బాల్యం ప్రభావం జీవితాంతం ఉంటుంది
పాలగుమ్మి పద్మరాజుగారు నవల, కథానిక, నాట కం, వ్యాసం, కవిత్వం... సాహిత్యంలోని పలు శాఖ లలో సృష్టి చేసినా ఆయన పేరు చెప్పగానే ‘కథానిక’ గుర్తుకొస్తుంది. కారణం- ఆయన ‘గాలివాన’ కథా నిక అంతర్జాతీయ పోటీలో ద్వితీయ బహుమతి పొందడమే! ఆయనకు ఇష్టమైన ప్రక్రియా కథానికే.
ఆయన తన గురించి తనే ఓ వ్యాసంలో చెప్పు కుంటూ ‘‘నేను పది మందిని ఆకర్షించే మనిషిని కాదు. నాలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని నమ్మే టంత అహంకారమూ లేదు. అందుచేత నా కథాని కలు వేటిలోనూ నేను కథానాయకుణ్ణి కాదు. ఎవరికీ దొరకని అపూర్వ అనుభవం నాకేమీ కలగలేదు. అం దుకే నా గురించి కథానికల్లో రాసుకోలేదు. కానీ ఒక భయంకరమైన అనుభవానికి ఒకసారి లోనయ్యా ను. ఆ అనుభవం మాత్రం నా కథానికలో చోటు చేసుకుంది. అదే నాకు అంతర్జాతీయ బహుమతి తెచ్చిన ‘గాలివాన’... సాఫీగా జీవితం గడుపుతున్న రావు, మరుక్షణంలో జీవితం ఎలా గడుస్తుందో తెలీ ని బిచ్చగత్తె ఈ కథానికలో పాత్రలు. 1948వ సంవ త్సరంలో అర్థరాత్రి సంభవించిన తుఫాన్‌లో నేను గాలివాన కథానికలో రావు అనుభవించిన క్షోభంతా అనుభవించాను. మా ఇల్లు కూలిపోయింది. ఆ కూ లిన ఇంటికింద నా భార్య చిక్కుకుపోయి మూడుగంటల పాటు నిస్సహాయంగా పడి ఉంది. ఆ రాత్రి భయానకం, బీభ త్సం. అలాగని నేను కథానికలో రావుని మాత్రం కాను. ఒకే పరిస్థితిలో మేమిద్ద రం చిక్కుకున్నాం’’ అన్నారు.
రావు ఎన్నో బహిర్గత సూత్రాల్ని నిర్మించుకున్నారు. బిచ్చమెత్తకూడదు, అటువంటి వారిని దగ్గరకు రానీయకూడదు, దొంగతనాన్ని ప్రోత్సహించకూడదు లాంటివెన్నో! కానీ ‘గాలి వాన’లో ఆ సూత్రాలన్నీ కొట్టుకుపోయాయి. మాన వత్వమొక్కటే మిగిలింది. అదే రావుని, బిచ్చగత్తెను దగ్గరకు చేర్చింది.
‘మృత్యువు’ అంటే పాలగుమ్మి పద్మరాజు గారికి చెప్పలేని ఆకర్షణ. అందుక్కారణం 1927లో తాతగారి మరణాన్ని దగ్గర నుండి చూడటం! ఎం తో చలాకీగా ఉండే పిన్ని కూతురు హఠాత్తుగా చిన్న వయసులో చనిపోయింది. ఈ అనుభవం తాలూకు నీడలు ఆయన ‘బాల్యం, వియ్యన్న తాత మరణం, గాలివాన కథానికల్లో కనిపిస్తాయి. కొవ్వూరులో చది వేప్పుడు గోదావరి గట్టంట రైల్వే బ్రిడ్జి వరకు నడుస్తూ కనిపించిన అన్నింటి మీదా కవిత్వం చెప్తుండేవారట పద్మ రాజు. అందరిలోనూ అన్ని గుణాలూ కలసి ఉంటాయి. ఒకరిలోని మంచిని స్వీకరించగలిగినట్లు చెడుని స్వీకరించగ లగాలి అనడమే కాదు, ‘పడవ ప్రయా ణం’ అనే గొప్ప కథానిక ద్వారా ఈ విషయాన్ని చెప్పారు. ఓ విదేశీ సంస్థ పోలెండ్‌లోని భారతీయ రాయబారి కె.సత్వర్‌సింగ్ సంపాదకత్వంలో సంక లనం తెచ్చింది. దాంట్లో ఒకే ఒక తెలుగు కథానిక పడవ ప్రయాణం (ఆన్ ది బోట్).
యాదృచ్ఛికమేమిటంటే ఈ నెలలో పాలగు మ్మి పద్మరాజుగారి శతజయంతి పూర్తయితే, వచ్చే నెలలో గోదావరికి మహా పుష్కరాలు. అప్పుడు గోదావరి మాతని అంతర్జాతీయ స్థాయికి పెంచిన పాలగుమ్మి పద్మరాజుగారిని గుర్తు చేసుకోవలసిన అవసరం ఈ సందర్భంలో లేదా?
(జూన్ 24 పాలగుమ్మి శతజయంతి ముగింపు)
-డా॥వేదగిరి రాంబాబు