ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రేపటి పౌరుల ఆరోగ్యం సంకటంలో పడుతోంది. సరైన పౌష్టికాహారం అందక సతమతమవుతోంది. వయసుకు తగిన ఆహారం లేక చిన్నారులు బక్కచిక్కిపోతున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గత నెలలో చేపట్టిన అధ్యయనంలో సగం మంది చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో పావు శాతం మంది ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండగా.. 10 శాతం మంది తీవ్ర పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
ఆరోగ్యంగా 51 శాతం మందే..
రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 16,72,812 మంది ఉండగా.. 8,09,600 మంది ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశారు. వీరిలో 4,14,225 మందే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. 1,81,200 మంది (22%) వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మరో 10% మంది పిల్లల్లో పౌష్టికాహార సమస్య తీవ్రంగా ఉండగా.. 16% చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు లేకున్నా ఎత్తుకు తగ్గ బరువు లేనట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 51% మంది చిన్నారులు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది.
తక్కువ బరువుతోనే సగం జననాలు
అప్పుడే పుట్టిన శిశువు బరువు కనీసం 2.4 కిలోలు ఉండాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. కానీ రాష్ట్రంలో సగం వరకు జననాలు తక్కువ బరువుతోనే నమోదవుతున్నాయి. గర్భస్థ సమయంలో తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
కొందరు మూడు పూటలు ఆహారం తీసుకుంటున్నా.. ఒకే రకం పోషక విలువలున్న పదార్థాలు తీసుకుంటుండటంతో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం ఉంటోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతి 100 జననాల్లో 49 మంది పిల్లలు తక్కువ బరువుతోనే పుడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వెయ్యి జననాల్లో 39 మంది శిశువులు.. లక్ష ప్రసవాల్లో 95 మంది తల్లులు మృతి చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment