palagummi padmaraju
-
దారితప్పిన బస్సు
రామలింగం మేష్టారికి తన సొంత పిల్లల్నే అదుపులో పెట్టడం చేతకాదు ఆయన ఖర్మానికి పాతికమంది కోతి మూకని ఎక్స్కర్షన్ తీసికెళ్ళవలిసిన పని పడింది. ఈ కుర్ర కుంకల్ని హంపీ తీసుకుపోవాలట. అక్కడి శిథిలాలు చూసి, గతించిన విజయనగర సామ్రాజ్యం తాలూకు గొప్పతనం అవగాహన చేసుకుంటారట. చరిత్ర అంతా స్పష్టంగా రాసి ఉంది. చదువుకుని ఏడవకూడదూ? ఏవిటో రకరకాల కొత్త సిద్ధాంతాలొచ్చి పడ్డాయి. ఏమయితేనేం, ఈ అధికమాసపు తద్దినం తనకి తప్పలేదు. ఉదయం ఎనిమిందిటికి బుల్లిపాలెం నించి బయలుదేరవలసిన టూరిస్టు బస్సు స్కూలు దగ్గరకు వచ్చేసరికి పదిన్నరయింది. రామలింగం మేస్టారు సీట్లో వెనక్కి జేర్లబడి కళ్ళు మూశారు. నలభై ఏభై మంది సంతగోల చేస్తున్న క్లాసులోనే గుర్రుపెట్టి నిద్రపోగల యోగసాధన ఆయనకుంది. కిటికీలోంచి చల్లని కొండగాలి వీస్తోంది. మేస్టారు నిద్రపోయారు. బస్సు ఆగిన కుదుపుకి మేస్టారు ముందుకు పడబోయి మేలుకుని నిలదొక్కుకున్నారు. పిల్లలు బిలబిల గంతులేస్తూ దిగిపోయారు. వంటవాడు జంబుఖానాలు దారి పక్కన పచ్చిక మీద పరిచాడు. రామలింగం మేస్టారికి ఒకటే కంగారు, ఈ కొండదారుల్లో ఎక్కడ ఎవరు తప్పిపోతారో, ఎవరు పారిపోతారోనని, దిగే పిల్లల్ని తిరిగి లెక్క పెట్టారు మేస్టారు. కిష్టప్ప ఒక కొండ కొమ్మ మీదికి ఎక్కుతుంటే, సుబ్బిగాడు, వెంకటం, గౌరి వెంటపడుతున్నారు. మేస్టారు అరిచారు అలాంటి కోతిపనులు చెయ్యొద్దని. ఈ కిష్టప్పగాడు కోతిమూకకి లీడరు కూడా. వాణ్ని ఓ కంట కనిపెట్టి చూడకపోతే, కొంప మునుగుతుంది. మేస్టారు రవంత ఈతిబాధ తీర్చుకోడానికి ఒక బండరాతి పక్కకి వెళ్ళి తిరిగొచ్చేసరికి, కిష్టప్ప మరో నలుగురు గల్లంతు. వెతగ్గా వెతగ్గా, వాళ్లు ఒక కొండవాల్లో ఉన్న చెట్టెక్కి సీతాఫలాలు కోస్తున్నారు. వాళ్ళని నాలుగు తిట్టి బెదిరించి, బస్సులో ఎక్కించేసరికి గంటన్నర పట్టింది. బస్సు కదిలింది. కిష్టప్ప సందేహాం! సీతాఫలాలు వర్షాకాలంలోనూ, మామిడి కాయలు వేసవిలోనూ ఎందుకు కాస్తాయి, అని. తనకి మాత్రం ఏం తెలుసు? అయినా తెలీదంటే మేస్టారి మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. అందుకని, దేవుడు అలా ఏర్పాటు చేశాడని పోటీలేని సమాధానం చెప్పారు. ఈ కుర్రాళ్ళందరికీ అనుమానాలు అంటువ్యాధిలా పుట్టుకొస్తాయి. వరసగా అడగడం మొదలుపెట్టారు. ఇంత ఎత్తు కొండ మీద నీళ్ళు ఉండవుగదా మొక్క లెలా మొలుస్తున్నాయని ఒకడు. వర్షాలు కురుస్తాయిగా అని మేస్టారి సమాధానం. కురిస్తే అవన్నీ కొండ కిందికి పారి వెళ్ళిపోతాయి గదండి? అని ఇంకొకడి ఎదురుప్రశ్న. కిట్టప్ప కొంటెగా, దేవుడు కింది నించి వాటికి నీళ్ళు ఏర్పాటు చేస్తాడని జవాబు చెప్పాడు. డ్రైవరు రేడియో మోగించాడు. సినిమా పాట లొస్తున్నాయి. వాటి వ్యామోహంలో పడి పిల్లలు ఆయన్ని మరిచిపోయారు. ఆయన వాళ్ళనీ మరిచిపోయి, హాయిగా గుర్రు నిద్రలో మునిగిపోయాడు. ఆ నిద్రలో ఓ కల. చటుక్కున బస్సు తేనెపట్టులా మారిపోయింది. పిల్లలంతా తేనెటీగలు. అందులో గౌరి రాణి ఈగ. తను మాత్రం చెట్టు మీద నిలబడిపోయాడు. ఇన్ని తేనెటీగల్ని ఎలా పట్టడం? తేనెపట్టు చిటారు కొమ్మన ఉంది. పిల్లలంతా ఇలా అయిపోయారంటే, బుల్లిపాలెం ఊరంతా కలిసి తన్ను కొరత వేస్తారు. తేనెటీగల్ని బతిమాలాడు–తేనెపట్టు కిందికి దింపి దాన్ని మళ్లీ బస్సుగా మార్చేయమని, తమందరు తిరిగి పిల్లలుగా మారిపొమ్మని. పెద్ద తీనెటీగ కిష్టప్పగాడి మొహంతో తన చుట్టూ నవ్వుతూ ఎగిరింది. చెయ్యి విసిరారు, కొట్టబోయారు, పట్టుకోబోయారు. చురుక్కున ఒక పోటు పొడిచి కిష్టప్పగాడు ఎగిరిపోయాడు. కోపం వచ్చింది మేస్టారికి. ధైర్యం చేసి చెట్టెక్కారు చిటారు కొమ్మదాకా. చెయ్యి జాపారు పట్టు అందుకోడానికి. అంతే పిల్లతేనెటీగలన్నీ ఒక్క పెట్టున చేతిచుట్టూ మూగి కుట్టడం మొదలెట్టాయి. ‘అబ్బ’ అనుకుంటూ చెయ్యి వెనక్కి లాక్కున్నారు. పట్టు తప్పింది. కింద పడిపోతున్నారు, కొన్ని వందల అడుగులు. తేనెటీగలు మాత్రం కుడుతూనే ఉన్నాయి చేతిని. ‘కెవ్వు’మని అరుస్తూ లేచారు రామలింగం మేస్టారు. తను బస్సులోనే ఉన్నాడు. పక్క కిటికీలోంచి సన్నజల్లు చురుకు చురుకుమని చేతి మీద పడుతోంది. మేస్టారు పక్క కిటికీ అద్దం దింపేశాడు. అప్పుడాయనకి అర్థమైంది, చీకటి పడుతోందని, అవతల గాలీ, సన్న జల్లూ ప్రారంభమైందని. రోడ్డు చూస్తే ఆయనకి అనుమానం వచ్చింది, ‘తారురోడ్డులా లేదే’ అన్నారాయన. ‘అడ్డుదారి’ అన్నాడు డ్రైవరు. ‘‘ఎక్కడి కెడుతుందీ అడ్డుదారి?’’ ‘‘మళ్లా ధర్మారం మేన్ రోడ్డులో కలుస్తాదంట, 12 మైళ్ళు కలిసొత్తాదంట’’ ఏడు గంటలకి ధర్మారం చేరాల్సింది. టైం చూస్తే పావు తక్కువ ఏడు. రోడ్డు మరింత అధ్వాన్నంగా ఉంది. కొండదారి..మలుపులు బస్సుదీపాల వెలుగులో అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి. బస్సు పరుగెత్తడం లేదు. పాకుతోంది. ఎనిమిదయింది. అప్పటికీ మెయిన్‌రోడ్డు రాలేదు సరిగదా, పల్లె కూడా తగల్లేదు. వాన జోరు హెచ్చింది. ‘‘ఏం దారయ్య ఇది. నీ మొహం అడ్డుదారి’’ అన్నారు మేస్టారు. ‘‘దారి తప్పినట్టున్నామండి. ఆ మడిసి సెప్పిన ఊరేదీ తగల్లేదు’’ అన్నాడు వంటవాడు. ‘‘బస్సు వెనక్కి తిప్పు. నీ మొహం లాగుంది, నీ అడ్డదార్లూ నువ్వూ’’ ‘‘బస్సు తిరగదండి, ఓ పక్క కొండ, ఓ పక్క ఎయ్యి అడుగుల లోయ’’ అన్నాడు డ్రైవరు. రామలింగం మేస్టారికి ఓ పక్క కోపం, రెండో పక్క భయం. ఇంతమంది పిల్లలతో ఈ బస్సు సురక్షితంగా మనుషులుండే చోటికి చేరితే చాలునని వెయ్యి దేవుళ్లకు మొక్కుకున్నారు. తొమ్మిదింబావు. బస్సు రెండుసార్లు గుంజి ఆగిపోయింది. మేస్టారి పై ప్రాణాలు పైకి పోయాయి. ఇప్పుడేవిటి గతి? డ్రైవర బోనెట్ ఎత్తి బాటరీలైట్ల సహాయంతో ఇంజిన్ చూస్తున్నాడు. నిద్ర పోతున్న పిల్లలంతా మేలుకున్నారు. పిల్లల్లో పిరికివాళ్ళు ఏదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్టు వొణికిపోతున్నారు. కిష్టప్ప, సుబ్బు బస్సు దిగారు. వాళ్ళు కొండ మీదికి ఎక్కుతుంటే ఆయన గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ‘‘మేస్టారూ’ అదిగో ఏదో దీపం. పెద్ద ఇల్లులా ఉంది’’ అని అరిచాడు కిష్టప్ప. బిలబిల పిల్లలంతా దిగారు, ‘‘మేస్టారు! ఈ మలుపు తిరిగితే ఏదో ఇల్లుందండి. దీపం ఉంది లోపల’’ అన్నాడు కిష్టప్ప. ‘‘బస్సు కేమయింది?’’ అని అడిగారు మేస్టారు. ‘‘డెల్కోలోకి నీల్లెల్లిపోయాయ్. ఈ వోనలో కదల్దు’’ అన్నాడు డ్రైవర్. మేస్టారి అనుమతి కోసం చూడకుండా కిష్టప్ప బాటరీలైట్ల సహాయంతో మిగతా పిల్లలకి దారి చూపిస్తూ నడిచాడు. అదృష్టవశాత్తు వానజోరు కొంత తగ్గింది. విరిగి తప్పుపట్టిపోయిన గేటు తోస్తే కిర్రుమంటూ తెరుచుకుంది. దారంటూ లేదు. పాచి పట్టిన రాతి మెట్లెక్కి తలుపు తట్టాడు. మేస్టారికి ఇంత వాన కురిసినా మెత్తబడని ఎండు పచ్చిక విచిత్రంగా తోచింది. బాటరీ లైటు వేసి చూశారు–రంగు పచ్చగానే ఉంది! తలుపు బాదగా బాదగా తెరుచుకుంది. వయసు చెప్పడానికి వీల్లేని ఒక వ్యక్తి చేత్తో హరికెన్ లాంతరు పట్టుకుని గుమ్మంలో నిలబడ్డాడు. ‘‘మా బస్సు దారి తప్పింది. ఈ పక్క సందులో ఆగిపోయింది. బాగు అయేదాకా మేం ఇక్కడ ఉండొచ్చా?’’ అని అడిగాడు కిష్టప్ప. వ్యక్తి సమాధానం చెప్పలేదు సరిగదా, గుమ్మంలోంచి తప్పుకోలేదు. ‘‘తమరు కాస్త అనుగ్రహించాలి. పిల్లలు, బయట వాన’’ అన్నారు మేస్టారు. అప్పటికీ ఆ వ్యక్తి తప్పుకోలేదు. కిష్టప్ప ధైర్యం చేసి, అతని పక్క నించి లోపలికి జారాడు. ఇంక మర్యాద కాదన్నట్టు ఆ వ్యక్తి పక్కకి నిలబడ్డాడు. పిల్లలంతా ధైర్యం చేసి లోపలికొచ్చారు. ఆ వెనక మేస్టారూ వచ్చారు. ‘‘మూగతనేమో పాపం’’ అన్నాడు కిష్టప్ప. వ్యక్తి అతని వంక చూశాడు. పిల్లలు రవంత బెదిరి కిష్టప్ప వెనక చేరారు. ‘‘ఇదే ఊరు?’’ అని అడిగాడు మేస్టారు. వ్యక్తి కళ్ళప్పగించి అరగంట చూసినట్టు చూశాడు ఆయన వంక. కిష్టప్ప చెప్పినట్టు అతడు నిజంగా మూగవాడేమోనన్న అనుమానం మేస్టారికి ధ్రువపడుతుండగా, అతడు నోరు తెరిచాడు. ‘‘దుగ్గన్న సత్రం’’ అన్నాడా వ్యక్తి. మేస్టారు ఆత్రంగా ఎన్నో ప్రశ్నలడిగారు, ఈ కొండదారి ఎక్కడికి పోతుంది? దగ్గర ఉన్న పట్నం ఏది? ఎంత దూరం? దేనికి ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు. హరికేన్ లాంతరు చేతపట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. లాంతరు గుమ్మంలో పెట్టి తన మంచం మీద పడుకున్నాడు. సరే ఈమాత్రమయినా ఆశ్రయం దొరికినందుకు సంతోషించారు మేస్టారూ పిల్లలూ. బుల్లిపాలెంలో తయారుచేసి తీసుకొచ్చిన సాంబరు అన్నం పిన్నలూ పెద్దలూ అందరూ తిన్నారు. నీళ్ళు ఎక్కడున్నాయని కిష్టప్ప వెళ్ళి ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి లేచి వచ్చి లాంతరు తీసుకుని దారి చూపించాడు. అది పెద్దభవంతి. ఎన్నో గదులున్నాయి. అన్నీ బూజు పట్టి దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఎంతో దూరం నడిచాక, వెనక పక్క వరండాలోకి వచ్చారు ఆ పిల్లలూ ఆ వ్యక్తీ. అక్కడొక పెద్ద నీళ్ళకుండీ ఉంది. అవి మంచినీళ్లేనని నిర్ధారణ చేసుకుని పిల్లలంతా చేతులు కడుక్కొని నీళ్ళు తాగారు. వ్యక్తి ఈసారి గదిలోకి పోకుండా గొడవారని ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ‘‘బాబాయి’’ అన్నాడు కిష్టప్ప. ఆ పిలుపుతో ఆ వ్యక్తి కొంత మెత్తబడ్డాడు. అతని ముభావం సడలింది. కిష్టప్పా మేస్టారూ ఈ ఇంటిని గురించీ దీని ఒంటరితనాన్ని గురించీ ప్రశ్నలు వేశారు. అతను అతి క్లుప్తంగా దీని కథ చెప్పాడు. రెండు వందల ఏభై ఏళ్ళ క్రితం దుగ్గన్న సేనాని బీజాపూర్ నవాబు కింద సేనాపతిగా ఉండేవాడు. అతని పెళ్ళాం చాలా అందగత్తె. అతన్ని యుద్ధభూమికి పంపి, అతని భార్యని చెరపట్టాడు. విజయం సాధించి తిరిగివచ్చిన దుగ్గన సేనానికి ఈ సంగతి తెలిసింది. సైన్యంలో అతనికి చాలా పలుకుబడి ఉండేది. కొందరు నమ్మిన అనుచరులతో నవాబు జనానాలో ప్రవేశించి తన భార్యను బలత్కారం చెయ్యబోతున్న నవాబుని నరికేసి, తను రాజయ్యాడు. ఇది అప్పుడు బీజపూరికి రహదారి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ సత్రం కట్టించాడు. దీని వెనక చాలా అందమైన పూలతోట వేయించాడు. ఆరోజుల్లో ఎంతో కలకల్లాడుతూ ఉండేది ఈ సత్రం. ఇంతలో తెల్లవాళ్ళు ఈ ప్రాంతం క్రమంగా ఆక్రమించడం మొదలు పెట్టారు. దుగ్గన్న సేనాని మాత్రం ఎంతో ధైర్యంతో ప్రతిఘటించాడు. కాని అతని భార్య, బావమరుదులు, ఎలాగా ఓడిపోతామన్న భయంతో తెల్లవాళ్ళతో కుట్ర పన్నారు. అది తెలిసిన దుగ్గన్న భార్యనీ బావమరుదుల్ని చంపేసి, ఈ సత్రంలోకి పారిపోయి వచ్చేశాడు. వెనక తోటలో ఒక చిన్న ఇల్లుంది. ఆ ఇంట్లో దాక్కున్నాడు. ఇక్కడున్న ఆయన నమ్మినబంటు, తెల్లసైన్యాలు సత్రాన్ని చుట్టుముట్టడం చూసి, తోటలో చిన్న ఇంటికి బయట తాళం వేసి, దుగ్గన్న సేనాని అక్కడలేడన్నాడు. తెల్లవాళ్ళు అతన్ని బంధించి పట్టుకుపోయారు. సేనాని ఆ ఇంట్లోంచి బయటపడే దారి లేక, కొన్నిరోజులు ఆకలిదప్పులతో బాధపడి, చచ్చిపోయాడు. ఇప్పుడు దెయ్యమై ఆ తోటలోనూ ఇంట్లోనూ తిరుగుతుంటాడు. దుగ్గన్న దెయ్యం మహా భయంకరమైంది. రకరకాల ఆకారాలు ధరించి, రాత్రిపూట ఆ తోటలో అడుగు పెట్టిన మనుషుల్ని భయపెట్టి చంపుతుంటుంది. ఇరవై ఏళ్ళక్రితం ఒక కలెక్టర్‌గారు ఇలాంటి రాత్రే ఈ సత్రంలో మకాం పెట్టి, ఈ కథంతా విని దెయ్యాలంటే తనకి నమ్మకం లేదని, ఆ తోటలోకి వెళ్ళాడు. తెల్లారేసరికి ఆయన శవం కింద లోయలో ఉంది. ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. సగంమంది పైగా పిల్లలకి, మేస్టారికీ భయంతో వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ‘‘ఈ భవనంలోకి కూడా వొస్తుందా ఆ దెయ్యం?’’ అని అడిగారు మేస్టారు. రాదన్నట్టు తల ఊపాడు ఆ వ్యక్తి. ‘‘వెనకాల మంచి పూలతోట ఇంకా ఉందే’’ అని అడిగాడు కిష్టప్ప. ‘‘అది తోట కాదు, రెండు వందల ఏళ్ళనించీ ఆ మొక్కలకీ పూలతీగెలకీ ఎదుగూ బొదుగూ లేదు. ఆ దెయ్యం స్పర్శకి అవన్నీ రాళ్లుగా మారిపోతుంటాయి. రాత్రి గుడ్డి వెలుగులో అవన్నీ పూలమొక్కల్లాగ కనిపిస్తాయి. పగలు చూద్దురుగాని, అన్నీ రాళ్ళు’’ అన్నాడు వ్యక్తి. ‘‘అదంతా కట్టుకథ, ఎవడో మహాశిల్పి ఆ మొక్కలూ లతలూ అతి సున్నితంగా చెక్కి ఉంటాడు’’ అన్నారు రామలింగం మేస్టారు. ‘‘అవి మహాశిల్పాలు కావు, రాళ్ళయి పోయిన పూలమొక్కలు. అవి తాకితే తెలుస్తుంది. చెయ్యి కూడా గడ్డ కట్టుకుపోతుంది’’ అన్నాడు వ్యక్తి. రామలింగం మేస్టారికి ఈ కథలన్నీ నమ్మాలని లేదు. కాని తను నమ్మడం లేదని ఆ దెయ్యానికి తెలిస్తే, తన మీద విజృంభిస్తుందేమోనని భయం. ఎందుకైనా మంచిదని, సింహద్వారం తెరిచే ఉంచి, పారిపోవడానికి వీలుగా గుమ్మం దగ్గర పక్కపరుచుకున్నారాయన. కుర్రవాళ్ళందరినీ తెల్లవారకుండానే లేవాలని హెచ్చరించి, ఆయన నడుం వాల్చారు. పిల్లలంతా పడుకున్నారు. ఆ వ్యక్తి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు–క్రమంగా అందరికీ నిద్ర పట్టింది. కాని కిష్టప్పకు మాత్రం ఆ కథే బుర్రలో తిరుగుతోంది. ఆ దెయ్యాన్ని చూడాలని గట్టి కోరిక. రవంత భయం కూడా. కాని కుతూహలం. ఆ మొక్కలన్నీ నిజంగా రాళ్ళయిపోయినవేనా? ఇంతలో సన్నగా ఏ పక్క నించో విచిత్రమైన ధ్వని వచ్చింది. చెవులు నిక్కించి విన్నాడు. ఈ లోకంలో విన్నచప్పుడులా లేదు. ఆవు అరుపు సింహం గర్జన కాకుండా రెండూ కలిసినట్లుంది ఆ ధ్వని. మెల్లిగా లేచాడు. అతని వెనక సుబ్బు, వెంకటం, గౌరి కూడా లేచారు. వాళ్ళూ నిద్ర పోలేదు అతనిలాగే–నలుగురూ పిల్లుల్లాగ బాటరీ లైట్ల సహాయంతో వెనక వరండా చేరుకున్నారు. చూశారు. వందగజాల అవతల మరో ఆవరణ ఉంది. రాళ్ళతో కట్టిన ప్రహరీ ఉంది దానికి. అదే రాతి మొక్కల తోటై ఉంటుంది. నలుగురూ ధైర్యం చేసి ఆ వైపు నడిచారు. గేటు లేదు, కాని ఆ చోట కంప అడ్డంగా ఉంది. అది మెల్లిగా తొలిగించారు. వాళ్ళు ఆ తోటలో అడుగు పెట్టడంతోటే, విచిత్రమైన వెలుగు, వెన్నెలకాని వెన్నెలలాంటిది తోటంతా ఆవరించింది, ఎవరో స్విచ్చి నొక్కినట్టు. ఆ వెలుగులో తోట ఎంతో అందంగా ఉంది. లతల కొసల్లో పువ్వులు ఎవరో శిల్పి తీర్చిదిద్దినట్లున్నాయి. రవంతా గాలి వీస్తున్నా, లతలు మాత్రం ఊగడం లేదు. ఒక చెట్టు మీద పిట్ట కూడా కూచ్చుని ఉంది. కిష్టప్ప దాని మీదికి రాయి విసిరాడు, గురి చూసి. తగిలింది. కాని పిట్ట ఎగిరిపోలేదు. రాయి రాతికి తగిలిన చప్పుడు మాత్రం వినిపించింది. ధైర్యం చేసి కిష్టప్ప ఒక పువ్వు కొయ్యబోయాడు. గట్టిగా రాయిలా తగిలింది చేతికి! మంచుకున్న తీవ్రమైన చల్లదనం అతని శరీరంలోకి విద్యుత్తులా ప్రవహించింది. చట్టుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని రెండో చేత్తో వేడి పుట్టేదాకా రాసుకున్నాడు–మిగతా ముగ్గరూ బిత్తరపోయి చూశారు–ఇంతలో పెద్ద వింత శబ్దం. చటుక్కున అందరూ అటు చూశారు. పెద్ద బస్సు అంత ఆకారం ఏదో తమవంక వస్తోంది. సింహం నోట్లో సగం ఆవు. ఆవు ముందు కాళ్ళు గాలిలో గిలగిల కొట్టుకుంటున్నాయి. పెద్ద గుహలాగుంది ఆవు నోరు. నలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులు దాని వంటి మీద మారిపోతున్నాయి. గుహలోంచి వచ్చినట్టు పెద్ద గంభీరమైన గొంతు. ‘‘కుర్రకుంకల్లారా! మా తోటలో అడుగు పెట్టడానికి మీకు ఎన్ని గుండెలున్నాయి’’ అంటూ ఆ ఆకారం వాళ్ళ మీదికి ఉవ్వెత్తున వచ్చిపడింది. నలుగురూ ఒకరికొకరు గట్టిగా పట్టుకు నిలబడ్డారు. పారిపోవడానికి కాళ్ళు రాలేదు వాళ్ళకి. ఆ ఆకారం వాళ్ళని దూసుకుని తుపానుగాలిలా వెళ్ళిపోయింది. కిష్టప్పటికి భయం పోయింది. దెయ్యమంటే వట్టిగాలి, గాలి తమని ఏంచెయ్యగలదు? భయపెడుతుంది. అంతే. కాని సుబ్బు, వెంకటం, గౌరి తోట అవతలికి పారిపోయారు. కాని కిష్టప్ప రావడం లేదని చూసి ఆగిపోయారు. కిష్టప్ప తోటంతా పరీక్షగా చూడ్డం మొదలు పెట్టాడు. చాలా పెద్ద తోట. ఎన్నో రకాల మొక్కలుండేవి, ఇప్పుడన్నీ రాళ్ళయిపోయాయి. చిన్న ఇల్లు, దాని మీద ఒక పెద్ద నీళ్ళకుండీ, ఆ నీళ్ళ కుండీలోంచి ఇందాకా కురిసిన వాననీళ్ళు ధారగా కిందికి కారుతున్నాయి. ఆ నీళ్ళు చక్కగా రాళ్ళతో కట్టిన బోదుల ద్వారా మొక్కల్లోకి పారుతున్నాయి. అన్ని మొక్కలకీ చుట్టూ పాదులు చేసి ఉన్నాయి. నీళ్ళు ఆ పాదుల్లో నిండి పొర్లి మరో బోదిలో పడుతున్నాయి. ఆ బోది నీళ్ళను మరో మొక్కకి మర్లిస్తోంది. చాలా బాగా కట్టిన బోదులు. ఇంతలో దుగ్గన్న దెయ్యానికి మళ్ళీ కోపం వచ్చింది. ఇంత సాహసించిన కుర్రకుంకని బెదిరించి రాయిగా మార్చెయ్యాలని తీర్మానించుకుంది. కిష్టప్ప తన మీదికి వస్తున్న దెయ్యం వంక చూశాడు. దెయ్యం ఈసారి పెద్ద రైలు ఇంజను అవతారం దాల్చింది. దానికి ఎర్రటి మంటలు పొగలు కక్కుతున్న నోరుంది. ఆ నోరు తెరుచుకుని ఇంజన్ అతని మీదికి వచ్చింది. అతనప్పుడు ఒక బండరాయి మీద ఎక్కి ఉన్నాడు ఇంజను మీదికి వచ్చిపడుతుంటే, అతను వెనక పక్కకి దూకి నేల మీద పడుకున్నాడు. ఇంజను రాయికి తగిలి రెండుగా చీలి, రెండు బండరాళ్లకు ఢీకొని, చప్పగా రంగులు మారుతూ నేలమట్టం అయిపోయింది. కొంతసేపు కదల్లేదు. కిష్టప్ప మళ్ళీ సురక్షితంగా లేవడం చూసి, మిగతా ముగ్గురూ ధైర్యం చేసి లోపలికొచ్చారు. మెల్లగా దెయ్యం పడి పోయిన చోటికి వచ్చారు–దెయ్యం మెల్లగా మనిషి ఆకారం దాలుస్తోంది. బిత్తరపోయి చూశారు నలుగురూ. దెయ్యం మనిషిగా మారింది. అయినా పూర్తిగా కాదు–గాజులాంటి దూదితో చేసినట్టుంది ఆకారం. తలవంచుకుని, రాతికి జేర్లబడి కిందికి చూస్తూ కూచుంది దెయ్యం. ఔనన్నట్టు తల ఊపింది. బాధగా నిట్టూర్చింది. ‘‘ఎందుకండీ ఏదో బాధపడుతున్నట్టున్నారు?’’ అని అడిగాడు కిష్టప్ప. ‘‘నా పరువంత నువ్వు మంట కలిపేశావురా కుర్రకుంకా! రెండువందల ఏళ్ళుగా ఎందరు మహావీరుల్ని హడల గొట్టేశాను! వేలెడు లేవు. నా భయంకరాలకు తట్టుకుని ధైర్యంగా నిలబడ్డావు. ఇంకేముంది? నన్ను చూసి మనిషన్నవాడు ఎందుకు భయపడతాడు? ఇంత గొప్ప దెయ్యమై లాభం ఏముంది?’’ కిష్టప్పకి జాలి వేసింది. ‘‘సార్! అసలు మీరు మనుషుల్ని ఎందుకు భయపెట్టాలి?’’ ‘‘మరింక దెయ్యం కావడం ఎందుకు? అయి ప్రయోజనం ఏమిటి? పైగా మనుషులు నన్ను చూసి భయపడి ప్రాణాలు విడుస్తుంటే నాకెంతో సరదాగా తృప్తిగా ఉండేది. అది కూడా లేకపోతే ఇంకా దెయ్యంగా ఎలా బతికేది? నాకింక రాత్రుల్ళు ఎలా గడుస్తాయి?’’ ‘‘మనుషుల్లా మీరు కూడా హాయిగా మెత్తని పరుపు మీద వెచ్చగా పడుకుని నిద్రపోకూడదు?’’ ‘‘నిద్రా? దెయ్యానికా?’’ దెయ్యం బరువుగా నవ్వింది. తరువాత మెల్లగా అంది– ‘‘నాకు వెచ్చని పరుపు ఏదో తెలుసా? ఊరి బయట, ఏటి ఒడ్డున, కట్టెలు పేర్చి నాకు పరుపే ఏర్పాటయి ఉంది. నేను పడుకున్నాక అది అంటించాలి. ఆ వెచ్చని మంటల దుప్పటి కప్పుకుని నేను శాశ్వతంగా నిద్ర పోవాలి. అంత వరకు నిద్ర లేదు, మెలకువ లేదు. నేను బ్రతికీ లేను, చచ్చీ లేను. చావు బతుకుల మధ్య ఇలా ఊగులాడుతూ శాశ్వతంగాగా ఉండిపోవలసిందే, నాకీ స్థితి నించి విడుదల లేదు?’’ కిష్టప్ప మిత్రులకీ కళ్ల నీళ్ళు తిరిగాయి–గౌరి అంది–‘‘తాతగారూ! మేం కట్టెలు పేర్చి మీకు పరుపు ఏర్పాటు చేస్తామండి’’ దెయ్యం ముఖంలో రవంత ఆశ, వెంటనే నిరాశ, మీవల్ల కాదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు, కిష్టప్ప అడిగాడు ‘‘సార్! మీరు బతికున్నప్పుడే చాలామందిని చంపేశారట. మరి పాపం కాదండీ!’’ ‘‘పాపం! మీరు అమాయకులు. పాపం అనే మాటే మీకు తెలుసు. అర్థం తెలియదు. అందుకే నన్ను చూసి మీరు భయపడలేదు. మీ మనసుల్లో పాపం ఉంటే, మీ పెద్దల్లాగే మీరూ నన్ను చూసి హడలి చచ్చిపోయి ఉందురు. రెండువందల ఏళ్ళుగా లోకాన్ని చూస్తున్నాను, అంతకంతకూ పాపం పేరుకుని లోకంలో గడ్డ కట్టుకుపోతోంది. స్వార్థం, దుర్మార్గం, క్రౌర్యం, ఇవే లోకాన్ని నడిపిస్తున్నాయి. మంచితనాన్ని చంపెయ్యడం మనిషి లక్ష్యం. నేను చాలా ఘోరాలు చేశాను, నా మీదా ఎందరో ఎన్నో ఘోరాలు చేశారు. ఒక మనిషినిహత్య చేస్తే హంతకుడికి ఉరిక్ష వేస్తారు లేదా యావజ్జీవ కారాగారం వేస్తారు. అదయినా ఏ పది పదిహేనేనేళ్లో. ఆ తరువాత హంతకుడు హాయిగా చనిపోతాడు. నేనో, చావూ కాని, బ్రతుకూ కాని, ఈ దెయ్యం రూపంలో రెండు వందల ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్నాను. ఇంకా ఎన్ని వందల ఏళ్ళు నేనిలా గడపాలో. ఈ ఒంటరితం ఎలా భరించేది? అందుకే ఈ తోటని దెయ్యపుతోటగా మార్చేశాను, కసిదొద్దీ. ఈ మొక్కలకు చావూ లేదూ బ్రతుకూ లేదు. ఈ తోటలో ఉన్న పువ్వులకీ పిట్టలకీ కూడా అదే గతి. నేను వాయురూపంలో ఉన్న దెయ్యాన్ని, అవి ఘనరూపంలో దెయ్యాలు. నా తోడు కోసం తాకినదంతా దెయ్యంగా మార్చెయ్యాలని నా కోరిక. వీలయితే ఈ స్వార్థపరుల లోకాన్నంతా దెయ్యపు లోకంగా మార్చెయ్యాలని. ఈ క్షణం వరకూ ఈ లోకంలో మంచితనం, ధైర్యం, అమాయకత్వం ఉన్నాయని నేననుకోలేదు. ఉన్నాయని మీ ద్వారా నా కర్థమయింది...ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా ఈ స్థితి నుంచి బయటపడాలి? ఎలా శాశ్వత నిద్రలో మునిగిపోవాలి? మిమ్మల్ని చూశాక, లోకాన్ని మీ కోసమన్నా మిగల్చాలనిపిస్తోంది. నేను చచ్చిన దెయ్యాన్ని. మీ లోకంలో బతికున్న దెయ్యాలున్నాయి. పెరిగి పెద్దవాళ్లై మీరూ ఆ దెయ్యాల్లో ఒకరై పోతారని నా భయం. మీ అమాయకత్వం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని మీరు మార్చెయ్యాలని మంచితనానికి స్థావరంగా చెయ్యాలనీ నా కోరిక. ఏది నిజమౌతుంతో నాకు తెలియదు. అందుకే నాకేం పాలు పోవడం లేదు. గౌరి కిదంతా అర్థం కాకపోయినా దెయ్యంతాత ఎందుకో చాలా బాధపడుతున్నాడని గ్రహించింది. ‘‘తాతా! నీకు పరుపు మేం ఏర్పాటు చేస్తాం. ఈ తోటని మాత్రం మూములుగా చెయ్యి. వెనకటిలాగా పూలతో పిట్టలతో ఉంటే ఎంతో బాగుంటుంది. రా తాతా! నా చెయ్యి పట్టుకో. ఈ తోటలో కట్టెలు లేవు. అవతల నీకు కట్టెలతో పరుపు వేసి వెచ్చగా అంటిస్తాం. రా తాతా! రా మరి!’’ దెయ్యం కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పసిపాప చెయ్యి పట్టుకుంది. నడవడం మొదలు పెట్టింది. ఈలోగా నిద్రపోతున్న పిల్లలంతా ఒకరొకరే లేచి వచ్చారు. తోట ఆవరణకి అవతల కట్టెలతో చితి పేర్చారు. కిష్టప్ప లాంతరు పట్టుకొచ్చాడు. గౌరి అలిసిపోయిన దెయ్యం తాతని చితి మీద పడుకోబెట్టారు. కిష్టప్ప లాంతరు చిమ్నీ తీసి చితి అంటించాడు. వెచ్చని మంటల్లో సగం మగత నిద్రలోకి పోతున్న దుగ్గన్న సేనాని దెయ్యం అంది– ‘‘నా చేతులతో ఆనాడు వేసిన తోట నేనే దెయ్యపుతోటగా మార్చేశాను. నేనింక విముక్తి పొందుతున్నాను. నాతో పాటు ఈ తోట విముక్తి పొందుతుంది. నేను శాశ్వత నిద్రలో చావును చేరుకుంటాను. ఈ రాతి మొక్కలు, లతలు, పువ్వులు, పిట్టలు బ్రతుకును చేరుకుంటాయి. కలకల్లాడుతూ వెనకటిలాగ అయిపోతుంది తోట. కానీ...స్వార్థం ఏమాత్రం మమస్సులో ఉన్నవాళ్లకయినా ఇది రాతితోటే. అమాయకులైన పిల్లలకే ఇది సజీవంగా కనిపిస్తుంది. మీలాంటి పిల్లలే...రాతితోటలాంటి లోకానికి తిరిగి ప్రాణం పొయ్యాలి’’ దుగ్గన్న సేనాని దెయ్యం మంటల్లో వెలుగుగా మారిపోయింది. తోటంతా పిట్టలు కిలకిలమంటూ ఎగురుతున్నాయి. పువ్వులు కలకల్లాడుతున్నాయి, అనేక రంగులతో. పిల్లలు ఆనందంగా ఆ తోటమధ్య గంతులేస్తూ తిరుగుతున్నారు. కాని– వాళ్లని వెతకడానికి వచ్చిన రామలింగం మేస్టారికీ, డ్రైవరుకీ, వంటవాడికీ రాతి మొక్కలే, రాతిపువ్వులే, రాతి పిట్టలే కనిపించాయి. విరిగి తప్పుపట్టిపోయిన గేటు తోస్తే కిర్రుమంటూ తెరుచుకుంది. దారంటూ లేదు. పాచి పట్టిన రాతి మెట్లెక్కి తలుపు తట్టాడు. మేస్టారికి ఇంత వాన కురిసినా మెత్తబడని ఎండు పచ్చిక విచిత్రంగా తోచింది. కిష్టప్ప తన మీదికి వస్తున్న దెయ్యం వంక చూశాడు. దెయ్యం ఈసారి పెద్ద రైలు ఇంజను అవతారం దాల్చింది. దానికి ఎర్రటి మంటలు పొగలు కక్కుతున్న నోరుంది. ఆ నోరు తెరుచుకుని ఇంజన్ అతని మీదికి వచ్చింది. దెయ్యం కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పసిపాప చెయ్యి పట్టుకుంది. నడవడం మొదలు పెట్టింది. ఈలోగా నిద్రపోతున్న పిల్లలంతా ఒకరొకరే లేచి వచ్చారు. ∙పాలగుమ్మి పద్మరాజు -
శుభం శుభమే
ఈవేళో రేపో కాలవ తెరుస్తారు. తవ్వు ఇంకా పూర్తికాలేదు. కంట్రాక్టరు కోప్పడతాడు. ఇంకా చిన్న గుంట దగ్గర ఓ వంద గజాల మేర కాలవ తవ్వి గట్టు బాగు చెయ్యాలి. దొరికినంతమంది కూలీలను రాత్రికి రాత్రి పోగుచేశాను. పనికాకపోతే కాంట్రాక్టు డబ్బు ప్రభుత్వం వారు ఇవ్వరు. ఎండిన కాలవ నీటికోసం దాహంగా ఉంది. ఇరుగట్లనీ పరువుకొచ్చిన మామిడికాయలు గుత్తులుగా వేళ్లాడుతున్నాయి. అప్పుడే తెల్లవారినా, రాబోయే గాడుపు వేడిగా సూచనగా తగులుతోనే ఉంది. కాలవ మధ్యన నీటిచెలమలో తప్ప కనుచూపు మేరలో నీరు లేదు. నేను గట్టు మీద కూర్చుని నీరసంగా కూలివాళ్లని హెచ్చరిస్తున్నాను. ఎంత తొందరపెట్టినా మెల్లగానే పారలు వేసి తవ్వుతున్నారు. ఆడకూలీలు మెల్లగా తట్టలు నెత్తిమీద ఎత్తుకుని గట్టు తెగిపోయిన చోట పోస్తున్నారు. కూలివాళ్ల నల్లటి దేహాల మీద చెమట నిగనిగ మెరుస్తోంది. వాళ్ల కండలకి ఆ తడి ఓ వింతమెరుపు నిచ్చింది. ఆడ మగ మెల్లగా కబుర్లు చెప్పుకుంటో పని చేస్తున్నారు. బొద్దుమీసాల పెద్దవాడు అందరిలోకి సోమరిపోతు. అతని పేరు సత్తిరెడ్డి. కాని తెలివయిన వాడు. అతని కబుర్లలో పడి అంతా పని మరచిపోతారు. పావుగంట కొకసారి గునపం పాతుతుంటాడు. కాని బలమయినవాడు. పద్దెనిమిదేళ్ల పిల్ల అతను తవ్విన మట్టిబెడ్డలు తట్టలో వేసుకుంది. ఒక క్షణం అతని మాటలు వింటో నవ్వింది. తట్ట ఎత్తుకు వెళ్లిపోయింది. ఆమె పేరు రత్తి. తరవాత ముప్ఫయియేళ్ల పడుచు వచ్చింది. ఆమె పేరు చెల్లమ్మ. ‘‘యెయ్యి పిల్లా! సూడకు’’ అన్నాడు మీసాల పెద్ద. ‘‘నువ్వు పాడు’’ అంది ఆమె. పొద్దు ముదురుతోంది. కూలివాళ్ల సంభాషణ రోదలాగ వినబడుతోంది. రత్తి కిచకిచ నవ్వుతోంది. ఆమె మొగుడు కుర్రతనపు గర్వంతో తవ్వుతున్నాడు. బూతుపాటలు పాడుతున్నాడు. అతన్ని ముసలయ్య అంటారు. ఏభయి ఏళ్ల గడ్డపు ముసిలి పద్దాలు వాళ్ల ఊళ్లో మావుళ్లమ్మ మహత్తు వర్ణిస్తున్నాడు. ఎండ ముదురుతోంది. నేను కాలవగట్టు మీద నించి లేచి పక్కనే ఉన్న కరణంగారి ఇంటి అరుగు మీద కూర్చున్నాను. తాటాకు చూరు కింద పెద్ద వరికంకెల గుత్తి వేళ్లాడుతోంది. పిచికలు పక్కని ఏటవాలుగా వాలి గింజలు తింటున్నాయి. అరుగు ముందు చింతచెట్టు కింద ఆవు సగంనిద్రతో నిలబడి ఉంది. ముసిలి పద్దాలు చెపుతున్నాడు. ‘‘సంబరం నాడు పోతుని బలేత్తారు. ఒక్క యేటకి తల తెగిపోవాల. తప్పితే గండమన్నమాట. నెత్తురంతా పెద్ద మూకుళ్లో పడతారు.’’ పని అంతకంతకి వడి తగ్గింది. పొద్దు నడినెత్తికి ఎక్కుతోంది. ఊళ్లో జనసంచారం లేదు. కాకులు దాహంగా చెట్టుమీది నుంచి చెట్టుమీదికి ఎగురుతున్నాయి. చివరాకి మీసాలవాడు గునపం పాతి మళ్లీ పైకి ఎత్తలేదు. అంతా పని ఆపారు. గట్టు సగం అయింది. సత్తిరెడ్డి కాలవ దగ్గర ఒళ్లు కడుక్కుంటున్నాడు. రత్తి దగ్గరికి వెళ్లి నీళ్లిమ్మంది. అతను చేదతో నీళ్లు తీసి ఆమె ముఖం మీదికి చిమ్మాడు. ‘‘సచ్చినోడా’’ అంది రత్తి సరదాగా. రత్తి మొగుడు ముసలయ్య గుర్రుగా చూశాడు. సత్తిరెడ్డి నోట్లో నీళ్లు పోసుకున్నాడు. ‘‘థూ! ఉప్పనీల్లేసే’’ అని చీదరించుకున్నాడు. అంతా కాలవలో ఉన్న చెలమ దగ్గరికి పరుగెత్తారు. ఒక గిన్నెలోనే రత్తీ, (ముసలయ్యా) తినడం మొదలుపెట్టారు. ఉప్పువేసిన గంజీ అన్నం, కక్కముక్కలు కొరుక్కుంటున్నారు. సత్తిరెడ్డి తన మూటలో ఉన్న ఊరగాయ అందరికీ కొంత కొంత పంచాడు. ఎక్కువభాగం రత్తికిచ్చాడు. చెల్లమ్మ సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వింది. ముసలయ్య చెల్లమ్మ వేపు చూసి రత్తివేపు అనుమానంగా చూశాడు. లోకమంతా ఏదో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్టుగా దీనంగా ఉంది. నేను అరుగు మీద చాపమీద వెన్నువాల్చి ఏమీ చూడకుండా చూస్తున్నాను. కూలివాళ్లు తిని గిన్నెలు మెల్లగా కడుక్కున్నారు. ఆ గిన్నెలతోనే నీళ్లు సంతృప్తిగా తాగారు. చింతచెట్టు మొదట్లో చుట్టూ కూర్చున్నారు. తలగుడ్డల్లోంచీ, రొంటినించీ పొగాకు తీసి, కొంచెం నీళ్లతో తడిపి చుట్టలు చుట్టుకున్నారు. పొద్దు తిరిగింది. కంగారుగా లేచి వాళ్లని హెచ్చరించాను. తొందరలేని స్థిమితంతో మెల్లగా లేచారు. తలపాగలు చుట్టుకున్నారు. నేలమీద తట్టలు ఎడమకాలితో లేవతన్ని ఎడమచేత్తో వంగకుండా పట్టుకున్నారు. తొందరలేని వేగంతో తవ్వు మళ్లీ ప్రారంభమయింది. మట్టిలో ఇసక పాలుంది. అంచేత పారలతో తవ్వవలసి వస్తోంది. సత్తిరెడ్డి గునపం పారేసి, తట్టల్లోకి పారలతో తవ్విపోస్తున్నాడు. తట్ట కాలితో వొడుపుగా రత్తి తన్ని పెట్టింది. యధాలాపంగా ఒక పార మట్టి రత్తి కాలి మీదకి సత్తిరెడ్డి విసిరాడు. తట్ట తన్నేసి చీదరగా కాళ్లు దులుపుకుంది. ముసలయ్య ఆవేపొక సారి చూశాడు. పొద్దు వాలుతోంది. వాళ్ల తత్వాలని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్లు చెయ్యాలంటే చేస్తారు. మనం తొందరపెట్టినా వాళ్లు తొందరపడరు. వాళ్లకి కాలం, తొందర అనేవి లేవు. అయినా వాళ్లకొక అంచనా ఉంది. పని అయిపోతుందని వాళ్లకి తెలుసు. అయిపోతుంది కూడాను. కాని వాళ్లు మన చేతులో లేరు. మన అవసరాలన్నీ వాళ్ల చేతుల్లో కట్టుబడి ఉన్నాయి. వాళ్లకి మనం బానిసలం. వాళ్ల యెడల మన అంచనాలు పని చెయ్యవు. చటుక్కుని ముసలయ్య తట్ట కుడిచేత్తో ఎత్తి రాక్షసిలాగ రత్తిమీద పడ్డాడు. తట్టతో నెత్తిమీద మోదాడు. చేతులతో కాసుకుంది. అంతా పని ఆపి ముసలయ్యని పట్టుకున్నారు. కోపంతో వణికిపోతూ అన్నాడు, ‘‘సరసాలాడతంది నెంజ’’. ‘‘నేదండి బాబో! నేదండి’’ అని దీనంగా కంగారుగా సగం ఏడుస్తోంది రత్తి. ‘‘తోలు వొలిచేత్తాను’’ ముసలయ్య మళ్లీ విజృంభించబోయాడు. సత్తిరెడ్డి బలంగా అతన్ని పట్టుకున్నాడు. ‘‘ఏటబ్బా ఆ యిసురు? కూంత పరాసకాలాడితేనే అంత కోపమా? పారుచ్చుకో. పారుచ్చుకో. సందలడిపోతంది. రండల్లా రండి.’’ అంతా మళ్లీ పని ప్రారంభించారు. నా గుండెల్లో అదుటు పోలేదు. ఆమెను తరవాత ముసలయ్య ఏం చేస్తాడో. గట్టు పూర్తి అయేసరికి పొద్దు కుంకింది. వెన్నెల కూడా వేడిగా వ్యాపిస్తోంది. గిన్నెల్లో మిగిలిన అన్నాలు మళ్లీ వాళ్లంతా తిన్నారు. నేను అనుమానంగా రత్తి వేపు చూస్తున్నాను. కూలీల్లో ఒకడు వచ్చి కొంతడబ్బు కావాలన్నాడు. అనుమానిస్తూ ఇచ్చాను. కరణం గారింట్లో భోజనం చేసి నేను వారిచ్చిన మంచం ఒకటి అరుగు పక్కని ఖాళీస్థలంలో వాల్చాను. గాలి కొంత చల్లబడుతోంది. కూలీలంతా ఎక్కడికో పోయారు. ముసలయ్య రత్తి ఎల్లాగ సమాధానపడతారో నని ఆందోళనగా పడుకున్నాను. ముసలయ్య ముఖంలో నాగరికతకు లొంగని పశుత్వం అప్పుడు చూశాను. రత్తిలో అసహాయమయిన దైన్యం చూశాను. కూలీలు గొడవగా వచ్చారు. తాగి వచ్చారని గ్రహించాను. గట్టు మీద అల్లరి చిల్లరగా పడిపోయారు. ముసలయ్య తప్ప తాగాడు. రత్తీ బాగా తాగింది. ముసలయ్య పాట ప్రారంభించాడు. సింత కొమ్మల మీద సిరిబొమ్మ ఆడింది పుంతలో ముసలమ్మ పురిటి కెల్లిందే ‘‘పురిటి కెల్లిందే’’ అంతా అందుకున్నారు. ఎవరికొచ్చింది వాళ్లు పాడారు. క్రమంగా గొంతుకలు సన్నగిల్లాయి. పాటలు ఆగిపోయాయి. నాకు మసగ్గా నిద్ర పడుతోంది. చటుక్కున రెండు స్వరూపాలు ఏవో నడిచినట్టయింది. కళ్లు విప్పి కదలకుండా చూశాను. రెండు మూర్తులు ఒకళ్ల మీద ఒకళ్లు తూలుతూ నడుస్తున్నాయి. రత్తి. ముసలయ్య. ముసలయ్య రహస్యంగా అన్నాడు. ‘‘ఈ యరుగు మీద తొంగుందామే’’ ‘‘ఈ యెన్నిట్లోనే?’’ ‘‘నడేశే’’ ఆమె నడుము పట్టుకున్నాడు. ఆమె తన్మయంగా అతని మీదికి వంగింది. నేను మేలుకున్నాను. కాని కదలకుండా పడుకున్నాను. అతని ఈర్ష్య, కోపం, అంతా ఏమయింది? నాకా ప్రశ్న అర్థం కాలేదు కాని, నా మనస్సులో అనంతమయిన సంతృప్తి, ప్రశాంతి నిండుకున్నాయి. లోకం ఉండవలసినట్టుగానే ఉంది! నడవవలసినట్టుగానే నడుస్తోంది. నా కర్థం కాకపోతే మట్టుకు నష్టమేముంది? నాకు క్రమంగా నిద్ర పట్టింది. ఏదో కలకలంతో మెలకువ వచ్చింది. కళ్లు నులుపుకుంటూ లేచి కూర్చున్నాను. కూలీలు హడావుడాగా తట్టలూ పారలూ గట్టుని పడేస్తున్నారు. కాలవలో అడుగుని సన్నగా నీటితడి ఆనింది. మనస్సు నిండిపోయినట్టయింది. చంద్రుడప్పుడే అస్తమించాడు. కూలీలు మళ్లీ నిద్రలో మునిగిపోయారు. అరుగుమీద చీకట్లో ఏమీ కనబడలేదు. కాని నాకు మాత్రం నిద్ర పట్టలేదు. నేను మేలుకున్నాను. కాని కదలకుండా పడుకున్నాను. అతని ఈర్ష్య, కోపం, అంతా ఏమయింది? నాకా ప్రశ్న అర్థం కాలేదు కాని, నా మనస్సులో అనంతమయిన సంతృప్తి, ప్రశాంతి నిండుకున్నాయి. పాలగుమ్మి పద్మరాజు (1915–1983) కథ ‘కూలిజనం’ సంక్షిప్త రూపం ఇది. దీని తొలి ప్రచురణ 1944లో ఆంధ్రపత్రికలో. సౌజన్యం: కథానిలయం. గాలివాన, పడవ ప్రయాణం, పద్మరాజు ప్రసిద్ధ కథల్లో కొన్ని. బతికిన కాలేజీ, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూణ్నాళ్ల పాలన, ఆయన నవలలు. సినిమా రచయితగానూ పనిచేశారు. -
గాలివాన
క్లాసిక్ కథ ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయోజనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండోతరగతి పెట్టె ఎక్కుతుంటే తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచి వుంటుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దాని మీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలు గుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పట్టాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ. వాళ్లని చూస్తే ఆయనకు ఎంతో గర్వం. రైలు పెట్టెలో మూడు మెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచు కున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు చిరాకు పడుతున్నట్టు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టి లోకి వెడితే బాగుంటుందని అనిపించింది. కాని రైలు కదిలిపోయింది. కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించాడు. కిటికీల పక్కనివున్న రెండు మెత్తల మీదా ఇద్దరు పెద్ద వయసువాళ్లు కూర్చున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆ యువకుని భార్య అయివుంటుంది. సిగరెట్టు పొగ మెల్లని ఘాటు రావుగారి నాసికా రంధ్రాలలోకి తెలియకుండానే ప్రవేశించి ఒక క్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. రైలుపెట్టెలో సిగరెట్టు పొగ గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయా లున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలు న్నాయి. ఆయన వేదాంతి. వేదాంతం జీవితం తోటీ, జీవన విధానం తోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ అనుబంధించి వుంటుం దని ఆయన వాదము. ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచి వక్తగా కూడా ప్రఖ్యాతి పొందాడు. ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడం కోసం. రావుగారు యువ దంపతుల వేపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగా వుంది. ఆమెకు కాస్త వుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా ఏదో అతను ఉద్యోగంలో వున్న దూరదేశానికి మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. గాలి పెరిగింది. బలంగా కిటికీ తలు పుల మీద ఒత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టిలో చీకటిగా అయిపోయింది ఎంచేతో. ఇంకా సాయంత్రం అయివుండదు. రావు గారి పక్కన కూర్చున్న పెద్దమనిషి కని పించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుకున్నారు. ఆయనకు రావుగారి వయస్సు వుంటుంది ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్ట కాలుస్తూ దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. ఆయన రావుగారికంటె పెద్దవాడై యుంటాడు. కాని ముఖంలో చురుకు ఉంది. అయినా జారిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి. తాను చాలా అదృష్టవంతుడని రావు గారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటె పెద్దదిలా కన్పిస్తుంది. ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే యిద్దరు పిల్లలున్నారనీ, అతను ఈమధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ చూసుకోవడం ప్రారంభించా డనీ వాళ్లెవ్వరూ అనుకోరు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించా లని నిశ్చయించుకున్నాడు. మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని, కోరికలు వాళ్ల ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన యింట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టాడు. ఆ పద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికీ కూడా ఎంతో శాంతీ, సుఖం సమకూరుస్తోంది. గాలి అరుస్తోంది. జల్లు కూడా ప్రారం భించింది. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి అటూ ఇటూ చూచి దూరంగా జరిగింది. చక్కగా దువ్విన తలకట్టులోనించి ముంగురులు విడిపోయి ఆమె నుదురుమీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తల దువ్వుకునే పద్ధతి రావుగారు నిర్ణ యించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ రావుగారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీ వానా పెట్టెలోకి చొచ్చుకు వచ్చాయి. చినిగి పోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ నిలబ డింది. ముసలాయన ‘ఇది పరుపుల పెట్టి అని తెలియదూ’ అన్నాడు. ‘బాబ్బాయి! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాక సోటివ్వరా బాబుగారూ. దయగల బాబులు! బిడ్డలున్నాతండులు! ఓ కానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతంది బాబులు...’ రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లల్లో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయో జనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చ మెత్తుకోడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్లి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు. ‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి యింత మాత్రం జాలి లేదు. ‘ఫో’ అంటాడు’. తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. ఇష్టం లేకపోయినా ఆమె వేపు చూస్తూ కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తే పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడస్తుందోనని భయం. ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ‘డబ్బున్న దొరలున్నా రని, నాబోటి ముష్టిముండని ఆకలితో సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేముడ! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్లుంటారు. ఆళ్లకే ఎక్కువ జాలి. డబ్బున్నా బాబులంతా రాతిగుండె లని తెలుసుకోలేక పోయాన్రా దేముడా! రావుగారి పక్కనున్న పెద్దమనిషి విచిత్రంగా ఆమెవేపు చూశాడు. ‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు.‘ఓ వూరేటి, ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్లకి. తమబోటి పెభువులకి వూళ్లుంటాయి. పెద్ద పెద్ద లోగిళ్లుంటాయి. గేటు ముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్లని రానీకుండా తరిమేయిత్తారు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’ ‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని ఉద్దేశించి, ఇంగ్లీషులో. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకు తోంది. ముష్టిది పెట్టెలో యువ దంపతు లకు ఎదురుగా కూర్చుంది. యువకుడు అన్నాడు: ‘మాతో కూడా వచ్చేయ కూడదూ నువ్వు? పనీపాటా చేస్తూ వుందుగాని తిండీ గుడ్డా యిస్తామ్.’ ‘ఏదో యిచ్చి దాన్ని పంపెయ్య కూడదూ?’ అంది యువతి భర్తని ఉద్దేశించి. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారి మనస్సు ఇతర విష యాలతో నిండిపోయింది. ఆయన గాలి వానను గురించీ, తను రైలులోంచి దిగడాన్ని గురించీ ఆలోచిస్తున్నాడు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో బట్టుకు లేచాడు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. తూలిపోయారు. ముష్టిమనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావు గారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలో చించడానికి అవకాశం లేదు. ఆమె సహా యాన్ని అంగీకరించక తప్పలేదు. కాని ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లం ఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ. కాని రైలు దిగి స్టేషనులోకి పరుగెత్తి వెళ్లిపోయారు. ముష్టి ఆమె సామానుల బరువుతో తూలుతూ వెనకాల వచ్చింది. సామానులు వెయిటింగు రూములో పెట్టింది. ఎక్కడా ఒక్క దీపం లేదు. రావు గారు కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబో యాడు. ఆమె వద్దనలేదు గాని, ఏదో విన బడకుండా అని మాయమైపోయింది. రావుగారు కూర్చున్నాడు. గింగురు మనే ఆ గాలిలో కళ్లు పట్టు తప్పిపోతు న్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమాడు. బాటరీ లైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. తడిబట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నాడు. స్వెట్టరు తొడుక్కున్నాడు. మఫ్లరు చెవులకు, తలకు చుట్టుకున్నాడు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు ఉండి తీరాలని బయటికి వచ్చాడు. ఇద్దరు ప్లాట్ ఫారం దాటివెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషను మాష్టరనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు. ‘నేను వూర్లోకి వెళ్లాలి’ అన్నారు రావుగారు ఆదుర్దాగా. ‘చాలా కష్టం. రోడ్డుమీద అంగుళం అంగుళానికీ చెట్లు పడి వున్నాయి. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.’ ‘కాని స్టేషన్లో యింకెవరూ లేరు.’ ‘నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.’ స్టేషను మాష్టరు వెళ్లిపోయాడు. రావు గారు వెయిటింగ్ రూంలోకి వెళ్లిపోయారు. మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావు గారికి తోచలేదు. క్రమశిక్షణ, నియ మాలు, విలువలు అన్నీ కూడా మానవా తీతమైన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితాలైపోతాయని ఆయనకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడా మానవ హృదయమన్నది లేదు. గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ గదిలో యింకో వస్తువేదో వున్నట్టు రావుగారికి కనిపించింది, తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వేపు చూశాడు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ వొక మూల నిలబడివుంది. ఆమె తడి వెంట్రు కలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది. ‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా ఉంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్లీ తలుపులు మూసి గదిలో వున్న కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ‘‘ఏం గాలివానండి బాబుగారు. నేను పుట్టిన్నాటినుండి యింత గాలివాన నేను చూడలేదు’’ అంది ముష్టి ఆమె. ఆమె గొంతులో బెదురులేదు. అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడకల్గుతూందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశాడు. మూలగా వొణుకుతూ కూచున్నది. రావుగారు తన పంచ ఒకటి తీసి ఆమె వేపు విసరి ‘యిది కట్టుకో’ అన్నారు. కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్న చోట కూర్చుంది. రావుగారికి ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది. బిస్కట్ల పొట్లం తీశాడు. ఒకటొ కటి చొప్పునా నమలడం ప్రారంభించాడు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని కొన్ని బిస్కట్లిచ్చాడు. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె వుండడం కొంత నయం. ఆమె దేన్ని గూర్చీ బాధ పడదు గాలీ వానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా ఆమెకు అనుభవమై వుంటాయి. రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. ‘ఈ యిల్లు కూలిపోదు గదా?’ అని ఆయన అడిగారు. ‘ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువైతే ఏది ఆగుద్ది?’... ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం. ఆయన పెట్టె దగ్గరకు పోయి కూర్చు న్నాడు. ఆయన కూర్చున్న మూలకు ఆమె కూడా చేరింది. అక్కడ కూచుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది. ‘గాలివాన యింత ముదిరిపోతుందని నేననుకోలేదు.’ ‘బాబుగారు ఎందుకలా భయపడతా’ రందామె. ‘ఒక్కరుండేకంటె యిద్దర మున్నాం గదా! టిక్కెట్టు కలెక్టరు రైలు కదులు తూంటే నన్ను దింపేశాడు, ఏం చేయను! ఇక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టుమెట్టుకోనాకి ఓ పొడి గుడ్డ యిచ్చారు. ఆకలికి మేత పడేశారు. వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అది లేదనీ, యిది లేదనీ సీకాకు పడితే ఏం లాభం?’ ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ మన మనస్సుకీ ఎంతో అంతరం వుంది. అయినా ఆ భయంకరమైన రాత్రివేళ తనకు తోడుగా ఆమె వున్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. ‘నీకెవరూ చుట్టాలు లేరా?’ అన్నా రాయన. వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. రైలులో ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. కాని ఆమె మాటల్లో గానీ చేతల్లో గానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆయన దగ్గరగా జరిగింది. ‘సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగు తాడు. ఆడే మా అమ్మని సంపేశాడం టారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగ ముండావాడితో సేవితం కలిగింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటైపోయాయండి. ఇంట్లో తిండికీ తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి. ‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు?’ ‘ఒక్కొక్కరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒక్కొక్కరోజు కానీ కూడా ఉండదు.’ రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపిం చింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు గానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలు గానీ ఆమెకు లేవు. ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకేసలా చూత్తారు?’ అంది. ‘మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.’ వెంటనే ఆయన తనలోకి ముడుచుకు పోయారు. తన మనస్సులో అశ్లీలైన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచిం చినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. ‘నీవేపు చూడ్డం లేదు’ అన్నారాయన గట్టిగా. ‘దీపం ఆర్పడం మరచిపోయాను.’ అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచు కున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదురైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీమీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలలోకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగలించు కున్నాడు. వెంటనే సిగ్గుపడ్డాడు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టి నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లాడు మూలలోకి. ఆమె ఆయనను ఆ మూలలో కూచోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతు లాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన జరుగుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావ సరం. అంచేత ఆయన కాదనలేదు. ఆమె మరీ దగ్గరగా జరిగి వొళ్లోకి వాలింది. ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనా పరంపరలో మునిగిపోయాడు. ఆమె మాట్లాడుతూనే వుంది. ‘ఈ మూల భయం లేదండి. బాబుగారికి చక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుచు కుంటున్నారు. మా గుడిసి ఎగిరిపోయుం టది. పిల్లేమైయుంటారో! ఇరుగు పొరు గోళ్లు సూత్తుంటార్లెండి. మావోడు చిత్తుగా తాగి పడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలు సుకంగా వున్నారో లేదో?’ ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆమెను గట్టిగా అదుముకున్నాడు క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానివేసింది. గాలి చేసే గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. కాలం అతి మెల్లగా జరుగుతోంది. కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలివల్ల వాన వారిద్దరినుంచీ దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశాడు. అమాయికంగా, నిశ్చింతగా వుంది. స్వచ్ఛమైన, నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింప జేసింది. గాలివాన జోరు హెచ్చింది. కాని ఆయన మనస్సులో అమితమైన ప్రశాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మరచిపోయి నిద్రలో మునిగిపోయాడు. మళ్లీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టి ఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం చూచుకున్నారు. ఐదుగంటలయింది. అనుకోకుండానే జేబులు తడుము కున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట ‘దొంగ ముండ’. కాని ఆమె అల్లా దొంగతనం చేసి వుంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గు మూలలా వెతికారు. కనబడలేదు. గదిలో నుంచి బయటికి వచ్చారు. భీభత్సంగా వుంది. ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్క లంతా నీటిమయం. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టి నప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనెప్పుడూ చూడలేదు. వికారం వచ్చింది. వెనక్కు తిరిగాడు. టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నాడు. ఆ కల్లోలాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ సామాను కింద ఏదో శరీరం ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టి ఆమె. తట్టుకోలేకపోయాడు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయి నట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరా వుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి తొందరగా యింటికి పోయుంటాడు. రావు చిన్నపిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించాడు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నాడు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ శాంతినీ గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడి పోయి వుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రం లాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు అనిపించింది. తన పర్సును దొంగలించినందుకు గాని, అంత గాలి వానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చు నని టిక్కట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసును. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్య గాని ఆయన పిల్లల్లో ఎవరుగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం... అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే. అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకుని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందులోంచి డబ్బు తీసి తెరచి వున్న డ్రాయరులో వేసి డ్రాయరు మూశాడు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయన మనస్సు వొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేడు. అంతచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్నించి వెళ్లిపోయాడు. (స్థలాభావం కారణంగా కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది) - పాలగుమ్మి పద్మరాజు -
పడవ ప్రయాణం
క్లాసిక్ కథ పొద్దు కుంకిన తరవాత లోకమంతా దిగులుగా ఉంది. పడవ మెల్లగా నీటిమీద జారుతోంది. నీరు పడవ పక్కన కలకల మంటూ రాసుకుంటోంది. చూపుమేరలో జీవనం చలనం లేని ప్రపంచం నిశ్శబ్దంగా జుమ్మంటోంది. ఆ ధ్వని దేహాన్నంతనీ తాకుతుంది. మనస్సు లోలోపల అది నిండుగా కంపిస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు ఏదో బ్రదుకు చివరకి ఆఖరయిపోతున్న నిస్పృహ, ప్రశాంతమయిన నిరాశ మనస్సులో నిండుకుంటాయి. దూరంగా చెట్లు అస్పష్టంగా, మాయగా పడవతో కూడా నిశ్చలంగా ముందుకి సాగుతాయి. దగ్గరగా ఉన్న చెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దెయ్యాల్లాగ జీబురుమంటో వెనక్కి నడుస్తాయి. పడవ కదలదు, కాలవగట్టు కదులుతుంది. నా చూపులు చొచ్చుకుని చొచ్చుకుని నీటిలోకి చూస్తాయి. అందులో ప్రతిబింబించిన చీకటిని చీల్చుకుని చూస్తాయి. నక్షత్రాలు మెల్లగా కెరటాల మీద వివశంగా ఉయ్యాల లూగుతాయి. కన్ను తెరిచి నిద్రపోతాయి. గాలి లేదు. పడవలాగే తాడు, ముని గర్ర చప్పుడయినప్పుడల్లా బిగువుగా, వొదులుగా అవుతోంది. పడవ వెనక భాగంలో పొయ్యిలో నిప్పు మండుతోంది. అప్పుడప్పుడు రప్పుమంటోంది. అప్పుడప్పుడు తగ్గిపోతోంది. లోపలికి ఊరిన నీరు చేదతో తోడి ఒక కుర్రవాడు కాలవలోకి పారబోస్తున్నాడు. పడవ లోపల ఏవేవో బస్తాలున్నాయి. ధాన్యం, బెల్లం, ఉప్పు, చింతపండు వగైరా. పడవ టాపుమీద నేను వెల్లగిల పడుకున్నాను. పడవ లోపల నించి చుట్టపొగలు, ఏదో సంభాషణ కలిసి మెల్లగా తాపీగా అన్ని దిక్కులికీ వ్యాపిస్తున్నాయి. గుమాస్తా కూచున్న గదిలో గుడ్డిదీపం కొద్దిగా కునుకుతోంది. పడవ సాగుతోంది. ‘‘ఏయి పడవా? ఈ గట్టుకి రానీ! ఈ గట్టుకి!’’ అని ఎవరో పిలిచారు. పడవ గట్టుకి జేరడంతోనే ఇద్దరు ఎక్కారు. పడవ ఆ పక్కకి కొంచెం వొరిగింది. ‘‘టాపుమీద కూకుంటాం లే!’’ అంది ఆడగొంతుక. ‘‘ఇన్నాళ్లూ ఏడ పోయావే? కనమట్టం లేదు’’ అన్నాడు చుక్కాని కాస్తున్న మనిషి. ‘‘ఇజానగరం, ఇశాక పట్టం, మావోడూ నేనూ కలిసి తిరిగొచ్చాం. అప్పన్న కొండకెల్లాం.’’ ‘‘ఏడ బోతన్నా?’’ ‘‘మండపాక పోతన్నాం మరిదీ! కులాస గున్నావా? గుమాత్తాగారు పాతోరేనా?’’ ‘‘ఆ!’’ మగవాడు టాపుమీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నాడు. అతని నోట్లో చుట్ట పక్కకి పడిపోతే ఆడమనిషి తీసి ఆర్పేసింది. అతని వొంటిమీద గుడ్డ కప్పింది. తనో చుట్ట దీసి అంటించింది. అగ్గిపుల్ల రప్పుమన్నప్పుడు ఆమె ముఖం చూశాను. నల్లగా ఉన్న ముఖం ఎర్రగా వెలిగింది. ఆమె గొంతుకలో మగజీర ఉంది. ముఖం అందమయినది కాదు. జుట్టు చెదిరి పోయినా ముఖంలో ఏదో పెద్దమనిషి తరహా ఉంది. చీకట్లో కూడా ఆమె కళ్లు మేలుకున్నట్టు మెరుస్తున్నాయి. ఇంతలో దీపం పెకైత్తి గుమాస్తా పడవ పక్కని నిలబడి చూశాడు. ‘‘ఏమే రంగీ, ఈడెవడు?’’ అడిగాడు. ‘‘మావోడండి, బాబ్బాబు రిమార్కు రాయించండి’’ అంది రంగి. ‘‘పద్దాలే! దింపెయ్యి! నీకు బుద్ధి లేదూ! మళ్లీ ఆణ్ణి పడవెక్కించా? తాగుబోతోణ్ణి.’’ ‘‘నే తాగందే. ఎవరంట నే తాగానంటా?’’ అన్నాడు పద్దాలు. ‘‘ఒరే దింపెయ్యండర్రా! ఎందుకెక్క నిచ్చారీణ్ణి! చిత్తుగా తాగుతున్నాడు.’’ ‘‘బాబ్బాబు, మండపాక్కాడ దిగిపోతాం.’’ ‘‘ఏమన్నా అల్లరిచేసే కాలవలోకి తోయించేస్తాను. జాగ్రత్త!’’ గుమాస్తా గదిలోకి వెళ్లిపోయాడు. పద్దాలు లేచి కూర్చున్నాడు. అట్టే తాగినట్టు లేడు. చుట్ట అంటించాడు. పద్దాలుకి బొద్దుమీసాలు. కోల ముఖం. మనిషి కొంచెం సన్నంగా, నిర్లక్ష్యంగా ఉంటాడు. పడవ మళ్లీ నిశ్శబ్దంగా సాగుతోంది. పడవ వెనక భాగంలో నిప్పు రగలడం లేదు. సరంగులు తిన్న గిన్నెలు తాపీగా మాట్లాడుకుంటో కడుక్కుంటున్నారు. గాలి చలిగా లేదు. అయినా నేను కండువా కప్పుకున్నాను. అనంతమయిన ఆ చీకటికి అసహాయంగా శరీరాన్ని అప్పగించడానికి నాకు భయం వేసింది. గాలి చురుకుగా ఉంది - మెత్తని స్త్రీ స్పర్శలాగ. చెప్పలేనంత మృదుత్వం, విశాలమయిన స్త్రీత్వం ఆ రాత్రిలో నిండుగా ఆవరించు కుని ఉంది. ఆ కౌగిలిలో నాకు చిరకాలం నాటి విషాద గాథలు జ్ఞాపక మొస్తున్నాయి - అనాది నించీ మగవాణ్ణి లాలించి పోషించిన స్త్రీత్వపు గాథలు. కొంచెం దూరంలో రెండు చుట్టలూ ఎర్రగా కాలుతున్నాయి. జీవితం బరువుగా అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ చుట్ట కాలుస్తున్నట్టు అనిపించింది. ‘‘వొచ్చీదేవూరు?’’ అన్నాడు పద్దాలు. ‘‘కాల్దారి’’ అంది రంగి. ‘‘ఇంకా శానా దూరముంది.’’ ‘‘ఇయ్యాల జాగత్తుండ్రా. ఏరా నామాటినవూ?’’ రంగి జాలిగా బతిమాలుతూ అడిగింది. ‘‘బెదురు’’ అంటూ ఆమెపక్కలో వేలెట్టి పొడిచాడు. ‘‘అమ్మో!’’ అంది రంగి. తన్మయ త్వంగా ఆకాశంలోకి ముఖమెత్తి చీకట్లోకి చూసింది. ఆ స్పర్శ శాశ్వతంగా ఉండి పోవాలని కోరుతున్నట్టుగా ముఖమెత్తింది. నాకు నిద్రపట్టింది. పడవంతా కూడా నిద్రపోతో, నీటివాలుకి మెల్లగా జారి పోతోంది. కొంచెం దూరంలో ఆ ఇద్దరు వ్యక్తులూ కొంతసేపు గుసగుసలాడు కున్నారు. నాకు నిద్ర పూర్తిగా పట్టలేదు. పడవ నడుస్తున్నట్టు, నీరు జారుతున్నట్టు, చెట్లు వెనక్కి పోతున్నట్టు తెలుసు. పడవనెవరూ లాగడం లేదు. అంతా కునుకుతున్నారు. రంగి నాపక్క నించి నడిచి చుక్కాని దగ్గరకు వెళ్లి కూచుంది. ‘‘మరిదీ! ఎల్లాగున్నా?’’ అంది. ‘‘నువ్వెల్లాగున్నా?’’ అన్నాడు చుక్కాని కాసేవాడు. ‘‘ఎన్నెన్ని సిత్తరాలు సూపించాడను కున్నా మావోడు! చినీమా కెళ్లాం! ఓడల్ని సూశాం! ఓడంటే ఓడ కాదు మరిదీ! మా వూరంతుంది’’ రంగి అల్లా చాలాసేపు కబుర్లు చెవుతో కూర్చుంది. ఆ కబుర్లు నన్ను జోకొడుతున్నట్టున్నాయి. ‘‘పిల్లా! నాకు నిద్దరొత్తందే!’’ అన్నాడు చుక్కాని కాసే మరిది. ‘‘సుక్కాని నేనూత్తాలే. నువ్వల్లా తొంగో’’ అంది. పడవ మళ్లీ మెల్లగా జారిపోతోంది - నిశ్శబ్దంగా. రంగి ఆ నిశ్శబ్దాన్ని కదప కుండా గొంతుకెత్తి చల్లగా పాట పాడింది. ‘‘యాడున్నాడో!-నావోడు - యాడున్నాడో! కూడు గిన్నెలో యెట్టి - కూకుని సూత్తుంటె నీడల్లె మా పెల్లి నిదరే కంటికి రాదు - యాడున్నాడో!! రంగి గొంతుకలోని మగజీరలో సంగీతముంది. ఆ పాటలో పడుకుని ఉన్న అన్ని ప్రాణులూ ఒక్కసారి కునికాయి. గడిచిన యుగాల ప్రేమగాథలు వింతగా, విషాదంగా ఆ పాటలో కంపించాయి. ఆ పాట నీటి వెల్లువై పొంగితే అందులో లోకం చిన్న పడవలాగ తేలిపోయింది. మానవ జీవితం ఈ ప్రణయం తోటి, ఈ విషాదం తోటి మాయగా, వింతగా, బరువుగా అనిపించింది. పద్దాలు నెత్తిని ముసుగు మూసుకొని కూర్చున్నాడు. కాని అతనికీ రంగికీ మధ్య కొన్ని యుగాల అంతరమేదో ఉన్నట్టు తోచింది. అతను టాపు దిగి పడవలోకి పోయాడు. నేను వెల్లగిల పడుకొని చూస్తున్నాను. రంగి అల్లాగే పాడుతోంది. నాకు నిద్ర పడుతోంది. రంగి పాట అల్లా లోకాలు తిరిగి వచ్చి మళ్లీ మెల్లగా నా గుండెల్లో తగులుతోంది. నాకు నిద్ర పట్టింది. నిద్రలో ప్రాకృతికమయిన ప్రణయం నా ముందు గంతులు వేసింది. పాట క్రమంగా జ్ఞప్తిలోనించి పోయింది. నిద్ర నా మనస్సు తలుపులు మూసింది. పడవలో గొడవయింది. కళ్లు నులుపు కుంటో లేచాను. పడవ గట్టుకి చేర్చివుంది. లాంతర్లు పట్టుకుని సరంగులు కంగారుగా పడవ ఎక్కి దిగుతున్నారు. గట్టుమీద రంగిని ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. అందులో ఒకడు గుమాస్తా. అతని చేతిలో మడిచిన తాడుంది. రంగికి అప్పుడే దెబ్బలు తగిలుంటాయి. నేను చటుక్కుని పడవ దిగి ఏం జరిగిందని అడిగాను. ‘‘ఆ దొంగనాకొడుకు సరుకు ఎత్తుకు పోయాడు. ఇది ఎక్కడో గట్టుకి తార్చింది పడవని. సుక్కాని పట్టుకుంది!’’ గుమాస్తా కోపంగా, చిరాకుగా అన్నాడు. ‘‘ఏం పోయాయి?’’ అని అడిగాను. ‘‘రెండు బెల్లం బుట్టలు, మూడు చింతపండు బుట్టలు. నేనందుకే ఎక్కని వ్వొద్దన్నాను. ఎక్కడ దింపుకుపోయాడే?’’ ‘‘కాల్దారి కాడండి! బాబయ్యా!’’ ‘‘కాల్దారి కాడ మేం మేలుకునుంటే?’’ ‘‘అయితే నిడదవోలు కాడేనండి!’’ ‘‘ఇదిప్పుడు చెప్పదు. రేపు అత్తిల్లో పోలీసోళ్ల కప్పగిద్దాం!’’ గుమాస్తా ఆమెను పడవ్వేపు తోశాడు. సరంగులు ఆమెను పడవెక్కించారు. ‘‘నిద్దర మొకాలు! సూసుకోవొద్దూ! దాని చేతులో సుక్కాని ఎవరెట్టమన్నారు?’’ గుమాస్తా అందరి మీదా విసుక్కుని గదిలోకి పోయాడు. రంగిని టాపుమీదికి ఎక్కించారు. ఒక సరంగు ఆమె పారిపోకుండా కాపలా వున్నాడు. నేను కూడా ఎక్కాను. పడవ మళ్లీ కదిలింది. నేను చుట్ట ముట్టించాను. ‘‘అయ్యగోరోసుట్ట ఇప్పించరూ!’’ రంగి చనువుగా అడిగింది. చుట్ట, అగ్గిపెట్టీ ఇచ్చాను. ఆమె చుట్ట ముట్టించింది. ‘‘మరిదీ! నన్ను పోలీసోళ్ల కప్పగించి ఏం లాబం!’’ ‘‘గుమాస్తా వొదలడు!’’ అన్నాడు సరంగు. ‘‘పద్దాలు నీ మొగుడా!’’.. అడిగాను. ‘‘మావోడు’’ అంది రంగి. ‘‘దీన్ని పెళ్లాడలేదు. ఆడికి ఇంకొక త్తుంది. ఇప్పుడది ఎక్కడుందే?’’ అన్నాడు సరంగు. ‘‘కొవ్వూరులో ఉంది. రంగూ, పొంగూ బాగుందిప్పుడు. నేను తిన్నన్ని తన్నులు తింటే అదీ నాలాగే అవుద్ది.’’ ‘‘మరి నీకింకా వాడితో ఎందుకు!’’ అన్నాను నేను. ‘‘ఆడు నా వోడండి!’’ అంది. అంతా అందులో ఉన్నట్టుగా. ‘‘ఇంకొకత్తితో పోతున్నాడన్నావుగా?’’ ‘‘ఎక్కడ పోతాడు? మొగోడి కెంతమందయితే మాత్రమేం? ఆడండి, మా రాజండి. అల్లాంటి మనిషి లేడండి.’’ ‘‘బాబో! ఆడి సంగతి మీరింకా ఎరగరు. ఇదెంత రంగుగా ఉండేదను కున్నారు? ఓ తూరండి, దీన్ని గుడిసెలో పెట్టి గుడిసి అంటించేశాడు. మగ్గిపోయిందనుకోండి! ఇంకా దీనికి భూమ్మీది నూకలున్నాయిగాని’’ అన్నాడు సరంగు. ‘‘అయ్యగోరు! అప్పుడు ఆడు కనమడితే పీకి నులిమేద్దామనుండేది. కాలిన గడోటి ఈపుమీద పడిందండి.’’ ఆమె వెనక్కి తిరిగి రవిక కొంచెం పెకైత్తింది. తెల్లటి మచ్చ ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనబడింది. ‘‘మరి ఇంకా వాణ్ణి పట్టుకు దేవులాడుతావేం?’’ అని అడిగాను. ‘‘ఏం చెయ్యను? ఆడు కంటబడితే అన్నీ మరిచిపోయి కరిగిపోతాను. ఈ సందాల కొవ్వూరులో బయలుదేరాం. దార్లో నన్ను జాలిగా బతిమలాడాడు. ఈ పడవలో ఎక్కి చేతికి చిక్కిన సరుకు దించి పారెయ్యాలని. నేనుంటేగాని సాగదు. అడ్డ దోవని నడిచి మడుగు జేరుకున్నాం.’’ ‘‘ఎక్కడ దింపేశాడు సరుకు?’’ ‘‘ఎక్కడో నాకూ గుర్తునేదండి.’’ రంగి మొగం చూడాలని నాకు ఎంతో కుతూహలం వేసింది. కాని ఆ కటిక చీకట్లో అవ్యక్తంగానే ఉండిపోయింది. పడవ మెల్లగా పాకుతోంది. నడిరాత్రి గడిచినకొద్దీ గాలి చిరుగాలిగా తగులు తోంది. చెట్ల ఆకులు కొద్దిగా కదులు తున్నాయి. మళ్లీ పడవని సరంగులు లాగుతున్నారు. నాకింక నిద్రపట్టలేదు. కొంతసేపటికి కాపలా ఉన్న మనిషి కునికి ఒరిగి చివరకి నిద్రపోయాడు. రంగి పారిపోయే ప్రయత్నం మానుకుంది. తాపీగా చుట్ట కాలుస్తూ కూర్చుంది. ‘‘నీకసలు పెళ్లి అవలేదా’’ అడిగాను. ‘‘లేదు. సిన్నతనంలోనే పద్దాలు నన్ను లెగేసుకొచ్చాడు.’’ ‘‘మీదేవూరు?’’ ‘‘ఈండ్రపాలెం. అప్పుడు తాగు తాడని నాకు తెలదు. ఇప్పుడు నేనూ తాగుతాననుకోండి. తాగితే తప్పు లేదు. తాగి సావగొడతాడు.’’ ‘‘మరి వొదిలి వెళ్లిపోకపోయావా?’’ తన్నులు తిన్నప్పుడల్లాగనిపిత్తది. అయినా అంతటి మనిసి లేడండి. ఉత్తప్పుడండి, యెన్నలా కరిగిపోతాడు. వొందమందితో పోయినాసరే ఆడు నాకాడి కొచ్చితీరతాడు. నేను లేకపోతే గుండగిలి సచ్చిపోడూ?’’ నాకు వింతగా అనిపించింది ఆ అమ్మి తత్వం. వాళ్లిద్దరి అనుబంధం ఎల్లాంటిదో నాకు అర్థం కాలేదు. ‘‘మాకిద్దరికీ ఏపనీ సరిపడింది కాదు. సిగురుకి దొంగతనాల్లోకి దిగాం. ఓనాడు నా గుడిసికి దాన్ని తీసుకొచ్చాడు.’’ ‘‘ఎవరిని?’’ ‘‘ఇప్పుడున్న గుంటని. నా యెదురు గుండా, నా ఇంటో దాంతో ఉన్నాడు. నా కళ్లెదర! చిత్తుగా తాగొచ్చాడు. అదీ తాగింది. దానిమీద పడి పీకాను. ఆడు నన్ను సావదన్నాడు. అద్దరేత్తిరికాడ దాన్నెక్కడకో తీసుకుపోయాడు. మల్లీ వొచ్చాడు. నేను తిట్టాను. ఇంటోకి రావొద్దన్నాను. గుమ్మంకాడ కూకుని పిల్లోడికన్నా జాలిగా ఏడిచాడు. ఆ గుంట లేకపోతే బతకలేనన్నాడు. నాక్కోపం ఎక్కువయిపోయింది. గుమ్మంలోంచి గెంటి తలుపేసుకున్నాను. తలుపు గుంజి గుంజి సివరికి ఎల్లిపోయాడు. నాకు శానాసేపు నిద్దర రాలేదు. కొంచెం కునుకు పట్టేతలికి ఇల్లంటుకుంది. తలుపు పైన గొళ్లెమేసి నడికొప్పంటించాడు. ఎవరూ రాలేదు. నడిరాత్తిరి. నా వొళ్లంతా మగ్గి పోయింది. తెలివి తప్పింది. ఇంతలో అవతల్నించి తలుపు తెరిచారు. మన్నాడు ఆణ్ణి పోలీసోళ్లట్టుకున్నారు. ఎవరిమీద అనుమానముందో నన్ను చెప్పమన్నారు. ఆడుమాత్రం కాదని చెప్పేశాను. సందేల నాకాడ కొచ్చి, ఎంతో జాలిగా ఏడిచాడు. ఉత్తప్పుడసలు ఏడుపే రాదు. నవ్వుతుం టాడు. సుక్కడితే సాలు, పిల్లోడి కన్నా ఎక్కువగా ఏడుస్తాడు.’’ ‘‘నువ్వింకా వాడితో ఎందుకు దిగుతావు ఈ దొంగతనాల్లోకి?’’ ‘‘ఏం జెయ్యమంటారు? ఆడొచ్చి గోలెడితే?’’ ‘‘మరి నిన్ను విజయనగరం తీసుకుని వెళ్లాడన్నావు?’’ ‘‘వొట్టిది. ఊరికే అల్లా సెప్పాను. నేనంటే కొంచెం సరంగులికి నమ్మకం. ఇదిగాక రెండు తూర్లు ఈ పడవలో దొంగతనం జరిగింది.’’ ‘‘నిన్ను పట్టుకుంటే పోలీసులు ఏం జేస్తావు?’’ ‘‘ఏమీ చెయ్యను. నన్ను పట్టుకునేం జేత్తారు? నాకాడ దొంగసొమ్ము లేదు. ఏమో ఎవరెత్తుకుపొయ్యారో, ఓ రోజు కొడతారు, మన్నాడొగ్గేత్తారు. ఆడు దొరకడు. ఈపాటికంతా అయిపోద్ది. ఆడు దొరక్కుండానే నేను పడవలో ఉండిపోతా.’’ ఆమె నిట్టూర్చి విడిచి మళ్లీ మెల్లగా తనలో తను అనుకున్నట్టు చెప్పింది. ‘‘ఈ సొమ్మంతా మళ్లీ ఆ గుంటకే దక్కుడు. దాని మీద మోజు తగ్గీదాకా దాన్నొదలడు. నా ఉసురోసుకుంటంది.’’ ఆ మాటల్లో ఉద్రేకమేమీ లేదు. ఆమె అతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా అంగీకరించింది. పద్దాలు కోసం ఆమె ఎల్లాంటి పనన్నా చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అది ఒక ఆదర్శమూ కాదు. భక్తీ కాదు. ప్రేమా కాదు. ఎన్నో చిత్రమయిన సంకీర్ణ భావాలతో, ఈసులతో, అనురాగాలతో ఎన్నిటితోనో కలిసిన స్త్రీ హృదయం! అయినా ఆ హృదయం అన్నిటికీ ఫలితంగా ఒకేచోట లగ్నమయి ఉంది. తన మగవాడికోసం ఆమె నిరం తరం తపిస్తుంది. కాని అతడు నిర్దుష్టంగా, నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. సుగుణాలతో, అవగుణాలతో అతన్ని ఆమె అంగీకరిం చింది. నాకామె బ్రతుకు బరువనిపించింది. నిజానికి నా బ్రతుకే బరువేమో అంతకంటే. రంగి మోకాళ్లు ముడుచుకుని ఎటో అవ్యక్తంగా చూస్తోంది. ‘‘ఆడు నావోడు! ఎన్ని తిరుగుళ్లు తిరిగినా నావోడు నా దగ్గరకే వొత్తాడు,’’ అని తనలో తను అను కుంది. అందులో ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం తొణికిసలాడాయి. ఆ మాట ఆమె జీవిత సర్వస్వానికి కేంద్రంలాగ అవుపించింది. నేను భయంతో, భక్తితో, జాలితో ఆ మాట విని ఊరుకున్నాను. అల్లాగ తెల్లవారీదాకా కూర్చున్నాం. నేను పడవ దిగిపోయేముందు ఒక రూపాయి ఆమె చేతులో పెట్టి ఊళ్లోకి పోయాను. ఆమె జవాబు చెప్పీదాకా నేను నిలబడలేదు. ఆమె సంగతి తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు. - పాలగుమ్మి పద్మరాజు -
బహుదూరపు బాటసారి పద్మరాజు...
రాకోయీ అనుకోని అతిథి... జననీ వరదాయనీ.... ప్రియే చారుశీలే... అతి తక్కువ పాటలతో ఎక్కువమంది సినీ ప్రేక్షకులకి చేరువైన రచయిత పాలగుమ్మి పద్మరాజు. ‘గాలివాన’ కథతో అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుని సాహిత్యంలో సమున్నత గౌరవం పొందిన ఆయన సినీ రంగంలో విశేషకృషి చేశారని చాలా తక్కువ మందికే తెలుసు. నిర్మాత మురారి, దర్శకరత్న దాసరి నారాయణరావులు పద్మరాజును గురువుగా భావించేవారని కూడా చాలా తక్కువమందికే తెలుసు. పద్మరాజుగారి సినిమాల గురించి వారి పెద్ద అమ్మాయి పాలగుమ్మి సీత చెప్పిన వివరాలు... - పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ రచయిత నాన్నగారు తన పంతొమ్మిదో యేట నుంచే రచనలు మొదలుపెట్టారు. మొదట ఛందోబద్ధంగా పద్యాలు రాసి తర్వాత వచనంలోకి వచ్చారు. అందుకు కారణం ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి చేసేటప్పుడు విస్తృతంగా పాశ్చాత్య సాహిత్యం చదవడం కావచ్చు. నాన్నగారికి తెలుగు మీద ఎంత పట్టు ఉందో ఇంగ్లిష్ మీద కూడా అంతే అధికారం ఉంది. అందుకే తాను రాసిన కథానికలను తానే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకునేవారు. ఆ క్రమంలోనే 1958లో అంతర్జాతీయ కథానికల పోటీలో ‘గాలివాన’ కథ రాసి పంపితే బహుమతి వచ్చింది. ఆయన రాసిన కవితలు, పద్యాలు, పాటలు, కథానికలు, నవలలు. రేడియో నాటకాల గురించి అందరికీ తెలిసినా సినిమా రచనల గురించి తెలియదు. నాన్నగారి సినిమా ప్రవేశం కృష్ణశాస్త్రిగారి ద్వారా జరిగింది. అప్పటికే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు సినిమాలకు పాటలు రాస్తున్నారు. బిఎన్‌రెడ్డిగారు సినిమా తీయాలనుకున్న సంగతి తెలిసి నాన్నగారికి కబురు చేస్తే నాన్న మద్రాసు వచ్చారు. కృష్ణశాస్త్రిగారి కుటుంబం, మా కుటుంబం చాలా క్లోజ్. అలా ఆయన ద్వారా ‘బంగారుపాప’ సినిమాకు నాన్న పని చేశారు. అందులో కోటయ్య పాత్ర ఎస్విరంగారావుకు చాలా పేరు వచ్చింది. ‘ఇటువంటి పాత్ర మళ్లీ నాకు దొరకలేదు’ అని ఎన్నోసార్లు చాలామందితో సంబరంగా అనేవారట. ఆ తరవాత ‘రంగులరాట్నం’ చిత్రానికి కథ మాటలు నాన్నగారే రాశారు. కథకు నంది అవార్డు వచ్చింది. అది మామూలు కథే అయినప్పటికే నటుడు చంద్రమోహన్ పాత్రకు ప్రాణం పోసి నిలబెట్టారు. చంద్రమోహన్‌కు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. ఆయన క్యారెక్టర్‌ను నాన్నగారు మా బాబయ్య భానుమూర్తిగారి ప్రభావంతో రాశారని నేననుకుంటాను. మా బాబయ్య అలాగే ఉండేవారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేవారు. ఆయన ప్రేరణగానే ఈ క్యారెక్టర్ని మౌల్డ్ చేసినట్లు అనిపిస్తుంది. భావనారాయణగారు తీసిన ‘గోపాలుడు భూపాలుడు’ జానపద చిత్రానికి కథ, మాటలు నాన్నగారే అందించారు. అలా చాలా జానపద చిత్రాలకు పని చేశారు. మురారిగారి నిర్మాణంలో వచ్చిన ‘సీతామాలక్ష్మి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. మురారిగారు మొదటి నుంచి అన్ని విషయాలలోనూ నాన్నగారి సలహా సూచనలు తీసుకునేవారు. పాటలలో ఎక్కడైనా ఏదైనా పదం నచ్చకపోయినా, పాటలకు ట్యూన్ నచ్చకపోయినా నాన్నగారు బాగాలేదని చెప్పారంటే వెంటనే మురారి గారు ఆ సూచనల ప్రకారం మార్పులు చేయించేవారు. అలా కొందరు పెద్ద రచయితలకు నాన్నగారి మీద కోపం కూడా వచ్చింది. మురారిగారికి నాన్న మాట వేదవాక్కు. ఎవరు పాటలు రాసినా నాన్నగారు ఓకే చేయాల్సిందే. సినిమా అంటే అవగాహన ఉన్న వ్యక్తి నాన్నగారు. మొత్తం 24 క్రాఫ్ట్స్ నాన్నకు పరిచయమే. పాటలు, మాటలు, కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం,.. అన్ని శాఖలలోనూ పనిచేశారు. దేవుడిచ్చిన భర్త, బికారి రాముడు... చిత్రాలకు దర్శకత్వం చేశారు. ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఉండాల్సిందే. తేడా వస్తే సర్దుకునేవారు కాదు. మొత్తం 30కి పైగా సినిమాలకు పని చేశారు. ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు. సినిమాల ఎడిటింగ్‌లో కూర్చునేవారు. ప్రాసెసింగ్ నేర్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ దాకా అన్నీ చూసి నేర్చుకున్నారు. శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ సినిమాకు పాటలు రాయడానికి కృష్ణశాస్త్రి గారు రావడం కొంచెం ఆలస్యం కావడంతో నాన్నగారితో ఒక పాట రాయించారు, అదే ‘రాకోయీ అనకోని అతిథి’ .అంతకుముందే ‘భక్తప్రహ్లాద’ చిత్రానికి ‘జననీ వర దాయనీ భవానీ’ అనే గీతం కూడా రచించారు. దాసరిగారితో చాలా సినిమాలు చేశారు. అక్కడ అందరికీ ఒక మాస్టర్లా ఉండేవారు. ఇప్పటికీ దాసరిగారు నాన్నగారి గురించి మాట్లాడాలంటే ‘మాగురువుగారు’ అంటారు. వారిద్దరిదీ 30 సంవత్సరాల సినిమా అనుబంధం. దాసరిగారు ముందుగా నాన్నగారి దగ్గర రైటర్‌గా జాయిన్ అయ్యారు. ఆ తరవాత భీమ్‌సింగ్ గారి దగ్గర నాన్నగారే పెట్టారు. తాత మనవడు సినిమా దగ్గర నుంచి నాన్న పోయేవరకు దాదాపు ఆయన తీసిన ప్రతి చిత్రానికీ నాన్నగారే అడ్వయిజర్‌గా ఉన్నారు. మా రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవి. దాసరి పద్మగారిని నేను పద్మక్క అని పిలిచేదాన్ని.. మా నాన్నగారిని ఆవిడ ‘నాన్నగారూ’ అని పిలిచేవారు. దాసరిగారు ఒకేసారి నాలుగైదు సినిమాలు తీయడం వల్ల నాన్నగారి సలహాలను ఎక్కువగా అడిగేవారు. నాన్న సలహాలను ఆయప తప్పక పాటించేవారు. నాన్నగారి మాటను గౌరవించేవారు. నాన్నగారు కన్నడంలో రాసిన ‘హాలు-జేను’ అనే సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పుడు ఇచ్చిన మొమెంటోలు అక్కడే వదిలి వచ్చారు. అవి తెచ్చుకోవాలి, ప్రదర్శించుకోవాలనే స్వభావం ఆయనకు లేదు. నాన్నగారు ఏ సినిమా చూసినా వచ్చాక, ఆ సినిమా గురించి మాతో డిస్కస్ చేసేవారు. సఫైర్ థియేటర్లో వచ్చిన సినిమాలన్నీ చూశాం. సినిమా చూడటం కంటె ఆయనతో డిస్కస్ చేయడం మాకు సరదాగా ఉండేది. నాన్నగారు కొత్త స్క్రిప్ట్ రాశాక చదివి వినిపించేవారు. అది కూడా ఇంటరెస్టింగ్‌గా చదివేవారు. ఆయన చదువుతుంటే సినిమా కళ్లకు కట్టినట్లు కనిపించేది. ముగింపు దాసరిగారి ‘బహుదూరపు బాటసారి’ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒకనాడు నాన్నగారు ఆలిండియా రేడియో కార్యక్రమాలకు జూరీగా ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. ప్రయాణానికి ముందు ఆ రాత్రి దాసరిగారి ఇంటికి వెళ్లి ‘నారాయణరావూ! నేను వెళ్లిపోతున్నాను’ అన్నారట. అదే ఆయన ఆఖరిమాట. దైవికంగా జరిగిందో, ఎలా జరిగిందోగాని ఆ రోజే నాన్న మళ్లీ తిరిగిరాని బహుదూరాలకు బాటసారిగా వెళ్లిపోయారు. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై రోజుకో ఉత్తరం రాసేవారు... నాన్నగారు భాషను ప్రేమించేవారు, గౌరవించేవారు. ఆయనకు విలక్షణమైన వ్యక్తుల మీద ఆకర్షణ ఉండేది. ఒక పిక్ పాకెటర్ ఏ విధంగా దొంగతనం చేస్తాడో కూడా రచయితకు తెలిసి ఉండాలి అనేవారు. ఆయనకు టైలరింగ్ అంటే ఆసక్తి. మా బట్టలన్నీ కుట్టేవారు. ఎక్కడైనా తేడా వస్తే విప్పి మళ్లీ అందంగా సరిచేసేవారు. మా కోసం డ్రస్ డిజై నింగ్ బుక్స్ కొనేవారు. అలాగే ట్రావెల్ అంటే చాలా ఇష్టం. యూరప్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు రోజుకో పోస్ట్ కార్డు రాసేవారు అక్కడి ప్రాంతాల గురించి. పిల్లలు ముగ్గు వేస్తుంటే దీక్షగా చూసేవారు. భోజనం ఎంజాయ్ చేస్తూ తినేవారు. కొత్త టెక్నాలజీ నేర్చుకునేవారు. పుస్తకాలు ఎక్కువ కొనమనేవారు. అందుకే మా దగ్గర పుస్తకాలే ఎక్కువుంటాయి బట్టల కంటె. ఎంతో ఎక్కువ చదివి అతి తక్కువ రచనలు చేసినది నాన్నగారే. చదివేటప్పుడు ఏది అడిగినా తెలియదు అని చెప్పేవారు కాదు. క్షుణ్ణంగా వివరించేవారు. - పాలగుమ్మి సీత, పద్మరాజు గారి పెద్దమ్మాయి -
బాల్యం ప్రభావం జీవితాంతం ఉంటుంది
పాలగుమ్మి పద్మరాజుగారు నవల, కథానిక, నాట కం, వ్యాసం, కవిత్వం... సాహిత్యంలోని పలు శాఖ లలో సృష్టి చేసినా ఆయన పేరు చెప్పగానే ‘కథానిక’ గుర్తుకొస్తుంది. కారణం- ఆయన ‘గాలివాన’ కథా నిక అంతర్జాతీయ పోటీలో ద్వితీయ బహుమతి పొందడమే! ఆయనకు ఇష్టమైన ప్రక్రియా కథానికే. ఆయన తన గురించి తనే ఓ వ్యాసంలో చెప్పు కుంటూ ‘‘నేను పది మందిని ఆకర్షించే మనిషిని కాదు. నాలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని నమ్మే టంత అహంకారమూ లేదు. అందుచేత నా కథాని కలు వేటిలోనూ నేను కథానాయకుణ్ణి కాదు. ఎవరికీ దొరకని అపూర్వ అనుభవం నాకేమీ కలగలేదు. అం దుకే నా గురించి కథానికల్లో రాసుకోలేదు. కానీ ఒక భయంకరమైన అనుభవానికి ఒకసారి లోనయ్యా ను. ఆ అనుభవం మాత్రం నా కథానికలో చోటు చేసుకుంది. అదే నాకు అంతర్జాతీయ బహుమతి తెచ్చిన ‘గాలివాన’... సాఫీగా జీవితం గడుపుతున్న రావు, మరుక్షణంలో జీవితం ఎలా గడుస్తుందో తెలీ ని బిచ్చగత్తె ఈ కథానికలో పాత్రలు. 1948వ సంవ త్సరంలో అర్థరాత్రి సంభవించిన తుఫాన్లో నేను గాలివాన కథానికలో రావు అనుభవించిన క్షోభంతా అనుభవించాను. మా ఇల్లు కూలిపోయింది. ఆ కూ లిన ఇంటికింద నా భార్య చిక్కుకుపోయి మూడుగంటల పాటు నిస్సహాయంగా పడి ఉంది. ఆ రాత్రి భయానకం, బీభ త్సం. అలాగని నేను కథానికలో రావుని మాత్రం కాను. ఒకే పరిస్థితిలో మేమిద్ద రం చిక్కుకున్నాం’’ అన్నారు. రావు ఎన్నో బహిర్గత సూత్రాల్ని నిర్మించుకున్నారు. బిచ్చమెత్తకూడదు, అటువంటి వారిని దగ్గరకు రానీయకూడదు, దొంగతనాన్ని ప్రోత్సహించకూడదు లాంటివెన్నో! కానీ ‘గాలి వాన’లో ఆ సూత్రాలన్నీ కొట్టుకుపోయాయి. మాన వత్వమొక్కటే మిగిలింది. అదే రావుని, బిచ్చగత్తెను దగ్గరకు చేర్చింది. ‘మృత్యువు’ అంటే పాలగుమ్మి పద్మరాజు గారికి చెప్పలేని ఆకర్షణ. అందుక్కారణం 1927లో తాతగారి మరణాన్ని దగ్గర నుండి చూడటం! ఎం తో చలాకీగా ఉండే పిన్ని కూతురు హఠాత్తుగా చిన్న వయసులో చనిపోయింది. ఈ అనుభవం తాలూకు నీడలు ఆయన ‘బాల్యం, వియ్యన్న తాత మరణం, గాలివాన కథానికల్లో కనిపిస్తాయి. కొవ్వూరులో చది వేప్పుడు గోదావరి గట్టంట రైల్వే బ్రిడ్జి వరకు నడుస్తూ కనిపించిన అన్నింటి మీదా కవిత్వం చెప్తుండేవారట పద్మ రాజు. అందరిలోనూ అన్ని గుణాలూ కలసి ఉంటాయి. ఒకరిలోని మంచిని స్వీకరించగలిగినట్లు చెడుని స్వీకరించగ లగాలి అనడమే కాదు, ‘పడవ ప్రయా ణం’ అనే గొప్ప కథానిక ద్వారా ఈ విషయాన్ని చెప్పారు. ఓ విదేశీ సంస్థ పోలెండ్‌లోని భారతీయ రాయబారి కె.సత్వర్సింగ్ సంపాదకత్వంలో సంక లనం తెచ్చింది. దాంట్లో ఒకే ఒక తెలుగు కథానిక పడవ ప్రయాణం (ఆన్ ది బోట్). యాదృచ్ఛికమేమిటంటే ఈ నెలలో పాలగు మ్మి పద్మరాజుగారి శతజయంతి పూర్తయితే, వచ్చే నెలలో గోదావరికి మహా పుష్కరాలు. అప్పుడు గోదావరి మాతని అంతర్జాతీయ స్థాయికి పెంచిన పాలగుమ్మి పద్మరాజుగారిని గుర్తు చేసుకోవలసిన అవసరం ఈ సందర్భంలో లేదా? (జూన్ 24 పాలగుమ్మి శతజయంతి ముగింపు) -డా॥వేదగిరి రాంబాబు