balantrapu rajanikanta rao
-
నూట ఇరవై = నూట ఎనభై
బులుసు పాపయ్య శాస్త్రి అపర సంస్కృత పండితుడు. లౌక్యుడు. పిఠాపురం జమీందారు రావు వేంకట మహీపతి గంగాధర రామారావు బహద్దర్ ఆస్థానంలో ఉండేవారు. జమీందారు ఆయనకు ఒక గ్రామంలో పది పుట్ల నేలను వాగ్దానం చేశారు. ఒక పుట్టి అంటే పన్నెండు ఎకరాలు. మొత్తం 120 ఎకరాలు. భూమి ఇమ్మని థానేదారుకు హుకుం ఇచ్చారు జమీందారు. అప్పుడు థానేదారుగా దుగ్గిరాల పల్లంరాజు ఉన్నారు. ఈయన బాలాంత్రపు రజనీకాంతరావు తల్లికి మేనమామ. పాపయ్య ఈయన దగ్గరికి వెళ్లి, ఈమాటా ఆమాటా చెప్పి 180 ఎకరాలు కొలిపించుకుంటారు. ఈ విషయం జమీందారు గారికి తెలిసింది. థానేదారును భర్తరఫ్ చేస్తారు. వెంటనే పాపయ్య జమీందారు దగ్గరికి వెళ్లి, ‘మీ దానం వెనక్కి తీసుకోండి, ఆయన్ని శిక్షించారు కదా, నాకు భూమి వద్దు’ అని చెబుతారు. ‘నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి తొలగించాను’ అంటారు జమీందారు. ‘నాకు ఏ భాషలో పాండిత్యం ఉందని మీరు నాకు దానం ఇచ్చారు?’ అడిగారు పాపయ్య. ‘సంస్కృతం’ ‘సంస్కృతం దేవభాషా? మానవ భాషా?’ ‘దేవభాష’ ‘మరి దేవతలకూ మానవులకూ కాలమానంలో తేడా ఉంటుంది కదా! మనుషుల లెక్కకు దేవతలది అర రెట్టు ఎక్కువ. దేవభాషలో ఇచ్చారు కాబట్టి నేను 120ని 180 చేశాను’ అంటారు. ఆ గడుసుతనానికి మెచ్చి తొలగించిన థానేదారును తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు జమీందారు. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
ఏమిటి ఈయన ప్రత్యేకత?
జీవన కాలమ్ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీ కాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు. నేను ఆలిండియా రేడి యోలో చేరే నాటికి నాకు 23 సంవత్సరాలు. రజనీగారికి 43. నా ముందు మహాను భావులైన ఆఫీసర్లు– బాలాంత్రపు రజనీకాంతరావు, యండమూరి సత్యనారాయ ణరావు, దాశరథి, బుచ్చి బాబు– ఇలా. ఇక పండిత ప్రకాండుల బృందం ఆ తరానికే మకుటాయమానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, ముని మాణిక్యం నరసింహారావు, నాయని సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, డాక్టర్ జీవీ కృష్ణారావు – ఈ జాబితా అపూర్వం. వీరందరూ తేలికగా మాకంటే 30–35 సంవత్సరాలు పెద్దవారు. ఓ తరాన్ని జాగృతం చేసిన అద్భుతమైన ప్రక్రియలకు ఆద్యులు. భారతదేశంలోని అన్ని ప్రక్రియలకు తగిన ప్రాధా న్యం కల్పించాలనే దురాశతో– ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వృద్ధులందరినీ రేడియోలోకి ఆహ్వానిం చారు పెద్దలు. వీరెవరికీ మాధ్యమంమీద ఒడుపుగానీ, అవగాహనగానీ, తర్ఫీదుగానీ లేనివారు. రిటైరై పెన్షన్ పుచ్చుకుంటున్న బాపతు మహానుబావులు. ఆ మాట కొస్తే మాకే ఇంకా తర్ఫీదు లేదు. ఉద్యోగంలో చేరిన ఒక్కొక్క బ్యాచ్‌ని ఢిల్లీ పంపుతున్నారు. ఇదొక రకమైన అవ్యవస్థ. అయితే ‘అసమర్థత’ తెలుస్తోంది. మార్గం తెలియడం లేదు. ఈ దశలో మాకంటే కేవలం 12 సంవత్సరాల ముందు –ఒక కార్యశూరుడు– మాధ్యమం అదృష్టవ శాత్తూ దక్షిణాది ప్రసార మాధ్యమంలో అడుగు పెట్టారు. ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంత రావు. ఆ రోజుల్లో మద్రాసు రేడియో స్టేషన్ అంటే తెలు గువారి పుట్ట. 1941లో చేరిన రజనీకాంతరావుగారు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అటు పార్లమెంటులో నెహ్రూ ఈ దేశ స్వాతంత్య్రాన్ని గురించి ఉపన్యాసం ఇస్తూంటే ఇక్కడ– మద్రాసులో కేవలం 26 ఏళ్ల యువ కుడు 1947 ఆగస్టు 15 తెల్లవారుజామున ఎలుగెత్తి ‘మ్రోయింపు జయభేరి’ అని నగారా మ్రోయించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ‘మాదీ స్వతం త్ర దేశం’ అని టంగుటూరి సూర్యకుమారి మైకుల ముందు ఉరిమింది. ఆ రోజు కమాండర్–ఇన్‌చీఫ్ రోడ్డులో ఉన్న రేడియో స్టేషన్లో లేనిదెవరు? కొత్తగా పెళ్లయిన బుచ్చిబాబు తన భార్యతో సహా స్డుడియోలో ఉన్నారు. అదొక ఆవేశం. మరో 40 ఏళ్ల తర్వాత టంగు టూరి సూర్యకుమారిని ఇంగ్లండు కెంట్‌లో ఒక పార్టీలో ఈ విషయం చెప్పి పులకించాను. రేడియో స్టేషన్ అంటే– ఆ రోజుల్లో దాదాపు సగం సంగీతం. ఏం సంగీతం? మరిచిపోవద్దు. మద్రా సులో సంగీతం అంటే వర్ణం, కీర్తన, జావళి వగైరా. మామూలు పాటలంటే సినీమా తైతక్కలు. కానీ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంత రావు. దీన్ని ఇంకా చాలా రేడియో కేంద్రాలు ఇప్పటికీ పట్టుకోలేదంటే తమరు నన్ను క్షమించాలి– బాణీ. ‘ఊపరె ఊపరె ఉయ్యాల... చిన్నారి పొన్నారి ఉయ్యాల’ వంటి రజని పాటలు (ఎస్. వరలక్ష్మిగారు పాడారు) నాకు బహిఃప్రాణం. మరో 35 సంవత్సరాల తర్వాత– జీవితం నాకు అవకాశమిచ్చి వరలక్ష్మమ్మ గారూ (నాకంటే 12 ఏళ్లు పెద్ద) నేనూ భార్యాభర్తలుగా నటించినప్పుడు ఆమెకి ఈ పాటని ఆమె చెవిలో గుర్తు చేసి పాడించుకుని పులకించాను. అలాగే పాకాల సావిత్రీదేవి, శాంతకుమారి, టంగుటూరి సూర్యకుమారి, ఏ.పీ. కోమల– ఇలా ఎందరో. వీరంతా నేను రేడియోలో చేరడానికి పెట్టు బడులు. ఆయనతో ‘బావొచ్చాడు’ ‘అతిథిశాల’ వంటి ఎన్నో సంగీత రూపకాలలో తలదూర్చిన అనుభవం ఉంది. ఇక నా కథకు వస్తాను. రజనీకాంతరావుగారు అప్పుడే స్టేషన్ డైరెక్టర్‌గా వచ్చారు. నాకు పిడుగు లాంటి వార్త. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ ఇచ్చి నన్ను శంబల్పూరు (ఒరిస్సా) బదిలీ చేశారని. ముమ్మ రంగా సినీ రచన సాగుతున్న సమయం. రజనీగారి గదిలోకి నా రాజీనామా కాగితంతో వెళ్లాను. రజనీ గారు తీరి కగా నా రాజీనామా పత్రం చదివారు. చదివి అడ్డంగా చించేశారు. ‘తప్పనిసరిగా వెళ్లండి. ఉద్యోగం మానేయవద్దు. అవసరమైతే ముందు ముందు చూద్దు రుగానీ’ అన్నారు. బయటికి నడిచాను. ఆ తర్వాత మరో 12 సంవత్సరాలు పనిచేసి– మరో ప్రొమోషన్ కడపలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరునై, అనుకోకుండా నటుడినై రాజీనామా చేశాను. ఇప్పటికీ– ఆయన ఏ 40 ఏళ్ల కిందటో– ఇంకా వెనుకనో– రచించి, బాణీ కూర్చి, పాడించిన (బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం) ‘మన ప్రేమ’ పాట ఒక్కటీ కేవలం 70 సంవత్సరాలు రేడియో నడ కనీ, వయ్యారాన్ని రజనీ రచనా పాటవాన్నీ, రేడియో తనాన్నీ తెలియజేస్తూ జెండా ఊపుతున్నట్టుంటుంది. రజనీకాంతరావు గారు రేడియో సంగీతానికి ఒక శయ్యను రూపుదిద్దారు. రేడియోకి ఒక రజనీ చాలడు. ప్రతీ కేంద్రానికీ కావాలి. ఈ మాధ్యమానికి కావాలి. ఇప్పటికీ కావాలి. - గొల్లపూడి మారుతీరావు -
బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత
సాక్షి, విజయవాడ : ప్రముఖ వాగ్గేయ కారుడు, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు(98) మరి లేరు. ఆదివారం ఉదయం విజయవాడ సీతారామపురంలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. సంగీత, సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రజనీకాంతరావు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చినవారిలో కీలకమైనవారు. ఆకాశవాణి రజనీకాంతరావుగా ఆయన సుప్రసిద్ధులు. రజనీకాంతరావు 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. ఆయన తండ్రి బాలాంత్రపు వేంకటరావు ప్రసిద్ధి చెందిన వేంకట పార్వతీశ కవుల్లో ఒకరు. బాలాంత్రపు 1941లో మద్రాస్ ఆలిండియా రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా చేరి అంచెలంచెలుగా స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 1947 ఆగస్ట్ 15న బాలాంత్రపు స్వయంగా రచించి బాణీలు సమకూర్చిన మోగించు జయభేరి..వాయించు నగారా గీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది. అలా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున రేడియోలో దేశభక్తి గీతం పాడిన ఘనత ఆయనకే దక్కింది. ‘మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే దేశభక్తి గేయాన్ని రచించి బాణీలు సమకూర్చారు. ఆ గీతం తెలుగుజాతికెంతో ఉత్తేజాన్నిచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఘంటసాల, సుశీల, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత ఆయనది. తొలితరం సంగీత దర్శకుల్లో బాలాంత్రపు ఒకరు. లలిత సంగీతం, యక్షగానాలతో రేడియో శ్రోతల అభిమానాన్ని సంపాదించారు. ఆయన భక్తిరంజని, ధర్మసందేహాలు వంటి కార్యక్రమాలతో అందరికీ సుపరిచితులు. చండీదాస్, గ్రీష్మ రుతువు వంటి పలు స్వీయ రచనలు చేశారు. శతపత్ర సుందరి పేరుతో గేయ సంకలన రచన చేశారు. పలు చలనచిత్రాలకు సైతం బాలాంత్రపు సంగీతం అందించారు. ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతిలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది ఆయనే. జేజి మమయ్య పేరుతో చిన్న పిల్లల పాటను ఆకాశవాణిలో బాలాంత్రపు ప్రసారం చేశారు. రజనీకాంతరావు రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1961లో లభించింది. ఇదిగాక కళారత్న అవార్డు, కళాప్రపూర్ణ, ప్రతిభామూర్తి జీవితకాల సాఫల్య బహుమతి, నాథ సుధార్ణవ, పుంభావ సరస్వతి, నవీన వాగ్గేయకార వంటి మరెన్నో పురస్కారాలు కూడా ఆయనకు లభించాయి. 2015లో ఏపీ ప్రభుత్వం ఉగాది సందర్భంగా తెలుగు వెలుగు పురస్కారంతో సత్కరించింది. ఆయనకు ఐదుగురు సంతానం. ఏపీ సీఎం సంతాపం రజనీకాంతరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పలువురి నివాళి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కా రంతోపాటు అనేక పురస్కారాలందుకున్న రజనీకాంతరావు మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని పలువురు సంగీత అభిమానులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, సంగీత ప్రియులు కడసారిగా దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ప్రయాగ వేదవతి, పాండురంగ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ నగరంలోని స్వర్గపురిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం బాలాంత్రపు రజనీకాంతరావు మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య, కళారంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తెలుగుతల్లి ముద్దుబిడ్డల్లో రజనీకాంతరావు అగ్రగణ్యులని వైఎస్ జగన్ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళలను, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లిన రజనీకాంతరావు చిరస్మరణీయులని, ఆయన మరణం సాహిత్య, కళారంగాలకు తీరని లోటని ఆయన అన్నారు. -
ఆకాశవాణి
-
ప్రముఖ రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు ఇకలేరు
-
బాలాంత్రపు మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, నూజివీడు : ప్రముఖ రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సాహిత్య, కళ రంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. తెలుగు తల్లి ముద్దు బిడ్డలో రజనీకాంతరావు అగ్రగణ్యులని వైఎస్ జగన్ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళల్ని, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన బాలాంత్రపు చిరస్మరణీయులని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రజనీకాంత రావు మరణం తెలుగు సాహిత్య, కళా రంగాలకు తీరని లోటు అని అన్నారు. బాలాంత్రపు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బాలాంత్రపు రజనీ కాంతారావుకు సన్మానం
పాత గుంటూరు: కవిగా, కళాకారుడిగా, సంగీత విద్వాంసుడిగా, గాయకుడిగా ఖ్యాతిగాంచిన బాలాంత్రపు రజనీ కాంతారావు శతాబ్దిక మేరుపర్వతం లాంటివారని ప్రముఖ సాహిత్య విశ్లేషకులు వాడ్రేవు చిన వీరభధ్రుడు పేర్కొన్నారు. నగరంపాలెంలోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి వసతిగృహం ప్రాంగణంలో ప్రముఖ సంగీత కళానిధి బాలాంత్రపు రజనీ కాంతారావుకు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారంతోపాటు నగదు పురస్కారం అందజేశారు. సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు బొమ్మిడాల కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా ముఖ్యవక్తగా పాల్గొన్న వీరభద్రుడు మాట్లాడుతూ 20వ శతాబ్దపు సాహిత్య, సంగీతానికి రజనీ కాంతారావు వారధిగా నిలిచారన్నారు. ఓలేటి వెంకట పార్వతీశం రచించిన ఏకాంతసేవ, రజనీ కాంతారావుపై రచించిన రజనీ పుస్తకాలను ఆవిష్కరించారు. సభలో ఓలేటి పార్వతీశం, ముంజులూరి కృష్ణకుమారి, డాక్టర్.భూసరవెల్లి వెంకటేశ్వర్లు, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరశాస్త్రి ప్రసంగించగా సాహిత్యాభిమానులు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మోదుగుల రవికృష్ణ నిర్వహించారు. -
దేశభక్తిగల వాగ్గేయకారుడు బాలాంత్రపు
విజయవాడ: దేశభక్తి, జాతీయభావం కలిగిన వ్యక్తి బాలాంత్రపు రజనీకాంతరావు అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. విజయవాడలో శనివారం నిర్వహించిన రజనీకాంతరావు వందో పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తన చిన్నతనంలో రజనీ రచించిన జేజిమామాయ్య పాటలు ప్రభావితం చేశాయని చెప్పారు. సంగీత కళాకారులపై ఆయన రచించిన ‘వాగ్గేయకార చరిత్ర’ సంగీత ప్రపంచానికి ప్రామాణిక గ్రంథమని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట సమయంలోను, భారత్-చైనా యుద్ధంలోను ఆయన రచించిన గీతాలు ప్రజల్లో దేశభక్తిని చాటాయని చెప్పారు. ‘నాదీ స్వతంత్ర దేశం.. నాదీ స్వతంత్ర జాతి’ ఇప్పటికీ గుర్తొస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రజనీకాంతరావు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ మోహన్‌కందా మాట్లాడుతూ రేడియోకి జవసత్వాలు కలిగించిన వ్వక్తి రజనీకాంతరావు అని, రజనీ లేని ఆకాశవాణిని ఊహించలేమని పేర్కొన్నారు. సంగీతం, రేడియో ఊపిరిగా బతికిన వ్యక్తి రజనీకాంతరావు అని తెలిపారు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రజనీ ప్రకృతి ఆరాధకుడని, ప్రపంచమే ఆయన సంగీతమని చెప్పారు. సినిమాలకు సంగీతం సమకూర్చినా ఆయన రేడియో కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. గాయని రావు బాలసరస్వతి తదితరులు ప్రసంగించారు. -
నేడు రజని వేడుక
ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు జన్మదినాన్ని (అధిక మాసాలు కలుపుకొని 100వ జన్మదినం) పురస్కరించుకుని నేటి సాయంత్రం విజయవాడలో ఆయన అభిమానులు, మిత్రులు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. స్థానిక మినర్వా గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో వేడుకలు ప్రారంభం అవుతాయి. మండలి బుద్ధప్రసాద్, మోహన్ కందా, వి.ఎ.కె. రంగారావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతీదేవి వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వేడుకల్లో పాల్గొని రజనీకాంతరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం భాగవతుల వెంకట్రామశర్మ బృందం రజని ‘విశ్వయానం’ రూపకాన్ని, ‘మహేశ్వరీ మహాకాళి’ గేయ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే రజని అభిమానుల నోట ఆయన గేయాల గానం ఉంటుంది. ఈ ఆత్మీయ సత్కార వేడుకలకు ఆహ్వాన సంఘ సభ్యులుగా డాక్టర్ జంధ్యాల శంకర్, కె.సదాశివరావు, సి.రాఘవాచారి, అండవిల్లి సత్యనారాయణ, గోవిందరాజన్, డాక్టర్ హేమ పరిమి, డాక్టర్ పరిమి, డాక్టర్ జి.వి.పూర్ణచందు, వి.వి.ఎమ్.కృష్ణ, వి.నాగలక్ష్మి, డి.ఇందుమతి, మూల్పూరు నర సింహారావు వ్యవహరిస్తున్నారు. చిత్రం: శంకర నారాయణ (శంకర నారాయణ ప్రముఖ చిత్రకారుడు ‘బాపు’ సోదరుడు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పని చేశారు. ఆ సమయంలో చిత్రాన్ని గీసి రజనీకి చూపించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించారట!) -
నేడు బాలాంత్రపు రజనీకాంత్‌రావు పుట్టినరోజు
-
క్షణ క్షణం రాగం - అనుక్షణం అనురాగం
ఇంద్రగంటి జానకీ బాల, ప్రముఖ రచయిత్రి - గాయకురాలు ఏ సామాన్య గుణానికైనా కొన్ని మినహాయింపులుంటాయి. కళాకారులు - వారు గాయకులైనా, కవులైనా - వచన రచన చేసే రచయిత(త్రు)లైనా పరస్పరం అసహనం - కించిత్ ఈర్ష్య, స్పర్ధ కలిగి ఉంటారనేది లోకసహజంగా అనుకునే విషయం. ఈ లోకవాక్యానికి రజనీకాంతరావుగారు పూర్తిగా మినహాయింపు. రజనిగారు అనేక సాహిత్య ప్రక్రియల్లోనూ, రకరకాల సంగీత రీతులలోనూ నిష్ణాతులు. అయితే ఆయన పాటల గురించి, ప్రత్యేకంగా లలిత గీతాల గురించి ఇక్కడ మాట్లాడాలనిపిస్తోంది. ఆయన పాటరచన, దానికి ఆయన కూర్చే బాణీ చాలా విలక్షణంగా ఉంటాయి. ఒక ప్రత్యేకత గల లిరిసిస్ట్! అపారమైన సంగీతంతో మనసు నిండి ఉండడం వల్ల రాగం - భావం జంటగా ఒక పాటై బయటికి వచ్చి ఆయన గళంలో పలుకుతుంది. అది ఒక తిరుగులేని కళారూపమై అందర్నీ అలరిస్తుంది. ఆయన పాటలు చాలా సున్నితంగా, సులభశైలిలో ఉన్నట్లనిపిస్తాయి గానీ పాడి ఒప్పించటం కష్టంగానే అనిపిస్తాయి. అయినా రజని సినిమాల్లో చేసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. నాకు చిన్నప్పటి నుంచీ రజనీ గారి పాటలు వినడం, పాడడం అలవాటుంది. స్కూలు రోజుల్లో ‘మాదీ స్వతంత్ర దేశం...’, ‘ఇదె జోతా - నీకిదె జోతా...’, ‘పసిడి మెరుగుల తళతళలు...’ లాంటి పాటలు తరచూ పాడే సందర్భాలుండేవి. 1970లో ఆలిండియా రేడియో (విజయవాడ)లో లలిత సంగీతం పాడేందుకు ఆడిషన్ ప్యాసయ్యాను. అప్పటికి రజని విజయవాడ స్టేషన్ డైరక్టర్‌గా రాలేదు. రేడియోలో ‘గీతావళి’ కార్యక్రమం కోసం పాటలు ఎంపిక చేసుకోవాలంటే ఆయన పాటలు ఆకర్షణీయంగా ఉండేవి. ‘రజని’ పాటలుగా ఆయన గీతాలు రేడియోలో మారు మ్రోగుతూ ఉండేవి. సాలూరి రాజేశ్వరరావు పాడిన ‘ఓ విభావరీ...’ గ్రామ్‌ఫోన్ రికార్డు ఆనాటి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించింది. ఇందులో సమాసాలు, పదబంధాలు వినూత్నంగా ఉంటాయి. ‘‘ఓ విభావరీ - / నీ హార హీర నీలాంబర ధారిణీ/ మనోహా రిణీ - ఓ విభావరీ’’ అంటూంటే ఆ ఊహ మనకందని లోకాలలో విహరింప చేస్తుంది. దానికనుగుణంగా రాగం తీగెలు సాగుతుంది. అలాగే ‘చల్లగాలిలో యమునా తటిపై, శ్యామ సుందరుని మురళీ...’. ఇదీ సాలూరి రాజేశ్వరరావు పాడిన పాటే. ఇందులో - ‘‘తూలిరాలు వటపత్ర మ్ముల పయి/ తేలి తేలి పడు అడుగులవే/ పూల తీవ పొదరిండ్ల మాటగ / పొంచి చూడు శిఖి పింఛమదే -’’ అంటూ పాటలోనే బొమ్మకట్టి, కళ్ల ముందుంచి, అద్భుత దృశ్యాన్ని మనోఫలకంపై ముద్రిస్తారు. రజనీగారి పాటలో సాహిత్యం - సంగీతం చెట్టాపట్టాలేసుకుని నడిచే నర్తకీమణుల్లా మెరిసిపోతూంటాయి. శృంగారం, దేశభక్తి, ప్రకృతి, భక్తి - వేటికవే అందంగా పలుకుతాయి ఆయన లలిత గీతాల్లో. ‘‘హాయిగ పాడుదునా సఖీ -/ ఆకసమందున రాకా చంద్రుడు/ నా కౌగిలిలో నీ సౌందర్యము/ కాంచలేక నా మబ్బుల లోపల/ పొంచి చూసి సిగ్గున తలవంచగ - హాయిగ పాడుదునా!’’ ఇక, దేశభక్తి రజనీగారికి వెన్నతో పెట్టిన లక్షణం. దేశ స్వాతంత్య్రం ప్రకటించగానే పాట, ఆంధ్రరాష్ట్రం లభించగానే పాట, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాట - ఇలా అన్ని సందర్భాల లోనూ ఆయన పాటలు రాశారు. ‘‘పసిడి మెరుంగుల తళతళలు / పసిమి వెలుంగుల మిలమిలలు/ గౌతమి కృష్ణల గలగలలు/ గుడి జేగంటల గణగణలు -’’ అంటూ ఆ శుభ సమయాన్ని ఉత్తేజంగా ప్రకటిస్తారు. ‘‘మరునిముసము మనదో - కాదో/ మధువానవో - మధుపా మధుపా’’ అని మరొక్కసారి తాత్వికంగా అంటారు. ‘పోయిరావే కోయిలా’ అంటూ కోయిలకు వీడ్కోలు చెబుతారు. ఇలా చెప్పాలంటే రజనీ గారివి ఎన్ని భావాలు! ఎన్ని ఊహలు! ఎంత వేదన - ఎంత ఆవేదన! ఎంత ప్రేమ - ఎంత అభ్యుదయం - ఎంత సమ భావం! ఇవన్నీ కలిసి ‘రజని’, ఆయన పాటలూ!! మళ్లీ మొదటికొస్తే, 1980లలో రజనీగారి పుట్టిన రోజు ఉత్సవంగా విజయవాడలో జరిగి నప్పుడు నేను ఆయన పాటలు రెండు పాడాను. ఆ రెండూ మా తమ్ముడు సూరి కుమారస్వామి ట్యూన్ చేశాడు. ఒకటి ‘నటన మాడవే మయూరి’. రెండోది ‘పోయి రావే కోయిలా.’ అవి విని రజని గారు బాగున్నాయని నన్ను అభినందించారు. నా లాంటి సామాన్య గాయకురాలు పాడిన పాటలు కూడా ఆనందంగా స్వీకరించి, బాగా పాడాననడం ఆయన హృదయ సంస్కారం. -
రేడియో హోదా పెరిగింది!
మల్లాది సూరిబాబు, కర్ణాటక సంగీత విద్వాంసులు - ‘ఆకాశవాణి’ నిలయ కళాకారులు అనుభూతి శబ్దాన్ని ఆశ్రయిస్తే మంచి పాట పుడుతుంది. సుస్వరంతో నిండిన ఆ శ్రావ్యమైన పాట సంస్కారవంతమైన హృదయాన్ని తట్టి లేపుతుంది. అప్పటికప్పుడు పాటను వ్రాయడం, అలా వచ్చిన పాటకు స్వరం కూడా తనే సమకూర్చుకుని పాడడం - ఈ మూడూ ఒకే వ్యక్తి వల్ల అయ్యే పనులు కాదు. రచన, సంగీతం, గానం - ఒకరే అయితే? మధురానుభూతుల్ని మాటలుగా మార్చి, వాటిని అందంగా పేర్చగల ప్రతిభామూర్తి మా రజనీ బాబాయ్. ‘‘హాయిలో నేల యెదకింత హింస... తీయ పాటలో బాధేల వంశీ...’’ అనే రజని పాటను నాలుగు దశాబ్దాల క్రితం ‘గజల్’గా ‘జనసమ్మోదిని’ రాగంలో ట్యూన్ చేసి, రజని గారికే వినిపించాను. గజల్ శైలిలో తన పాట విని ఆయన ఎంత పరవశించారో. ఈ పాటతో మా ఇద్దరి స్నేహం ఎంతో పెరిగింది. ఇవాళ్టికీ ఆయనకు ఈ పాట ఇంకా గుర్తే! రజనీ గారిది అదో సహజమైన, స్వతంత్రమైన సంగీతధార. ఆయన సంగీత విహంగం రెక్కలు చాపుకొని నాదప్రపంచంలో అందచందాలను వెతుక్కుంటూ, అటు మధ్య ప్రాచ్యం దాకా ఎగిరి రాగలదు. ఇటు హిందు స్థానీ, బెంగాలీ, జానపద రీతులతోనూ జత కట్టగలదు. జాతీయతకు (నేటివిటీ) దూరం కాకుండా నాద ప్రపంచంలో తనకో శైలిని ఏర్పరచుకున్నాడాయన. శాస్త్రీయ రాగాలు, వాటి స్వరూప స్వభావాలు, కోమలంగా ఉండే స్వరాలు, తీవ్రమైన స్వరాలు, పాటలోని మాటలకు ఏయే స్వరాన్ని ఎలా పాడితే భావాన్ని చెప్పగలమో అన్నీ తెలిసిన ‘సంగీతవేత్త’. ‘మనసౌనే ఓ రాధా...’, ‘మరు నిముసమే మనదో కాదో...’, ‘ఆశా నా ప్రాణసఖీ...’ లాంటి పాటలు ఓలేటి వెంకటేశ్వర్లు గారి కంఠంలో ఎన్ని హొయలు పోయాయో వింటే... రజని గారి ఊహాలోకాన్ని దర్శించవచ్చునని నాకనిపిస్తుంది. నూతన రీతుల క్రియాశీలతకు సంప్రదాయ పరిధులు అడ్డు రాకూడదనే విధానాన్ని వెనుకటి తరంలోని రేడియో స్టేషన్ డెరైక్టర్లు పాటించారు కాబట్టే, ఈవేళ ‘ఆలిండియా రేడియో’ గౌరవం తరిగిపోకుండా అలా నిలబడింది. అటువంటి సంగీత, సాహిత్య మర్యాదలను నిలబెట్టినవారిలో శ్రీరజనీకాంతరావు ముందు వరుసలో ఉంటారు. గమ్మత్తేమిటంటే, రచన, సంగీతం - రెండూ రజని గారి మనసులో నుంచి ఏకకాలంలో వచ్చేస్తాయి. రజని గారి వరసలు ఎవరూ, ఏమీ మార్చలేరు. వాటిని అవగాహన చేసుకుని పాడడం సామాన్య గాయకుడికి కష్టం. ‘రజని గారి గేయా లను స్వర సహితంగా అచ్చువేస్తే, భావితరాలకు ఆయన సంగీతజ్ఞత బోధపడుతుంద’ని బాల మురళీకృష్ణ గారోసారి నాతో అన్నారు. అంటే, రజని పాటల్లోని మజా ఏమిటో మనకర్థవుతుంది. పాటల్ని కంపోజ్ చేయడంలో రజనీది ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరూ అనుకరించ లేని శైలి. ఎవరూ ఎదురుచూడని దారులు తొక్కుతూ, ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. విజయవాడలో 1970ల మొదట్లో ‘జై ఆంధ్రా’ ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ‘ఆకాశవాణి’లో ఏ కార్యకలాపాలూ జరగరాదని నిర్ణయించిన ఉద్యమకారులు స్టూడియో చుట్టూ మోహరించినప్పుడు, ఆ సమస్యను గ్రహస్థితికి ముడిపెట్టి, రజని గారు తయారు చేసిన ‘నవగ్రహ స్తుతి’ ఒక వినూత్న అనుభవం. ఈ కీర్తన ప్రసారమైన కొన్నాళ్ళకి ఉద్యమం కాస్త తగ్గింది. అలాగే, 1977లో దివిసీమ తుపానప్పుడు రజని ఒక పాట రాశారు. ‘నివాత శూన్య స్తంభం, నిష్పీడన మంథానం, జంఝా వాత సంరంభం, హంసవిధి విధానం...’ అనే పల్లవితో తుపాను బీభత్స సమయాన్ని ప్రతిబిం బిస్తూ సాగే ఆ పాటను ‘ఆకాశవాణి’లో ‘ఈ మాసపు పాట’గా పాడాను. నిజానికి, ఆ పాటలోని మాటలన్నీ చక్రవాక తుపానుకు సంబంధించిన సాంకేతిక పదాలకు చక్కటి తెలుగు మాటలు. ‘సైక్లోనిక్ సిలిండర్’కి అనువాదం ‘నివాత శూన్య స్తంభం’. సంక్లిష్టమైన మాటలు, తుపానుకు సంబంధించిన విషాదం అయినప్పటికీ... పాడడానికి అనువుగా ఉండే అద్భుతమైన గీతం అది. రేడియోకు ఒక ప్రత్యేకతను తెచ్చిన ఘనత - రజనీదే! ‘సంస్కృత పరిచయం’, ‘భక్తిరంజని’, ఓలేటి చేత ‘సంగీత శిక్షణ’, ‘ఈ మాసపు పాట’ వంటి కార్యక్రమాల రూపకల్పనకు ఆద్యుడు రజనీయే. రజని తన దగ్గర పనిచేసేవారిలోని ప్రతిభను గుర్తించి, కార్యక్రమాలను చేయించేవారు. అది చిన్న విషయం కాదు. ఆయనకున్న హోదా వల్లనే పేరు ప్రఖ్యా తులు వచ్చాయనుకుంటే పొరపాటు. ఆయన వల్ల రేడియో హోదా పెరిగిందనడం నిజం. -
మేధస్సు అలసిపోదు
గొల్లపూడి మారుతీరావు, ప్రసిద్ధ రచయిత - నటుడు - కాలమిస్టు కిందటి శతాబ్దపు అయిదో దశకం తెలుగు దేశానికి మరపురాని దశ. కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవం. ముఖ్యంగా ‘భక్తి రంజని’. నిజానికి ఆ కార్యక్రమాన్ని ‘భక్తిరజని’ అనాలని చాలామంది అనేవారు. కారణం ఆ వైభవానికి మూలపురుషులు బాలాంత్రపు రజనీకాంతరావుగారు కావడం. నాకప్పుడు ఇరవయ్యేళ్లు. తెల్లవారితే ప్రతీ ఇంట్లో ‘భక్తిరంజని’ పాటలే చెవుల్లో గింగుర్లెత్తించేవి. తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, నరసదాసు, నారాయణ తీర్థులు, రామదాసు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి - ఇలాగ. ఇవన్నీ మధురమయిన జ్ఞాపకాలు. బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, ఎమ్.వి. రమణమూర్తి, సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, పాకాల సావిత్రీ దేవి, నల్లాన్ చక్రవర్తుల నరసింహా చార్యులు - వీరంతా గానం చేసిన పాటలవి. అన్నమాచార్య కీర్తనలు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. మూడు శతాబ్దాలు తిరుమల శ్రీవారి ఆలయ భాండాగారంలో అజ్ఞాతంగా మిగిలిపోయిన ఆ కీర్తనల వైభవాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రారంభించగా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు కొనసాగించారు. అయితే ‘‘ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది’’ అన్న కీర్తన బాలమురళీ కృష్ణ పాడగా విన్న గుర్తు. అప్పటికి టీవీలు లేవు. ఆనాటి రేడియో ప్రాచుర్యాన్ని పూర్తిగా అనుభవించిన తరం మాది. కానడలో వోలేటిగారి హనుమాన్ చాలీసా, చరిత్రగా నిలిచిపోయిన బిళహరి, కాంభోజీ, జౌన్పురీ, నాట మొదలైన రాగాలలో బాలమురళి నారాయణ తీర్థ తరంగాలు, రజని సూర్య స్తుతి - ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు. ‘మాది’ అని నన్నూ కలుపుకోడానికో కారణం ఉంది. నా జీవితంలో - ఆ మాటకి వస్తే మా ఇంట్లో మొదటి రేడియో నేను కొన్నదే. 1959లో నేను అంతర్జాతీయ రేడియో నాటికోత్సవాల పోటీలలో నా నాటిక ‘అనంతం’కు మొదటి బహుమతిగా పుచ్చుకున్న వంద రూపాయలతో, నేను రేడియోకి రాసిన ‘శాఫో’ అనే నాటికకి దక్కిన పదిహేను రూపాయలు, ‘అనంతం’లో నటించినందుకు దక్కిన మరో పాతిక కలపగా, మా నాన్నగారు మరో ఇరవై రూపాయలు ఇచ్చిన గుర్తు. ఆ పైకంతో చిన్న ‘మర్ఫీ’ రేడియో కొన్నాను. అది ఆ తర్వాతి 57 సంవత్సరాల జీవితానికి పెట్టుబడి అయింది. ఆ విధంగా రజనీకాంతరావుగారు, బాలమురళీకృష్ణ, మిగతా గాయకులంతా నా డ్రాయింగు రూములో కొలువుతీరారు. ఓ చిన్న రచయితకి అదొక దేవలోకం. ఎప్పుడయినా ఈ గంధర్వుల్ని చూడగలుగుతానా అనుకొని రేడియోలో తలదూర్చి మరీ లలిత సంగీతం వినేవాడిని. అది 1959. మరో నాలుగేళ్లకు (1963) వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. రేడియోలో ఉద్యోగం వచ్చింది! అంతే. అదే జీవితంలో పెద్ద మలుపు. నా జీవితంలో గొప్ప అదృష్టాన్ని చెప్పమంటే నా ప్రవృత్తి- వృత్తి మమేకయి జీవితమంతా కొనసాగడం. అడుగడుగునా ఎందరో పెద్దలతో భుజం కలిపి పనిచేయడం. ఏనాడూ అహంకారానికి తావివ్వని ప్రతిభావంతుల, పెద్దలతో సాంగత్యం, ఆ మలుపులో నా అభిరుచిని సంధించినవారిలో రజనీకాంతరావుగారి పాత్ర ఉంది. 1959 నాటి మరో ప్రత్యేకమైన జ్ఞాపకం - విజయవాడ మొగల్రాజపురంలో మహీధర రామమోహనరావు గారింట్లో సాహితీ సమావేశం. ఆ రోజుల్లో నా ఆనర్స్ చదువు పూర్తి చేసుకుని ‘ఆంధ్రప్రభ’లో ఉద్యోగానికి వారం వారం నీలంరాజు వేంకట శేషయ్యగారిని కలుస్తూండేవాడిని. విజయవాడలో మహీధర రామ మోహనరావుగారు సాహితీ సమావేశాలకు సంధానకర్త. సైకిలు మీద వచ్చి అందరి ఇళ్లకీ వెళ్లి మమ్మల్నందరినీ పేరు పేరునా సమావేశాలకు ఆహ్వానించేవారు. ఆ రోజు కొడవటిగంటి, శ్రీశ్రీ వచ్చారు. ఆనాటి సభలో నేనూ, ఏటుకూరి బలరామమూర్తి, పరకాల పట్టాభిరామారావు, అంగర సత్యనారాయణ రావు ప్రభృతులు ఉన్న జ్ఞాపకం. రజనీగారు అప్పుడు విజయవాడ రేడియోలో చేస్తున్నారు. వచ్చారు. అనర్గళంగా ‘మహాప్రస్థానం’లో కవితల్ని గానం చేశారు. 1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి - ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి - ఇలాగ. నా జీవితంలో అదృష్టం - తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను. వోలేటి పాడిన ద్విజావంతి రాగంలో రజని గీతం ‘మనసౌనే రాధా, మరల వేణువూద!’’ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. పాట వినగానే నా జ్ఞాపకాలు 55 ఏళ్లు వెనక్కి దూకుతాయి. రజని పాట ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ అన్నపాట ఇప్పటికీ పాడగలను. రేడియోలో ఎస్. వరలక్ష్మిగారు పాడారు. ఆవిడ నాకంటే 12 సంవత్సరాలు పెద్ద. నిజానికి నా ముందుతరం హీరోయిన్. 35 సంవత్సరాల తర్వాత మేమిద్దరం కనీసం నాలుగు చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించాం! ‘శ్రీవారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆవిడకి ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ పాటని గుర్తు చేశాను. ఆవిడకి జ్ఞాపకం రాలేదు. నాకు గుర్తున్నట్టు పాడి వినిపించాను. అది విని ఆమె నాకు మళ్లీ పాడారు. మంచి పాట, మంచి బాణీ, రజని సంగీతంలో జీవలక్షణం చిరంజీవి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రజనిగారు 1940లో రేడియోలో ఆర్టిస్టుగా చేరారు. 1943లో ఆయన ఉద్యోగం రెగ్యులరైజ్ అయింది. 1978 వరకూ పనిచేసి స్టేషన్ డెరైక్టరుగా పదవీ విరమణ చేశారు. ఆ తరానికి అది ఉద్యోగం కాదు. ఉద్యమం. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మద్రాసు కమాం డరన్ చీఫ్ రోడ్డులోఉన్న ఆకాశవాణి కేంద్రంలో దాదాపు అందరూ ఉన్నారు. పార్లమెంటులో నెహ్రూ ప్రసంగాన్ని వారూ పులకించిపోతూ విన్నారు. ఆనాడు రజని టంగుటూరి సూర్యకుమారి చేత ‘మాదీ స్వతంత్ర దేశం’ పాడించారు. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రసారమైన మొదటి దేశభక్తిగేయం ఇది. ఎంతటి గౌరవం! అప్పుడు కేంద్రంలో బుచ్చిబాబు, అనౌన్సరు మల్లంపల్లి ఉమామహే శ్వరరావు మొదలైనవారంతా ఉన్నారు. ఏం రోజులవి? రేడియో మాధ్యమానికి పునాదులు వేసిన తరం అది. ఆ స్ఫూర్తితోనే మా తరం వారంతా పనిచేశాం. నాకు ఏనాడూ రేడియోలో నా జీతమెంతో తెలి సేది కాదు. తెల్లవారితే ఏ కొత్త పనిచెయ్యాలా అని ఆఫీసుకి దూకే వాళ్లం. 1963-68 మధ్య హైదరాబాదులో రేడియోలో ఉద్యోగం. నా పని డ్యూటీ ఆఫీసరు. ఒక సంఘటన బాగా గుర్తు. ఆ రోజు అయిదు గంటలకి ఇంటికి బయలుదేరుతున్నాను. స్టూడియోలో రజనిగారు, వేణుగాన విద్వాంసులు ఎన్.ఎన్. శ్రీనివాసన్గారూ - అంతా హడావిడి పడుతూ పరుగులు తీస్తున్నారు. పాటల రికార్డింగు మరో పక్క జరుగుతోంది. ‘బావొచ్చాడు’ నాటిక గ్రామస్తుల కార్యక్రమంలో (సాయంత్రం 6-20కి) ప్రసారం. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వెళ్తున్న నన్ను ఆపారు. అప్పటికే ఆయన కంఠం మూగపోయింది. నన్ను పిలిచి కాగితం మీద రాశారు. ‘‘నీ మొహం రాగి చెంబులాగ ఉంటుంది. నా నాటికలో వేస్తావా?’’ అని. చేసేది రేడియో నాటిక. మొహానికీ దానికీ సంబంధం లేదు. ఆయన చమత్కారమది. ఏం వేషం? అందులో నా పాత్ర ‘బావ’. అంటే ప్రధాన పాత్ర. సంగీత రూపకానికి సంగీతం సమకూర్చినది రజనీకాంతరావుగారు. ఆశగా కూర్చున్నాను. కార్యక్రమం పాటతో ప్రారంభమైంది. అవుతూనే మరో పాట. పండగకి బావ ఇంటికి రావడం సందర్భం. పాటలు వేడివేడిగా వస్తున్నాయి. కాలం జరిగిపోతోంది.7 గంటలకి తెలుగులో వార్తలు. 6-55 అయిపోయింది. ఈ బావ ఎప్పుడొస్తాడు? దేవులపల్లివారిని అడిగాను. సన్నని చిరునవ్వు సమాధానం. 6-57 అయింది. నా చేతికి ఓ కాగితం మీద ఒక మాట రాసిచ్చారు దేవులపల్లి. ‘‘ఏమర్రా పిల్లలూ!’’ అన్నాను. అంతా ‘‘బావొచ్చాడు బావొచ్చాడు’’ అన్నారు. నాటిక అయిపోయింది! ఆ విధంగా రజని గారి సంగీత రూపకంలో ఒకే ఒక్కసారి నటించాను. నా షష్ఠిపూర్తికి ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ రజని గారు ప్రత్యేక సంచికలో వ్యాసం రాశారు. అంతటి మహానుభావులతో 50 ఏళ్లు నిలిచిన మధురమైన జ్ఞాపకం ఇది. నేను విజయవాడలో పనిచేసే నాటికి రజనీగారు ఉత్తర దేశంలో పనిచేసేవారు. నాకు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ వచ్చి శంబల్పూర్ బదిలీ చేసేనాటికి విజయవాడ స్టేషన్ డెరైక్టరుగా వచ్చారు. అప్పటికి నేను సినీమాల్లో ముమ్మరంగా రచనలు చేస్తున్నా. సినీరంగ మిత్రులు నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. రాజీనామా పత్రాన్ని తీసుకుని రజనీగారి గదిలోకి వెళ్లాను. కాగితం తీసుకు చదివారు. ఒక్కసారి నన్ను ఎగాదిగా చూసి కాగితాన్ని అడ్డంగా చింపేశారు. ‘‘శంబల్పూరు వెళ్లు. అక్కడి నుంచే రచనలు చెయ్యవచ్చు. నేను డిఫికల్టు స్టేషన్లలో పనిచేయబట్టే ఇక్కడికి రాగలిగాను. మరేం ఆలోచించకు. వెళ్లు’’అంటూ హితవు చెప్పారు. ఆయన కారణంగా వెళ్లాను. మరో పదేళ్లు రేడియోలో పనిచేసి, అసిస్టెంటు స్టేషన్ డెరైక్టరుగా ప్రమోషన్ తీసుకుని, కడప రేడియో స్టేషన్‌కి హెడ్డునయి, ఊహించని రీతిలో సినిమాల్లో నటించి, తొలి సినిమాకే స్టార్నై- అప్పుడు తప్పక రాజీనామా చేశా. మేథస్సుతో పనిచేసే వ్యక్తికి శరీరం అలిసిపోదు. వృద్ధాప్యం కేవలం శరీరానికే పరిమితం. ఒక శతాబ్ద కాలం సంగీత సాహిత్యాలకు తనదయిన ప్రత్యేకతలను సంతరించిన వాగ్గేయకారులు రజనీగారు. ఆయన నూరేళ్ల జీవితం ఒక ఉద్యమం. ఆయన తరానికి దక్కిన అవకాశాలు మరే తరానికీ దక్కవు. ఓ మాధ్యమానికి ఊపిరి పోసి, ఓ దేశ స్వాతంత్య్రాన్ని చిరస్మరణీయం చేసి, సంగీతానికి నూరేళ్ల ఆయుష్షును పోసిన నిండు జీవితం రజనీగారిది. తెలుగు సాహితీ చరిత్రలో ఆయన ఒక సువర్ణ అధ్యాయం. -
కృతజ్ఞతాగేయం
రచన: బాలాంత్రపు రజనీకాంతరావు నే చేయునదీ నే చేయనిదీ సాధించినదీ ఫలియించనిదీ నీ యిచ్ఛలేక జరుగదట నా స్వేచ్ఛ మొదలు తుది యెచట! ॥చేయునదీ॥ నిను చూచుటకే రప్పించితివీ నీ దరిసెనమే యిప్పించితివీ యీనోట పాట పాడించితివీ యిది ఎవరి రచనయని యడిగితివీ ॥చేయునదీ॥ నా భావనమే నా జీవనమై నీ ప్రణయమ్మే నా కవనమ్మై నా అహపుటంచు చెరిపించెదవో నా ఇహము పరము గావించెదవో ॥చేయునదీ॥ నాదామృతమే పరసాధనగా నీ దివ్య వాక్కే ఉద్బోధనగా ఈ రజని కాంతు లొలయించెదవో విశ్వ జనహితము వెలయించెదవో ॥చేయునదీ॥ (1965 మే) అహ్మదాబాద్ స్టేషన్ డెరైక్టర్‌గా రజనీకాంతరావు (1970) -
ఎప్పటికీ ఎగిరే సంగీత పతాకం
పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ప్రముఖ సంగీత, సాహిత్య, కళా విమర్శకులు దక్షిణదేశ సంగీతాకాశంలో రజనీకాంతరావు గారు ఒక విశిష్టమైన పతాకం ప్రతిష్ఠించారు. అది అలా ఎగురుతూ ఉండటాన్ని తానే స్వయంగా చూడగల్గిన అదృష్టవంతులు. తనే ఇప్పటికీ తన పాటలూ, చరణాలూ, ఒక్కొక్కసారి పూర్తి పాఠం సంగీతపు వరుసలతో సహా పాడటం ఈ వంద సంవత్సరాల వేడుకల సమయంలో ఆయనను దర్శించేవారికి ఒక విందు. డెబ్బయ్ ఏళ్ళ ఆధునిక కవులు, 80 ఏళ్ళ అమెరికా తల్లులు వచ్చి ఆయన పాటలు ఆయన దగ్గరే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే, ఆయన కూడా గొంతు కలపడం వచ్చిన వారికి ఎంతో ఆత్మీయమైన అనుభూతినిస్తుంది. పదేళ్ళ క్రితం వరకూ ఆయన దగ్గరకు వచ్చిన మిత్రులు గంటల తరబడి ఆయన పాటలు ఆయన చేత పాడించుకొని కదలలేక, కదలలేక వెళ్ళేవారు. ఆయనను గంభీరమైన ప్రశ్నలతోటి,చిలిపి ప్రశ్నలతోటి విసిగించే నాలాటి వాళ్ళ సంగతి సరేసరి. ‘‘ఆ ‘విశ్వయానం’లో చివరన ‘మార్వా’ రాగంలో ఓలేటి చేత పాడించేందుకూ, అంత గొప్పగా వచ్చిన జంత్రగాత్ర వాద్యమేళనానికీ సరిపోయిందా? ‘మార్వా’ రాగం ఎందుకూ’’ అంటే, ‘‘ఎందుకుండరాదు? వై నాట్’’అని సమాధానం ఇచ్చారు. ఇంకొకసారి నేను ‘మీరు సినిమా పరిశ్రమను వదిలేయడం మీకు వ్యక్తిగతంగా నష్టం కలిగించినదండీ!’’ అన్నాను. ‘‘ఇలా మిగిలేవాణ్ణి కాదులే! దుర్గాబాయి గారు కూడా అనేది’’ అని నవ్వుతూ తేల్చేవారు. ప్రముఖ దర్శక - నిర్మాత బి.యన్. రెడ్డిగారు తమ రికార్డింగ్ స్టూడియోను కట్టించిన కొత్తలో ఈయను తీసుకెళ్ళి ‘ఇదిగో స్టూడియో’ అన్నారట! కానీ ఆయన తర్వాత సినీమాకు ఆయనను సంగీతం సమకూర్చమనలేదు. ‘‘బాధపడ్డారా?’’ అన్నాను. ‘‘లేదు. సాలూరి రాజేశ్వరరావు నా కంటే సీనియర్. బాగా చేశాడు’’ అన్నారు. జీవితంలో అంతటి కపటం లేనితనం, తనకు సంక్రమించిన దాని పట్ల తృప్తి, వివాదాలకు దూరంగా ఉండడం - ఆయన సహజ గుణాలు. ఒక పెద్ద కవి గారికి కోపం వచ్చింది. ఆ కోపానికి ఈయన కారణం కాదు. కానీ ఈయనే అని ఆ కవి గారి చెవిలో ఒక ఆప్తుడు ఊదాడు. ఈయన మేలు కోరే పెద్దమనిషి పెద్ద కవి గారికి రజని గార్ని క్షమాపణ చెప్పి సర్దుకోమన్నాడు. ఈయన క్షమాపణ చెప్పలేదు. మేలుకోరిన పెద్దమనిషి మీద కోపం తెచ్చుకోలేదు. ఇది చెప్పి నాకు హితవు చెప్పారు - ‘‘నువ్వు చేయనిదానికి కూడా నీ మీద నిందలు వేస్తారు. తెలుసుకో’’ అని! పిఠాపురంలో తండ్రిగారి నుండి వచ్చిన ఇల్లు అవసరం లేకపోయినా అమ్మివేశారు. ఆయనకి ఇష్టం లేదు. భార్య సుభద్రమ్మ గారికీ ఇష్టం లేదు. ‘‘ఏమిటండీ! అమ్మడం ఎందుకండీ’’ అంటే ప్రాప్తం ఉండాలి కదా అని ‘లైటు’ తీసుకున్నారు. చాలామందికి తెలుసు ఆయన జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రవీణులని. నేను తేలికగా ‘‘ఎన్ని చెప్పండి... మీ పిల్లల్ని మీ స్థాయిలో చదివించలేదండి. మీరు అప్పుడే వాల్తేరులో ఆనర్సు చదివినవారు. ఏమిటిది?’’ - అంటూ చనువు తీసుకుని ఒకసారి నిరాశ వ్యక్తం చేశాను. ‘‘ఏం? చీకూచింతా లేని ఆరోగ్యమైన జీవితం సాగిస్తారు. అంతకంటే కావాల్సింది ఏమిటి?’’ అని సమాధానమిచ్చారు. ఎంతటి సాధారణమైన అసాధారణ జీవితం ఆయన గడిపారో చెప్పే ప్రయత్నంలో అందరికీ తెలిసిన ఆయన సంగీతమయ ప్రపంచం గురించి వివరించలేదు. ఆయన సంగీత పతాకం రచించిన దశాబ్దాలు దర్శించలేదు. ఆయన ఒక చిత్రమైన స్వయంభువు. ఎవరిదీ - చివరికి తండ్రి గారిది కూడా ప్రభావం పడకుండా దారి ఎంచుకున్న కాల్పనిక ఉద్యమకాల రచయిత. ఆయన పాటల్లో ఎవరి ప్రభావం లేకుండా, ఆ కాలంలో 1940-’90ల మధ్య వ్రాయడం దాదాపు అసాధ్యం. ఆఖరికి రవీంద్రుడి ప్రభావం కూడా లేదు. ఊహల ఆంతర్య కల్పనల విస్తృతీ పరిమితమైన కాలంలో కూడా, సుదూర తీరాలకు మీ మనసును తీసుకుపోయే భావాలతో పాటలు రాశారు. ఆ పాటలకు సంగీతం సమకూర్చారు. ఏవో వరుసలు కట్టడం కాదు, ఆయన సంగీతంలో ఉన్నది. సంగీత కల్పనలో కూడా లోతైన, మనసైన, సొగసైన, ఆశ్చర్యం కల్గించే పోకడలు నిలుపుకోగల పద, భావ, ఆలోచనా శక్తిని నింపారు. ఆ పతాకం అవిశ్రాంతంగా ఎగరడానికి, రెపరెపలాడుతూ ‘ఆచంద్రార్కమూ’ ఉండడానికి ఆయనే పాడగలిగారు. ఆయన పాటలో పాఠం- పల్లవి,అనుపల్లవుల బంధాల నుండి ముక్తి పొంది అనిర్వచనీయమైన ఏదో ఆధారంతో, మాంసంతో, ఆభరణాలతో, తేజంతో దర్శనమిస్తూనే ఉంటుంది. ఎక్కడో వెండి తీగలా ఒకొక్కసారి పాట అంతా పదసిద్ధ సంభారాలో, ‘చరణ’ మంజీరాలో, నిష్ర్కమణ గీత శకలాలో వేరే లోకాల్లోకి మిమ్మల్ని లాక్కుపోతాయి. స్మృతిగీతాలైనా, సంవాద గీతాలైనా చివరికి దేశభక్తి గీతాలయినా - ఆ అలంకార శయ్య పరిమళ ద్రవ్యంగా మత్తు కలిగిస్తుంది. ఇక ఆ సంగీతపు పూత వెనుకనున్న రసాయన మేళనం ఎవరికి వారు పరిశోధించుకోవలసినదే. లేకపోతే బాలమురళి నుండి సూరిబాబు దాకా ఆయన సంగీత కూర్పుకి ఎందుకు పరవశులవుతారు? పాటలకు ఆయన సమకూర్చిన ఆరంభ వాద్యగోష్ఠి నుండి చరణాంతర సంగీత తీర్మానాలకు, నాటకీయ పరికల్పనలకు ముగ్ధులు కానివారు లేరు. రవీంద్రుని గీతాలకు తెలుగు అనువాదం, సంగీతం రజని సమకూర్చినట్లు పట్టుగా ఏ ఇతర భారతీయ భాషలలోనూ వచ్చి ఉండవు. అందుకే కేంద్ర సంగీత అకాడెమీ తరఫున రవీంద్రుడి 150వ జయంతికి పురస్కారం లభించింది. అలాటి పాటల బెంగాలీ సంగీతమూ, చిక్కటి అనువాదమూ ఒక్కరే సమకూర్చే అవకాశం ఇతర భాషారచయితలకు ఉండదు కదూ! ‘‘చిత్తమెచట భయశూన్యమో... గృహప్రాచీరము తన ప్రాంగణ తలమును దివారాత్ర మృత్తికాధూళిలో క్షుద్ర ఖండములు చేయదో’’ అంటూ రవీంద్రుడి సంగీత వరుస కట్టడం - మామూలు వారికి సాధ్యం కాని పని. మరో అసాధ్యమైనదీ ఎవరూ చేయలేనిదీ ఒకటి ఉంది. రామాయణ అవతరణ గాథను వాద్యగోష్ఠిలో ‘ఆదికావ్యావతరణం’ అని వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతోటి ఆరంభించి ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. అలాగే శివుడి కోపంతో మన్మథుడు దహనం కావటం - ‘కామదహనం’గా స్వరపరిచారు. గొంతుకలు లేని, కేవలం వాద్యగోష్ఠిలో సాగే విషయాత్మక సంగీత రచనలకు దారుఢ్యాన్నీ, పుష్టినీ, విషయనిష్ఠనీ సమకూర్చిన భారతీయ వాద్యబృంద సంగీత రచయితలలో రజని ఒకరు. ఎక్కువ సంఖ్యలో ఈ గోష్ఠులు నిర్వహించే అవకాశం ఆయనకు రాలేదు కానీ, రవిశంకర్, పన్నాలాల్ ఘోష్, ఈమని శంకరశాస్త్రి, అనిల్ బిస్వాస్ల సరసన ఆయనది గౌరవనీయమైన స్థానం. కీర్తనలు పాడుకుంటూ అదే కర్ణాటక సంగీత, హిందూస్థానీ సంగీత పారమ్యం అని భావించే శ్రోతల సముద్రంలో ఈ ఆర్కెస్ట్రా అనే విషయాత్మక సంగీత కల్పనాపటిమ మరుగున పడిపోయింది. నాలుగు దశాబ్దాలుగా 1940ల నుంచి ’80ల దాకా సాగిన వాద్యగోష్ఠి కల్పనలలో రజని గారిది ప్రత్యేక పీఠం. రాగం తెచ్చే లయాత్మక సమ్యగ్దృష్టికి, ఆ రాగ స్వరాల జాడలు విసిరే లోచూపులకు ఆయన సంగీత రచనలు బంగారం గీటు చూపుతాయి. భారతీయ సంగీత పరిణామ చరిత్రను వీక్షించడంలోనూ, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రలోని ధాన్యరాశులను ఎగురవేయడంలోనూ, లలిత సంగీత నిర్మాణ ఫలకాలను స్థాపించడంలోనూ ఏడు దశాబ్దాల విరామమెరుగని సేవ ఆయనది. అందుకే ఆయనకంత పేరు. అందుకే ఆయన వేరుదారులు ఈ నేలలో బలంగా పాదుకొన్నాయి. పూర్ణ జీవితంలో సంపూర్ణ తృప్తితో జీవిస్తూ ఉండడం ఆయనకే పట్టిన అదృష్టం. -
వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!
పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పత్రికా సంపాదకులు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి రాయడానికీ, చెప్పడానికీ నాకున్న అర్హత ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు సంగీతం రాదు. అయితే, సంగీతాన్నీ, మంచి పాటనూ ఆస్వాదించడం వచ్చు. నేను టీనేజ్‌లో ఉండగా విన్న ఒక సినిమా గీతం ఆయన పట్ల నాకు ఆరాధనను పెంచింది. అది - ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట. ఆయన స్వరకల్పన చేసిన ఆ పాట తలుచుకుంటే, ఇవాళ్టికీ భలేగా ఉంటుంది. ముఖ్యంగా, ఆ పాటకు ముందుగా వచ్చే ఆ ‘హమ్మింగ్’ లాంటిది భానుమతి పాడిన తీరు, ఆ రకంగా దానికి వరుస కట్టిన రజనీ గారి ప్రావీణ్యం ఇప్పటికీ నిత్యనూతనమే. ఆ రకంగా ఆ రోజుల నుంచే నేను ఆయన సంగీతానికీ, పాటకూ అభిమానిని. ఆ తరువాత జర్నలిజమ్‌లోకి వచ్చాక బెజవాడకు వెళ్ళినప్పుడు జర్నలిస్టు మిత్రులు నండూరి రామమోహనరావు, సి. రాఘవాచారి, ఉషశ్రీ లాంటి వారితో కలుస్తుండేవాణ్ణి. అలా రజనీగారిని కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా కలిశాను. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. పైగా అప్పట్లో నేను ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో పనిచేసేవాణ్ణి. అందువల్ల కొంత వెసులుబాటు ఉండేది. రజనీ గారిని ఎప్పుడు కలిసినా, కేవలం పది నిమిషాలే మాట్లాడుకున్నా సరే, అందులోనూ సంగీతం వినిపించకుండా, మాట్లాడేవారు కాదు. సామాన్య సంభాషణల్లో కూడా అలా సంగీతాన్ని ప్రస్తావించడం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. నిజం చెప్పాలంటే, సంగీతం లేని రజనీని ఊహించలేమంటే నమ్మండి. మనకున్న కళాకారుల్లో, సాహిత్యవేత్తల్లో ఇటు సంగీతం, అటు సాహిత్యం - రెండింటిలోనూ ప్రావీణ్యం ఉన్నవారు ఈ తరంలో, నాకు తెలిసినంత వరకు రజనీ ఒక్కరే! ఒక తరం వెనక్కి వెళ్ళి చూస్తే, సంగీత, సాహిత్యాల్లో అంతటి మహానుభావుడు - హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు. రజనీ గారిలో మరో గొప్పదనం - ప్రకృతిలో, పశుపక్ష్యాదులలో కూడా సౌందర్యాన్నీ, కవిత్వాన్నీ చూసే విభిన్నమైన చూపు. పశువులు, పక్షుల అరుపులో కూడా సంగీతం చూశారాయన. అందుకు ఆయన చేసిన సంగీత రూపకం ‘కొండ నుంచి కడలి దాకా’ ఒక ఉదాహరణ. కీచురాళ్ళ చప్పుడులోనూ సౌందర్యం, సంగీతం, శ్రావ్యతను చూడడం రజనీ ప్రత్యేకత. 1970లలో అనుకుంటా... ఆ సంగీత రూపకానికి గాను ఆయనకు జపాన్ వాళ్ళదనుకుంటా... అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ నాకు ఎదురైన ఒక స్వీయానుభవం ప్రస్తావించాలి. ఒకరోజు మాటల సందర్భంలో ఆయన మా ఇంట్లోని కుక్కకు కూడా సంగీతం వచ్చు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకొకసారి వినిపించండి అన్నాను. సరే అన్నారు. వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఆ పెంపుడు కుక్కను పక్కనపెట్టుకొని, ‘సా’ అని రాగం తీశారు. గమ్మత్తుగా అది కూడా ‘సా’ అంటూ ఆ ఫక్కీలోనే అంది. అలాగే, ‘రి’. ఎక్కడా ఎగుడుదిగుళ్ళు లేకుండా రజనీ గారి ఇంటి పెంపుడు కుక్క ‘సరిగమ పదనిస’లు అన్నీ పలికినట్లు నాకు అనిపించింది. పాటలైతే పాడలేదు కానీ, ఆ కుక్క స్వరాలు పలుకుతున్నట్లు గ్రహించాను. ఆ వెంటనే ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో ఆ ‘సంగీతం పాడే కుక్క’ గురించి ప్రత్యేకంగా ఒక ఫీచర్ రాసి, ప్రచురించాను. ‘ఏ గూటి చిలక ఆ గూడి పలుకు’ అని మనకో జాతీయం ఉంది. సరిగ్గా అలాగే, ఇక్కడ సంగీతపు గూటి కుక్క, ఆ గూటిలోని సంగీతాన్నే పలికిందన్నమాట. ఇవాళ ఒక్కసారి తెలుగునాట సంగీత పరిణామక్రమాన్ని సింహావలోకనం చేసుకుంటే, శాస్త్రీయ సంగీతం కాస్తా లలితసంగీతంగా రూపం మార్చుకొని, ప్రవర్తిల్లడం ఒక పరిణామ దశ. ఆ పరిణామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రితో సహా కొందరు సాహిత్యకారులు, సంగీతజ్ఞుల పాత్ర ఉంది. వారితో పాటు రజనీ గారిది కూడా లలిత సంగీతావిర్భావంలో ఒక ముఖ్యపాత్ర. అలాగే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం డెరైక్టర్‌గా కూడా ఆయన నూతన పథగామి అయ్యారు. ఆకాశవాణిలో మామూలు స్థాయిలో మొదలైన ఆయన కేంద్ర సంచాలకుడి స్థాయి వరకు ఎదిగారు. సాధారణంగా ఆ స్థాయికి వచ్చాక, చాలామంది మునుపు చేసినవారి మార్గాన్నే అనుసరిస్తూ, ఒక మూసలో వెళ్ళిపోతుంటారు. కానీ, రజనీ గారు అలా కాదు. వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ‘భక్తి రంజని’ లాంటివెన్నో రజని గారి కంట్రిబ్యూషనే! అలాగే, యువకులు, కొత్తవాళ్ళలోని ప్రతిభను పసిగట్టి, వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేక లక్షణం ఆయన సొంతం. అలా ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి ఆయన ఒరవడి పెట్టారు. ఇతరులకు కూడా ఆ విషయంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వ్యక్తిగతంగా చూస్తే, వయసులో నా కన్నా రజనీ గారు చాలా పెద్ద. అయినా, నన్నెప్పుడూ ఆయన స్నేహదృష్టితో చూసేవారు. ఆయన, రచయిత మహీధర రామమోహనరావు, నేను కలిసి, సరదాగా మాట్లాడుకున్న క్షణాలు, ఫోటోలు దిగిన క్షణాలు నాకిప్పటికీ గుర్తే! ఆయనకు వయసు మీద పడ్డాక ఎప్పుడైనా కలిసినప్పుడు, ‘కులాసాగా ఉన్నారా’ అని నేను అడిగితే, ఆయన నన్ను గుర్తుపట్టానని చెప్పడానికి బదులుగా కావాలని - ‘నేను... పొత్తూరి వెంకటేశ్వరరావును’ అంటూ ఉంటారు. నేను వెంటనే, ‘అవును. మరి నేనేమో బాలాంత్రపు రజనీకాంతరావును’ అని నమస్కరిస్తుంటా. ఆ మాటతో ఇద్దరం హాయిగా నవ్వుకుంటాం. నిండు చంద్రుడి లాంటి ఆయన నవ్వుకు మరో వసంతం నిండుతున్నందుకు ఆనందిస్తున్నాను. స్నేహసంగీతం పరిమళించే ఈ శతాయువు తెలుగు లలిత సంగీత ప్రపంచంలో చిరాయువు! (సంభాషణ - రెంటాల జయదేవ) -
కవే గాయకుడవడం అదృష్టం
వింజమూరి అనసూయ, సుప్రసిద్ధ జానపద సంగీత గాయని ఎనభై నాలుగేళ్ల స్నేహం రజనీ అన్నయ్యతో! నాకంటే ఒక ఏడాది పెద్దవాడనుకుంటాను. బాలాంత్రపు వారి కుటుంబం అంతా నాకు ఆప్తులే. వెంకట్రావు బాబయ్యగారు, పార్వతీశం మామయ్యగారు (వేంకట పార్వతీశ కవులు) నాకు సన్నిహితులు. బాలాంత్రపు నళినీ అన్నయ్య మా అందరికీ పెద్దన్నయ్య. నాగరాజు బావ, చెల్లాయి, సుభద్ర, శశాంక అందరూ నాకు కావలసిన వాళ్లే. పిఠాపురం నాకెందుకిష్టం అంటే, ఊరంతా నా వాళ్లే. దివాను గారి బంగళాల కెదురుగా ఉండే సందులో మొదటింట్లో (రంగనాయకులు గారిల్లు) మామయ్య కృష్ణశాస్త్రి ఉండేవాడు. సందు తిరగగానే మెయిన్ రోడ్డు మీద ఎడం పక్క మొదటిల్లు వెంకట్రావు బాబయ్యగారిది. దానికెదురుగా అవతల పక్కనున్న ఇల్లు పార్వతీశం మామయ్య గారిది. ఎడం పక్క వీరిళ్లయితే, కుడి పక్కన రంగనాయకులు లైబ్రరీ. నా చిన్నతనంలో వేంకట పార్వతీశ కవుల బెంగాలీ అనువాద నవలలు అన్నీ అక్కడే చదివాను. నా చిన్నతనం సగం కాకినాడలోనూ, సగం పిఠాపురంలోనూ గడిచింది. మామయ్యకు చాలాకాలం పిల్లలు లేరు. నేను మామయ్య గారాల చిన్నతల్లిని (నన్నలాగే పిలిచేవాడు). శనివారాలు, ఆది వారాలు వచ్చాయంటే కాకినాడ నుంచి నన్ను పిఠాపురం తీసుకొచ్చేవాడు. తర్వాత రజనీ అన్నయ్యా వాళ్లు కూడా కాకినాడకు మకాం మర్చారు. అప్పుడు తరచూ కలుసుకునేవాళ్లం. అప్పటికే నేను పెట్టిన ట్యూన్స్‌లో లలిత సంగీత కచేరీలు చేస్తున్నాను. రజనీ అన్నయ్య తను రాసిన ట్యూన్స్ పెట్టిన ‘చండీదాస్’ పాటలు వినిపించడానికి వచ్చేవారు. అప్పటి మా నాన్నగారి పద్ధతి ప్రకారం, రాత్రి 9 అయితే పిల్లలు చదువు ఆపి, దీపాలార్పి పడుకోవలసిందే. అప్పటికి మామయ్య కుటుంబం కూడా పిఠాపురం నుంచి మా ఇంటికి వచ్చేశారు. హాల్లో ముసలాళ్లూ, పిల్లలం పడుకునేవాళ్లం. రజనీ అన్నయ్య ఆ టైమ్‌కి వచ్చేవాడు తీరుబడిగా. ‘‘ప్రభ గారూ!’’ అని అన్నయ్యను పిలిచేవాడు. తలుపు తీసినా, లైట్ వేసినా పెద్దవాళ్లు దెబ్బలాడతారు. అందుచేత అన్నయ్యా, నేనూ కిటికీ దగ్గరే కూర్చునే వాళ్లం. కిటికీ అవతల ప్రక్క నిలబడి, చిన్న గొంతుతో తన పాటలు పాడి వినిపించేవాడు. ఇందులో ‘రామి’ (హీరోయిన్) కేరక్టరు పాటలు అనసూయ పాడాలని నిర్ణయంచుకుని రాసి, ట్యూన్ పెట్టాననే వాడు. నేనా రోజుల్లో మామయ్య రాసిన ‘వసంతోత్సవం’ సంగీత నాటికకు ట్యూన్స్ పెడుతున్నాను. మొదటిసారి ‘వసంతోత్సవం’ మద్రాసు రేడియోలో ప్రసారమైనప్పుడు, మామయ్య కుటుంబం, మా కుటుంబం, ప్రయాగ నరసింహశాస్త్రి, రజనీ అన్నయ్య, గాడేపల్లి సుందరమ్మ - అందరం పెళ్లివారు లాగ కాకినాడ నుంచి మద్రాసుకు వెళ్లాం. అప్పుడు రజనీ అన్నయ్య ‘వసంతుడు’, ప్రయాగ నరసింహశాస్త్రి అన్నయ్య ‘మలయ మారుతం’, గాడేపల్లి సుందరమ్మ ‘వేణువు’, నా చెల్లెలు వింజమూరి సీత - ‘కోయిల’, నేను - ‘తుమ్మెద’, బాలమ్మ, సుగంధి - ‘పువ్వులు’గా పాడాం. ఈనాటి వాగ్గేయ కారులలో రజనీ అన్నయ్య ఒకడు. కవే గాయకుడవడం ఎంతో అదృష్టం. తన భావాలకు తగిన సంగీతం కూర్చవచ్చు. త్యాగరాజు అందుచేతే అంత గొప్ప గాయకుడు కూడా అయ్యాడేమో! బాలాంత్రపు రజనీకాంతరావు కవి, గాయకుడు కూడాను. అనేకమైన లలిత సంగీతం ప్రోగ్రాములు, రేడియో ప్రోగ్రాములూ నేను రజనీ అన్నయ్యా కలిసి పాడినవి ఉన్నాయి. మేము పరస్పర అభిమాన సంఘాల వాళ్లం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. మేము సమకాలికులం, సమ భావికులం, సమ గాయకులం. -
రజనీగంధం
కళాప్రపూర్ణ బాలాంత్రపు రజనీకాంతరావు గారు కళారంగంలో ఏ ప్రక్రియను స్పృశించినా దాని పారం (అంతు) చూడకుండా వదలరు. భారతీయ సంగీతం గురించి, ముఖ్యంగా కర్ణాటక సంగీతం గురించి, మరీ ముఖ్యంగా ఆంధ్ర వాగ్గేయకారుల గురించి ఆయన చేసినంతటి లోతైన పరిశోధన మరెవ్వరూ చేయలేదు. ఆయన రచించిన ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ ఇప్పటికీ అత్యంత ప్రామాణికమైనది. ఇక సృజనాత్మక సంగీతంలో రజని గారు స్పృశించని బాణీ లేదేమోననిపిస్తుంది. రవీంద్ర సంగీతం, బెంగాలీ కీర్తన్, బావుల్ గీతాల ఫణితులు, మరాఠీ భావగీత్, పర్షియన్, అరేబియన్ ఫణితులు, శ్పానిష్ జానపద (ఫ్లెమెంకో) ఫణితులు - అన్నీ ఆయన సంగీతంలోకి చొరబడ్డాయి. వాటిని ఆయన సందర్భ ఔచిత్యంతోనే ఉపయోగించుకున్నారు. లలిత సంగీతమైనా, సినిమా సంగీతమైనా, యక్షగానాల శాస్త్రీయ సంగీతమైనా ఆయన సంగీత రచనలన్నింటిలోనూ ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుగులో ‘లలిత సంగీతం’ అంటున్నదానికి ఆయనే వైతాళికుడు. సుమారుగా 1940 ప్రాంతం నుండి 1990 దాకా ఒక అర్ధశతాబ్ది కాలంలో ఆయన రచించి, స్వరపరచిన గీతాలన్నీ అజరామరాలే. అవన్నీ తర్వాతి తరాల లలిత సంగీత స్రష్టలను అంతో ఇంతో ప్రభావితం చేసినవే. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు రజనీకాంతరావు గారు. 1920 జనవరి 29న నిడదవోలులో ఆయన జన్మించారు. 1941 ఫిబ్రవరిలో - 21 సంవత్సరాల వయస్సులో రజని గారి మొదటి రేడియో సంగీత నాటకం ‘చండీదాసు’ ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయింది. అప్పటి నుండే ఆయన కళాజీవితం ప్రారంభమయింది. 1941 నుంచే రజనిగారు - తన పేరు ప్రకటించుకొనే అవకాశం లేకపోయినా అడపా తడపా సినిమా సంగీతం కూడా చేస్తూ వచ్చారు. అలా నిడుమోలు జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘తారుమారు - భలేపెళ్ళి’ అనే జంట హాస్యచిత్రాలకు రజనిగారు పాటలు రాశారు. వీటి స్వరాలూ ఆయనవే. అప్పటికే (1942) ఆయన రేడియో ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో ఉన్నవారు ఇతర సంస్థలకు పని చేయరాదనే నిబంధన ఉండేది. రేడియో అధికారులకు ముందుగా దరఖాస్తు చేసుకొని, అనుమతి సంపాదించుకోగలిగితేనే సినిమాలకు పని చేయవచ్చు. కాని, ఆ పని అంత తేలిక కాదు. సినిమాల కోసం ఆయన రాసిన పాటలు, వాటి స్వరరచనలు రాశిలో కాకపోయినా వాసిలో గొప్పవే. అన్నీ కాకపోయినా వాటిలో కొన్నైనా ఇప్పటికీ దొరుకుతాయి. గ్రామఫోన్ రికార్డుల ద్వారా వెలువడిన 1940 దశకంనాటి ప్రైవేటు పాటలు - రాజేశ్వరరావు, బాలసరస్వతి, భానుమతి, సూర్యకుమారి, వరలక్ష్మి పాడినవి - కూడా చాలా వరకు దొరుకుతాయి. కాని, రేడియో కోసం చేసిన సంగీతం చాలావరకు చెరిగిపోయినట్లే! దొరికినంత మటుకైనా రజనిగారి సంగీతాన్ని మళ్ళీ సీడీల మీదకు తెచ్చి సంగీత ప్రియులకు అందించడం అవసరం. (ఈ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, సంగీత విమర్శకుడు) నండూరి పార్థసారథి -
ఓసారి ఆకాశంపై లుక్కేద్దాం!
అన్నమయ్య ఎలా ఉంటారు? త్యాగయ్య, క్షేత్రయ్య ఎలా ఉంటారు? పాతరాగాలను స్థిరపరచి, కొత్తరాగాలను కట్టిన వారెలా ఉంటారు? కర్ణాటక-హిందుస్తానీ-రవీంద్ర-అరబిక్-వెస్ట్రన్ సంగీతాలను రంగరించి తెలుగువారి కోసం లలితసంగీతపు మంచిగంధాన్ని తీసినవారెలా ఉంటారు! మనకు స్వాతంత్య్రం వచ్చీరాగానే అర్ధరాత్రి పాటరాసి, స్వరపరచి ‘మాదీ స్వతంత్ర దేశం’ అని టంగుటూరి సూర్యకుమారితో పాడించినవారెలా ఉంటారు? ఉషశ్రీతో ధర్మసందేహాలను తీర్పించిన వారెలా ఉంటారు? సంగీతము - సాహిత్యము ఉచ్వాసనిశ్వాసాల్లా జీవిస్తోన్న వారెలా ఉంటారు? ఎలా ఉంటారెలా ఉంటారంటే బాలాంత్రపు రజనీకాంతరావు గారిలా ఉంటారు! బెజవాడ సీతారామపురం వెళ్లండి. వారణాసివారి వీధిలో ఆహ్లాదకరమైన నివాసం. ‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అన్నట్లుగా ఊయలలూగుతూ కన్పిస్తారు రజని. రజని అంటే చీకటి. మనకు తెలియని ఆయన మనో ఆకాశంలో ఎన్నెన్ని పాటల పాలపుంతలున్నవో! 95వ పుట్టినరోజు సందర్భంగా... లెటజ్ హేవ్ ఎ లుక్ ఎట్ ద స్కై! శివనారాయణ తీర్థుల పరంపరలో వేంకటపార్వతీశ కవులలో ఒకరైన వేంకటరావు-వేంకటరమణమ్మల ద్వితీయ పుత్రుడుగా 29 జనవరి 1920లో బాలాంత్రపు రజనీకాంతరావు జన్మించారు. టీనేజ్‌లో వానచినుకు రజనిలో సంగీత-సాహిత్యాలను మొలకెత్తించింది. ‘చినుకు కన్నియల పరికిణీ చెంగున/చెంగున మెరిశాయె చిన్ని ముత్తెసరులు/టిప్ టాప్ టాప్’ అన్నారు. పదాలను కూర్చేవారు వాక్కారులు. రాగమును బయలు పరచేవారు బయకారులు. రెండు విద్యలు తెలిసిన వారు ఉభయకారులు. వాగ్గేయకారులన్నమాట. ‘వాగ్గేయం’ అంటే ‘యవ్వనంలో బయలుపడే శృంగార చేష్ట’ అనే అర్ధం కూడా ఉంది. జానపదులు అసలు సిసలు వాగ్గేయకారులంటారు రజనీ. ఆది ‘చరిత్ర’ కారుడు! ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్, తెలుగు-సంస్కృతాలు అభిమాన విషయాలుగా మూడేళ్ల ఎం.ఏ. కోర్సు చదువుతూ పాటలు కట్టి, పాడే రజనితో విశ్వవిద్యాలయ కులపతి కట్టమంచి రామలింగారెడ్డి గొంతుకలిపేవారు. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాల్ని-పఠాభి ఫిడేల్ రాగాల్ని జరుక్ శాస్త్రి ద్వారా విన్న రజనీ రాజ్యస్వభావాన్ని నిరసిస్తూ ‘పూషా’ అనే కలం పేరుతో (షాను ఊదేసే కవి ) కవితలు రాశారు. 1955-56లో తెలుగు భాషా సమితి ప్రచురించిన రజనీ కృత సర్వసమగ్ర గ్రంధం ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం’ 1961లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందింది. కర్ణాటకసంగీతంలో పరిశోధన చేస్తోన్న వారికి ఇప్పటికీ రజనీ ‘చరిత్రం’ ఆదికావ్యమే! ‘కృష్ణకర్ణామృత’ కర్త లీలాశుకుడు, ‘సంగీతసార’ కర్త పార్శ్వనాధుడు, ‘రాగవిబోధి’ కర్త సోమనాథులు తెలుగువారని, ఆంధ్రభైరవి క్రమేణా ఆనందభైరవిగా మారిందని రజనీ ప్రతిపాదించారు. 1940ల్లో గోవిందరాజుల సుబ్బారావుగారు ‘నల్లవాడే గొల్ల॥పిల్లవాడే చెలియ’ అని పాడేవారు. రజనీ పద్ధతి ‘నల్లవాడే-గొల్ల పిల్లవాడే-చెలియ’! పాటను పంక్తులలో విభజించడం, సాహిత్యం లోని ఉద్వేగాన్ని పరిరక్షిస్తూ వన్నెతేవడం లలిత సంగీతానికి బాలాంత్రపు కంట్రిబ్యూషన్. రాగమయ్య! ఇప్పుడు బాగా పాపులర్ అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ కంటే ముందు రజనీ ‘పసిడి మెరుగుల తళతళలు’ తెలుగుతల్లి గీతంగా ప్రాచుర్యంలో ఉండేది. ఈ పాటను భానుమతితో కలసి పాడారు. చిత్తూరు నాగయ్య, కృష్ణశాస్త్రి, సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, టంగుటూరి వలెనే భానుమతికీ రజనీ అంటే ఎంతో గౌరవం. అరేబియా రాగాలతో రజనీ రచించి స్వరపరచిన ‘ఓహోహో పావురమా’ ఆమెకు ఉత్తమగాయనిగా కేంద్రప్రభుత్వపు అవార్డును లభింపజేసింది. అన్నమయ్య కీర్తనల్లోని ‘దేశాటం-నాటగౌళ-మాళవి’ తదితర రాగాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. రజనీ రాగాల స్వరూపాన్ని ఆవిష్కరించి అన్నమయ్యను తొలిసారిగా రేడియో ద్వారా తెలుగు వారికి పరిచయం చేశారు. ‘జో అచ్యుతానంద’ శ్రీమతి రజనీ పాడడం విశేషం! నాగాలాండ్, డార్జిలింగ్, సూరత్ తదితర ప్రాంతాలలో రేడియోలో పనిచేసిన రజని ప్రకృతి ధ్వనులను రేడియోలో ప్రతిధ్వనించారు. స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకూ మరే ఇతర రేడియో కార్యక్రమానికి రాని అంతర్జాతీయ బహుమతి రజని రూపొందించిన ‘కొండనుంచి కడలి దాకా....’ కార్యక్రమాన్ని మాత్రమే వరించింది. రేడియో ప్రసంగానికి పిలిస్తే ‘గో టు హెల్’ అన్న గుడిపాటి వేంకటాచలం ఒకే ఒక్కసారి ఆలిండియా రేడియోకు 1972లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అదీ రజనిపై గల గౌరవంతో. చలాన్ని రజని పువ్వులా ప్రశ్నలడిగారు! చలం... పరిమళంలా సమాధానమిచ్చారు. ఎన్.ఆర్.నంది ‘మరోమొహెంజదారో’ ప్రారంభగీతం ‘మరుగున పడిందొక మహీధరం’ ద్వారా రజనీ నాటకం ఆత్మను పలికించారు! రాగాల ‘చినుకులు’ వానచినుకు రజనిలో సంగీత-సాహిత్యాలను మొలకెత్తిసాయి. పిఠాపురంలో వింజమూరి సీతాదేవి, సుభద్ర వర్షంలో ఆనందిస్తోండగా టీనేజ్‌లో రజని అప్పటికప్పుడు‘చినుకు కన్నియల పరికిణీ చెంగున’ గేయం రాశారు. ట్యూన్ కట్టారు. ఆ పాటను 1938లో వింజమూరి సిస్టర్స్ (అనసూయ-సీతాదేవి)ఆలిండియా రేడియోలో పాడేరు. ఆ తర్వాత ‘చినుకుల’ సుభద్ర, రజనీ అర్ధాంగి అయ్యారు. రజని సంతానం... రమణకుమారి, హేమచంద్ర, నిరుపమకుమారి, శరత్చంద్ర, వెంకోబ్లు తండ్రికి కోరస్ పాడే రాగాల ‘చినుకులే’! మృత్యువును పరిహసించిన ‘ముత్యం’! సముద్రంలో సాధారణ రాచిప్పలో స్వాతి చినుకు కురిస్తే ముత్యం అవుతుందట. అది కల్పన. వాస్తవం ఏమిటి? రాచిప్పలో ఇసుక రేణువు చేరితే తోసేయటానికి ‘ప్రాణి’ నిర్విరామంగా ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో విడుదలైన స్రావాలు ఘనీభవించి మంచి ముత్యాలవుతాయి. రజనీ జీవితంలోకీ ‘ఇసుక రేణువు’ ప్రవేశించింది. రేడియోలో పనిచేస్తోండగా కొందరు ఆత్మీయ సహచరులు వరుసగా చనిపోయారు. ‘మృత్యువు’ రజనిని కలవర పరచింది. తన మీద ఆధారపడ్డ పసికూనలకు రెక్కలు వచ్చేదాకా జీవించాలి కదా. అంతటితో సరా? జీవించినందుకు ‘విలువలను నిలువ చేయాలి కదా’ అని ఒక కవితలో రాసుకున్నారు. తన హృదయస్రావాల నుంచి రజని జీవితపరమార్ధాన్ని సాధించారు. మనకూ, రాబోయే తరాలకూ కానుకగా అందించారు. ఇక నీ ఇష్టం అని మృత్యువుతో పరాచికాలాడుతూ. రాగాలతో సరాగం చేస్తోన్న ‘చిరంజీవి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారా! అలాగే!! వాళ్లబ్బాయి హేమచంద్ర (9247387192) ద్వారా కన్వే చేయండి! - పున్నా కృష్ణమూర్తి ఫొటో: కె.ఎస్.కోటేశ్వరరావు, విజయవాడ రేడియోలో ‘కాలం’ అచ్చులో ‘స్థలం’ ఎంత ముఖ్యమో రేడియోలో ‘కాలం’ అంత ముఖ్యం. స్థలకాలాదులను తెలిసిన రజని... పైకి చదువుతూ రాయడం అనే ప్రక్రియను బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు వంటి మహా రచయితందరి చేత పాటింపచేశారు. శ్రోతలకు వీనులవిందు చేశారు. మాదీ స్వతంత్ర దేశం... అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సుబ్రహ్మణ్యభారతి తమిళగీతం, ఆ వెంటనే ప్రసారమైన తొలి తెలుగు దేశభక్తి గీతం... రజని రచించి స్వరపరచిన ‘మాదీ స్వతంత్ర దేశం...’. ఆ పాటను టంగుటూరి సూర్యకుమారి గానం చేశారు. బాలాంత్రపు...95వ పుట్టిన రోజు సందర్భంగా...