బాల్యంలో తప్పిపోవడం లేదా కిడ్నాప్‌కు గురవ్వడం.. పెద్దయ్యాక సంపన్నులైన తల్లిదండ్రులను కలవడం... ఎన్నో సినిమాల్లో మనం చూసిన కథే. కానీ ఆ సినిమా కథలను మించిన జీవిత కథ చైనాలో జరిగింది. మూడు నెలల వయసులో కిడ్నాప్‌కు గురైన పసిబాలుడు.. యువకుడిగా తల్లిదండ్రులను చేరాడు. ఆ తరువాత కథ మాత్రం సినిమాలను మించి పోయింది. అదేంటో చూద్దాం! ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న షి కిన్షుయ్ మూడు నెలల వయసులో కిడ్నాపయ్యాడు.
తల్లిదండ్రులు దశాబ్దాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ కుటుంబం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. రెండున్నర దశాబ్దాల తరువాత.. ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. డిసెంబర్ 1న కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. ఆ సందర్భాన్ని ఘనమైన వేడుకలా చేసుకున్నారు. అంతేకాదు తమ ఐశ్వర్యాన్నంతా ముందు పెట్టారు. అనేక భవనాలు.. లగ్జరీ కార్లు.. విలాసవంతమైన బహుమతులెన్నో అందించారు. కానీ.. ఇక్కడే పెద్ద ట్విస్ట్.
అప్పటిదాకా అనాథలా పెరిగిన షి.. ఆస్తులకు వారసత్వాన్ని పొందడానికి ఇష్టపడలేదు. తన భార్యతో కలిసి జీవించడానికి ఒక్క ఫ్లాట్‌ను మాత్రం తీసుకున్నాడు. ప్రస్తుతం తన లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న షి... తన సంపాదనతోనే జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కోట్ల ఆస్తులను వదులుకుని నిరాడంబరుడిగా మిగిలిపోవాలనుకున్న అతని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతని విలువలను కొందరు ప్రశంసిస్తుంటే.. సానుభూతి కోరుకుంటున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్న షి నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment