. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా ఉన్న ఆ సభలో వాళ్లిద్దరూ నాకో సూచన చేశారు. ‘తెలుగు కథ ఆవిర్భవించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావొస్తోంది. కానీ ఇంత వరకు మన పక్కనే మనతో పాటే కలసిమెలసి బతుకుతున్న ముస్లిముల జీవన స్థితిగతుల మీద మాత్రం ఎవరూ రాయలేదు. ఆ పని సత్యాగ్ని చేయగలుగుతాడనే నమ్మకం ఉంది. ఇక మీదట ఆయన రాసే కథలు ఆ లోటును పూరిస్తాయి’ అని ప్రకటించారు. అప్పుడే నాలో ముస్లిం కథలు రాయాలనే ఆలోచన మొదలైంది. అప్పటికి తెలుగు కథాసాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన రచయితలు అనేకమంది ఉన్నారు కానీ ఎవరూ ముస్లిం కథ రాయడానికి పూనుకోలేదు. వారికి ముస్లిములతో పైపై పరిచయాలు తప్ప వారి జీవితాలపై లోతైన అవగాహన లేకపోవడం కూడా కారణం కావచ్చు. అలాగే ఇస్లాం మతసిద్ధాంతాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వాళ్ల జీవితాల గురించి రాస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం కూడా కారణం కావచ్చు. అందుకే అప్పటి వరకు అది ఒక చీకటి కోణంగానే మిగిలి పోయిందనేది నా భావన. ఆ లోటు భర్తీ కోసం నేను నా జీవితంలో జరిగిన, నేను అత్యంత సన్నిహితంగా చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ముస్లిం కథలు రాయడానికి ఉపక్రమించాను. 1989లో నేను రాసిన (తొలి ముస్లిం) కథ ‘పాచికలు’ ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత రాసిన కొన్ని కథలు ‘గీటురాయి’ పక్షపత్రికలో ప్రచురితమయ్యాయి. ఇస్లాం మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం లేక విమర్శించడమో పనిగా కాకుండా వాటిని ఆసరా చేసుకొని కొనసాగుతున్న ముస్లిం స్త్రీల బాధల గాథలకు అక్షర రూపమివ్వడమే నా కథల ప్రధాన ఉద్దేశ్యము. అయితే నా కథలకు కొనసాగింపుగా నా తరువాతి రచయితలెవరూ అంత తొందరగా దీన్ని అందుకోలేదు. మూడు సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసంతో కొందరు యువ రచయితల హృదయాల్లో అణగారి ఉన్న ఆవేదన, ఆవేశము ఒక్క పెట్టున బహిర్గతమై ముస్లిం సమాజ స్థితిగతుల మీద కథలు రాయడం మొదలుపెట్టారు. అది పెరిగి పెద్దదై ముస్లిం వాదంగా స్థిరపడి ఇప్పటికీ కొనసాగుతోంది. - షేక్ హుసేన్ సత్యాగ్ని (తెలుగులో తొలి ముస్లిం కథలు ‘పాచికలు’ రచయిత) -
విద్యార్థులు తప్పక చదవాల్సిన రచన
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు నవలా రచయితగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన త్రీ మంకీస్ని నేను కూడా చదివాను. త్రీ మంకీస్ అనగానే చెడు వినవద్దు, మాట్లాడద్దు, చూడద్దు అనే గాంధీ గారి కోతులు గుర్తుకు వస్తాయి. కాని ఏ కవి అయినా కాలానుగుణంగా మారాలి కనుక వీరు కూడా వానర్, మర్కట్, కపీష్లని దొంగ పనులు చేసి జైలుకి వెళ్ళేవారుగా చిత్రీకరించారు. మల్లాది రచనలు అనగానే సస్పెన్స్, థ్రిల్స్, లాజిక్, రీజనింగ్, మేజిక్ మొదలైనవి కలిపి హ్యూమరస్‌గా చిత్రీకరించడమని అందరికీ తెలుసు. ఈ నవలని కూడా అదే పద్ధతిలో రాశారు. పేరుకి వ్యతిరేక లక్షణాలు గల పాత్రలని మొదట్లోనే ప్రవేశపెట్టి పాఠకులని నవ్వించారు. ఉదాహరణకి లక్ష్మీపతి, గుండూరావు, లావణ్య. గొలుసు మింగిన దొంగకి అరటిపళ్ళ తీర్పు, దుర్యోధన్ నామకరణం, తర్వాత వచ్చే పాత్రలు పేరుకి తగ్గట్టుగా మూలిక, వైతరణి, రుధిర. కోర్టు సీన్లు, దొంగలు, పోలీసులు అత్యంత రక్తి కట్టించాయి. సత్తి పండు కేసు బీర్బల్ కథని గుర్తుకి తెచ్చింది. నవల చదివాక పరవస్తు చిన్నయసూరి గారు పంచతంత్రం ద్వారా రాజకుమారులకి నీతిని బోధించినట్లుగా మల్లాది గారు చెడిపోతున్న సమాజానికి, యువతకి ఈ కథని విష్ణశర్మ గారిలా అందించారు అనిపిస్తోంది. ఈనాటి సమాజాన్నంతటినీ పట్టి పీడిస్తున్న పెద్ద జబ్బు డబ్బు. దానికోసమే ఈ సమాజంలో అనేక అక్రమాలు. కష్టపడకుండా జల్సా చేయడం అలవాటైంది. విద్యార్థి స్థాయి నుంచి మంచి లక్షణాలు రావాలంటే ఇలాంటి రచనలు విద్యార్థులు తప్పకుండా చదవాలి. ఇందులో ముఖ్యమైన విషయాలు సెల్‌ఫోన్ వాడటం, ఫేస్బుక్. వీటి దుర్వినియోగం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి నెట్ మీద ఆధారపడటం (పలుగు, పార కోసం గూగుల్ చేయడం) కథలో చూపించారు. నైతికంగా నేటి యువతీయువకులు ఎలా పతనమైపోతున్నారో చక్కగా వివరించారు. పెద్ద చదువులు చదివి తక్కువ ఉద్యోగాలు చేయలేక, అర్హతగల ఉద్యోగాలు దొరక్క, దశాదిశా చూపించేవారు లేక యువత పడే ఇబ్బందులు ఈ నవలకి పునాది అనే చెప్పాలి. ‘తన కోసం బతికే వాడు కుక్కని పెంచుతాడు. సమాజం కోసం బతికేవాడు మొక్కని పెంచుతాడు’ లాంటి కొటేషన్స్ బావున్నాయి. - ఐ. వి. సుబ్బాయమ్మ, విశ్రాంత ఉపాధ్యాయని, లక్సెట్టిపేట, (ఆదిలాబాద్ జిల్లా) త్రీమంకీస్ సీరియల్‌పై పాఠకుల అభిప్రాయాలు మా ప్రకటనకు స్పందనగా త్రీ మంకీస్ సీరియల్ మీద చాలామంది పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను పంపించారు. వాటిలో నుంచి ఉత్తమమైనవిగా రచయితమల్లాది వెంకట కృష్ణమూర్తి ఎంపిక చేసిన మూడిటిలో ఇది చివరిది. ఎంపిక చేసిన ముగ్గురికి ముందుగా ప్రకటించినట్లు తలో రూ. 500/- నగదు బహుమతి రచయిత పంపుతారు. వీటిని పుస్తక రూపంలో వచ్చే నవలలో కూడా ప్రచురిస్తారు. -
రచయితల రచయిత బాల్జాక్
రచయితల రచయిత బాల్జాక్ ‘ఫ్యాక్టరీలలో తయారైన వస్తువుల్ని ఉత్పత్తి ధరకన్నా రెండింతలకు అమ్మకపోతే వాణిజ్యమే ఉండదు అంటాడు బాల్జాక్ తన విలేజ్ ప్రీస్ట్ నవలలో. ఎలా ఉంది ఆయన పరిశీలన?’ అని అడిగాడు మార్క్స్ ఒకసారి ఎంగెల్స్కు లేఖ రాస్తూ. దానికి జవాబు ఎంగెల్స్ ఏం రాశాడో తెలియదుగాని మార్క్స్ మాత్రం బాల్జాక్‌ను వదల్లేదు. ‘పెట్టుబడి’ మొదటి సంపుటం రాతప్రతిని ప్రచురణ కోసం పంపిస్తూ ఎంగెల్స్కు మళ్లీ బాల్జాక్‌ను రికమండ్ చేశాడు. ‘ఆయన రాసిన అన్నోన్ మాస్టర్‌పీస్ చదువు. గొప్ప వ్యంగ్య నవలిక’ అని రాశాడు. (పరిపూర్ణ వాస్తవికతని రంగుల్లో రేఖల్లో పట్టుకోవడానికి పదేళ్లు శ్రమించి ఒక పెయింటింగ్ పూర్తి చేస్తాడో ప్రముఖ చిత్రకారుడు. కాని చూసినవాళ్లకు అందులో కొన్ని గజిబిజి గీతలు రంగుల మరకలు తప్ప మరేమీ కనిపించవు. అదీ దాని కథావస్తువు). ‘పెట్టుబడి’ మూడో సంపుటిలో కూడా మార్క్స్ బాల్జాక్ ప్రస్తావన చేస్తాడు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు కానివాళ్లు కూడా దాని నియమాల ప్రకారమే నడుచుకోక తప్పదు. తన చివరి నవల ‘రైతులు’లో బాల్జాక్ ఆ విషయమే స్పష్టం చేస్తాడు’ అని రాశాడు. మార్క్స్‌ను ఇంతగా ఆకర్షించినవాడూ బాల్జాక్లాంటి వాడూ మరో రచయిత లేడు. ఫ్రాన్స్‌లో 1799లో జన్మించిన బాల్జాక్ తన తండ్రి వల్ల బాల్యం నుంచి బాధలు పడ్డాడు. అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బాల్జాక్ తండ్రి కష్టపడి పైకి రావడమే కాక తన పెళ్లిని కూడా ‘జీవితంలో స్థిరపడటానికి’ ఒక నిచ్చెనగా ఆమె ఆస్తిపాస్తులను చూసి చేసుకున్నాడన్న అపవాదు ఉంది. అతడు బాల్జాక్‌ను ఖరీదైన బడిలో చేర్పించినా ‘రూపాయి విలువ తెలిసిరావాలి’ అనే ఉద్దేశంలో అతి తక్కువ పాకెట్ మనీ ఇవ్వడంతో చుట్టూ ఉన్న సంపన్నుల పిల్లల ఎదుట అనేక అవమానాలు పడ్డాడు బాల్జాక్. చదువు పెద్దగా వంటబట్టలేదు. పైగా చిన్నప్పటి నుంచి వదలని అనారోగ్యం. స్కూల్ నుంచి దాదాపు ‘కోమా’ స్థితిలో ఇల్లు చేరుకుని ఆ తర్వాత కొన్నాళ్లు ఇంకేదో చదివి చివరకు తండ్రి ప్రోద్బలం మీద లా ప్రాక్టీసులోకి వచ్చాడు. మూడేళ్లు పని చేస్తే అదీ రుచించలేదు. ‘తినడం, తాగడం, నిద్రపోవడం... అందరూ ఇదే చేసి దానిని జీవించడం అనుకుంటున్నారు. ఈ రుబ్బురోలు బతుకు నాకక్కర్లేదు. నాకు వేరే చేయాలని ఉంది’ అని మిత్రుడికి రాశాడు బాల్జాక్. దాని ఫలితమే 1820లో రచయితగా అతడి ఆవిర్భావం. మొదట నాటకాలతో మొదలుపెట్టి ఆ తర్వాత కథలు, నవలలు, విశేష అంశాల మీద పుస్తకాలు లెక్కలేనన్ని రాశాడు. దాదాపు వంద నవలలు ఉన్న తన సాహిత్యాన్నంతా కలిపి బాల్జాక్ ‘హ్యూమన్ కామెడీ’ అన్నాడు. 1850లో మరణించేవరకూ అంటే రచయితగా ఆయన జీవించిన కాలం 1820 - 1850 మధ్యన బాల్జాక్ రాసిన ప్రతీదీ ఫ్రెంచ్ సమాజ చరిత్రకు అద్దం పట్టింది అని విమర్శకుల అభిప్రాయం. ఆ కాలంలోనే ఫ్రాన్స్‌లో బూర్జువా వర్గం బలం పుంజుకుంది. అధికారం కోల్పోయిన రాజవంశీకుల మీద, కులీనుల మీద తన పట్టు బిగించింది. ఒకప్పటి పరువు మర్యాదలు, వంశ గౌరవాలు నడమంత్రపు సిరిగాళ్ల ముందు తల వంచుకున్నాయి. ఆనాటి ఉన్నత వర్గాల మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా అది గొప్పగా మార్చివేశారు. డబ్బు వెదజల్లి భర్తల్ని లొంగదీసుకున్నారు. ఈ పరిణామం, మార్పునంతా ఆర్థిక కోణం నుంచి విశ్లేషించినవాడు బాల్జాక్. అందుకే ‘చరిత్రకారులు, ఆర్థిక శాస్త్రజ్ఞులు, గణాంక నిపుణులు వగైరాల నుంచి నేర్చుకున్నదాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సమాచారం బాల్జాక్‌ను చదివి తెలుసుకున్నాము’ అని మార్క్స్, ఆయనతో పాటు ఎంగెల్స్ కూడా ఒప్పుకున్నారు. బాల్జాక్ రాసినంత మరో రచయిత రాయగలడా అని సందేహం వస్తుంది. అతడు పని రాక్షసుడు. మధ్యాహ్నంవేళలో తేలికపాటి ఆహారం తీసుకొని నిద్రపోయి సాయంత్రం లేచి, బ్లాక్ కాఫీ పెట్టుకొని రాత్రి తెల్లవార్లూ రాస్తూ కూచునేవాడు. మరుసటి రోజు నడి మధ్యాహ్నం వరకూ ఇదే సాగేది. ‘ఒకసారి నేను మధ్యలో కేవలం 3 గంటలు విరామం పాటించి 48 గంటలపాటు రాస్తూనే ఉన్నాను’ అని బాల్జాక్ చెప్పుకున్నాడు. అయితే ఆయన ‘ప్రజా రచయిత’ అని చెప్పలేం. ‘రాజకీయ విశ్వాసాల పరంగా బాల్జాక్ సాంప్రదాయకుడు. రాజరిక వ్యవస్థ అంతమైనందుకు గుండెలవిసేటట్టు విలపించాడు. అయినా తనకు ఆరాధ్యులైన రాజవంశీకులను నిర్మొహమాటంగా ఎండగట్టాడు. ప్రజాస్వామ్యవాదుల పట్ల ఆయనకు సానుభూతి లేదు. అయినా వాళ్ల గురించి గొప్పగా రాశాడు. వాస్తవికతను చిత్రించాలనుకున్న రచయిత చేసే పని అదే’ అని ఎంగెల్స్ ఒకసారి పేర్కొన్నాడు. పెట్టుబడినీ బాల్జాక్నీ కలిపి చదివితే అది మరింత అర్థమవుతుంది అంటారు విమర్శకులు. బాల్జాక్ యాభై ఏళ్లకు మించి బతకలేదు. కాని రచయితగా వందల ఏళ్ల ఆయుష్షును పొందాడు. బాల్జాక్ రచనలకు విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో చైనీస్ ప్రభుత్వం ఆయన హ్యూమన్ కామెడీని చైనీస్‌లో అనువాదం చేయించింది. ఈ అపూర్వ గౌరవం పొందిన మరొక మహానుభావుడు షేక్స్పియర్ ఒక్కడే. ఇలాంటి రచయిత తెలుగు పాఠకులకు ’అపరిచితుడి’గా మిలిగిపోవడం సాహిత్య విషాదం. - ముక్తవరం పార్థసారథి, 9177618708 -
పేరులోనే ఉంది అసలు కథంతా!
కథ రాసి ఒక రచయిత ఒక పత్రిక్కి పంపాడు. సాధారణ ప్రచురణకి. కొంతకాలం ఎదురు చూశాడు. వెనక్కు వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. కథ బాగానే ఉన్నట్టు అనిపించింది. అది రైతు కథ. రైతుకు వ్యవసాయం మీద ఉండే ప్రేమ... మట్టి అంటే ఉండే మమకారం... కరువు... వలస... వీటి వల్ల వచ్చే నలుగుబాటు.... వీటిని రాసి పంపాడు. పేరు కూడా మంచిదే పెట్టాడు. ‘భూమమ్మ’. కాని తిరిగి వచ్చింది. ఈలోపు సంవత్సరం గడిచిపోయింది. అదే పత్రిక ఈసారి కథల పోటీ పెట్టింది. కథ పంపాలి. పాత కథే మళ్లీ తీశాడు. ఊళ్లో ఉన్న సీనియర్ రచయితకు చూపించాడు. ఆ సీనియర్ రచయిత కథంతా చదివి, గతంలో పెట్టిన పేరు కొట్టేసి ‘మన్ను తిన్న మనిషి’ అని పెట్టి- ఇప్పుడు పంపు అన్నాడు. పంపాడు. కొన్నాళ్లు గడిచాయి. ఫలితాలు వచ్చాయి. గతంలో సాధారణ ప్రచురణకు ఎన్నిక కాని కథ ఇప్పుడు ప్రైజ్ కొట్టింది. ఆ రచయిత పేరు- చిలుకూరి దేవపుత్ర. పేరు సరి చేసిన రచయిత పేరు - సింగమనేని నారాయణ. గతంలోనూ ఇలాగే జరిగింది. ఒక రచయిత మంచి కథ రాసి పత్రిక్కి పంపాడు. సంపాదకుడు దానిని చదివాడు. బాగున్నట్టో బాగలేనట్టో అర్థం కాలేదు. కథ పేరు - ‘విపణి వీధి’. తిప్పి పంపాడు. మళ్లీ కొన్నాళ్లకు అదే రచయిత అదే కథను ఇంకో పత్రిక్కి పంపాడు. ఆ పత్రికలో పని చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు స్వయంగా రచయిత. కథను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఆయనదే. కథను చదివాడు. బాగుంది. కొంచెం కత్తిరించాలి. రచయితకు చెప్పి ఆ పని చేశాడు. పేరు కూడా మార్చాలి. మార్చాడు. ‘కువైట్ సావిత్రమ్మ’. అచ్చయ్యింది. తెలుగు నేలంతా ఆ కథ మోగిపోయింది.రచయిత - చక్రవేణు. పేరు సరి చేసిన రచయిత- పి. రామకృష్ణ. సెప్టెంబర్ 11 జరిగింది. ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. అక్కడే ఉంటున్న రచయిత అక్కిరాజు భట్టిప్రోలు ఒక కథ రాశాడు. ఒక విధ్వంస చర్య ఒక జాతి మీదున్న నమ్మకాన్ని కుప్పకూల్చరాదు. కొందరి పని అందరి మీదా విద్వేషాన్ని రగల్చరాదు. అంతే కథ. ఒక్క ఊపులో రాశాడు. పేరేం పెట్టాలో తెలియలేదు. సాటి రచయిత- చంద్ర కన్నెగంటికి పంపాడు. అతనికి కవిత్వం తెలుసు. కథ చదవగానే బైరాగి కవితేదో గుర్తొచ్చింది. టైటిల్ తట్టింది- నాక్కొంచెం నమ్మకమివ్వు. ఇలా జరుగుతుంటుంది చాలాసార్లు. వంటంతా అద్భుతంగా చేసిన చీఫ్ చెఫ్ కూడా ఆఖరులో ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని వాళ్ల దగ్గరా వీళ్ల దగ్గరా గరిటె పట్టుకొని తిరుగుతాడు. రుచి చూసి చెప్తే ఇంకొంచెం వేయడమో ఎక్కువైందని తెలిస్తే రిపేరు చేయడమో... ఇదొక ప్రాసెస్. కథంతా రాశాక పేరు పెట్టడం తెలియదు మనలో చాలామందికి. కొందరు ముందే పేరు అనుకొని కథ మొదలుపెడతారు. అంటే కథ, కథతో పాటు పేరూ ఒకేసారి తడతాయి. ఇది నయం. కాని కథ మొదట తట్టి తర్వాత పేరంటేనే కష్టం. నిజాయితీతో రాసిన కథకు నిజాయితీతో కూడిన మకుటమే పెట్టాలి ఎప్పుడూ. కథలో మోసం ఉన్నా టైటిల్లో మోసం ఉన్నా పాఠకుడు మూచూడడు. చూసినా హృదయానికి పులుముకోడు. గురజాడ టైటిల్స్ చూడండి... దిద్దుబాటు... మీ పేరేమిటి... మెటిల్డా. సూటిగా ఉంటాయి. మల్లాది, శ్రీపాద టైటిల్స్? వేరే చెప్పాలా? మల్లాది ఒక కథకు ‘ఏలేలో’ అని పెట్టారు. మధురం. శ్రీపాద ‘అరికాళ్ల కింద మంటలు’... అనగానే మరి ఆ కథను వదలం. ఎవరి అరికాళ్ల కింద మంటలు అవి? ఏ మంటలు? దాని వల్ల ఏమైంది? కథ చదవడం మొదలెట్టి రెండు మూడు పేజీలు దాటేసరికి మనకు మెల్లగా తెలుస్తుంది మంటలు ఉన్నది మన అరికాళ్ల కిందే అని. కథ గడిచే కొద్దీ ఆ సెగ అంటుకుంటుంది. ఆఖరులో పంటి బిగువు మీద జట్కా పరిగెత్తి పోయి మలుపు తిరిగితే తప్ప మనం తెరిపిన పడం. నీళ్ల బకెట్టులో కాళ్లు పెట్టుకున్నట్టుగా చల్లబడం. అయితే ఆ తర్వాత మన టైటిల్స్ కొంచెం మారాయి. జంట పదాలతో మూస పోశాయి. ఈ ధోరణి బహుశా బుచ్బిబాబు తెచ్చారనుకుంటాను. ‘ఊడిన చక్రం వాడిన పుష్పం’, ‘కాగితం ముక్కలు గాజు పెంకులు’, ‘మర మేకులు చీర మడతలు’, ‘వెనుక చూపు ముందు నడక’.... ఇవన్నీ ఆయన కథల పేర్లే. సామాన్యుణ్ణి దృష్టిలో పెట్టుకుందాం ఒక క్షణం. ఏం కథ చదివారు అనంటే ‘మర మేకులు చీర మడతలు’ అంటాడా? ఆ పేరు అతనికి గుర్తే ఉండదు. దాంతో పాటే కథ కూడా. కాని ఈ ధోరణి కొంత కాలం పాటు తెలుగు కథను పట్టి పీడించింది. ‘భవదీయుడు బంతిపూలు’, ‘పూర్ణము నిరంతమూ’, ‘బింబం ప్రతిబింబం’, ‘ధ్వని ప్రతిధ్వని’, ‘పయనం పలాయనం’, ‘పరిధులూ ప్రమేయాలూ’... ఆఖరుకు బాపుగారు తన జీవితంలో రాసిన ఒకటి రెండు కథల్లో ఒక కథ పేరు ‘మబ్బువానా మల్లెవాసనా’. ఈ వ్యవహారం చూసి చూసి ముళ్లపూడి వెంకట రమణ ఒక హాస్యకథ రాసి దానికి ‘భగ్నవీణలూ బాష్పకణాలూ’ అని పేరు పెట్టి వెక్కిరించారు. అయినా మార్పు లేదు. కాలం అలాంటిది. ప్రభావాలూ అలాంటివే. మధురాంతకం నరేంద్ర ఒక చాలా మంచి కథ రాశారు. ఇంట్లో బాధలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఆడవాళ్ల మీదే ఆ బరువంతా వేసి బలాదూరు తిరిగే మగవాళ్ల కథ అది. పేరు ‘నిత్యమూ నిరంతమూ’. కాని ‘ఎప్పటిలాగే’ అనే పేరు కూడా ఎంత బాగుండేదో కదా అనిపిస్తుంది. మూసలో కొట్టుకుపోవడం అంటే పులివేషగాళ్ల మధ్య పులేషం వేసుకొని తిరగడం. ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. మందతో పాటు తప్పెట్ల మోతలో పోతూ ఉండటమే. కొన్నాళ్లు ఇంకో వింత జరిగింది. ‘రాధమ్మ పెళ్లి (లేక) బంగారుగాజులు’, ‘గడ్డిమోపు (లేక) వీరిగాడి పెళ్లాం’ ఇలాంటి పేర్లు పెట్టారు చాలా మంది. ఈ లేక ఏమిటి? రచయితకు తెలియదా ఇదో లేక అదో. అతడికే తెలియనప్పుడు పాఠకుడికి ఎందుకు? ఆ తర్వాత ‘అను’ అనే ఇంకో వైపరీత్యం వచ్చింది. దీనికి ఆద్యులు రావిశాస్త్రి గారా? ‘ది స్మోకింగ్ టైగర్ అను పులిపూజ’ అనే కథ రాశాడాయన. ఆ తర్వాత కథల పేర్లు- ‘న్యాయం అను టిప్పు సుల్తాన్ కతి’్త, ‘నల్లబజార్ అను సుబ్బారావు పాతబాకీ’... ఇలాంటివి వచ్చాయి. ఈ ధోరణి ఎంత ప్రభావం రేపిందంటే అనంతపురంలో ఉంటూ తమ స్వంత ధోరణిలో కథలు రాసుకునే బండి నారాయణ స్వామి, సింగమనేని నారాయణ వంటి కథకులు కూడా వరుసగా- ‘తెల్లదయ్యం అను గ్రామవివక్ష కథ’, ‘సెప్టెంబర్ 11 అను ఫిరంగిలో జ్వరం’... అనే అను కథలు రాశారు. చెప్పుకోవడానికి ఏమీ లేని వ్యక్తి ఉంగరాలు తొడుక్కుని, బ్రాస్లెట్ పెట్టుకొని, మెళ్లో చైను దిగేసుకొని వీటిని చూసైనా మర్యాదివ్వండి అని చెప్పడం ఎలాగో కథలో ఏమీ లేకపోతే ఒక ఆర్భాటమైన టైటిల్ పెట్టి ఇందులో ఏదో ఉంది అని మోసం చేయడం అలాగ. - ఖదీర్ -
కాళోజీ జీవితం... సాహిత్యం
కాళోజీ ప్రజాకవి. రచయిత. ఉద్యమకారుడు. నిత్య చైతన్యశీలి. జీవితమే ఉద్యమంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ వైతాళికుడు. వ్యక్తి ఉన్నతుడై వ్యక్తిత్వం సమోన్నతమైతే ఆ రెంటి కలయిక కాళోజీ అనంటారు. రాజీ పడి బతికేవాడి ఆయుష్షు కన్నా ఆధిపత్యాన్ని ప్రశ్నించేవాడి యశస్సు గొప్పది అని నిరూపించి అలాంటి యశస్సును మూటగట్టుకున్న గొప్ప కవి కాళోజీ. ఆయన జీవిత చరిత్రే- 20వ శతాబ్దపు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్ర. అందుకే ఆయన ప్రభావం నాడూ ఉంది. నేడూ ఉంది. రేపూ ఉంటుంది. అందుకే నల్లగుంట్ల యాదగిరి రావు ఆయన పట్ల ఆరాధ్యం పెంచుకున్నారు. తాను చదివిన ఎమ్మెస్సీ మేథ్స్ను అక్కడితో వదిలి కేవలం కాళోజీ కోసమే ఎంఏ తెలుగు చేసి ఆ తర్వాత కాళోజీ సాహిత్యాన్ని ిపీహెచ్.డి అంశంగా ఎంచుకున్నారు. ఇదంతా తెచ్చిపెట్టుకునే అభిమానంతో జరిగే పని కాదు. దానికి లోలోపలి అర్పణభావం ఉండాలి. 500 పేజీల ఈ పుస్తకంలో రచయిత వదిలిపెట్టిన అంశమంటూ ఏదీ మిగల్లేదు. కాళోజీ బాల్యం, చదువు, వివాహం, జైలు జీవితం, గ్రంథాలయోద్యమం, జాతీయోద్యమ ప్రభావం, కవిత్వం (నా గొడవ, పరాభవ వసంతం, పరాభవ గ్రీష్మం, పరాభవ వర్షం, పరాభవ శరత్తు, పరాభవ హేమంతం, పరాభవ శిశిరం), ఎమర్జెన్సీ జీవితం, కథలు (మనమే నయం, ఫేస్ పౌడర్, లంకా పునరుద్ధరణ, ఆగస్టు 15, భూతదయ), ఆత్మ కథ (నా గొడవ)... వీటన్నింటినీ సాకల్యంగా చిత్రించడం, చర్చించడం కనిపిస్తుంది. ముఖ్యంగా కాళోజీ వ్యక్తిత్వంలోని లక్షణాలు- స్వేచ్ఛా పిపాస, నిర్భయత్వం, ధైర్యం, సంచార గుణం, జ్ఞాన తృష్ణ, గాంధేయవాదం, స్నేహశీలత్వం, జ్ఞాపక శక్తి... వీటన్నింటినీ తగు దృష్టాంతాలతో తెలుసుకుంటూ ఉంటే కొత్తతరాలకు ఈ వ్యక్తిత్వాన్ని ఎంత చేరువ చేస్తే అంత బాగుణ్ణు కదా అనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ కల సాకారమైంది. కాని ఈ కల సాకారం కావడం వెనుక కాళోజీ వేసిన బీజాలూ అవి చూపిన ప్రభావమూ అందుకొరకు ఆయన స్థిరపరచిన కార్యరంగం అత్యంత శక్తిమంతమైనవి. తెలంగాణవారిపై తెలంగాణేతరుల పెత్తనాన్ని నిరసిస్తూ ఆ రోజుల్లోనే కాళోజి రాసిన ‘లంకా పునరుద్ధరణ’ కథ ఇటీవల వరకూ సాగిన ఒక ధోరణికి చెంపపెట్టు. కాళోజీ సాహిత్యమూ, జీవితమూ లేవనెత్తిన అంశాలపై, చూపిన దిశపై జరగవలసిన చర్చ చాలా ఉన్నది. తెలంగాణ భవిష్యత్తులోని ప్రతి మలుపులోనూ ఆయన నుంచి స్వీకరించాల్సింది ఎంతో ఉంటుంది. అందుకు ఉపయుక్తంగా సమగ్రమైన పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని అందించిన నల్లగుంట్ల యాదగిరిరావు ధన్యులు. ప్రతి సాహితీ ప్రేమికుడూ, ప్రతి తెలంగాణ చదువరి తప్పకుండా పరిశీలించదగ్గ పుస్తకం ఇది. దిశ: కాళోజీ సాహిత్య సమగ్ర పరిశీలన- డా. నల్లగుంట్ల యాదగిరి రావు వెల: రూ.360; ప్రతులకు- 9848382555 -
నూరేళ్లకూ మసకబారని చూపు...
బేతి శ్రీరాములు బి.ఎస్.రాములుగా పాఠకులెరిగిన రచయిత. పుట్టిన గడ్డ జగిత్యాల . తండ్రి ‘బొంబాయి’ బట్టలమిల్లు కార్మికుడు. తల్లి బీడీ కార్మికురాలు. ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాలలో చదివారు. 1964లో ఆర్.ఎస్.ఎస్ క్రియాశీలిగా మొదలయ్యి ’78లో ముఖ్యశిక్షక్‌గా ఎదిగి ఆ తర్వాత 90 వరకూ విప్లవరాజకీయాల్లో కొనసాగి పూలే-అంబేద్కర్ల అధ్యయనం వల్ల దళిత-బహుజన దార్శనికతతో రచనలు చేశారు. కరీంనగర్ మాండలీకంలో 1982లో ప్రచురితమైన ఆయన తొలి నవల ‘బతుకు పోరు’. ఇప్పుడు రెండవ నవల ‘చూపు’ ముద్రణలో ఉంది. ‘చూపు’ ప్రత్యేకత ఏమిటి? తెలంగాణ కేంద్రకం నుంచి చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలను కలుపుతూ మలచిన వృత్తం! ‘చూపు’ గురించి ఆయన మాటల్లోనే... ఏ మంచి నవలైనా సమాజాన్ని వ్యక్తీకరిస్తుంది. భవిష్యత్‌కూ ఉపకరిస్తుంది. బంకించంద్ర ‘ఆనందమఠ్’, రవీంద్రుని ‘గోరా’, ప్రేమ్‌చంద్ ‘రంగభూమి’ ఇందుకు ఉదాహరణలు. 1948లో లక్షీకాంత మోహన్ తెలంగాణపై తొలి నవల రాశారు. ఆ తర్వాత ఆళ్వారుస్వామి, దాశరథి తాము చూసిన తెలంగాణ సమాజపు సంక్షోభాలను నవలీకరించారు. ‘చూపు’లో తెలంగాణ ఉద్యమంలో మూడవ దశ కు సంబంధించిన సంఘటనలుంటాయి. తీసుకున్న కాలం 1989 నుంచి 2008 వరకూ. అంటే రాష్ట్ర ఆవిర్భావానికి ఐదేండ్ల ముందు వరకూ. 1996 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన 36 సంస్థలతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఆ అనుభవాలన్నిటినీ క్రోడీకరించుకుని తెలంగాణ గురించి ఫిక్షన్‌గా చెప్పిన నాన్ఫిక్షన్ ‘చూపు’. ఎన్నో ‘చూపు’ల సమదృష్టి! ‘చూపు’లో తల్లి- తండ్రి- విద్యార్థులు- అధ్యాపకులు- స్త్రీవాదులు- దళితులు- వామపక్షవాదులు- కాంట్రాక్టర్లు ఇలా కీలకమైన 15 పాత్రలు ఉన్నాయి. ఆధిపత్యకులాల నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించాల్సి రావడం వెనుక ఉన్న కారణాలను ఈ పాత్రలు వెల్లడిస్తాయి. ఈ పాత్రల్లో ఎవరి చూపు వారిదే. నవలను ఆకళింపు చేసుకుంటే రచయిత ‘చూపు’ తెలుస్తుంది. అది ఎంత వరకు నిష్పాక్షికం ఏ మేరకు ఆ విశ్లేషణను ఆచరణలో వినియోగించుకోవాలి అనే అంశాన్ని పాఠకులు నిర్ణయించుకుంటారు. ఇందులోని పాత్రలు వాస్తవిక వ్యక్తుల నుంచి వచ్చినవే. ప్రొ.లక్ష్మీపతి పాత్ర ప్రొ.జయశంకర్ వంటి తెలంగాణ మేథావుల సమ్మిళిత రూపం. పార్టీ ఐఏఎస్‌లూ, పార్టీ సీఈవోలు! ఉద్యమాలు విజయవంతం అయిన తర్వాత ‘మరోప్రపంచం’ ఊడిపడదని ఇందులో కొన్ని పాత్రలు కుండబద్దలు కొడతాయి. కమ్యూనిస్ట్ పాలన వస్తే ఇప్పటి ఐ.ఏ.ఎస్‌లు, ిసీ.ఈ.వోలూ, కాంట్రాక్టర్లు అంతరించి పోరని వీరి కుర్చీల్లో పార్టీ ప్రముఖులు వారి వారసులు ఆయా హోదాలలో వస్తారని వర్తమాన ‘కమ్యూనిస్ట్’ దేశాల పాలనాధోరణులను సోదాహరణంగా వివరించే కేపిటలిస్టులూ నవలలో ఉన్నారు. కులవృత్తుల సమాజం పారిశ్రామికవేత్తలు వచ్చేవరకూ ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటుంది. పెట్టుబడికి కులస్వభావం ఉండదు. వర్గస్వభావం కూడా ఉండదు. ‘లాభ’స్వభావం మాత్రమే ఉంటుందనే సంభాషణలూ ఉన్నాయి! ఎందుకివ్వాలి? ఎందుకివ్వకూడదు! కొన్ని పాత్రలు ఆంధ్రా-తెలంగాణ ఆర్థిక మనస్తత్వాలను చర్చిస్తాయి. ఆంధ్రావాళ్లు దోపిడీ చేస్తున్నారనే ఆవేదనలుంటాయి. అందుకు ఎటువంటి పరిస్థితులు దోహదపడుతున్నాయి అనే వివేచన ఉండాలి కదా! ఆంధ్రప్రాంతంలో కేపిటలిస్ట్ దృక్పథం ఉంది. తెలంగాణలో భూస్వామ్యధోరణే చలామణిలో ఉంది. ఇక్కడి సమాజంపై జైన, శైవ ప్రభావాలున్నాయి. ఉన్నది చాలులే అనే ‘అంతఃచేతన’ ఉంది. అయితే ‘వనరులు ఎన్ని ఉన్నా స్థానికులు వాటిని ఉపయోగించుకుని ఎదగకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పారిశ్రామిక వేత్తలుగా, పెట్టుబడి దారులుగా స్థిరపడిపోతారు’ అని ‘చూపు’లో ఒక పాత్ర స్పష్టం చేస్తుంది. తెలంగాణ సమాజం తన సాంస్కృతిక విలువలను కోల్పోకుండా ‘వాణిజ్య దృక్పథం’ సంతరించుకోవాలని ‘ఎంటర్‌ప్రెన్యూయర్ సైకాలజీ’ అవసరమని కొన్ని పాత్రలు నొక్కిచెబుతాయి! సారాంశంలో నూరేళ్ల తర్వాతైనా ‘చూపు’ మసకబారదని, పాఠకులతో సంభాషిస్తుందని విశ్వసిస్తున్నాను! - పున్నా కృష్ణమూర్తి -
చరిత్ర ఆరాధన.. జ్ఞాపకాల ఆవాహన
చాలామంది రచయితల మాదిరిగా నేను ఒక్క పుస్తకాన్నే చాలాసార్లు రాశాను అంటారాయన. ఆ ఇతివృత్తంతో అంతగా మమేకమయ్యారు మొడియానో. ఇదే వాస్తవాన్ని ‘ఆయన పుస్తకాలు పరస్పరం సంభాషించుకుంటాయి, ఒక దాని ప్రతిధ్వనిని ఒకటి వింటాయి’ అని నోబెల్ స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్ చెప్పారు. కాలం వెలిగించిన జ్ఞాపకాలు మనిషి గుండె చిమ్నీ లోపల, తగ్గించిన ఒత్తుల్లా మినుకుమినుకుమం టూనే ఉంటాయి. అలాంటి వెలుగులలో రచనా వ్యాసంగాన్ని సాగించిన మహా రచయితలు ఎం దరో ఉన్నారు. నాజీల దురాక్రమణలలో కోల్పో యిన తన వారి అస్తిత్వం, తన జాతి నేపథ్యం; చరిత్ర విస్మరించలేని ఒక మహా ఉన్మాదం, ఇవన్నీ మిగిల్చిన విషాద జ్ఞాపకాలే చోదకశక్తులుగా రచ నలు సాగించిన మరో అద్భుత రచయిత పాట్రిక్ మొడియానో. కళా తాత్వికతలకీ, విప్లవాలకీ, ప్రపం చాన్ని కదిపి కుదిపిన సాహిత్యోద్యమాలకీ పురుడు పోసిన ఫ్రాన్స్‌లో పుట్టినవాడాయన. ఈ సంవ త్సరం సాహిత్య నోబెల్ ఆయననే వరించింది. మొడియానో మిగిలిన ప్రపంచానికి పెద్దగా తెలియ కపోయినా ఫ్రాన్స్‌లో ఆరాధనీయుడు. నరక కూపాల వంటి నాజీల మృత్యు శిబిరాలలో వినిపిం చిన నిస్సహాయ యూదుల చావు కేకలు, అపహ రణకు గురైన తమవారి కోసం జరిగిన వెతుకులాట ఆయన అక్షరాల నిండా వినిపిస్తాయి. మరుగున పడిన జీవితచిత్రాలను స్మృతులతో తట్టి లేపిన రచయిత మొడియానో. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు మాసాల తరువాత (జూలై 30, 1945) పుట్టిన మొడియానో, 1940-44 మధ్య ఫ్రాన్స్ హిట్లర్ దురాక్రమణ కింద ఉన్న కాలంలో నలిగిపోయిన సాధారణ జీవితాలను గురించి ప్రధా నంగా రచనలు చేశారు. తండ్రి ఇటలీకి చెందిన యూదు జాతీయుడు కాగా, తల్లి లూయిసా కొల్పైన్ బెల్జియంలో పుట్టింది. ఆమె వెండితెర మీద హాస్య నటి. కానీ ఆమె జీవితమంతా విషాదమే. ఒక కొడుకు రూడీ కేన్సర్‌తో చనిపోయాడు. భర్త యూ దు కావడం వల్ల తరచూ అజ్ఞాతంలో గడిపేవాడు. మొడియానో రచనల నిండా ఈ దుఃఖమే ఘూర్ణి ల్లుతూ ఉంటుంది. చాలామంది రచయితల మాది రిగా నేను ఒక్క పుస్తకాన్నే చాలాసార్లు రాశాను అంటారాయన. ఆ ఇతివృత్తంతో అంతగా మమేక మయ్యారు మొడియానో. ఇదే వాస్తవాన్ని ‘ఆయన పుస్తకాలు పరస్పరం సంభాషించుకుంటాయి, ఒక దాని ప్రతిధ్వనిని ఒకటి వింటాయి’ అని నోబెల్ స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్ చెప్పారు. తల్లి లూయిసా స్నేహితుడు, రచయిత, మొడియానో స్కూల్లో లెక్కల మాస్టారు రేమాండ్ క్యూనాతో ఏర్పడిన సాంగత్యమే మొడియానో దృష్టిని సాహిత్యం మీదకు మళ్లించింది. 1968 నుంచి మొదలుపెట్టి, మరో పనేదీ చేయకుండా ఇప్పటి దాకా దాదాపు 40 రచనలు చేశారు. ‘నైట్ రౌండ్స్’ ఆయన తొలి రచన. కొన్ని సినిమాలకు చిత్రానువాదం కూడా చేశారు. మొడియానో పేరు చెప్పగానే ఎవరైనా ‘మిస్సింగ్ పర్సన్’ నవలను గుర్తుకు తెచ్చుకుం టారు. దీనితో పాటు ‘ఔటాఫ్ ది డార్క్’, ‘దోరా బ్రూడర్’ కూడా ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చా యి. మిస్సింగ్ పర్సన్ నవలకు ప్రిక్స్ గాన్కోర్ట్ పుర స్కారం లభించింది. ఆయన రచనలలో ప్రధానంగా కనిపించే విస్మృతి, మూలాలను వెతుక్కుంటూ సాగడం అనే లక్షణాలు వీటిలోనూ కనిపిస్తాయి. మిస్సింగ్ పర్సన్ నవల ఇతివృత్తం, శైలి గొప్పగా అనిపిస్తాయి. గై రోలాండ్ అనే డిటెక్టివ్ కథను రచయిత ఇందులో వర్ణించారు. ఇతడు ఒక ప్రైవేటు సంస్థలో డిటెక్టివ్‌గా చేరడానికి ముందటి జీవితాన్ని మొత్తం మరచిపోతాడు. తను ఎవరో, తన జాతీ యత ఏమిటో కూడా మరచిపోతాడు. పదవీ విర మణ చేసిన తరువాత ఆ ప్రశ్నలకు జవాబులు అన్వే షిస్తూనే బయలుదేరతాడు. ఇతడు మరుపు వ్యాధికి గురైన సందర్భం మళ్లీ నాజీల దురాక్రమణ కాలమే. నిజానికి నాజీల దురాక్రమణ సమయంలో తామె వరమోనన్న సంగతిని మరుగుపరచడానికే ఎక్కువ మంది యూదులు ఇష్టపడ్డారు. నిజానికి పత్తేదార్లు ఆధారాల కోసం అన్వేషిస్తారు. కానీ గై రోలాండ్ జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళతాడు. పూర్వా శ్రమంలో తన పేరు మెక్వి అని, రష్యా నుంచి వలస వచ్చానని ఒకసారి, హాలీవుడ్ నటుడు జాన్ గిల్బర్ట్కు సన్నిహితుడనని ఒక పర్యాయం, లాటిన్ అమెరికాకు చెందిన దౌత్యవేత్తనని ఒకసారి భావి స్తాడు. చివరికి తాను గ్రీస్‌కు చెందినవాడిననీ, పేరు స్టెర్న్ అనీ కనిపెడతాడు. మొడియానో పరిశోధన సాగిస్తుండగా వార్తా పత్రికలో చూసిన ఒక ప్రకటన ఇచ్చిన ప్రేరణతో ‘దోరా బ్రూడర్’ నవల రాశారాయన. 1941లో దోరా బ్రూడర్ అనే యూదు బాలిక తప్పిపోయిం దని, ఆచూకీ చెప్పవలసిందని కోరుతూ నాటి పత్రికలో వెలువడిన ప్రకటన అది. చివరికి ఈమె, తండ్రితో కలిసి ఆష్విజ్ కేంప్లో ఉన్నట్టు తెలుస్తుం ది. మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భాన్ని ప్రపంచం జరుపుకుంటున్న సందర్భంలో రెండవ ప్రపంచయుద్ధ బాధితుడికి ఈ పురస్కారం లభిం చడం ఎంతో సబబు. గోపరాజు నారాయణరావు -
పాఠకుడిని ఆకట్టుకునే రచనలు రావాలి
హైదరాబాద్: ప్రతి రచయితా పాలగుమ్మి పద్మ రాజును ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన జనం కోసం రచనలు చేసేవారని ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు అన్నారు. ఇప్పుడు వస్తున్న రచనల్లో శిల్పం లేక కథనం దెబ్బతింటోందన్నారు. ప్రముఖ రచయత వాణిశ్రీ రచించిన ‘మా కథలు-2013’ పుస్తకాన్ని రవీంద్రభారతిలో ఆదివారం ఆయున ఆవిష్కరించారు. తెలుగు కథారచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది కథ చరిత్ర తెలి యకుండా రాస్తుంటారని, కథ ముగింపు పాఠకుడిని ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. ప్రజల్ని ఆకట్టుకునే రచనలు రావాలని సూచిం చారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ కథా రచయితలు వారి కథలను వారే మెచ్చుకోవడం గొప్ప కాదని, ఇతరులు మెచ్చుకున్నప్పుడే పాఠకాదరణ పొందుతాయన్నారు. రచయితలు తవు కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవాలని సూచించారు. రచయితలు వీరాజీ, కన్నెగంటి అనసూయ తదితరులు పాల్గొన్నారు.