పడవ ప్రయాణం | Classic story of Boat Trip | Sakshi
Sakshi News home page

పడవ ప్రయాణం

Published Sun, Nov 15 2015 12:39 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

పడవ ప్రయాణం - Sakshi

పడవ ప్రయాణం

క్లాసిక్ కథ
పొద్దు కుంకిన తరవాత లోకమంతా దిగులుగా ఉంది. పడవ మెల్లగా నీటిమీద జారుతోంది. నీరు పడవ పక్కన కలకల మంటూ రాసుకుంటోంది. చూపుమేరలో జీవనం చలనం లేని ప్రపంచం నిశ్శబ్దంగా జుమ్మంటోంది. ఆ ధ్వని దేహాన్నంతనీ తాకుతుంది. మనస్సు లోలోపల అది నిండుగా కంపిస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు ఏదో బ్రదుకు చివరకి ఆఖరయిపోతున్న నిస్పృహ, ప్రశాంతమయిన నిరాశ మనస్సులో నిండుకుంటాయి.

దూరంగా చెట్లు అస్పష్టంగా, మాయగా పడవతో కూడా నిశ్చలంగా ముందుకి సాగుతాయి. దగ్గరగా ఉన్న చెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దెయ్యాల్లాగ జీబురుమంటో వెనక్కి నడుస్తాయి. పడవ కదలదు, కాలవగట్టు కదులుతుంది. నా చూపులు చొచ్చుకుని చొచ్చుకుని నీటిలోకి చూస్తాయి. అందులో ప్రతిబింబించిన చీకటిని చీల్చుకుని చూస్తాయి. నక్షత్రాలు మెల్లగా కెరటాల మీద వివశంగా ఉయ్యాల లూగుతాయి. కన్ను తెరిచి నిద్రపోతాయి.
 
గాలి లేదు. పడవలాగే తాడు, ముని గర్ర చప్పుడయినప్పుడల్లా బిగువుగా, వొదులుగా అవుతోంది. పడవ వెనక భాగంలో పొయ్యిలో నిప్పు మండుతోంది. అప్పుడప్పుడు రప్పుమంటోంది. అప్పుడప్పుడు తగ్గిపోతోంది. లోపలికి ఊరిన నీరు చేదతో తోడి ఒక కుర్రవాడు కాలవలోకి పారబోస్తున్నాడు. పడవ లోపల ఏవేవో బస్తాలున్నాయి. ధాన్యం, బెల్లం, ఉప్పు, చింతపండు వగైరా. పడవ టాపుమీద నేను వెల్లగిల పడుకున్నాను. పడవ లోపల నించి చుట్టపొగలు, ఏదో సంభాషణ కలిసి మెల్లగా తాపీగా అన్ని దిక్కులికీ వ్యాపిస్తున్నాయి. గుమాస్తా కూచున్న గదిలో గుడ్డిదీపం కొద్దిగా కునుకుతోంది. పడవ సాగుతోంది.
 
‘‘ఏయి పడవా? ఈ గట్టుకి రానీ! ఈ గట్టుకి!’’ అని ఎవరో పిలిచారు.
 పడవ గట్టుకి జేరడంతోనే ఇద్దరు ఎక్కారు. పడవ ఆ పక్కకి కొంచెం వొరిగింది. ‘‘టాపుమీద కూకుంటాం లే!’’ అంది ఆడగొంతుక. ‘‘ఇన్నాళ్లూ ఏడ పోయావే? కనమట్టం లేదు’’ అన్నాడు చుక్కాని కాస్తున్న మనిషి.
 ‘‘ఇజానగరం, ఇశాక పట్టం, మావోడూ నేనూ కలిసి తిరిగొచ్చాం. అప్పన్న కొండకెల్లాం.’’
 ‘‘ఏడ బోతన్నా?’’
 ‘‘మండపాక పోతన్నాం మరిదీ! కులాస గున్నావా? గుమాత్తాగారు పాతోరేనా?’’
 ‘‘ఆ!’’
 
మగవాడు టాపుమీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నాడు. అతని నోట్లో చుట్ట పక్కకి పడిపోతే ఆడమనిషి తీసి ఆర్పేసింది. అతని వొంటిమీద గుడ్డ కప్పింది. తనో చుట్ట దీసి అంటించింది. అగ్గిపుల్ల రప్పుమన్నప్పుడు ఆమె ముఖం చూశాను. నల్లగా ఉన్న ముఖం ఎర్రగా వెలిగింది. ఆమె గొంతుకలో మగజీర ఉంది. ముఖం అందమయినది కాదు. జుట్టు చెదిరి పోయినా ముఖంలో ఏదో పెద్దమనిషి తరహా ఉంది. చీకట్లో కూడా ఆమె కళ్లు మేలుకున్నట్టు మెరుస్తున్నాయి.
 
ఇంతలో దీపం పెకైత్తి గుమాస్తా పడవ పక్కని నిలబడి చూశాడు. ‘‘ఏమే రంగీ, ఈడెవడు?’’ అడిగాడు. ‘‘మావోడండి, బాబ్బాబు రిమార్కు రాయించండి’’ అంది రంగి.
 ‘‘పద్దాలే! దింపెయ్యి! నీకు బుద్ధి లేదూ! మళ్లీ ఆణ్ణి పడవెక్కించా? తాగుబోతోణ్ణి.’’
 ‘‘నే తాగందే. ఎవరంట నే తాగానంటా?’’ అన్నాడు పద్దాలు.
 ‘‘ఒరే దింపెయ్యండర్రా! ఎందుకెక్క నిచ్చారీణ్ణి! చిత్తుగా తాగుతున్నాడు.’’
 ‘‘బాబ్బాబు, మండపాక్కాడ దిగిపోతాం.’’
 
‘‘ఏమన్నా అల్లరిచేసే కాలవలోకి తోయించేస్తాను. జాగ్రత్త!’’ గుమాస్తా గదిలోకి వెళ్లిపోయాడు. పద్దాలు లేచి కూర్చున్నాడు. అట్టే తాగినట్టు లేడు. చుట్ట అంటించాడు.
 పద్దాలుకి బొద్దుమీసాలు. కోల ముఖం. మనిషి కొంచెం సన్నంగా, నిర్లక్ష్యంగా ఉంటాడు.
 పడవ మళ్లీ నిశ్శబ్దంగా సాగుతోంది. పడవ వెనక భాగంలో నిప్పు రగలడం లేదు. సరంగులు తిన్న గిన్నెలు తాపీగా మాట్లాడుకుంటో కడుక్కుంటున్నారు. గాలి చలిగా లేదు. అయినా నేను కండువా కప్పుకున్నాను. అనంతమయిన ఆ చీకటికి అసహాయంగా శరీరాన్ని అప్పగించడానికి నాకు భయం వేసింది. గాలి చురుకుగా ఉంది - మెత్తని స్త్రీ స్పర్శలాగ.

చెప్పలేనంత మృదుత్వం, విశాలమయిన స్త్రీత్వం ఆ రాత్రిలో నిండుగా ఆవరించు కుని ఉంది. ఆ కౌగిలిలో నాకు చిరకాలం నాటి విషాద గాథలు జ్ఞాపక మొస్తున్నాయి - అనాది నించీ మగవాణ్ణి లాలించి పోషించిన స్త్రీత్వపు గాథలు.
 కొంచెం దూరంలో రెండు చుట్టలూ ఎర్రగా కాలుతున్నాయి. జీవితం బరువుగా అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ చుట్ట కాలుస్తున్నట్టు అనిపించింది.
 ‘‘వొచ్చీదేవూరు?’’ అన్నాడు పద్దాలు.
 ‘‘కాల్దారి’’ అంది రంగి.
 ‘‘ఇంకా శానా దూరముంది.’’
 
‘‘ఇయ్యాల జాగత్తుండ్రా. ఏరా నామాటినవూ?’’ రంగి జాలిగా బతిమాలుతూ అడిగింది. ‘‘బెదురు’’ అంటూ ఆమెపక్కలో వేలెట్టి పొడిచాడు.
 ‘‘అమ్మో!’’ అంది రంగి. తన్మయ త్వంగా ఆకాశంలోకి ముఖమెత్తి చీకట్లోకి చూసింది. ఆ స్పర్శ శాశ్వతంగా ఉండి పోవాలని కోరుతున్నట్టుగా ముఖమెత్తింది.
 నాకు నిద్రపట్టింది. పడవంతా కూడా నిద్రపోతో, నీటివాలుకి మెల్లగా జారి పోతోంది. కొంచెం దూరంలో

ఆ ఇద్దరు వ్యక్తులూ కొంతసేపు గుసగుసలాడు కున్నారు. నాకు నిద్ర పూర్తిగా పట్టలేదు. పడవ నడుస్తున్నట్టు, నీరు జారుతున్నట్టు, చెట్లు వెనక్కి పోతున్నట్టు తెలుసు. పడవనెవరూ లాగడం లేదు. అంతా కునుకుతున్నారు. రంగి నాపక్క నించి నడిచి చుక్కాని దగ్గరకు వెళ్లి కూచుంది.
 ‘‘మరిదీ! ఎల్లాగున్నా?’’ అంది.
 ‘‘నువ్వెల్లాగున్నా?’’ అన్నాడు చుక్కాని కాసేవాడు.
 
‘‘ఎన్నెన్ని సిత్తరాలు సూపించాడను కున్నా మావోడు! చినీమా కెళ్లాం! ఓడల్ని సూశాం! ఓడంటే ఓడ కాదు మరిదీ! మా వూరంతుంది’’ రంగి అల్లా చాలాసేపు కబుర్లు చెవుతో కూర్చుంది. ఆ కబుర్లు నన్ను జోకొడుతున్నట్టున్నాయి.
 ‘‘పిల్లా! నాకు నిద్దరొత్తందే!’’ అన్నాడు చుక్కాని కాసే మరిది. ‘‘సుక్కాని నేనూత్తాలే. నువ్వల్లా తొంగో’’ అంది.
 
పడవ మళ్లీ మెల్లగా జారిపోతోంది - నిశ్శబ్దంగా. రంగి ఆ నిశ్శబ్దాన్ని కదప కుండా గొంతుకెత్తి చల్లగా పాట పాడింది.
 ‘‘యాడున్నాడో!-నావోడు - యాడున్నాడో! కూడు గిన్నెలో యెట్టి - కూకుని సూత్తుంటె నీడల్లె మా పెల్లి నిదరే కంటికి రాదు - యాడున్నాడో!!
 రంగి గొంతుకలోని మగజీరలో సంగీతముంది. ఆ పాటలో పడుకుని ఉన్న అన్ని ప్రాణులూ ఒక్కసారి కునికాయి. గడిచిన యుగాల ప్రేమగాథలు వింతగా, విషాదంగా ఆ పాటలో కంపించాయి. ఆ పాట నీటి వెల్లువై పొంగితే అందులో లోకం చిన్న పడవలాగ తేలిపోయింది. మానవ జీవితం ఈ ప్రణయం తోటి, ఈ విషాదం తోటి మాయగా, వింతగా, బరువుగా అనిపించింది.
 
పద్దాలు నెత్తిని ముసుగు మూసుకొని కూర్చున్నాడు. కాని అతనికీ రంగికీ మధ్య కొన్ని యుగాల అంతరమేదో ఉన్నట్టు తోచింది. అతను టాపు దిగి పడవలోకి పోయాడు. నేను వెల్లగిల పడుకొని చూస్తున్నాను. రంగి అల్లాగే పాడుతోంది. నాకు నిద్ర పడుతోంది. రంగి పాట అల్లా లోకాలు తిరిగి వచ్చి మళ్లీ మెల్లగా నా గుండెల్లో తగులుతోంది. నాకు నిద్ర పట్టింది. నిద్రలో ప్రాకృతికమయిన ప్రణయం నా ముందు గంతులు వేసింది. పాట క్రమంగా జ్ఞప్తిలోనించి పోయింది. నిద్ర నా మనస్సు తలుపులు మూసింది.
   
పడవలో గొడవయింది. కళ్లు నులుపు కుంటో లేచాను. పడవ గట్టుకి చేర్చివుంది. లాంతర్లు పట్టుకుని సరంగులు కంగారుగా పడవ ఎక్కి దిగుతున్నారు. గట్టుమీద రంగిని ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. అందులో ఒకడు గుమాస్తా. అతని చేతిలో మడిచిన తాడుంది. రంగికి అప్పుడే దెబ్బలు తగిలుంటాయి. నేను చటుక్కుని పడవ దిగి ఏం జరిగిందని అడిగాను.
 
‘‘ఆ దొంగనాకొడుకు సరుకు ఎత్తుకు పోయాడు. ఇది ఎక్కడో గట్టుకి తార్చింది పడవని. సుక్కాని పట్టుకుంది!’’ గుమాస్తా కోపంగా, చిరాకుగా అన్నాడు.
 ‘‘ఏం పోయాయి?’’ అని అడిగాను.
 ‘‘రెండు బెల్లం బుట్టలు, మూడు చింతపండు బుట్టలు. నేనందుకే ఎక్కని వ్వొద్దన్నాను. ఎక్కడ దింపుకుపోయాడే?’’
 ‘‘కాల్దారి కాడండి! బాబయ్యా!’’
 ‘‘కాల్దారి కాడ మేం మేలుకునుంటే?’’
 ‘‘అయితే నిడదవోలు కాడేనండి!’’
 
‘‘ఇదిప్పుడు చెప్పదు. రేపు అత్తిల్లో పోలీసోళ్ల కప్పగిద్దాం!’’ గుమాస్తా ఆమెను పడవ్వేపు తోశాడు. సరంగులు ఆమెను పడవెక్కించారు. ‘‘నిద్దర మొకాలు! సూసుకోవొద్దూ! దాని చేతులో సుక్కాని ఎవరెట్టమన్నారు?’’ గుమాస్తా అందరి మీదా విసుక్కుని గదిలోకి పోయాడు. రంగిని టాపుమీదికి ఎక్కించారు. ఒక సరంగు ఆమె పారిపోకుండా కాపలా వున్నాడు. నేను కూడా ఎక్కాను. పడవ మళ్లీ కదిలింది. నేను చుట్ట ముట్టించాను.
 
‘‘అయ్యగోరోసుట్ట ఇప్పించరూ!’’ రంగి చనువుగా అడిగింది. చుట్ట, అగ్గిపెట్టీ ఇచ్చాను. ఆమె చుట్ట ముట్టించింది. ‘‘మరిదీ! నన్ను పోలీసోళ్ల కప్పగించి ఏం లాబం!’’
 ‘‘గుమాస్తా వొదలడు!’’ అన్నాడు సరంగు.
 ‘‘పద్దాలు నీ మొగుడా!’’.. అడిగాను.
 ‘‘మావోడు’’ అంది రంగి.

 ‘‘దీన్ని పెళ్లాడలేదు. ఆడికి ఇంకొక త్తుంది. ఇప్పుడది ఎక్కడుందే?’’ అన్నాడు సరంగు.
 ‘‘కొవ్వూరులో ఉంది. రంగూ, పొంగూ బాగుందిప్పుడు. నేను తిన్నన్ని తన్నులు తింటే అదీ నాలాగే అవుద్ది.’’
 ‘‘మరి నీకింకా వాడితో ఎందుకు!’’ అన్నాను నేను. ‘‘ఆడు నా వోడండి!’’ అంది. అంతా అందులో ఉన్నట్టుగా.
 ‘‘ఇంకొకత్తితో పోతున్నాడన్నావుగా?’’
 ‘‘ఎక్కడ పోతాడు? మొగోడి కెంతమందయితే మాత్రమేం? ఆడండి, మా రాజండి. అల్లాంటి మనిషి లేడండి.’’
 
‘‘బాబో! ఆడి సంగతి మీరింకా ఎరగరు. ఇదెంత రంగుగా ఉండేదను కున్నారు? ఓ తూరండి, దీన్ని గుడిసెలో పెట్టి గుడిసి అంటించేశాడు. మగ్గిపోయిందనుకోండి! ఇంకా దీనికి భూమ్మీది నూకలున్నాయిగాని’’ అన్నాడు సరంగు.
 ‘‘అయ్యగోరు! అప్పుడు ఆడు కనమడితే పీకి నులిమేద్దామనుండేది. కాలిన గడోటి ఈపుమీద పడిందండి.’’ ఆమె వెనక్కి తిరిగి రవిక కొంచెం పెకైత్తింది. తెల్లటి మచ్చ ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనబడింది.
 ‘‘మరి ఇంకా వాణ్ణి పట్టుకు దేవులాడుతావేం?’’ అని అడిగాను.
 
‘‘ఏం చెయ్యను? ఆడు కంటబడితే అన్నీ మరిచిపోయి కరిగిపోతాను. ఈ సందాల కొవ్వూరులో బయలుదేరాం. దార్లో నన్ను జాలిగా బతిమలాడాడు. ఈ పడవలో ఎక్కి చేతికి చిక్కిన సరుకు దించి పారెయ్యాలని. నేనుంటేగాని సాగదు. అడ్డ దోవని నడిచి మడుగు జేరుకున్నాం.’’
 ‘‘ఎక్కడ దింపేశాడు సరుకు?’’
 ‘‘ఎక్కడో నాకూ గుర్తునేదండి.’’
 రంగి మొగం చూడాలని నాకు ఎంతో కుతూహలం వేసింది. కాని ఆ కటిక చీకట్లో అవ్యక్తంగానే ఉండిపోయింది.
 
పడవ మెల్లగా పాకుతోంది. నడిరాత్రి గడిచినకొద్దీ గాలి చిరుగాలిగా తగులు తోంది. చెట్ల ఆకులు కొద్దిగా కదులు తున్నాయి. మళ్లీ పడవని సరంగులు లాగుతున్నారు. నాకింక నిద్రపట్టలేదు. కొంతసేపటికి కాపలా ఉన్న మనిషి కునికి ఒరిగి చివరకి నిద్రపోయాడు. రంగి పారిపోయే ప్రయత్నం మానుకుంది. తాపీగా చుట్ట కాలుస్తూ కూర్చుంది.
 ‘‘నీకసలు పెళ్లి అవలేదా’’ అడిగాను.
 ‘‘లేదు. సిన్నతనంలోనే పద్దాలు నన్ను లెగేసుకొచ్చాడు.’’
 ‘‘మీదేవూరు?’’
 
‘‘ఈండ్రపాలెం. అప్పుడు తాగు తాడని నాకు తెలదు. ఇప్పుడు నేనూ తాగుతాననుకోండి. తాగితే తప్పు లేదు. తాగి సావగొడతాడు.’’
 ‘‘మరి వొదిలి వెళ్లిపోకపోయావా?’’
 తన్నులు తిన్నప్పుడల్లాగనిపిత్తది. అయినా అంతటి మనిసి లేడండి. ఉత్తప్పుడండి, యెన్నలా కరిగిపోతాడు. వొందమందితో పోయినాసరే ఆడు నాకాడి కొచ్చితీరతాడు. నేను లేకపోతే గుండగిలి సచ్చిపోడూ?’’
 
నాకు వింతగా అనిపించింది ఆ అమ్మి తత్వం. వాళ్లిద్దరి అనుబంధం ఎల్లాంటిదో నాకు అర్థం కాలేదు.
 ‘‘మాకిద్దరికీ ఏపనీ సరిపడింది కాదు. సిగురుకి దొంగతనాల్లోకి దిగాం. ఓనాడు నా గుడిసికి దాన్ని తీసుకొచ్చాడు.’’
 ‘‘ఎవరిని?’’
 ‘‘ఇప్పుడున్న గుంటని. నా యెదురు గుండా, నా ఇంటో దాంతో ఉన్నాడు. నా కళ్లెదర! చిత్తుగా తాగొచ్చాడు. అదీ తాగింది. దానిమీద పడి పీకాను. ఆడు నన్ను సావదన్నాడు. అద్దరేత్తిరికాడ దాన్నెక్కడకో తీసుకుపోయాడు. మల్లీ వొచ్చాడు.

నేను తిట్టాను. ఇంటోకి రావొద్దన్నాను. గుమ్మంకాడ కూకుని పిల్లోడికన్నా జాలిగా ఏడిచాడు. ఆ గుంట లేకపోతే బతకలేనన్నాడు. నాక్కోపం ఎక్కువయిపోయింది. గుమ్మంలోంచి గెంటి తలుపేసుకున్నాను. తలుపు గుంజి గుంజి సివరికి ఎల్లిపోయాడు. నాకు శానాసేపు నిద్దర రాలేదు. కొంచెం కునుకు పట్టేతలికి ఇల్లంటుకుంది. తలుపు పైన గొళ్లెమేసి నడికొప్పంటించాడు. ఎవరూ రాలేదు. నడిరాత్తిరి. నా వొళ్లంతా మగ్గి పోయింది. తెలివి తప్పింది.

ఇంతలో అవతల్నించి తలుపు తెరిచారు. మన్నాడు ఆణ్ణి పోలీసోళ్లట్టుకున్నారు. ఎవరిమీద అనుమానముందో నన్ను చెప్పమన్నారు. ఆడుమాత్రం కాదని చెప్పేశాను. సందేల నాకాడ కొచ్చి, ఎంతో జాలిగా ఏడిచాడు. ఉత్తప్పుడసలు ఏడుపే రాదు. నవ్వుతుం టాడు. సుక్కడితే సాలు, పిల్లోడి కన్నా ఎక్కువగా ఏడుస్తాడు.’’
 ‘‘నువ్వింకా వాడితో ఎందుకు దిగుతావు ఈ దొంగతనాల్లోకి?’’
 ‘‘ఏం జెయ్యమంటారు? ఆడొచ్చి గోలెడితే?’’
 
‘‘మరి నిన్ను విజయనగరం తీసుకుని వెళ్లాడన్నావు?’’
 ‘‘వొట్టిది. ఊరికే అల్లా సెప్పాను. నేనంటే కొంచెం సరంగులికి నమ్మకం. ఇదిగాక రెండు తూర్లు ఈ పడవలో దొంగతనం జరిగింది.’’
 ‘‘నిన్ను పట్టుకుంటే పోలీసులు ఏం జేస్తావు?’’
 ‘‘ఏమీ చెయ్యను. నన్ను పట్టుకునేం జేత్తారు? నాకాడ దొంగసొమ్ము లేదు. ఏమో ఎవరెత్తుకుపొయ్యారో, ఓ రోజు కొడతారు, మన్నాడొగ్గేత్తారు.

ఆడు దొరకడు. ఈపాటికంతా అయిపోద్ది. ఆడు దొరక్కుండానే నేను పడవలో ఉండిపోతా.’’ ఆమె నిట్టూర్చి విడిచి మళ్లీ మెల్లగా తనలో తను అనుకున్నట్టు చెప్పింది. ‘‘ఈ సొమ్మంతా మళ్లీ ఆ గుంటకే దక్కుడు. దాని మీద మోజు తగ్గీదాకా దాన్నొదలడు. నా ఉసురోసుకుంటంది.’’
 ఆ మాటల్లో ఉద్రేకమేమీ లేదు. ఆమె అతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా అంగీకరించింది. పద్దాలు కోసం ఆమె ఎల్లాంటి పనన్నా చెయ్యడానికి సిద్ధంగా ఉంది.

అది ఒక ఆదర్శమూ కాదు. భక్తీ కాదు. ప్రేమా కాదు. ఎన్నో చిత్రమయిన సంకీర్ణ భావాలతో, ఈసులతో, అనురాగాలతో ఎన్నిటితోనో కలిసిన స్త్రీ హృదయం! అయినా ఆ హృదయం అన్నిటికీ ఫలితంగా ఒకేచోట లగ్నమయి ఉంది. తన మగవాడికోసం ఆమె నిరం తరం తపిస్తుంది. కాని అతడు నిర్దుష్టంగా, నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. సుగుణాలతో, అవగుణాలతో అతన్ని ఆమె అంగీకరిం చింది. నాకామె బ్రతుకు బరువనిపించింది. నిజానికి నా బ్రతుకే బరువేమో అంతకంటే.
 
రంగి మోకాళ్లు ముడుచుకుని ఎటో అవ్యక్తంగా చూస్తోంది. ‘‘ఆడు నావోడు! ఎన్ని తిరుగుళ్లు తిరిగినా నావోడు నా దగ్గరకే వొత్తాడు,’’ అని తనలో తను అను కుంది. అందులో ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం తొణికిసలాడాయి. ఆ మాట ఆమె జీవిత సర్వస్వానికి కేంద్రంలాగ అవుపించింది. నేను భయంతో, భక్తితో, జాలితో ఆ మాట విని ఊరుకున్నాను. అల్లాగ తెల్లవారీదాకా కూర్చున్నాం.
 నేను పడవ దిగిపోయేముందు ఒక రూపాయి ఆమె చేతులో పెట్టి ఊళ్లోకి పోయాను. ఆమె జవాబు చెప్పీదాకా నేను నిలబడలేదు. ఆమె సంగతి తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు.                                         
- పాలగుమ్మి పద్మరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement