వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది! | Balantrapu Rajanikanta Rao dog allso singing music | Sakshi
Sakshi News home page

వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!

Published Wed, Jan 28 2015 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!

వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!

పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పత్రికా సంపాదకులు, రచయిత
 
 బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి రాయడానికీ, చెప్పడానికీ నాకున్న అర్హత ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు సంగీతం రాదు. అయితే, సంగీతాన్నీ, మంచి పాటనూ ఆస్వాదించడం వచ్చు. నేను టీనేజ్‌లో ఉండగా విన్న ఒక సినిమా గీతం ఆయన పట్ల నాకు ఆరాధనను పెంచింది. అది - ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట. ఆయన స్వరకల్పన చేసిన ఆ పాట తలుచుకుంటే, ఇవాళ్టికీ భలేగా ఉంటుంది. ముఖ్యంగా, ఆ పాటకు ముందుగా వచ్చే ఆ ‘హమ్మింగ్’ లాంటిది భానుమతి పాడిన తీరు, ఆ రకంగా దానికి వరుస కట్టిన రజనీ గారి ప్రావీణ్యం ఇప్పటికీ నిత్యనూతనమే. ఆ రకంగా ఆ రోజుల నుంచే నేను ఆయన సంగీతానికీ, పాటకూ అభిమానిని. ఆ తరువాత జర్నలిజమ్‌లోకి వచ్చాక బెజవాడకు వెళ్ళినప్పుడు జర్నలిస్టు మిత్రులు నండూరి రామమోహనరావు, సి. రాఘవాచారి, ఉషశ్రీ లాంటి వారితో కలుస్తుండేవాణ్ణి. అలా రజనీగారిని కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా కలిశాను. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. పైగా అప్పట్లో నేను ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో పనిచేసేవాణ్ణి. అందువల్ల కొంత వెసులుబాటు ఉండేది.

 రజనీ గారిని ఎప్పుడు కలిసినా, కేవలం పది నిమిషాలే మాట్లాడుకున్నా సరే, అందులోనూ సంగీతం వినిపించకుండా, మాట్లాడేవారు కాదు. సామాన్య సంభాషణల్లో కూడా అలా సంగీతాన్ని ప్రస్తావించడం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. నిజం చెప్పాలంటే, సంగీతం లేని రజనీని ఊహించలేమంటే నమ్మండి. మనకున్న కళాకారుల్లో, సాహిత్యవేత్తల్లో ఇటు సంగీతం, అటు సాహిత్యం - రెండింటిలోనూ ప్రావీణ్యం ఉన్నవారు ఈ తరంలో, నాకు తెలిసినంత వరకు రజనీ ఒక్కరే! ఒక తరం వెనక్కి వెళ్ళి చూస్తే, సంగీత, సాహిత్యాల్లో అంతటి మహానుభావుడు - హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు.

 రజనీ గారిలో మరో గొప్పదనం - ప్రకృతిలో, పశుపక్ష్యాదులలో కూడా సౌందర్యాన్నీ, కవిత్వాన్నీ చూసే విభిన్నమైన చూపు. పశువులు, పక్షుల అరుపులో కూడా సంగీతం చూశారాయన. అందుకు ఆయన చేసిన సంగీత రూపకం ‘కొండ నుంచి కడలి దాకా’ ఒక ఉదాహరణ. కీచురాళ్ళ చప్పుడులోనూ సౌందర్యం, సంగీతం, శ్రావ్యతను చూడడం రజనీ ప్రత్యేకత. 1970లలో అనుకుంటా... ఆ సంగీత రూపకానికి గాను ఆయనకు జపాన్ వాళ్ళదనుకుంటా... అవార్డు కూడా వచ్చింది.

 ఇక్కడ నాకు ఎదురైన ఒక స్వీయానుభవం ప్రస్తావించాలి. ఒకరోజు మాటల సందర్భంలో ఆయన మా ఇంట్లోని కుక్కకు కూడా సంగీతం వచ్చు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకొకసారి వినిపించండి అన్నాను. సరే అన్నారు. వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఆ పెంపుడు కుక్కను పక్కనపెట్టుకొని, ‘సా’ అని రాగం తీశారు. గమ్మత్తుగా అది కూడా ‘సా’ అంటూ ఆ ఫక్కీలోనే అంది. అలాగే, ‘రి’. ఎక్కడా ఎగుడుదిగుళ్ళు లేకుండా రజనీ గారి ఇంటి పెంపుడు కుక్క ‘సరిగమ పదనిస’లు అన్నీ పలికినట్లు నాకు అనిపించింది. పాటలైతే పాడలేదు కానీ, ఆ కుక్క స్వరాలు పలుకుతున్నట్లు గ్రహించాను. ఆ వెంటనే ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో ఆ ‘సంగీతం పాడే కుక్క’ గురించి ప్రత్యేకంగా ఒక ఫీచర్ రాసి, ప్రచురించాను. ‘ఏ గూటి చిలక ఆ గూడి పలుకు’ అని మనకో జాతీయం ఉంది. సరిగ్గా అలాగే, ఇక్కడ సంగీతపు గూటి కుక్క, ఆ గూటిలోని సంగీతాన్నే పలికిందన్నమాట.

 ఇవాళ ఒక్కసారి తెలుగునాట సంగీత పరిణామక్రమాన్ని సింహావలోకనం చేసుకుంటే, శాస్త్రీయ సంగీతం కాస్తా లలితసంగీతంగా రూపం మార్చుకొని, ప్రవర్తిల్లడం ఒక పరిణామ దశ. ఆ పరిణామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రితో సహా కొందరు సాహిత్యకారులు, సంగీతజ్ఞుల పాత్ర ఉంది. వారితో పాటు రజనీ గారిది కూడా లలిత సంగీతావిర్భావంలో ఒక ముఖ్యపాత్ర. అలాగే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం డెరైక్టర్‌గా కూడా ఆయన నూతన పథగామి అయ్యారు. ఆకాశవాణిలో మామూలు స్థాయిలో మొదలైన ఆయన కేంద్ర సంచాలకుడి స్థాయి వరకు ఎదిగారు. సాధారణంగా ఆ స్థాయికి వచ్చాక, చాలామంది మునుపు చేసినవారి మార్గాన్నే అనుసరిస్తూ, ఒక మూసలో వెళ్ళిపోతుంటారు. కానీ, రజనీ గారు అలా కాదు.  వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ‘భక్తి రంజని’ లాంటివెన్నో రజని గారి కంట్రిబ్యూషనే! అలాగే, యువకులు, కొత్తవాళ్ళలోని ప్రతిభను పసిగట్టి, వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేక లక్షణం ఆయన సొంతం. అలా ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి ఆయన ఒరవడి పెట్టారు. ఇతరులకు కూడా ఆ విషయంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
 వ్యక్తిగతంగా చూస్తే, వయసులో నా కన్నా రజనీ గారు చాలా పెద్ద. అయినా, నన్నెప్పుడూ ఆయన స్నేహదృష్టితో చూసేవారు. ఆయన, రచయిత మహీధర రామమోహనరావు, నేను కలిసి, సరదాగా మాట్లాడుకున్న క్షణాలు, ఫోటోలు దిగిన క్షణాలు నాకిప్పటికీ గుర్తే! ఆయనకు వయసు మీద పడ్డాక ఎప్పుడైనా కలిసినప్పుడు, ‘కులాసాగా ఉన్నారా’ అని నేను అడిగితే, ఆయన నన్ను గుర్తుపట్టానని చెప్పడానికి బదులుగా కావాలని - ‘నేను... పొత్తూరి వెంకటేశ్వరరావును’ అంటూ ఉంటారు. నేను వెంటనే, ‘అవును. మరి నేనేమో బాలాంత్రపు రజనీకాంతరావును’ అని నమస్కరిస్తుంటా. ఆ మాటతో ఇద్దరం హాయిగా నవ్వుకుంటాం. నిండు చంద్రుడి లాంటి ఆయన నవ్వుకు మరో వసంతం నిండుతున్నందుకు ఆనందిస్తున్నాను. స్నేహసంగీతం పరిమళించే ఈ శతాయువు తెలుగు లలిత సంగీత ప్రపంచంలో చిరాయువు!
 
(సంభాషణ - రెంటాల జయదేవ)


http://img.sakshi.net/images/cms/2015-01/51422468787_Unknown.jpg
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement