బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత | Famous Writer Balantrapu Rajanikanta Rao passes Away | Sakshi
Sakshi News home page

ప్రముఖ రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత

Published Mon, Apr 23 2018 1:23 AM | Last Updated on Tue, Jul 31 2018 5:33 PM

Famous Writer Balantrapu Rajanikanta Rao passes Away - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రముఖ వాగ్గేయ కారుడు, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు(98) మరి లేరు. ఆదివారం ఉదయం విజయవాడ సీతారామపురంలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. సంగీత, సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రజనీకాంతరావు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చినవారిలో కీలకమైనవారు. ఆకాశవాణి రజనీకాంతరావుగా ఆయన సుప్రసిద్ధులు.

రజనీకాంతరావు 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. ఆయన తండ్రి బాలాంత్రపు వేంకటరావు ప్రసిద్ధి చెందిన వేంకట పార్వతీశ కవుల్లో ఒకరు. బాలాంత్రపు 1941లో మద్రాస్‌ ఆలిండియా రేడియోలో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా చేరి అంచెలంచెలుగా స్టేషన్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. 1947 ఆగస్ట్‌ 15న బాలాంత్రపు స్వయంగా రచించి బాణీలు సమకూర్చిన మోగించు జయభేరి..వాయించు నగారా గీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది. అలా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున రేడియోలో దేశభక్తి గీతం పాడిన ఘనత ఆయనకే దక్కింది. ‘మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే దేశభక్తి గేయాన్ని రచించి బాణీలు సమకూర్చారు. ఆ గీతం తెలుగుజాతికెంతో ఉత్తేజాన్నిచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఘంటసాల, సుశీల, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత ఆయనది. తొలితరం సంగీత దర్శకుల్లో బాలాంత్రపు ఒకరు. 

లలిత సంగీతం, యక్షగానాలతో రేడియో శ్రోతల అభిమానాన్ని సంపాదించారు. ఆయన భక్తిరంజని, ధర్మసందేహాలు వంటి కార్యక్రమాలతో అందరికీ సుపరిచితులు. చండీదాస్, గ్రీష్మ రుతువు వంటి పలు స్వీయ రచనలు చేశారు. శతపత్ర సుందరి పేరుతో గేయ సంకలన రచన చేశారు. పలు చలనచిత్రాలకు సైతం బాలాంత్రపు సంగీతం అందించారు. ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతిలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది ఆయనే. జేజి మమయ్య పేరుతో చిన్న పిల్లల పాటను ఆకాశవాణిలో బాలాంత్రపు ప్రసారం చేశారు. రజనీకాంతరావు రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1961లో లభించింది. ఇదిగాక కళారత్న అవార్డు, కళాప్రపూర్ణ, ప్రతిభామూర్తి జీవితకాల సాఫల్య బహుమతి, నాథ సుధార్ణవ, పుంభావ సరస్వతి, నవీన వాగ్గేయకార వంటి మరెన్నో పురస్కారాలు కూడా ఆయనకు లభించాయి. 2015లో ఏపీ ప్రభుత్వం ఉగాది సందర్భంగా తెలుగు వెలుగు పురస్కారంతో సత్కరించింది. ఆయనకు ఐదుగురు సంతానం. 

ఏపీ సీఎం సంతాపం
రజనీకాంతరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 

పలువురి నివాళి
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కా రంతోపాటు అనేక పురస్కారాలందుకున్న రజనీకాంతరావు మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని పలువురు సంగీత అభిమానులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, సంగీత ప్రియులు కడసారిగా దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ప్రయాగ వేదవతి, పాండురంగ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ నగరంలోని స్వర్గపురిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సంతాపం  
బాలాంత్రపు రజనీకాంతరావు మరణం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య, కళారంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తెలుగుతల్లి ముద్దుబిడ్డల్లో రజనీకాంతరావు అగ్రగణ్యులని వైఎస్‌ జగన్‌ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళలను, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లిన రజనీకాంతరావు చిరస్మరణీయులని, ఆయన మరణం సాహిత్య, కళారంగాలకు తీరని లోటని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement