కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అది వారిని సత్ప్రవర్తన వైపుకి మళ్లించకపోగా..చిన్న వయసులోనే తట్టుకోలేని బాధలకు లోనవ్వుతారు. అందరూ ఒకలా తీసుకోరు. ఒక్కో పిల్లవాడి ఆలోచనా తీరు వేరుగా ఉంటుంది. చెడు అలవాట్ల బారిన పడకూడదని కొంతమంది తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చిన్నారులను తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు.
వాళ్లు మంచిగా మారడం అటుంచి ఇంటి నుంచి పారిపోయి.. ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఇలా తానుకూడా బాల్యంలో వేధింపులకు గురయ్యానని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. అంతపెద్ద స్టార్ కూడా ఒక్కసారిగా బాల్యం అనగానే వేధింపులే గుర్తుకొచ్చాయి. అంటే అవి నీలి నీడల్లా ఆయన్ను ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇలా చిన్నారుల బాల్యం చేదు జ్ఞాపకంగా మారకూడదంటే..
నటుడు ఆయుష్మాన్ ఖురాన్ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తండ్రి తనని బెల్టులు, చెప్పులతో దారుణంగా కొట్టేవాడనంటూ.. చిన్నతనంలో తాను అనుభవించిన బాధను చెప్పుకొచ్చారు. చిన్ననాటి ఆ గాయం తానింకా మర్చిపోలేదన్నారు. అయితే తాను మాత్రం తన పిల్లలకు అలాంటి తండ్రిని కానని, చాలా భిన్నంగా ఉంటానని అన్నారు.
ఆయుష్మాన్‌కి ఇద్దరు పిల్లలు. తన బాల్యంలా వేధనాభరితంగా గడిచిపోకూడదని వారితో ఫ్రెండ్లీ ఫాదర్‌గా ఉంటానన్నారు. ఇక్కడ ఆయుష్మాన్ తన బాల్యంలో కలిగిన చేదు జ్ఞాపకాలు అతడి మనుసులో చాలా బలంగా నాటుకుపోయాయి. కానీ ఆయన తాను మంచి తండ్రిగా ఉండాలని భావించడం హర్షణీయం. ఎందుకంటే తనలా తన పిల్లలు కాకూదని అనుకోవడమే గాక ఎవరి బాల్యం అలా గాయాలతో నిండిపోకూడదని కోరుకున్నారు ఆయుష్మాన్. ఇలా అందరూ సానుకూలంగా తీసుకునే యత్నం చేయరు.
చిన్నారుల సైకాలజీ ప్రకారం..బాల్యంలో జరిగే ప్రతిదీ వారి మనుసులో బలంగా నాటుకుంటుంది. వారు ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే వాతావరణం, పరిచయమై కొత్త వ్యక్తులు అంతా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈజీగా చెడు అలవాట్లు లేదా వ్యసనాల బారినపడే అవకాశం ఉంది. దీన్ని తల్లిదండ్రులు ఓ స్నేహితుడి మాదిరిగా దగ్గరకు తీసుకుని వివరించి..వాటి వల్ల ఎదురయ్యే నష్టాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతే తప్ప భయబ్రాంతులకు గురిచేసేలా కొట్టడం, తిట్టడం, లేదా పనిష్మెంట్లు ఇవ్వడం చేయకూడదు. ఇలా ప్రపంచమంతటా బాల్యంలో వేధింపులకు గురైన వారెందరో ఉన్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అలాంటి పిల్లలను వారి సన్నిహితులో, బంధువులో లేక తల్లిదండ్రులో ఎవరో ఒకరైనా దగ్గరకు తీసుకోవాలి. లేదంటే వారు నిరాశ నిస్ప్రుహలకు లోనై ఎందుకు పనికరాని వారుగా లేదా ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతారని చెబుతున్నారు నిపుణులు.
వేధింపులకు గురయ్యే చిన్నారుల తీరు..
చదువులో వెనుకబడటం
చురుగ్గా లేకపోవడం
ఆత్మవిశ్వాసం లేకపోవడం
వేలు నోట్లో పెట్టుకోవడం లేదా పక్కతడిపే అలవాటు
వారి ముఖం ఆందోళన, బాధతో ఉండటం
ఏకాగ్రత లోపించటం
నలుగురితో కలవకపోవడం
తదితర లక్షణాలు కనిపంచగానే వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అక్కడ వారికి ఆత్మవిశ్వాసం పెరిగేలే థెరపీలు ఇవ్వడం వంటివి చేస్తారు నిపుణులు. ఇక్కడ చిన్నారులు తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ఎవ్వరి వల్ల అయినా వేధింపులకు గురైతే.. వెంటనే తన తల్లిదండ్రులు లేదా తనను ప్రేమగా చూసేవారి వద్ద మనసు విప్పి మాట్లాడేలా చేయడం తదితర విషయాలను నేర్పించడమే గాక తల్లిదండ్రులతో పిల్లలకు సాన్నిహిత్యం ఏర్పడేలా ఇరువురు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తారు.
అలాగే మొండిగా ఉండే పిల్లలను కూడా దారిలో పెట్టాలని కొట్టడం చెయ్యకూడదు. ఓపికతో వ్యవహరించడం లేదా మానసిక నిపుణులను సంప్రదించి సరైన మార్గంలో పయనించేలా చేయాలి తల్లిదండ్రులు. అంతే తప్ప బాల్యం అంటే భారంగా గడిపిన బాధకరమైన క్షణాలుగా మిగలకూడదని అని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!)
Comments
Please login to add a commentAdd a comment