famous writer
-
ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామలక్ష్మి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి, రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరులో ఆమె జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పుచ్చుకున్నారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి. చదవండి: దిగ్గజ రచయిత ఆరుద్ర సతీమణి కన్నుమూత -
సాహితీవేత్త శివకోటి ఇకలేరు..
ఖమ్మం గాంధీచౌక్: ప్రముఖ సాహితీవేత్త, సుప్రసిద్ధ కథ, నవలా రచయిత చావా శివకోటి (82) ఖమ్మం మామిళ్లగూడెంలోని స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. ముదిగొండ మండలం గోకినపల్లికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజాసమస్యలపై తన కలాన్ని కొరడాగా మార్చి అనేక రచనలు చేశారు. దాశరథి రంగాచార్య సమకాలికుడిగా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్షను తన రచనల ద్వారా ఎలుగెత్తి చాటారు. శివకోటి అంత్యక్రియలను బుధవారం ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. 1940 డిసెంబర్ 14న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శివకోటి ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసి.. రచనలు ప్రారంభించారు. సాహిత్యంపై ఉన్న అభిరుచితో కథలు, కవితలు, కవితా సంపుటిలు, నవలలు రాసిన ఆయన ‘అసురగణం’నవలతో తెలుగు సాహిత్యంలో సంచలనాన్ని సృష్టించారు. ఆ తర్వాత 27 నవలలు రాయగా, ఆనాటి ప్రముఖ వార, మాస ప -
ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (88) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయనను ఫిబ్రవరి 20వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటినుంచి ఆయన పూర్తిస్థాయిలో కోలుకోలేదు. బుధవారం మదీనగూడలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య లక్ష్మీకాంతమ్మ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు శైలజ, ప్రమీల కొంతకాలం క్రితమే మరణించారు. తెలుగు ప్రజలకు ‘ఫ్రాయిడ్’ను, మనోవిజ్ఞాన శాస్త్రాలను అన్నపరెడ్డి పరిచయం చేశారు. బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించిన అరుదైన అనువాదకులుగానూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘మిసిమి’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. 1933 ఫిబ్రవరి 22న గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో అన్నపరెడ్డి జన్మించారు. తూములూరులోనే ఎలిమెంటరీ విద్య, కొల్లిపరలో హైస్కూలు చదువు, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, వాల్తేరు ఆంధ్ర వర్సిటీలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. తెనాలిలో సోషియాలజీ లెక్చరర్‌గా ఆయన చాలా మంది విద్యార్థులను ప్రభావితం చేశారు. బౌద్ధానికి సంబంధించిన అనేక ప్రఖ్యాత గ్రంథాలను అనువదించి తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. 1991లో లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన అనంతరం 30 గ్రంథాలు రచించారు. ‘సిగ్మండ్ ఫ్రాయిడ్’, మానవీయ బుద్ధ, చింతనాగ్ని, కొడిగట్టినవేళ, ఆచార్య నాగార్జునుడు, మేధావుల మెతకలు, బుద్ధదర్శనం (అనువాదం), ‘బుద్ధుని సూత్రసముచ్చయం’ (సుత్తనిపాతానువాదం) వీటిలో ముఖ్యమైనవి. 2000–2002 మధ్యకాలంలో కేంద్ర సాం స్కృతిక శాఖ సీనియర్ ఫెలోషిప్తో ‘తెలుగు సాహిత్యంపై బౌద్దం ప్రభావం’అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన ఫలితంగానే ‘తెలుగులో బౌద్ధం’పుస్తకాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. అన్నపరెడ్డి జరిపిన సాహితీ కృషికి గుర్తింపుగా ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. -
జగద్ధాత్రి నిష్క్రమణం
ఒంటరితనం పెను శత్రువైంది. పీడకలగా పరిణమించింది. పొగలా కమ్ముకుంది. పడగలా, మృత్యునీడలా వెంటాడింది. ఆత్మీయుడి అస్తమయం కారణంగా అంతా శూన్యమైతే.. ఆమె ఒంటరి హృదయం నిండా దిగులు కమ్మేసింది. కన్నీటి సంద్రంలో తానొక ఒంటరి నౌక కాగా.. చేరాల్సిన తీరం దరిదాపుల్లో కానరాకపోగా.. ఎవరి ఆప్త వచనాలూ సహించకపోగా.. చివరికి వ్యథాభరిత హృదయంతో ఆమె మృత్యువు సాహచర్యాన్నే కోరుకుంది. జీవిత పయనంలో ఎంతో ఆత్మీయతను పంచి ఇచ్చిన సన్నిహితుడు, సాహితీవేత్త, సృజనశీలి రామతీర్థ హఠాన్మరణంతో తీవ్ర కుంగుబాటుకు లోనైన రచయిత్రి జగద్ధాత్రి ఇక సెలవంటూ ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఒంటరితనం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు లేఖరాసి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. సాక్షి, విశాఖ సిటీ: సాహిత్యలోకం మరోసారి విషాదంలో మునిగిపోయింది. సాహిత్యలోకానికి చిరపరిచితులైన ప్రముఖ రచయిత, సాహితీవేత్త రామతీర్థ ఆకస్మిక మరణం మరుపులోకి జారకముందే.. మళ్లీ కన్నీటి కెరటాలు ముంచెత్తడంతో చింతాక్రాంతమైంది. రామతీర్థ సన్నిహితురాలు, ఆయన సహచరి జగద్ధాత్రి (55) విషాదకర పరిస్థితుల్లో లోకం విడిచివెళ్లారు. ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతినిధి అయిన జగద్ధాత్రి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకోజీపాలెంలోని ఓ అపార్ట్మెంట్లో ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. రామతీర్థ మరణంతో కొన్ని నెలలుగా తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆమె మానసిక క్షోభతో తనువు చాలించారు. ఒంటరితనం, మనోవేదన కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు జగద్ధాత్రి సూసైడ్ నోట్ రాశారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ నగర పోలీస్ కమిషనర్‌కు మరో నోట్ ద్వారా తెలిపారు. తనకు సంబంధించిన వస్తువులను తనకు చేదోడువాదోడుగా ఉన్న రాజేష్ అనే యువకుడికి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. జగద్ధాత్రి మృతదేహాన్ని గతంలోనే ఆమె కోరిన ప్రకారం ఆంధ్ర మెడికల్ కళాశాల అనాటమీ విభాగానికి విద్యార్థుల ప్రయోగాల నిమిత్తం అప్పగించారు. ఉత్తరాంధ్రలోని పలువురు సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఆమె మృతదేహానికి ఘన నివాళి అర్పించారు. తొలి రచనతోనే ప్రశంసలు.. 1964లో జన్మించిన జగద్ధాత్రి విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఆంధ్ర విశ్వవిదాలయం నుంచి ఏంఎలో బంగారు పతకం సాధించిన ఆమె సాహిత్యంపై అనురక్తితో మొజాయిక్ సాహిత్య సంస్థలో సభ్యురాలిగా చేరారు. బహుభాషల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. తొలి కవితా సంపుటి ‘సహచరణం’తోనే ఆమె సాహితీప్రియుల మన్ననలు పొందారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో సమాంతర అధ్యయనంతో సాహితీ పరిజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్నారు. లెక్చరర్‌గా పనిచేస్తూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేశారు. ఆమె కవిత్వంతో పాటు పలు విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. కావ్యజ్యోతి పేరుతో ఆమె చేసిన అనేక రచనలు ఓ దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమయ్యేవి. రామతీర్థ బాటలోనే ఆమె కూడా సాహితీలోకంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో బాధాకరం.. ఇద్దరు సాహితీమిత్రులను కోల్పోవడం బాధాకరంగా ఉంది.రామతీర్థకు ఆమె ఎప్పుడూ చేదోడువాదోడుగా ఉండేవారు. సాహిత్యంలో ఇద్దరూ ఓ జంటగా మెసలేవారు. రచనాప్రక్రియలో ఒకరికొకరు సహకరించుకునేవారు. ఇప్పుడు ఇద్దరూ లేరన్న విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. -చెన్నా తిరుమలరావు, ఘంటశాల స్పోర్ట్స్, కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి సాహితీ యాత్రికురాలు.. జీవితపు సంచారిణీ దీప శిఖ. సంవాదినీ, సంభాషిణి దీపశిఖగా ఒక దశాబ్దపు నడక జగద్ధాత్రిది. శివమెత్తి ప్రసగించిన, సిరాక్షరాలు ఒలికించి సమీక్షలు చేసిన, కుందనపు బొమ్మలతో కొలువు కట్టిన యాత్రికురాలు ఆమె. జిజ్ఞాసే ఆమె శ్వాస. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, ఒడియా, బెంగాలీ భాషలలో పరిచయంవున్న సాహిత్య శుశ్రూష. -మేడా మస్తాన్ రెడ్డి, సాహిత్యకారుడు బహుభాషా ప్రజ్ఞాశాలి.. ఉభయ రాష్ట్రాలలో మూడు భాషలు (తెలుగు,హిందీ,ఆంగ్లం)లో రచనలు చేయలగ అతికొద్ది మంది మహిళల్లో జగద్ధాత్రి ఒకరు. పెద్ద సదస్సుల్లో కీలకమైన ఉపన్యాసాలు చేయగల దిట్ట.అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి తనువు చాలించడం బాధకరం. -ఫణిశయన సూరి, పరవస్తు పీఠం అధ్యక్షుడు తీరని లోటు.. జగద్ధాత్రి మృతి సాహితీ రంగానికి తీరనిలోటు. సాహితీ రంగానికి ఎనలేని సేవలు అందించిన రామతీర్థకు ఆమె చేదోడుగా ఉండేవారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ కనుమూయడం బాధాకరం. వారిద్దరూ కలసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లేవారు ఆయన మృతి ఆమెను బాగా కుంగదీసింది. ఇటీవల ఆమె ఎక్కడికి వెళ్లినా ఆయన కోసమే అంతా ప్రస్తావించడం ఆమెను మరింతగా కలచివేసింది. -ప్రజాగాయకుడు దేవిశ్రీ -
బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత
సాక్షి, విజయవాడ : ప్రముఖ వాగ్గేయ కారుడు, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు(98) మరి లేరు. ఆదివారం ఉదయం విజయవాడ సీతారామపురంలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. సంగీత, సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రజనీకాంతరావు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చినవారిలో కీలకమైనవారు. ఆకాశవాణి రజనీకాంతరావుగా ఆయన సుప్రసిద్ధులు. రజనీకాంతరావు 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. ఆయన తండ్రి బాలాంత్రపు వేంకటరావు ప్రసిద్ధి చెందిన వేంకట పార్వతీశ కవుల్లో ఒకరు. బాలాంత్రపు 1941లో మద్రాస్ ఆలిండియా రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా చేరి అంచెలంచెలుగా స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 1947 ఆగస్ట్ 15న బాలాంత్రపు స్వయంగా రచించి బాణీలు సమకూర్చిన మోగించు జయభేరి..వాయించు నగారా గీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది. అలా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున రేడియోలో దేశభక్తి గీతం పాడిన ఘనత ఆయనకే దక్కింది. ‘మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే దేశభక్తి గేయాన్ని రచించి బాణీలు సమకూర్చారు. ఆ గీతం తెలుగుజాతికెంతో ఉత్తేజాన్నిచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఘంటసాల, సుశీల, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత ఆయనది. తొలితరం సంగీత దర్శకుల్లో బాలాంత్రపు ఒకరు. లలిత సంగీతం, యక్షగానాలతో రేడియో శ్రోతల అభిమానాన్ని సంపాదించారు. ఆయన భక్తిరంజని, ధర్మసందేహాలు వంటి కార్యక్రమాలతో అందరికీ సుపరిచితులు. చండీదాస్, గ్రీష్మ రుతువు వంటి పలు స్వీయ రచనలు చేశారు. శతపత్ర సుందరి పేరుతో గేయ సంకలన రచన చేశారు. పలు చలనచిత్రాలకు సైతం బాలాంత్రపు సంగీతం అందించారు. ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతిలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది ఆయనే. జేజి మమయ్య పేరుతో చిన్న పిల్లల పాటను ఆకాశవాణిలో బాలాంత్రపు ప్రసారం చేశారు. రజనీకాంతరావు రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1961లో లభించింది. ఇదిగాక కళారత్న అవార్డు, కళాప్రపూర్ణ, ప్రతిభామూర్తి జీవితకాల సాఫల్య బహుమతి, నాథ సుధార్ణవ, పుంభావ సరస్వతి, నవీన వాగ్గేయకార వంటి మరెన్నో పురస్కారాలు కూడా ఆయనకు లభించాయి. 2015లో ఏపీ ప్రభుత్వం ఉగాది సందర్భంగా తెలుగు వెలుగు పురస్కారంతో సత్కరించింది. ఆయనకు ఐదుగురు సంతానం. ఏపీ సీఎం సంతాపం రజనీకాంతరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పలువురి నివాళి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కా రంతోపాటు అనేక పురస్కారాలందుకున్న రజనీకాంతరావు మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని పలువురు సంగీత అభిమానులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, సంగీత ప్రియులు కడసారిగా దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ప్రయాగ వేదవతి, పాండురంగ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ నగరంలోని స్వర్గపురిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం బాలాంత్రపు రజనీకాంతరావు మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య, కళారంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తెలుగుతల్లి ముద్దుబిడ్డల్లో రజనీకాంతరావు అగ్రగణ్యులని వైఎస్ జగన్ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళలను, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లిన రజనీకాంతరావు చిరస్మరణీయులని, ఆయన మరణం సాహిత్య, కళారంగాలకు తీరని లోటని ఆయన అన్నారు. -
ప్రముఖ రచయిత కన్నుమూత
-
రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూత
-
రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
-
రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
హాయ్‌ల్యాండ్ వేదికగా జరిగిన ఖైదీ నెం. 150 ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద కామెంట్లు చేసిన ఇద్దరు ప్రముఖులపై వాళ్ల పేర్లు ప్రశ్నించకుండానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చరణ్ ముఖం మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడంటూ ఒక వ్యక్తి గతంలో కామెంట్ చేశారని ముందుగా అన్నారు. ఆయన తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, గతంలో చిరంజీవి సినిమాలకు కథలు అందించడం, దర్శకత్వం వహించడం కూడా చేశాడని చెప్పారు. వ్యక్తిత్వ వికాస క్లాసులు కూడా చెప్పుకుంటాడని, ఇప్పుడు ఏమీ లేక ఖాళీగా ఉండటం వల్లే ఈ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని చెబుతూ.. అంతా 'వాడు.. వాడు' అని ప్రస్తావించారు. తాను ఎవరి గురించి చెబుతున్నానో వాడొక్కడికీ అర్థమైతే చాలని, ఇక్కడ ఉన్నవాళ్లందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదని తెలిపారు. మరోవ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్‌ను ఒక మాట అంటే మైలేజి పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. -
శంకరంబాడికి పుష్పాంజలి
తిరుపతి కల్చరల్: తెలుగు తల్లి, తెలుగు భాష విశిష్టతను చాటుతూ రాష్ట్ర గేయాన్ని అందించిన గొప్పకవి శంకరంబాడి సుందరాచార్యులకు పలువురు సాహితీ వేత్తలు ఘన నివాళులు అర్పించారు. శంకరంబాడి 103 జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శంకరంబాడి సాహితీ పీఠం ఆధ్వర్యంలో తిరుచానూరు రోడ్డులోని లక్ష్మీపురం సర్కిల్ ఉన్న శంకరంబాడి విగ్రహానికి ప్రముఖ అవధాని మేడసాని మోహన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ‘మా తెలుగుతల్లికి... మల్లెపూదండ...’ గేయాన్ని డాక్టర్ జి.సుహాసిని ఆలపించారు. ఈ సందర్భంగా శంకరంబాడి సాహితీ పీఠం గౌరవాధ్యక్షుడు ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి తిరుపతి నగరంలో జన్మించడం మనందరి అదృష్టమన్నారు. పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి.మస్తానమ్మ మాట్లాడుతూ గొప్ప సాహితీ వ్యక్తులను నేటి తరానికి తెలియజేయడమే పీఠం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమలో పీఠం ప్రధాన కార్యదర్శి దేవరాజులు, సాహితీ వేత్తలు సాకం నాగరాజు డాక్టర్ కె.రెడ్డెప్ప, శ్రీమన్నారాయణ, ఆముదాల మురళి పాల్గొన్నారు. -
బహుదూరపు బాటసారి పద్మరాజు...
రాకోయీ అనుకోని అతిథి... జననీ వరదాయనీ.... ప్రియే చారుశీలే... అతి తక్కువ పాటలతో ఎక్కువమంది సినీ ప్రేక్షకులకి చేరువైన రచయిత పాలగుమ్మి పద్మరాజు. ‘గాలివాన’ కథతో అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుని సాహిత్యంలో సమున్నత గౌరవం పొందిన ఆయన సినీ రంగంలో విశేషకృషి చేశారని చాలా తక్కువ మందికే తెలుసు. నిర్మాత మురారి, దర్శకరత్న దాసరి నారాయణరావులు పద్మరాజును గురువుగా భావించేవారని కూడా చాలా తక్కువమందికే తెలుసు. పద్మరాజుగారి సినిమాల గురించి వారి పెద్ద అమ్మాయి పాలగుమ్మి సీత చెప్పిన వివరాలు... - పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ రచయిత నాన్నగారు తన పంతొమ్మిదో యేట నుంచే రచనలు మొదలుపెట్టారు. మొదట ఛందోబద్ధంగా పద్యాలు రాసి తర్వాత వచనంలోకి వచ్చారు. అందుకు కారణం ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి చేసేటప్పుడు విస్తృతంగా పాశ్చాత్య సాహిత్యం చదవడం కావచ్చు. నాన్నగారికి తెలుగు మీద ఎంత పట్టు ఉందో ఇంగ్లిష్ మీద కూడా అంతే అధికారం ఉంది. అందుకే తాను రాసిన కథానికలను తానే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకునేవారు. ఆ క్రమంలోనే 1958లో అంతర్జాతీయ కథానికల పోటీలో ‘గాలివాన’ కథ రాసి పంపితే బహుమతి వచ్చింది. ఆయన రాసిన కవితలు, పద్యాలు, పాటలు, కథానికలు, నవలలు. రేడియో నాటకాల గురించి అందరికీ తెలిసినా సినిమా రచనల గురించి తెలియదు. నాన్నగారి సినిమా ప్రవేశం కృష్ణశాస్త్రిగారి ద్వారా జరిగింది. అప్పటికే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు సినిమాలకు పాటలు రాస్తున్నారు. బిఎన్‌రెడ్డిగారు సినిమా తీయాలనుకున్న సంగతి తెలిసి నాన్నగారికి కబురు చేస్తే నాన్న మద్రాసు వచ్చారు. కృష్ణశాస్త్రిగారి కుటుంబం, మా కుటుంబం చాలా క్లోజ్. అలా ఆయన ద్వారా ‘బంగారుపాప’ సినిమాకు నాన్న పని చేశారు. అందులో కోటయ్య పాత్ర ఎస్విరంగారావుకు చాలా పేరు వచ్చింది. ‘ఇటువంటి పాత్ర మళ్లీ నాకు దొరకలేదు’ అని ఎన్నోసార్లు చాలామందితో సంబరంగా అనేవారట. ఆ తరవాత ‘రంగులరాట్నం’ చిత్రానికి కథ మాటలు నాన్నగారే రాశారు. కథకు నంది అవార్డు వచ్చింది. అది మామూలు కథే అయినప్పటికే నటుడు చంద్రమోహన్ పాత్రకు ప్రాణం పోసి నిలబెట్టారు. చంద్రమోహన్‌కు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. ఆయన క్యారెక్టర్‌ను నాన్నగారు మా బాబయ్య భానుమూర్తిగారి ప్రభావంతో రాశారని నేననుకుంటాను. మా బాబయ్య అలాగే ఉండేవారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేవారు. ఆయన ప్రేరణగానే ఈ క్యారెక్టర్ని మౌల్డ్ చేసినట్లు అనిపిస్తుంది. భావనారాయణగారు తీసిన ‘గోపాలుడు భూపాలుడు’ జానపద చిత్రానికి కథ, మాటలు నాన్నగారే అందించారు. అలా చాలా జానపద చిత్రాలకు పని చేశారు. మురారిగారి నిర్మాణంలో వచ్చిన ‘సీతామాలక్ష్మి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. మురారిగారు మొదటి నుంచి అన్ని విషయాలలోనూ నాన్నగారి సలహా సూచనలు తీసుకునేవారు. పాటలలో ఎక్కడైనా ఏదైనా పదం నచ్చకపోయినా, పాటలకు ట్యూన్ నచ్చకపోయినా నాన్నగారు బాగాలేదని చెప్పారంటే వెంటనే మురారి గారు ఆ సూచనల ప్రకారం మార్పులు చేయించేవారు. అలా కొందరు పెద్ద రచయితలకు నాన్నగారి మీద కోపం కూడా వచ్చింది. మురారిగారికి నాన్న మాట వేదవాక్కు. ఎవరు పాటలు రాసినా నాన్నగారు ఓకే చేయాల్సిందే. సినిమా అంటే అవగాహన ఉన్న వ్యక్తి నాన్నగారు. మొత్తం 24 క్రాఫ్ట్స్ నాన్నకు పరిచయమే. పాటలు, మాటలు, కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం,.. అన్ని శాఖలలోనూ పనిచేశారు. దేవుడిచ్చిన భర్త, బికారి రాముడు... చిత్రాలకు దర్శకత్వం చేశారు. ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఉండాల్సిందే. తేడా వస్తే సర్దుకునేవారు కాదు. మొత్తం 30కి పైగా సినిమాలకు పని చేశారు. ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు. సినిమాల ఎడిటింగ్‌లో కూర్చునేవారు. ప్రాసెసింగ్ నేర్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ దాకా అన్నీ చూసి నేర్చుకున్నారు. శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ సినిమాకు పాటలు రాయడానికి కృష్ణశాస్త్రి గారు రావడం కొంచెం ఆలస్యం కావడంతో నాన్నగారితో ఒక పాట రాయించారు, అదే ‘రాకోయీ అనకోని అతిథి’ .అంతకుముందే ‘భక్తప్రహ్లాద’ చిత్రానికి ‘జననీ వర దాయనీ భవానీ’ అనే గీతం కూడా రచించారు. దాసరిగారితో చాలా సినిమాలు చేశారు. అక్కడ అందరికీ ఒక మాస్టర్లా ఉండేవారు. ఇప్పటికీ దాసరిగారు నాన్నగారి గురించి మాట్లాడాలంటే ‘మాగురువుగారు’ అంటారు. వారిద్దరిదీ 30 సంవత్సరాల సినిమా అనుబంధం. దాసరిగారు ముందుగా నాన్నగారి దగ్గర రైటర్‌గా జాయిన్ అయ్యారు. ఆ తరవాత భీమ్‌సింగ్ గారి దగ్గర నాన్నగారే పెట్టారు. తాత మనవడు సినిమా దగ్గర నుంచి నాన్న పోయేవరకు దాదాపు ఆయన తీసిన ప్రతి చిత్రానికీ నాన్నగారే అడ్వయిజర్‌గా ఉన్నారు. మా రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవి. దాసరి పద్మగారిని నేను పద్మక్క అని పిలిచేదాన్ని.. మా నాన్నగారిని ఆవిడ ‘నాన్నగారూ’ అని పిలిచేవారు. దాసరిగారు ఒకేసారి నాలుగైదు సినిమాలు తీయడం వల్ల నాన్నగారి సలహాలను ఎక్కువగా అడిగేవారు. నాన్న సలహాలను ఆయప తప్పక పాటించేవారు. నాన్నగారి మాటను గౌరవించేవారు. నాన్నగారు కన్నడంలో రాసిన ‘హాలు-జేను’ అనే సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పుడు ఇచ్చిన మొమెంటోలు అక్కడే వదిలి వచ్చారు. అవి తెచ్చుకోవాలి, ప్రదర్శించుకోవాలనే స్వభావం ఆయనకు లేదు. నాన్నగారు ఏ సినిమా చూసినా వచ్చాక, ఆ సినిమా గురించి మాతో డిస్కస్ చేసేవారు. సఫైర్ థియేటర్లో వచ్చిన సినిమాలన్నీ చూశాం. సినిమా చూడటం కంటె ఆయనతో డిస్కస్ చేయడం మాకు సరదాగా ఉండేది. నాన్నగారు కొత్త స్క్రిప్ట్ రాశాక చదివి వినిపించేవారు. అది కూడా ఇంటరెస్టింగ్‌గా చదివేవారు. ఆయన చదువుతుంటే సినిమా కళ్లకు కట్టినట్లు కనిపించేది. ముగింపు దాసరిగారి ‘బహుదూరపు బాటసారి’ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒకనాడు నాన్నగారు ఆలిండియా రేడియో కార్యక్రమాలకు జూరీగా ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. ప్రయాణానికి ముందు ఆ రాత్రి దాసరిగారి ఇంటికి వెళ్లి ‘నారాయణరావూ! నేను వెళ్లిపోతున్నాను’ అన్నారట. అదే ఆయన ఆఖరిమాట. దైవికంగా జరిగిందో, ఎలా జరిగిందోగాని ఆ రోజే నాన్న మళ్లీ తిరిగిరాని బహుదూరాలకు బాటసారిగా వెళ్లిపోయారు. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై రోజుకో ఉత్తరం రాసేవారు... నాన్నగారు భాషను ప్రేమించేవారు, గౌరవించేవారు. ఆయనకు విలక్షణమైన వ్యక్తుల మీద ఆకర్షణ ఉండేది. ఒక పిక్ పాకెటర్ ఏ విధంగా దొంగతనం చేస్తాడో కూడా రచయితకు తెలిసి ఉండాలి అనేవారు. ఆయనకు టైలరింగ్ అంటే ఆసక్తి. మా బట్టలన్నీ కుట్టేవారు. ఎక్కడైనా తేడా వస్తే విప్పి మళ్లీ అందంగా సరిచేసేవారు. మా కోసం డ్రస్ డిజై నింగ్ బుక్స్ కొనేవారు. అలాగే ట్రావెల్ అంటే చాలా ఇష్టం. యూరప్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు రోజుకో పోస్ట్ కార్డు రాసేవారు అక్కడి ప్రాంతాల గురించి. పిల్లలు ముగ్గు వేస్తుంటే దీక్షగా చూసేవారు. భోజనం ఎంజాయ్ చేస్తూ తినేవారు. కొత్త టెక్నాలజీ నేర్చుకునేవారు. పుస్తకాలు ఎక్కువ కొనమనేవారు. అందుకే మా దగ్గర పుస్తకాలే ఎక్కువుంటాయి బట్టల కంటె. ఎంతో ఎక్కువ చదివి అతి తక్కువ రచనలు చేసినది నాన్నగారే. చదివేటప్పుడు ఏది అడిగినా తెలియదు అని చెప్పేవారు కాదు. క్షుణ్ణంగా వివరించేవారు. - పాలగుమ్మి సీత, పద్మరాజు గారి పెద్దమ్మాయి -
ప్రముఖ రచయిత ఎన్.కె.రామారావు కన్నుమూత
నల్లగొండ కల్చరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ రచయిత ఎన్.కె.రామారావు (78) గురువారం మృతిచెందారు. ఇటీవల సూర్యాపేటలో బస్సు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వి షయం తెలిసిందే. ఈయన తెలుగు,ఆంగ్ల, హిం దీ సాహిత్యంలో ప్రావిణ్యుడు. ప్రముఖ సినీ నిర్మాత దర్శకులు బాపు, రచయిత రమణ, సాహితీ దిగ్గజాలైన శ్రీశ్రీరమణ,రావిశాస్త్రి, సినీగాయకులు బాలసుబ్రమణ్యం, కాంతారావులతో సంబంధాలు కొనసాగించారు. బొంబాయికి ప్రత్యేకంగా వెళ్లి హిందీ సినీప్రముఖులు రాజ్‌కపూర్, షమ్మీకపూర్ల ఇంటర్వ్యూలతో వ్యాసాలు ప్రచురించారు. జిల్లా కోర్టులో సూపరింటెండెంట్‌గా పనిచేసిన రామారావుకు న్యాయశాస్త్రంపై పట్టున్న వ్యక్తిగా ప్రఖ్యాతి సంపాదించారు. ఇక సాహిత్యసేవా కార్యక్రమాలలో, జిల్లా సాహితీ ప్ర ముఖులు కాంచనపల్లి చిన వెంకటరామారావు 1967 స్థాపించిన యువ రచయితల సమితిలో సభ్యులుగా ఉండి తన కథా రచనలకు శ్రీకారం చుట్టారు. 1983లో జిల్లా రచయితల సంఘం మహాసభలకు శ్రీశ్రీని తీసుకుని వచ్చిన ఘనత వీరిదే. 1972లో బాపువేసిన ముఖ చిత్రంతో ‘‘విద్యుల్లత’’ కథల సంపుటిని ప్రచురించారు. బాపు ముఖచిత్రంతో మరోకథల సంపుటి ‘‘మా మిలట్రీ బాబాయి’’ త్వరలో రాబోతుంది కూడా. ప్రస్తుతం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడిగా యువ రచయితల సంఘానికి డెరైక్టర్‌గా ఉన్నారు. పలువురి సంతాపం జిల్లాలోని సాహితీ ప్రియులు, కళాకారులు ఎన్.కె.రామారావు మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశా రు. డాక్టర్లు నోముల సత్యనారాయణ, బెల్లి యాదయ్య, బోయ జంగయ్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎలికట్టె శంకర్రావు, ఎంఎల్. నర్సింహారావు, డాక్టర్ పురుషోత్తమాచారి, డాక్టర్ లేఖానందస్వామి, కొండకింది చిన వెంకట్‌రెడ్డి, పున్న అంజయ్య, ఫొటోగ్రాఫర్ శ్యాం సుందర్, చకిలం వేణుగోపాలరావు, సంధ్యారాణి తదితరులు సంతాపం తెలిపారు. -
చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్
ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. రెహాన్, అమోఘ్ దేశపతి, శ్వేతా జాదవ్ ఇందులో ముఖ్యతారలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించాం’’ అని చెప్పారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తమకు మంచి బ్రేక్ ఇస్తుందని రెహన్, శ్వేతా జాదవ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, మాటలు: రమేశ్‌రెడ్డి పూనూరు, సుకుమారన్.