బహుదూరపు బాటసారి పద్మరాజు... | palagummi padmaraju batasari story | Sakshi
Sakshi News home page

బహుదూరపు బాటసారి పద్మరాజు...

Published Sun, Jun 28 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

బహుదూరపు బాటసారి పద్మరాజు...

బహుదూరపు బాటసారి పద్మరాజు...

రాకోయీ అనుకోని అతిథి... జననీ వరదాయనీ.... ప్రియే చారుశీలే... అతి తక్కువ పాటలతో ఎక్కువమంది సినీ ప్రేక్షకులకి చేరువైన రచయిత పాలగుమ్మి పద్మరాజు. ‘గాలివాన’ కథతో అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుని సాహిత్యంలో సమున్నత గౌరవం పొందిన ఆయన సినీ రంగంలో విశేషకృషి చేశారని చాలా తక్కువ మందికే తెలుసు. నిర్మాత మురారి, దర్శకరత్న దాసరి నారాయణరావులు పద్మరాజును గురువుగా భావించేవారని కూడా చాలా తక్కువమందికే తెలుసు.

పద్మరాజుగారి సినిమాల గురించి వారి పెద్ద అమ్మాయి పాలగుమ్మి సీత చెప్పిన వివరాలు...


- పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ రచయిత
నాన్నగారు తన పంతొమ్మిదో యేట నుంచే రచనలు మొదలుపెట్టారు. మొదట ఛందోబద్ధంగా పద్యాలు రాసి తర్వాత వచనంలోకి వచ్చారు. అందుకు కారణం ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సి చేసేటప్పుడు విస్తృతంగా పాశ్చాత్య సాహిత్యం చదవడం కావచ్చు.
 
నాన్నగారికి తెలుగు మీద ఎంత పట్టు ఉందో ఇంగ్లిష్ మీద కూడా అంతే అధికారం ఉంది. అందుకే తాను రాసిన కథానికలను తానే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకునేవారు. ఆ క్రమంలోనే 1958లో అంతర్జాతీయ కథానికల పోటీలో ‘గాలివాన’ కథ రాసి పంపితే బహుమతి వచ్చింది. ఆయన రాసిన కవితలు, పద్యాలు, పాటలు, కథానికలు, నవలలు. రేడియో నాటకాల గురించి అందరికీ తెలిసినా సినిమా రచనల గురించి తెలియదు. నాన్నగారి సినిమా ప్రవేశం కృష్ణశాస్త్రిగారి ద్వారా జరిగింది.
 
అప్పటికే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు సినిమాలకు పాటలు రాస్తున్నారు. బిఎన్‌రెడ్డిగారు సినిమా తీయాలనుకున్న సంగతి తెలిసి నాన్నగారికి కబురు చేస్తే నాన్న మద్రాసు వచ్చారు.  కృష్ణశాస్త్రిగారి కుటుంబం, మా కుటుంబం చాలా క్లోజ్. అలా ఆయన ద్వారా ‘బంగారుపాప’ సినిమాకు నాన్న పని చేశారు. అందులో కోటయ్య పాత్ర  ఎస్‌విరంగారావుకు చాలా పేరు వచ్చింది. ‘ఇటువంటి పాత్ర మళ్లీ నాకు దొరకలేదు’ అని ఎన్నోసార్లు చాలామందితో సంబరంగా అనేవారట. ఆ తరవాత ‘రంగులరాట్నం’ చిత్రానికి కథ మాటలు నాన్నగారే రాశారు.

కథకు నంది అవార్డు వచ్చింది. అది మామూలు కథే అయినప్పటికే నటుడు చంద్రమోహన్ పాత్రకు ప్రాణం పోసి నిలబెట్టారు. చంద్రమోహన్‌కు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. ఆయన క్యారెక్టర్‌ను నాన్నగారు మా బాబయ్య భానుమూర్తిగారి ప్రభావంతో రాశారని నేననుకుంటాను. మా బాబయ్య అలాగే ఉండేవారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేవారు. ఆయన ప్రేరణగానే ఈ క్యారెక్టర్‌ని మౌల్డ్ చేసినట్లు అనిపిస్తుంది.
 
భావనారాయణగారు తీసిన ‘గోపాలుడు భూపాలుడు’ జానపద చిత్రానికి కథ, మాటలు నాన్నగారే అందించారు. అలా చాలా జానపద చిత్రాలకు పని చేశారు. మురారిగారి నిర్మాణంలో వచ్చిన ‘సీతామాలక్ష్మి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. మురారిగారు మొదటి నుంచి అన్ని విషయాలలోనూ నాన్నగారి సలహా సూచనలు తీసుకునేవారు.

పాటలలో ఎక్కడైనా ఏదైనా పదం నచ్చకపోయినా, పాటలకు ట్యూన్ నచ్చకపోయినా నాన్నగారు బాగాలేదని చెప్పారంటే వెంటనే మురారి గారు ఆ సూచనల ప్రకారం మార్పులు చేయించేవారు. అలా కొందరు పెద్ద రచయితలకు నాన్నగారి మీద కోపం కూడా వచ్చింది. మురారిగారికి నాన్న మాట వేదవాక్కు. ఎవరు పాటలు రాసినా నాన్నగారు ఓకే చేయాల్సిందే.
 
సినిమా అంటే అవగాహన ఉన్న వ్యక్తి నాన్నగారు. మొత్తం 24 క్రాఫ్ట్స్ నాన్నకు పరిచయమే. పాటలు, మాటలు, కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం,.. అన్ని శాఖలలోనూ పనిచేశారు. దేవుడిచ్చిన భర్త, బికారి రాముడు... చిత్రాలకు దర్శకత్వం చేశారు. ఏ పని చేసినా పర్‌ఫెక్షన్ ఉండాల్సిందే. తేడా వస్తే సర్దుకునేవారు కాదు. మొత్తం 30కి పైగా సినిమాలకు పని చేశారు. ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు. సినిమాల ఎడిటింగ్‌లో కూర్చునేవారు.

ప్రాసెసింగ్  నేర్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ దాకా అన్నీ చూసి నేర్చుకున్నారు. శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ సినిమాకు పాటలు రాయడానికి కృష్ణశాస్త్రి గారు రావడం కొంచెం ఆలస్యం కావడంతో నాన్నగారితో ఒక పాట రాయించారు, అదే ‘రాకోయీ అనకోని అతిథి’ .అంతకుముందే ‘భక్తప్రహ్లాద’ చిత్రానికి ‘జననీ వర దాయనీ భవానీ’ అనే గీతం కూడా రచించారు.
 
దాసరిగారితో చాలా సినిమాలు చేశారు. అక్కడ అందరికీ ఒక మాస్టర్‌లా ఉండేవారు. ఇప్పటికీ దాసరిగారు నాన్నగారి గురించి మాట్లాడాలంటే ‘మాగురువుగారు’ అంటారు. వారిద్దరిదీ 30 సంవత్సరాల సినిమా అనుబంధం. దాసరిగారు ముందుగా నాన్నగారి దగ్గర రైటర్‌గా జాయిన్ అయ్యారు. ఆ తరవాత భీమ్‌సింగ్ గారి దగ్గర నాన్నగారే పెట్టారు. తాత మనవడు సినిమా దగ్గర నుంచి నాన్న పోయేవరకు దాదాపు ఆయన తీసిన ప్రతి చిత్రానికీ నాన్నగారే అడ్వయిజర్‌గా ఉన్నారు. మా రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవి.

దాసరి పద్మగారిని నేను పద్మక్క అని పిలిచేదాన్ని.. మా నాన్నగారిని ఆవిడ ‘నాన్నగారూ’ అని పిలిచేవారు. దాసరిగారు ఒకేసారి నాలుగైదు సినిమాలు తీయడం వల్ల నాన్నగారి సలహాలను ఎక్కువగా అడిగేవారు. నాన్న సలహాలను ఆయప తప్పక పాటించేవారు. నాన్నగారి మాటను గౌరవించేవారు. నాన్నగారు కన్నడంలో రాసిన ‘హాలు-జేను’ అనే సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పుడు ఇచ్చిన మొమెంటోలు అక్కడే వదిలి వచ్చారు. అవి తెచ్చుకోవాలి, ప్రదర్శించుకోవాలనే స్వభావం ఆయనకు లేదు.

నాన్నగారు ఏ సినిమా చూసినా వచ్చాక, ఆ సినిమా గురించి మాతో డిస్కస్ చేసేవారు. సఫైర్ థియేటర్‌లో వచ్చిన సినిమాలన్నీ చూశాం. సినిమా చూడటం కంటె ఆయనతో డిస్కస్ చేయడం మాకు సరదాగా ఉండేది. నాన్నగారు కొత్త స్క్రిప్ట్ రాశాక చదివి వినిపించేవారు. అది కూడా ఇంటరెస్టింగ్‌గా చదివేవారు. ఆయన చదువుతుంటే సినిమా కళ్లకు కట్టినట్లు కనిపించేది.
 
ముగింపు
దాసరిగారి ‘బహుదూరపు బాటసారి’ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒకనాడు నాన్నగారు ఆలిండియా రేడియో కార్యక్రమాలకు జూరీగా ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. ప్రయాణానికి ముందు ఆ రాత్రి దాసరిగారి ఇంటికి వెళ్లి ‘నారాయణరావూ! నేను వెళ్లిపోతున్నాను’ అన్నారట. అదే ఆయన ఆఖరిమాట. దైవికంగా జరిగిందో, ఎలా జరిగిందోగాని ఆ రోజే నాన్న మళ్లీ తిరిగిరాని బహుదూరాలకు బాటసారిగా వెళ్లిపోయారు.
- సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
 
రోజుకో ఉత్తరం రాసేవారు...
నాన్నగారు భాషను ప్రేమించేవారు, గౌరవించేవారు. ఆయనకు విలక్షణమైన వ్యక్తుల మీద ఆకర్షణ ఉండేది. ఒక పిక్ పాకెటర్ ఏ విధంగా దొంగతనం చేస్తాడో కూడా రచయితకు తెలిసి ఉండాలి అనేవారు. ఆయనకు టైలరింగ్ అంటే ఆసక్తి. మా బట్టలన్నీ కుట్టేవారు. ఎక్కడైనా తేడా వస్తే విప్పి మళ్లీ అందంగా సరిచేసేవారు. మా కోసం డ్రస్ డిజై నింగ్ బుక్స్ కొనేవారు. అలాగే ట్రావెల్ అంటే చాలా ఇష్టం.

యూరప్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు రోజుకో పోస్ట్ కార్డు రాసేవారు అక్కడి ప్రాంతాల గురించి.  పిల్లలు ముగ్గు వేస్తుంటే దీక్షగా చూసేవారు. భోజనం ఎంజాయ్ చేస్తూ తినేవారు. కొత్త టెక్నాలజీ నేర్చుకునేవారు. పుస్తకాలు ఎక్కువ కొనమనేవారు. అందుకే మా దగ్గర పుస్తకాలే ఎక్కువుంటాయి బట్టల కంటె. ఎంతో ఎక్కువ చదివి అతి తక్కువ రచనలు చేసినది నాన్నగారే.  చదివేటప్పుడు ఏది అడిగినా తెలియదు అని చెప్పేవారు కాదు. క్షుణ్ణంగా వివరించేవారు.
 - పాలగుమ్మి సీత, పద్మరాజు గారి పెద్దమ్మాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement