లావెక్కిపోతున్నారు! | health servey in Telangana and Andhra Pradesh | Sakshi
Sakshi News home page

లావెక్కిపోతున్నారు!

Published Mon, Feb 1 2016 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

లావెక్కిపోతున్నారు!

లావెక్కిపోతున్నారు!

  • తెలంగాణ పట్టణాల్లో స్థూలకాయం బారిన 40% స్త్రీలు, 32% పురుషులు
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి
  • ఊబకాయంలో దేశంలో తొలిస్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ
  • పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే స్థూలకాయులు ఎక్కువ
  • తెలంగాణ పల్లెల్లో 18.5 శాతం మంది మహిళలకే అధిక బరువు
  • ఊబకాయుల రాజధానిగా హైదరాబాద్
  • మారిన జీవనశైలి, జంక్‌ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడమే ‘బరువు’కు కారణం
  •  
    సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పట్టణాలు స్థూలకాయం బారినపడుతున్నాయి! పురుషుల కంటే అధికంగా మహిళలే స్థూల కాయంతో సతమతమవుతున్నారు. దేశంలోని పట్టణాల్లో నివసించే మహిళల్లో అధిక బరువు ఉన్నవారు తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల బరువుపై సర్వే చేయగా.. తెలంగాణలో పట్టణాల్లో నివసించే మహిళల్లో 39.5% మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.

    పురుషుల్లో 31.9% మంది అధిక బరువు ఉన్నట్టు వెల్లడైంది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో నివసించే మహిళల్లో స్థూలకాయం సగానికంటే తక్కువ ఉండటం గమనార్హం. తెలంగాణ పల్లె మహిళలు 18.5% మందే అధిక బరువు కలిగి ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో రెండు చోట్లా కలిపి మహిళలు 28.1%, పురుషులు 24.2% అధిక బరువు కలిగి ఉన్నారు.

    జీవనశైలే ప్రధాన కారణం
    దేశంలో తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలే ఊబకాయంలో తొలి రెండు స్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ హైదరాబాద్  పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారత ప్రజారోగ్య సంస్థ సమాచారం ప్రకారం హైదరాబాద్ దేశంలో ఊబకాయుల రాజధానిగా అవతరించింది. ఇందుకు మారిన జీవనశైలే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, రెస్టారెంట్లకు వెళ్లి తినే సంస్కృతి పెరగడం, జంక్ ఫుడ్ తినడం, టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుని పోవడం, ఫలితంగా నిద్ర సరిగా లేకపోవడం వంటివి ప్రధాన కారణాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) తెలంగాణ ముఖ్య కార్యక్రమాల నిర్వహణాధికారి డాక్టర్ జి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

    అలాగే నిర్ణీత పనివేళలు లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, విందులు వినోదాలు పెరగడం కూడా ఒక కారణంగా విశ్లేషించారు. మధ్యతరగతి జనం వారాంతాల్లో రెస్టారెంట్లకు వెళ్లి ఆహారం తీసుకోవడం స్టేటస్‌గా భావిస్తున్నారు. ఇది వారి శరీరంపై ప్రభావం చూపుతోంది. అధిక బరువుతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా గుండె సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. అధిక బరువుతో షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు కూడా తలెత్తుతున్నాయి. పల్లెల్లో ఉండే మహిళలు వ్యవసాయ పనులకు వెళ్లడం, ఇంటి భోజనమే తినడం వంటి కారణాల వల్ల బరువు తక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
     
    దేశంలో తొలి రెండు స్థానాలు మనవే..
    అధిక బరువులో తెలంగాణ పట్టణాల్లోని మహిళలు దేశంలో రెండో స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ పట్టణ మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారు. ఏపీ పట్టణాల్లో 45.6 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోని పట్టణ పురుషులు కూడా 44.4 శాతం ఊబకాయంతో ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉంది. దేశంలో మేఘాలయలో అత్యంత తక్కువగా 18.4 శాతం మంది పట్టణ మహిళలు, 17.1 శాతం పట్టణ పురుషులు ఊబకాయం బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా పట్టణ మహిళలే అధికంగా స్థూలకాయంతో బాధపడుతున్నట్టు సర్వేలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement