ఈవేళో రేపో కాలవ తెరుస్తారు. తవ్వు ఇంకా పూర్తికాలేదు. కంట్రాక్టరు కోప్పడతాడు. ఇంకా చిన్న గుంట దగ్గర ఓ వంద గజాల మేర కాలవ తవ్వి గట్టు బాగు చెయ్యాలి. దొరికినంతమంది కూలీలను రాత్రికి రాత్రి పోగుచేశాను. పనికాకపోతే కాంట్రాక్టు డబ్బు ప్రభుత్వం వారు ఇవ్వరు.
ఎండిన కాలవ నీటికోసం దాహంగా ఉంది. ఇరుగట్లనీ పరువుకొచ్చిన మామిడికాయలు గుత్తులుగా వేళ్లాడుతున్నాయి. అప్పుడే తెల్లవారినా, రాబోయే గాడుపు వేడిగా సూచనగా తగులుతోనే ఉంది. కాలవ మధ్యన నీటిచెలమలో తప్ప కనుచూపు మేరలో నీరు లేదు.
నేను గట్టు మీద కూర్చుని నీరసంగా కూలివాళ్లని హెచ్చరిస్తున్నాను. ఎంత తొందరపెట్టినా మెల్లగానే పారలు వేసి తవ్వుతున్నారు. ఆడకూలీలు మెల్లగా తట్టలు నెత్తిమీద ఎత్తుకుని గట్టు తెగిపోయిన చోట పోస్తున్నారు.
కూలివాళ్ల నల్లటి దేహాల మీద చెమట నిగనిగ మెరుస్తోంది. వాళ్ల కండలకి ఆ తడి ఓ వింతమెరుపు నిచ్చింది. ఆడ మగ మెల్లగా కబుర్లు చెప్పుకుంటో పని చేస్తున్నారు. బొద్దుమీసాల పెద్దవాడు అందరిలోకి సోమరిపోతు. అతని పేరు సత్తిరెడ్డి. కాని తెలివయిన వాడు. అతని కబుర్లలో పడి అంతా పని మరచిపోతారు. పావుగంట కొకసారి గునపం పాతుతుంటాడు. కాని బలమయినవాడు. పద్దెనిమిదేళ్ల పిల్ల అతను తవ్విన మట్టిబెడ్డలు తట్టలో వేసుకుంది. ఒక క్షణం అతని మాటలు వింటో నవ్వింది. తట్ట ఎత్తుకు వెళ్లిపోయింది. ఆమె పేరు రత్తి. తరవాత ముప్ఫయియేళ్ల పడుచు వచ్చింది. ఆమె పేరు చెల్లమ్మ.
‘‘యెయ్యి పిల్లా! సూడకు’’ అన్నాడు మీసాల పెద్ద.
‘‘నువ్వు పాడు’’ అంది ఆమె.
పొద్దు ముదురుతోంది. కూలివాళ్ల సంభాషణ రోదలాగ వినబడుతోంది. రత్తి కిచకిచ నవ్వుతోంది. ఆమె మొగుడు కుర్రతనపు గర్వంతో తవ్వుతున్నాడు. బూతుపాటలు పాడుతున్నాడు. అతన్ని ముసలయ్య అంటారు. ఏభయి ఏళ్ల గడ్డపు ముసిలి పద్దాలు వాళ్ల ఊళ్లో మావుళ్లమ్మ మహత్తు వర్ణిస్తున్నాడు.
ఎండ ముదురుతోంది. నేను కాలవగట్టు మీద నించి లేచి పక్కనే ఉన్న కరణంగారి ఇంటి అరుగు మీద కూర్చున్నాను. తాటాకు చూరు కింద పెద్ద వరికంకెల గుత్తి వేళ్లాడుతోంది. పిచికలు పక్కని ఏటవాలుగా వాలి గింజలు తింటున్నాయి. అరుగు ముందు చింతచెట్టు కింద ఆవు సగంనిద్రతో నిలబడి ఉంది. ముసిలి పద్దాలు చెపుతున్నాడు.
‘‘సంబరం నాడు పోతుని బలేత్తారు. ఒక్క యేటకి తల తెగిపోవాల. తప్పితే గండమన్నమాట. నెత్తురంతా పెద్ద మూకుళ్లో పడతారు.’’
పని అంతకంతకి వడి తగ్గింది. పొద్దు నడినెత్తికి ఎక్కుతోంది. ఊళ్లో జనసంచారం లేదు. కాకులు దాహంగా చెట్టుమీది నుంచి చెట్టుమీదికి ఎగురుతున్నాయి. చివరాకి మీసాలవాడు గునపం పాతి మళ్లీ పైకి ఎత్తలేదు. అంతా పని ఆపారు. గట్టు సగం అయింది. సత్తిరెడ్డి కాలవ దగ్గర ఒళ్లు కడుక్కుంటున్నాడు. రత్తి దగ్గరికి వెళ్లి నీళ్లిమ్మంది. అతను చేదతో నీళ్లు తీసి ఆమె ముఖం మీదికి చిమ్మాడు.
‘‘సచ్చినోడా’’ అంది రత్తి సరదాగా. రత్తి మొగుడు ముసలయ్య గుర్రుగా చూశాడు. సత్తిరెడ్డి నోట్లో నీళ్లు పోసుకున్నాడు. ‘‘థూ! ఉప్పనీల్లేసే’’ అని చీదరించుకున్నాడు. అంతా కాలవలో ఉన్న చెలమ దగ్గరికి పరుగెత్తారు.
ఒక గిన్నెలోనే రత్తీ, (ముసలయ్యా) తినడం మొదలుపెట్టారు. ఉప్పువేసిన గంజీ అన్నం, కక్కముక్కలు కొరుక్కుంటున్నారు. సత్తిరెడ్డి తన మూటలో ఉన్న ఊరగాయ అందరికీ కొంత కొంత పంచాడు. ఎక్కువభాగం రత్తికిచ్చాడు. చెల్లమ్మ సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వింది. ముసలయ్య చెల్లమ్మ వేపు చూసి రత్తివేపు అనుమానంగా చూశాడు.
లోకమంతా ఏదో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్టుగా దీనంగా ఉంది. నేను అరుగు మీద చాపమీద వెన్నువాల్చి ఏమీ చూడకుండా చూస్తున్నాను. కూలివాళ్లు తిని గిన్నెలు మెల్లగా కడుక్కున్నారు. ఆ గిన్నెలతోనే నీళ్లు సంతృప్తిగా తాగారు. చింతచెట్టు మొదట్లో చుట్టూ కూర్చున్నారు. తలగుడ్డల్లోంచీ, రొంటినించీ పొగాకు తీసి, కొంచెం నీళ్లతో తడిపి చుట్టలు చుట్టుకున్నారు.
పొద్దు తిరిగింది. కంగారుగా లేచి వాళ్లని హెచ్చరించాను. తొందరలేని స్థిమితంతో మెల్లగా లేచారు. తలపాగలు చుట్టుకున్నారు. నేలమీద తట్టలు ఎడమకాలితో లేవతన్ని ఎడమచేత్తో వంగకుండా పట్టుకున్నారు. తొందరలేని వేగంతో తవ్వు మళ్లీ ప్రారంభమయింది. మట్టిలో ఇసక పాలుంది. అంచేత పారలతో తవ్వవలసి వస్తోంది. సత్తిరెడ్డి గునపం పారేసి, తట్టల్లోకి పారలతో తవ్విపోస్తున్నాడు. తట్ట కాలితో వొడుపుగా రత్తి తన్ని పెట్టింది. యధాలాపంగా ఒక పార మట్టి రత్తి కాలి మీదకి సత్తిరెడ్డి విసిరాడు. తట్ట తన్నేసి చీదరగా కాళ్లు దులుపుకుంది. ముసలయ్య ఆవేపొక సారి చూశాడు.
పొద్దు వాలుతోంది. వాళ్ల తత్వాలని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్లు చెయ్యాలంటే చేస్తారు. మనం తొందరపెట్టినా వాళ్లు తొందరపడరు. వాళ్లకి కాలం, తొందర అనేవి లేవు. అయినా వాళ్లకొక అంచనా ఉంది. పని అయిపోతుందని వాళ్లకి తెలుసు. అయిపోతుంది కూడాను. కాని వాళ్లు మన చేతులో లేరు. మన అవసరాలన్నీ వాళ్ల చేతుల్లో కట్టుబడి ఉన్నాయి. వాళ్లకి మనం బానిసలం. వాళ్ల యెడల మన అంచనాలు పని చెయ్యవు.
చటుక్కుని ముసలయ్య తట్ట కుడిచేత్తో ఎత్తి రాక్షసిలాగ రత్తిమీద పడ్డాడు. తట్టతో నెత్తిమీద మోదాడు. చేతులతో కాసుకుంది. అంతా పని ఆపి ముసలయ్యని పట్టుకున్నారు. కోపంతో వణికిపోతూ అన్నాడు, ‘‘సరసాలాడతంది నెంజ’’.
‘‘నేదండి బాబో! నేదండి’’ అని దీనంగా కంగారుగా సగం ఏడుస్తోంది రత్తి.
‘‘తోలు వొలిచేత్తాను’’ ముసలయ్య మళ్లీ విజృంభించబోయాడు. సత్తిరెడ్డి బలంగా అతన్ని పట్టుకున్నాడు. ‘‘ఏటబ్బా ఆ యిసురు? కూంత పరాసకాలాడితేనే అంత కోపమా? పారుచ్చుకో. పారుచ్చుకో. సందలడిపోతంది. రండల్లా రండి.’’ అంతా మళ్లీ పని ప్రారంభించారు. నా గుండెల్లో అదుటు పోలేదు. ఆమెను తరవాత ముసలయ్య ఏం చేస్తాడో.
గట్టు పూర్తి అయేసరికి పొద్దు కుంకింది. వెన్నెల కూడా వేడిగా వ్యాపిస్తోంది. గిన్నెల్లో మిగిలిన అన్నాలు మళ్లీ వాళ్లంతా తిన్నారు. నేను అనుమానంగా రత్తి వేపు చూస్తున్నాను. కూలీల్లో ఒకడు వచ్చి కొంతడబ్బు కావాలన్నాడు. అనుమానిస్తూ ఇచ్చాను.
కరణం గారింట్లో భోజనం చేసి నేను వారిచ్చిన మంచం ఒకటి అరుగు పక్కని ఖాళీస్థలంలో వాల్చాను. గాలి కొంత చల్లబడుతోంది. కూలీలంతా ఎక్కడికో పోయారు. ముసలయ్య రత్తి ఎల్లాగ సమాధానపడతారో నని ఆందోళనగా పడుకున్నాను. ముసలయ్య ముఖంలో నాగరికతకు లొంగని పశుత్వం అప్పుడు చూశాను. రత్తిలో అసహాయమయిన దైన్యం చూశాను.
కూలీలు గొడవగా వచ్చారు. తాగి వచ్చారని గ్రహించాను. గట్టు మీద అల్లరి చిల్లరగా పడిపోయారు. ముసలయ్య తప్ప తాగాడు. రత్తీ బాగా తాగింది. ముసలయ్య పాట ప్రారంభించాడు.
సింత కొమ్మల మీద సిరిబొమ్మ ఆడింది
పుంతలో ముసలమ్మ పురిటి కెల్లిందే
‘‘పురిటి కెల్లిందే’’ అంతా అందుకున్నారు. ఎవరికొచ్చింది వాళ్లు పాడారు. క్రమంగా గొంతుకలు సన్నగిల్లాయి. పాటలు ఆగిపోయాయి.
నాకు మసగ్గా నిద్ర పడుతోంది. చటుక్కున రెండు స్వరూపాలు ఏవో నడిచినట్టయింది. కళ్లు విప్పి కదలకుండా చూశాను. రెండు మూర్తులు ఒకళ్ల మీద ఒకళ్లు తూలుతూ నడుస్తున్నాయి. రత్తి. ముసలయ్య. ముసలయ్య రహస్యంగా అన్నాడు.
‘‘ఈ యరుగు మీద తొంగుందామే’’
‘‘ఈ యెన్నిట్లోనే?’’
‘‘నడేశే’’ ఆమె నడుము పట్టుకున్నాడు. ఆమె తన్మయంగా అతని మీదికి వంగింది.
నేను మేలుకున్నాను. కాని కదలకుండా పడుకున్నాను. అతని ఈర్ష్య, కోపం, అంతా ఏమయింది? నాకా ప్రశ్న అర్థం కాలేదు కాని, నా మనస్సులో అనంతమయిన సంతృప్తి, ప్రశాంతి నిండుకున్నాయి. లోకం ఉండవలసినట్టుగానే ఉంది! నడవవలసినట్టుగానే నడుస్తోంది. నా కర్థం కాకపోతే మట్టుకు నష్టమేముంది? నాకు క్రమంగా నిద్ర పట్టింది.
ఏదో కలకలంతో మెలకువ వచ్చింది. కళ్లు నులుపుకుంటూ లేచి కూర్చున్నాను. కూలీలు హడావుడాగా తట్టలూ పారలూ గట్టుని పడేస్తున్నారు. కాలవలో అడుగుని సన్నగా నీటితడి ఆనింది. మనస్సు నిండిపోయినట్టయింది. చంద్రుడప్పుడే అస్తమించాడు. కూలీలు మళ్లీ నిద్రలో మునిగిపోయారు. అరుగుమీద చీకట్లో ఏమీ కనబడలేదు. కాని నాకు మాత్రం నిద్ర పట్టలేదు.
నేను మేలుకున్నాను. కాని కదలకుండా పడుకున్నాను. అతని ఈర్ష్య, కోపం, అంతా ఏమయింది? నాకా ప్రశ్న అర్థం కాలేదు కాని, నా మనస్సులో అనంతమయిన సంతృప్తి, ప్రశాంతి నిండుకున్నాయి.
పాలగుమ్మి పద్మరాజు (1915–1983) కథ ‘కూలిజనం’ సంక్షిప్త రూపం ఇది. దీని తొలి ప్రచురణ 1944లో ఆంధ్రపత్రికలో. సౌజన్యం: కథానిలయం. గాలివాన, పడవ ప్రయాణం, పద్మరాజు ప్రసిద్ధ కథల్లో కొన్ని. బతికిన కాలేజీ, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూణ్నాళ్ల పాలన, ఆయన నవలలు. సినిమా రచయితగానూ పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment