health servey
-
Healthy Snacking Report 2024: మనోళ్లు కొంటున్నది... పోషకాలున్న స్నాక్సే!
న్యూఢిల్లీ: మార్కెట్లో స్నాక్స్ కొనేటప్పుడు ప్యాక్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా చదువుతున్నారా? అయితే ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నట్టే. ఆహారపదార్థాలు, ప్రత్యేకించి స్నాక్స్ కొనేటప్పుడు దానిలో వాడిన పదార్థాలేంటి? అందులో ఏమాత్రం పోషక విలువలున్నాయని 73శాతం మంది భారతీయులు చదువుతున్నారని హెల్తీ స్నాకింగ్ రిపోర్ట్–2024 సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 6వేల మందిపై సర్వే నిర్వహించి నివేదికను ఆది వారం విడుదల చేసింది. వీరిలో 93 శాతం మంది ఆరో గ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారని తెలిపింది. ఆహార కల్తీకి సంబంధించి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు, స్వీట్స్, ఇతర స్నాక్స్ ప్యాకెట్స్ కొనుగోలుదారులపై సర్వే నిర్వహించింది. ప్రతి 10 మందిలో 9 మంది సంప్రదాయ చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని చూస్తున్నారని తెలిపింది. డ్రైఫ్రూట్స్, నట్స్, తృణధాన్యాలతో చేసిన సహజమైన ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతు న్నారని తెలిపింది. డ్రై ఫ్రూట్స్, తామర గింజలతో చేసిన పేలాల (మఖనా)ను హెల్తీ స్నాక్‌గా గుర్తించారు. పోషకాలు అత్యధికంగా ఉన్న వీటిని కొనడానికి 67శాతం మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే వెల్లడించింది. -
బాల్యం..బలహీనం..
సాక్షి, హైదరాబాద్ : రేపటి పౌరుల ఆరోగ్యం సంకటంలో పడుతోంది. సరైన పౌష్టికాహారం అందక సతమతమవుతోంది. వయసుకు తగిన ఆహారం లేక చిన్నారులు బక్కచిక్కిపోతున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గత నెలలో చేపట్టిన అధ్యయనంలో సగం మంది చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో పావు శాతం మంది ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండగా.. 10 శాతం మంది తీవ్ర పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఆరోగ్యంగా 51 శాతం మందే.. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 16,72,812 మంది ఉండగా.. 8,09,600 మంది ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశారు. వీరిలో 4,14,225 మందే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. 1,81,200 మంది (22%) వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మరో 10% మంది పిల్లల్లో పౌష్టికాహార సమస్య తీవ్రంగా ఉండగా.. 16% చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు లేకున్నా ఎత్తుకు తగ్గ బరువు లేనట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 51% మంది చిన్నారులు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. తక్కువ బరువుతోనే సగం జననాలు అప్పుడే పుట్టిన శిశువు బరువు కనీసం 2.4 కిలోలు ఉండాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. కానీ రాష్ట్రంలో సగం వరకు జననాలు తక్కువ బరువుతోనే నమోదవుతున్నాయి. గర్భస్థ సమయంలో తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కొందరు మూడు పూటలు ఆహారం తీసుకుంటున్నా.. ఒకే రకం పోషక విలువలున్న పదార్థాలు తీసుకుంటుండటంతో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం ఉంటోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతి 100 జననాల్లో 49 మంది పిల్లలు తక్కువ బరువుతోనే పుడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వెయ్యి జననాల్లో 39 మంది శిశువులు.. లక్ష ప్రసవాల్లో 95 మంది తల్లులు మృతి చెందుతున్నారు. -
లావెక్కిపోతున్నారు!
తెలంగాణ పట్టణాల్లో స్థూలకాయం బారిన 40% స్త్రీలు, 32% పురుషులు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి ఊబకాయంలో దేశంలో తొలిస్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే స్థూలకాయులు ఎక్కువ తెలంగాణ పల్లెల్లో 18.5 శాతం మంది మహిళలకే అధిక బరువు ఊబకాయుల రాజధానిగా హైదరాబాద్ మారిన జీవనశైలి, జంక్‌ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడమే ‘బరువు’కు కారణం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పట్టణాలు స్థూలకాయం బారినపడుతున్నాయి! పురుషుల కంటే అధికంగా మహిళలే స్థూల కాయంతో సతమతమవుతున్నారు. దేశంలోని పట్టణాల్లో నివసించే మహిళల్లో అధిక బరువు ఉన్నవారు తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల బరువుపై సర్వే చేయగా.. తెలంగాణలో పట్టణాల్లో నివసించే మహిళల్లో 39.5% మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారని తేలింది. పురుషుల్లో 31.9% మంది అధిక బరువు ఉన్నట్టు వెల్లడైంది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో నివసించే మహిళల్లో స్థూలకాయం సగానికంటే తక్కువ ఉండటం గమనార్హం. తెలంగాణ పల్లె మహిళలు 18.5% మందే అధిక బరువు కలిగి ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో రెండు చోట్లా కలిపి మహిళలు 28.1%, పురుషులు 24.2% అధిక బరువు కలిగి ఉన్నారు. జీవనశైలే ప్రధాన కారణం దేశంలో తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలే ఊబకాయంలో తొలి రెండు స్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారత ప్రజారోగ్య సంస్థ సమాచారం ప్రకారం హైదరాబాద్ దేశంలో ఊబకాయుల రాజధానిగా అవతరించింది. ఇందుకు మారిన జీవనశైలే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, రెస్టారెంట్లకు వెళ్లి తినే సంస్కృతి పెరగడం, జంక్ ఫుడ్ తినడం, టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుని పోవడం, ఫలితంగా నిద్ర సరిగా లేకపోవడం వంటివి ప్రధాన కారణాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) తెలంగాణ ముఖ్య కార్యక్రమాల నిర్వహణాధికారి డాక్టర్ జి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అలాగే నిర్ణీత పనివేళలు లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, విందులు వినోదాలు పెరగడం కూడా ఒక కారణంగా విశ్లేషించారు. మధ్యతరగతి జనం వారాంతాల్లో రెస్టారెంట్లకు వెళ్లి ఆహారం తీసుకోవడం స్టేటస్‌గా భావిస్తున్నారు. ఇది వారి శరీరంపై ప్రభావం చూపుతోంది. అధిక బరువుతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా గుండె సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. అధిక బరువుతో షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు కూడా తలెత్తుతున్నాయి. పల్లెల్లో ఉండే మహిళలు వ్యవసాయ పనులకు వెళ్లడం, ఇంటి భోజనమే తినడం వంటి కారణాల వల్ల బరువు తక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దేశంలో తొలి రెండు స్థానాలు మనవే.. అధిక బరువులో తెలంగాణ పట్టణాల్లోని మహిళలు దేశంలో రెండో స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ పట్టణ మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారు. ఏపీ పట్టణాల్లో 45.6 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోని పట్టణ పురుషులు కూడా 44.4 శాతం ఊబకాయంతో ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉంది. దేశంలో మేఘాలయలో అత్యంత తక్కువగా 18.4 శాతం మంది పట్టణ మహిళలు, 17.1 శాతం పట్టణ పురుషులు ఊబకాయం బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా పట్టణ మహిళలే అధికంగా స్థూలకాయంతో బాధపడుతున్నట్టు సర్వేలో తేలింది.