అమ్మా.. నాన్నా..ఆలోచించండి!
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతలతో పిల్లలతో తీరిగ్గా గడిపేంత సమయం ఉండడం లేదు. దీంతో పిల్లల మార్కులు, ర్యాంకులపై చూపించే శ్రద్ధ వారి మనసు తెలుసుకోవడంలో చూపడం లేదని అపోలో ఆసుపత్రి మనస్తత్వ నిపుణులు డాక్టర్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. చిన్నారుల్లో అభద్రతాభావం పెరిగిపోతోందని, వారు మానసిక వైద్యులను తరచుగా ఆశ్రయిస్తున్నారని సైకాలజిస్టు గీత చెప్పారు. ఒంటరితనం వల్ల భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
బడి ఒడిలో బాల్యం బందీ
అందమైన బాల్యంలో ఆనందం, ఆహ్లాదం దూరమవుతున్నాయి. తెల్లవారుజామున మొదలైన పరుగు రాత్రి పదింటి వరకూ ఆగడం లేదు. బడిలో ఆటలు ఆగిపోయాయి. సాంస్కృతిక అంశాలు కనుమరుగయ్యాయి. ఎవరైనా ఆసక్తితో పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పాలని ప్రయత్నించినా యాజమాన్యాలు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. సిలబస్ నుంచి తప్ప బయటి విషయాలు ఏవి చెప్పినా వెంటనే తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదుల పరంపర మొదలవుతుంది అంటున్నారు రిటైర్డ్ అధ్యాపకులు కె.వి.సుబ్బారావు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, మానసిక వికాసం వికసించాల్సిన పాఠశాల ప్రాంగణంలో అవన్నీ దూర మయ్యాయని ఆయన ఆవేదన చెందారు.
'సాధారణంగా పిల్లలు ఎదుర్కొనే ప్రధాన సమస్య వారిని ఇతరులతో పోల్చడం. తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పిదం ఇదే' అని ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి పేర్కొన్నారు. 'స్కూలు, కాలేజీ, పోటీ పరీక్షలు ఏవైనా విద్యార్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే రాణిస్తారు. కేవలం పరీక్షలో విజేతగా నిలవడమే తెలివితేటలకు కొలమానం కాదు. తెలివితేటలంటే కేవలం మార్కులు, ర్యాంకులే కాదు. సంగీతం, చిత్రలేఖనం, నటన.. ఇలా అభిరుచి ఉన్న రంగాల్లోనూ పిల్లలు రాణిస్తారు' అని చెప్పారు ఆర్.సి.రెడ్డి. బాలల్లోని సహజ సిద్ధమైన లక్షణాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
మార్గం చూపే గురువులు
పిల్లల మనసెరిగి ప్రవర్తించడం గొప్ప కళ. వారి ఆసక్తులు, అభిరుచులను గమనించి ప్రోత్సహించటం ఇప్పటి తల్లిదండ్రులకు సవాలుగా మారింది. గతంలో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో పెద్దలు.. పిల్లలకు వినయం, విధేయత, సంస్కృతి, సంప్రదాయాల గురించి విడమర్చి చెప్పేవారు. చిట్టిపొట్టి కథల తో దిశానిర్దేశం చేసే తాతయ్యలు, మంచి చెడులు వివరించి సన్మార్గంలో నడిపించే బామ్మలు ఇప్పటి తరానికి కరువయ్యారు. అందుకే ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు పేరెంటింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వెలిశాయి.
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక అంశాలు, గతాన్ని గుర్తుచేసే సంప్రదాయ విలువలను తల్లిదండ్రులకు, పిల్లలకు వారాంతాల్లో బోధిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం క్వాలిటీ టైం కేటాయించడం, వారి సమస్యలను సావధానంగా తెలుసుకుని సానుకూలంగా స్పందించడం, సౌమ్యంగా మాట్లాడటం వంటివి తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారు. ఇంటి పనిలో, వంట పనిలో తల్లిదండ్రులకు సాయం చేసేలా పిల్లలకూ శిక్షణ ఇస్తున్నారు. ఖాళీ దొరికితే చాలు టీవీకో, ఇంటర్నెట్‌కో అతుక్కుపోకుండా.. చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, నటన, యోగా వంటివి నేర్పిస్తున్నారు.
మన సుకుమారులు
'పోటీ ప్రపంచంలో చిన్నారులను యంత్రాలుగా మార్చేశాం. మార్కులు, ర్యాంకులు సాధించేవారిగానే పరిగణిస్తున్నాం. బిజీ లైఫ్‌లో పిల్లల కోసం సమయం వెచ్చించకపోవటం పెద్ద లోపం. మంచి చెడు, సభ్యత, సంస్కారం.. ఇవన్నీ పెద్దల నుంచి పిల్లలకు అలవడాల్సిన లక్షణాలు. కానీ వీటి గురించి తెలియజెప్పే సమయం తల్లిదండ్రులకు ఉండడం లేదు. పిల్లలు తీసుకుంటున్న ఆహారంపై పెద్దలు శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా పసితనంలోనే ఊబకాయం బారిన పడుతున్నారు.
మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల మనస్తత్వాన్ని గమనించి ప్రవర్తించాలనే విషయం చాలామంది పేరెంట్స్‌కు తెలియదు. దీనికి పరిష్కారం.. పిల్లలకు కూడా మనసుంటుందనే విషయం తెలుసుకోవడం. దీని కోసమే పేరెంటింగ్ క్లాసులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల మనసును గుర్తించడం ఎలాగో తెలియజేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది'
-నయనతార నందకుమార్, డెరైక్టర్, అవర్ సేక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్