కంచికి చేరని కథ
పద్ధతిగా వండితే సినిమా కథ కూడా పులిహోర వండినంత తేలికే. అయితే సమస్యేమిటంటే ఒక్క పులిహోరకి వందమంది వంటవాళ్లు తయారవుతారు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉప్పు, కారం, పులుపు కలిపేస్తారు. చివరికి అది పులిసిపోతుంది. జనం పుట్‌బాల్ ఆడుతారు.
వెనుకటికి ఒకాయన రామాయణం తీయబోయి పొరపాటున మహా భారతం తీసేశాడు. కథ మీద కూర్చోగానే బంధుమిత్రులంతా వచ్చి తలా ఒక వేషం వేస్తామన్నారు. ఏ ఒక్కరూ కూడా కోతుల వేషం కానీ, రాక్షసుడి వేషం కానీ వేయరట. దాంతో రామాయణాన్ని మార్చి మహాభారతాన్ని తీసారు. కథా చర్చలన్నీ ఇలాగే మంటెక్కువై పెనం మీది దోసెల్లా మాడిపోతుంటాయి. సినిమా కథలో వున్న సౌలభ్యమేమంటే కథలోకి ఎవరైనా ఇట్టే దూరిపోతారు. టీ ఇచ్చే అబ్బాయి కూడా ఒక యాక్షన్ సీన్ చెప్పి వెళ్లిపోతాడు. కామెడీ సీన్లన్నీ నిర్మాత బావమరిది చెపుతాడు. సెంటిమెంట్‌ని నిర్మాత కోడలు యాడ్ చేస్తుంది. పాటలు ప్రొడ్యూసర్ బాల్య స్నేహితుడు రాస్తాడు. ఎవడి పనులు వాళ్లు చేసేస్తూ వుంటే మూల దర్శకుడికి, రచయితకి ఏం చేయాలో తెలియక వీలైతే నీళ్లు లేదంటే బఠాణీలు నములుతుంటారు.
వెనుకటికి ఒకాయన తన కుక్కని హీరోగా పెట్టి సినిమా తీద్దామనుకున్నాడు. దాని ప్రత్యేకత ఏమంటే అడిగిన వాళ్లకి షేక్‌హ్యాండ్ ఇస్తుంది. అడగని వాళ్ల మీద పడి కరుస్తుంది. అందువల్ల దానికి ఫైటింగ్‌లు బాగా వచ్చని యజమాని నమ్మకం. చెయ్యిని షేక్ చేసింది, కాలు కూడా షేక్ చేస్తుంది కాబట్టి డాన్స్ కూడా బాగా వచ్చినట్టే. అయితే కుక్కకి దేన్ని హ్యాండ్ అంటారో, దేన్ని లెగ్ అంటారో అని రచయితకి సందేహమొచ్చింది. డౌట్ అడిగేవాణ్ని డౌట్ లేకుండా తన్నాలని నిర్మాత ఫిలాసఫి. అందువల్ల ఆ రచయితని తన్ని తరిమేసి కొత్త రచయితని తెచ్చారు. అతను మూగవాడు. ఏదీ అడగడు, చెప్పడు. కుక్కతో ముహూర్తం షాట్ తీసి గ్రాఫిక్స్‌తో రెండు, గ్రాఫిక్స్ లేకుండా రెండు సీన్లు తీశారు. లైట్ల వేడికి కుక్కకి మంటపుట్టి కెమెరామన్ కండపట్టుకు లాగింది. ఆ రోజుకి ప్యాకప్.మరుసటిరోజు ఈ విషయం జీవకారుణ్య సంఘం వాళ్లకి తెలిసి కుక్కని ఏకాకిని చేసి మనుషులంతా హింసిస్తున్నారని అపార్థం చేసుకుని నిర్మాత దగ్గర నుంచి లైట్ బాయ్ వరకూ దుడ్డుకర్రలతో బాది కుక్కని పట్టుకుపోయారు.
హీరో లేకుండా సినిమా తీయడం ఎలా అని నిర్మాత ఆలోచిస్తూ వుంటే ఒక జపాన్ టెక్నో వచ్చి రోబో కుక్కని తయారుచేసి ఇచ్చాడు. ఒరిజినల్ కుక్క బాడీ లాంగ్వేజీని అర్థం చేసుకోవడం ఈజీ. కానీ రోబోకి ఏ స్విచ్ నొక్కితే అరుస్తుందో, కరుస్తుందో తెలియలేదు. తెలుసుకునేలోపు నిర్మాత ఇల్లూవాకిలి, పిల్లామేక, గొడ్డూగోదా అన్నీ అమ్మేశాడు. చివరికి రోబోడాగ్ మిగిలింది. అయితే దానికి విశ్వాసం లేదు. ఛార్జింగ్ పెట్టకపోతే ఇష్టమొచ్చినట్టు కరిచేది. ఒళ్లంతా కట్లతో ఫిల్మ్‌నగర్‌లో ఎవరైనా కనిపిస్తే ఆయనే కుక్క నిర్మాత.
- జి.ఆర్. మహర్షి