Classic story
-
ఉంగరం
క్లాసిక్ కథ అమ్హయ్య! ఈ రోజుతో తన కష్టాలన్నీ ఫలిస్తాయి. దేనికైనా ధైర్యం ఉండాలి. ఎటువంటి అద్భుతమైన ఆలోచన తట్టింది తనకి! ఎలాగ మెరుస్తోంది తన అందమైన వేలికి? - ఇంక దీనితో తాను బతుకుని కొత్తగా తీర్చుకోవాలి. సుఖంగా దర్జాగా జీవితం గడపాలి. ఇంతవరకూ తానెంత నీచంగా బతికిందీ తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. అంట్లు తోమడం, గదులూడ్చడం, వాళ్ళిచ్చే పాసిపోయిన అన్నంతో పాటు తిట్లనీ శాప నార్థాల్నీ మూటకట్టుకుని నిస్సహాయతతో ఉడుకుమోతుతనంతో యింటికి వెళ్ళడమూ - అక్కడ తల్లి రోగంతో మంచం మీద బల్లిలాగా అంటుకుపోయి, తాను ఆలస్యంగా వచ్చి నందుకు ఇంకా తిట్టడమూ - తన వొళ్ళంతా చాకిరితో నొప్పులూ - ఏడుపొచ్చేది తనకి. చచ్చిపోవాలనిపించేది. అందరిలాగా తాను హాయిగా కులాసాగా ఎందుకు బతకకూడదు? పంతులమ్మ కూతురిలా సిల్కు వోణీలు తన కెందుకుండవు? రవణమ్మ బుగ్గలూ వొళ్ళూ ఎలా నిగనిగలాడుతుంటాయో - రెండు పూటలా మీగడ పెరుగూ వెన్నపూసా వేసుకుని తింటుంది కదూ! తన యీడుదే వరహాలు మరి. రోజూ తల్లో పువ్వులు పెట్టుకుని కాటుక పెట్టుకుని సినిమాకు వెళ్తుంటుంది మొగుడితో. మరి తనకి పువ్వులూ సినిమాకి డబ్బులూ ఎప్పుడూ వుండవు. మరి మొగుడూ లేడు! తనలో ఎన్ని కోరికలు! ఎన్ని కలలు! చిన్నప్పట్నుండీ తనకెందుకో ఎగిరిపోవాలనీ, పాటలు పాడాలనీ, నాట్యం చెయ్యాలనీ ఎన్నో ఎన్నో - పొలంగట్టుకాడ కూర్చుని సినిమా పాటలు పాడుతుంటే తనకేసి అందరూ చూసి నవ్వేవారు. తనని వెర్రిదనేవారు. ఏమిటో తన వెర్రి! మంచిబట్టలు కట్టుకోవాలనీ, షోగ్గా సింగారించుకోవాలనీ హాయిగా బతకాలనీ ఎవరనుకోరు! వాళ్ళకి డబ్బూ యిల్లూ ఉన్నా ఎంత అసహ్యంగా బతుకుతారు! ఎంత లేకిగా వుంటారు? వడ్డాణమూ కాసులపేరూ పెట్టుకుని తిరుగుతుంది అమ్మగారు. ‘అమ్మా, ఈవాళ తిరణాల, ఓ బేడ డబ్బు లివ్వండి’ అని అడిగితే దండకం చదువుతుంది. ‘నా దగ్గర ఏం ఒలకడంలేదు. ముష్టిముండా పీనుగని ఒక్క అణా డబ్బులు కూడా నాకివ్వరు. తాళి కట్టాడు కాబట్టి యిలా బతుకుతున్నాను కుక్కిన పేనులాగ. ఈయన్నీ ఈయన డబ్బునీ చూచి పీక కోశాడు మానాన్న’ - అబ్బబ్బ వినలేక వచ్చేస్తాను. ఇవ్వకపోతే మానె, ఇంత అఘాయిత్యంగా మాట్లాడుతుందే విటి: అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ధాన్యం చాటుగా అమ్మి డబ్బు దాచేసుకుంటుంది. పోనీ అయ్యగారిని అడిగితే ఆయన ఒకటే తిట్లు. ‘‘ఈ గది సరీగా ఊడవలేదేం! వెధవ పనితనం నువ్వూ, పైగా డబ్బులు కావాలిట! మీ అమ్మ నిరుడు వైద్యానికి మూడు రూపాయలు తీసుకు వెళ్ళింది. తీర్చడం మాట ఉత్తిదే. అయినా తిరణాలకెందుకే నీకు? వెధవ చిరుతిండి తింటా నికా? రెండు పూటలా తింటున్నావు చాలదూ?’’ ఉక్రోషం వచ్చింది తనకి! తనదగ్గరే డబ్బులుంటే ‘‘ఏడవకయ్యా! ఈ రూపాయి తీసుకుని తిరణాలకెళ్ళి నువ్వే కొనుక్కో’’ అని యిచ్చేసును. ఇవ్వనంటే పోయేది యింతంత మాటలెందుకో! తనకి అందం లేదా! తెలివితేటలు లేవా! సుబ్బయ్యగారి గదిలో ఎవరూ లేనప్పుడు అద్దంలో తన మొహాన్ని చూచుకొనేది. ఎంత అందంగా వుంది తన మొహం - నిగనిగలాడే వొళ్ళూ, మెరిసే కళ్ళూ, బుగ్గమీద సొట్టా - వాళ్ళ అచ్చెమ్మకన్న వెయ్యిరెట్లు నయం. కొంచెం సబ్బు పెట్టి మొహం తోముకుని పువ్వులరైక తొడుక్కుంటే అచ్చెమ్మ డీలా అయి పోదూ! చిన్న కళ్ళూ, లావాటి పెదవులు - దాన్నెవడు మనువు చేసుకుంటాడూ! డబ్బుని చూశా? వెర్రిముండాకొడుకులు. పిల్ల యేపుగా ఊతంగా వుంటే సరదా కాని డబ్బుతో ఏం మనసు తీరుతుందీ? తిని బలిసిన అచ్చెమ్మకి ఎప్పుడూ సొగసులూ సొలపులూ. లేవలేదు, కూర్చోలేదు. తనకున్న విలువ వాళ్ళకుందా. తన అందాన్ని ఊరకే తక్కువకి కొనెయ్య వచ్చునని అను కుంటారు రౌడీ వెధవలు. రోడ్లమ్మటి పోతుంటే కోరగా జోరుగా చూస్తారు. సుబ్బయ్య గారి కోడలు - అదేవిటి అలా చూస్తాడు? జేబులోంచి వెండి రూపాయితీసి మోగిస్తాడు. చెయ్యి వూపుతాడు! మళ్ళీ భయం. వీధి గుమ్మంలో జోడు చప్పుడవగానే గటుక్కున గదిలోకి దూకి తలుపులు వేసుకుంటాడు, వాళ్ళ బాబు వస్తున్నాడని. తన వాళ్ళందరిలాగా తనకెందుకో తృప్తి వుండదు. రంగురంగుల ఊహలు కలవర పెడు తుంటాయి. తనకెన్నో కథలు వచ్చును. ఊరవతల గుడికాడ సాధుబాబా వుండేవాడు. చిన్నప్పుడు తనకి మాంచి కథలు చెప్పేవాడు. తెల్లని గడ్డం, ముడతలు పడిన కళ్ళూ, వళ్ళూ, చిరిగిన బనీనూ వేసుకుని తన్నెంతో ఆప్యా యంగా చూసేవాడు. తాను గొప్పదానినౌతా నని రాజకుమారినవుతానని చెప్పేవాడు. రాజకుమారులు తెల్లని గుర్రాలమీద ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోయి పెళ్ళి చేసు కుంటారట. వాళ్లకి పెద్ద పెద్ద మేడలు, నౌకర్లు, మాంచి పిండివంటలు, జిగేల్మనే నగలు... సీతాలుని ఓ అబ్బాయి అలాగే లేవ తీసుకుపోయాడు. ఏడాది పోయాక మళ్ళీ వచ్చింది సీతాలు. ఎంచక్కావుంది. సిల్కుచీర కట్టుకుంది. బంగారపు గాజులు వేసుకుంది. ఆ అబ్బాయి పట్నం తీసుకెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నాడట. వర్తకం చేస్తాడట. ఎంతో డబ్భు లాభం వస్తుందిట! ‘‘నన్ను కూడా తీసుకు పోయేందుకు ఎవడినేనా చూసిపెట్టు సీతాలూ’’ అని అడిగింది ఆ రోజున. ఎంతో బతిమాలు కుంది. సీతాలు విరగబడి నవ్వింది. ‘‘నేను చూసి పెట్టనా. ఓయమ్మ యిదేం సోద్దెమే ’’ అంది. ‘‘నాకేం తక్కువ?’’ అంది తను ఉక్రోషంగా. ‘‘ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎలాగ? మాంచి పరికిణీ వోణీ కుట్టించుకో, ఆ మొగుడెవరో వాడే వస్తాడులే’’ అంది సీతాలు. తనకి మంచి బట్టలు ఎలా వస్తాయి? పోనీ సుబ్బయ్యగాడు, వెర్రిపిల్ల చాలాకాలం నుంచి చాకిరీ చేస్తోందని కొనిపెట్టకూడదూ? ఆయన కూతురు అచ్చెమ్మ ఓ చీర యివ్వకూడదూ? ఇలా అనుకునేది తను. కానీ యింత సులువైన ఊహ తట్టనేలేదు ఎప్పుడూ తనకి. సుబ్బయ్య చిన్న కొడుకు బళ్ళో నుంచి వస్తున్నాడు. వాడి వేలిని ఉంగరం మెరిసింది. ఈ కబురూ ఆ కబురూ చెప్పి మిఠాయి కొనిపెట్టి ఉంగరం తీసేసుకుంది. కుర్రనాగన్న యింటి దగ్గర చెప్పగలడా? సుబ్బయ్యగారూ, పెళ్ళామూ ఉంగరం ఎక్కడో పోయిందనుకుంటారు. ఈ ఉంగరం అమ్మితే ఇరవై రూపాయలేనా వస్తాయి. ఆ డబ్బుతో అందమైన బట్టలు కొనుక్కుని కట్టుకుని వెళుతూవుంటే మాంచి రాజకుమారుడులాంటి కుర్రాడు తన్ను చూసి ‘‘ఏయ్ అమ్మాయ్’’ అని నవ్వుతాడు అదోలా. పెళ్ళికొడుకులు నవ్వినట్టు నవ్వుతాడు. అప్పుడు... అయినా తను అందర్నీ నమ్మకూడదు. మంచివాణ్ణి, డబ్బున్న వాడినీ ఏరుకోవాలి. దొరలాగ వుండాలి వాడు. ‘నిన్ను పెళ్ళి చేసి కొంటాను. నువ్వులేందే బతకలేను లచ్చీ’ అనాలి. అప్పుడెంచక్కా వాడిని పెళ్ళి చేసు కుంటుంది. సీతాలులాగా పట్నం వెళ్ళిపో తుంది. ఎప్పుడేనా సుబ్బయ్యగారు యిటువస్తే తనను చూసి ‘అబ్బో’ అని ముక్కు మీద వేలేసు కుంటారు! పెళ్ళి చేసుకోలేకపోతే నలుగురిలో గౌరవం ఉండదు. అందరూ తిడతారు. ఛీ అంటారు. పెళ్ళయితే కాని - మగవాడికి అలుసివ్వకూడదు. దొంగవెధవలు సరదా తీరాక పురుగును దులిపినట్టు దులిపి పారేస్తారు. సింగడు మరి యిదివరకూ ఏం చేశాడు? ఎన్ని కబుర్లు చెప్పాడు? రంగం వెళ్ళిపోదామన్నాడు. తీరా ఓ రోజున మరెవత్తెనో పెళ్ళి చేసుకున్నాడు. తనింకా అప్పుడు చిన్నపిల్ల. ఎంతో ఏడ్చింది. ‘‘ఏంటి యిలా అన్యాయం చేశావ్’’ అంటే ‘నిన్నెవడు పెళ్ళాడుతాడు’ అన్నాడు. నల్లని ఉంగరాల జుట్టు ఉండాలి. తెల్లగా పొడుగ్గా ఉండాలి. మంచి యిల్లు తోటా వుండాలి. అలాంటి అబ్బాయి వచ్చి పెళ్ళి చేసుకోవాలి. తలలో పువ్వులు పెట్టుకొని పెరట్లో పాటలు పాడుతూంటుంది తను. వెనకాలే వచ్చి కళ్ళు మూస్తాడు. చేతులు తీయ కుండానే బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు. తను మళ్ళీ ఆయన మొహాన్ని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటుంది. తను రోజూ నీళ్ళు పోసుకుంటుంది. ఘుమఘుమలాడే సబ్బుతో వొళ్ళంతా రుద్దుకుంటుంది. బలే వాసన. ఓసారి సుబ్బయ్యగారి అల్లుడు వదిలేసిన సబ్బు ముక్క తెచ్చుకుని నీళ్ళు పోసుకుంది. తన వొళ్ళు కొత్తగా మెత్తగా పట్టుచీరలా మెరిసిపోయింది. ఒకానొక వేసవిలో ఊరికి దూరంగా ఉన్న ఒక మామిడితోపులో కూర్చుని పగటి కలలు కంటోంది. పదిహేడేళ్ళ దాసీపిల్ల లక్ష్మి చిరిగిన మానిన బట్టలూ సంస్కారంలేని చిక్కబడిన జుట్టూ, ఆమె కళ్ళల్లో ఊహల నిచ్చెనలమీద ఎగబ్రాకే కోర్కెల్ని ఆపలేకపోతున్నాయి. చల్లని పైరుగాలి, ప్రశాంతమైన మామిడితోటా, యౌవనం కొత్తగా వింతగా అలుముకుంటూన్న ఆమె వయస్సూ ఆమె కలల్ని మరింత రెచ్చ గొడుతున్నాయి. తాను దిక్కులేని దాసీపిల్లననీ, తన భవిష్యత్తు ఎప్పుడూ యింతేననీ వాస్తవికంగా ఆమె ఆలోచించగలిగితే అప్పుడీ స్వప్నాలవల్ల కలిగే క్షణికమైన మధురానుభూతి కూడా జీవితంలో లేకుండా చేసుకోవడమే అవుతుందేమో! బతుకు అడుక్కిపొయినకొలదీ బతకడానికి చేయూత స్వప్నం మాత్రమే కాబోలు. అందరూ అభాగిని అయిన లక్ష్మిలాగ కలలు కంటారు. కానీ ఆ కలలు నిజాలౌతా యని నమ్మరు. అక్కడ వాళ్ళు తెలివిగా జాగ్రత్త పడతారు. కాని లక్ష్మిలాంటి అమాయకులూ ఆవేశ హృదయాలూ కలల్ని తరుముకుంటూనే పరుగెత్తుతారు. దానిలో గొప్పితగిలేదీ గొయ్యి వచ్చేదీ చూచుకోరు. రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండి వంటల్ని గురించీ, దరిద్రుడు ధనం యిచ్చే సౌఖ్యాన్ని గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు. నిజమే. అందుకే భయంకర దరిద్ర పీడితులూ, అంగవికలులూ, దుర్భర వ్యాధిగ్రస్తులూ ఆత్మహత్య చేసుకుని కడతేరకుండా బతుకుతూనే వుంటారు, రేపటి సుఖంకోసం. కళ్ళెంలేని భావనా ప్రపంచంలో విహారం చేస్తూన్న లక్ష్మి తనని ఓ గంట నుండి నారాయణ అదేపనిగా పరికిస్తున్నాడని గమ నించలేకపోయింది. కొంతసేపయ్యాక అతను మెల్లగా ఆమె దగ్గరకు నడచి వచ్చాడు. చామన చాయగా వున్నాడు. పైజామా తొడిగి తెల్లని గ్లాస్కో చొక్కా వేసుకున్నాడు. కాళ్ళకి నల్లని స్లిప్పర్సు, జుట్టు వెనక్కు దువ్వాడు, పెదవులు ఎర్రగా ఉన్నాయి తాంబూల సేవనం వలన. సుబ్బయ్యగారి కొడుకు కన్న, సింగడు కన్న ఎంతో బాగున్నాడు. ఎంతో బాగున్నాడు. చదువుకున్నవాడిలా ఉన్నాడు. లక్ష్మికి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు. లక్ష్మి తల పెకైత్తి చూసింది. ఫక్కున నవ్వింది. ఆమెకి కథలో రాజ కుమారుడు నిజంగా వచ్చేసినట్టనిపించింది. ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాడు నారాయణ గంభీరంగా. ‘‘ఏం?’’ అంది ఓరగా చూస్తూ లక్ష్మి. ఇంకా ఆమెకు పూర్తిగా మెలకువ రాలేదు. వేలినున్న ఉంగరాన్ని ఆప్యాయంగా చూచుకుంటోంది. ‘‘నీ పేరేవిటి?’’ అడిగాడు నారాయణ. సన్నగా నవ్వి తియ్యగా చూసింది లక్ష్మి జవాబుగా. ‘‘ఈ తోట ఎవరిదో తెలుసునా?’’ ఈసారి కోపంగా అధికారంగా అన్నాడు నారాయణ. ఉలిక్కిపడింది లక్ష్మి ‘‘మీదేంటి బాబూ, ఊరికనే కూర్చున్నాను...’’ భయపడుతూ లేచి నుంచుంది లక్ష్మి. వీడు తనని పెళ్ళి చేసుకోడానికి రాలేదా? నారాయణ గీరగా చూశాడు. అదోవిధంగా దగ్గాడు. లక్ష్మి కూడా గమ్మత్తుగా చూసింది: నవ్వింది. ‘‘నీ పేరేవిటీ?’’ ప్రశ్నించాడు మృదువుగా నారాయణ. ‘‘లచిమి.’’ ‘‘ఈ వూరేనా?’’ ‘‘ఉహు పక్క ఊరు’’ ‘‘ఏం చేస్తుంటావ్?’’ సందేహంగా కనురెప్ప పెకైత్తి నారాయణను చూసింది. దాసీ దాన్నని చెప్పాలా చెప్పకూడదా అని తటపటా యిస్తోంది. నారాయణ మీద చెయ్యివేశాడు. జాలిగా అన్నాడు. ‘‘పాపం. దాసీ పిల్లవా?’’ లక్ష్మి తలూపింది ఔనని. నారాయణ ఈసారి ఆమె బుగ్గలమీద చేత్తోరాశాడు. ‘‘మాంచి దానివి.’’ ఆశగా చూసింది లక్ష్మి! ‘‘అలాగరా - ఆ పక్కకి’’ అని అర్థవంతంగా నవ్వాడు నారాయణ. ‘‘ఎందుకూ?’’ ‘‘ఇక్కడ అందరూ చూస్తారు.’’ తెల్లబోయి చూస్తోంది లక్ష్మి. ‘‘డబ్బులిస్తాను సరేనా, రా.’’ ఛీ, తననింత లోకువగా చూస్తున్నాడేమిటి? తనని ప్రేమించాననీ పెళ్ళి చేసుకుంటాననీ అనడేం అనుకుంది లక్ష్మి. ‘‘నాను సెడిపోయిన దాన్ని కాదు. నానల్లా రాను’’ అంది లక్ష్మి. ‘‘ఇక్కడి కెందుకొచ్చావు మరి?’’ కోపంగా అడిగాడు నారాయణ. ‘‘పెళ్ళి చేసుకుందుకు-’’ అమాయకంగా అంది లక్ష్మి. ‘‘ఎవర్నీ?’’ అన్నాడు. పెళ్ళిచేసుకునేందుకు మామిడి తోపులోకి రావడమెందుకో రకరకాల అనుభవం గల నారాయణకే అర్థమవలేదు. ‘‘నాకు నచ్చినవాణ్ణి, డబ్బున్నవాణ్ణి’’ అంది లక్ష్మి. నారాయణకి లక్ష్మి ఒక్కసారిగా అర్థమై పోయింది, మెల్లగా కబుర్లలోకి దింపాడు. ఆమె ఊహలు పయనించే తోవలేమిటో తెలుసు కున్నాడు. తర్వాత జాలిగా ప్రేమగా అన్నాడు ‘‘నన్ను పెళ్ళి చేసుకుంటావా లక్ష్మీ’’ ‘‘మిమ్మల్నా?’’ ‘‘అవును.’’ ‘‘ఒట్టు?’’ ‘‘ఒట్టు’’ ‘‘మరి సింగడిలాగ..’’ ‘‘సింగడెవడూ?’’ ‘‘దొంగనా...’’... రెండు మాటలలో సింగడెవడో చెప్పింది లక్ష్మి. ‘‘ఛఛ.. నేనలాంటివాణ్ణికాను. నీలాంటి పిల్లకోసమే చూస్తున్నాను. నిన్ను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను. పువ్వుల్లో పెట్టి పూజిస్తాను’’ అన్నాడు నారాయణ. ‘‘నిజం?’’ పెద్దకళ్ళలో వెలుగు నిండగా అడిగింది లక్ష్మి. ‘‘ఇంకా నీకు చదువు చెప్పిస్తాను.’’ ‘‘ఓహ్!’’ ‘‘డ్యాన్సు నేర్పిస్తాను.’’ ‘‘అబ్బో.’’ ‘‘మరి ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం?’’ అన్నాడు నారాయణ. ‘‘పట్నంలో కాదా పెళ్ళి?’’ - సీతాలుని జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మి. నారాయణ ఓ సెకను ఆలోచించి ‘‘అవును పట్నంలోనే - నేనక్కడేగా ఉండేది’’ అన్నాడు. ‘‘మీరు పట్నంలో ఏం చేస్తుంటారు?’’ నారాయణ చిక్కులో పడ్డాడు. ఈ పల్లెటూరిపిల్ల, అమాయకురాలూ, రొమాంటిక్ ఊహలు ఉన్న లక్ష్మికి ఏం చెపితే పని జరుగు తుందో గటుక్కున ఊహించడం నారాయణ వంటి చురుకైనవాడికేనా కష్టమే. హోటలులో సర్వర్‌గా, కారు క్లీనరుగా, పిక్‌పాకెటర్‌గా, రైలులో మందులమ్మేవాడిగా బహుపాత్రాభి నయం చేసిన నటనావతంసుడు ఆలోచించి అన్నాడు ‘‘మోటారు డ్రైవర్ని.’’ ‘‘అంటే’’ ‘‘పెద్ద పెద్ద మోటారులూ, లారీలూ నడుపుతాను. నేనెలాగ నడుపితే అలాగ వెడతాయి.’’ చక్రం దగ్గర కూర్చుని మోటార్లు నడిపేవాళ్ళని చూడకపోలేదు లక్ష్మి. కాని నారాయణ చెప్పడంలో, ఈ డ్రైవరు పని అసాధారణమైనదిగా తోచింది ఆమెకి. ‘‘బాగా డబ్బొస్తుందా?’’ ‘‘ఓ, కావల్సినంత. మనం హాయిగా బతకొచ్చును.’’ లక్ష్మి హాయిగా బతకటాన్ని ఆలోచిస్తోంది. ‘‘నిన్నెప్పుడూ కారుమీద తిప్పుతాను. పట్నంలో కార్ల మీద పెద్ద పెద్ద వీధుల్లో ఝామ్మని పోతూంటే’’ అన్నాడు నారాయణ. కిలకిల నవ్వింది లక్ష్మి. నారాయణ సమర్థతలో నమ్మకం చిక్కింది. సంజ యెరుపులు కళ్ళల్లో కలలకి మరింత విభ్రమాన్ని చేకూర్చాయి. ‘‘మరి ఎప్పుడు పట్నం వెళ్ళటం?’’ అంది. ‘‘ఆ ఉంగరం ఎక్కడిది నీకు?’’ అన్నాడు నారాయణ లక్ష్మిపై గల శ్రద్ధను విశదపరుస్తూ. ‘‘నాదే.. ఏం?’’ బెదురుగా అంది లక్ష్మి. ‘‘అబద్ధం. నా దగ్గర దబాయించకు.’’ ‘‘నాదే నాదే.. మరి..’’ ‘‘నిజం చెప్పు. లేకపోతే పోలీసులొచ్చి జైల్లో పడేస్తారు నిన్ను. నీ కోసమే చెపుతున్నాను. నమ్మవా నన్ను?’’ లక్ష్మి సంగతంతా చెప్పింది. ‘‘ఈ ఉంగరం నీ దగ్గరుంటే అపాయం వెర్రిదానా. రేపీపాటికి ఖైదులో వుంటావు. ఈ ఉంగరం నా చేతికిచ్చెయి. రాత్రికి రాత్రి కరిగించేసి రూపాయలు తీసుకొస్తాను’’ అన్నాడు నారాయణ ఆత్రంగా. ‘‘నేను మంచి వోణీ పరికిణీ కొనుక్కుందామనుకున్నాను’’ దీనంగా అంది లక్ష్మి. ‘‘పిచ్చిదానా, నేను కొని తీసుకొస్తాను. ఈ చిరిగిన బట్టలతో పట్నం వెళ్ళితే నవ్వుతారు.’’ లక్ష్మి సందేహంగా బెదురుగా బాధగా ఉంగరాన్ని వేలినుంచి మెల్లగా తీసి ఇచ్చింది. ‘‘మరి పెళ్ళి చేసుకుంటావా!’’ అంది. ‘‘ఒట్టు వెయ్యలేదూ?’’ ఒట్టుయొక్క మహత్యాన్ని కిమ్మనకుండా అంగీకరిస్తుంది లక్ష్మి. ‘‘మళ్ళీ ఎప్పుడొస్తారు!’’ ‘‘ఈ రాత్రికి ఎక్కడో ఒకచోట పడుకో. తెల్లారగానే గుడి దగ్గరకు వచ్చి ఉండు. అక్కడికి నేను వస్తాను. రాత్రి కరిగించేసి అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను. ఇద్దరం కలసి రెలైక్కి బొంబాయి వెళ్ళిపోదాం ఏం?’’ ‘‘అదేం వూరు? ఛ, నేను రాను.’’ ‘‘బొంబాయి చాలా పే..ద్ద పట్నం లక్ష్మీ.’’ ‘‘సీతాలు మరి చెన్నపట్నం వెళ్ళిందేం?’’ ‘‘వెధవ చెన్నాపట్నం. బొంబాయి ఇంకా గో.. ప్పవూరు. అక్కడ డబ్బు బోలెడు దొరుకుతుంది.’’ లక్ష్మి ఆలోచించింది. ‘‘గుడి కాడనే వుంటాను వస్తారా?’’ ‘‘తప్పకుండా. వెళ్ళొస్తాను - ఏం?’’ లక్ష్మి తలూపింది బెదురుగా. బుగ్గమీద చిటికవేసి గబగబా పొలాలలోంచి నడచి వెళ్ళిపోయాడు నారాయణ. చీకటి పడుతూంటే భయం కలసిన ఆనందంతో కలల మత్తుతో గుడివైపు నడచింది లక్ష్మి. ఆరు, ఏడు, ఎనిమిది. తొమ్మిది కూడా అయింది. లక్ష్మికి ఆకలి ఎక్కువౌతోంది. ఎండ చుర్రుమనగానే గుడి దగ్గర రావిచెట్టు నీడకి వెళ్ళికూర్చుంది. గుడిగోపురం అంత ఎత్తుగా ఎవరు కట్టారా అని చాలాసేపు ఆలోచించింది. గోపురం మీద ఏదో పక్షి వాలింది. లక్ష్మికి సరదా వేసింది. తనకి అంత పైన నుంచి భూమి అన్ని వైపులా చూడాలనిపించింది. కొంతసేపు ముసలి రోగిష్టి తల్లి జ్ఞాపకం వచ్చింది. బొడ్డులో తాళాలు దోపుకున్న సుబ్బయ్యగారు కేకలు వేస్తోన్నట్టు అనిపించింది. మధ్య మధ్య అకారణంగా ఉలిక్కిపడింది. గాలిలోంచి యేదో కమ్మని వాసన వస్తోంటే, లాలాజలాన్ని గుక్కిళ్ళు మింగింది. పూజారి గవరయ్య ఎవరు నువ్వని అడిగాడు. ‘బొమ్మాయి’ వెళ్తున్నానని చెప్పింది. నారాయణ ఎటువైపునుండీ రావడం లేదు. తనని దగా చేశాడా? గుండె కొట్టుకుంది భయంతో, ఆశాభంగంతో కాదు. తప్పకుండా వస్తాడు. తనని పెళ్ళిచేసుకుంటాడు. ఆ కళ్ళలో ఎంత ఇష్టంగా చూశాడు! కాలవ రేవు నుంచి తడిసిన బట్టలతో బిందెలు బుజాన పెట్టుకుని ఆడవాళ్ళు వెళు తున్నారు. గుళ్ళోంచి మంత్రాలు వినపడు తున్నాయి. దేవుణ్ణి తలచుకుని నమస్కరించింది. కళ్ళెత్తి చూసింది. ఎదురుగా సుబ్బయ్యగారు పోలీసులతో. లక్ష్మి కంగారుపడిపోయింది. పారిపోదామనుకుంది. ‘‘ఆగక్కడ’’ గద్దించాడు పోలీసు. లక్ష్మి జబ్బ పట్టుకున్నాడు. ‘‘ఇక్కడ తగులడ్డావా, ఇదేం బుద్ధే నీకు?’’ అన్నాడు సుబ్బయ్య. లక్ష్మి వణుకుతూంది. ‘‘ఏదీ ఉంగరం?’’ వగరుస్తూన్న సుబ్బయ్య గారు గట్టిగా గొంతుచించుకుని అడిగాడు. ‘‘ఉంగరవేంటీ?’’- తనని తాను కాపాడుకుంటానికి ఒకటే మార్గం అయిన అబద్ధాన్ని ఆశ్రయించింది లక్ష్మి. ‘‘రెండు తన్నండి’’ సుబ్బయ్య సలహా ఇచ్చాడు. పోలీసు లాఠీతో వీపు మీద పొడిచాడు. ‘‘అమ్మో’’ అంది లక్ష్మి. ‘‘చెప్పు ఉంగరం ఏంచేశావు?’’ ‘‘నాకు తెల్దు’’ మొరాయించింది లక్ష్మి. పోలీసు మొకాళ్ళ మీద లాఠీతో కొట్టాడు. అరిచింది లక్ష్మి. కళ్లమ్మట నీళ్లు ప్రవాహం కట్టాయి. జనం మూగారు. కొందరు వెకిలిగా నవ్వారు. కొందరసహ్యించు కున్నారు. ‘‘స్టేషనుకి నడు’’ అన్నాడు పోలీసు. మునివేళ్ళ మీద నిలబడి చుట్టూ మూగిన జనంలోకి, జనం అవతల వున్న రోడ్డు వైపూ పరకాయించి ఆశగా చూసింది నారాయణ వస్తున్నాడేమో అని. కానీ జాడ లేదు. తల్లి జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చింది రోడ్డు మీద చతికిలబడి. పోలీసు ఒక పక్కా, సుబ్బయ్య ఒక పక్కా నడుస్తోంటే దారి పొడుగునా నారాయణ వస్తాడనీ, తనని విడిపిస్తాడనీ ఆశతో కన్నీళ్ళతో చూస్తూనే ఉంది. రెండు నెలలు జైలులో ఉండేటప్పటికి నారాయణ ఇంక రాడని లక్ష్మికి దృఢమైంది. ఇసుకలాంటి అన్నమూ, చీకటి కొట్టులాంటి జైలుగదీ, మనోవ్యథా... లక్ష్మిని నీరసంగా అసహ్యంగా చేసివేశాయి. ‘ఉంగరమూ పోయింది. పెళ్లీ పోయింది’ అని గొణుగుకునేది ఒక్కతే, కటకటాల్ని పట్టుకుని. మగవాడినెవడినీ నమ్మకూడదనుకుంది. అయినా సుబ్బయ్యగారి కొడుకు ఉంగరం తాను తీస్తే పోలిసులకెందుకూ బాధ అనిపించింది లక్ష్మికి. లక్ష్మి హేతువుకి ఈ చట్టాలు మనుష్యులూ అర్థం లేకుండా కనిపించాయి. రోజూ తెలియకుండా ఏడ్చేది. జ్వరం వచ్చేది. కదలకపోయినా కాళ్ళు లాగేవి. ముసలితల్లి చచ్చిపోయిందేమో అన్న దిగులు, రాత్రుళ్ళు నిద్రలో తనూ నారాయణా ‘బొమ్మాయి’ వెళుతూన్నట్టూ, దారిలో రైలు లోంచి తనని నారాయణ కిందికి తోసేసినట్లు, తన తల చితికి రక్తం ప్రవహించినట్టూ కలవచ్చి ‘బాబోయ్’ అని అరుస్తూ లేచి కూర్చునేది. ఒకరోజు ‘లక్ష్మీ’ అన్న పిలుపు వినబడింది. ఎక్కడా అని తెల్లబోయి గది నలువైపులా చూసింది. ఎవరూ కనబడలేదు. మళ్ళీ ‘లక్ష్మీ ఇక్కడ... నేను’ అన్న మాటలు వినిపించాయి. ధ్వని వచ్చిన వైపే చూసింది. తన గదినాను కున్న గది గోడ పగులులోంచి నారాయణ చూసి నవ్వుతున్నాడు. ‘‘నేనూ-నారాయణని లక్ష్మీ’’ ‘‘నువ్వెలాగొచ్చావు?’’ ఆశ్చర్యంతో అడిగింది లక్ష్మి. ‘‘నిన్న రాత్రి తీసుకువచ్చారు’’ ‘‘ఏం?’’ ‘‘సైకిల్ షాపులో పనికి కుదిరాను. డబ్బు అవసరం వచ్చి సైకిల్ చక్రం అమ్మేశాను. పోలీ సులు వచ్చి ఇక్కడ ఉండమని బతిమాలు కొన్నారు’’ నవ్వుతూ చెప్పాడు నారాయణ. ‘‘బలేగా అయింది సచ్చినోడా-బాగా అయింది’’ కసితో మెటికలు విరిచింది లక్ష్మి. ‘‘నాకిదేమీ కొత్త కాదు పిల్లా. ఇది అయిదోసారి మనం రావడం’’ అన్నాడు నారాయణ తన ఆధిక్యతను నిరూపిస్తూ. ‘‘మంచిదానివి లక్ష్మీ, నీ ఉంగరం అమ్మితే ఇరవైరూపాయలొచ్చినై. వారం రోజులు దర్జాగా వెలిగింది మన బతుకు. సినిమాలూ, కాఫీ హోటళ్ళూ హాయ్ హాయ్’’ ‘‘దొంగనాయాల’’ తిట్టింది లక్ష్మి. ‘‘నీ తిట్లు నాకు తగలవు’’ అన్నాడు. ‘‘అన్నాయం చేశావు దొంగసచ్చినోడా. నా ఉసురు నీకు తగుల్తుంది’’ అంది ఉక్రోషంతో. ‘‘ప్రపంచవే అన్యాయం లక్ష్మీ. ఎవడికి అవసరమైతే వాడే అన్యాయం చేస్తాడు. నువ్వు దొంగతనం చెయ్యలేదూ? నీ దగ్గర్నుంచి నేను కొట్టేశాను’’ ‘‘ఫో...నీ జిమ్మడా’’ ‘‘ఎక్కడికి పోను. ఇక్కడే నీకు సావాసనంగా వుంటాను’’ లక్ష్మి బాధతో మొహం మరోవైపు తిప్పి కూర్చుంది. నారాయణ నవ్వుతూ అన్నాడు.. ‘‘జైలు నుంచి విడిచాక వచ్చి నిన్ను తప్పకుండా పెళ్లిచేసుకుంటానులే’’ అంటూ ఫక్కున నవ్వాడు నారాయణ. లక్ష్మి ఉక్రోషంతో మాట్లాడలేదు. ‘‘అప్పుడు బొంబాయి వెళ్లిపోదాం. ఏది లక్ష్మీ ఇటు చూడు. ఒక ముద్దియ్యి’’ అంటూ ‘ప్చ్’ అని పెదవులతో చప్పుడు చేశాడు నారాయణ. లక్ష్మి దగ్గరున్న నీళ్ల లోటా తీసి పగులు వైపు విసిరింది. పెద్ద చప్పుడయింది. పోలీసు ‘ఏమిటది’ అని కేక వేశాడు. లక్ష్మి మోకాళ్ళ మీద తల ఆన్చి ఏడుస్తోంది. నారాయణ వెకిలినవ్వు జైలుగదిలో కోలాహలంగా ప్రతిధ్వనించింది. - తిలక్ -
జలపాతం గట్టున...
క్లాసిక్ కథ ఈ సంవత్సరాంతంలో ఎదురుచూడని ఒక మంచి ఉత్తరం వచ్చింది మాకు. అది ఎంతో సంతోషం కలిగించింది. జన్మస్థలం మీది అభిమానమూ, పొదిగై కొండ చరియల మీది సౌఖ్యమూ ప్రతి యేడూ మమ్మల్ని కుట్రాలానికి లాక్కుని వెడతాయి. ప్రతి యేడూ మేమక్కడికి వెళ్లేముందు, మా మిత్రులూ మా కుటుంబ వైద్యులూ అయిన డాక్టరు ముత్తుకుమారస్వామి గారిని సకుటుంబంగా వచ్చి మాతో పాటు కాలం గడపవలసిందిగా కోరుతాము. ఆయనా ప్రతిసారి మా ఆహ్వానాన్ని పెడచివిని పెడుతూ ఉంటాడు. ‘‘రెండు నెలలూ మీరు మాతో వుండవద్దు. రెండు వారాలైనా వుండండి’’ అని బలవంతం చేసేవాణ్ని. ‘‘అమ్మో! రెండు వారాలే! రెండు రోజులు కూడా నేనీ చెన్నపట్టణం విడిచిపెట్టి రాలేను’’ అని చెప్పేవాడు డాక్టరుగారు. ముత్తుకుమారస్వామి అలా అనడానికి ప్రబలమైన కారణం లేకపోలేదు. ఈ మహానగరంలో నూర్లకొద్ది డాక్టర్లున్నా ఎడింబరో వెళ్లి ఇంగ్లీషు భాషలోని యిరవై అక్షరాలను తమ పేర్లకు చివర తగిలించుకున్న వైద్యులున్నా, ఈ అరవై ఏళ్ల వృద్ధుడు డాక్టరు ముత్తుకుమారస్వామి వద్దకే రోగులు వెతుక్కుంటూ వెడతారు. అందులోనూ కోయడం, కత్తిరించడం, అతికించడం, కలిపి కుట్టడం వంటి శస్త్ర చికిత్సలంటేనూ, పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలంటేనూ తప్పకుండా కుమారస్వామి చేతి మీదుగా జరగాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రముఖుల శరీరాలు ముత్తుకుమారస్వామి కత్తికోసం ఎదురుచూస్తూ వుంటాయి. ఆయనకి భోజనం చేసేందుకు కూడా తీరిక వుండదు. ఆయనకి భోజనానికి కూర్చునే సావకాశం కూడా లేదని ఆయన భార్య అంటూ ఉంటుంది. నిజానికి ఆమె సాంబారూ అవియలూ అన్నంలో కలిపి ఒక పళ్లెంలో ఉంచుతుంది. డాక్టరు నిలబడే భోజనం ముగించుకుని త్వరత్వరగా ఒక శస్త్ర చికిత్స కోసం బయలుదేరుతారు. ఈ దృశ్యం నేను చాలాసార్లు చూశాను. ‘ఇటువంటి డాక్టర్ని రెండు నెలలపాటు రోగుల నుంచి వేరుచేసి, కుట్రాలంలో బంధిస్తే, అంతమంది రోగుల వుసురు మనకు కొడుతుందండి’ అని నా భార్య చాలాసార్లు నాతో చెప్పింది. ఈ డాక్టరు ముత్తుకుమారస్వామిగారి వద్ద నుంచే ఆ అపూర్వ లేఖ వచ్చింది. మేము కుట్రాలం చేరుకున్న రెండు వారాలకు ఆ జాబు వచ్చింది. సంతోషమూ ఆశ్చర్యమూ మమ్మల్ని ఆవహించాయి. సంతోషం ఎందుకంటే, సకుటుంబంగా వచ్చి డాక్టరుగారు మాతో ఉంటామని వ్రాశారు. ఆశ్చర్యం ఎందుకంటారేమో: రెండు నెలలూ మాతో ఉంటామంటూ ఉత్తరంలో వ్రాశారు. 2 కుట్రాలంలో మేము బస చేసిన యిల్లు మా బంధువులది. కొండ చరియా గుడిని ఆనుకుని వున్న మిట్టా కలిసే చోటు నుంచి జలపాతానికి వెళ్లే అందమైన బాట చివర, చెట్టు చేమలూ పూల మొక్కలూ దట్టంగా పెరిగిన ప్రదేశంలో ఉంది ఆ యిల్లు. చిన్న జలపాతం నుంచి గలగల పారే చిన్న వాగులలో ఒకటి ఈ యింట్లోకి ప్రవేశించి, యింటినంతా ఒక్కసారి ప్రదక్షిణం చేసి, వెనక వాకిలికి దగ్గరగా వున్న సరస్సు గుండా ప్రవహించి, చివ్వరికి ఒక చిన్న నదిలో కలిసింది. ఇంటిని అలా నిర్మించాడు ఆ గృహ యజమాని. ఇల్లు పెద్దది. దాని చుట్టూ మామిడి, పనస, కొబ్బరి - అలా రకరకాల ఫల వృక్షాలు గల ఒక తోట. ఆ తోట నానుకుని దక్షిణం వైపు ఒక గది వుంది. దానిని దానికి పక్కనే వున్న భాగాన్నీ డాక్టరుగారి కుటుంబానికి కేటాయించాము. ఈ ప్రశాంతమైన గదిలో దక్షిణం వైపు కిటికీని కనక తెరిస్తే చాలు కమ్మని తెమ్మెర వీస్తుంది. రోగాలనూ రొప్పులనూ తరిమివేసే యీ దక్షిణానిలం చాలా ఆరోగ్యకరమైంది. పొదిగై కొండమీది మూలికల మీదుగా, పూల మొక్కల సువాసనలను లీనం చేసుకుని వీచే యీ గాలి ఎక్కడ లేని హాయినిస్తుంది. పొద్దుటి వేళల, బాలభానుని కిరణాలలో వజ్రాలు చెదిరినట్లుగా జలపాతం తెల్లగా కనిపిస్తుంది. రాత్రివేళ, ఆ తెల్లని వెన్నెట్లో వెండి కరిగినట్లుగా జలపాతం దర్శనమిస్తుంది. డాక్టరుగారికీ గది బాగా నచ్చుతుందని అనుకున్నాము. ఆయన రాకకోసం మేము ఎదురు చూడసాగాము. డాక్టరుగారు తమ భార్యతోనూ, ఢిల్లీలో ఉద్యోగం చేసే కొడుకుతోనూ, మదరాసులో మేరీ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే కూతురితోనూ వచ్చారు. వాళ్ల రాక మాకెంతో సంతోషం కలిగించింది. డాక్టరుగారి కొడుకూ కూతురూ జలపాతం వద్దకు వెళ్లి స్నానం చెయ్యడం, ఆకలితో ఇంటికి తిరిగి వచ్చి, దోసెలు తిని మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం, మళ్లీ యింటికి వచ్చి తిరునెల్వేలి ‘ఆనైకొంబన్’ (శ్రేష్ఠమైన వరి జాతి) అన్నంలో పులుసు పోసుకుని భోజనం చెయ్యడం, మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం - ఇలా కుట్రాలం జీవితాన్ని బాగా అనుభవించసాగారు. డాక్టరుగారి భార్య మొదటి రెండు మూడు రోజులు పొద్దుటిపూట జలపాతంలో స్నానం చెయ్యడం, మిగిలిన వేళల్లో ఆడవాళ్లతో కలిపి తెన్ కాశి, సెంగోట - మొదలైన ఆ చుట్టుపక్కల వూళ్లకు వెడుతూ హాయిగా కాలం గడపసాగింది. ఆ తర్వాత ఒక చిక్కు యేర్పడింది ముత్తుకుమారస్వామి వల్ల. అవును. కుట్రాలానికి వచ్చిన ఆ రోజే డాక్టరులో ఒక మార్పుని చూశాడు. ఎప్పుడూ నలుగురితో గలగలమంటూ నవ్వుతూ మాట్లాడే డాక్టరిప్పుడు మూగనోము పట్టాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. పొద్దునపూట జలపాతంలో స్నానం చేసేవాడు. తర్వాత ఫలహారం చేసి గదిలోకి వెళ్లేవాడు. అంతే. మధ్యాహ్నం భోజనానికి ఆయన్ని పిలవాలి. అంతవరకూ ఆయన ఆ గదిలోనే ఒంటరిగా కూర్చునేవాడు. బయటికి వచ్చేవాడు కాదు. ఆ తర్వాత సాయంకాలం నాలుగింటికి చేతికర్ర తీసుకుని జలపాతం బాట వెంబడి గాని, లేకపోతే చంపకాటవి వైపుగా గాని ఒంటరిగా? నడిచి వెళ్లేవాడు. మాట వరసకైనా తోడు రమ్మని ఎవ్వరినీ పిలిచేవాడు కాదు. చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది చూచి నేను చాలా ఆశ్చర్యపోయాను. నాలుగైదు రోజులు గడచిన తర్వాత నా ఆశ్చర్యం మరీ ఎక్కువయింది. ఒకరోజు జలపాతం వద్ద నుంచి వచ్చి, ఫలహారం చేసి, మళ్లీ బయటికి వెళ్లాడు. చేతిలోని అల్యూమినియం పెట్టెలో ఒక దోసె మడిచి పెట్టుకున్నాడు. ‘‘ఇవాళ నేను కొండమీద కొంచెం దూరం వెళ్లి వస్తాను’’ అని వెళ్లిన మనిషి సాయంకాలం బాగా చీకటిపడ్డ తర్వాత గాని ఇంటికి తిరిగి రాలేదు. ఒక వారంపాటు ప్రతిరోజూ డాక్టరు ఒంటరిగా ఎక్కడికో వెళ్లి చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది డాక్టరుగారి భార్యకు విచారహేతువయింది. ఒకరోజు ఆమె మాటల సందడిలో తన విచారహేతువుని వివరించింది. రాజస్థాన్ నుంచి తమిళనాడుకి వచ్చిన ఒక కళాకారుల బృందం తలవని తలంపుగా భయంకరమైన రైలు ప్రమాదానికి పాల్పడడం, ప్రభుత్వం ఆసుపత్రిలో వాళ్లకు డాక్టరు ముత్తుకుమారస్వామి కొన్ని ముఖ్యమైన చిక్సితలు చేయడం మొదలైనవాటిని గురించి నేను కుట్రాలానికి వచ్చిన మరునాడు పత్రికా ముఖంగా తెలుసుకున్నాను. ఈ చికిత్సల తదనంతరం డాక్టరుగారి వైఖరిలో ఏదో ఒక మార్పు ఏర్పడిందని ఆయన భార్య ఇప్పుడు చెప్పింది. ‘‘బాబూ! ఆ రోజు మొదలుకొని మీ డాక్టరుగరు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడం మానివేశారు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించేవారు. కుట్రాలానికి వెడదామని ఆయన చెప్పడం కూడా ఈ మార్పు ఫలితమే. మొదట్లో నేను ఆశ్యర్యపోయాను. కాని కుట్రాలానికి వచ్చిన తర్వాత, ఈ మార్పూ మౌనమూ తగ్గిపోతాయని అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా ఆయన ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఆయన ఏకాంతంగా వుండడం, కొండలకూ కోనలకూ వెళ్లడం చూస్తుంటే నాకేదోలా ఉంది. మీరు కొంచెం ఆయన్ని కనిపెట్టుకుని వుండండి’’ అంది డాక్టరుగారి భార్య. 3 ఒకరోజు డాక్టరుగారిని అనుసరించి వెళ్లాను, ఆయనకు తెలియకుండా. చేతికర్రను టక్ టక్మని నేలమీద మోపుకుంటూ గబగబా నడిచి వెడుతున్నాడు డాక్టరు. వంపులు తిరిగిన దోవ కావడం వల్ల, ఆయన నన్నెక్కడ చూస్తాడో అని పొదల్లోనూ బండరాళ్ల మధ్యగానూ ఒదిగి ఒదిగి నేను ఆయన వెనకాలే వెళ్లాను. మిట్టమధ్యాహ్నం వేళ ఆయన చంపకాటవిని చేరుకున్నాడు. ఒక పొద మాటున చేరి ఆయన్ని నేను పరీక్షగా చూశాను. చంపకాదేవి ఆలయం పక్కన వున్న కొండ చరియలో అందమైన గుహ ఒకటుంది గదా! గలగలమంటూ కిందికి ఉరుకులు వేసే జలపాతం దగ్గర భగవదనుగ్రహం కోసం నిరీక్షించే భక్తుని నిండు మనస్సులా దర్శనమిచ్చే ఆ గుహ చాలామందికి తెలుసు. ఇంకా కొంచెం పైకి నడిస్తే ఆ ప్రాంతంలో అటువంటి చిన్న చిన్న గుహలు మరికొన్ని కనిపిస్తాయి. ఆ కోవకు చెందిన ఒక గుహలో మన డాక్టరుగారు కళ్లు రెండూ మూసుకుని ఆసీనుడయ్యాడు. తంబురా శ్రుతిని స్ఫురణకు తెచ్చే కొండవాగుల మృదు ధ్వని, ఆ ఆధార శ్రుతిలో తమ వివిధ కంఠాలను మేళవింపు జేసి గానం చేస్తున్న పక్షుల కిలకిల రావాలు, ఆ గానానికి మృదంగం వాయిస్తున్నట్లుగా జలపాతం చేసే సవ్వడీ - మధుర గానంలా వినిపిస్తున్నాయి ఆ కొండ మీద. ఆ గానం వింటూ మైమరచి డాక్టర్ ముత్తుకుమారస్వామి కళ్లు మూసుకున్నాడా? లేకపోతే ఆయన అంతరంగం లోలోపలి వాగురలో చిక్కుకుపోయిందా? పొదమాటు నుంచి బయటపడి తొందరగా నడిచాను. ‘‘డాక్టర్... డాక్టర్!’’ సరాసరి డాక్టరు వద్దకు వెళ్లి, ఆయనకెదురుగా కూర్చున్నాను. బెదిరిపోయినవానిలా, ఆయన కళ్లు తెరిచాడు. నా రాక ఆయనకు నచ్చలేదు. ఆయన చూపులు తీక్షణంగా ఉన్నాయి. ‘‘నన్ను క్షమించాలి డాక్టరుగారూ! మీరిలా యిక్కడ ఒంటరిగా కూర్చోవడం, మాటా పలుకూ లేకుండా మౌనముద్ర దాల్చి మీరు సంచరించడం, చూస్తే మాకందరికీ దిగులుగా వుంది. ఇందువల్ల మీ భార్య కూడా దిగులుపడుతోంది.’’ ‘‘మీ దిగులుని అర్థం చేసుకుంటున్నాను. కాని నన్ను విసిగించననీ, నా ప్రయత్నాన్ని వారించననీ మీరు కనక మాట యిస్తే మీతో మాట్లాడతాను. లేకపోతే...’’ ‘‘మిమ్మల్ని విసిగించను. మీరు చెప్పినట్లే మాట యిస్తున్నాను. మీరు చెప్పండి డాక్టరుగారూ...’’ అన్నాను నేను. డాక్టరు చెప్పాడు. ‘‘రాజస్థాన్ నుంచి ఒక కళాకారుల బృందం తమిళదేశం రావడం, తలవని తలంపుగా ఆ బృందం వారికి రైలు ప్రమాదం సంభవించడం, వాళ్లను ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్చడం, వాళ్లకు నేను చికిత్స చేయడం, మొదలైనవి మీరు పత్రికలలో చదివే వుంటారు. ఆ కళాకారుల్లో ముగ్గురికి బలమైన గాయాలు తగిలాయి. వాళ్లకు చికిత్స చేసే బాధ్యత నామీద పడింది. ఇందులో ఒక పెద్ద చిక్కు యేమిటంటే, ముగ్గురిలో ఒకామె స్త్రీ. ఆమెకు కాలు తీసెయ్యాలి. కోసి తీసెయ్యాలి. ఒక యువకుడి కళ్లల్లో గాజు ముక్కలు లోతుగా నాటుకున్నాయి. అందుకు ఒక కంటి డాక్టరు శస్త్ర చికిత్స చేయాలి. అదీ నా పర్యవేక్షణలోనే జరగాలి. మరొకతనికి కుడి చెయ్యి పూర్తిగా తీసివేస్తేనే, అతను బతుకుతాడు. నా సంగతి మీకు తెలిసిందే గదా! శస్త్ర చికిత్స విషయంలో తూర్పు పడమరలు చూస్తూ కాలక్షేపం చేయను. మనుషులు అరటికాయలు, వంకాయలూ అని అనుకునే స్వభావం నాది.’’ ఇలా డాక్టరు చెపుతున్నప్పుడు, నాకు ఆశ్చర్యం కలిగింది. ‘‘ఏవిటండీ డాక్టరుగారూ! మీరలా మాట్టాడుతున్నారు? మీరు శస్త్ర చికిత్స కనక చెయ్యకపోతే, మొదటికే మోసమవుతుంది కదా! అందుకని శస్త్ర చికిత్స చేస్తారు. ఇందులో తప్పేముంది.’’ ‘‘అంతవరకూ, ఆ ముగ్గురికీ శస్త్ర చికిత్స చేసేంతవరకూ, నేనూ అలాగే అనుకున్నాను.’’ ‘‘ఏం! వాళ్లు ముగ్గురూ బతకలేదా?’’ ‘‘వాళ్లు బతికారు. అందుకే నేను విచారిస్తున్నాను. చచ్చిపోయివుంటే, యింతగా విచారించి వుండేవాణ్ని కాను’’ ఇలా అంటున్నప్పుడు డాక్టరుగారి కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘డాక్టరుగారూ! మీరు నన్ను తికమక పెడుతున్నారు.’’ ‘‘బాబూ! ఆ ముగ్గురు కళకారులకు స్పృహ తెలిసిన తర్వాత, ఆ మరు క్షణంలోనే వాళ్లు పడ్డ బాధను చూసి, నేనెంత బాధపడ్డానో నీకెలా చెప్పగలను? నేను పడ్డ బాధ, పడుతున్న బాధ, పడబోయే బాధ - వీటికి హద్దులేదు. ఎందుకంటే, నేను కాలు తీసివేసిన స్త్రీ రాజస్థానంలో ప్రసిద్ధికెక్కిన నాట్యగత్తె అట! కళ్లు తీసివేసిన ఆ కళాభిజ్ఞుడు ప్రముఖ చిత్రకారుడు. దయాదాక్షణ్యాలు లేకుండా కుడిచెయ్యి తీసివేసిన వ్యక్తి సుప్రసిద్ధ సారంగి విద్వాంసుడట! రాజస్థాన్ నుంచి వచ్చిన ఆ బృందంలో వీళ్లు ముగ్గురే ముఖ్యులట. నాట్యగత్తెకు కాలే పంచప్రాణాలు; చిత్రకారుడికి కళ్లే ప్రాణం; సారంగి విద్వాంసుడికి జీవితం అతని వాద్యం; వాయించడానికి చెయ్యి-చేతివేళ్లు చాలా అవసరం. వాటినే నేను తీసివేయవలసి వచ్చింది.’’ చెప్పడం పూర్తయిందో లేదో ఆయన కళ్ల వెంబడి ధారగా కన్నీళ్లు జారాయి. ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు. ‘‘నాయనా! మనుషుల్ని బతికిస్తున్నాననే వుద్దేశంతో, నేను నా శక్తిలోనూ సేవలోనూ తృప్తి చెందుతున్నాను. మదరాసు నుంచి కుట్రాలానికి వచ్చినా, ఈ సంఘటనను ఆధారం చేసుకుని యముడు నామీద పగ తీర్చుకుంటున్నాడా అనిపిస్తుంది. నేను చేసిన పనికి ఇదొక శిక్ష. ఆ ముగ్గురు కళాకారులకు ప్రాణదానం చేసి, వాళ్లను జీవచ్ఛవాలుగా చేశాను గదా! ఆ దుఃఖం నన్ను మాడ్చివేస్తోంది. నాకు ప్రాణం పోతున్నట్లనిపిస్తోంది. ఆ ముగ్గురు తమ ప్రాణ ప్రాణమైన అంగాలు కోల్పోయినందుకు కన్నీరు మున్నీరుగా దుఃఖించారు. ఆ కన్నీటి వేడిని యీ కుట్రాలం జలపాతం కూడా తగ్గించలేకపోతోంది. ఈ చల్లని తెమ్మెరలు కూడా వేడెక్కిన నా మనస్సుకి చల్లగా తగలడం లేదు. మనస్సులో ఏదో బాధ. దేహ ప్రాణాలలో శక్తి లేదు. ఈ అడవులూ కొండలూ తిరిగి, ఈ ఒంటరితనంలో కళ్లు మూసుకుని నా బాధ నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మధురం, మధురం ఏకాంతం’’ అంటారు గద. ఆ ఏకాంతాన్ని వెతుక్కుంటూ యిక్కడికి వచ్చాను. కళ్లు బాగా మూసుకుంటేనైనా, ఆ ఏకాంతం లభిస్తుందేమోనని అనుకుంటున్నాను. కాని అందువల్లా లాభం కలిగించలేదు. కుమిలిపోతున్నాను; కుమిలిపోతున్నాను’’ అన్నాడు డాక్టరు. 4 ఈ సంఘటనకు తర్వాత డాక్టరుగారి వైఖరిలో యింకా గొప్ప మార్పుని చూశాను. అడవిలోకి వెళ్లి, కళ్లు మూసుకుని, ప్రశాంతత కోసం ప్రయత్నించాడు. ఇప్పుడేమో యింట్లోనే కళ్లు మూసుకుని, మౌనముద్ర దాల్చి, ఏకాంతంగా కాలం గడపసాగాడు. ఇది అందరి దిగులునీ యినుమడింపజేసింది. అందువల్ల నేనెక్కడికైనా వెడితే చాలు, బలవంతంగానైనా, డాక్టరుగారిని నాతోపాటు పంపించసాగారు. మదరాసుని గురించి గాని, రోగుల్ని గురించి గాని ఆయన కొంచెమైనా అనుకునేవాడు కాదు. మాకందరికీ ఆయన ఒక మనో వ్యాధిని సంక్రమింపజేయడమే కాక, ఆయన కూడా మహా బాధపడేవాడు. ఇలా ఉండగా, పాళయం కోట నుంచి ఒక వార్త వచ్చింది. రాత్రులలో మదరాసు నగరంలో ఇళ్లల్లో ప్రవేశించి, తుపాకులు చూపి కొల్లగొట్టే గజ దొంగల్లో ముగ్గురు ముఖ్యులు పాళయం కోటలో పట్టుబడ్డారనీ, వాళ్ల వద్ద ఉన్న వస్తువుల్ని సోదా చేయగా మదరాసులో మా యింట్లో ఐదేళ్లకు మునుపు పోయిన కొన్ని వెండి సామాన్లు వాళ్ల వద్ద కనిపించాయనీ, నేను పాళయం కోటకు వెళ్లి ఆ దొంగల్నీ సామాన్లనీ గుర్తుపట్టాలనీ నాకు కబురు అందింది. కారులో బయలుదేరి వెళ్లి, మధ్యాహ్నానికల్లా తిరిగి వచ్చేద్దామనుకున్నాను. బలవంతం చేసి, ఎలాగో డాక్టరుగారిని కూడా బయలుదేరదీశాను. పట్టుబడిన ముగ్గురు దొంగలూ ఘటికులే. తుపాకి గురి చూచి పేల్చడంలో ఒకడు మహా నేర్పరి. అతని కంటిచూపు అటువంటిది. మారు తాళాలతో తాళాలు తీసి, లోపలికి వెళ్లడంలో యింకొకడు సిద్ధ హస్తుడు. మూడోవాడు ఎన్ని బస్తాలనైనా సరే బుజాల మీద మోసుకుని కొన్ని మైళ్లు నిమిషంలో పరిగెత్తగల ఘటికుడు. ఈ ముగ్గురి దర్శన భాగ్యం కలిగింది మాకు పాళయం కోటలో. కాని ఆశ్చర్యమేమిటంటే, నాతోపాటు వచ్చిన డాక్టరుగారిని చూడగానే, వాళ్లు ముగ్గురూ చేతులు జోడించి, ఆయనకు నమస్కరించారు. కాని డాక్టరు నిర్లిప్తంగా ఉండిపోయాడు. అంతసేపూ ఆయన అడవులూ కొండలూ మరిచిపోయి నాతోపాటు వుండడం గొప్ప విషయమనుకున్నాను. ఇక అక్కడ కాలక్షేపం చెయ్యకుండా, మేము కుట్రాలానికి తిరిగి వచ్చేశాము. ‘‘ఈ డాక్టరుగారిని మీరింతకు మునుపే ఎరుగుదురా?’’ అని అడగ్గ, ఈ కింది విషయాలు బయటపడ్డాయి. పెక్కు సందర్భాలలో రకరకాల చిక్కులలో రకరకాల పేర్లతోనూ రకరకాల వంకలతోనూ ఈ ముగ్గురు దొంగలు ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందారు. ముఖ్యంగా చెప్పవలసిన సంఘటన యేమిటంటే; కన్నాలు వేసే దొంగ కణ్ణుస్వామి ఒకసారి పైనుంచి కిందపడి, చెయ్యి విరిగిన స్థితిలో ఆసుపత్రికి వచ్చాడు. అతని చేతిని సరిచేసి, బాగుచేసి, చేతిని మళ్లీ పెకైత్తేటట్లు చేసిన ఘనత డాక్టరు ముత్తుకుమారస్వామికి దక్కింది. ఆ చెయ్యే యిప్పుడు కన్నాలు వెయ్యడానికి ఉపకరిస్తూంది. తుపాకీ వీరుడు దొరసామి ఎటువంటి వాడనుకున్నారు! ఒకసారి జరిగిన ఘోర ప్రమాదంలో వాడి కంట్లో ఒక సూది గుచ్చుకుంది. కన్ను పాడు కాకుండా, చూపు చెడిపోకుండా, ఆ కంటిని బాగుచేయడం జరిగింది. ఎవరనుకున్నారు? ఇంకెవరు? డాక్టరు ముత్తుకుమారస్వామీ, ఆయనకు తోడ్పడ్డ ఒక కంటి డాక్టరూను. బస్తాలు అనాయాసంగా మోసే పహిల్వాన్ ముత్తుపక్కిరి? ఆ మూడో దొంగ ఎలాంటివాడని! ఒకప్పుడు తిండికి గతిలేక, నల్లుల మందు తిని, ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. ముత్తుకుమారస్వామి మనుషుల్ని చావనిస్తాడా మరి! వాడికి ప్రాణ దానం చేసి కాపాడడమే కాకుండా, వైటమిన్ మాత్రలతో వాడి కడుపు నింపి, వాణ్ని లోకంలోకి పంపించాడు. కంటిచూపు పొందిన తుపాకీ వీరుడు దొరసామి యిప్పుడు బాగా గురిచూసి తుపాకీ పేలుస్తున్నాడు. చెయ్యి బాగయిన కణ్ణసామి కన్నాలు వేయడంలో ఘటికుడనిపించుకున్నాడు. పహిల్వాన్ పక్కిరి డాక్టరిచ్చిన ఉత్సాహంతో తన వృత్తిని మహా నేర్పుగా సాగిస్తున్నాడు. ఈ ముగ్గురి వద్దా కనిపించిన వెండి సామాన్లు మావని తేలాయి. 5 పోలీసుల వద్ద నుంచి యీ విషయాదికం తెలుసుకున్న ఆ మరునాడే డాక్టరు ముత్తుకుమారస్వామి మదరాసుకి ప్రయాణమైనాడు. ‘‘ఏవిటి డాక్టరుగారూ! ఉన్నట్టుండి ప్రయాణమయ్యారు?’’ అని అడిగాను ఆశ్చర్యంగా, ఆశగా. ‘‘ఒక్క నెలరోజులుగా నేను నా రోగుల్ని మరిచిపోయి, నేనే జబ్బుపడ్డాను. ఇప్పుడు నా జబ్బు నయమయింది. ఇక నా రోగుల వ్యాధుల్ని పరిశీలించాలి. నా కోసం ఎందరు ఎదురుచూస్తున్నారో మదరాసులో!’’ ‘‘ఏమంటున్నారు మీరు?’’ ‘‘నాట్యగత్తె కాలు తీసివేసినందుకూ, చిత్రకారుని కళ్లు తీసివేసినందుకూ, సారంగి విద్వాంసునికి చెయ్యి తీసివేసినందుకూ నేనింతవరకూ చాలా బాధపడ్డాను, దుఃఖించాను. కానీ యిప్పుడు నేను విన్నదేవిటి! కష్టపడి కళ్లిచ్చాను ఒకడికి. కాళ్లూ చేతులూ బాగు చేశాను మరి యిద్దరికి. వాళ్లిప్పుడు ఏం పనులు చేస్తున్నారో విన్నావుగా? వాటిని తీసివేసినందుకూ నేనే బాధ్యుణ్ని; అలాగే బాగుచేసినందుకూ నేనే బాధ్యుణ్ని. ఏమంటారు?’’ డాక్టర్ ఒక్క క్షణం కళ్లు మూసుకుని మళ్లీ ఇలా అన్నాడు. ‘‘నాయనా, నా వృత్తి శస్త్ర చికిత్స చెయ్యడం. అంతకుమించి నా మెదడు పనిచెయ్యకూడదు. నా బాధ్యత నా వృత్తి నిర్వహణతో పూర్తయినట్లే. దేవుడు చేసే పనిని నేను చేస్తున్నట్టు అనుకోవడం అవివేకం. కళ్లూ కాళ్లూ చేతులూ తీసివెయ్యడం, బాగుచెయ్యడం వైద్య శాస్త్ర రీత్యా చేసే ఒక చికిత్స; పని. ఈ అంగాలను సద్వినియోగమో దుర్వినియోగమో చేసుకోవడం, దేనికి ఎంత కాలం వినియోగించాలో - ఇటువంటివి నా చేతిలో లేవు. అదంతా లలాట లిఖితం’’ అన్నాడు డాక్టరు. ‘‘లలాట లిఖితాన్ని మార్చడమే గదా మీ పని?’’ ‘‘కాదు. కాని అలా అనుకున్నాను కొన్ని రోజులు. అది తప్పు. చావు పుట్టుకలు, రోగాలు రొప్పులూ అవి లేకపోవడం - ఇవన్నీ వైద్య శాస్త్రానికి భిన్నంగా పరిశోధించడం అవివేకం. భగవల్లీలలను పరిశీలించడానికి పూనుకుంటే, డాక్టరుకే జబ్బు చేస్తుంది. ఆ తర్వాత దానికి మందు లేదు. రండి. జలపాతంలో స్నానం చేసి నేను మదరాసుకి బయలుదేరాలి. రోగులెంతమందో నాకోసం ఎదురుచూస్తూ వుంటారు. నా విద్యుక్త ధర్మం నన్ను పిలుస్తోంది.’’ ఇలా అంటూ కాల ప్రవాహమైన జలపాతం గట్టు వెంబడి నడక సాగించాడు డాక్టరు ముత్తుకుమారస్వామి. - సోము -
ముంగిస కథ
క్లాసిక్ కథ వంశధార నది ఒడ్డునే మడపాం గ్రామంలో డాక్టరు అప్పారావుగారి ఇల్లు. రెండు వాసల్‌లో ఒకటి మిద్దెటిల్లు, రెండోది అటక మీద గడ్డినేత ఇల్లు. ప్రతి సంవత్సరం వరదల్లో ఒడ్డు కూలిపోతూందని సర్కారువారు కొండరాళ్లు వాలుగా పేరుపు పేర్చారు. అది పేర్చాక రెండు వరదలు వచ్చినా ఒడ్డు చెక్కుచెదరలేదు. ఈ ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వర్షాకాలంలో బొబ్బలు పెట్టుకుంటూ చెట్లనూ, శవాలనూ తోసుకు వచ్చిన వరద వెల్లువ పాములను కూడా జీవంతో తెచ్చేది. ఆ రాళ్ల సందుల్లో దాగున్న పాములు ఒకోసారి రాత్రివేళ ఇంట్లోనే ఉండేవి. ఒకనాడైతే ఒక పాము పైనించి మంచం మీదనే పడింది. ఆయుర్వేద వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేస్తున్న అప్పారావు పంటల కాలంలో ముఖ్యంగా ఇంకో ఉపద్రవాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చేది. ఎంతో పదిలంగా, భద్రంగా దాచిన ధాన్యాలను పదోవంతైనా ఎలకలకూ, పందికొక్కులకూ ధారపొయ్యవలసిందే! పెంచిన పిల్లి ఒకటి ఈ పందికొక్కుల సమూహానికి జడిసిపోయినట్లుంది. ఇంట్లో పడుకోదు. యజమానురాలు పడుకున్న మిద్దె ఇంట్లో పక్కనే పడుకుంటుంది. డాక్టరుగారికి ఇద్దరు పిల్లలు. కొడుకు వెయ్యి మైళ్ల దూరంలో మిలిటరీ ఆఫీసరు. కూతురు అత్తవారింట్లో ఎనిమిది మైళ్ల దూరంలో ఉంటుంది. డాక్టరు ఎందరి బాధలనో కుదర్చగలిగారు గాని ఈ ఎలకల, పాముల బాధ నించి విముక్తి పొందలేకపోయాడు. ఒకనాడు ఉదయమే ఒక ఎరకలవాడు ఒక ముంగిస పిల్లను తెచ్చాడు. ‘‘ఇది నాకెందుకూ?’’ అన్నాడు డాక్టరు. ‘‘బాబూ, మీకు పాములు, ఎలకలు బాధ. ఇది ఇప్పుడు బుల్లిపిల్లలా ఉంది. ఆరు నెలల్లో పెరిగి పెద్దదయిపోతాది. అప్పుడు దీని మేలు మీకు తెలుస్తాది.’’ ‘‘పెంపుడు జంతువా ఉండటానికి.’’ ‘‘మన తరిఫీదు బట్టి ఉంటాది బాబూ. పదిహేను రోజులు ఒక గూడులో తాడుతో కట్టి పెట్టండి. ఏ పిల్లీ, కుక్కా నొక్కేకుండా సూడండి. పాలన్నం తింటాది. ఏదైనా తీపి వస్తువు తింటాది. అప్పుడు మెడలో మూడు మువ్వలు కట్టెయ్యండి దొరా.’’ ‘‘మువ్వలు కడ్తే ఎలకల్ని, పాముల్ని ఎలా పడుతుందిరా? పిల్లికి గంటలు కట్టిన చందం కదరా.’’ ‘‘అది కాదు దొరా! మువ్వలు మోగితే ఆ ముంగిస జాతి దీనిని దగ్గిరకు చేరనివ్వవు. వెలేస్తాయి. దానికింకో గతి లేక మనిల్లు వదల్దు.’’ ముంగిస పిల్లను పట్టుకోవడానికి డాక్టరుకు భయం వేసింది. ఆ ఎరకలవాడే తాడు కట్టాడు. పాలన్నం ఇచ్చినా ముంగిస పిల్ల తినలేదు. కర్కర్ అని అరుస్తూంది. ‘‘అది అలా అరుస్తూంది. అదిక్కడ బతుకుతుందిరా?’’ అన్నాడు డాక్టరు. ‘‘తల్లినొదిలి ఉండటం కదా? రెండు రోజులు తల్లికోసరం ఏడుస్తుంది బాబూ.’’ డాక్టరు భార్య అమ్మాయమ్మ దాని గోలను కొంత పంచదార పోసిన రొట్టెముక్కనిచ్చి తగ్గించింది. రెండు మూడు రోజులకొకసారి ఆ ఎరకల ఎండన్న వచ్చి చూసి పెంచడం విషయంలో సలహాలిచ్చిపోయేవాడు. చూస్తుండగానే ముంగిస పెరిగిపోయింది. పదిహేను రోజుల్లో దానికి డొక్కులో పెట్టే అవసరం లేకపోయింది. తాడు మెడకు కట్టి అది ఎటు తీసుకువెళ్తే అటు తిప్పేది అమ్మాయమ్మ. చుంచు మూతి, మూతి చివర లేత ఎరుపు, ఊదారంగు శరీరం, కొండ చీపురుకట్టలా తోక, చిన్న కళ్లూ, చెవులూ గెంతుతూ నడుస్తూంటే మువ్వలు గలగలలాడుతున్నాయి. దానికి పేరు కూడా అమ్మాయమ్మ పెట్టింది. ‘‘బయ్యన్న... బయ్యన్న..’’ నెలరోజులకల్లా ఏ తాడు అక్కర్లేకపోయింది. పేరు పెట్టి పిలిస్తే పరుగెత్తుకు వస్తూంది. మూడు నెలలకు చుంచెలకలా ఎదిగిపోయింది. ఇప్పుడు దాని నివాసం ఇల్లు కాదు, పెరట్లో ఉన్న కర్రడొక్కు కాదు. ఏటి ఒడ్డున రాళ్ల పేరుపులో ఒక బిలం. ఉదయం కాఫీ వేళకి బిలం నించి బయటకు వచ్చి అటకమీదకెక్కి గోడలమీద నించి పాకుతూ ఘల్లుఘల్లుమంటూ మెల్లగా దిగువకు దిగుతుంది. అమ్మాయమ్మ ఆ మువ్వల మోత వినగానే ‘‘బయ్యన్నా, రారా’’ అని పిలుస్తుంది. దానికోసం ఒక పాతచేట గోడ దగ్గిరే పరిచి ఉంటుంది. దానిమీద కూర్చొని ఒకసారి ముందు కాళ్లు రెండూ ఎత్తుతుంది. ఇడ్లీ పంచదార వెయ్యకుండా ఎదర పెడితే అలుగుతుంది. పంచదార వెయ్యగానే అంత ముక్క అయిదు నిమిషాల్లో మింగేస్తుంది. మళ్లీ తిరుగు ప్రయాణం, అటు ధాన్యపు గాదెలు, ఇటు అటక, ఇంటి చుట్టూ ఒకసారి సాయుధ భటునిలా తిరిగి మళ్లీ బిలంలోనికి వెళ్లిపోతుంది. అమ్మాయమ్మ మధ్యన ఒకసారి ఏటి ఒడ్డుకు వచ్చి ‘‘బయ్యన్నా’’ అని కేక వేస్తే, ఒకసారి చాలు - ఘల్లుఘల్లున వస్తుంది. చేతిలో చేపను చూపిస్తుంది. అది ఇవ్వకపోతే ఆమె పాదాలపై నిల్చుని పైకి పాకడానికి ప్రయత్నిస్తుంది. ఈ బయ్యన్న ఇప్పుడు ఇంట్లో ఒక ముద్దు పిల్లాడు. కడుపు నిండా పెట్టకపోతే వాడు ఎంతో మారాం చేస్తాడు. అమ్మాయమ్మ కాళ్లా వేళ్లా పడతాడు. ఏ పనీ చెయ్యనివ్వడు. అదే పనిగా అరుస్తాడు. ఆమె మీదకే చెవిలో ఏదో చెబుదామని ఎగబ్రాకిపోతాడు. ఆ చిన్ని కాళ్లతో అడ్డాలలో పిల్లడు తల్లికి మూతితో, కాళ్లు చేతులతో గిలిగింతలు పెట్టినట్టు పెడతాడు. బయ్యన్న వాళ్ల దృష్టిలో ఇంకా ఆర్నెల్ల పిల్లాడే. కాని వాడు ఇంటి యజమానైపోయాడు. ఇంటి యజమాని సాధించలేక, విసిగి వదిలేసిన పనులన్నీ ఈ ఆరు నెలల యువకుడూ సాధించేవాడు. ఇంట్లో ఎలకలు లేవు. పందికొక్కులింకెటు పారిపోయాయో? ఏ తుప్పలు పట్టేశాయో? పాము పిల్లయినా మచ్చుకు కనబడలేదు. పాము పొరలు వెతుకుదామన్నా ఏటి ఒడ్డున కనబడలేదు. ఈ సంవత్సరం వాళ్లు ఎక్కడ, ఏది, ఎలా విడిచి పెట్టినా అలాగే ఉంటూంది. కూరగాయలు బోనె పెట్టి మీద పడేస్తున్నారు. ధాన్యం ఒక్కోసారి అలా నేలమీదో, బుట్టలోనో ఉంచేస్తున్నారు. ఏటిపై వచ్చే చల్లగాలి హాయిగా పీల్చి, వెన్నెలను తెరచాప చేసుకొని, నావలా కదిలే నీటిని చూస్తూ, ఏటి ఒడ్డున నిల్చుంటున్నారిద్దరూ. ఒక్కోసారి వాళ్ల యౌవనపు రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఇదివరలా ఏ పామైనా కాళ్లకు చుట్టుకుంటుందన్న భయం లేదు. ఒకనాటి తెల్లవారుఝామునే డాక్టరు ఇంటి ముందు గంభీరంగా భైరవయ్య చేతితో కర్రతో నిల్చున్నాడు. వాడు వీళ్లకు దూరపు చుట్టం. వీళ్లకు వాడి కంటే జరుగుబాటు హెచ్చని కన్నుకుట్టుకుంటున్నాడు. ఏదో సాకుతో వీళ్లమీద విరుచుకుపడ్డానికి ఉరుకుతూంటాడు. మాంచి పొంకంతో మెలితిరిగిన నల్లని బొడ్డు మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టగలనంటాడు. పెరిగిన జుత్తుకు వంకీలు తిప్పి వెనక్కి వదిలాడు. ‘‘ఏమైం’’దన్నాడు డాక్టరు. ‘‘నే చెప్పాలా? రాత్రి బయ్యన్న ఈ కోడిపిల్లల్ని నొక్కేసింది.’’ ‘‘ఎవరు చూశారు?’’ ‘‘దీనికి సాక్ష్యం కావాలా?’’ ‘‘నీవు కళ్లెర్రజేస్తే పనికిరాదు. అనవసరంగా మా బయ్యన్న మీద నేరం మోపక. అలాంటి పని చెయ్యడు. ఎవరో పిలిచి వేస్తే తింటాడు. అంతే.’’ ‘‘నీకు సాక్ష్యమే కావలసినవే వస్తే తెస్తాను.’’ వాడు పొరుగునుంచే సాక్ష్యం తెచ్చాడు. గడపలోనున్న కోడిప్లిలల్ని హతమార్చింది మీ బయ్యన్నేనని చెప్పగానే ఇది దొంగ సాక్ష్యమని కేకలేశాడు. ‘‘వీటి ఖరీదు, పది రూపాయలు. ఇచ్చేయి.’’ ‘‘అనవసరంగా నేనెందుకివ్వాలి? మా బయ్యన్న పీకలు కొరికే నీచుడు కాడు. నేను ఒక్క దమ్మిడీ ఇవ్వమంటే ఇవ్వను.’’ ‘‘సరే! పెద్దింటివాడివి. పసిమితో ఎగురుతున్నావు. నాకు నష్టం వచ్చింది. నీకు కాదు కదా! ఈ కోళ్లు నాకు హక్కయినవి కావనుకుంటాను’’ అంటూ ఆ కోడి పిల్లలను ఏట్లోకి విసిరేశాడు. ఇట్టే ఎగురుతున్న గెద్దలు అందుకున్నాయి. కోపంతో ఇంట్లోకి వచ్చిన డాక్టరుతో భార్య అంది. ‘‘వాడు క్రూరుడండీ. పోనీ, కొంతలో కొంత ఇచ్చి సముదాయించలేకపోయారా?’’ డాక్టరు ఖస్సుమన్నాడు. ‘‘వెధవ, అనవసరంగా మన బయ్యన్న మీద నిందలేస్తే పడతామా? అదే అక్కడకు వెళ్లుంటే ఘల్లుఘల్లుమని శబ్దం వినపడేది కాదా? ఆ పెట్ట అరిచేది కాదా? వీళ్లు లేచేవాళ్లు కాదా?’’ పది రోజులు గడిచిపోయాయి. డాక్టరు దగ్గరకు మందుకి వచ్చాడు భైరవయ్య. డాక్టరు పైసా పుచ్చుకోకుండా మందిచ్చాడు. కోడిపిల్లల ఊసే మరిచిపోయారు. పట్నంలో కూతుర్ని చూడ్డానికి డాక్టరూ, భార్య ఉదయమే బయలుదేరారు. ఇల్లుకు తాళాలు వేశారు. పెరటి డొక్కులో పాలన్నం గిన్నెలో పెట్టి ‘‘బయ్యన్నా, మధ్యాన్నం తినరా, పట్నం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం. ఇల్లు జాగ్రత్త’’ అంటూ అమ్మాయమ్మ చెప్పి మరీ వెళ్లింది. బయన్న వాళ్ల వెంట వద్దన్నా పడ్డాడు. ఇద్దరూ మర్రిచెట్టు కింద బస్సుకోసం కూర్చుంటూనే ముంగిస అరుపులు విన్నారు. ఆత్రంగా తిరిగి చూసేసరికి ఒక ముంగిస కాదు - బయ్యన్న కాక మరి రెండు ముంగిసలు. ఆ రెండు ఆ చిన్న చెవులు రిక్కించి కోపంతో అరుస్తున్నాయి. బయ్యన్న దారికడ్డమయ్యాయి. బయ్యన్న వాటిని చేరాలని ఆత్రపడుతున్నాడు. ‘‘అవిగో అవే, ఆ రెండు బయ్యన్న అమ్మా, నాన్నా’’ అన్నాడు డాక్టరు. ఇద్దరూ వింతగా చూస్తున్నారు. ఆ రెండు బయ్యన్న మీద ఉరకడానికి సిద్ధమౌతున్నాయి. బయ్యన్న కులం నుంచి వెలివేసిన మనిషిలా ఉన్నాడు. ‘‘చంపగలవండి. వాటిని తోలండి’’ అంది భార్య. వాటిని అదిలించి ‘‘రారా, బయ్యన్నా’’ అంటే మెల్లగా మూతి వంచుకుని అమ్మాయమ్మ దగ్గరకు వచ్చి పాదం మీద పడుకున్నట్లు వంగిపోయాడు. ఆమె ఎత్తుకొనగానే మూతి దగ్గర మూతిపెట్టి మెల్లగా అరుస్తున్నాడు. ‘‘మీ అమ్మా, నాన్నా నిన్ను రానివ్వలేదని ఏడుస్తున్నావా? మేం ఉన్నాం కదరా. నీ అమ్మను నేను, అరుగో, మీ నాన్న. వెళ్లు ఇంటికి - ఇంట్లో నీవు లేకపోతే శత్రుమూకలు దాడిచేసేస్తాయి. వెళ్లు, నాయనా. వెళ్లరా’’ అమ్మాయమ్మ ఒక ముద్దు పెట్టుకుని అంత దూరం వెనక్కు వచ్చి విడిచిపెట్టింది. రాను రాను ఘల్లుఘల్లుమనే శబ్దం దూరమైపోయింది. ఇంతలో బస్సు వస్తూంది. డాక్టరు పిలుస్తున్నాడు. తిరిగి రోడ్డుమీదకు పరుగెత్తింది. పది గంటలయింది. ఇంకా పాలన్నం తినటానికి సమయం కాలేదు. ఆ సమయం వస్తే గంటలు విన్నట్లు మరీ వెళ్తుంది. ‘‘బయ్యన్నా, రారా...’’ అన్న పిలుపు ఒకసారి బిలం నించి వచ్చి చూశాడు. మళ్లీపిలుపు. భైరవయ్య ఒడ్డులో నిల్చున్నాడు. ‘‘రారా బయ్యన్నా... ఇదిగో చేప... రారా... రారా...’’ సన్నగా మోత వినిపించింది. చెంగుచెంగున రాళ్లన్నీ ఎగబ్రాకింది. భైరవయ్య చేతిలో చేప చూశాడు. కొద్దిగా జరిగాడు భైరవయ్య. అందుకోడానికి ఘల్లుమని శబ్దం చేస్తూ ఉరికాడు. ఎదురుగా మునకాలకర్ర పట్టుకుని మీసం తిముడుతూ నిల్చున్న భైరవయ్య, ఒక్కసారి కర్రెత్తి దభీమని బయ్యన్న శరీరం మీద వేశాడు. బయ్యన్న ఒక్కసారి అరిచి ‘‘వద్దు! వద్దు! నేనేం పాపం ఎరగ’’నన్నట్లు ఆ మూతి ఎత్తాడు. మళ్లీ దభీమని ఇంకో దెబ్బ. బయ్యన్న కిలకిలా తన్నుకుంటున్నాడు. మరి రెండు దెబ్బలతో మూగబోయాడు. భైరవయ్య తోక పట్టుకుని ఎత్తాడు. నోటి వెంబడి రక్తం కారుతూంది. ‘‘బయ్యన్నా, రారా’’ అంటే ఈ మానవాళి అరుపంతా సౌహార్థం, ప్రేమతో నిండి ఉంటుందనీ, వాళ్ల కరుణతో తనలాంటి జంతు జాలానికి కడుపు నింపుతారని ఆశతో ఆ పిలుపు వింటుండిన చెవులు శాశ్వతంగా చెముడయ్యాయి. భైరవయ్య ఏటిలోనికి బయ్యన్న శవాన్ని విసిరేశాడు. కింద రక్తం పడిన జాగాలో మన్నంతా ఎత్తి ఏటిలో పారేశాడు. ఏమీ తెలియనట్లు, ఏటికి పోయి కాళ్లు చేతులు కడుక్కున్నాడు. సాయంత్రం. పొద్దుకుంగకుండానే ఉదయం పశువులను తోలుకు వెళ్లిన పసివాడు తిరిగి వచ్చాడు. పట్నం నించి డాక్టరూ, అమ్మాయమ్మా తిరిగివచ్చారు. బయ్యన్నకు తీపి వస్తువులు ఇష్టమని, ఎండు చేపలు మరీ ఇష్టమని అమ్మాయమ్మా అవే కొనుక్కొని వచ్చింది. ఇంటికి రాగానే పెరటి డొక్కులో చూసింది. పాల అన్నం అలాగే ఉంది. ‘‘చూడండి, మన బయ్యన్నకు, ఎంత దర్జాయో! చెప్పి మరీ వెళ్లినా - తినలేదు.’’ ‘‘నీవు దగ్గర ఉండి తినిపిస్తే గాని తినడే.’’ సంచిలోని ఒక ఎండు చేపను తీసుకుని, అమ్మాయమ్మా ఏటి ఒడ్డుకు వచ్చింది. ‘‘బయ్యన్నా, రారా... నీకిష్టమైనది తెచ్చాను రా. రారా... నాయనా... రారా’’ పిల్చింది. మళ్లీ మళ్లీ పిల్చింది. ఇంట్లో ప్రతిచోటా పిల్చింది. ‘‘ఎక్కడ తప్పిపోయాడో, ఇంటికి తెచ్చి దిగబెట్టకుండా మధ్యమ వదిలి వచ్చేశాను. ఆ పాడు బస్సు అంతసేపు రానిది, అప్పుడే వచ్చేయాలా? తోవలో ఏ కుక్క నొక్కేసిందో, ఏ పిల్లి పట్టేసుకుందో, ఆ రెండు ముంగిసలు వచ్చి దానిమీదపడ్డాయేమో?’’ అంత చీకట్లో కూడా మొగుడితో కలిసి మర్రిచెట్టు వరకు కేకలు వేసుకుంటూ వెళ్లింది. పిల్చింది. తిరిగివస్తూ ఎన్నో విధాల పిలిచింది. ఇంటికి వచ్చినా వంట లేదు. నోట్లో మంచినీరైనా పొయ్యలేదు. రాత్రంతా జాగారం చేసింది. మధ్యన లేచి వచ్చి ఏటి ఒడ్డున ‘‘నాయనా, బయ్యన్నా, నీకు తీపి తీపి మిఠాయి తెచ్చానురా. నీకిష్టమైన చేపలు తెచ్చానురా. రారా. నాయనా, రారా...’’ అని పిలిచింది. తెల్లవారినా ఆ ఘల్లుఘల్లు శబ్దం వినబడలేదు. ఉదయమే తలకు స్నానం చేసి దేవుడి గదిలో గంటసేపు కూర్చొని నా బయ్యన్నను నాకియ్యమని మొక్కింది. నలుగురిచేత వెతికించింది. వాడు దొరికితే పూజలు పునస్కారాలు చేస్తానంది. రెండు రాత్రుళ్లు గడిచిపోయాయి. బయ్యన్న జాడ తెలియలేదు. మూడో రాత్రి అటకపైన చప్పుడయింది. ఆత్రంగా లేచింది. అది ఘల్లుఘల్లుమన్న శబ్దం కాదు. పటుక్కు పటుక్కుమని శబ్దం వినిపిస్తూంది. లెటైత్తి చూస్తే ఇదివరలా బాహాటంగా ఒదిలేసిన ధాన్యాన్ని ఎలకలు వంచన చేస్తున్నాయి. వాటిని తోలాలన్న మనసైనా పుట్టలేదు. బయ్యన్న ఎక్కడో బతికి ఉన్నాడని, ఎవరో ఇనప గొలుసుతో కట్టేశారని, ఆ గొలుసు పటుకు పటుకుమని నమిలి, తెంపుకుని తనను చూడటానికి ఎప్పటికైనా వస్తుందని అమ్మాయమ్మ విశ్వాసం. ఒకనాడు ఉదయం. పొద్దు కాస్త మీదికి లేచింది. భైరవయ్య ఇంట్లో నించి కోడిపిల్లలను వదిలాడు. డాక్టరు ఇంటి ఎదర వీధి అది. చింతచెట్టు కింద ఏటి ఒడ్డులో రాలిన గింజలను కోళ్లపిల్లల సమూహం ఏరుకుంటున్నాయి. బయ్యన్న బాధ తప్పించుకున్నందుకు భైరవయ్య మురిసిపోతూ ఇంక కోళ్లను ఆ రాత్రి నించి అరుగుల మీద విడిచిపెట్టినా భయం లేదనుకున్నాడు. ఆ కోడి పిల్లల రంగుల వేపు చూసి మురిసిపోతున్నాడు. అలా అతను చూస్తుండగానే, ఒక ముంగిస - బయ్యన్న కంటె మరీ పెద్దది, భీకరమైంది, లేత నలుపు రంగుది - కోడిప్లిలపై ఉరుకుతూ ఒకదాన్ని పట్టుకుంది. భైరవయ్య పరుగెత్తి వెంట తరిమాడు. రాళ్లలో ఏ బిలంలోనికి పోయిందో ఎంత వెతికినా దొరకలేదు. తిరిగి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ కోళ్లను ఇంటివైపు తోలుకుని పెళ్లాంతో కోళ్లను ముయ్యమని చెప్పాడు. భైరవయ్య మంచం ఎక్కాడు. తన కర్రతో కొడుతుండగా, నేరం ఎరగని అమాయకమైన బయ్యన్న ఎత్తిన మూతి, జోడించిన చేతులు, అదో మానవుడుగా ‘నాదేం తప్పులేదు. నన్ను చంపకు. చంపకు’ అని నిండా ప్రాణంపై ఆశతో గగ్గోలు పెట్టుకున్నట్లు తోచి, ఆ దృశ్యాన్ని మనసు నించి చెరుపుకోలేక నడుం జార్చేసుకున్నాడు. - బలివాడ కాంతారావు -
గాలివాన
క్లాసిక్ కథ ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయోజనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండోతరగతి పెట్టె ఎక్కుతుంటే తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచి వుంటుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దాని మీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలు గుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పట్టాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ. వాళ్లని చూస్తే ఆయనకు ఎంతో గర్వం. రైలు పెట్టెలో మూడు మెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచు కున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు చిరాకు పడుతున్నట్టు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టి లోకి వెడితే బాగుంటుందని అనిపించింది. కాని రైలు కదిలిపోయింది. కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించాడు. కిటికీల పక్కనివున్న రెండు మెత్తల మీదా ఇద్దరు పెద్ద వయసువాళ్లు కూర్చున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆ యువకుని భార్య అయివుంటుంది. సిగరెట్టు పొగ మెల్లని ఘాటు రావుగారి నాసికా రంధ్రాలలోకి తెలియకుండానే ప్రవేశించి ఒక క్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. రైలుపెట్టెలో సిగరెట్టు పొగ గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయా లున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలు న్నాయి. ఆయన వేదాంతి. వేదాంతం జీవితం తోటీ, జీవన విధానం తోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ అనుబంధించి వుంటుం దని ఆయన వాదము. ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచి వక్తగా కూడా ప్రఖ్యాతి పొందాడు. ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడం కోసం. రావుగారు యువ దంపతుల వేపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగా వుంది. ఆమెకు కాస్త వుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా ఏదో అతను ఉద్యోగంలో వున్న దూరదేశానికి మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. గాలి పెరిగింది. బలంగా కిటికీ తలు పుల మీద ఒత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టిలో చీకటిగా అయిపోయింది ఎంచేతో. ఇంకా సాయంత్రం అయివుండదు. రావు గారి పక్కన కూర్చున్న పెద్దమనిషి కని పించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుకున్నారు. ఆయనకు రావుగారి వయస్సు వుంటుంది ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్ట కాలుస్తూ దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. ఆయన రావుగారికంటె పెద్దవాడై యుంటాడు. కాని ముఖంలో చురుకు ఉంది. అయినా జారిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి. తాను చాలా అదృష్టవంతుడని రావు గారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటె పెద్దదిలా కన్పిస్తుంది. ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే యిద్దరు పిల్లలున్నారనీ, అతను ఈమధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ చూసుకోవడం ప్రారంభించా డనీ వాళ్లెవ్వరూ అనుకోరు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించా లని నిశ్చయించుకున్నాడు. మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని, కోరికలు వాళ్ల ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన యింట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టాడు. ఆ పద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికీ కూడా ఎంతో శాంతీ, సుఖం సమకూరుస్తోంది. గాలి అరుస్తోంది. జల్లు కూడా ప్రారం భించింది. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి అటూ ఇటూ చూచి దూరంగా జరిగింది. చక్కగా దువ్విన తలకట్టులోనించి ముంగురులు విడిపోయి ఆమె నుదురుమీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తల దువ్వుకునే పద్ధతి రావుగారు నిర్ణ యించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ రావుగారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీ వానా పెట్టెలోకి చొచ్చుకు వచ్చాయి. చినిగి పోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ నిలబ డింది. ముసలాయన ‘ఇది పరుపుల పెట్టి అని తెలియదూ’ అన్నాడు. ‘బాబ్బాయి! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాక సోటివ్వరా బాబుగారూ. దయగల బాబులు! బిడ్డలున్నాతండులు! ఓ కానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతంది బాబులు...’ రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లల్లో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయో జనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చ మెత్తుకోడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్లి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు. ‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి యింత మాత్రం జాలి లేదు. ‘ఫో’ అంటాడు’. తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. ఇష్టం లేకపోయినా ఆమె వేపు చూస్తూ కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తే పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడస్తుందోనని భయం. ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ‘డబ్బున్న దొరలున్నా రని, నాబోటి ముష్టిముండని ఆకలితో సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేముడ! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్లుంటారు. ఆళ్లకే ఎక్కువ జాలి. డబ్బున్నా బాబులంతా రాతిగుండె లని తెలుసుకోలేక పోయాన్రా దేముడా! రావుగారి పక్కనున్న పెద్దమనిషి విచిత్రంగా ఆమెవేపు చూశాడు. ‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు.‘ఓ వూరేటి, ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్లకి. తమబోటి పెభువులకి వూళ్లుంటాయి. పెద్ద పెద్ద లోగిళ్లుంటాయి. గేటు ముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్లని రానీకుండా తరిమేయిత్తారు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’ ‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని ఉద్దేశించి, ఇంగ్లీషులో. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకు తోంది. ముష్టిది పెట్టెలో యువ దంపతు లకు ఎదురుగా కూర్చుంది. యువకుడు అన్నాడు: ‘మాతో కూడా వచ్చేయ కూడదూ నువ్వు? పనీపాటా చేస్తూ వుందుగాని తిండీ గుడ్డా యిస్తామ్.’ ‘ఏదో యిచ్చి దాన్ని పంపెయ్య కూడదూ?’ అంది యువతి భర్తని ఉద్దేశించి. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారి మనస్సు ఇతర విష యాలతో నిండిపోయింది. ఆయన గాలి వానను గురించీ, తను రైలులోంచి దిగడాన్ని గురించీ ఆలోచిస్తున్నాడు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో బట్టుకు లేచాడు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. తూలిపోయారు. ముష్టిమనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావు గారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలో చించడానికి అవకాశం లేదు. ఆమె సహా యాన్ని అంగీకరించక తప్పలేదు. కాని ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లం ఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ. కాని రైలు దిగి స్టేషనులోకి పరుగెత్తి వెళ్లిపోయారు. ముష్టి ఆమె సామానుల బరువుతో తూలుతూ వెనకాల వచ్చింది. సామానులు వెయిటింగు రూములో పెట్టింది. ఎక్కడా ఒక్క దీపం లేదు. రావు గారు కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబో యాడు. ఆమె వద్దనలేదు గాని, ఏదో విన బడకుండా అని మాయమైపోయింది. రావుగారు కూర్చున్నాడు. గింగురు మనే ఆ గాలిలో కళ్లు పట్టు తప్పిపోతు న్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమాడు. బాటరీ లైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. తడిబట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నాడు. స్వెట్టరు తొడుక్కున్నాడు. మఫ్లరు చెవులకు, తలకు చుట్టుకున్నాడు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు ఉండి తీరాలని బయటికి వచ్చాడు. ఇద్దరు ప్లాట్ ఫారం దాటివెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషను మాష్టరనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు. ‘నేను వూర్లోకి వెళ్లాలి’ అన్నారు రావుగారు ఆదుర్దాగా. ‘చాలా కష్టం. రోడ్డుమీద అంగుళం అంగుళానికీ చెట్లు పడి వున్నాయి. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.’ ‘కాని స్టేషన్లో యింకెవరూ లేరు.’ ‘నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.’ స్టేషను మాష్టరు వెళ్లిపోయాడు. రావు గారు వెయిటింగ్ రూంలోకి వెళ్లిపోయారు. మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావు గారికి తోచలేదు. క్రమశిక్షణ, నియ మాలు, విలువలు అన్నీ కూడా మానవా తీతమైన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితాలైపోతాయని ఆయనకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడా మానవ హృదయమన్నది లేదు. గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ గదిలో యింకో వస్తువేదో వున్నట్టు రావుగారికి కనిపించింది, తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వేపు చూశాడు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ వొక మూల నిలబడివుంది. ఆమె తడి వెంట్రు కలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది. ‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా ఉంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్లీ తలుపులు మూసి గదిలో వున్న కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ‘‘ఏం గాలివానండి బాబుగారు. నేను పుట్టిన్నాటినుండి యింత గాలివాన నేను చూడలేదు’’ అంది ముష్టి ఆమె. ఆమె గొంతులో బెదురులేదు. అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడకల్గుతూందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశాడు. మూలగా వొణుకుతూ కూచున్నది. రావుగారు తన పంచ ఒకటి తీసి ఆమె వేపు విసరి ‘యిది కట్టుకో’ అన్నారు. కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్న చోట కూర్చుంది. రావుగారికి ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది. బిస్కట్ల పొట్లం తీశాడు. ఒకటొ కటి చొప్పునా నమలడం ప్రారంభించాడు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని కొన్ని బిస్కట్లిచ్చాడు. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె వుండడం కొంత నయం. ఆమె దేన్ని గూర్చీ బాధ పడదు గాలీ వానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా ఆమెకు అనుభవమై వుంటాయి. రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. ‘ఈ యిల్లు కూలిపోదు గదా?’ అని ఆయన అడిగారు. ‘ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువైతే ఏది ఆగుద్ది?’... ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం. ఆయన పెట్టె దగ్గరకు పోయి కూర్చు న్నాడు. ఆయన కూర్చున్న మూలకు ఆమె కూడా చేరింది. అక్కడ కూచుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది. ‘గాలివాన యింత ముదిరిపోతుందని నేననుకోలేదు.’ ‘బాబుగారు ఎందుకలా భయపడతా’ రందామె. ‘ఒక్కరుండేకంటె యిద్దర మున్నాం గదా! టిక్కెట్టు కలెక్టరు రైలు కదులు తూంటే నన్ను దింపేశాడు, ఏం చేయను! ఇక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టుమెట్టుకోనాకి ఓ పొడి గుడ్డ యిచ్చారు. ఆకలికి మేత పడేశారు. వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అది లేదనీ, యిది లేదనీ సీకాకు పడితే ఏం లాభం?’ ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ మన మనస్సుకీ ఎంతో అంతరం వుంది. అయినా ఆ భయంకరమైన రాత్రివేళ తనకు తోడుగా ఆమె వున్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. ‘నీకెవరూ చుట్టాలు లేరా?’ అన్నా రాయన. వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. రైలులో ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. కాని ఆమె మాటల్లో గానీ చేతల్లో గానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆయన దగ్గరగా జరిగింది. ‘సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగు తాడు. ఆడే మా అమ్మని సంపేశాడం టారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగ ముండావాడితో సేవితం కలిగింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటైపోయాయండి. ఇంట్లో తిండికీ తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి. ‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు?’ ‘ఒక్కొక్కరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒక్కొక్కరోజు కానీ కూడా ఉండదు.’ రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపిం చింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు గానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలు గానీ ఆమెకు లేవు. ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకేసలా చూత్తారు?’ అంది. ‘మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.’ వెంటనే ఆయన తనలోకి ముడుచుకు పోయారు. తన మనస్సులో అశ్లీలైన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచిం చినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. ‘నీవేపు చూడ్డం లేదు’ అన్నారాయన గట్టిగా. ‘దీపం ఆర్పడం మరచిపోయాను.’ అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచు కున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదురైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీమీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలలోకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగలించు కున్నాడు. వెంటనే సిగ్గుపడ్డాడు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టి నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లాడు మూలలోకి. ఆమె ఆయనను ఆ మూలలో కూచోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతు లాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన జరుగుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావ సరం. అంచేత ఆయన కాదనలేదు. ఆమె మరీ దగ్గరగా జరిగి వొళ్లోకి వాలింది. ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనా పరంపరలో మునిగిపోయాడు. ఆమె మాట్లాడుతూనే వుంది. ‘ఈ మూల భయం లేదండి. బాబుగారికి చక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుచు కుంటున్నారు. మా గుడిసి ఎగిరిపోయుం టది. పిల్లేమైయుంటారో! ఇరుగు పొరు గోళ్లు సూత్తుంటార్లెండి. మావోడు చిత్తుగా తాగి పడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలు సుకంగా వున్నారో లేదో?’ ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆమెను గట్టిగా అదుముకున్నాడు క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానివేసింది. గాలి చేసే గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. కాలం అతి మెల్లగా జరుగుతోంది. కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలివల్ల వాన వారిద్దరినుంచీ దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశాడు. అమాయికంగా, నిశ్చింతగా వుంది. స్వచ్ఛమైన, నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింప జేసింది. గాలివాన జోరు హెచ్చింది. కాని ఆయన మనస్సులో అమితమైన ప్రశాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మరచిపోయి నిద్రలో మునిగిపోయాడు. మళ్లీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టి ఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం చూచుకున్నారు. ఐదుగంటలయింది. అనుకోకుండానే జేబులు తడుము కున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట ‘దొంగ ముండ’. కాని ఆమె అల్లా దొంగతనం చేసి వుంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గు మూలలా వెతికారు. కనబడలేదు. గదిలో నుంచి బయటికి వచ్చారు. భీభత్సంగా వుంది. ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్క లంతా నీటిమయం. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టి నప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనెప్పుడూ చూడలేదు. వికారం వచ్చింది. వెనక్కు తిరిగాడు. టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నాడు. ఆ కల్లోలాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ సామాను కింద ఏదో శరీరం ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టి ఆమె. తట్టుకోలేకపోయాడు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయి నట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరా వుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి తొందరగా యింటికి పోయుంటాడు. రావు చిన్నపిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించాడు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నాడు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ శాంతినీ గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడి పోయి వుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రం లాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు అనిపించింది. తన పర్సును దొంగలించినందుకు గాని, అంత గాలి వానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చు నని టిక్కట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసును. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్య గాని ఆయన పిల్లల్లో ఎవరుగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం... అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే. అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకుని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందులోంచి డబ్బు తీసి తెరచి వున్న డ్రాయరులో వేసి డ్రాయరు మూశాడు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయన మనస్సు వొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేడు. అంతచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్నించి వెళ్లిపోయాడు. (స్థలాభావం కారణంగా కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది) - పాలగుమ్మి పద్మరాజు -
శేషమ్మ
క్లాసిక్ కథ శేషమ్మకి ఈ లోకంలో ఏ మాత్రమూ ఆనందమూ సౌందర్యమూ కనపడడం మానేసి ముప్ఫై యేళ్లయింది. ఇతరులు నవ్వుతున్నా, తింటున్నా, పాడుతున్నా, ఆమెకి విచారమో లేక, అసహ్యమో కలుగుతుంది. పిట్టల కూతలూ, పిల్లల నవ్వులు కూడా ఆమెని ‘ఇరిటేట్’ చేస్తున్నాయి. ‘‘పాడు పిట్టలు - పనిలేదు వీటికి. వెధవ అరుపులూ, గోలలూ, అంతకన్న చస్తేనేం?’’ ఆమెకి ప్రపంచం దుఃఖమయం, పాపభూయిష్టం, అపవిత్రం. దీన్నంతా విడిచిపోవాలని, మృత్యువుని తలుచుకుని అందరూ వినేట్టుగా ఆహ్వానిస్తూ వుంటుంది. ‘‘ఆ ఈశ్వరుడు యెప్పుడు దయ తలుస్తాడో, ఎప్పుడు పిలిపించుకుంటాడో, యీ నరకంలోంచి నన్ను!’’ ఆ ఈశ్వరుడు తన తండ్రిలాగూ, తనని భూలోకమనే అత్తవారింటికి పంపినట్టూ మాట్టాడుతుంది. నాలుగేళ్ల క్రిందట కలరా తగిలినప్పుడు మాత్రం - ‘‘ఒరే చస్తానురా. చస్తానురా. డాక్టరేమన్నాడూ? ఆస్పత్రి పెద్ద డాక్టర్ని పిలుచుకురా. ఆ పెరుగు తోడుకుందో లేదో చూచావుటే. మా అమ్మ యెనభై యేళ్లు బతికిందిరా. ఇంత చిన్నదాన్ని నాకప్పుడే యేం చావు? అవునులే ఈ ముసలిముండ చస్తే ఎవరికేం? అందరికీ పీడ విరగడైపోతుంది’’ అంది మళ్లీ. ఆమె మొహాన నవ్వు చూసిన వాళ్లెవరూ లేరు. చిన్నపిల్లలు గంతులేస్తోవుంటే, ‘‘ఈ గంతులెన్నాళ్లు? మీ కాళ్లు విరగా. ఇదేం పోయేకాలంరా. సరిగా కూచుని యాడవలేరూ?’’ అన్నట్టు చూస్తుంది. ఎంత విచారంగా కనపడితే యీ లోకం మీద, యీ మాయమీద ఎంత అసహ్యం కనపరిస్తే, ఎంత సౌందర్యాన్ని ద్వేషిస్తే ఈశ్వరుడికి అంత సన్నిహితురాలూ, ప్రియతమురాలూ అయి వుంటుంది. యీ లోకంలో తన వంటి సన్మార్గులకు కష్టాలు తప్ప యింకేమీ లేవు కనక సుఖపడేవాళ్లంతా దుర్మార్గులే అయి వుండాలి. తను కష్టాల కోసం ఎంత ప్రయత్నించి ఏరుకుంటుందో ఆమెకి తెలీదు. ‘‘అదేమిటి ఆ కామాక్షి అట్లా పాడుతోవుంటుంది యెప్పుడూ! దేన్ని చూసుకునీ! మొగుడి వుద్యోగం వూడినప్పుడు తెలుస్తుంది, అమ్మగారి అదిరిపాటు!’’ ఆమెని ‘‘యెట్లా వున్నారమ్మా!’’ అని అడిగితే యెప్పుడూ ‘‘బాగానేవున్నా’’నని అనలేదు. అసలు యీ దేశంలో ఆ మాట అనేవాళ్లే తక్కువ. నిజంగా బాగా వుండేవాళ్లే తక్కువ. బాగా వున్నా కూడ. బాగా వున్నామని తెలుసుకున్నవాళ్లు చాలా తక్కువ. తెలుసుకున్నా, ‘‘బాగా వున్నా’’మని అంటే దిష్టి తగిలి, అదృష్టం మారుతుందని ఆ మాట అనరు. అంతేకాక బాగా వుండడం దోషమనీ, పాపాత్ములే బాగా వుంటారనీ, మూర్ఖులు మాత్రమే బాగా వున్నామనుకుంటారనీ నమ్మకం. ‘‘ఏం బాగుండడమమ్మా! కుర్రాడికి నిన్నటి నుంచి జలుబు కదా! ఇంతవరకు కన్ను తెరచి యెరుగడు. ఆవు పాలివ్వడం మానేసింది. మొన్ననేగా మా తాతగారి సవతి తల్లి మేనమామ పొయినాడు. వాడి మనుమడు మూడో క్లాసు తప్పిపోయినాడా! రాచ్చిప్ప చిల్లిపడ్డది. నిక్షేపం లాంటి రాచ్చిప్ప! ఇట్లావుంది మాగతి. ఏమోనమ్మా ఈ కాలంలో అంతా మాయ మాయ రాచ్చిప్పలూ! మాయ మనుషులూ! అవునులే అమ్మా! ఏం శాశ్వతం? ఈ దేహమూ అంతేకద, వూరికే పట్టుకు పాకులాడుతారు గానీ.’’ ఈ వాక్యాలే ఏ దేశాభిమాని ఐనా విన్నాడా, అక్కడే మూడు పల్టీలు కొట్టి ‘‘హా భారతమాతా! ధన్యురాలిని. ఇట్లాంటి ఆధ్యాత్మికులైన ముసలమ్మల్ని కన్నావు’’ అని ఆనందంలో మూర్ఛపోతాడు. ఎవరన్నా - ‘‘అదీ, ఆ రత్తమ్మ! మొన్న రాత్రి పారిపోయిందటమ్మా!’’ అంటే - శేషమ్మ ‘‘ఛీ ఛీ, అట్లాంటి మాటలు నా చెవిని పడనీకు. నాకెందుకూ? నా రామ నామమేమో, నేనేమో! ఇంతకీ యెవడితో?’’ ‘‘అక్క యింటికి.’’ ‘‘ఇంతేనా? పారిపోయిందంటావేం?’’ ‘‘ఏమో వాళ్లంటే నేనన్నాను.’’ కొంచెం ఆగుతుంది శేషమ్మ ఇంకా యేమన్నా చెపుతారేమోనని. చెప్పకపోతే - ‘‘నాకెందుకమ్మా! కానీ అక్క యింటికి ఎవరు తీసుకెళ్లారూ? ఎవడో మొగాడు వుంటాడు. బాగా చూడమను. వాతలు పెడితే యిద్దర్నీ పట్టుకుని - నాకెందుకులే. వద్దన్నా నాకెందుకు చెపుతావు! అక్క యింటికి వెళ్లిందో, ఇంకెక్కడికి వెళ్లిందో! ఆ అక్క సంగతి తెలుసుగా! దాని షోకులూ, రవ్వల దుద్దులూ - నాకెందుకమ్మా! బండెడు చాకిరీ! చస్తున్నాను.’’ ‘‘మీ కోడలు పనిచెయ్యదా?’’ ‘‘అయ్యో దాని చేతులు పువ్వులట, దాని కాళ్లు తామరాకులట!’’ ‘‘మీ కూతురో?’’ ‘‘మా కూతురుకి గంపెడు రోగమమ్మా! అదేం చేస్తుంది దాని ముఖం!’’ ‘‘అట్లానమ్మా! బాగానే తిరుగుతో వుంటుందే!’’ ‘‘మీ కంటికి అట్లానే కనపడుతుంది. పై పుస్టేగానీ లోపలంతా గుల్ల. ఒకటే ఆయాసం.’’ ‘‘మరి ఎపుడూ అలా చిరుతిళ్లు తింటే...’’ ‘‘అయ్యో యేం తింటుంది? అన్నం అసలే తినదు. ఆ చిరుతిళ్లు కూడా లేకపోతే ఎట్లా?’’ ‘‘మా కూతురమ్మా, మా సుబ్బలక్ష్మి! దానికొక్కరోజు జబ్బు చెయ్యదు కదా!’’ ‘‘చెయ్యకేమమ్మా! అట్లా తిరిగేవాళ్లు గభాలున పడతారు. మా మామ మనుమడు అంతే, పిడిరాయి లాగు-’’ శేషమ్మ ప్రపంచం పనీ, ఆచారమూ. తెల్లవారకట్ట నాలిగింటికి లేచి, రాత్రి పదకొండింటి వరకు (మధ్యాహ్నం రెండు గంటలు విశ్రాంతితో) పనిచేయడం, ముప్పై యేళ్లనించి, ప్రతి దినమూ ఆ విధంగా పనిచేస్తోంది. ఆమె పని చేసినంతసేపూ, ఆమె నోరు పనిచేస్తోవుంటుంది, మాటలతో తిట్లతో. తెల్లవారకట్టే రాత్రి అల్లరి చేసిన పిల్లుల్నీ, యెలకల్నీ తిట్లు, తరవాత పదింటిదాకా దాసీదాన్ని తిట్లు, అల్లరి చేసే పిల్లుల్నీ కాకుల్నీ తిట్లు. కానీకి వీశడు బీరకాయ లివ్వని కూరలదాన్నీ, మజ్జిగదాన్నీ, తిట్లు. ఈ ముపై యేళ్లలోనూ ఒక్కరోజు కూడా చిక్కని మజ్జిగ పొయ్యలేదు కదా, పుచ్చుపోని కూరలివ్వలేదు కదా? మధ్యాన్నించి యిరుగు పొరుగు వాళ్లనీ, కోడల్నీ, కొడుకు అనాచారాన్నీ కృతఘ్నతనీ, దేవుణ్ని, పిచికల్నీ, తోవన పొయ్యేవాళ్లనీ తిట్టుకోవడం ప్రారంభిస్తుంది. పని చెయ్యకుండా వుండలేదు. అదే ఆమె మతం, ఆమె శరీరమే పనిచేసే మర అయిపోయింది. ఆమె ‘ఇంటెలిజిన్స్’ ఎప్పుడో మానింది పని చెయ్యడం. ‘రొటీన్’ తప్ప ఇంకేమీ ఆమె చేతకాదు. ఒక్కరవ్వ ప్రోగ్రామ్ మారిందా యిల్లు పడుకుంటుంది. అంట్ల శుభ్రం, యిల్లు కడగడం, పేడ చల్లడం, మెతుకులూ, ఎంగిలీ మైల మైల అని అరవడం యిదే బతుకు? ఒక కొత్తపనీ, కొత్త యోచనా రెండూ ఆమె చేతకాదు, గానుక్కి కట్టిన యెద్దు నయం. అందువల్లనే మార్పు అంటే గుండెలు పగిలి చస్తారు. బెత్తం లేకుండా పాఠం చెప్పమంటే, ముసలి స్కూలు మాష్టరికి యెట్లా వుంటుందో, యింగువ లేకుండా వంట చెయ్యటమంటే ఆమెకట్లా వుంటుంది. టేపు లేకుండా పని చెయ్యమంటే తాలూకా గుమాస్తాకి యెట్లా వుంటుందో మడి కట్టుకోకుండా వండమంటే ఆమె కట్లావుంటుంది. ప్రపంచం ముక్కలైనా ఆమెకి ఆశ్చర్యం కలగదు. ఇంత పని యిన్నేళ్లు చేసిందా యెవరికా వుపయోగమంటే యేమీ కనపడదు. అందరూ ఆమెని చూసి విసుక్కునేవాళ్లే గాని కృతజ్ఞత కనబరిచేవాళ్లు లేరు. నలుగురికి భోజనం పెడుతోంది. తను తింటోంది. ఇంటిని మురికి చేస్తుంది, ఎందుకు? కడగడానికి. కడగడమెందుకు? మళ్లీ మురికి చెయ్యడానికి. అంతకాలం వంట చేస్తే మూడు వందల మందికి భోజనం పెట్టవొచ్చు వొక మనిషి. స్వర్గంలో అంట్లు తోమడమూ, బట్టలారవెయ్యడమూ లేకపోతే యేం చేస్తుందో యీ మనిషి! పాపం, ఏ కొత్త కాంతినీ, ఆశనీ, ఆనందాన్నీ, కోర్కెనీ, అన్నిటినీ త్యజించి, ఆ వంటిల్లే తన ప్రపంచంగా తన బాధే తన ఆనందంగా, తన చేతికి చిక్కిన అయిదారుగురు దాసీలతో సహా, తన నోటి తీటను తృప్తిపరచగల సాధనాలుగా, తన ఆచారాన్నీ, తులసికోటని చూసుకుని గర్వపడి బతుకుతోంది. భూకంపాలు రానీ, దేశాలు దేశాలు తగలపడనీ, సామ్రాజ్యాలు పడిపోనీ, ఆమెకేమీ సంబంధం లేదు. తన యింటికి వంద గజాలు దాటి ఆమె మనసు పనిచెయ్యదు. కాపురము, పిల్లలు, ప్రేమ, ఏమీ లేక తనది, స్వంతంగా తనది అనే ఆస్తిగాని మనిషి గాని లేక, క్రమంగా క్రమంగా మనసు మోడైపోయి నిలిచింది ఆమె. ఇంకే ఆసక్తీ లేక ఆ పాత పురాణాలలో విన్న అక్కడక్కడి వచనాలని పట్టుకుని, వాటి వాస్తవత్వం పైన తన ఆత్మ పురోభివృద్ధిని ఆధారంగా చేసుకుని కన్నంలో యెలిక వలె బతుకుతోంది. ఎవరికైనా ప్రేమించడం కన్నా ద్వేషించడం సులభం. ప్రేమ మనిషిని తన స్వంతంగా చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ పేద వితంతువు స్వంతం కావడానికి ఎవరంగీకరిస్తారు? తన కోడలికి ఒక్కొక్క బిడ్డే పుడుతోవుంటే తన స్వంతం చేసుకోవాలని చూసింది. ఆ తల్లి ప్రతి నిమిషమూ జ్ఞాపకం చేసేది ఆ పిల్ల తనదని - చూపుచాతా, నడవడిచాతా. ఆ పిల్లలే మూడేళ్లు రాగానే అందరి కన్న లోకువ గనక కర్రలు తీసుకుని బాదేవారు ఆమెని. ప్రేమ లేక, సంతోషం లేక, జీవితంలో ఇంటరెస్టు లేక, తను ఏ బాధపడ్డా కరుణించేవారు లేక, తిట్లలో తన ఆనందాన్ని సార్థకం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇట్లా ఎందరు యీ దేశంలో యిట్లా కొయ్యబారిన ఆత్మలతో తమ జీవితాన్నీ యితరుల జీవితాల్నీ క్షోభపెట్టి చివరికి మృత్యువులో తప్పించుకునే స్త్రీలు! కానీ మృత్యువులోనైనా తప్పించుకుంటారా? వాళ్ల జన్మలో వుందా యీ లోపం? వాళ్లనిట్టా చేసిన సంఘం పరిస్థితులలో వుందా? వాళ్లు సంఘాన్నిట్టా ఎండపెడుతున్నారా, సంఘం వాళ్లని కొయ్యల్ని చేస్తోందా? -
అవి కావు జంతువులు
క్లాసిక్ కథ ఎర్రని యెండ. తారు వేసిన ఆ రోడ్డులోంచి వేడి తెరలు తెరలుగా పైకి లేస్తోంది. రోడ్డు పక్కగా ఒక పెద్ద చింతచెట్టు... మూర్ఛపోయిన వానిలా అచేతనంగా ఉంది. దాని నీడ కూడా వేడిగా ఉంది. కాని దానికంటె నీడగల చెట్టు ఆ ప్రాంతాలలో మరొకటి లేదు. అందువల్ల తాము తోలుకు వచ్చిన ఎడ్లను నీడలో నిలిపి, చింతచెట్టు బోదె వద్ద ఆసాములు నిద్రపోతున్నారు. చెమటలు కారిపోతున్నాయి. అలిసిపోయిన ఈటె కొమ్ములది నిద్రపోతోంది. నీడలో పడుకున్నా, దాని కళ్లల్లో కన్నీళ్లు ధారలు కడుతూనే వున్నాయి. దాని ఒంటిమీద ములుకర్ర దెబ్బల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈటె కొమ్ములది ఒక ముసలి ఎద్దు. దాన్ని కొమ్ములు రెండూ ఈటెల్లా వాడిగా వుండడం వల్ల, ఆసాములు దానికా పేరు పెట్టారు. పుట్టినప్పట్నుంచీ అలవాటైన ఆ చోటికి తలవని తలంపుగా రావడంతో ‘అంబా’ అంటూ అరిచి పడుకుంది. దాని జత యెద్దయిన పొడుగు కొమ్ములది ఎక్కడుందో యేవిటో, ఆ అరుపు విని కంచె దాటి అక్కడికి వచ్చింది. ఈటె కొమ్ముల యెద్దు ఒంటిమీద కనిపిస్తున్న దెబ్బల్ని తన నాలుకతో మెల్లగా నాకుతూ అక్కడ నిలిచింది. అక్కడింకా యిరవై ముప్ఫయి ముసలి యెడ్లూ, వట్టిపోయిన ఆవులూ వున్నాయి. అవి ఎక్కడికి వెడుతున్నవో వాటికి తెలియదు. ఆసాముల ములుకర్రల దెబ్బలకు జడిసి, నడిచేటప్పుడు దారిలో కనిపించిన గడ్డీ గాదం త్వరత్వరగా తినడం చేత, యిప్పుడు కళ్లు మూసుకుని నెమరు వేసుకుంటున్నాయి. మనిషికి ఒక జానెడు, పశువుకి ఒళ్లంతా పొట్ట - అంటారు. అందువల్ల ఏదో ఒకటి తినాలిగా మరి! ‘‘పొడుగు కొమ్ములూ, అదుగో కనిపిస్తోందే ఆ తోటలో మనం జతగా పనిచేసిన ఆ రోజులు తలుచుకుంటే నాకిప్పుడు ఒళ్లు జలదరిస్తోంది. రేయింబవళ్లూ చెరకు తోటకు నీళ్లు తోడి పోసేటప్పుడు, ఒకసారి ఆసామి నిద్రపోయి నీ మీద పడ్డాడు. అప్పుడు కనక నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే, అతనికి దెబ్బ తగులుతుందని బరువంతా మోస్తూ కదలకుండా అలాగే నుంచున్నావు, గుర్తుందా?’’ అంది అలసిపోయిన ఈటె కొమ్ములు, తెచ్చుకున్న ఉత్సాహంతో. ‘‘అదంతా యిప్పుడు గుర్తు చేసుకోవడం దేనికి? నిన్ను మళ్లీ చూడడంతో నాకు కలిగిన సంతోషం యింతా అంతా కాదు. ఏవేవో మాట్లాడి, యీ సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవడం?’’ అని విసుక్కుంది పొడుగు కొమ్ములు. ‘‘అది సరే కాని, నువ్వు నన్నెలా వెతుక్కుంటూ వచ్చావ్?’’ ‘‘ఈ పక్కనేగా వుంది మా ఆసామి తోట. నీ గొంతు వినిపించింది. మరి రాకుండా వుంటానా? కంచెను ఒక్క అదుము అదిమి, దాటి వచ్చేశాను.’’ కందప్పన్ పుదూర్ అనే ఊరికి దగ్గరగా వున్న రహదారిలో ఈ యెడ్ల జత విడివడిపోయి, తలవని తలంపుగా ఇవాళ మళ్లీ కలుసుకున్నాయి. తమ మౌన భాషలో మాట్లాడుకోసాగాయి. ఇక్కడి నుంచి కందప్పన్ పుదూర్ ముప్ఫయి మైళ్ల దూరంలో ఉంది. ఆ ఊరి ఆసామి ఒకాయన ఈ రోడ్డులో ప్రతి గురువారం జరిగే సంతలో ఒకసారి ఈటె కొమ్ముల్ని అమ్మివేశాడు. ఇప్పుడది ఆ ఊరికి పక్కగా పోతున్న బాటగుండా ఇతర పశువులతో పాటు కేరళ దేశానికి వెడుతోంది. గొడ్లు తోలుకొని వెడుతున్న ఆసాములు విశ్రాంతి కోసమని ఆ చింతచెట్టు నీడను విశ్రమించడం యాదృచ్ఛికంగా జరిగింది. ఈటె కొమ్ములు వీపు విరుచుకుని పక్కకు తిప్పుకుని మళ్లీ పడుకుంది. పొడుగు కొమ్ములు నాకుతూ వుంటే ఎక్కడలేని సుఖం కలిగింది దానికి. ‘‘అబ్బా! వాళ్లు నన్నెక్కడికి తోలుకుపోతారే యేవిటో! ఇంకా ఎంత దూరం నడవాలో! ఈ ములుకర్ర దెబ్బల్ని మాత్రం నేను భరించలేకుండా వున్నాను. నాకే మాంఛి దెబ్బలు తగులుతున్నాయి.’’ ‘‘అవును. నీ కాలు కుంటి. దెబ్బలు తప్పించుకుని నువ్వెలా ముందుకి నడుస్తావ్?’’ పొడుగు కొమ్ములు కళ్లు చెమ్మగిల్లాయి. ఆ జత యెడ్లు చాలా యేళ్లుగా ఒక ఆసామి వద్ద రాత్రనక పగలనక కష్టపడి పనిచేశాయి. వాడి కొమ్ములు ఎడమవైపు కాల్లోకి ఎలాగో ఒక మేకు దూరింది. మొదట్లో దీన్ని గమనించలేదు. ఆ తర్వాత చికిత్స చేశారు. గుణం మాత్రం కనిపించలేదు. చివరికది కుంటిదయింది. అప్పుడు ఆసామి దాన్ని కేరళ నుంచి వచ్చిన ఒక ఆసామికి ఈ రోడ్డు సంతలో నూరు రూపాయలకు అమ్మివేశాడు. కందప్పన్ పుదూరు దగ్గరగా కేరళకు వెళ్లే రహదారి వుండడం వల్ల, ఆ జత యెడ్లు మళ్లీ కలుసుకునేందుకు అవకాశం కలిగింది. ‘‘పోయిన సంవత్సరం నాలుగెకరాల్లో మన ఆసామి పసుపు వేశాడు. గుర్తుందా నీకు?’’ అడిగింది పొడుగు కొమ్ములు. ఇలాంటి విషయాలు గుర్తు చేయవద్దనే అది యిందాక చెప్పింది. కాని యెడ్లకు మాట్లాడుకునేందుకు వేరే విషయాలు ఏముంటాయి? ‘‘అప్పుడే మరిచిపోతాననుకున్నావా? పసుపు పంటకి వంద నీళ్లంటారు. మనమేగా అన్ని నీళ్లూ తోడిపోసింది.’’ ‘‘బళ్లకొద్దీ పెంటపోగు తోలింది కూడా మనమేగా? పసుపు బాగా పండింది.’’ ‘‘ఆ యేడు దానికి మంచి ధర పలికింది కూడా. ఆసామి బోలెడు గడించాడు’’ అని వాడి కొమ్ములు తన కష్టాలన్నీ మరిచిపోయి చెప్పుకుంది. ‘‘నువ్వు నీళ్లు తోడిపోశావు. ఆసామికి’’ అని వాడి కొమ్ములు చెపుతుంటే, మాటకు అడ్డం వచ్చి, ‘‘నువ్వు కూడా నాతోపాటు కష్టపడ్డావు గదా! ఆసామి సంచిలో ఎన్ని వంద రూపాయల నోట్లు పడ్డాయో!’’ అంది పొడుగు కొమ్ములు. అప్పుడు నిద్రపోతున్న ఆసాములు యిద్దరూ లేచారు. వెంటనే వాళ్లు బీడీలు ముట్టించుకున్నారు. మాటలు సాగాయి వాళ్ల మధ్య. ‘‘ఆ మనిషిని చూశావా? వచ్చే యేడు అమ్ముతాడట!’’ ‘‘ఏ మనిషంటావు!’’ ‘‘వాడే, సంతకు రాలేదూ, బాడుగ ఒంటెద్దు బండివాడు. ఇంకా ఒక సంవత్సరం దాంతో కాలక్షేపం చేసి, బాగా దాన్ని చావబాది, ఆ తర్వాత అమ్ముతాడట.’’ ‘‘దానికి యాభై రూపాయలు మంచి ధరే అనుకుంటా.’’ ‘‘వాడు బలే మనిషిలే. వచ్చే యేడు ఇరవై అయిదు వచ్చినా చాలట. అలా అని వాడే చెప్పాడు.’’ ‘‘అవును. ఆ యెద్దుతోనే వాడు సంవత్సరం తిరిగే సరికల్లా అయిదు వందలకు పైగా సంపాయిస్తాడు. అటువంటప్పుడు యిప్పుడెందుకు అమ్ముతాడు?’’ వాడు లెక్కా డొక్కా తెలిసిన ఘటం! గొడ్డు బాగా అలిసిపోయి, నేలకు ఒరిగేంత దాకా దాన్ని పిండి, పిప్పి చేస్తాడు. ఆ తర్వాత ఏం ధర పలికితే మాత్రం యేం! ఆ వచ్చే డబ్బుని కూడా విడిచిపెట్టడు.’’ ఆలమందల్ని తోలుకు వెళ్లేటప్పుడు కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపకుండా, వాటిని ములుకర్రలతో బాధించే ఆ మనుషుల మాటల్ని అర్థం చేసుకోవాలని పొడుగు కొమ్ములూ వాడి కొమ్ములూ ఆశించాయి. కాని ఒక మనిషి మాటల్ని మరో మనిషి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అర్థం చేసుకో గలిగితే... అన్న మాటలకు భిన్న అర్థ తాత్పర్యాలు, ప్రతివిమర్శలు, వివాదాలు ఎందుకు బయలుదేరుతాయి? మనుషుల పరిస్థితే యిలా వుంటే, ఆ మనుషుల్ని గొడ్లు ఎలా అర్థం చేసుకోగలుగుతాయి? ఇదీ ఒక విధంగా మంచిదనే తోస్తోంది. ఎందుకంటారా - ప్రయాణం చివర ఏం జరుగుతుందో ముందే తెలియకుండా వుంటే, అంతవరకైనా బాధ తప్పుతుంది గదా! వాడి కొమ్ములకీ పొడుగు కొమ్ములకీ వాళ్ల మాటలు ఏమీ అర్థం కాలేదు. ముఖాలు చూసుకున్నాయి. మనిషే సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు, పాపం గొడ్లకేం తెలుస్తాయి మాటలు? ఇంకా కాలితే, వేళ్లు కాలుతా యన్నంతగా బీడీలు చిన్నవైనాయి. అందువల్ల వాటిని పారేసి, మళ్లీ వాళ్లు పడుకున్నారు. పొడుగు కొమ్ములూ వాడి కొమ్ములూ మళ్లీ మాటల్లోకి దిగాయి. ‘‘మన ఆసామివాళ్ల నాన్న పక్షవాతంతో ఆసుపత్రిలో పడుకున్నాడు గదా’’ అంది వాడి కొమ్ములు. ‘‘అవును. ఆ మూడేళ్లూ ప్రతిరోజూ పది మైళ్లు ఆసుపత్రికి వెళ్లి, మళ్లీ యింటికి వచ్చేవాళ్లం. ఒక్క రోజయినా నాగా పడలేదు.’’ పొద్దున పూటేమో పొలంలో మంచి పని. సాయంకాలం బండిలో అందర్నీ మోసుకుని పది మైళ్లు ఆసుపత్రికి వెళ్లాలి. మళ్లీ పది మైళ్లు పరుగు.’’ ‘‘కాలు పడిపోయిన వాళ్ల నాన్నను మన ఆసామి బాగానే చూశాడు. కాని ఆయన లేచి తిరక్కుండానే కళ్లు మూశాడు. ఆయన అస్థుల్ని కావేరిలో కలపడానికి మన బండే కట్టారు. అప్పుడు... పాపం... మన ఆసామి వెక్కి వెక్కి యేడ్చాడు.’’ అవి యిలా మాట్లాడుకుంటూ వుండగా, బిగ్గరగా కేకలు వేసుకుంటూ అక్కడికి వచ్చాడు ఆసామి. ఆ రోజు పొడుగు కొమ్ముల్ని మరో యెద్దుతో జతచేసి, పొలం దున్నాలని ఆయన అనుకున్నాడు. కాని కట్టుకొయ్య వద్ద పొడుగు కొమ్ములు కనిపించలేదు. వెంటనే దాన్ని వెతకడం కోసం మనుషుల్ని పంపించాడు మూడు వైపులకీ. తానేమో తమలపాకులు వేసుకుంటూ చింతచెట్టు నీడలో గొడ్లు వుండడం చూసి, అక్కడికి వచ్చాడు. పొడుగు కొమ్ముల్ని చూశాడు. అంతే... ‘‘ఓహో! ఆ కుంటిదాని మీద నీకింత ప్రేమా! నీకోసం అన్ని చోట్లూ గాలించమని చెప్పి వచ్చాను. వాళ్ల పనిని కాస్తా పాడుచేశావ్! నీకు వేడి వేడి దెబ్బలు తగలాలి’’ అంటూ అక్కడున్న కంచెలోని ఒక తీగను మెలిపెట్టాడు. పొడుగు కొమ్ములు పడుకున్న చోటికి కోపంతో నడక సాగించాడు. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడినుంచో వచ్చింది ఒక కుక్క అక్కడికి ఆసామిని కరవడానికి. దాన్ని చూస్తేనే పిచ్చి కుక్కని తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినా దాని బారి నుంచి తప్పించుకోలేకపోయాడు ఆసామి. వాడి కొమ్ములు గభాలున లేచి, ఆ కుక్క మీదికి ఉరికింది. కుక్క కాటుకు కూడా వెరవకుండా, ఎద్దు తన కొమ్ములతో దాన్ని పొడిచి చంపేసింది. దానికెందుకో అంత కోపం వచ్చింది. ఆ పిచ్చి కుక్కతో పోరాడడం వల్ల, అలిసిపోయి రోజుతూ రొప్పుతూ నుంచుంది. వాడి కొమ్ములు కాలికి తగిలిన దెబ్బల్ని పొడుగు కొమ్ములు నాకసాగింది. ఆ దెబ్బల బాధను పోగొట్టాలనుకుంది కాబోలు! పిచ్చికుక్క కాట్లను నాకడం వల్ల, పొడుగు కొమ్ములుకి పిచ్చెక్కుతుందని ఆసామి అనుకున్నాడు. ఇక ఆ యెద్దువల్ల ఆసామికి లాభం లేదు. పిచ్చికుక్కతో జరిగిన పోరాటం మూలంగా అక్కడున్నవాళ్లంతా మేల్కొన్నారు. ‘‘ఏమయ్యా! వాడి కొమ్ముల జత యెద్దయిన ఆ పొడుగు కొమ్ముల్ని కూడా కొంటావా?’’ అని అడిగాడు ఆసామి. ‘‘నిన్ననే అడిగాను గదయ్యా! అప్పుడేమో యివ్వనన్నావు.’’ ‘‘యిప్పుడిస్తానంటున్నానుగా. ఎంత యిస్తావు?’’ ‘‘ఆ వంద రూపాయలే. జతలోని యెద్దే, భేదం వుండకూడదు.’’ ‘‘సరే యివ్వండి’’ అని ఆసామి వంద రూపాయలు తీసుకుని రొండిలో దూర్చుకున్నాడు. ఆ జత యెడ్లూ ఆ బాటమీద యితర గొడ్లతోపాటు కేరళ వైపుగా బయలు దేరాయి. ధణా ధణా అనే ములుకర్ర దెబ్బలు గొడ్లు బయలుదేరుతున్నాయని సూచించాయి. పొడుగు కొమ్ములుకి ఏమీ తోచలేదు. కాని పిచ్చికుక్క బారి నుంచి ఆసామిని కాపాడిన వాడి కొమ్ములతో కలిసి నడిచి వెళ్లడం దానికెంతో సంతోషంగా ఉంది. తన ఆసామి ఆ గొడ్లతో పాటు తననూ ఎందుకు జత చేశాడో దానికి అర్థం కాలేదు. ఆ విషయం గురించి ఆలోచించేలోగా దాని వీపుమీద చుర్రుమంటూ ఒక దెబ్బ తగిలింది. వాడి కొమ్ములుకి అయిదారు దెబ్బలు తగిలాయి. ‘‘మహా దొంగ గొడ్డిది. అటూ యిటూ పరుగెత్తి ఆ కుక్కతో పోట్లాడింది. ఇప్పుడేమో కుంటుతోంది. వఠ్ఠి దొంగ గొడ్డు’’ అని సెలవిచ్చాడు ఒక ఆసామి. - తూరన్ -
క్రిస్మస్ కానుక
క్లాసిక్ కథ మనిషంటే ప్రకృతికి కోపమేమో, శీతాకాలం తన వెంట శిశిరాన్ని కూడా తీసుకుని మరీ వచ్చింది మమ్మల్ని వణికించటానికి... మంచు వర్షం, నల్లటి మబ్బులతో చీకటిగా మారిన పట్టపగలు. కిటికీకి ఎక్కడన్నా రంధ్రముంటే రివ్వుమంటూ లోపలికి దూసుకువచ్చే గాలి, ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయేమో నన్నంత బలంగా వీచిన తుఫాను. పైపు గొట్టాల్లో నిరంతరంగా వినిపించే రొద. ఎక్కడి వాళ్లను అక్కడ కట్టిపడేసే చెప్పలేని బాధ. ప్రళయం ఇంతకన్న భయంకరంగా ఉంటుందేమో తెలియదు. 1882. తెల్లారితే క్రిస్మస్. అప్పటికి నాకింకా శిక్ష పడలేదు. వస్తువులు తాకట్టు పెట్టుకునే టుపాయెవ్ వద్ద నౌకరీ. తాకట్టుకు వచ్చే వస్తువుల వెల కట్టి దేనికెంత ఇవ్వాలో చెప్పటం నా పని. నడిరాత్రి వస్తువులకు కాపలా ఉండమని పురమాయించాడు యజమాని. ఊదారంగు మంటతో వెలుగుతోంది కొవ్వొత్తి. విశాలమైన గది నిండా కుప్పలు తెప్పలుగా వస్తువులు... ట్రంకు పెట్టెల్లో, షెల్ఫుల నిండా. కుందేలు వెంట్రుకలతో తయారుచేసిన కోట్లు. మగాళ్ల లాంగ్ కోట్లు, రైఫిళ్లు, చిత్రపటాలు, అలంకరణ వస్తువులు, పెచ్చులూడిన గోడకు వేలాడుతున్న గిటారు. వీటికి నేను నిఘా. నగల షో కేసును చూస్తూ ఎర్ర ట్రంకుపెట్టె మీద పడుకున్నాను. కొవ్వొత్తి మీదే ఉంది నా దృష్టి. ఎందుకో భయమేసింది. ప్రేతాల్లాంటి తాకట్టు వస్తువులు... రాత్రివేళ వాటికి ప్రాణం వచ్చి మసక వెలుగులో స్వైర విహారం చేస్తున్నట్టుగా, కిటికీ తలుపుల మీద చినుకుల చప్పుడు, రోదిస్తున్న గాలి. సమోవార్ (రష్యన్ స్టవ్) లోంచి, చూరులోంచి దాడి చేస్తున్న చలి. వస్తువులు ఎలుగెత్తి ఏడుస్తున్నాయి. అన్నీ నేను విలువ గట్టినవే. ఒక్కొక్క దాని చరిత్ర నాకు తెలుసు. ఆ గిటారు డబ్బుల్తో రోగికి మందులు కొన్నారు. ఈ రైఫిల్‌తో ఒక తాగుబోతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య పోలీసుల కంటపడకుండా దాన్ని దాచిపెట్టింది. తరువాత ఇక్కడ తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బుల్తో శవపేటిక చేయించింది. ఈ బ్రేస్లెట్ ఎవరిదో, దొంగిలించినవాడు మాకమ్మాడు. ‘178’ నంబరున్న రెండు డ్రెస్సులు ఓ పిల్ల అత్యవసర స్థితిలో ఇక్కడికి తెచ్చింది. ఒక్కొక్క వస్తువు వెనకా ఒక విషాద గాథ, రోగాలు, రొష్టులు, పూటకు గతిలేని రోజులు. పోలీసులు నమోదు చెయ్యని నేరాలు. క్రిస్మస్ వాతావరణంలో ఇవన్నీ తమ కథలు చెప్పుకుంటున్నాయి. ‘పండగ పూట కొట్టులో ఎందుకు, ఇళ్లకు పోదాం’ అంటున్నాయి. అయితే నన్ను భయ పెట్టింది ప్రాణం లేని వస్తువులు మాత్రమే కాదు. అట్టలు అట్టలుగా పేరుకుపోయిన గాజు కిటికీల గుండా ఆశగా లోపలికి చూస్తున్న మొహాలు కూడా. ‘నాన్సెన్స్’ అంటూ తల విదిలించాను. అంతా నా భ్రమ. అసలు విషయమేమిటంటే వస్తువులకు వెలకట్టే నాలాంటి వాడికి, క్రిస్మస్ వచ్చిందంటే పీకుతుంటుంది. అంతరాత్మ ఘోషిస్తుంది. నిష్కృతిలేని పాపం, తాకట్టు కొట్టులో పని చేయటం! అంతరాత్మను తాకట్టు పెట్టుకునే చోటు కూడా ఇదే. బోర్డు రాసి పెట్టుకోవచ్చు. ‘అంతరాత్మలు అమ్మబడును, కొనబడును’. అది నిరాకారమైంది కాదిక్కడ. ఒక వస్తువు రూపంలో ఉంటుంది. దానికున్న మిగతా లక్షణాలతో మాకు సంబంధం లేదు. ఇంతకూ నాకు అంతరాత్మ ఉందనే భ్రమ ఎందుకు కలిగింది? ఇలాంటి ఆలోచనల చిక్కుముడి నా గొంతుకెందుకు బిగుసుకుంటోంది? విదిలించుకోవటానికి ప్రయత్నించాను. బహుశా ఇది రోజంతా పనిచేసి అలసి నిద్రపోవడం వల్ల కలిగిన మనో విభ్రమం. క్రిస్మస్ వచ్చిందంటే చాలు పేదవాళ్లు మాకొట్టు ముందర బారులు తీరి నిలబడతారు. ఇలాంటి చలిలో పేదరికం కేవలం దురదృష్టం మాత్రమే కాదు... ప్రత్యక్ష నరకాన్ని అనుభవంలోకి తెస్తుంది. కనీసం పండగ నాడన్నా కాస్త సంతోషంగా గడపాలంటే మునుగుతున్న వాడికి గడ్డిపోచలా కనిపిస్తుంది తాకట్టుకొట్టు. కానీ నిజానికది బండరాయిలా మెడకు తగులుకుంటుంది. గుంపులు గుంపులుగా వచ్చారు జనం. వస్తువులతో గదంతా నిండి పోయింది. కొన్ని వెనకాల వరండాలో పెట్టాం. తెల్లారి నుండి అర్ధరాత్రి దాకా క్షణం విరామం లేదు. ఎందుకంటే అది ఇవ్వటం ఎంతిస్తే అంత పట్టుకుపోవడం. వాళ్లను పీల్చి పిప్పి చెయ్యటానికి ఇంతకన్నా మంచి రోజు మరొకటుండదు. తాకట్టు పెట్టటానికే వచ్చారు. కానీ, వాళ్ల పరిస్థితి ముష్ఠి వాళ్లకన్నా అధ్వాన్నం. పనితో ఎంత అలసిపోయానంటే నిద్ర కూడా రావటం లేదు. ఎవరో తలుపు తట్టారు. యజమాని గొంతు వినిపించింది. ‘‘నిద్రపోతున్నావా?’’ ‘‘లేదు... ఏం కావాలి?’’ ‘‘రేపు కాస్త పెందలాడే తెరవాలి కొట్టు. తేనె మీద ఈగల్లా వచ్చి వాలతారు జనం. చర్చికి తరువాత వెళ్లొచ్చు. కౌంటర్ దగ్గర కూర్చో. గుడ్‌నైట్.’’ కొవ్వొత్తి మంట వణుకుతోంది. భయంగా ఉంది. ఆర్పేసి పడుకోవాలి. దీపం దగ్గరగా వెళ్లాను. మసక వెలుతురు. గాజు తలుపుల్లోంచి రెండు మొహాలు నా వేపే చూస్తున్నాయి. ‘‘ఎవరూ లేరు. అంతా నా ఊహ’’ అని ధైర్యం చెప్పుకున్నాను. దీపం ఆర్పి తిరిగి వస్తుంటే అనుకోనిదొకటి జరిగింది. నా గొంతుకతో మరెవరో అరుస్తున్నారు. ఎక్కడో ఏదో విరిగిన, పగిలిన శబ్దం. గిటారు తీగ తెగింది. భరించలేని బాధ. బిగ్గరగా అరిచాను. ఒళ్లంతా చెమట పట్టింది. కళ్లు మూసుకుని పరిగెత్తాను. ఎదురుగా ఫర్నిచర్ డబ్బాలు. ఊపిరి బిగపట్టి, బిక్కచచ్చి వింత గొంతుకల నాలకించాను. ‘పద’ అంటూ తొందర పెట్టింది ఈదురు గాలి. ‘‘ఇది క్రిస్మస్ పర్వదినం. నువ్వూ పేదవాడివే. గడ్డ కట్టే చలిలో, ఆకలితో నకనకలాడే పేదవాళ్ల కష్టాలేమిటో నీకూ తెలుసు. ఈ వస్తువులన్నీ వాళ్లవే గదా?’’ అవును. నేను కూడా నిరుపేదనే. ఇక్కట్లు నాకు కొత్త కాదు. చలికి గజగజ వణికిన రోజులింకా జ్ఞాపకమే. దుర్భర దారిద్య్రమే నేనీ వడ్డీ వ్యాపారి వద్ద పనిచెయ్యక తప్పని పరిస్థితి కల్పించింది. రోజూ నాలాంటి ఇతర్లను పీల్చి పిప్పి చేస్తే తప్ప నా కడుపు నిండదు మరి. ఆకలిని తట్టుకోగలిగిన సత్తా నాకుంటే ఎదుటి మనుషుల జీవితాల్ని, ఆప్యాయతల్ని, అవసరాల్ని అణా పైసల్తో లెక్కగట్టగలిగేవాడినా? మరి, ఈ గాలికి నా మీదెందుకు కోపం? అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోందా? ఒకవైపు బాధ, పశ్చాత్తాపం, నామీద నాకు కోపం. మరోవైపు అలసట. నిద్ర ముంచుకొచ్చింది. మళ్లీ యజమాని తలుపు తట్టిన చప్పుడు. అర్ధరాత్రి చర్చి గంటలతో క్రిస్మస్కు స్వాగతం. ఇంటి కప్పు మీద వాన చప్పుడు. సుడిగాలి రొద. గది నిండా షోకేసుల్లో, వస్తువులు. కిటికీ తలుపునకు యేసు ప్రభువు బొమ్మ. తాకట్టుకు వచ్చిన వస్తువులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్లనివ్వమని అర్థిస్తున్నాయి. గిటారు తీగలు క్రమం తప్పక తెగిపోతున్నాయి. ముష్టివాళ్లు, వృద్ధ స్త్రీలు ముడతలు పడిన మొహాలతో కిటికీలోంచి నన్నే చూస్తున్నారు. తలుపులు తీసి తమ వస్తువులు వాపసు చెయ్యమంటున్నారు. కలలో ఎలుకలు కిచకిచ మంటున్నట్టుగా వినిపించింది. తలుపును కొరుకుతున్నది. చలికి బ్లాంకెట్ కప్పుకుని లేచాను. అర్థం కావటం లేదు గానీ, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పీడకలలాగ ఉంది. మెలకువ వచ్చినా బాగుండును. గాజు పగిలింది. షోకేస్ మీద లైట్ పడింది. ‘‘మాట్లాడొద్దు, నిశ్శబ్దం, యముడు లేస్తాడు, బూట్లు కూడా విప్పి నడువు.’’ షోకేస్ వద్దకు వచ్చి తాళం లాగి చూశాడు. మొహం పాలిపోయి ఉంది. గడ్డం పెరిగింది. చిరిగిన కోటూ, రంధ్రాలు పడ్డ బూట్లూ, పొడుగ్గా ఉన్న మరొకడు వాడి వెనకే వచ్చాడు. ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. ‘‘దొంగలు’’ అనుకున్నాను. నిద్రలో ఉన్నాను. అయినా జ్ఞాపకం వచ్చింది. నా దిండు కింద ఎప్పుడూ ఒక పిస్తోలుంటుంది. ‘‘వాడు లేస్తాడు జాగ్రత్త’’ అనుకుంటున్నారు వాళ్లు. ‘‘హ్యాండ్సప్’’ అంటూ అరిచాను. భయంతో గోడకంటుకు పోయారిద్దరూ. కన్నీళ్ల పర్యంతమై, వదిలెయ్యమని ప్రాధేయపడ్డారు. పగిలిన కిటికీ అద్దం గుండా వచ్చిన శీతగాలికి చేతులు వణుకుతున్నాయి. దొంగలు వెలిగించిన కొవ్వొత్తి దీనంగా వెలుగుతోంది. ‘‘నువ్వే దిక్కు రక్షించు’’ అంటూ కాళ్ల మీద పడ్డారు. కిటికీలో, వర్షంలో తడిసిన ముసిల్దాని మొహం. ‘‘వాళ్లనేం చెయ్యక వదిలెయ్. దరిద్రం మమ్మల్ని శాసిస్తోంది’’ అని అంది. ‘‘అవును... దరిద్రం’’ అన్నాడు ముసలాడు. ‘‘దరిద్రమే... దరిద్రమే’’ వంత పాడింది ఈదురుగాలి. గుండెలో బాకులు దించే దరిద్రం. నిద్రా? నిద్రలో కలా? లేచి, షోకేస్లోంచి నగలు తీసి దొంగల జేబుల్లో కుక్కాను. ‘‘తీసికెళ్లండి. రేపు క్రిస్మస్. సరదాగా గడపండి.’’ మిగతా నగలు మూటగట్టి ముసల్దానికిచ్చాను. ఫర్ కోట్, మరో బ్లాక్ సూట్, లేసులల్లిన డ్రెస్సులు, గిటారు. అన్నీ అందరికీ. ఇలాంటి వింత కలలు కూడా వస్తాయి మరి. ఆ తరువాత తలుపు తెరుచుకుంది. పోలీసువాళ్లను వెంటపెట్టుకుని యజమాని ప్రవేశించాడు. ఇంత అకస్మాత్తుగా వీళ్లు ఎక్కణ్నుంచి ఊడిపడ్డారు? యజమాని చూస్తుండగానే వస్తువులు అందరికీ పంచిపెట్టాను. ‘‘దుర్మార్గుడా... ఏం చేస్తున్నావురా?’’ ‘‘రేపు క్రిస్మస్. అందరూ ఆనందంగా గడపాలి.’’ ఈ అంకానికి ఇక్కడితో ముగింపు. కొత్త అంకం ప్రారంభం. ఇప్పుడు నేను కొట్టులో లేను. సంకెళ్లతో నడుస్తున్నాను. వెంట పోలీసులు. ‘‘ఎందుకిలా చేశావు?’’ మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. వర్షం ఆగింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వెచ్చగా నీరెండ. పోలీసులే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. నెల తర్వాత విచారణ ప్రారంభమైంది. ‘‘జరిగిందంతా కల’’ అని చెప్పాను జడ్జిగారికి. కలలో చేసిన పనులకు శిక్షలు వెయ్యటం అన్యాయం. వాళ్లకు చెందని వస్తువులు దొంగకెందుకిస్తానసలు? పైగా, డబ్బులు తీసుకోక ఎందుకు దానం చేస్తాను? కానీ నాకు వచ్చిన కల వాస్తవమని ధ్రువీకరించింది న్యాయ స్థానం. శిక్ష కూడా వేసింది. నా తరఫున వాదిస్తారా మీరు? అయాం నాట్ గిల్టీ. అనువాదం: ముక్తవరం పార్థసారథి చెహోవ్ : మూల రచయిత -
అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది
క్లాసిక్ కథ మా అవ్వనెరగరూ మీరూ, అవ్వని... హయ్యొ! మా ఊళ్లో ఆవిణ్ని ఎరగనివాళ్లు లేరే! అసలు ఊరంతా అవ్వ అనే పిలుస్తారావిణ్ని. కొద్దిమంది ‘సుబ్బమ్మ గారూ’ అని కూడా అంటారు. ఆవిడకి కోపం వచ్చినపుడు ‘‘ఆ ఆ ఆ, ఎవర్రా అవ్వ! నువ్వు నాకేవవుతావురా చస్తే దెయ్యవవుతావు గాని’’ అని గద్దిస్తుంది. అప్పుడు చటుక్కున సర్దుకుని ‘సుబ్బమ్మగారూ’ అంటారు. ఒక్కొక్కప్పుడు, ‘సుబ్బమ్మ గారూ’ అని పిలిస్తే ‘‘హారి గాడిదా! వేలెడంత లేవు, బొడ్డుకోసి పేరెడతావురా నాకూ!’’ అని దులిపేస్తుంది. వెంటనే దిద్దుకుని ‘అవ్వగారూ’ అంటారు. ఏవయితేనేం... అందరికీ ఇష్టవే, అవ్వంటే. అవును. అందరికీ ఇష్టవే మరి! వాళ్లకేం పోయింది ఇష్టం గాక, ఎప్పుడో కనిపిస్తుంది వాళ్లకి. కనిపించినప్పుడు ఎంచక్కా కుశల ప్రశ్నలూ అవీ వేస్తుంది. సాతల్తో సాతాళించి కబుర్లూ కథలూ చెపుతుంది. మాంచి ఫారమ్‌లో ఉంటే - అంటే ఒడుపులో ఉంటే పాటలు పాడుతుంది. పావు పాటా అవీ. ఆ కాస్సేపూ వాళ్లకి కులాసాగా ఉంటుంది. వింటారు పోతారు. వాళ్లకేం! రాత్రీ పగలూ ఆవిడతో ఇంట్లో ఉండేవాళ్లం. మేం వేగలేక చస్తున్నాం గాని! అన్నట్టు - అవ్వంటే మీరెరగరన్నారు కదూ సుబ్బమ్మవ్వని - ఆవిడ మమ్మల్నెలా ఏడిపిస్తుందో చెప్పే ముందు, ఆవిడ రూపురేఖలూ ధోరణీ మీకు తెలియద్దూ! అసలు మా అవ్వంటే, మా నాన్నగారి మేనత్త. నాయన్తాలూకు అయిదెకరాల పొలవూ, అప్పారం లోగిలీ వగైరా ఆస్తితో అవ్వ కూడా నాకు సంక్రమించింది. మా నాన్న మేనత్తంటే దాదాపు డెబ్భై మాట గదా. అయితేనేం, నడుం నిటాగ్గా కదురులా నిలబెడుతుంది. ఇష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో ‘ఐ’ అక్షరం లేదూ ‘ఐ’... దానిలాగా ఒంగిపోతుంది. తరుచు కంఠం రైలు గంటలాగా గణగణా మోగించేస్తుంది. ఇష్టం లేనప్పుడు పీలగా మూలుగుతుంది. ఈ మధ్య కొంచెం చెడ్డా, గెద్ద చూపు లాంటిది అవ్వచూపు. అయితే పళ్లు మాత్రం తీయించెయ్యడవో రాలిపోవడవో జరిగింది. ఒక్కటే ఒక్క పై పన్ను మాత్రం - ముందుంది - కింది పెదిమ మీదకి వొంగి, అక్కడ కాలూని, మాట్టాడుతున్నప్పుడు రవ్వంత తలాడిస్తూ ఉంటుంది. అది అందానిక్కాబోలు ఉంచేసిందవ్వ. మా ఇంటికొచ్చిన వో పెద్దమనిషి - అప్పన్న శాస్త్రుర్లని మాంచి కవి కూడా - ఆయనొకసారన్నాడు చెమత్కారంగా... ‘‘ప్రెపంచంలో ఏ ప్రెభుత్వవూ చెయ్యలేని పని సుబ్బమ్మవ్వగారు చేసిందండి. ఒకే ఒక్కటి తప్ప ఏ పన్నూ లేకుండా చేసిందీ!’’ అని. అయితే, అవ్వ మాట్టాడుతుంటే మాత్రం అతి స్పష్టంగా తెలుస్తుంది. కొందరు పళ్లు లేనివాళ్ల నోరు లక్కపిడతలాగా డొల్లగా ఉంటుంది. మాట్టాడుతుంటే ఏవీ తెలియదు. రొచ్చులో నడుస్తున్నట్టు పుసుకూ పుసుకూ గాలి పోసుకుంటుంది. అంతే, పాత రబ్బరు బొమ్మ కడుపు నొక్కితే చప్పుడైనట్టు అవ్వలా గాదు. అయినా ఓ లోపం ఉంది. అవ్వ మాటల్లో ‘ప’, ‘ఫ’ అని పలుకుతుంది. ‘తప్పూ, వప్పూ, చెప్పూ’ అంటుంది, ఈ వొంటిపన్ను వల్ల. అసలు అవ్వదీ - మా సుబ్బమ్మవ్వదీ - పెద్ద జాతీయ నాయకుడి ఉపన్యాస ధోరణి. అయితే అవ్వ తెలివిగా మాట్టాడుతుంది. వోసారీ, ఉపన్యాసాల్తో దేశాన్నంతనీ తల దిమ్మెక్కించే వో పెద్దమనిషి మా ఇంటికొచ్చాడు. ఆయన సభలోనే గాక సభ ఇవతల కూడా సభలో అంతా మాట్లాడతాడు. మా ఇంటికొచ్చిన పది నిమిషాల్లో మొదలెట్టాడు ప్రసంగం. మరి పది నిమిషాల్లో అవ్వ కలుగజేసుకుని రంగస్థలంలో విరగబడింది. ఆయనగారు తోక జాడించి, నాటికీ నేటికీ అవ్వకి ‘నమస్తే’. అంతే! ఆవిడ సన్నిధానంలో నోరు విప్పడు. వెనకటికి వో కవిగారు చెప్పినట్టు నిప్పుల, నీళ్లను, చప్పిడుప్పిళ్లను, తీర్థాల, తిరునాళ్ల త్రిప్పటలను, గడిదేరి గడ్డకట్టిన ఘటం అవ్వ. పెళ్లికి కాస్త ముందో వెనకో పోయాడు పెనివిటి. డెబ్బై ఏళ్ల పైని ఏకధాటిగా అంటే ఏక టాకీని వైధవ్య రాజ్యాన్ని పరిపాలించి పారేసిన రాణీ బహద్దర్. గడ్డు బ్రహ్మచారిణి. యాక్సిడెంట్, అంటే ఏ కారో, రైలో కలగజేసుకుంటే తప్ప మార్కండేయాది చిరంజీవుల లిస్టులో మనిషి మా అవ్వ. నాలుగ్గంటలకే లేచి తొలి కోడిని లేపడం, తలుపులన్నీ తెరిచి పారేసి పాచిపనులు అవీ చెయ్యడం, చెంబులూ, గిన్నెలూ చప్పుళ్లు చెయ్యడం, స్నానం చెయ్యడం, పత్తిరాట్టం లాంటి కంఠవెత్తి ‘ప్రాతస్మరామి’ వగైరా శ్లోకాలు చదవడం, మా నిద్దర తగలెయ్యడం - ఇలాగ రోజంతా జరిగే తంతుని గూర్చి అట్టే చెప్పడం నాకిష్టం లేదు. ఈ వివరాలు కూడా మీకు చెప్పకపోదును. కాని మీ కోసమే చెప్పా ఇదంతా. అవ్వ ధోరణిలో చెప్పవలసి వస్తే ఎప్పుడైనా అవ్వ ఎదురయితే చప్పున తప్పుకుని మీరు దాటిపోవచ్చని! అంతేగాక, ఇవన్నీ చెపితేగాని, మేవావిడతో ఎలా వేగిపోతున్నావో మీకు తెలీదని కూడా ఇన్ని వివరాలిచ్చా మీకు. ఇంట్లో మమ్మల్ని ప్రతి ఘడియా ఏడిపించే పనుల్ని గూర్చి నేను చెప్పనే లేదు. హయ్యొ బాబో! ఏ నవ్వండీ బాబూ, కోటయ్యగారు క్లీన్‌గా భోంచేసిన విస్తట్లోనే కొత్తదనుకున్నానని, మా శాషమ్మ దొడ్డమ్మకి మళ్లీ వడ్డించడం, నీళ్లనుకుని చెంబెడు సామర్లకోట పప్పు నూనితో చెయ్యి కడుక్కోవడం, ఎంగిలి విస్తళ్లన్నీ కట్టగట్టి గోడమీద నుంచి వీధంట వెడుతున్న మేస్ట్రీటు వీర్రాజుగారి తలమీద పడేటట్టు విసిరివేయడం - ఈ గొడవలన్నీ ముందు ముందు మీకు తెలుస్తాయి. అలాగే సినిమాకు వెళ్లడం, సర్కస్వాళ్ల బోనుల దగ్గర కదలకుండా నిలబడి అక్కడ జంతువులతో జత కట్టడం, శాసనసభ సీటు కోసం మా ఊళ్లో చేసిన పెద్ద ఎన్నికల సభలో రభస చెయ్యడం - ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కాదు, తర్వాత చెపుతా. అయితే, ఓ చిన్న సంగతి చెప్పి, అది చెప్పి తీరాలి - ఆవిడ తిర్నాళ్లలో తప్పిపోవడం దగ్గరకొస్తా. అప్పన్న శాస్తుర్లు గారని చెప్పానే ఇందాకా. కవిగారు, ఆయన ఓసారి అవ్వమీద పంచరత్నాలు చెప్పాడు భోజనాల దగ్గిర సరదాకి! ‘‘సుగుణమణిగణ నికురుంబ సుబ్బమాంబ’’ అనిన్నీ. ‘సుజన సేవాలంబ గం, సుబ్బమాంబ’’ అనిన్నీ, ‘‘గం’’ అంటే గంగా భాగీరథీ సమానురాలట. ఆయన పద్యాలు చెపుతుంటే, అవ్వ ముసిముసి నవ్వుల్తో అటూ ఇటూ తిరుగుతూ, ఏదో తన గొడవ కాదన్నట్టూ నిర్లక్ష్యంగా పట్టించుకోనట్టూ విననట్టూ అంతా విని, ‘‘అవి ఓ కాయితం మీద రాసి పారెయ్యండి బాబూ, మా నాన్నిగాడికివ్వండి’’ అంది. నాన్నిగాడంటే మా పెద్దబ్బాయి, వాడంటే మా అవ్వకిష్టం. మా నాన్న పేరని! వాడూ గడుసు రాస్కెల్, ఏం చేశాడూ! ఆ పద్యాలు తీసుకుని, వల్లించి, అడపా దడపా పెద్ద రాగవరస పెట్టి అవ్వ దగ్గిర చదివేయడమూ, ఆవిడ దగ్గరేదేనా కొట్టేయడమూ. ఈ పద్యాల వెర్రి అవ్వనెంతదాకా పట్టుకుందీ అంటే ఓసారి నాతో అందీ - ‘‘వొరే అబ్బాయీ! నేను పోయాక పదకొండో రోజున ఈ కవుల్నందర్నీ పిలిపించి నామీద పజ్యాలు చెప్పించరా’’ అని. ప్రెస్తుతమేవిటంటే, నాన్నిగాడు శివరాత్రి తీర్దానికెళదామని అవ్వని రెచ్చగొట్టాడు. నా కిష్టం లేదు. ‘‘తీర్దములు మానసములు ముక్తి ప్రదములు’’ అంటూ ‘‘సత్యము తీర్దము’’ అంటూ కవి చెప్పిన మాటల్లో నమ్మకం ఉన్న వాణ్నాయెను. అయితే ఏం జెయ్యను అవ్వా నాన్నిగాళ్లల్లో ఏ ఒక్కళ్లనీ లొంగదీయడవే కష్టం! ఇద్దరూ పట్టుకున్నారాయె! పోనీ ఇల్లేనా ఆనాటికి విశ్రాంతిగా ఉంటుందనిన్నీ దారి పొడుగునా అస్తమానవూ అవ్వకోసం పంచరత్నాలు పద్యాలు చదివి నాన్నిగాడి తెగులు కుదురుతుందనిన్నీ సరేనన్నాను, చివరికి. ఆ తీర్దానికే వెళుతున్న రావయ్య కాపుని బతిమాలుకుని, అతని రెండెడ్ల బండిలో మా వాళ్లని కుక్కాను. తోవలో అవ్వ కునికిపాట్లు పడి కిందపడకుండా రావయ కాపు పెద్ద కొడుకుని బండి చివర బిరడాలాగా బిగించాను. ఈ బిరడా సంగతి తర్వాత చెపుతా. వాళ్లు తెల్లారగట్టే వెళ్లారు. సాయంకాలవో, రాత్రి పడుతుంటేనో రావాలి. మూడు నాలుగ్గంటలకి ఏదో పనివుండి వీధిలోకి వచ్చా. వీధరుగు పక్కని బిక్కమొహం వేసుకుని, ఏడిచి ఏడిచి ఎర్రకళ్లూ వాడూ, నాన్నిగాడు ఒదిగి నిలబడి ఉన్నాడు. ‘‘ఏమిరా అవ్వేదిరా’’ అన్నాను. ‘‘త-త-త’’ అన్నాడు. ‘‘ఏమిట్రా తతత తప్పిపోయిందా ఛ ఛ ఛ కాదు గదా, అంటే చచ్చిపోలేదు గదా’’ అనడిగాన. ‘‘తీర్ధంలో అవ్వ కనబళ్లేదు’’ అన్నాడు వాడు మెల్లిగా. ‘ఆ’ అన్నాను. నా గుండె గుభేలుమంది. గోదార్లో పడిందేవో! కారు కింద పడిందేవో! గుండె ఆగిపోయిందేవో, నాకు మహ జాలీ, దుఃఖం వేసుకొచ్చాయి. అసలు అవ్వంటే మా అందరికీ ఎంత ఇష్టవో అప్పుడు తెలిసొచ్చింది నాకు. అవ్వని తీసేస్తే లోకం ఎలా ఉంటుందో మాకు తెలియదు. పాపం ఆవిడకెవరున్నారు? నిజానికి నాకు ముసలాళ్లను చూస్తే ఎంతో దిగులు. ముందుకు చూసుకుంటే నోరు తెరుచుకుని దగ్గరగా వచ్చే చీకటి భూతంగాక వాళ్లకే ఉంది! మా అవ్వ చూపులు ఒక్కొక్కప్పుడు, దూరాన ఆకాశాన పోయే పక్షుల్లాగా ఉంటాయి. ఎక్కడికో ఎక్కడికో పోతూన్నట్టు, అప్పుడు నాకు భయం వేస్తుంది. అవ్వ ఒక్కొక్కప్పుడు పొడుగ్గా నిట్టూర్చేది! ఆ నిట్టూర్పు చిన్నతనం నుంచీ ఎనభై ఏళ్ల దార్లోబడి పాకివచ్చినట్టుండేది. ఇప్పుడు ఈ మాటలన్నీ స్థిమితంగా అంటున్నాను గానీ అప్పుడు... ‘‘ఏవిట్రా, ఏం జరిగిందీ?’’ అని నాన్నిగాణ్ని అడిగాను. గోదావర్లో స్నానం చేసొచ్చారట. గుళ్లోక్కూడా వెళ్లొచ్చారట. స్వామి దర్శనమయ్యాక, గుళ్లో మండపం మీద కూచుని వాడి చేత సరదాగా పంచరత్నాలు కూడా చదివించుకుందిట. తర్వాత ఇవతలికి వచ్చాక, రంగుల రాట్నం దగ్గరికొచ్చేటప్పటికి నాన్నిగాడు అదెక్కుతానన్నాట్ట. వాడు కాస్సేపు దానిమీద తిరిగొచ్చేసరికి అవ్వక్కడలేదు. వాడు మొదట ఇక్కడా అక్కడా చూసి, కనబడకపోతే కంగారుపడి, ‘‘అవ్వా, అవ్వా’’ అని పిలుస్తూ తీర్ధవంతా తిరిగీ, బళ్లు విప్పినచోట అక్కడ కూడా ఆవిడ కనబడకపోతే అయిదు మైళ్లూ నడిచి ఇంటికొచ్చేశాడు. ఇదీ కథ. వెంటనే రావయ్య కాపొచ్చాడేమో వాళ్లింటిక్కబురు చేశాను. కావిగాణ్నీ గోవిందునీ తిర్నాళ్లకి పరుగెత్తించాను. అవసరమైతే పోలీసుల్తో గూడా చెప్పమన్నా. ఇంట్లో మా ఆవిడా పిల్లలూ నిశ్శబ్దంగా కూచున్నారు. కుక్కిన పేనుల్లా. నేను శివస్మరణ చేస్తూ బయటికి వెళుతూ, లోపలికొస్తూ మతిపోయినట్లు తిరగడం మొదలుపెట్టాను. రాత్రి పదయింది. అవ్వ లేకుండా రావయ్య కాపు బండి వచ్చేసిందట. కావిగాడూ గోవిందు వఠ్ఠి చేతుల్తో, అంటే అవ్వ లేకుండా వచ్చేశారు. ఇహ, ఊరుకుంటే బావుండదని, మా ఆవిడ లోపల్నించి కొంచెం కూనిరాగం ఏడుపు ప్రారంభించింది. చంటిపిల్లాడు కూడా యధాశక్తి వాళ్లమ్మకి తోడయ్యాడు. చూడ్డానికీ, ఉబుసుపోకా, సొహం గ్రామం మా ఇంటి దగ్గర చేరి, అవకాశం రాగానే సరదాగా పరామర్శలోనూ, అవ్వ దివ్య స్మృతుల్ని నెమరువేసుకోవడంలోనూ, అప్పుడే పడిపోయారు. ఇదీ తిర్నాళ్ల రోజున అర్ధరాత్రి మా స్థితి. అంతలో ‘‘సన్యాసిరాజుగారిల్లిదేనా?’’ అని దూరాన్నుంచి గద్దిస్తున్న మాటలు వినబడ్డాయి. అందరూ అటు తిరిగి చూశారు. ‘‘ఎవరు బాబూ, ఏవిటి?’’ అని గావుకేక పెట్టాన్నేను. చీకట్లోంచి వస్తూ పోలీసు జవాను కనబడ్డాడు. కూడా ఠీవిగా నడుస్తూ, చీకట్లో దీపస్తంభం లాగా, జవాను కంటే ధాటిగా అవ్వ సాక్షాత్కరించింది. ‘‘అవ్వొచ్చింది’’ అని కేకేశాను. లోపల్నుంచి అందరూ ‘ఘొల్లు’మని ఇవతలకి వచ్చారు. కొందరు మాత్రం ‘అరెరే! అవ్వ అప్పుడే దొరికేసిందే. నాల్రోజుల పాటు సరదా పోయిందే’ అని దిగులు మొహం వేశారు. పోలీసు జవాన్, ‘ఇదుగోండీ ముసలావిడ. నా ప్రాణాలు తోడేసిందీ! ఈవిణ్ని తిర్నాళ్లకీ తీర్ధాలకీ పంపి, దేశం మీద వదుల్తారేవిటయ్యా ఈవిడ కంటే మా సూపర్నెంటు నయం’’ అని చీదరించుకుంటూ అన్నాడు. ‘‘పోరా! నే సూపరింటునే, నాకేంరా బహద్దర్ని! శెలవిచ్చాను ఫో’’ అంది అవ్వ. వాడు పళ్లు బిగించి కొరకొర చూసి, చీకట్లోకి నడిచి, అక్కడ ఖాండ్రించి ఉమ్మేసి చక్కాపోయాడు. ఇహ తీర్ధంలో జరిగిన కథేమిటంటే... నాన్నిగాడు రంగులరాట్టం తిరుగుతూంటే పిల్లలందరికీ జీళ్లూ, జంగిడీ మిఠాయి, తొక్కుడుండలూ కొందామని, ఆ కొట్లకెళ్లి ఒక్కొక్కళ్లకి పేరు పేర్నా వొక్కొక్క పొట్లాం కట్టించిందట అవ్వ. అక్కడ చిల్లర విషయంలో కొట్టువాడితో పేచీ వచ్చి, వాణ్ని భూశెయనం చేసి పారేసి, దమ్మిడీలతో సహా వాడి దగ్గర్నుంచి మీద పడిందట. అక్కడ రాగిచెంబూ, గరిటా బేరం తేల్చడానికి రావరావణ యుద్ధం చేసి, రాచ్చిప్పల కొట్టువైపు దృష్టి తిప్పి, అటు దాడి చేసింది. దారిలో డక్కీ డమడమల బండి వాడు తారసిల్లితే, అన్నీ వాయించీ, నడిపి చూసీ, అమ్మేవాడు బోరుమని ఏడ్చేదాకా వాణ్ని ఆపి, అంతలో ఉప్మాకయ్యగారి కుటుంబం కనబడితే వాళ్లతో ఊసులాడి, అట్టే నాలుగడుగులేసే సరికి నాన్నిగాడు గ్యాపకానికొచ్చాడు. అప్పటికప్పుడే పొద్దువాల్తోంచి. ‘‘నాన్నిగా నాన్నిగా’’ అని తీర్ధవంతా తిరగడం మొదలెట్టింది. బళ్ల దగ్గిరకొచ్చి చూస్తే, రావయ్య కాపు బండీ వెళ్లిపోయింది. మళ్లీ తీర్ధంలోకి వచ్చింది... ‘‘మా నాన్నిగాడు కనబడ్డాడా?’’ అనడుగుతూ. ఎవళ్లనడిగినా వాళ్లు పట్టించుకోలేదు. అప్పటికి కంగారు పడ్డం మొదలెట్టిందవ్వ. ఇంతలో కనబడిన పోలీస్ జవాన్ని కూడా అడిగింది. వాడు ఊరూ పేరు అన్నీ అడిగి పోలీస్ స్టేషన్ దగ్గిర కూచోబెట్టాడు. ‘‘అమ్మా! బైపడకండి. ఇంటికి తీసికెడతాం’’ అని పోలీసు వాడంటే ‘‘ఎవరికిరా భయం?’’ అని ధీమాగా మొదట అన్నప్పటికీ, నాన్నిగాడి కోసం లోపల్లోపల కంగారు పడిపోయింది. అవ్వ పోలీస్‌స్టేషన్‌లో కూర్చున్న సమయంలోనే కావిగాడూ గోవిందూ అవ్వకోసం గాలించిపోయారు. ఇదంతా చెప్పాక ఇలాగంది అవ్వ. ‘‘ఆ రాచ్చిప్పల దుకాణం దగ్గిరాలస్యవయిపోయిందర్రా! అక్కడే వళ్లు మరిచిపోతుంటాను. ఏవిరా నాన్నిగా! శివరాత్రి గూడాను. అప్పన్న శాస్త్రులుగారి పద్యాలు నామీద రాసినవి చదవరా’’ అంది. అందరూ పకపకా నవ్వారు. నాకు మాత్రం ఒళ్లు భగ్గుమంది. ఆవిడ గొంతుక పట్టుకుని ఆ రాత్రి ఆవెని శివసాయుజ్యం పొందిద్దావనుకున్నాను. దిక్కుమాలిన పాపభయవో, దండ భయవో వచ్చిపడి మళ్లీ తమాయించు కున్నాను. అంతకంటే గూడా నా లోపల పిచ్చి ఇష్టం గూడా ఏడిసిందాయెను అవ్వమీద, మా సుబ్బమ్మవ్వ మీద! - దేవులపల్లి కృష్ణశాస్త్రి -
బుద్బుదం
క్లాసిక్ కథ ‘‘నీట్లో లేచిన బుడగ ఎంతోసేపు ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది? బద్దలైపోతుంది. బద్దలవడం అంటే ఏమిటి? నీట్లో మళ్లీ కలిసిపోవడమే కదా! అంటే ఏవన్నమాటా? బుడగ నీట్లోంచి లేచింది. నీట్లోనే కలిసిపోయింది. నీరు నీర్లోనే ఉన్నప్పుడు ఆ నీరు పుట్టడం ఏమిటి? ఆ నీరు చావడం ఏమిటి? అందులో అర్థం లేదు కదా! అంతా అసందర్భమే కదా! ఆ సంగతి మీకు బోధపడిందా! అందుచేత తెలుసుకోండి ఆ నీరు ఏ విధంగా అయితే పుట్టలేదో చావలేదో ఆ విధంగానే ఆత్మపదార్థం అనేది పుట్టదు - చావదు!’’ అని శాస్త్రుల్లుగారు ఓ సాయంత్రం సీతారామస్వామివారి గుళ్లో పెట్రొమాక్సులైటు వెలుగులో స్వచ్ఛంగా, శాంతంగా కూర్చొని కొన్ని పరమ రహస్యాలు పామరులందరికీ తేటతెల్లంగా తెలియజేసేరు. ‘‘భేష్’’ అన్నారు పామరులు. సాయంత్రం ఆరుకి ఆరంభించిన ఉపన్యాసం ఆ దినం రాత్రి తొమ్మిది గంటలకి ముగిసింది. పెట్రొమాక్సు దీపం ఎలా తెల్లగా వెలిగిందో అలా తేటతెల్లంగా అంతా వివరించి చెప్పేరు శాస్త్రుల్లుగారు. అక్కడ చేరిన పామరుల ముఖాల మీద పడిన కాంతి పెట్రొమాక్సు దీపకాంతా లేక శాస్త్రిగారి ధవళకాంతా అనే భ్రమ కలిగేట్టుగా చక్కగా నవ్వుతూ స్పష్టంగా ఉపన్యసించేరు శాస్త్రిగారు. తొమ్మిది రోజుల పురాణం చెప్పి పదో రోజున దాని సారం అంతా పిండి వడబోసి పామరులందరికీ అందజేసేరు శాస్త్రిగారు. ఆ రాత్రి ఆ దీపం వెలుగులో గుడిస్తంభాల మీద రాతిబొమ్మలు కూడా ఓ వెలుగు వెలిగాయి. ‘‘బాబూ, తమరు మాకే కాదు వాటిక్కూడా జ్ఞానోదయం ఇప్పించగలరు. తమరు అవతార పురుషులే కాని మరొకరు కాదు’’ అని ఒక పామరుడు అకస్మాత్తుగా జ్ఞానిగా మారి శాస్త్రిగార్ని శ్లాఘించేడు. శాస్త్రిగారు నిర్లిప్తంగా నవ్వేరు. ఉపన్యాసం ముగిసింది. పామరత్వాన్ని ఆనాటికి కొంత కొంతగా పోగొట్టుకుని లేచిన సభికుల్లో పదేళ్ల శ్యాంబాబు కూడా ఉన్నాడు. మున్సిపాల్టీవారి రికార్డులో శ్యాంబాబు పేరుండదు. ‘‘ఒక మగశిశువు’’ అని మాత్రం ఉంటుంది. స్కూల్ రికార్డులో అతని పేరు శ్యామలరావు. వెక్కిరించాలంటే అది చీమలరావుగా పెంకె కుర్రాళ్ల పెదిమల మీద మారు రూపు చెందుతుంది. వాళ్లమ్మకి అతడు శ్యాంబాబు; కాకపోతే ఇంకా క్లుప్తంగా శాంబాబు. శ్యాంబాబు అయిదోక్లాసు చదివి ఆరోక్లాసులోకి వెళ్లలేకపోయాడు. కష్టం కష్టం చాలా కష్టం. స్కూలుకు వెళ్తే పరాజయాన్ని పదిమందిలో కూర్చుని అనుభవించడం కష్టం. ఇంటికి వెళ్తే అమ్మ ఆయాసపు నిట్టూర్పులు వినడం ఎంతో కష్టం. అందుచేత ఆ కష్టాల్ని అతడు మామిడి తోటల నీడల్లోనూ, కొండగుట్టల బండరాళ్లలోనూ, సముద్రపుటలల నురుగు ముద్దల్లోనూ, తీరాన ఇసకలో సాయంకాలపు ఆటల్లోనూ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓనాడు సాయంకాలం చీకటిపడ్డాక శ్యాంబాబు బీచి నుండి ఇంటికి వెళ్తూ, దార్లో గుడిలో పెట్రొమాక్సు దీపపు వెలుగు చూసేడు. లోనికి వెళ్లి శాస్త్రిగారి ‘శాంత గంభీర వచనాలు’ విన్నాడు. అక్కణ్నించి ప్రతిరోజూ అతను పురాణ శ్రవణానికి వెళ్లనారంభించేడు. పురాణం అంతా అయింది. శాస్త్రిగారి ఆఖరి ఉపన్యాసం కూడా అయింది. భక్తులంతా ఆయన కాళ్లమీద పడి ఆయనచేత ఆశీర్వదింపబడ్డారు. శాస్త్రిగారి పాదధూళి కళ్లకి అద్దుకుని తలెత్తి శాస్త్రిగారి స్నిగ్ధ గంభీర వదనంలోకి చూసిన శ్యాంబాబు కళ్లంట ఆనంద బాష్పాలు రాలేయి. అక్కడ ప్రసాదంగా పంచిపెట్టిన కొబ్బరికోరూ, వడపప్పూ చేతిలో వేయించుకొని, కళ్లకద్దుకుని తిందాం అనుకున్నాడు శ్యాంబాబు. కాని, అంతలో దేవుడి ప్రసాదం అమ్మకియ్యాలి అనిపించిందతనికి. గుడి పూజార్ని బతిమిలాడి రెండు బాదం ఆకులు సంపా దించి అందులో ప్రసాదం భద్రంగా చుట్టి చేత్తో జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి బయల్దేరేడతను. రాత్రి తొమ్మిది దాటింది. పెద్ద ఊరు కాకపోవడం వల్ల ఊరంతా చాలామట్టుకు మాటు మణిగింది. వెన్నెల్లో జనంలేని వీధుల్లో చలికి చిన్నగా వణుకుతూ నడిచే శ్యాంబాబుకి మనసెందుకోగాని ఎంతో తేలిక పడినట్టనిపించింది. నీటి బుడగలకి చావు లేనట్టే మనుషులకి కూడా చావుండదనేది అతనికెందుకోగాని చాలా స్పష్టంగా బోధపడినట్టనిపించింది. అతను తేలిగ్గా నడవసాగేడు. రోడ్డంతా గోతులు గోతులుగా ఉంది. గోతులన్నీ చాలా అడ్డదిడ్డంగా ఉన్నాయి. వాటిమీంచి చెంగు చెంగున అటూ యిటూ గెంతుతూ హుషారుగా నడిచేడు శ్యాంబాబు. కార్తీకం, శుక్ల సప్తమి చంద్రుడు ఓరగా ముద్దుగా నవ్వుతున్నాడు. ఆకాశంలో చుక్కలు నిర్మల సముద్రం మీద నిలబడిపోయిన పూల పడవల్లా, మనోహరంగా కనిపిస్తున్నాయి. ఒక మేఘం శాస్త్రిగారి తెల్లగడ్డంలాగా స్వచ్ఛంగా వెండి దూదిలా ఉంది. ఊరి సందుల్లో గాలి మత్తుగా సోలిపోయి నిద్రపోతోంది. ‘‘మంచి రాజుల’’ రాజ్యంలో మురికి మనుష్యులు కూడా ఆనందంగా ఉంటారుంటారన్నట్టు మురుగు కాలువలు కూడా చందమామల వెన్నెల అలలకి మురిసిపోతున్నాయి. పాతపెంకుల ఇళ్లు కూడా అంత అందమైన రాత్రిలో అంత బరువుగా బాధగా కనిపించడానికి ఎంతో సిగ్గుపడుతున్నాయి. నాచుపట్టిన పాత డాబాలు కూడా వెన్నెలందానికి రెచ్చిపోయి సిగ్గు మర్చిపోయి సింగారాలకి సిద్ధపడుతున్నాయి. రొట్టెల షావుకారిగారి కొత్త మేడ ఆయన కొత్త కోడల్లాగే ఈ వెన్నెలంతా నాదే అన్నట్టుగా రాణీలా నిల్చుంది. పున్నమినాటి వెన్నెల్ని నీలపు తెరలోంచి చూస్తే ఉన్నట్టు సప్తమినాటి రమ్యాతిరమ్యంగా రాబోయే రేపటి పెండ్లికి మరికొత్త కలువకన్నియు ఈనాడు కలలో కనిపించినట్లు కడు కమ్మగా వుంది. రాత్రంతా ఎంతో చల్లగా నిన్న సాయంత్రం ఆరవేసిన అమ్మచీర ఈవాళ మెత్తగా చల్లగా ఉన్నట్టు ఎంతో మెత్తగా మధురంగా ఉంది. రోజూ ఎనిమిదే అయేది. అవాళ తొమ్మిది దాటింది. అమ్మ కోప్పడుతుందేమోనని రవ్వంత అనుమానం వేసింది శ్యాంబాబుకి. అమ్మ ఎప్పుడో కాని కోప్పడదు. తను పరీక్ష తప్పినప్పుడు ఆవిడ కోప్పడలేదు. తను చూడలేదనుకొని కంటతడి పెట్టింది. అన్నకి రోషం వచ్చి కొట్టబోతే, ఆవిడ అడ్డుకొని, ‘‘తప్పమ్మా కొట్టకు’’ అని వారించింది. చెల్లి ఏడుస్తే ‘‘మళ్లీ ఏడు చిన్నన్న తప్పక పాసవుతాడమ్మా! ఏడవకూడదలా! తప్పు కళ్లు తుడుచుకో!’’ అని బుజ్జగించింది. ఆ రోజున స్పెషల్‌గా తనకి వేపుడుకూర వేయించింది కూడాను. అయితే, ఎప్పుడైనా కోప్పడుతుందమ్మ! (బ్రతుకుబండి లాగలేక గుండె నిబ్బరం లేనెలేక). తమందర్నీ విడిచి పారిపోయిన నాన్న ఫొటో చించేస్తే తనని అమ్మ చాలా కోప్పడింది. ఓసారి కాణీ పచ్చిమిరపకాయలు కొనుక్కురమ్మని తనకి పావలా యిచ్చి పంపిననాడు అది తను సినిమా బండి వెనుక పరిగెట్టడంలో పారేసి నప్పుడు అమ్మ కొంచెం కోప్పడిందనే చెప్పాలి. ఈమధ్య తొలిరోజున తను పురాణానికి వెళ్లినప్పుడు కోప్పడలేదు గాని, ‘‘నాకు ఒంట్లో బాగులేనప్పుడైనా వేగిరం ఇంటికి రాకూడదుట్రా శ్యాంబాబూ?’’ అంది. అంతే అంది. నిన్న సాయంత్రం తను ఆడుకొందికి వెళ్తున్నప్పుడు తనతో యేదో చెప్పబోయి ఎందుకోగాని ఊరుకుంది. ఇవాళ మాత్రం, ‘‘ఒరే శ్యాంబాబూ! నా చిట్టి తండ్రీ, ఇవాళైనా వేగిరం ఇంటికొచ్చేరా బాబూ’’ అంది. ‘‘ఇవాళ ఆఖర్రోజమ్మా’’ అన్నాడు తను. ‘‘ఫరవాలేదురా! వేగిరం వచ్చెయ్! రోజూ పురాణానికి వెళ్తూనే వున్నావు కదా! భగవంతుడు మెచ్చుతాడు, మరేం భయం లేదు. ఒచ్చే యేడు నిన్ను తప్పక పాసుచేస్తాడు’’ అంది అమ్మ. శ్యాంబాబుకి ఎందుకో గాని సన్నగా సిగ్గువేసింది. చిన్నగా నవ్వు కూడా వచ్చింది. తను భక్తిగా, శ్రద్ధగా పురాణం వినడానికి వెళ్లడం తన పరీక్ష పాసు గురించి అనుకొంటోంది అమ్మ. ‘‘కాదమ్మా! నీకు వేగిరం నయం కావడానికి వెళ్తున్నానమ్మా’’ అని చెప్పడానికి అతనికెందుకో గాని సిగ్గువేసింది. అమ్మ వేగిరం ఇంటికి రమ్మన్న రోజునే చాలా ఆలస్యం అయింది. అమ్మ కోప్పడుతుందా! కోప్పడొచ్చు. లేకపోతే విసుక్కోవచ్చు. మూడొంతులు విసుక్కోవచ్చు. ఇల్లు దగ్గరయ్యేసరికి శ్యాంబాబు నడక జోరయింది. కోప్పడ్డానికి అమ్మకి అవకాశం ఇవ్వకుండా పరిగెట్టికెళ్లి ఆమె చేతిలోకి దేముడి ప్రసాదం ఇచ్చేద్దాం అనుకున్నాడతను. అన్నకి కూడా ‘‘అన్నయ్యా ఇందరా ప్రసాదం’’ అని కొంచెం ఇస్తే వాడు కూడా ఊరుకుంటాడు. ఒకే ప్రసాదంతో ఇరువురి కోపాలూ తప్పించవచ్చు కదా అనే ఉద్దేశంతో రయ్‌మని పరుగుతీసి ఇంటికి అల్లంత దూరంలో ఆగేడు శ్యాంబాబు. ఆ రాత్రి వాళ్లమ్మ అతణ్ని కోప్పడలేదు. ఇంటిముందు వీధిలో చాపమీద ఆమె పడుకొనుంది. ఆమె తలవెనుక అన్న కూర్చున్నాడు. పక్కని కూర్చొని అమ్మని కావలించుకొని ఆమె కంఠంలో తలదాచుకొంది చెల్లి సరళ. అన్నకి వెనకాతల పెంకుటింటి వసారాలో ఓ హరికెన్ లాంతరు పేద ముసలమ్మలా, స్తంభానికి చేర్లబడి మినుకు మినుకు మంటోంది. అయిదారుగురు ఆడంగులు, అద్దె వాటాల వారు మర్యాదగా తలలు వంచుకుని ఓ వార కూర్చున్నారు. పంచె కట్టుకుని తువ్వాలు భుజాన వేసుకొన్న పెద్దమనిషొకతను స్తంభాలమీది సన్న దూలం కుడిచేత్తో పట్టుకొని ఎడం చెయ్యి నడుంమీద పెట్టుకొని చిరాగ్గా నిల్చున్నాడు. ఆ సమయంలో ఆకాశం విరిగిపడిందో- చంద్రుడు ముక్కలయేడో, చుక్కలు రాలేయో, భూమి దద్దరిల్లిందో, ఉప్పెన ముంచుకొచ్చిందో, ఏం జరిగిందో, ఏం జరగలేదో తెలియదు శ్యాంబాబుకి. అమ్మ లేదని మాత్రం ఆ క్షణంలో అతను తెలుసుకున్నాడు. అతను తీసిన పరుక్కి అతని చేతిలోని ప్రసాదం కింద రాలి మట్టిలో కలిసింది. మురికి మచ్చల చింకి చాపమీద ఆవిడ వెల్లకిలా పడుకుంది. ఆవిడ ఆ సమయంలో నిర్మలంగా నిద్రపోవడం లేదు. ప్రాణాలు పోయినా ఆవేదనలు మాత్రం మిగిలిపోయినట్టు ఆమె ముఖం ఎంతో విచారంగా వుంది. చందమామ చిలిపి శృంగారంతో చుక్కల గిలిగింతలతో తెలి వెన్నెల పట్టుతెరలతో ఆకాశం నిండా లోకమంతటా భగవంతుడు సృష్టించి గుప్పించిన ‘దివ్య సౌందర్యం’తో ఆమెకి సంబంధం ఏమీ లేనట్టు ఆమె ముఖం ఓ పక్కకి తిరిగి ఉంది. ‘‘నా పిల్లలంతా ఏడుస్తున్నారే! వాళ్లకి నేనన్నం పెట్టలేకపోయానే. ఈత రాని పిల్లల్ని లోతునీటిలో వదిలేసి నేనిలా శవాన్నయిపోయేనే! ఏది దారి వాళ్లకేది దారి?’’ అని మూగగా విలపిస్తున్నట్టుంది ఆమె ముఖం. మూతలు పడని ఆమె కళ్లనుంచి ఏ క్షణాన్నయినా కన్నీరు కాలవ కట్టవచ్చు. ఏ క్షణాన్నయినా ధారధారలుగా నెత్తురు ప్రవహించవచ్చునన్నట్టుగా ఆమె ముఖం ఎంతో దీనంగా (అందుచేతనే కాబోలు) ఎంతో భయంకరంగా ఉంది. అమ్మా నేనొచ్చాను. రేపట్నించి ఎక్కడికీ వెళ్లను. నువ్వు వెళ్లమంటేనే వెళ్తాను. వెళ్లినా ఆలస్యం చెయ్యను. న్నేనొచ్చేనమ్మా! నీ కోసమే పురాణం! నీ కోసమే ప్రసాదం! నీ కోసమే దేవుడి అనుగ్రహం! నాక్కాదు నాక్కాదు! అన్నీ నీ కోసమే! నీ కోసం పరీక్ష పాసయి తీరుతానమ్మా! అన్నయ్యని రేపణ్నించి వండనివ్వను. నేనే వండుతాను. నేనే నీకు జావ యిస్తాను. నయమయేక నేనే నీకు అన్నం పెడతాను. నేనే పనిచేసి అన్నయ్యని చదివిస్తాను. చెల్లి పెళ్లికి కట్నం నేనేనమ్మా నేనే తెస్తాను. వెళ్లి వెతికి నాన్నని పట్టి కట్టి నీకోసం నే తెస్తాను. తప్పకుండా తెస్తాను. నిన్ను ఏడవనివ్వను, ఎన్నడూ ఏడవనివ్వను. నువ్వు చెప్పినట్టు వింటాను. బుద్ధిగా ఉంటాను. నాన్న ఫొటో చింపను. పావలాలు పారెయ్యను. పరీక్షలు తప్పను. చెట్లెక్కను, కొండెక్కను, ఈత రాకుండా నీట్లోకి దిగను. దిగనమ్మా దిగను; లే అమ్మా లే; బుద్ధిగా ఉంటాను! కళ్లు తెరువమ్మా తెరువు. లే అమ్మా లే. ఊరూ ఆకాశం అన్నీ విన్నాయి. అద్దెవాటాలవాళ్లు కూడా విన్నారు. ఆ ఏడుపుకి అవధులుండవనీ ఏ దేముడెంత చెప్పినా అది ఒకంటత చల్లారదని వాళ్లందరికి బాగా తెలుసు. అంత గట్టిగా పెనుబొబ్బలు పెట్టి ఏడ్చేడు శ్యాంబాబు. చంద్రుడు కిందికి దిగేడు. రాత్రింకా ఉంది. నీటిబుడగ పోయినపుడు నీటిబుడగ లేడుస్తాయో లేదో భగవంతుడికి తెలియాలి. కాని, మనిషి పోతే మాత్రం మనుషులేడుస్తారు. శాస్త్రిగారూ... చావు నిజం కాదని మీకు బాగా తెలిసి ఉండవచ్చు. కాని బాధ నిజమని మాత్రం శ్యాంబాబుకి మీకంటె బాగా తెలుసు. - రావి శాస్త్రి -
పడవ ప్రయాణం
క్లాసిక్ కథ పొద్దు కుంకిన తరవాత లోకమంతా దిగులుగా ఉంది. పడవ మెల్లగా నీటిమీద జారుతోంది. నీరు పడవ పక్కన కలకల మంటూ రాసుకుంటోంది. చూపుమేరలో జీవనం చలనం లేని ప్రపంచం నిశ్శబ్దంగా జుమ్మంటోంది. ఆ ధ్వని దేహాన్నంతనీ తాకుతుంది. మనస్సు లోలోపల అది నిండుగా కంపిస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు ఏదో బ్రదుకు చివరకి ఆఖరయిపోతున్న నిస్పృహ, ప్రశాంతమయిన నిరాశ మనస్సులో నిండుకుంటాయి. దూరంగా చెట్లు అస్పష్టంగా, మాయగా పడవతో కూడా నిశ్చలంగా ముందుకి సాగుతాయి. దగ్గరగా ఉన్న చెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దెయ్యాల్లాగ జీబురుమంటో వెనక్కి నడుస్తాయి. పడవ కదలదు, కాలవగట్టు కదులుతుంది. నా చూపులు చొచ్చుకుని చొచ్చుకుని నీటిలోకి చూస్తాయి. అందులో ప్రతిబింబించిన చీకటిని చీల్చుకుని చూస్తాయి. నక్షత్రాలు మెల్లగా కెరటాల మీద వివశంగా ఉయ్యాల లూగుతాయి. కన్ను తెరిచి నిద్రపోతాయి. గాలి లేదు. పడవలాగే తాడు, ముని గర్ర చప్పుడయినప్పుడల్లా బిగువుగా, వొదులుగా అవుతోంది. పడవ వెనక భాగంలో పొయ్యిలో నిప్పు మండుతోంది. అప్పుడప్పుడు రప్పుమంటోంది. అప్పుడప్పుడు తగ్గిపోతోంది. లోపలికి ఊరిన నీరు చేదతో తోడి ఒక కుర్రవాడు కాలవలోకి పారబోస్తున్నాడు. పడవ లోపల ఏవేవో బస్తాలున్నాయి. ధాన్యం, బెల్లం, ఉప్పు, చింతపండు వగైరా. పడవ టాపుమీద నేను వెల్లగిల పడుకున్నాను. పడవ లోపల నించి చుట్టపొగలు, ఏదో సంభాషణ కలిసి మెల్లగా తాపీగా అన్ని దిక్కులికీ వ్యాపిస్తున్నాయి. గుమాస్తా కూచున్న గదిలో గుడ్డిదీపం కొద్దిగా కునుకుతోంది. పడవ సాగుతోంది. ‘‘ఏయి పడవా? ఈ గట్టుకి రానీ! ఈ గట్టుకి!’’ అని ఎవరో పిలిచారు. పడవ గట్టుకి జేరడంతోనే ఇద్దరు ఎక్కారు. పడవ ఆ పక్కకి కొంచెం వొరిగింది. ‘‘టాపుమీద కూకుంటాం లే!’’ అంది ఆడగొంతుక. ‘‘ఇన్నాళ్లూ ఏడ పోయావే? కనమట్టం లేదు’’ అన్నాడు చుక్కాని కాస్తున్న మనిషి. ‘‘ఇజానగరం, ఇశాక పట్టం, మావోడూ నేనూ కలిసి తిరిగొచ్చాం. అప్పన్న కొండకెల్లాం.’’ ‘‘ఏడ బోతన్నా?’’ ‘‘మండపాక పోతన్నాం మరిదీ! కులాస గున్నావా? గుమాత్తాగారు పాతోరేనా?’’ ‘‘ఆ!’’ మగవాడు టాపుమీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నాడు. అతని నోట్లో చుట్ట పక్కకి పడిపోతే ఆడమనిషి తీసి ఆర్పేసింది. అతని వొంటిమీద గుడ్డ కప్పింది. తనో చుట్ట దీసి అంటించింది. అగ్గిపుల్ల రప్పుమన్నప్పుడు ఆమె ముఖం చూశాను. నల్లగా ఉన్న ముఖం ఎర్రగా వెలిగింది. ఆమె గొంతుకలో మగజీర ఉంది. ముఖం అందమయినది కాదు. జుట్టు చెదిరి పోయినా ముఖంలో ఏదో పెద్దమనిషి తరహా ఉంది. చీకట్లో కూడా ఆమె కళ్లు మేలుకున్నట్టు మెరుస్తున్నాయి. ఇంతలో దీపం పెకైత్తి గుమాస్తా పడవ పక్కని నిలబడి చూశాడు. ‘‘ఏమే రంగీ, ఈడెవడు?’’ అడిగాడు. ‘‘మావోడండి, బాబ్బాబు రిమార్కు రాయించండి’’ అంది రంగి. ‘‘పద్దాలే! దింపెయ్యి! నీకు బుద్ధి లేదూ! మళ్లీ ఆణ్ణి పడవెక్కించా? తాగుబోతోణ్ణి.’’ ‘‘నే తాగందే. ఎవరంట నే తాగానంటా?’’ అన్నాడు పద్దాలు. ‘‘ఒరే దింపెయ్యండర్రా! ఎందుకెక్క నిచ్చారీణ్ణి! చిత్తుగా తాగుతున్నాడు.’’ ‘‘బాబ్బాబు, మండపాక్కాడ దిగిపోతాం.’’ ‘‘ఏమన్నా అల్లరిచేసే కాలవలోకి తోయించేస్తాను. జాగ్రత్త!’’ గుమాస్తా గదిలోకి వెళ్లిపోయాడు. పద్దాలు లేచి కూర్చున్నాడు. అట్టే తాగినట్టు లేడు. చుట్ట అంటించాడు. పద్దాలుకి బొద్దుమీసాలు. కోల ముఖం. మనిషి కొంచెం సన్నంగా, నిర్లక్ష్యంగా ఉంటాడు. పడవ మళ్లీ నిశ్శబ్దంగా సాగుతోంది. పడవ వెనక భాగంలో నిప్పు రగలడం లేదు. సరంగులు తిన్న గిన్నెలు తాపీగా మాట్లాడుకుంటో కడుక్కుంటున్నారు. గాలి చలిగా లేదు. అయినా నేను కండువా కప్పుకున్నాను. అనంతమయిన ఆ చీకటికి అసహాయంగా శరీరాన్ని అప్పగించడానికి నాకు భయం వేసింది. గాలి చురుకుగా ఉంది - మెత్తని స్త్రీ స్పర్శలాగ. చెప్పలేనంత మృదుత్వం, విశాలమయిన స్త్రీత్వం ఆ రాత్రిలో నిండుగా ఆవరించు కుని ఉంది. ఆ కౌగిలిలో నాకు చిరకాలం నాటి విషాద గాథలు జ్ఞాపక మొస్తున్నాయి - అనాది నించీ మగవాణ్ణి లాలించి పోషించిన స్త్రీత్వపు గాథలు. కొంచెం దూరంలో రెండు చుట్టలూ ఎర్రగా కాలుతున్నాయి. జీవితం బరువుగా అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ చుట్ట కాలుస్తున్నట్టు అనిపించింది. ‘‘వొచ్చీదేవూరు?’’ అన్నాడు పద్దాలు. ‘‘కాల్దారి’’ అంది రంగి. ‘‘ఇంకా శానా దూరముంది.’’ ‘‘ఇయ్యాల జాగత్తుండ్రా. ఏరా నామాటినవూ?’’ రంగి జాలిగా బతిమాలుతూ అడిగింది. ‘‘బెదురు’’ అంటూ ఆమెపక్కలో వేలెట్టి పొడిచాడు. ‘‘అమ్మో!’’ అంది రంగి. తన్మయ త్వంగా ఆకాశంలోకి ముఖమెత్తి చీకట్లోకి చూసింది. ఆ స్పర్శ శాశ్వతంగా ఉండి పోవాలని కోరుతున్నట్టుగా ముఖమెత్తింది. నాకు నిద్రపట్టింది. పడవంతా కూడా నిద్రపోతో, నీటివాలుకి మెల్లగా జారి పోతోంది. కొంచెం దూరంలో ఆ ఇద్దరు వ్యక్తులూ కొంతసేపు గుసగుసలాడు కున్నారు. నాకు నిద్ర పూర్తిగా పట్టలేదు. పడవ నడుస్తున్నట్టు, నీరు జారుతున్నట్టు, చెట్లు వెనక్కి పోతున్నట్టు తెలుసు. పడవనెవరూ లాగడం లేదు. అంతా కునుకుతున్నారు. రంగి నాపక్క నించి నడిచి చుక్కాని దగ్గరకు వెళ్లి కూచుంది. ‘‘మరిదీ! ఎల్లాగున్నా?’’ అంది. ‘‘నువ్వెల్లాగున్నా?’’ అన్నాడు చుక్కాని కాసేవాడు. ‘‘ఎన్నెన్ని సిత్తరాలు సూపించాడను కున్నా మావోడు! చినీమా కెళ్లాం! ఓడల్ని సూశాం! ఓడంటే ఓడ కాదు మరిదీ! మా వూరంతుంది’’ రంగి అల్లా చాలాసేపు కబుర్లు చెవుతో కూర్చుంది. ఆ కబుర్లు నన్ను జోకొడుతున్నట్టున్నాయి. ‘‘పిల్లా! నాకు నిద్దరొత్తందే!’’ అన్నాడు చుక్కాని కాసే మరిది. ‘‘సుక్కాని నేనూత్తాలే. నువ్వల్లా తొంగో’’ అంది. పడవ మళ్లీ మెల్లగా జారిపోతోంది - నిశ్శబ్దంగా. రంగి ఆ నిశ్శబ్దాన్ని కదప కుండా గొంతుకెత్తి చల్లగా పాట పాడింది. ‘‘యాడున్నాడో!-నావోడు - యాడున్నాడో! కూడు గిన్నెలో యెట్టి - కూకుని సూత్తుంటె నీడల్లె మా పెల్లి నిదరే కంటికి రాదు - యాడున్నాడో!! రంగి గొంతుకలోని మగజీరలో సంగీతముంది. ఆ పాటలో పడుకుని ఉన్న అన్ని ప్రాణులూ ఒక్కసారి కునికాయి. గడిచిన యుగాల ప్రేమగాథలు వింతగా, విషాదంగా ఆ పాటలో కంపించాయి. ఆ పాట నీటి వెల్లువై పొంగితే అందులో లోకం చిన్న పడవలాగ తేలిపోయింది. మానవ జీవితం ఈ ప్రణయం తోటి, ఈ విషాదం తోటి మాయగా, వింతగా, బరువుగా అనిపించింది. పద్దాలు నెత్తిని ముసుగు మూసుకొని కూర్చున్నాడు. కాని అతనికీ రంగికీ మధ్య కొన్ని యుగాల అంతరమేదో ఉన్నట్టు తోచింది. అతను టాపు దిగి పడవలోకి పోయాడు. నేను వెల్లగిల పడుకొని చూస్తున్నాను. రంగి అల్లాగే పాడుతోంది. నాకు నిద్ర పడుతోంది. రంగి పాట అల్లా లోకాలు తిరిగి వచ్చి మళ్లీ మెల్లగా నా గుండెల్లో తగులుతోంది. నాకు నిద్ర పట్టింది. నిద్రలో ప్రాకృతికమయిన ప్రణయం నా ముందు గంతులు వేసింది. పాట క్రమంగా జ్ఞప్తిలోనించి పోయింది. నిద్ర నా మనస్సు తలుపులు మూసింది. పడవలో గొడవయింది. కళ్లు నులుపు కుంటో లేచాను. పడవ గట్టుకి చేర్చివుంది. లాంతర్లు పట్టుకుని సరంగులు కంగారుగా పడవ ఎక్కి దిగుతున్నారు. గట్టుమీద రంగిని ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. అందులో ఒకడు గుమాస్తా. అతని చేతిలో మడిచిన తాడుంది. రంగికి అప్పుడే దెబ్బలు తగిలుంటాయి. నేను చటుక్కుని పడవ దిగి ఏం జరిగిందని అడిగాను. ‘‘ఆ దొంగనాకొడుకు సరుకు ఎత్తుకు పోయాడు. ఇది ఎక్కడో గట్టుకి తార్చింది పడవని. సుక్కాని పట్టుకుంది!’’ గుమాస్తా కోపంగా, చిరాకుగా అన్నాడు. ‘‘ఏం పోయాయి?’’ అని అడిగాను. ‘‘రెండు బెల్లం బుట్టలు, మూడు చింతపండు బుట్టలు. నేనందుకే ఎక్కని వ్వొద్దన్నాను. ఎక్కడ దింపుకుపోయాడే?’’ ‘‘కాల్దారి కాడండి! బాబయ్యా!’’ ‘‘కాల్దారి కాడ మేం మేలుకునుంటే?’’ ‘‘అయితే నిడదవోలు కాడేనండి!’’ ‘‘ఇదిప్పుడు చెప్పదు. రేపు అత్తిల్లో పోలీసోళ్ల కప్పగిద్దాం!’’ గుమాస్తా ఆమెను పడవ్వేపు తోశాడు. సరంగులు ఆమెను పడవెక్కించారు. ‘‘నిద్దర మొకాలు! సూసుకోవొద్దూ! దాని చేతులో సుక్కాని ఎవరెట్టమన్నారు?’’ గుమాస్తా అందరి మీదా విసుక్కుని గదిలోకి పోయాడు. రంగిని టాపుమీదికి ఎక్కించారు. ఒక సరంగు ఆమె పారిపోకుండా కాపలా వున్నాడు. నేను కూడా ఎక్కాను. పడవ మళ్లీ కదిలింది. నేను చుట్ట ముట్టించాను. ‘‘అయ్యగోరోసుట్ట ఇప్పించరూ!’’ రంగి చనువుగా అడిగింది. చుట్ట, అగ్గిపెట్టీ ఇచ్చాను. ఆమె చుట్ట ముట్టించింది. ‘‘మరిదీ! నన్ను పోలీసోళ్ల కప్పగించి ఏం లాబం!’’ ‘‘గుమాస్తా వొదలడు!’’ అన్నాడు సరంగు. ‘‘పద్దాలు నీ మొగుడా!’’.. అడిగాను. ‘‘మావోడు’’ అంది రంగి. ‘‘దీన్ని పెళ్లాడలేదు. ఆడికి ఇంకొక త్తుంది. ఇప్పుడది ఎక్కడుందే?’’ అన్నాడు సరంగు. ‘‘కొవ్వూరులో ఉంది. రంగూ, పొంగూ బాగుందిప్పుడు. నేను తిన్నన్ని తన్నులు తింటే అదీ నాలాగే అవుద్ది.’’ ‘‘మరి నీకింకా వాడితో ఎందుకు!’’ అన్నాను నేను. ‘‘ఆడు నా వోడండి!’’ అంది. అంతా అందులో ఉన్నట్టుగా. ‘‘ఇంకొకత్తితో పోతున్నాడన్నావుగా?’’ ‘‘ఎక్కడ పోతాడు? మొగోడి కెంతమందయితే మాత్రమేం? ఆడండి, మా రాజండి. అల్లాంటి మనిషి లేడండి.’’ ‘‘బాబో! ఆడి సంగతి మీరింకా ఎరగరు. ఇదెంత రంగుగా ఉండేదను కున్నారు? ఓ తూరండి, దీన్ని గుడిసెలో పెట్టి గుడిసి అంటించేశాడు. మగ్గిపోయిందనుకోండి! ఇంకా దీనికి భూమ్మీది నూకలున్నాయిగాని’’ అన్నాడు సరంగు. ‘‘అయ్యగోరు! అప్పుడు ఆడు కనమడితే పీకి నులిమేద్దామనుండేది. కాలిన గడోటి ఈపుమీద పడిందండి.’’ ఆమె వెనక్కి తిరిగి రవిక కొంచెం పెకైత్తింది. తెల్లటి మచ్చ ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనబడింది. ‘‘మరి ఇంకా వాణ్ణి పట్టుకు దేవులాడుతావేం?’’ అని అడిగాను. ‘‘ఏం చెయ్యను? ఆడు కంటబడితే అన్నీ మరిచిపోయి కరిగిపోతాను. ఈ సందాల కొవ్వూరులో బయలుదేరాం. దార్లో నన్ను జాలిగా బతిమలాడాడు. ఈ పడవలో ఎక్కి చేతికి చిక్కిన సరుకు దించి పారెయ్యాలని. నేనుంటేగాని సాగదు. అడ్డ దోవని నడిచి మడుగు జేరుకున్నాం.’’ ‘‘ఎక్కడ దింపేశాడు సరుకు?’’ ‘‘ఎక్కడో నాకూ గుర్తునేదండి.’’ రంగి మొగం చూడాలని నాకు ఎంతో కుతూహలం వేసింది. కాని ఆ కటిక చీకట్లో అవ్యక్తంగానే ఉండిపోయింది. పడవ మెల్లగా పాకుతోంది. నడిరాత్రి గడిచినకొద్దీ గాలి చిరుగాలిగా తగులు తోంది. చెట్ల ఆకులు కొద్దిగా కదులు తున్నాయి. మళ్లీ పడవని సరంగులు లాగుతున్నారు. నాకింక నిద్రపట్టలేదు. కొంతసేపటికి కాపలా ఉన్న మనిషి కునికి ఒరిగి చివరకి నిద్రపోయాడు. రంగి పారిపోయే ప్రయత్నం మానుకుంది. తాపీగా చుట్ట కాలుస్తూ కూర్చుంది. ‘‘నీకసలు పెళ్లి అవలేదా’’ అడిగాను. ‘‘లేదు. సిన్నతనంలోనే పద్దాలు నన్ను లెగేసుకొచ్చాడు.’’ ‘‘మీదేవూరు?’’ ‘‘ఈండ్రపాలెం. అప్పుడు తాగు తాడని నాకు తెలదు. ఇప్పుడు నేనూ తాగుతాననుకోండి. తాగితే తప్పు లేదు. తాగి సావగొడతాడు.’’ ‘‘మరి వొదిలి వెళ్లిపోకపోయావా?’’ తన్నులు తిన్నప్పుడల్లాగనిపిత్తది. అయినా అంతటి మనిసి లేడండి. ఉత్తప్పుడండి, యెన్నలా కరిగిపోతాడు. వొందమందితో పోయినాసరే ఆడు నాకాడి కొచ్చితీరతాడు. నేను లేకపోతే గుండగిలి సచ్చిపోడూ?’’ నాకు వింతగా అనిపించింది ఆ అమ్మి తత్వం. వాళ్లిద్దరి అనుబంధం ఎల్లాంటిదో నాకు అర్థం కాలేదు. ‘‘మాకిద్దరికీ ఏపనీ సరిపడింది కాదు. సిగురుకి దొంగతనాల్లోకి దిగాం. ఓనాడు నా గుడిసికి దాన్ని తీసుకొచ్చాడు.’’ ‘‘ఎవరిని?’’ ‘‘ఇప్పుడున్న గుంటని. నా యెదురు గుండా, నా ఇంటో దాంతో ఉన్నాడు. నా కళ్లెదర! చిత్తుగా తాగొచ్చాడు. అదీ తాగింది. దానిమీద పడి పీకాను. ఆడు నన్ను సావదన్నాడు. అద్దరేత్తిరికాడ దాన్నెక్కడకో తీసుకుపోయాడు. మల్లీ వొచ్చాడు. నేను తిట్టాను. ఇంటోకి రావొద్దన్నాను. గుమ్మంకాడ కూకుని పిల్లోడికన్నా జాలిగా ఏడిచాడు. ఆ గుంట లేకపోతే బతకలేనన్నాడు. నాక్కోపం ఎక్కువయిపోయింది. గుమ్మంలోంచి గెంటి తలుపేసుకున్నాను. తలుపు గుంజి గుంజి సివరికి ఎల్లిపోయాడు. నాకు శానాసేపు నిద్దర రాలేదు. కొంచెం కునుకు పట్టేతలికి ఇల్లంటుకుంది. తలుపు పైన గొళ్లెమేసి నడికొప్పంటించాడు. ఎవరూ రాలేదు. నడిరాత్తిరి. నా వొళ్లంతా మగ్గి పోయింది. తెలివి తప్పింది. ఇంతలో అవతల్నించి తలుపు తెరిచారు. మన్నాడు ఆణ్ణి పోలీసోళ్లట్టుకున్నారు. ఎవరిమీద అనుమానముందో నన్ను చెప్పమన్నారు. ఆడుమాత్రం కాదని చెప్పేశాను. సందేల నాకాడ కొచ్చి, ఎంతో జాలిగా ఏడిచాడు. ఉత్తప్పుడసలు ఏడుపే రాదు. నవ్వుతుం టాడు. సుక్కడితే సాలు, పిల్లోడి కన్నా ఎక్కువగా ఏడుస్తాడు.’’ ‘‘నువ్వింకా వాడితో ఎందుకు దిగుతావు ఈ దొంగతనాల్లోకి?’’ ‘‘ఏం జెయ్యమంటారు? ఆడొచ్చి గోలెడితే?’’ ‘‘మరి నిన్ను విజయనగరం తీసుకుని వెళ్లాడన్నావు?’’ ‘‘వొట్టిది. ఊరికే అల్లా సెప్పాను. నేనంటే కొంచెం సరంగులికి నమ్మకం. ఇదిగాక రెండు తూర్లు ఈ పడవలో దొంగతనం జరిగింది.’’ ‘‘నిన్ను పట్టుకుంటే పోలీసులు ఏం జేస్తావు?’’ ‘‘ఏమీ చెయ్యను. నన్ను పట్టుకునేం జేత్తారు? నాకాడ దొంగసొమ్ము లేదు. ఏమో ఎవరెత్తుకుపొయ్యారో, ఓ రోజు కొడతారు, మన్నాడొగ్గేత్తారు. ఆడు దొరకడు. ఈపాటికంతా అయిపోద్ది. ఆడు దొరక్కుండానే నేను పడవలో ఉండిపోతా.’’ ఆమె నిట్టూర్చి విడిచి మళ్లీ మెల్లగా తనలో తను అనుకున్నట్టు చెప్పింది. ‘‘ఈ సొమ్మంతా మళ్లీ ఆ గుంటకే దక్కుడు. దాని మీద మోజు తగ్గీదాకా దాన్నొదలడు. నా ఉసురోసుకుంటంది.’’ ఆ మాటల్లో ఉద్రేకమేమీ లేదు. ఆమె అతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా అంగీకరించింది. పద్దాలు కోసం ఆమె ఎల్లాంటి పనన్నా చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అది ఒక ఆదర్శమూ కాదు. భక్తీ కాదు. ప్రేమా కాదు. ఎన్నో చిత్రమయిన సంకీర్ణ భావాలతో, ఈసులతో, అనురాగాలతో ఎన్నిటితోనో కలిసిన స్త్రీ హృదయం! అయినా ఆ హృదయం అన్నిటికీ ఫలితంగా ఒకేచోట లగ్నమయి ఉంది. తన మగవాడికోసం ఆమె నిరం తరం తపిస్తుంది. కాని అతడు నిర్దుష్టంగా, నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. సుగుణాలతో, అవగుణాలతో అతన్ని ఆమె అంగీకరిం చింది. నాకామె బ్రతుకు బరువనిపించింది. నిజానికి నా బ్రతుకే బరువేమో అంతకంటే. రంగి మోకాళ్లు ముడుచుకుని ఎటో అవ్యక్తంగా చూస్తోంది. ‘‘ఆడు నావోడు! ఎన్ని తిరుగుళ్లు తిరిగినా నావోడు నా దగ్గరకే వొత్తాడు,’’ అని తనలో తను అను కుంది. అందులో ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం తొణికిసలాడాయి. ఆ మాట ఆమె జీవిత సర్వస్వానికి కేంద్రంలాగ అవుపించింది. నేను భయంతో, భక్తితో, జాలితో ఆ మాట విని ఊరుకున్నాను. అల్లాగ తెల్లవారీదాకా కూర్చున్నాం. నేను పడవ దిగిపోయేముందు ఒక రూపాయి ఆమె చేతులో పెట్టి ఊళ్లోకి పోయాను. ఆమె జవాబు చెప్పీదాకా నేను నిలబడలేదు. ఆమె సంగతి తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు. - పాలగుమ్మి పద్మరాజు -
దేవానై
క్లాసిక్ కథ రామనాథయ్యరూ ఆయన భార్య సీతాలక్ష్మీ తమ కార్లో చైనా బజారుకి వెళ్లి, ఏవో సామాన్లు కొని, ఆ పక్కనే ఉన్న ఒక హోటల్లో ఫలహారం చేసి మళ్లీ కారెక్కారు. ‘‘అలా బీచికి వెడదామా?’’ అడిగాడు రామనాథయ్యరు. ‘‘వెడదాం. జన సమ్మర్దం లేనిచోట కారునాపమని చెప్పండి. సమ్మర్దమంటే నాకసహ్యం. అదిగో, టాయ్స్ అమ్ముతున్నాడక్కడ. రెండు కొనండి. పిల్లలకి తీసుకు వెడదాం.’’ సీతాలక్ష్మి మాట ముగించేలోగా, ఆమె భావాన్ని పసిగట్టి కారు దగ్గరికి వచ్చాడు బొమ్మలమ్మే అతను. కారులో కూర్చునే ధరలడుగుతూ బొమ్మలు చూడసాగారు. మరో తలుపు దగ్గర ఒక బిచ్చగత్తె ‘‘అయ్యా! ధర్మం చెయ్యండి. ఈ పసిబిడ్డను చూడండమ్మా’’ అంది. ఆమె యువతి. చేతిలో ఒక పసిబిడ్డ ఉంది. ‘‘అన్నీ జపాన్వేనా?’’ అడిగాడు రామనాథయ్యరు. ‘‘అన్నీ జపాన్వేనండీ. మన వూళ్లో యివి తయారవుతాయా?’’ అని జవాబిచ్చాడు బొమ్మలతను. బిచ్చగత్తె మళ్లీ అర్థించింది. ‘‘మధ్య యీ పాపిష్ఠిదాని గోల ఒకటి. బిచ్చగాళ్ల బెడద మరీ ఎక్కువయింది మా వూళ్లో’’ అంది సీతాలక్ష్మి. ‘‘ఆకలేస్తోందమ్మా.’’ ‘‘వెడతావా పోలీసుని పిలవమంటావా?’’ సీతాలక్ష్మి కసిరింది. ‘‘చంటిబిడ్డ పాలకోసం తపించి పోతోందమ్మా. ఒక్కణా యిప్పించండి.’’ బొమ్మలు కొని కార్లో పెట్టి ‘‘బీచికి పోనియ్’’ అన్నాడు రామనాథయ్యరు. బిచ్చగత్తెను పొమ్మని, డ్రైవరు కారుని పోనిచ్చాడు. ‘‘అయ్యా! అయ్యా!’’ అంటూ కారుని పుచ్చుకుని ఆమె కొంచెం దూరం పరుగెత్తింది. ‘‘పరిగెత్తకు. వృథాగా చనిపోతావు’’ అన్నాడు రామనాథయ్యరు. ఆమె ముఖం చూశాడు. అంతకుమునుపు ఎక్కడో చూసినట్టనిపించింది. కారు వేగంగా వెడుతోంది. ‘‘అయ్యో, పాపం! చిన్నపిల్ల. మనవూరి దానిలా వుంది’’ అన్నాడు రామనాథయ్యరు. ‘‘ఏ వూరిదో యేవిటో; పాపిష్ఠిది. దాన్ని గురించి మనకెందుకు? ఇలా యివ్వండి చూద్దాం ఆ బొమ్మ’’ అంటూ ఒక్కొక్కటిగా కొన్న బొమ్మల్ని చూడసాగింది సీతాలక్ష్మి. సేలంలో పొన్నమ్మపేట పెరియన్న మొదలి వీధిలో ఒక పేద కుటుంబం ఉంది. వైయాపురికి ముప్ఫయ్యేళ్లు. అతని చెల్లెలు దేవానై; ఇరవై యేళ్ల యువతి. ఇంకా పెళ్లి కాలేదు. తల్లిపేరు పళనియమ్మ. కులవృత్తి అయిన చేనేతను ఆధారం చేసుకుని వాళ్లు ముగ్గురూ అతి కష్టంతో కాలం వెళ్లదోస్తున్నారు. వారానికి నాలుగు రూపాయలు సంపాదించేవాళ్లు. రాను రాను చేనేత వ్యాపారం పడిపోయింది. కూలి తగ్గుముఖం పట్టింది. ఎన్నో మగ్గాలతో పాటు వైయాపురి మగ్గం కూడా మూలపడింది. ఇద్దరు ఉద్యోగస్థుల యిళ్లల్లో వాకిలి ఊడ్చి, కలాపి చల్లి, చిల్లర మల్లర పనులు చెయ్యసాగింది దేవానై. అలా నెలకు మూడు రూపాయలు కళ్లజూచేది. పళనియమ్మ కూడా మరో యింట్లో పొద్దునపూట కలాపి చల్లి ఒక రూపాయి సంపాదించేది. షావుకార్ల వద్ద పనికోసం తిరిగేవాడు వైయాపురి. ఎక్కడా పని దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత వైయాపురి బెంగుళూరు వెళ్లాడు. అక్కడేదన్నా మిల్లులో పని దొరుకుతుందేమో అని ఆశించాడు. అతనితోపాటు కొందరు మొదలియార్లు కూడా బయలుదేరారు. వెళ్లిన కొన్నాళ్లకు ఒక మిల్లులో చేరినట్లుగా వైయాపురి ఇంటికి జాబు వ్రాశాడు. అతనికి వ్రాయనూ చదవనూ కొంచెం తెలుసు. వాళ్ల నాన్న పొన్నమ్మపేట మునిసిపల్ పాఠశాలలో చేర్పించాడు. ఆ రోజుల్లో నేత పనివారి జీవితం అంత అధ్వాన్నంగా ఉండేది కాదు. ‘‘ఎవరెవరికో లంచాలు పెట్టి ఒక మిల్లులో చేరాను. రోజుకి ఎనిమిదణాల కూలి, నెలకు ఇరవై ఆరు రోజుల పని. పదమూడు రూపాయలు వస్తాయి. ఈ నెల జీతం భోజనం ఖర్చుకీ చేసిన అప్పు తీర్చడానికీ సరిపోతుంది. ఆ తర్వాత నెలకు రెండు రూపాయల చొప్పున పంపిస్తాను. ఆ పైన భగవంతుడున్నాడు’’ అని వ్రాశాడు వైయాపురి. పక్కింటి మారియప్ప ముదలి కొడుకు ఆ ఉత్తరం చదివి వినిపించాడు. తల్లీ, దేవానై అంతులేని సంతోషం చెందారు. పది రోజులకు తర్వాత మరో జాబు వచ్చింది. ‘‘అమ్మకు ప్రణామములు. నేనిక్కడ క్షేమం. నువ్వూ దేవానై క్షేమమని తలుస్తాను. మన యింట్లో మగ్గం ముందు కూర్చుని పనిచేసిన ఆ రోజులు తలుచుకుంటే, కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక్కడ నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది. నా అవస్థా, దుఃఖమూ చెప్పలేను. ఎందుకు మన వూరు విడిచిపెట్టి వచ్చానా అనిపిస్తోంది. వీలుంటే పక్కింటి అబ్బాయి చేత జాబు వ్రాయించేది.’’ దేవానై వాకిలి ఊడ్చి కలాపి చల్లే యిళ్లల్లో ఒకటి పింఛను పుచ్చుకుంటున్న ఒక ఉద్యోగస్థుడిది. ఆయన భార్య మంచిది. పని చేయించుకోవడంలో కఠినంగా ఉన్నా, యితర విషయాలలో ఆప్యాయత కనబరిచేది. పాత చీర యిచ్చింది. అప్పుడప్పుడూ కొంచెం అన్నం పులుసూ ఇస్తూ వుండేది. ఇలా కొన్నాళ్లు గడిచాయి. కాని దేవుడికి కన్ను కుట్టింది కాబోలు! ఆ యింట్లో పనిచేసే వంటవాడు మిగిలిన భోజన పదార్థాలు దేవానైకి ఇస్తూండేవాడు. ఆమెతో పరిహాసాలాడేవాడు. ఒకనాడు అసభ్యంగా ప్రవర్తించాడు. దేవానైకి కోపం వచ్చింది. కాని యెవరితో చెప్పుకుంటుంది? ‘‘ఎక్కడా చెప్పకు. నీకు నెలకు రెండు రూపాయలిస్తాను’’ అని ఆశ చూపాడు ఆ నీచుడు. దుఃఖాన్ని దిగమింగి యింటికి వెళ్లింది. ‘‘నేనింక ఆ యింట్లో పనిచెయ్యలేనమ్మా’’ అంది తల్లితో. ఎందుకని తల్లి అడిగింది. కంటతడి పెట్టి జరిగిన విషయాన్ని చెప్పింది దేవానై. ఇంకెక్కడైనా పని దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. ప్రతి యింట్లోనూ ఎవరో ఒకరు పనిచేస్తూనే వున్నారు. అలా రెండు నెలలు తిరగ్గా, చివరికి ఒక యింట్లో దొరికింది. ఆరు నెలలు గడిచాయి. బెంగుళూరులో వైయాపురి పనిచేస్తున్న మిల్లులో ఒక సమ్మె జరిగింది. వైయాపురి కూడా అందులో చేరవలసి వచ్చింది. ఒక నెల గడిచింది. కార్మికులు ప్రదర్శనలు చెయ్యసాగారు. మొదట్లో ఉత్సాహంగా కనిపించింది. చేతిలో ఉన్న నాలుగు డబ్బులూ ఖర్చు కావడంతో ఉత్సాహం అడుగంటింది. ప్రభుత్వోద్యోగులు కొంతమంది రాజీ కుదిర్చారు. అంతా మళ్లీ పనుల్లోకి వెళ్లారు. ఒక వారం తిరిగేసరికి, ఇరవై యైదుగుర్ని పనిలోంచి తీసివేసినట్లూ, వాళ్లు మిల్లులోకి ప్రవేశించకూడదనీ గేటు ముందు ఒక బోర్డు కట్టారు. ఆ యిరవై యైదుగురిలో ఒకడు వైయాపురి. ‘‘నేనే పాపమూ యెరగను. కొత్తగా చేరినవాణ్ని. ఎందులోనూ నేను చేరలేదు’’ అని వైయాపురి తన మేస్త్రీ వద్ద మొరపెట్టుకున్నాడు. ‘‘ఇది పెద్ద దొర ఉత్తరువు. ఆ టైం కీపరు రంగస్వామి నాయకన్ ఇతరులతో పాటు నీ పేరూ దొరకు పంపించాడు. నేనేం చెయ్యలేను’’ అన్నాడు మేస్త్రి. రంగస్వామి నాయకన్ వద్దకు వెళ్లి బతిమాలుకున్నాడు వైయాపురి. ‘‘నాకేమీ తెలీదు. జీతం బట్వాడా చేసే ఆ గుమాస్తా అయ్యరు చేసిన పని యిది’’ అన్నాడతను. ఎవరి వద్దకు వెళ్లి, ఏం బతిమాలుకున్నా చివరికి ఫలితం లేకపోయింది. రోజులు గడవను గడవను ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అతికష్టం మీద వైయాపురి మదరాసు చేరుకున్నాడు. అతనిలా పనిలోంచి తీసివేయబడినవాళ్లు పదిమంది అతనితోపాటు మదరాసుకి బయలుదేరారు. వాళ్లలో కొందరి వద్ద వున్న డబ్బుని అంతా పంచుకున్నారు. ఎనిమిది రోజులపాటు మిల్లులన్నీ తిరిగారు. చివరికి వైయాపురికి ఒక మిల్లులో పని దొరికింది. గేటులో ఉండే అతనికీ, ఇతర ఉద్యోగస్థులకీ ఇవ్వవలసిన మామూళ్లకుగాను అయిదు రూపాయలు కావలసి వచ్చింది. దీనికీ, భోజనానికీ గాను చేసిన అప్పుని తీర్చడానికి వైయాపురి తన చెవులనున్న బంగారు పోగుల్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. మిల్లులో చేరిన కొన్నాళ్లకల్లా శ్రమను మరచిపోయేందుకు తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత జూదం ద్వారా డబ్బు గడించవచ్చునని కొందరు స్నేహితులతనికి బోధ చేశారు. అదీ అలవాటయింది. వచ్చే డబ్బుల్లో భోజనం ఖర్చు, గుడిసె అద్దె మొదలైనవి పోగా మిగిలిన డబ్బుని ఊరికి పంపడానికి బదులుగా, యిలా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. పఠాను దగ్గర బాకీ పెరగసాగింది. ఈ కష్టాలన్నీ మరిచిపోయేందుకు ఇంకా ఎక్కువగా తాగేవాడు. మొదట్లో ఏవో వంకలు చెప్పి, ఆ తర్వాత డబ్బు పంపలేకపోతున్నానని యింటికి ఉత్తరం వ్రాశాడు. దేవానై కూడా మదరాసులో ఏదో ఒక మిల్లులో చేరవచ్చుననీ వ్రాశాడు. ఆ ఉత్తరం చూసుకుని దేవానై, పళనియమ్మా కలత చెందారు. ఆ తర్వాత ఒకనాడు ‘‘అమ్మా, నేనూ పట్నం వెడితే! వైయాపురితో పాటు నేనూ కష్టపడి సంపాదించి, నీకు డబ్బు పంపుతాను. పట్నంలో చాలామంది ఆడపిల్లలు పనిచేస్తారటగా మిల్లుల్లో’’ అంది దేవానై. మొదట్లో పళనియమ్మ తటపటాయించింది. ‘‘ఆడపిల్ల అలా వెళ్లవచ్చా?’’ అంది. చివరికి సరే అంది. పక్కింటి మారప్ప మొదలి వద్ద తన బంగారు కమ్మల్ని తాకట్టు పెట్టి, పన్నెండు రూపాయలు తీసుకుని దేవానై మదరాసుకి బయలుదేరింది. దేవానైని ఒక మిల్లులో నూలు వడికే డిపార్టుమెంటులో చేర్పించాడు వైయాపురి. అతను పనిచేసే మిల్లు వేరు; ఈ మిల్లు వేరు. ఆమెలా నూట యాభైమంది ఆడపిల్లలు - చిన్నా పెద్దా - ఆ మిల్లులో పనిచేస్తున్నారు. దేవానై, మరి పదిమంది పైన ఒక ‘జాఫర్’. అతను మొదట్లో దేవానైని చాలా ఆప్యాయంగా చూచేవాడు. తర్వాత కస్సుబుస్సులాడడం మొదలుపెట్టాడు. ఒంటరిగా కనక చూస్తే కారణం లేకపో యినా ప్రీతి పూర్వకంగా మాట్లాడేవాడు. ‘‘ఈయన ఇలా వుంటాడేవిటి?’’ అని తనతోపాటు పనిచేసే ఒకామెను అడిగింది దేవానై. ‘‘నువ్వు వఠ్ఠి పల్లెటూరి దానివి! ఆయన వద్ద సరిగా మసలుకోకపోతే జీతంలో సగం ఫైను కింద పోతుంది. ఆయన కనక సంతోషంగా వుంటే మనకెంతో మంచిది’’ అంది. కొన్నాళ్లు దేవానై అన్నిటినీ సహించి ఊరుకుంది. ఆ తర్వాత దేవుడేవిటి, దయ్యమేమిటి అనుకుంది. మేస్త్రి చేతుల్ని ప్రతిఘటించడం మానుకుంది. మనస్సు కుదుర్చుకుని నవ్వుతూ మాట్లాడసాగింది. క్రమేపీ ఆమెకూ సంతోషం కలిగేది. కూలి కూడా ఎక్కువయింది. అలా కొన్ని నెలలు గడిచాయి. దేవానైకి తనలో మార్పులు కనిపించాయి. గర్భధారణ అయినట్టు గ్రహించింది. అడవిలో వేటగాని నుంచి తప్పించుకునే ఏనుగులా అవస్థపడింది. అన్నయ్యతో చెప్పడానికి భయపడింది. ఆమెతో పనిచేసే కొందరు ఆమె పరిస్థితిని చూసి వేళాకోళం చెయ్యడం మొదలుపెట్టారు. ఊరికి తిరిగి వెడదామా అనుకుంది. కాని జాతి నుంచి వెలివేస్తారేమో అని భయపడింది. అదీగాక తల్లి ఎలా సహించి ఊరుకుంటుంది! అందువల్ల ఊరికి వెళ్లే ఉద్దేశాన్ని విడిచిపెట్టింది. దేవుడే దిక్కని ధైర్యం తెచ్చుకొని అలాగే ఆ మిల్లులోనే పనిచేస్తోంది. మళ్లీ ఒక రోజున ఆమె మనస్సు చివుక్కుమంది. ‘‘అయ్యో! నేనేం చెయ్యను? కళంకం తెచ్చుకున్నాను’’ అని ఒకామెతో చెప్పుకొని యేడ్చింది. ‘‘భయపడకు, దీనికో విరుగుడు మందుంది. రెండు రూపాయలిస్తే చాలు. ముత్తుసామి ఆచారి వీధిలో ఒకావిడ వుంది. ఆవిడ అన్నీ చేస్తుంది’’ అందామె. కొన్నాళ్లయిన తర్వాత ఇంకొక స్నేహితురాలు... ‘‘కడుపులో ఉన్న బిడ్డని చంపకూడదమ్మా. అందువల్ల మూడు జన్మలకైనా తీరని పాపం చుట్టుకుంటుందని చెపుతారు. పిళ్లయారుగుడి వీధిలో ఒక ముసలమ్మ వుంది. ఆవిడ చాలా మంచిది. నువ్వావిడ వద్దకు వెళ్లు. నీలా చాలామంది ఆవిడ యింట్లోనేవుండి పురుళ్లు పోసుకున్నారు. నువ్వేమీ భయపడకు’’ అంది. ‘‘నువ్వు చల్లగా వుండాలి అక్కయ్యా’’ అంది దేవానై. తర్వాత పిళ్లయారుగుడి వీధిలో నివసించే ఆ పరోపకారి ముసలమ్మ యింటికి వెళ్లింది. ప్రసవం కొంచెం కష్టంగా జరిగింది. అయినా పుట్టిన బిడ్డను తాకిందో లేదో, దేవానైకి లోకం కొత్తగా కనిపించింది. తన కష్టాలను మరిచిపోయింది. తన బిడ్డే తన లోకమనుకుంది. ‘‘దైవం ప్రసాదించిన చిహ్నం యిది. ఈ బిడ్డ యేం పాపం చేసిందని’’ అంటూ బిడ్డకు పాలిచ్చేది. ఇలా కొన్ని రోజులు గడిపింది, కష్టాలన్నీ మరిచిపోయి. ‘‘దేవానై! నువ్విప్పుడు పనిలోకి వెళ్లలేవు. ఇక్కడే కొన్నాళ్లుందువుగాని’’ అంది జాలిగా ఆ ముసలమ్మ. ‘‘ఇంత మంచివాళ్లు యీ లోకంలో వుండగా నేను దేవుణ్ణి నిందించాను’’ అని నొచ్చుకుంది దేవానై. ఒక్క నెల తిరగ్గానే అసలు విషయం బయటపడింది. మగవాళ్ల వల్ల మోసపోయి, అనాథలైన యువతుల సహాయంతో అవినీతికరమైన వృత్తిని సాగిస్తోంది ఆ ముసలమ్మ. దేవానై కూడా ఈ విష వలయంలో చిక్కుకుంది. ఆ రోజు నుంచి ఆమె మిల్లుకి వెళ్లలేదు. ‘‘సేలంలో మన యింట్లో పనిచేసే దేవానై గుర్తుందా? ఆమెలా వుంది యీ బిచ్చగత్తె’’ అన్నాడు రామనాథయ్యరు. దేవానై సేలంలో పింఛను పుచ్చుకునే ఒక ఉద్యోగస్థుని యింట్లో మొదట పనికి కుదిరింది. ఆ ఉద్యోగస్థుని పెద్ద కొడుకే రామనాథయ్యరు. ఆయన మదరాసులో ఒక పెద్ద బ్యాంకులో క్యాషియరుగా పనిచేస్తున్నాడు. ‘‘సేలం పిల్ల యిక్కడెందుకుంటుందండి! మీ భ్రమ కాకపోతేను’’ అంది సీతాలక్ష్మి. ‘‘ఏమో, ఎలాగో, ఎవరైతే మాత్రమేం? పసిపిల్లలతో అలా తల్లులు బిచ్చమెత్తుకుంటున్నారు గాదా! మనదేశానికి ఎలాంటి గతి పట్టింది!’’ అన్నాడు రామనాథయ్యరు. ‘‘మీకెప్పుడూ దేశం గురించే ఆలోచన. మన యింటి సంగతి మనం చూసుకుంటే చాలదూ?’’ అంది ఆమె. ఆ మరునాడు సాయంకాలం రామనాథయ్యరు, ఆఫీసు నుంచి సరాసరి చైనా బజారుకి వెళ్లాడు. ఆమెనక్కడ చూడవచ్చుననీ, ఆమెనడిగి విషయం కనుక్కుందా మనీ అనుకున్నాడు. ఆ హోటలు దగ్గరే కారునాపాడు. ‘‘అయ్యా, అయ్యా!’’ అంటూ చాలామంది బిచ్చగాళ్లు ఆయన్ని చుట్టుముట్టారు. కాని ఆమె మాత్రం కనిపించలేదు. ఆ పై శనివారం సాయంకాలం రామనాథయ్యరూ ఆయన భార్యా మళ్లీ చైనా బజారు వైపు వెళ్లారు. ‘‘అదుగో మీ బిచ్చగత్తె’’ అంది సీతాలక్ష్మి. రామనాథయ్యరు కారుని చూసీ చూడడంతోనే ఆ కారులోని వాళ్లు యేమీ యివ్వరనుకొని, అక్కడికి కొంచెం దూరంలో ఆగిన మరో కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది ఆ బిచ్చ గత్తె. బిడ్డని ఎత్తికొని, ‘‘అమ్మా! ఒక్క కానీ యివ్వండి. ఈ బిడ్డను చూడండమ్మా’’ అని బతిమాలుకుంటోంది. దూరంగా నుంచున్న బిచ్చగత్తెను పిలవడానికి రామనాథయ్యరు సిగ్గుపడ్డాడు. కొంచెంసేపలాగే నిలబడ్డాడు. ఆ కారు వద్ద పని అయిపోగానే తన దగ్గరికి వస్తుందనుకున్నాడు. కాని ఆమె జన సమూహంలో కలిసిపోయి కనిపించలేదు. ‘‘వెడదాం రండి’’ అంది సీతాలక్ష్మి. ఎనిమిది రోజులయిన తర్వాత రామనాథయ్యరు సతీసమేతంగా సినిమాకి వెళ్లాడు. కథ నలోపాఖ్యానం. గేటు దగ్గర ఒకటే జనం. కొత్త తార టి.కె.ధనభాగ్యం దమయంతిగా నటించింది. ‘‘తరవాతి ఆటకు వెళ్లవచ్చు. ఈ ఆటకు టికెట్లు అయిపోయాయి’’ అన్నారు. ‘‘ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామా?’’ అడిగాడు రామనాథయ్యరు. సీతాలక్ష్మి జవాబు చెప్పేలోగా ‘‘అమ్మా! ధర్మం చెయ్యండి’’ అంటూ ఒక కంఠం వినిపించింది, కారు తలుపు వద్ద. సేలం అమ్మాయేమో అని వెనక్కి తిరిగి చూశాడు రామనాథయ్యరు. ఆమె కాదు. ఎవరో! ‘‘ఇక్కడ కారునాపి వుంచితే, బిచ్చగాళ్ల గోల భరించలేం. ముందర యింటికి పోనీ’’ అంది సీతాలక్ష్మి డ్రైవరుతో. అప్పుడే ఒక పోలీసు లాఠీ ఝళిపిస్తూ ఆ బిచ్చగత్తెను అక్కడి నుంచి తరిమాడు. ఆ రాత్రి రామనాథయ్యరుకి కలలో బిచ్చగత్తె కనిపించింది. ‘‘నువ్వు దేవానైవి కాదూ? ఏ వూరు?’’ అని అడిగాడు. సంతోషంతో ఆమె కళ్లు పెద్దవైనాయి. చేతిలో ఉన్న బిడ్డను నిమురుతూ ‘‘బాబూ! మీది సేలం కదూ? వేపచెట్టు యింటి వాళ్ల అబ్బాయివా?’’ అడిగింది బిచ్చగత్తె. ‘‘నాయర్! ఈమెను ముందు సీట్లో కూర్చోబెట్టు’’ అన్నాడు. ఇంటికి వెళ్లగానే ‘‘ఎవరీమె! ఈ పాపిష్ఠిదాన్ని ఎందుకు తీసుకొచ్చారు మన యింటికి?’’ అడిగింది భార్య. ‘‘మన యింట్లో ఈమెను పనిమనిషిగా ఎందుకు పెట్టుకోకూడదు? అన్నం పెట్టి నాలుగు రూపాయలిద్దాం.’’ ‘‘ఇంకా నయం! చెడిపోయినదాన్ని యింట్లో చేర్చడమా! బాగానే వుంది మన తెలివి. ఫో బయటికి’’ అంది సీతాలక్ష్మి. ‘‘నేను దొంగతనం చెయ్యనమ్మా. మీరు చెప్పే పనులన్నీ చేస్తాను’’ అంది బిచ్చగత్తె. ‘‘అక్కర్లేదు. ఫో బయటికి’’ అంది సీతాలక్ష్మి. ‘‘ఒక్క రూపాయి యిచ్చి పంపిద్దాం పోనీ’’ అంటూ రామనాథయ్యరు పర్సుకోసం జేబు తడిమి చూశాడు. పర్సు కనిపించలేదు. బిచ్చగత్తె బిగ్గరగా ఏడవసాగింది... మెలకువ వచ్చింది. అంతా కల. తన కూతురు రాధ పక్కమీద కూర్చుని యేడుస్తోంది. ‘‘ఇంకా నయం! సీతాలక్ష్మి నిజానికి యింత కఠినంగా ప్రవర్తించదు. కలే గదా...’’ అని సంతోషించాడు రామనాథయ్యరు. తర్వాత చాలా రోజుల పాటు బజారు, రైల్వేస్టేషను సినిమా హాలు - మొదలైన చోట్లన్నీ చూస్తూవుండేవాడు. కాని ఆ బిచ్చగత్తె కనిపించలేదు. ఆమె యేమయిందో ఎవరికి తెలుసు? -
ఎర్ర చీర
క్లాసిక్ కథ విశాలాక్షి గుండెలు గుబగుబలాడాయి. వశం తప్పి కొట్టుకున్న గుండెలతో తన రూమ్‌లోకి వచ్చి తలుపు భళ్లున వేసి, పిడికిట్లో సగం నలిగిన కాగితాన్ని టేబిలు మీదికి విసిరి, గుండెలమీద చేతులు పెట్టుకుని రెండు నిమిషాలలాగే వుండిపోయింది. కాస్త భయం, గాభరా తగ్గాక వెళ్లి కాగితాన్ని చేతిలోకి తీసుకుని దానివంక చూసి ‘‘ఎంత ధైర్యం అతనికి?’’ అనుకొంది. మరీ ఆలస్యమై పోతుందని మనసు తొందరపెట్టడం ప్రారంభించాక, వణికీ వణకని చేతుల్తో కాగితాన్ని విప్పింది విశాలాక్షి. ‘‘చూడండి... చెయ్యకూడని పనులు చెయ్యడమంటే మనుషులకిష్టం. ఇలా ఓ అందమైన అమ్మాయికి వుత్తరం రాసి, ధైర్యంగా అందజేయడం తప్పని నాకు తెలుసు. ఐనా ఆలోచనల్ని అణచుకోలేకా, మనసుని జయించలేకా రాస్తున్నాను. గరల్స్ హాస్టల్లో చివరి రూమ్‌లో మీరుంటున్నారు కదూ. మీ రూమ్‌కి కుడి పక్కనున్న కిటికీలోంచి ఎదురుగా చూస్తే ఒక తెల్లని మేడ వుంది. ఆ మేడమీద గదివుంది. ఆ గదిలో నేనున్నాను. కొద్దికాలం క్రితం వరకూ, యూనివర్సిటీలో ఎమ్మే చదివాను. ఈ మధ్యనే సెకండ్ క్లాసులో ప్యాసయినట్టు యూనివర్సిటీవాళ్లు డిక్లేర్ చేశారు. ఈ వూళ్లో చాలాకాలం నించీ వుంటున్నా, ఈ గదికి నేనొచ్చి రెణ్ణెల్లే కావస్తోంది. ఆ వచ్చిన రోజునే మిమ్మల్ని మీ రూమ్ కిటికీలోంచి చూశాను. అంత కంటే... మీరావేళ కట్టుకున్న ఎర్రచీరతో చూశాననడం బాగుంటుంది. ఎర్రని టెర్లిన్ చీరంటే నాకెంతో ఇష్టం. సంతోషమంత... ఆప్యాయమంత ఇష్టం. ఇంకా ఎక్కువ... చెప్పలేనంత ఇష్టం. ఆ వేళ మీకు తెలియ కుండానే, అటూ ఇటూ కదలాడే ఎర్రచీరతో బాటు మిమ్మల్ని చూశాను. ప్రపంచాన్నీ, నన్నూ, అన్నిటినీ అందర్నీ మర్చిపోయి, ఆలోచనల్ని, అంతరంగాన్ని, పనుల్ని పక్కకునెట్టేసి మరీ చూశాను. ఎప్పుడూ ఎన్నడూ ఎరగని ఊహా తీతమైన భావాలు నన్నావేళ చుట్టుముట్టేయి. ఎర్రని అందమైన దానిమ్మ గింజల మధ్య మల్లెపువ్వులు అమర్చినట్లున్న మీరు ఆ రోజే నా హృదయం మీద చెరగని ముద్రవేశారు. ఆ తరువాత... ఎప్పుడూ మీ కోసం, మీతోబాటు ఎర్రచీర కోసం వెతికిన కళ్లు రెండు మూడు మార్లు మాత్రం సంతృప్తిని పొందాయి. మిమ్మల్ని ప్రేమించానని, రోజూ మీరే కలల్లోకొస్తు న్నారనీ పిచ్చిపిచ్చిగా రాయడం నాకిష్టం లేదు. కాని ఎర్రచీర కట్టుకున్న మీరంటే మాత్రం నాకు ప్రాణంకన్నా ఎక్కువ. కనీసం మీ ముఖ పరిచయమైనా నాకు లేదు. ఐనా మీరంటే... రేపు ఆదివారం రాత్రి ట్రెయిన్లో నేను ఇంటర్వ్యూకని బొంబాయి వెళ్లి పోతున్నాను. ఈ వూరిలో నాకు మిగిలి పోయిన కోరిక ఒఖ్ఖటే... ఆఖరిసారి మిమ్మల్ని ఎర్రచీరలో చూడ్డం! అందుకే ఆదివారం సాయంత్రం ఆరుగంటలకి ఆ చీర కట్టుకొని బీచికొస్తారు కదూ! మీ ఫ్రెండ్స్‌తో వచ్చినా నాకభ్యంతరం లేదు. కాని మనసారా ఎర్రని చీరతోబాటు మిమ్మల్ని చూడ్డం నా ఆఖరి ఆశ. మరో విధంగా భావించరనే తలుస్తాను. మీ పేరు తెలియకపోవడంవల్లే ఎలా సంబో ధించాలో తెలిసింది కాదు. క్షమించండి... చక్రవర్తి.’’ ఉత్తరం చదవడం పూర్తిచేసి, నిట్టూర్చింది విశాలాక్షి. ఏమాలోచించాలో, ముక్కూ, మొహం, పేరూ తెలియని ‘అతని’ గురించి ఏమనుకోవాలో ఆమెకి తెలీలేదు. తల నొప్పిగా వుందని క్లాసు నుంచి హాస్టల్‌కి వచ్చేస్తూంటే హాస్టలెదురుగా వున్న తెల్లమేడలోంచి పదేళ్ల పనిపిల్ల వచ్చి ఆ కాగితాన్నిచ్చి ‘మీకిచ్చేయమన్నారు’ అనేసి మాటైనా వినకుండా వెళ్లి పోయింది. అదృష్టవశాత్తు రోడ్డుమీద జనం ఎక్కువమంది లేరు. ఉన్నవాళ్లెవరూ దీన్ని గమనించలేదు. కాగితాన్ని పారేద్దా మనుకుంది విశాలాక్షి. కాని చేతులు రాలేదు. ఎందుకో చదవాలనిపించింది. వణికే చేతుల్తో, కదిలే గుండెల్తో గబగబా రూమ్‌కి వచ్చి వుత్తరం చదివేసింది! విశాలాక్షికెవరూ ఇలాంటి వుత్తరాన్ని కాని, ఇంతకుమించిన ప్రేమలేఖల్ని గాని ఇప్పటిదాకా రాయలేదు. ఇరవై యేళ్ల విశాలాక్షికీ అనుభవం మొదటిసారి. కథల్లో ఎక్కువసార్లు, కలల్లో తక్కువసార్లు ఇలా చదివింది, చూసింది. కాని నిజ జీవితంలో ఇలాంటి ఉత్తరాన్ని ఎవరూ రాయలేదు. ‘‘ఇరవై యేళ్ల వయసుండీ, పట్నంలో బీఎస్సీ చదువుతున్న విశాలాక్షికి... తెల్లని విశాలాక్షికి... ఎవరూ ఉత్తరం రాయనే లేదా? ఉహు... రాసేవుంటారు’’ అని చాలామందికి అనిపించవచ్చు. ఐనా విశాలాక్షికీ అనుభవం కొత్త. కారణం... విశాలాక్షి వయసులోనే వున్నా... పట్నంలో చదువుతున్నా, తెల్లగావున్నా అంత బావుండదు. అలాగని అనాకారి కాదు... కాని ఆ లేని అనాకారితనానికి అబ్బాయిల్ని పిచ్చెక్కించే ప్రేమలేఖ రాయడానికి పురిగొల్పే శక్తి లేదు. అందుకే విశాలాక్షి కొన్నాళ్లు బాధపడేది. తను పి.యు.సి.లో వుండగానే తన క్లాస్మేట్ సరస్వతికి తమ సీనియర్ వుంగరాల జుత్తబ్బాయి ప్రేమలేఖ రాసినప్పుడూ... ఫస్టియర్‌లో వున్నప్పుడు పక్కరూమ్లోవున్న అరుణని దేవానంద్ లాంటబ్బాయి ప్రేమించి సినిమాలకీ, పిక్నిక్కులకీ తీసుకెళ్లినప్పుడు... విశాలాక్షికి దాదాపు ఏడుపొచ్చింది. అందర్నీ అందరూ కాకపోయినా, చాలామంది అమ్మాయిలని అబ్బాయిలూ, అబ్బాయిల్ని అమ్మాయిలూ ప్రేమిస్తున్నారు. ‘కాని తన్నెవరూ ప్రేమించరేం’ అని కించపడేది. ఆఖరికి ‘నేనంతందంగా వుండను కాబోలు’ అని సమాధానపరచుకుని, అప్పటికి నిట్టూర్చి... ఓపికున్నంతవరకూ విచారించేది. కాని ఇన్నాళ్లకు... మూల పడేసిన వీణనెవ్వరో తీసి మ్రోగించినట్టూ, తంత్రులు సరిచేసినట్టూ ఐంది. విశాలాక్షి తలనొప్పి పోయింది. మన సిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడు కాబోలు. ప్రేమించకపోతే అలా ఎందుకు రాస్తాడు?? ఇన్నాళ్లకు తనను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు. విశాలాక్షి అద్దం దగ్గరికి వెళ్లి అద్దంలో చూసుకుంది. తన కళ్లల్లో తనకే తెలియని కాంతీ, అప్రయత్నంగా మెరిసిన చిరునవ్వులో ఏవో అందాలూ... ‘‘నేనూ అందంగానే వున్నాను’’ అనుకుంది. అరే! అసలు సంగతి తను మరిచి పోయింది. రేపే ఆదివారం. ఆ ఎర్రచీర తనది కాదు. తన రూమ్మేట్ సరళది. రెండు మూడుసార్లు తనే ముచ్చటపడి కట్టుకొంది. ఎర్రచీరంటే తనకూ ఇష్టమే... ఇప్పుడు మరీ యిష్టం. పొద్దున్న గదిలోంచి ఏ చీర కట్టుకు వెళ్లానో చూసుంటాడతను - మళ్లీ వచ్చేదాకా పాపం వేచివుంటాడు కాబోలు..! తనకోసం ఇంత శ్రమించిన ఒక మగప్రాణి వుందంటే విశాలాక్షికి చాలా సంతోషంగా వుంది. చెప్పలేనంత సంతోషంగావుంది. విశాలాక్షి కుర్చీలో కూర్చుని వుత్తరం మరోమారు చదివింది, దాన్ని జాగర్తగా పెట్లో దాచేసి, మళ్లీ కూర్చొని ఏదో ఆలోచించనారంభించింది. చల్లనిగాలి వీస్తుండగా, ఈ ప్రపంచంలో ఎవరూ సాధించలేని విజయం సాధించినంత సంతోషం కలగనారంభించింది. ఉదయం ఎనిమిది గంటలకు నిద్ర లేచిన విశాలాక్షి ‘ఆదివారం వచ్చేసింది’ అనుకొంది సంతోషంగా, ఆరాటంగా. ఆమె మనసులో ఇప్పుడు ఆకాశమంత సంతోషం వుంది. ఆలోచనలో సముద్ర మంత ఆరాటముంది. గబగబా కాలకృత్యాలు ముగించుకొని పుస్తకం చేత్తో పట్టుక్కూర్చొంది. ‘‘ఏమిటోయ్! ఇవాళా చదువే? మార్నింగ్‌షోకి పోదాం రారాదూ అంది సరళ. విశాలాక్షి ఏదో చెప్పేంతలో బయట అడుగుల చప్పుడు వినబడింది. వార్డెన్ గదిలోకి వచ్చింది. ‘‘విశాలాక్షీ... మీ అన్నయ్యగాబోలు విజయనగరం నుంచి వచ్చారు. నిన్ను చూడాలట. కింద విజిటర్స్ రూమ్‌లో వున్నారు రా’’ అంది. ‘‘ఉండవోయ్ మళ్లీ వస్తాను’’ అని సరళతో చెప్పేసి కిందకు వెళ్లింది విశాలాక్షి. ‘‘ఏవమ్మా! బావున్నావా?’’ అన్నాడు కింద గదిలో కూర్చున్న అన్నయ్య. ‘‘ఊ’’ అంది విశాలాక్షి. ‘‘సుభద్రమ్మగారికి బొత్తిగా కనపడ్డం మానేశావుట’’ అన్నాడు రామారావు. సుభద్రమ్మ రామారావు అత్తగారు. రామారావ్ విశాలాక్షన్నయ్య. వాళ్లంటే విశాలాక్షికి అసహ్యం. ఆప్యాయత మీటర్లలో కొలిచి మరీ వొలకబోస్తారు. ఆవిడకీ మిగతావాళ్లకీ విశాలాక్షంటే అసూయా, కోపం. హాస్టల్లోవుంటూ చదువుకుంటున్నందుకూ, పోకిరీ వేషా లేస్తుందని అభిప్రాయం వున్నందుకూ. ‘‘అమ్మానాన్నల దగ్గర్నుంచి వుత్తరాలొస్తున్నాయా?’’ అన్నాడు రామారావు. ‘‘ఊ’’ సరే! అలా వెళ్లి మాట్లాడుకుందాం రా! ఓసారి నువ్వు వాళ్లని చూసినట్టూ వుంటుంది’’ అన్నాడు రామారావు. విశాలాక్షికి వస్తాననక తప్పింది కాదు. ‘‘సరే, వుండు గదికి వెళ్లొస్తాను’’ అని చెప్పి గదిలోకి వచ్చింది. సరళకప్పుడే చీర సంగతి చెప్పేస్తే సరి. కాని... ఎలా చెప్పడం? యేం బావుంటుంది? ఐనా సరళ ఎక్కడికి వెళ్తుంది కనక? వెళ్లినా ఆ చీర పెట్లోనే వుంటుందిగా? ఆ మాత్రం అడక్కుండా చీర తీసుకునే చనువూ అధికారం తనకు లేకపోలేదు. ‘‘నేను మార్నింగ్ షోకి వెడుతున్నానోయ్! మధ్యాహ్నం కలుద్దాం. నీకిప్పుడు తీరిక లేదుగా! నా దగ్గరో తాళం వుంది. నువ్వు తాళం వేసుకుని వెళ్లిపో. బై బై..’’ అంటూ మరో ఫ్రెండ్ కోసం కాబోలు... పక్క రూమ్‌కి వెళ్లింది సరళ. విశాలాక్షికంతా ఆరాటంగా వుంది. తలుపు తాళం వేసి కిందకు వచ్చి ‘‘పదన్నయ్యా’’ అంది. ఆ మధ్యాహ్నం విశాలాక్షికి సుభద్రమ్మ గారింట్లో భోంచేయక తప్పింది కాదు. ఓ పక్క మొహమాటం... బిగువు... బిడియం. మరోపక్క సాయంత్రం గురించి ఆరాటం... తొందర. భోంచేశాక ఓ అరగంట కూచొని పనుందని అందరి దగ్గరా సెలవు తీసుకుని వచ్చేసింది. ‘‘వచ్చేవారం మళ్లీ కలుస్తాన్లే... జాగ్రత్తగా చదూ’’ అన్నాడు రామారావు. ‘‘ఊ’’ అనేసి వచ్చేసింది విశాలాక్షి. ‘‘నీ కోసం చూసి, ఓ పావుగంట క్రితం వాళ్ల బంధువులింటికి వెళ్లింది సరళ’’ అంది పక్క రూము భానుమతి. గదివైపు చూసింది విశాలాక్షి. తాళం కప్ప వెక్కిరించింది. వాచీ చూసుకుంది. మూడైంది. తాళం తీసి గదిలో ప్రవేశిం చింది. తను ఆరుగంటలకి పార్కుకెళ్లా లంటే సరళ కనీసం ఐదుకైనా యిక్కడుండాలి. కాని... సరళ సంగతి తనకి తెలుసు. బంధువులతో ఆదివారం బైటకెడితే భోజనాల టైమ్‌కి కాని రాదు. ఇప్పుడెలా? ఫరవాలేదు. ఆ పెట్టె తాళం లాంటిదే మరోటి తన దగ్గర వుంది. చీర తీసుకోవచ్చు’’... అనుకుంది విశాలాక్షి. అనుకోకుండా విశాలాక్షికి మళ్లా తల నొప్పి ప్రారంభమైంది. కాస్త అమృతాం జనం పట్టించుకొని ఐదుగంటలకి అలారం పెట్టి బెడ్ మీద వాలింది విశాలాక్షి. విశాలాక్షి బరువుగా కళ్లు తెరిచేసరికి గదిలో సగం వెలుగుతో బాటు చీకటి కూడా ఆక్రమించింది. తలలో ఎవరో సుత్తులతో సున్నితంగా కొడుతున్నారు. వెంటనే లేచి టైము చూసింది. వాచీ నాలుగున్నర దగ్గర ఆగిపోయింది. వెంటనే రిస్టు వాచీ చూసుకుంది. ఆరూ పది నిముషాలైంది. తలలో సుత్తులు ఇప్పుడు బరువుగా కొట్టడం మొదలెట్టాయి! ‘‘అరెరే!’’ అనుకొంటూ పక్కమీంచి లేచింది. ఆరాటం, ఆతృత, భయం, విసుగు, కోపం! గబగబా ముఖం కడుక్కొని సరళ పెట్టె తెరిచింది విశాలాక్షి. దేవుడు తనమీద పగ తీసుకుంటున్నట్టు అనిపించింది. పెట్టంతా గాలించినా, ఎర్రచీర ఎక్కడా కనబడలేదు. విశాలాక్షికేం చేయాలో తోచలేదు. వాచీ ఆరూ ఇరవై చూపిస్తోంది. ఆరాటం! భయం! కోపం! విసుగు! ఇప్పుడేం చేయాలి? ఏదో చెయ్యాలి? ఎలాగైనా అక్కడికి వెళ్లాలి. పోనీ ఏదో ఓ చీర... ఏం చేయడం మరి... వెళ్లకపోతే అసలు ప్రమాదమే! అతను? అతన్ని కలుసుకోవాలి. లేకపోతే రేపతని ప్రయాణం. వెళ్లాలి... వెళ్లాలి. విశాలాక్షి లేచి ముఖం కడుక్కొంది... తనకున్న వాటిలో గులాబీ రంగు చీర... కాస్త వెలిసిపోయింది కట్టుకుంది. ఓ పక్క వొళ్లు స్వాధీనం తప్పిపోతోంది. ఏమైనా వెళ్లాలి అనుకుంటూ రూమ్ తాళం వేసి మెట్లు దిగింది. బరువైన మనసుతోనే బలవంతంగా శక్తి తెచ్చుకుంటూ, జోరుగా బీచ్ వైపు నడిచింది విశాలాక్షి. బీచి బిజీగావున్న హృదయంలా సందడిగా వుంది. చంటిపిల్లల దగ్గర్నుంచి, చరమదశ ఎంతో దూరంగా లేనివాళ్ల వరకూ అందరూ గాలిని, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. విశాలాక్షి తొందరగా పార్కులోకి ప్రవేశించింది. టైము ఆరున్నరైంది. చీకటి, వెలుగు ఒకే సరిహద్దును చేరుకున్నట్టు న్నాయి! ప్రకృతికి ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్టు వెలుగూ చీకటీ కలిసి ఒకేలాగున్నాయి! ఒక్కసారి విశాలాక్షికి దూరంగా లీలగా ఎర్రచీర కనబడింది. ‘‘ఔను! సందేహం లేదు. ఆమె సరళే!’’ అనుకుని గబగబా సరళ వద్దకు నడిచింది. ‘‘సరళా...’’ ‘‘హల్లో విశాలా? మధ్యాహ్నం ఏమై పోయావోయ్! నీకోసం చూసి చూసి మావాళ్లతో వాళ్లింటికెళ్లి ఇలా వచ్చేశాను. పోనీలే, ఏమైతేనేం వచ్చావుగా?’’ అంది సరళ అందంగా నవ్వుతూ. విశాలాక్షి మనసక్కడ లేదు. అతను... అతన్నెలా పోల్చుకోవడం? తనే ఎర్రచీర కట్టుకోవాల్సిన వ్యక్తినని ఎలా చెప్పడం? ‘‘ఏయ్ విశాలా? ఏమిటాలో చిస్తున్నావ్?’’ అంది సరళ. విశాలాక్షి ఉలిక్కిపడి సరళకేసి చూసింది. ఎర్రచీరలో సరళ ధగధగా మెరిసి పోతోంది. తనలాగే రెండు జడలు. దాదాపు తనంతే పొడుగు... విశాలాక్షి మనసులో ఏదో అవ్యక్తమైన ఆలోచన మెరిసింది. ఎడం కన్నొక్కసారి అదిరింది.’’ ‘‘ఏయ్! అది సరే కాని ఓ చిన్న గమ్మత్తు చెప్పనా’’ అంది సరళ. ‘‘ఊ’’ అంది మనసుని స్వాధీన పర్చుకోవడానికి ప్రయత్నిస్తూ విశాలాక్షి. ‘‘ఇందాక... నేను మా కజిన్స్‌తో బీచి కొచ్చినప్పుడు, అంటే వాళ్లూ ఇప్పుడిక్కడే వున్నారనుకో!’’ అంటూ నాలుగడుగుల దూరంలో కూచున్న మరో ఇద్దరమ్మా యిల్ని చూపించింది సరళ. ‘‘వాళ్లతో మాట్లాడుతున్నాను. ఇంతలో ఎవడో బ్రూట్ దగ్గరగా వచ్చి మాట్లాడబోయాడు. చూస్తే పెద్దమనిషిలాగున్నాడని ఏమిటని అడిగాను. అప్పుడు ఏమన్నాడో తెల్సా - ఎర్రచీరలో మీరెంతో బావున్నారు. నా మాట కొట్టేయకుండా ఇలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేను. మీ పేరు కూడా చెబితే కృతజ్ఞుణ్ని’’ అనింకా ఏదో అనబోయాడు. ‘‘ఆ! అప్పుడేమైంది?’’ అనడిగింది విశాలాక్షి కంగారుగా. ‘‘ఏముందీ - మర్యాదగా మాట్లాడు మిస్టర్! పిచ్చిగా వాగవద్దని ఇంకా బాగా చీవాట్లు పెట్టి పంపించాను. మా కజిన్స్ కూడా బాగా దులిపేశారనుకో! వెంటనే వెళ్లిపోయాడు పాపం’’ అని వెంటనే ‘‘ఏయ్! అడుగో వాడే!’’ అంది పార్కుపై నున్న కిళ్లీ కొట్టుకేసి చూపిస్తూ సరళ. విశాలాక్షి కంగారుగా అటు చూసింది. అప్పుడే టర్నింగ్ తిరిగి ఎర్రటి ఇంజిన్‌తో వున్న పదో నంబరు బస్సు వచ్చి ఆగింది. పార్కుపైన కిళ్లీకొట్టు దగ్గర్నుంచి తెల్లటి ప్యాంట్లో నల్లటి సిల్కు షర్ట్ టక్ చేసిన ఓ ఆకారం దిగులుగా, నీరసంగా - బస్‌వైపు నడిచింది. ‘‘వాడే! బ్రూట్. ఆ నల్లషర్టు...’’ అంది సరళ. విశాలాక్షికి పరుగెత్తుకువెళ్లి అతని చేతులు పట్టుకు ఆపాలనిపించింది. అన్నీ వివరంగా చెప్పేసి క్షమాపణ కోరుకోవా లనిపించింది. అప్రయత్నంగా కళ్ల వెంట నీళ్లుకారి ఆరిపోయాయి. వెంటనే... సరళ వెనక్కి వెళ్లిపోయింది. ‘‘ఏమోయ్, ఏమైంది?’’ అంది సరళ విశాలాక్షి వైపు తిరుగుతూ. సరళ ఎర్రచీర పైట గాలికి విలాసంగా ఎగురుతోంది. ఎగురుతోన్న ఆ ఎర్రపైట లోంచి మెల్లగా కదిలిన బస్సు స్వప్న శిఖరంలోంచి జారిపోయిన యదార్థంలాగ కనిపించింది విశాలాక్షికి. విశాలాక్షికి కన్నీళ్లాగలేదు. ఆమెతో పాటు ఆమె మనసు కార్చిన కన్నీళ్లలో మధురమైన భావాలన్నీ తడిసి ఎటో కొట్టుకుపోయాయి! హృదయంలో లెఖ్ఖలేనన్ని డైనమైట్లు బద్దలవుతున్నాయి. అంతా పీడకల లాగ... అందరూ శత్రువు ల్లాగా... సైనేడ్లో ముంచిన కత్తుల్లాగా కనబడుతున్నారు. సముద్రమంతా తనమీదకే కొట్టుకొచ్చినట్లయింది. ‘‘అరరే! ఇదేమిటి విశాలా? కన్నీళ్లు!’’ అంది సరళ. దీనంగా సరళ వైపు చూసింది విశాలాక్షి. సరళ కట్టుకున్న ఎర్రచీర, కన్నీళ్లలోంచి రక్తపుముద్దలా కనిపించింది విశాలాక్షికి. (శ్రీరంగం రాజేశ్వరరావు రాసిన కథకు సంక్షిప్త రూపం) -
ఇరుకు
క్లాసిక్ కథ ‘‘అనంతపురం హాస్పిటల్లో రంగనాథం అడ్మిట్ అయ్యాడు’’ అన్న వార్త తాడిపత్రి అంతా పాకిపోయింది. దాంతో తాడిపత్రికీ, అనంతపురానికీ ఉన్న రోడ్డుకు సగం ఆయుష్షు మూడింది. అతన్ని పరామర్శించి రావడానికి బంధుమిత్రులంతా ఒకటే ప్రయాణాల్లో పడ్డారు. అతడు నాకు చిరకాలమిత్రుడూ - ప్రస్తుతం ఒకే హైస్కూల్లో సహోపాధ్యాయుడూ అవటం చేత నేనూ అనంతపురం వెళ్ళాను. వాడికి ఏ జబ్బూ లేదనీ, తిండి కాస్త తగ్గించడమే మందనీ, ఆ మరసటి రోజే డిశ్చార్జి అయిపొమ్మని అన్నారట డాక్టరు. ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా మా సొంత ఊరు వెళ్ళి మా అమ్మానాన్నలని చూసి వస్తే బావుంటుందనిపించింది నాకు. ఆ మాటే రంగనాథంతో చెప్పేసి గబగబ హాస్పిటల్ మెట్లు దిగేసి వరండాలోకి వచ్చాను. నెత్తురుతో కడిసిన ఓ మనిషిని స్ట్రెచర్ మీద తీసికెళుతున్నారు ఆస్పత్రి ఉద్యోగులు. వాళ్ళ వెనకాల ఓ ఆడమనిషి ఏడుస్తూ వెళుతోంది. బహుశా ఆమె గాయపడ్డ వ్యక్తి భార్య అయ్యుంటుంది. గ్రామ కక్షల కారణంగా విరోధులెవరో అతన్ని పొడిచారుట. ఆ విషయం అక్కడ గుమికూడిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు చూస్తే మనుషుల మీద విరక్తి కలుగుతుంది నాకు. మనుషుల మధ్య, దేశాల మధ్య రగులుకుంటున్న కక్షలూ, యుద్ధాలూ ఎప్పటికీ పోవేమోనని దిగులేస్తుంది. వరండాదిగి అటు పక్కగా వెళ్ళి వేపచెట్టు నీడన నిలుచుని సిగరెట్టు వెలిగించాను. నాకు ఎదురుగా ఓ డజను రిక్షాలున్నాయి. వాటి తాలూకు డ్రైవర్లు చెట్టు కింద హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూచుని వున్నారు. ‘‘ఏవయ్యా హరీ బావున్నావా? ఏమిటి విశేషం?’’ అంటూ వెంకటేశ్వర్లు పలుకరించేసరికి ఆలోచనల్లోంచి తేరుకున్నాను. అతనిది మా పక్క ఊరే. దూరపు బంధుత్వం కూడా ఉంది. నేను వచ్చిన పని మూడు ముక్కల్లో చెప్పేశాను. ‘‘మా అమ్మాయిని డెలివరీకి చేర్పించాను’’ అన్నాడు వేంకటేశ్వర్లు. నేనతన్ని ‘‘విశేష మేమిటి?’’ అని అడగకనే చెప్పినందుకు చాలా సంతోషం వేసింది. ఎందుకో.... మాటాడుతూ ఉన్న నేను హాస్పిటల్ వరండాలోకి చూశాను. అక్కడ సుబ్బులు వస్తూ ఉండటం కనిపించింది. ఎడమ బుజం మీద మూడేళ్ళున్న పిల్లవాడిని వేసుకుని రెండు చేతులతోనూ పట్టుకుని నడుస్తూ ఉంది. పిల్లవాడు నిద్రపోయాడేమో తల బుజానికి ఆన్చి ఉంది. అసలు సుబ్బులు అక్కడ కనిపించడమే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆమె ఇక్కడికి ఎప్పుడొచ్చిందో కనుక్కోవాలనిపించింది. అయితే, ఎదురుగాఉన్న వెంకటేశ్వర్లు ఏమనుకుంటాడోనని నాలోని మర్యాదస్తుడు నన్ను అడ్డుకున్నాడు. చూస్తున్నట్టే ఓ రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది సుబ్బులు. నన్ను చూడలేదు కానీ చూసుంటే కనీసం ఒక్క మాటయినా మాటాడకుండా వెళ్ళిపోయేదా! ‘‘మావయ్యా... సుజాతకీ కాపీ తేవాలిట’’ అంటూ వేంకటేశ్వర్ల మేనకోడలు వచ్చి పని పురమాయించేసరికి ఆయన వెళ్ళిపోయాడు. చివరి దమ్మును లాగేసి, సిగరెట్టును అవతలకు గిరవాటు పెట్టి, నేనూ ఓ రిక్షాలో బస్టాండుకు బయల్దేరాను. ఆ రోజు సంత అవటం వల్లనేమో బస్టాండు మరీ రద్దీగా ఉంది. మా ఊరు వెళ్ళాల్సిన బస్సు అప్పటికి ఇంకా రాలేదు. వాచీ చూసుకున్నాను, మూడు గంటలయింది. సూర్యుడు మబ్బుల్లో ఉన్నా చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా. ఇంత ఉక్కగా ఉందంటే రాత్రికి వాన వస్తుందేమో! అనిపిస్తోంది. ‘‘ఇదే ఊరు పోతుందయ్యా!’’ ఓ ఆడ గొంతు వినిపించింది. తిరిగి చూడకుండానే చెప్పాను. ‘‘ఉరవకొండకు పోతుందమ్మా!’’ కొత్తపలికి పోయే బస్సు ఎప్పుడొస్తుందయ్యా!’’ అదే గొంతు అడిగే సరికి తిరిగి చూశాను.... సుబ్బులు!! ‘‘ఇంకా కొంచెం సేపటికి రావొచ్చు సుబ్బులు!’’ అన్నాను. అంతటితో ఊరుకోవాలనిపించలేదు. ‘‘ఏం సుబ్బులూ! ఆస్పత్రికెందుకొచ్చావు? కుర్రాడికి జ్వరమా?’’ అని అడిగాను. నేను వేసిన రెండు ప్రశ్నలకీ ‘‘అవు’’నన్నట్టు తల ఊపింది నా వేపు చూడకుండానే. ‘‘ఇప్పుడు నయమయిందా?’’ ‘‘ఊ’’ అంది సుబ్బులు. ‘‘అదిగో సుబ్బులూ! మన ఊరికి వెళ్ళాల్సిన బస్సు వచ్చేస్తోంది!’’ అప్రయత్నంగానే సుబ్బులుకు చెబుతున్నందుకు నాకే ఎలాగో అనిపించింది. విలువైన టెర్లిన్ దుస్తుల్లో, మర్యాదస్తుడుగా అవుపించే నాకూ, మాసిపోయీ, అక్కడక్కడ చిరుగుల్తో ఉన్న బట్టల్లో సరిగ్గా దువ్వుకోని జుత్తుతో ఉన్న సుబ్బులుకీ మధ్య నాగరికత అంత అంతరాల్ని ఏర్పరచింది మరి. బస్సు వచ్చి నిలబడటం తోటే డోర్ వద్ద ముసిరారు ఎక్కవలసిన వారు. ఐదు నిమిషాలు ఆ రద్దీని ఛేదించడానికి కొంత పోరాడక తప్పింది కాదు. ఏమైతేనేం నాకూ ఓ సీటు సంపాయించి, ఆడవాళ్ళ సీట్లలో కిటికీ పక్కగా సుబ్బులుకీ ఓ సీటు జేబురుమాలతో రిజర్వు చేశాను. సుబ్బులు వచ్చి తన సీటులో కూచుంది. తమకు సీటు ఉంచినందుకు కృతజ్ఞతగా నవ్వుతుందనుకున్నాను. ఊహూ... నేనేమైనా అతిగా ఆశించానేమో! అరగంటలో బస్సు బయల్దేరింది. సుబ్బులు కిటికీలోంచి ఎటో చూస్తోంది. పిల్లవాడికి పాలు ఇస్తోందేమో కొంగుని నిండుగా కప్పుకొని ఉంది. పదేళ్ళ క్రితం చూసిన సుబ్బులుకీ ఇప్పుడు చూస్తున్న సుబ్బులుకీ లేశ మాత్రమైనా పోలిక ఉందా! ప్రఖ్యాత శిల్పి తీర్చిదిద్దిన శిల్పంలాగు ఉండేది సుబ్బులు. ఆమె ఎంత నలుపో, ఆ నలుపులో అంత కాంతి పొంగుతుండేది. నవ్విందా? ఆషాడమాసపు మేఘాల మెరుపుకి పిల్లకాలువ చప్పుడు నేపథ్యం పలికినట్టు అనిపించేది. మా ఊళ్లో పీర్ల పండగనాడు చూడాలి. ఒక్కోకుర్ర వెదవ తప్ప తాగి సుబ్బులు మెచ్చుకోలు కోసం గుణిసే తీరు. ఒక్కొక్కడు కళ్ళకి నల్లటి చలవద్దాలు పెట్టుకుని, తలకి అరలీటరు ఆముదం దట్టించి నీటుగా దువ్వి, విచ్చుకున్న గొడుగుల్ని ఎత్తి పట్టుకుని మెడలో బంతిపూల దండలు వేసుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, సారా కైపులో ఎగురుతూ ఉంటే బాగా పెంచుకుని ఉన్న గిరజాల జుట్టులు లయగా ఎగిరేవి. అదంతా సుబ్బులు చూస్తోందన్న తలంపుతో మరింత కైపు పెరిగేది వాళ్ళకి. నిజానికి సుబ్బులు వాళ్ళెవర్నీ చూడటం లేదనీ, చూస్తున్నది మా రామచంద్రుడినని చాలా మందికి తెలీదు. మా రామచంద్రుడికి సుబ్బులంటే ఎంతిష్టమో!.... ‘‘ఒరే, ఆ పిల్ల తక్కువ కులంలో పుట్టకుండా ఉంటే ఎప్పుడో మీసం మీద పూలేసుకొని పెండ్లి చేసుకొని ఉండునురా! ఇప్పటికైనా నాకేం అబ్బెంతరం లేదు కానీ.... మా నాయన ఒక్కమాట అననీ... యాడన్నా పాడైపోరా నాకేం పట్టదు అని. వెంటనే పెండ్లి చేసుకోనూ!’’ అన్నాడు ఓ రోజు మా రామచంద్రుడు. ‘‘అట్లా అంటాడని కలలు కంటూ ఉండు సరిపోతుంది. ఒరే రామచంద్రిగా! మీదేం పేద్ద ఎక్కువ కులం కూడా కాదు లేవోయ్!’’ అని సన్నగా చురుకు వేశాను. ‘‘నోర్మోయవోయ్! మా కులమంటే నీకు తక్కువగా కనబడుతోందా?’’ అన్నాడు కాస్త ఉడుక్కుని. ‘‘మీ కులానికీ కొమ్ములేం రాలేదు కానీ... చూస్తూ చూస్తూ మీ నాయన మీ కులం కాని పిల్లను నీకు కట్టబెడతాడా... మంచి ఆస్తులన్నీ, కట్నాల్ని తెచ్చే కుల మింటి పిల్ల యాడుందా అని రెండేండ్ల నుంచి దుర్భిణీ వేసి చూస్తున్నాడు గదా? పోనీ ఓ పని చేద్దాం- నువ్వు సుబ్బుల్ని చేసుకుంటాను అంటే పట్నంలో నాకు మంచి మిత్రులున్నారు. వాళ్ళ సాయంతో మీ ఇద్దరికీ రిజిష్టరు పెళ్ళి జరిపించే పూచీ నాది. సరేనా! అన్నాను. వాణ్ణి ఆ రకంగా సుబ్బులతో పెళ్ళికి రెడీ చేయించాను. సుబ్బులుకి కూడా ఈ విషయం తెలిపాము. సరేనంది సుబ్బులు. సరిగ్గా అదే సమయంలోనే సుబ్బులు మేనమామ నర్సిమ్ముడు పంచాయతీ పెట్టాడు - తన కొడుక్కి సుబ్బుల్నిచ్చి పెళ్ళిచేయాలని. ఆ పంచాయితీలోని పెద్ద మనుషులకి అప్పటికే సారా బాగా తాగించాడు నర్శిమ్ముడు. దాంతో పెద్ద మనుషులు నర్శిమ్ముడి మాట సరైందని తీర్పు చెప్పారు. అంతే.... ఒక్క వారం తిరిగే సరికి నర్శిమ్ముడి కొడుకుతో సుబ్బులు పెళ్ళి జరిగిపోయింది. మా రామచంద్రుడు ఈ దెబ్బ నుంచి ఓ ఆర్నెలలకి కాని కోలుకోలేక పోయాడు. మూడు సంవత్సరాల క్రితం సుబ్బులుకి కొడుకు పుట్టాడు. అదే నెలలోనే సుబ్బులు భర్త చెట్టు మీద నుంచి పడి చనిపోయాడు. సుబ్బులు దురదృష్టవంతురాలు కాకపోతే మా రామచంద్రుడునే పెళ్ళి చేసుకుని వుంటే ఆమె బ్రతుకు ఎంత మారిపోయుండేదో అనిపిస్తుంది. కొత్తపల్లి వచ్చేసింది. నేను బస్సు దిగాను. రద్దీని దాటుకుంటూ బస్సు దిగే ప్రయత్నంలోనే ఉంది సుబ్బులు. మా కొత్తపల్లి రోడ్డుకు ఏడు పర్లాంగుల దూరం ఉంది. సూర్యుడి కిరణాల్లో తీక్షణత లేదు. కరువు బాగా ముదిరి ఉండటం వల్ల చేలన్నీ బోసిపోయి ఉన్నాయి. నన్నూ, సుబ్బుల్నీ దించిన బస్సు వెళ్ళిపోయింది. రెండు మూడు అడుగులు ముందుకు వేసాను. పెద్ద పెట్టున ఏడుపు వినిపిస్తే తిరిగి చూశాను. సుబ్బులు ఏడుస్తోంది. దారి పక్కన ఉన్న రావి చెట్టుకిందే కూలబడి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని ఏడ్చేస్తోంది. నాకేం పాలు పోలేదు. అసలేమయింది సుబ్బులికి! ఇంతవరకూ బావుందే! ‘‘ఏం సుబ్బులూ ఏమయింది పిల్లాడికి?’’ ‘‘నా పిల్లోడు పోయెనే... నా బంగారు కొండ సచ్చిపాయె గదమ్మా! ఇంగెట్లాగమ్మా నేను బతికేది?’’ అంటూ బిగ్గరగా ఏడుస్తోంది సుబ్బులు. నేను దిమ్మెరపోయి చూస్తున్నాను. ఒళ్ళోని కుర్రాడు చలన రహితంగా ఉన్నాడు! ‘‘ఎప్పుడు చనిపోయాడు? బస్సు దిగాక చనిపోయాడా సుబ్బులూ? నా ప్రశ్నలు ఆమెకేమీ వినబడ్డం లేదు. ఎదను బాదుకుంటూ ఒకటే ఏడుస్తోంది. మళ్ళీ గొంతు పెంచి అడిగాను. లేదన్నట్టు తలను ఊపింది - ఏడుస్తూ చెప్పింది సుబ్బులు.... ‘‘ఆస్పత్రిలోనే సచ్చిపోయినాడు సామీ!’’..... నేను షాక్ తిన్నాను ఆ మాటకి. ‘‘మరి నాకు బస్టాండులో కానీ, బస్సులోకానీ, ఈ విషయం చెప్పలేదేం సుబ్బులూ?’’ అన్నాను ఆందోళనతో. పెద్ద పెట్టున ఏడుస్తూనే చీలిపోతున్న కంఠంతో చెప్పింది సుబ్బులు, అసలు విషయమంతా. వారం రోజుల నించి ఈనికి అగ్గి మాదిరి జరం వచ్చింది సామీ! నిన్న పొద్దున్న బతకడేమోనని అనుమానంవచ్చి ఆస్పత్రిలో జేర్పిస్తి. అయినా, ఈ పొద్దుటికి ఈనికి ఆయుస్సు సెల్లిపోయింది సామీ. నా బంగారు కొండ సచ్చిపాయెనే అని, నాకెంత దుక్కం వస్తున్నా ఏడ్చలేదు సామీ.... ఆస్పత్రిలో ఏడిస్తే నర్సులూ, డాకటేర్లు తిడ్తారని బయం... ఆస్పత్రి బయటికి వచ్చినాక ఏడ్సుదామనిపించింది. కానీ! ఆడ ఏడిస్తే రిక్షాకు డబ్బులెక్కువ అడుగతారేమోనని ఏడుపు బిగ పట్టుకున్నా... బస్సు కాడ ఏడిస్తే పీనుగతో బస్సులోకి ఎక్కనియ్యరని ఆడా ఏడుపుని అనుసుకున్నా. యింక నా వల్ల కాదు సామీ..... కరువు తీరా నా సిట్టి తండ్రికోసరం ఏడుస్తా.... నా నాయన నాకి దూరమైపోతే నాకేంది ఉంది... సామీ! నేనింక ఊర్లోకి రాలేను నా సేత కాదు. నువ్వే మావోల్లందరికీ సెప్పుసామీ! నీకు పున్నెముంటుంది!! అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంది సుబ్బులు. నేనొక్కడినే ఊరి దారి పట్టాను, అంతకన్నా ఏం చేయాలో తెలీక. - చిలుకూరి దేవపుత్ర (ఆరుగ్లాసులు సంకలనం నుంచి) -
వానకు తల దాచుకున్న చోట
క్లాసిక్ కథ చెన్నపట్టణం జాతకంలో ‘ప్రచారయోగం’ ఉచ్చస్థితిలో ఉన్నట్టుంది. దానికి తలనొప్పి గాని జ్వరం గాని వచ్చినా, జలుబు చేసినా వెంటనే ఆ సంగతి రెక్కలు కట్టుకుని దేశమంతా వ్యాపిస్తుంది. దాని సందు గొందులూ మురికివాడలూ కాలిబాటలూ మొదలైన వాటికి అంతగా ప్రచార భాగ్యం కలగనిమాట వాస్తవమే. కాని అప్పు డప్పుడూ వాటికి కూడా ఆ అదృష్టం పడుతుంది. గుడిసెలు పరశురామ ప్రీతి అయితేనో, గుడిసెలలోని వాళ్లు కొందరు వార్నిష్లు దొంగ సారాగా తాగితేనో అప్పుడు పత్రికలవారు ఆ విషయాలకు అంతులేని ప్రాముఖ్యం యిస్తారు. నగరంలో వాన కురవనందువల్ల నీటి యెద్దడి యేర్పడిందని దేశమంతా మారు మోగిపోయింది. కుళాయిలు కన్నీళ్లు కారుస్తున్నవనీ, పాలలో కలిపేందుకు నీళ్లు లేక పాలవాళ్లు బాధపడుతున్నారనీ పత్రికలు కంటతడి పెడతాయి. నీటి యెద్దడి అంటే యేమో తెలీని పట్టణ ప్రముఖులు పలువురు పత్రికలు చదివిన తర్వాత గాని నీటి యెద్దడి యేర్పడినట్లు గ్రహించరు. ఎన్నాళ్లని నీటి యెద్దడి అంటూ పాడిన పాటే పాడడం? పత్రికలకు కొత్త కబురు అందించాలని కాబోలు ఉన్నట్టుండి చెన్నపట్టణంలో వాన కురవడం మొదలుపెట్టింది. వానకు రోషం వచ్చిందేమో! రెండో రోజున విశ్రాంతి తీసుకున్న వాన మూడో రోజు మధ్యాహ్నం మళ్ళీ విజృంభించింది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశంలో ఎడతెగని రణగొణ ధ్వని. రాత్రి ఎనిమిది దాటింది. విద్యుత్ ప్రసారం లేని కొన్ని వీధులలో తప్ప, మిగిలిన చోట్లలో విద్యుద్దీపాల కాంతి వాన నీటిలో కలిసిపోయింది. వాన నీరు ప్రవహించేందుకు వీలున్న వీధుల్లోకి, పిలవని చుట్టంగా, ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. పిలవని చుట్టాలు మరి కొందరున్నారు. వానకు తలదాచుకోడానికి వీధుల్లో వాళ్లు అటూ యిటూ తిరుగు తున్నారు. పట్టణంలో వాన కురవకూడ దని వీధి మలుపుల్లో వెలసిన దేవుళ్లకు మొక్కుకున్న ‘ఆరు బయట నివసించే’ పౌరులు వాళ్లు. రోడ్డుపక్కన వుండే చెట్టు చేమలు, మూసిన దుకాణాల ముందు భాగం, కప్పువేసిన బస్సు స్టాండ్లు, పార్కులలోని సిమెంటు బెంచీలు, కాలి బాటలు - మొదలైన చోట్ల, గోడల కంటించిన సినిమా పోస్టర్లు చింపి, వాటిని పరుచుకుని కాలక్షేపం చేస్తారు! మైలాపూరు వైపు వెడుతున్న అయి దారుగురిలో వెళ్లసామి ఒకడు. రెండు నెలల క్రితం బతుకు తెరువు కోసం పట్టణం వచ్చాడు. కాయ కష్టం చెయ్య డంలో బద్ధకించడు. కొత్వాల్ చావడిలో బస్తాలు మోయడం, చేతిబండి వానికి సహాయపడడం, కట్టెలు కొట్టడం, ప్రయాణికుల మూటాముల్లెలు మోయడం మొదలైన పనులు చేసేవాడు. మన్నడి నుంచి - అతను మైలాపూరు వెళ్లడానికి కారణం లేకపోలేదు. కూలికి చేతిబండి లాగే కరుప్పన్ మైలావూరు కూనం ఒడ్డున వున్న ఒక కుప్పంలో నివ సిస్తున్నాడు. కరుప్పన్తో పాటు ఒకసారి వెళ్లసామి అతని గుడిసెకు వచ్చాడు. ఆ పూట అక్కడ భోజనం చేశాడు కూడా. పెద్ద పరిచయం లేకపోయినా, వెడితే అడ్డు చెప్పడని అతని వుద్దేశం. బస్సులో వెళ్లా లంటే ముప్ఫయి పైసలు చెల్లించుకోవాలి. చొక్కా జేబులో తొంభై అయిదు పైసలు న్నాయి. పని బాగా వున్న రోజుల్లోనే అంతంత మాత్రం దొరికేవి డబ్బులు. వాన పడడం వల్ల, రెండు మూడు రోజులుగా ఆ కాసిని డబ్బులు కూడా కరువయ్యాయి. ఆకలి మాత్రం మూడు పూటలు కాదు, అయిదు పూటలు వేసేది. రాయపేటరోడ్డు గుండా మైలాపూరు సరిహద్దుకి వచ్చిన వెళ్లసామి, వెళ్లవలసిన చోటు విచారించుకుంటూ నడక సాగిం చాడు. మంచి వానలో నాలుగు మైళ్లు నడి చాడు. దారిలో ఒక టీ దుకాణం కనిపిం చింది. ఆకలి ఎక్కువయింది. నాయరు వద్ద పది పైసల బన్లు మూడు కొని, తిని, రెండు అరటిపళ్లు కూడా లోపలికి పంపించాడు. మొత్తం నలభై పైసలు. కాని చలికి గడ్డ కట్టుకుపోతున్న శరీరం సింగిల్ టీ కోరింది. ఇంకో పది పైసలిచ్చి వేడి వేడి తేనీరు మెలమెల్లగా తాగాడు. ఒంట్లో వేడి వ్యాపించడంతో హాయిగా వుంది. కుప్పం వైపు తిరిగే సందుని చూచీ చూడడంతో వెళ్లసామికి కడుపు తరుక్కు పోయింది. గుడిసెలు గుడిసెలుగా లేవు. వాటిలో మనుషులూ కనిపించలేదు. కొంచెం దూరం బురదలో నడిచివెళ్లాడు. రెండు మూడు గుడిసెలు నేలమట్టమయి నాయి. ఎందుకు నేనింత దూరం వెతుక్కుంటూ వచ్చాను? అనుకున్నాడు. అక్కడున్న దీపస్తంభం ఆధారం చేసుకుని ఎలాగో కరుప్పన్ గుడిసెను గుర్తుపట్టాడు. అరుగుమీది తడికలు పడిపోయినాయి. గాలికి తలుపు కొట్టుకుంటోంది. మెరుపుల కాంతికి గుడిసె లోపలి భాగం కనిపి స్తోంది. బయట నుంచునే పరీక్షగా చూశాడు. పైకప్పు జల్లెడలా వుంది. ఒక మూల ఒకరినొకరు కౌగిలించుకుని యిద్దరు కూర్చున్నారు. ఇద్దరూ స్త్రీలే. ఒకామె కరుప్పన్ తల్లి. మరొకామె అతని కూతురు. కరుప్పన్ భార్య మరణించిన విషయం వెళ్లసామికి తెలుసు. వెళ్లసామి ఆలోచనలోపడ్డాడు. వానకు తల దాచుకునేందుకు మరోచోటు దొరక్క అక్కడికి వచ్చాడు. కరుప్పన్ లేడు. ఇంట్లో వాళ్లకే చోటు లేదు. కారుతున్న ఆ గుడిసె కంటె బయటే బాగుందనుకున్నాడు. వెనక్కి వెళ్లిపోదామనుకున్నాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ‘‘అవ్వా! అవ్వా! నాన్న వచ్చాడే’’ అంటూ కరుప్పన్ కూతురు తలుపు తెరిచింది. నుంచున్న వ్యక్తి ముఖం సరిగ్గా చూడకుండానే ‘‘వచ్చావా? దోవ తెలిసిందా?’’ అంటూ ఆదుర్దాగానూ కోపంగానూ అతన్ని ఆహ్వానించింది. ఉలిక్కిపడ్డాడు వెళ్లసామి. ‘‘నేను...’’ చంపకం అతన్ని చూస్తూ నిర్ఘాంత పోయింది. ఆగంతకుడు ఎవరో గుర్తు తెలిసిన తర్వాత ఆమె దడ తగ్గింది. కాని ఆమె ముఖంలోని నిరాశ తగ్గలేదు. ‘‘ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంకా యింటికి రాలేదా?’’ అడిగాడు. ‘‘రెండు రోజులయింది యింటి మొగం చూసి. అవ్వకు జ్వరం వస్తున్నట్టు తెలిసి కూడా దొంగ సారా తాగి ఎక్కడో పడివుంటాడు’’ అంది. బాధపడ్డాడు వెళ్లసామి. ‘‘వానకు యింత అవస్థ పడుతూ వుంటే, కన్నతల్లినీ కన్నకూతుర్నీ మరిచిపోయి ఎలా వుండగలి గాడు! వాడూ మనిషేనా!’’ అనుకున్నాడు. వెళ్లిపోదామనుకున్న వాడల్లా కొంచెం తటపటాయించాడు. ఆ దురవస్థలో వాళ్లనలా విడిచిపెట్టి తాను హాయిగా ఉండడానికతనికి మనస్కరించలేదు. చంపకం అతన్ని లోపలికి రమ్మంది. వెళ్లాడు. కాలు పెట్టిన చోటల్లా నీళ్లు. అవ్వకు పక్కగా కొయ్య పలక వేసి కూర్చో మంది. కూర్చోలేదు. ఇంతలో చంపకం వచ్చిన మనిషి ఎవరో అవ్వకు తెలియ జేస్తోంది. పేదరికంతో పాటు ముసలి తనమూ జ్వరమూ కలిసేసరికి ఆ ముసలి దానికి, చెవులూ కళ్ళూ సరిగా పని చేస్తు న్నట్లు లేదు. కూర్చున్న తీరూ, కనిపించిన విధమూ చూస్తే, వ్యాధితో బాధపడే ఆడ కోడి గుర్తుకి వచ్చింది. ‘‘మిగిలిన వాళ్ళల్లా మీరూ ఎక్కడికైనా వెడితే బాగుండేది గదా!’’ అన్నాడు వెళ్లసామి. ‘‘అవ్వ నడవలేదు. అవ్వను ఒంటరిగా విడిచిపెట్టి, వెళ్ళడానికి నాకు కాళ్ళాడలేదు.’’ ‘‘మీరు లోపలే కూర్చుని వానలో తడిస్తే, ఆ తర్వాత చావ్వలసిందే.’’ ‘‘కాని ఎక్కడికని వెళ్ళగలం?’’ అంది. ఆమె అన్న మాట ములుకోలు దెబ్బలా అనిపించింది వెళ్లసామికి. వేలకు వేలుగా మేడలూ మిద్దెలతో, గుళ్ళూ గోపురాలతో మహా గర్వంగా కనిపించే యీ తమిళదేశపు రాజధాని నగరంలో నివసిస్తూనా ఆమె యీ మాట అంది! ‘‘ఏవన్నా తిన్నారా లేదా?’’ అడిగాడు. ‘‘తిన్నాం’’ అంది. ఆమె చెప్పింది అబద్ధం అని అక్కడున్న పొయ్యి సాక్ష్యమిచ్చింది. అందులో నీళ్లు నిలిచాయి. సరకుపేళ్లు నానిపోయినాయి. వాన నీళ్ళు పట్టడాని కేమో కుండలు వాడబడ్డాయి. కొంచెంసేపు ఆలోచించి ‘‘మీరిద్దరూ నాతో రండి. మొదట మనం ఎక్కడైనా తలదాచు కోవాలి’’ అన్నాడు. చంపకం ఆలోచిం చింది. అవ్వ ఆరోగ్యం చూస్తే, ఆ రాత్రివేళ ఆమెతో ఒంటరిగా వుండడానికి భయం వేసింది. పరిచయం లేని ఆ యువకుడితో వెళ్లడానికి భయపడింది. ‘‘అవ్వ నడవలేదు గదా...’’ అవ్వను మెల్లగా పైకి ఎత్తాడు వెళ్ల సామి. అతనితోపాటు బయలుదేరడం చంపకానికి భయంగానే వుంది. అయినా తలవని తలంపుగా అక్కడికతను రావడం, భగవంతుడే పంపించాడని అనుకుంది. అతని ఆదరభావం, ఖచ్చితమైన తీరూ ఆమె భయాన్ని కొంచం పారదోలాయి. ముసలిదాన్ని మోసుకుని నడక సాగించాడు వెళ్లసామి. నాయరు టీకొట్టు మూస్తున్నాడు. నాలుగు బన్లు కట్టి యిమ్మని కేక వేశాడు వెళ్లసామి. నాయరిచ్చిన పొట్లాన్ని పంచె కొంగున కట్టుకున్నాడు. ఇంకా అయిదు పైసలే మిగిలాయి. నాయర్ దుకాణంలో అతనికీ, పని చేసే కుర్రవాడికీ పడుకో డానికి చోటు లేదు. ఇంకెక్కడైనా చోటు దొరుకుతుందేమో అని విచారించాడు. ‘‘శాంథోం సముద్రం ఒడ్డున వుంది చూడండి, కార్పొరేషను బడి... అక్కడికి వెళ్లండి’’ అన్నాడు నాయరు. ‘‘అదెక్క డుంది?’’ వెళ్లసామి పట్టణానికి కొత్త గదా! ‘‘నాకు తెలుసు రండి’’ అంది చంపకం. అరమైలు నడిచి వెళ్ళిన తర్వాత, ఆ బడిలో చోటు లేదన్న విషయం తెలియ వచ్చింది. చంపకం కళ్లల్లో నీళ్ళు తిరుగు తున్నట్టు వీధి దీపాల వెలుతురు వల్ల తెలుసుకోగలిగాడు. ఏం చెయ్యాలో తెలీక వాళ్లు వీధిలో ఒక మూల నిలబడ్డారు. అప్పుడు పది దాటి వుంటుంది. ఆ అపరాత్రి వేళ కూడా చాలా కార్లు వస్తూ పోతూ వున్నాయి. ప్రాణం లేని ఆ కార్లకు కూడా షెడ్లు అనే యిళ్లు వున్నాయి. ఎండవానల నుంచి వాటిని జాగ్రత్తగా కాపాడతారు. మనిషి ఎలా పోతే యేం? వచ్చిన దారినే తిరుగు ముఖం పట్టారు. కాలి బాటను ఆనుకుని కాంపౌండు గోడ ఒకటి పొడుగ్గా వుంది. ఆ గోడకు వెనకాల ఇళ్లు యేమీ కనిపించలేదు. కాంపౌండు గోడ నానుకుని రెండు మూడు డబ్బారేకుల సావిళ్ళు ఉన్నాయి. ఒక దాంట్లో కొంతమంది నిద్రపోతున్నారు. మరోదాన్లో మేకలూ ఆవులూ వున్నాయి. మూడవ సావిట్లో ఒకే ఒక గాడిద మాత్రం నిలబడింది. భగవంతుడు కళ్లు తెరిచాడనే ఆనందం కలిగింది వెళ్లసామికి. ఆ కాంపౌండు గోడకు ఎక్కడో ఒక చోట వాకిలి అంటూ ఒకటి వుండాలి. అది కనక వుంటే... అది తెరిచే వుందో, లేదో! తాళం వేసి వుందేమో. కాపలా వాళ్లెవరైనా వుంటే, అతని కాళ్లు పట్టుకునైనా బతిమాలవలసిందే. అతని అభిప్రాయం తెలుసుకుందో లేదో, చంపకం గజ గజ వణికిపోయింది. ముఖం పాలిపోయింది. మొండిపట్టు పట్టింది, లోపలికి పోవద్దంటూ. ‘‘వద్దు... మనం దీన్లోకి వెళ్లకూడదు.’’ ‘‘ఏం?’’ అని అరిచాడు వెళ్లసామి. ‘‘చెపుతున్నాను విను, వద్దు.’’ ‘‘ఇప్పుడే మీ అవ్వకు ప్రాణం పోయి నట్టుంది. ఇక మీద నేను మొయ్యలేను. ఇక్కడికి వెళ్లకూడదంటే, సముద్రానికి దారి చూపు. సరాసరి అక్కడికే వెడదాం. అందులో పడి పూర్తిగా మునిగిపోదాం...’’ చంపకం అతనికేదో చెప్పబోయింది. అతని ప్రయత్నం నుంచి అతన్ని విరమింపజేయాలనుకుంది. కాని అతని కోపం చూసి, యేమీ మాట్లాడలేక పోయింది. ఏమన్నా మాట్లాడితే, అతను వాళ్లను విడిచిపెట్టి పరుగెత్తుకుపోయేలా వున్నాడు. ఆ పరిస్థితిలో అతన్ని వదులు కోడానికి ఆమె యిష్టపడలేదు. ముసలిదాన్ని కిందికి దింపి, చంపకాన్ని ఎత్తి గోడ మీద కూర్చో బెట్టాడు. తర్వాత ముసలిదాన్ని ఎత్తి గోడ మీద కూర్చోబెట్టి, పట్టుకోమని చెప్పాడు. ఆఖరికి అతను గోడ ఎక్కి కిందికి దూకాడు. వాళ్లను దింపాడు. గాడిద నుంచున్న సావిట్లోకి వాళ్లు వెళ్ళారు. వాళ్లను చూసి, గాడిద తనంత తానే పక్కనున్న సావిట్లోకి దారి తీసింది తన వాళ్లను కలుసుకోడానికి. వెళ్లసామి ముసలిదాన్ని నేలమీద పడుకోబెట్టాడు. ఈలోగా చంపకం ఒక మూలకు వెళ్లి తన చింపిరి పాతను పిండి, దాంతో తల తుడుచుకుంది. అవ్వ తలను కూడా తుడి చింది. అతని పంచను కూడా పిండింది. వెళ్లసామి చొక్కా విప్పి పిండుకున్నాడు. ఆ సావిడి పొడుగ్గా ఉంది. వాన జల్లు వల్ల సిమెంటు నేల సగం దాకా తడిసి పోయినా, మిగిలిన సగం పొడిగానే ఉంది. ముగ్గురూ పడుకునేందుకు చోటు చాలదు. అయినా ఆ చోటు అతనికి స్వర్గంలా కనిపించింది. పంచె కొంగున కట్టుకున్న బన్నులు పైకి తీశాడు. నానిపోయి వున్నాయి. వాటిని చంపకానికి అందిం చాడు. అవ్వకు తెలివి లేదన్న మాటేగాని, ఆమె నోట్లో బన్ను ముక్కలు పెట్టిందో లేదో ఆమె మెల్లగా నమిలింది. ఒకటిన్నర బన్ను కంటె ఎక్కువ తినలేకపోయింది. ‘‘ఏం నువ్వు తినవా?’’ అంటూ చంపకం ఒక బన్ను వెళ్లసామికి యిచ్చింది. ‘‘కడుపు నిండా తిన్నాను. ఇంక ఒక్క పిసరైనా లోపలికి పోదు’’ అంటూ సులభంగా అబద్ధం ఆడాడు. నాలుగు కాదు, ఆరు బన్నులైనాసరే తినగలడు. చంపకం తింటూ వుండడం చూసి ఎంత గానో సంతోషించాడు. దూరాన విద్యుద్దీ పాల వెలుతురులో మెరిసిపోతున్న నగర భవనాలను ఆశగా చూశాడు. ‘‘పట్టణానికి వచ్చిన కొత్తల్లో నేనేం అనుకున్నానో తెలుసా?’’ అని మొదలుపెట్టాడు. ‘‘ఏమనుకున్నావేవిటి?’’ ‘‘మేడ మీద మేడ, దానిపైన మరో మేడ - యిలా పట్టణం పైపైకి పెరిగి పోతోంది; వీధుల్లో కార్లు బారులు బారు లుగా వెడుతున్నాయి. అంగళ్ళలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వస్తువులెన్నో మెరిసి పోతున్నాయి. ఇలాంటి కుబేర పట్టణంలో పని, తినడానికి అన్నం, వుండడానికి నీడా దొరక్కపోతాయా అనుకున్నాను.’’ ‘‘నువ్వు చూసింది కుబేర పట్టణాన్నే. ఒక్కపూట భోజనానికి పదిహేను రూపాయలు ఖర్చు పెడుతున్నారట కొందరు మగవాళ్ళు. ఆడవాళ్ళు యాభై రూపాయలు పెట్టి ఒక్క గజం రవికగుడ్డ కొంటారట.’’ ‘‘మీరుండే పట్టణాన్ని కూడా చూశాను’’ అన్నాడు వెళ్లసామి. ‘‘నువ్వు సరిగ్గా చూసుండవు. మా గుడిసెల పట్టణాన్ని చూడాలంటే, కూవం ఒడ్డునే తిరగాలి. అక్కడక్కడా పుట్టుకొ స్తున్న మురికివాడల్ని కూడా చూడాలి.’’ ‘‘ఇప్పటికే చాలు చాలనిపిస్తోంది. నేను పడ్డ కష్టం కుక్క కూడా పడి వుండదు’’ అతని కంఠం రుద్ధమయింది. ‘‘డబ్బున్న వాళ్లకే యిది స్వర్గం... నీకూ నాకూ కాదు... యిది... యిది...’’ అర్ధోక్తిలోనే ఆపివేసింది చంపకం. ‘‘చెప్పేసెయ్.... ఎందుకు దాస్తావ్?’’ ‘‘చెప్పవలసిన మాట కాదిది.’’ ‘‘చెప్పకపోతే నిన్ను విడిచిపెట్టను.’’ విడిచిపెట్టడని అనుకుంది. ‘‘మన మిప్పుడు ఎక్కడున్నామో, అలాంటి చోటు...’’ అని చెబుదామనుకున్నాను- ‘‘మనమిప్పుడు ఎక్కడున్నామని?’’ ఆమె బదులు చెప్పడానికి ఇష్టపడ లేదు. అతనూ విడిచి పెట్టలేదు. మళ్లీ మళ్లీ అడిగాడు. ‘‘నీకింకా తెలీలేదా?’’ ‘‘తెలుస్తే, నిన్నెందుకడుగుతాను?’’ ‘‘వల్లకాట్లో వున్నాం.’’ ‘‘ఏమిటి?’’ ‘‘అవును. ఏ సావిట్లో వుంచి పీనుగుల్ని తగలబెడతారో, ఆ సావిట్లోనే వున్నాం. ఆ చోటు మీదే కూర్చున్నాం. నువ్వు పక్కకు నెట్టావు చూడు, ఆ బూడిద మనుషుల్ని కాల్చగా వచ్చిన బూడిద...’’ ఇక్కడికి వచ్చే ముందు చంపకం తనను ఎందుకు వారించిందో వెళ్లసామికి యిప్పుడర్థమయింది. అయినా తన భయాన్ని గాని ఆదుర్దాని గాని అతను చూపుకోలేదు. ధైర్యశాలిలా పక పక నవ్వుతూ ‘‘కుబేర పట్టణంలోనివాళ్లు ఆఖరికి వచ్చి నివసించే చోటికే మనమూ వచ్చామన్నమాట’’ అన్నాడు. ‘‘భయంగా లేదూ?’’ అని అడిగింది. ‘‘ఏవన్నా వుంటే భయపడాలి. నా దగ్గరేముందని... నాకెవరున్నారని?’’ ‘‘మీ వూళ్లో ఎవ్వరూ...?’’ ‘‘నాన్నా, అత్తయ్యా, ఇల్లూ, వాకిలీ, ఆస్తీ, గీస్తీ... ఏమీ లేవు... ఊరు విడిచిపెట్టి యిక్కడికి... వచ్చేశాను.’’ ‘‘ఎందుకొచ్చావ్?’’ ‘‘ఆకాశాన్ని నమ్ముకున్న వూళ్లో బ్రతుకులేదు. పని చేద్దామంటే ఏమీ లేదు. మోసం చేసి బతకడం చేతకాదు. పట్టణం మెరుపుల్ని నమ్మి యిక్కడికి వచ్చేశాను.’’ వెళ్లసామికి భయం ఆవరించింది, అతనికి తెలీకుండానే. ఒక్క నిముషానికి ముందు నాకేం భయం లేదన్నవాడు, యిప్పుడు తన జీవితాన్ని చూసి భయపడి పోయాడు. వస్తున్న యేడుపుని ఆపుకోలేక పోయాడు. ‘‘ఏ మొహం పెట్టుకుని యిక నేను మా వూరు వెడతాను?’’ అన్నాడు. ‘‘దిగులు పడకు. వయస్సులో వున్న వాడివి, బెంబేలు పడితే ఎలా?’’ అని ఓదారుస్తూ అతనికి దగ్గరగా జరిగింది చంపకం. మెరుపు వెలుతురులో ఆమె ముఖం చూశాడు. ఆమె నలుపు. కాని చూడ ముచ్చట గొలిపే ముఖం. వయసు వచ్చిన పిల్ల అతనితో అంత చనువుగా మాట్లాడడం అతనికదే తొలి అనుభవం. ‘‘మేమంతా యీ పట్టణంలో బతకడం లేదూ? నీకు మాత్రం ఏదో ఒక బతుకు తెరువు కనిపించకపోతుందా?’’ అంది చంపకం. ‘‘ఇదీ ఒక బతుకేనా?’’ అన్నాడు వెళ్లసామి బాధగా. ‘‘నన్ను కన్న తండ్రినీ, నిన్ను కన్నాడు చూడు - మీ నాన్ననూ గొంతు పిసికి చంపాలి. కాసుకి గతిలేని వాళ్లు పిల్లల్ని కనకూడదు. డబ్బు గడించకుండా పిల్లల్ని కంటే సరా? ఇంతకూ మీ అయ్య ఎక్కడికి వెళ్లాడు?’’ తన తండ్రిని గురించి అతనలా మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. అయినా అలా మాట్లాడే హక్కు అతనికున్నట్లు ఆమె అనుకుంది. ‘‘చాలా పొద్దుపోయింది. నిద్రవస్తే నిద్రపో,’’ అంది. ‘‘ఈ చల్లో, యీ నడి వల్లకాట్లో నువ్వు బాధగా మాట్లాడితే, నాకు ఏడుపొస్తుంది.’’ ‘‘నువ్వు పడుకో. భయపడకుండా నిద్రపో’’ అన్నాడు వెళ్లసామి. ముసలిది వాళ్లిద్దరి మధ్యా కట్టెలా పడివుంది. ప్రశాంతంగా పడుకునేందుకు వీలు లేదను కున్నాడు. ఒళ్లు బాగా అలిసిపోయినా, మనసులో మాత్రం ఒక విధమైన భావోద్రేకం ఉరకలు వేస్తోంది. ముందు వెనుకలు తెలియని ఒక అపరిచిత యువతి తన బాధను చూసి ఏడుస్తా ననడం తలుచుకుని నవ్వుకున్నాడు. చంపకం పడుకున్న కొంతసేపటికల్లా, వెళ్లసామి ఎలాగో ఒదిగి కాళ్లు చాచాడు. అవ్వను దగ్గరికి తీసుకుని చంపకం నిద్రపోవడం అతను గమనించాడు. ఆకాశం దాగుడుమూతలాడుతోంది, కొంచెంసేపు వాన కురుస్తూ కొంచెంసేపు వాన వెలుస్తూను. అది డబ్బారేకుల సావిడి కావడం వల్ల, వాన జల్లుకి మరీ చప్పుడవుతోంది. వీస్తున్న గాలిలో కుళ్ళి పోయిన మానవ శరీరం తాలూకు కంపు కూడా కలిసింది. నిద్ర రాలేదు. చిత్రమైన యీ లోకంలో, విచిత్రమైన ఒక వలయంలో, తలవని తలంపుగా తాను చిక్కుకున్నట్లనిపించింది. తన రక్షణలో ఇద్దరు స్త్రీలు నిర్భయంగా నిద్రపోతు న్నారు. అతనిలో పురుషత్వం మేల్కొన్నది. తాను పరమ దరిద్రుడనని గాని, బ్రతుకు తెరువు లేని కూలి అని గాని, అతనను కోలేదు. వయసు వచ్చిన పురుష సింహం అతను. కాయకష్టంతో తననూ తనను అంటిపెట్టుకున్న వాళ్ళనూ పోషించగలడు. తనలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని కలిగించిన చంపకాన్ని పరీక్షగా చూశాడు. బలిష్ఠమైన ఒళ్ళు, చక్కని ముఖం, ప్రేమ భరితమైన హృదయం - పట్టు పరువు మీద పడుకున్నదానిలా పడుకుంది గాని, కట్టెలు పేర్చి మండబెట్టిన చితిమీద పడుకున్న దానిలా తోచలేదు. వెళ్లసామి పెదవుల మీద చిరునవ్వు దోబూచు లాడింది. మెలమెల్లగా కునుకుపట్టింది. అది మూడవ జామో నాలుగో జామో... ఉన్నట్టుండి డబ్బారేకుల షెడ్డు మీద ఎడతెరిపి లేకుండా గులకరాళ్లు పడ్డట్లు చప్పుడయింది. వడగళ్ల వానా అది! ఏదో మండుతున్నట్టుగా కళ్లు మిరు మిట్లుగొలిపే ఒక మెరుపు. దాన్ని అనుస రించి పిడుగుపడ్డ చప్పుడు. చంపకం గభాలున లేచి అవ్వను కదిలించి చూసింది. అవ్వ ఒళ్లు మంచులా చల్లగా ఉంది. గొల్లున ఏడుస్తూ, వెళ్లసామి వద్దకు వెళ్లి అతని చెయ్యి పుచ్చుకుంది. భయంతో వణికిపోయింది. వెళ్లసామి కళ్ళు తెరి చాడు. ఆమె ముఖం పరీక్షగా చూశాడు. ప్రపంచంలోని భయమంతా ఆమె కళ్లల్లో గూడు కట్టుకున్నట్టు కనిపించింది. ‘‘నాకెందుకో భయంగా వుంది’’ అంటూ యేడ్చింది. ‘‘మన మిక్కణ్ణుంచి వెళ్లిపోదాం’’ అని బతిమాలింది. వెళ్లసామి ఆమెను పట్టుకుని ఒళ్లో కూర్చోబెట్టుకు న్నాడు. ఆమె వారించలేదు. చలి బాధ నుంచీ, భయం నుంచీ ఆమెను కాపాడే నిమిత్తం తన విశాలమైన వక్షస్థలానికి చేర్చుకున్నాడు. ‘‘భయపడకు - నేను న్నాను’’ అంటూ చెవిలో చెప్పాడు మాటి మాటికి. ఆమె భయం క్రమకమంగా తగ్గు ముఖం పట్టింది. అలా వాళ్ళు ఆ శ్మశానం మధ్యలో మృత్యుదేవత సంచరించే ఆ చోట, బూడిదగుట్ట మీద తమను మరిచిపోయి అలాగే వుండిపోయారు. వాన కురిసింది. పిడుగులు చప్పుడు చేశాయి. గాలి వీచింది. సముద్రం ఘోషించింది. అయినా చంపకం భయం దూదిపింజలా ఎగిరిపోయింది. ఆమె ముఖం పక్కకు తిప్పుకుని, పళ్ళు కనిపించేలా నవ్వింది. ఆ నాలుగు కళ్లల్లోనూ కొత్త కాంతి తళుక్కుమంది. చంపకం తన చేతుల్ని అతని కంఠం చుట్టూ పోనిచ్చింది. ఆ చేతుల్లోని కవోష్ణం అతనిలోని చలిని పారదోలింది. ‘‘ఇలాగే యీ చోట్లో మనమిద్దరం ఒకటిగా చచ్చిపోతే ఎంత బావుంటుంది!’’ అంది మెల్లగా. తరువాతి మాటలను పైకి రానీయకుండా ఆమె అధరాలను వెళ్లసామి తన నోటితో కప్పివేశాడు. ఆ తర్వాత వాళ్లు యీ లోకంలోనే లేరు. మెరుపులు, పిడుగులు, వాన, చలిగాలి, శ్మశానం, మరణం, ఆకలి బాధ, దయావిహీనత, దురాశ, స్వార్థం - ఇవేమీ లేని ఒక అద్భుత ప్రపంచంలో వాళ్ళిద్దరూ తమ్ము తాము మరిచిపోయి సంచరించారు. ప్రాణానికి ప్రాణం యివ్వడానికి జంకని ప్రేమ ఎల్లెడలా నిండిన ఆనంద జగతి అది! కుబేరుల్నీ కోటీశ్వరుల్నీ కూడా ఆ చోట్లో క్షణకాలంలో గుప్పెడు బూడిదగా చేసే ఆ పరమశివుడు ఆ రుద్ర భూమిలో ఇద్దరు అనాథలు మైమరచి వుండడం బహుశా చూచి వుండడు. ఎన్నడో మన్మథుడు శివుని కంటి మంటకు కాలిపోయినట్లు చెపుతారు. కాని ఆ మన్మథుడికి నేడు అక్కడ నూతన జీవం ప్రసాదించే పని కలిగింది. నాశనాన్ని గర్భంలోనే నాశనం చేసే జీవలోకంలోని ఒక బొట్టు జీవశక్తి అనే చిప్పలో ముత్యమై పడింది. ఆమెకూ అప్పుడు తెలియదు. అతనికీ తెలియదు. తమను కన్నందుకుగాను తమ తలిదండ్రుల్ని నిందించిన వాళ్లిద్దరూ ఒక్క మెరుపు మెరిసిన తృటికాలంలో తలిదండ్రులుగా మారిపోయిన వింతను వాళ్లు తెలుసుకోలేదు. వాన కురిసింది. మెరుపు మెరిసింది. పిడుగుపడ్డ చప్పుడయింది. సముద్రపుటల మాత్రం పుడుతూ పెరుగుతూ ఒడ్డుకి మోదుకుని విరిగి పోతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ పెరుగుతూ విరిగిపోతూ వుంది. విరిగిన అలలా అక్కడ ఆ ముసలిది పడివుంది. పుట్టిన అలను ఆమె మనుమరాలు భరించింది. అందుకు సాక్ష్యంగా నిలిచింది ఆ డబ్బా రేకుల షెడ్డు. (కథా భారతి సంకలనం నుంచి) (స్థలాభావం కారణంగా కథను కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది) - అఖిలన్ -
పిచ్చుకలు
క్లాసిక్ కథ రహీమ్‌ఖాన్ పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి, గ్రామానికి పశ్చిమ దిక్కులో, మామిడి తోపు వెనుక భాస్కరుడు నక్కుతున్నాడు. రహీమ్‌ఖాన్ తన ఏభై పైచిలుకు జీవితములో ఆ వీధిగుండా, భుజం మీద నాగలితో, తన రెండెడ్లను తోలుకుంటూ నిర్లక్ష్యంగా నడిచాడు. అతను కచేరీ సమీపించేసరికి అక్కడ ఓ పదీ పన్నెండుమంది రైతులు పొగ త్రాగేందుకు గుమిగూడి వున్నారు. వృథా ప్రలాపాలతో, ఉల్లాసకరంగా వున్న వారి గొంతులు అతన్ని చూసేసరికి గుసగుసల్లోకి దిగిపోయాయి. అతను ఆ వీధిమలుపు తిరిగాక కల్లు... తన చేతిలోని హుక్కాను మరొకరికి అందిస్తూ, ‘‘అదిగో, పాషాణం వెళుతోంది’’ అన్నాడు. దానికి లావుపాటి నన్నా... ‘‘వాడు రోజురోజుకీ మరీ దుర్మార్గంగా తయారౌతున్నాడు. నిన్నటికి నిన్న తన ఎడ్లమీదికి చిన్న రాయి విసిరాడని, పాపం ఆ రాముగాడి కొడుకును చావగొట్టాడు,’’ అన్నాడు. ‘‘మరోరోజు వాడి పొలంలో నా గుర్రం పడిందని, దాన్ని చచ్చేంతగా బాదాడనుకోండి’’ అన్నాడు రామనాథ్. అది తన కొడుకులు పెంకితనంతో చేసిన పనని చెప్పడం అసంగతం అని అతని అభిప్రాయం. అదే సమయానికి వాళ్ల కబుర్లలో కర్త తన యింటికి జేరాడు. అతని యిల్లూ అతని జీవితానికి చిహ్నంగా ఇరుగు పొరుగు ఇళ్లకు దూరంగా ఉంది. ఎడ్లను కట్టేసి ఇంట్లోకెళ్లబోతూంటే, పొరుగింటి ముసలమ్మ అంది, ‘‘రహీమ్‌ఖాన్... మీ ఆవిడ...’’ ఇంకా వాక్యం పూర్తి కాలేదు. ‘‘పారిపోయింది. అంతేనా!’’ పళ్లికిలిస్తూ అన్నాడు. ‘‘అబ్బెబ్బే! కాదు, కాదు ఆవిడ ‘మరుపూరు’లోని తన అన్నగారింటికెళ్లింది. కొద్దిరోజుల్లో వచ్చేస్తుంది’’ అంది. ‘‘ఆ’’ అని తలుపు దడాలున తెరిచి, భగభగ మండే హృదయంతో, ఇంట్లో మంచం మీద చతికిలబడ్డాడు. అతనికి తెలుసు, ఆమె ఇంక తిరిగిరాదని. ఓ మూల ఏదో పిల్లి ‘‘మ్యావ్’’ అంది. అక్కడ అతని కోసమంటూ ఎవ్వరూ లేరు. అతను ఎంతో అసౌఖ్యంగా బాధపడ్డాడు వాళ్ల ముప్ఫై సంవత్సరాల దాంపత్య జీవితంలో. అతను ఎప్పుడూ అనుకుంటూనే వున్నాడు ఆమె ఏదో రోజున, ఏదో సమయాన తనను విడిచి పోతుందని. అలా చేస్తుందని ఆశపడ్డాడు కూడా. తను రోజూ కొట్టే దెబ్బలు భరించలేక, ఆరేళ్ల క్రితం తన పెద్దకొడుకు బుందు ఇల్లు విడిచి పారిపోయాడు. మూడేళ్ల క్రితం రెండవ కొడుకు నురు కూడా తన అన్నను కలిశాడు. అప్పట్నించి రహీమ్ అనుకొంటూనే వున్నాడు, ఇలా జరుగుతుందని. అలాగే జరిగింది. దానికి అతనికెంతో అసంతృప్తిగా వుంది. విచారం మాత్రం కాదు. ఎంచేతనంటే, అతనెప్పుడూ తన భార్యను ప్రేమించలేదు. అది కేవలం అసౌకర్యం మాత్రమే - ఏదో తనకవసరమైన వస్తువులలో ఒక వస్తువు పోయినట్టు. ఇప్పుడు ఎవరిపై తన కోపాన్ని వెళ్లగ్రక్కుతాడు?! ఈ ముప్ఫయి ఏళ్ల నుంచి అతని కుటుంబానికి, సంఘానికి, జీవితానికి వ్యతిరేకముగా... అతని కష్టాలకు, అతని భార్య ఒక చిహ్నంగా, గురుతుగా ఉంది. రహీమ్‌ఖాన్ యువకుడుగా ఉన్నప్పుడు, సాము, గరిడీలలో గాని, కుస్తీలో గాని అతన్ని గెలిచేవాడు ఎవ్వడూ ఆ గ్రామంలో లేడు. ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించేందుకు తన గ్రామం గుండా వెడుతున్న సర్కసులో చేరుదా మనుకొన్నాడు. అతను రాధ అనే హిందువుల అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కాని, అతని తల్లిదండ్రులు తన రెండు ఆశలను వమ్ము చేశారు. సర్కసు పని గౌరవనీయుడైన రైతుకు చాలా నీచమైనది. తన తండ్రి, తాత పూర్వీకులు భూమి దున్ని బ్రతికేవారు. కాబట్టి తను కూడా అలానే చేయాలి. హిందువుల అమ్మాయి రాధను పెళ్లిచేసుకోవడం అనే తలంపే చాలా సిగ్గుమాలినది, మత విద్రోహమైనదీను. ఈ రెండూ ఆ రెండు ఆశలను నాశనం చేశాయి. రహీమ్ తన యవ్వనోద్రేకంలో కొంతకాలం వ్యతిరేకించాడు. అయితే శతాబ్దాల నుంచి అనూచానంగా వస్తున్న బానిసత్వం అతని రక్తంలో ప్రవహిస్తోంది. తన తండ్రి క్రూరత్వానికి ఉద్రేకపడినా, సాంఘికాచారాలను, పైతృకాధికారమును ఎదిరించే ధైర్యం లేకపోయింది. కొన్ని రోజులకు ఆ సర్కసు ఆ గ్రామాన్ని, రహీమ్‌ను విడిచి వెళ్లిపోయింది. రాధతో ప్రేమ కూడా అకస్మాత్తుగా ముగిసింది, తన తండ్రి మోసం వలన రామలాల్ అనే మధ్యవయస్కునితో రాధకు పెళ్లి జరిగిపోయింది. రాధ అరడజను పిల్లలకు తల్లిగా కన్నీటితో వెళ్లింది. రహీమ్కూ పెళ్లయింది. ఈ విషయంలో అతని ఇష్టం లేనే లేదు. తన తల్లిదండ్రులే పిల్లను ఎంపిక చేసేరు - ముహూర్తం నిశ్చయించారు - తనకి పెళ్లిబట్టలు తీయించారు - గుర్రం మీద పెళ్లికూతురింటికి తీసికెళ్లారు. ఖాజీ అడిగిన ప్రశ్నలకు రహీమ్ యాంత్రికంగా తల ఊపాడు. తొలి రాత్రి, కసాయివాడి కోసం వేచివున్న మేకపిల్లలా, తనకోసం తన భార్య వేచి వున్న గది ముందు రహీమ్ ఖాన్ నిలిచివున్నాడు. తన తల్లిదండ్రుల మీద, తన కుటుంబం మీద, సంఘం మీద పగ తీర్చుకొనేందుకు భయంకరమైన నిర్ణయాన్ని గైకొన్నాడు. తన జీవితం గురించి తను కన్న కలలన్నీ నిరాశామయమవడానికి వాళ్లందరూ కారణమని తలచాడు. అతని వేదనాపూరితమైన, అతార్కికమైన మనస్సులో, తన భార్యను తను పెట్టే హింసకు గురుతుగా భావించాడు. అప్పటినుంచి అతని మల్లెవంటి మెత్తని, దయగల మనస్సు, ఇనుపరాయిగా మారింది. ఇది ముప్ఫై ఏళ్లనాటి మాట. అప్పటినుంచీ తన భార్యని, పిల్లల్ని, తన ఎద్దుల్ని ఎంతగానో హింసించాడు. గ్రామంలోని ప్రతి వ్యక్తితో పోట్లాడాడు. ప్రజలందరూ తనని అసహ్యించుకొనేట్టు చేసుకున్నాడు. ‘‘అందరిచేతా అసహ్యింపబడుతున్నాను’’ అనే ఆలోచన అతనికి ఎంతో తృప్తినిచ్చేది. ఉత్సాహవంతుడు, దయాపరుడైన యువకుడు. ఒక్కసారిగా మృగంలాగ మారడానికి కారణం ఏమిటాని, గ్రామములో ఒక్కరూ అర్థం చేసుకోలేదు - అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అతనంటే ఏ ఒక్కరికీ దయలేదు. అందరి చేత బహిష్కరింపబడ్డాడు. దుఃఖం అతని హృదయాన్ని ప్రతి నిత్యం కొరుక్కుతింటోంది. అందుకు రహీమ్‌ఖాన్, సంఘమిచ్చిన భార్యపై తన అధికారాన్ని చూపించి ఓదార్పు పొందేవాడు. ఈ ముప్ఫయి ఏళ్ల నుంచీ అతను పెట్టే హింసకు బానిసగా తలవొగ్గింది. ఆమె దీనికెంతగా అలవాటు పడిందంటే ఒక వారం దెబ్బలు లేకుండా గడిస్తే, అసహజమనిపించేటంతగా అలవాటు పడింది. తను అంతగా హింసించే భార్య తన బ్రతుకులో భాగం అని అతడెప్పుడూ అనుకోలేదు. ఆ రాత్రి అతను తినకుండానే నిదురపోయాడు. మర్నాడు ఆలస్యంగా లేచాడు. గతరోజు మిగిలిన చపాతీలు తిన్నాడు. ఇంటికి పట్టిన బూజు దులుపుదామని పొలం వెళ్లడం మానివేశాడు. దులిపేటప్పుడు, ఇంటికప్పులో ఓ పిచ్చుక గూడు కనిపించింది. రెండు పిచ్చుకలు అరుస్తూ దాని చుట్టూ తిరుగుతున్నాయి, ఇవన్నీ చూసి మొదట్లో ఆ గూటిని తీసేద్దామనుకున్నవాడు మానేశాడు. స్టూలు పెకైక్కి అందులో పుట్టి ఒకరోజు కూడా దాటని రెండు పిచ్చుక పిల్లల్ని చూశాడు. తల్లి పిచ్చుక రహీమ్‌ని ఎదుర్కొంది. తమ గూటిని, తమ పిల్లల్ని రక్షించుకోవడానికి ఆ చిన్న పక్షులు చూపే సాహసానికి రహీమ్ ఎంతో అబ్బురపడ్డాడు. ఆ రోజు రహీమ్‌ఖాన్ గుడిసెలో శాంతి రాజ్యమేలింది. మర్నాడు యథాప్రకారంగా దైనందిన జీవితం ప్రారంభమైంది. రోజూ పొలం పనులు చూసుకొని, సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరుకొనేవాడు. మంచంపై పడుకొని, హుక్కా పీలుస్తూ, ఆ పిచ్చుకలను శ్రద్ధగా తిలకించేవాడు. ఆ కూనలు రెండూ ఇప్పుడు పెద్దవయ్యాయి. వాటిని నురు, బుందు అని తన కొడుకుల పేర్లతో పిలుస్తున్నాడు. ప్రపంచంలో అతనికి ఈ పక్షులే బంధుమిత్రాదులు. ఇప్పుడు రహీమ్ తన ఎడ్లను హింసించడం లేదు. ప్రజలకి అతనంటే, ఇప్పటికీ భయమే. ఇప్పటి అతని ప్రవర్తన గ్రామస్తులకు సందేహంగానే వుంది. ఒక సాయంకాలం రహీమ్ ఇంటికొస్తున్న సమయానికి ఆకాశమంతా మేఘాలు దట్టంగా అలుముకున్నాయి, ఆడుకుంటున్న పిల్లలు, ఇతన్ని చూసేసరికి, తమ జోళ్లను కూడా వదిలి పారిపోయారు. ‘‘ఎందుకు పరిగెడుతున్నారు? నేను మిమ్మల్ని కొట్టను’’ అని రహీమ్ పిలిచినా వృథా అయింది. అతను ఇంట్లోకి వెళ్లేసరికి కుండపోతగా వర్షం మొదలయింది. నూనెదీపం వెలిగించి, తన భోజనానికి ముందు పిచ్చుకల కోసమని రొట్టెముక్కలు పెట్టి, ‘‘ఓ నూరూ, ఓ బుందూ!’’ అని పిలిచాడు. అయినా పిచ్చుకలు బయటికి రాలేదు. తన సహచరులకు ఏం జరిగిందోనని గూటిలోనికి ఆతృతగా తొంగిచూశాడు. ఆ నాలుగు పిచ్చుకలు ఓ చోట మునగదీసుకొని వున్నాయి. ఆ గూడు ఉన్నచోట ఇంటికప్పు కారుతోంది. రహీమ్‌ఖాన్ ఒక నిచ్చెన తీసుకొని, ఆ కుండపోత వర్షంలోనే ఆ కారే ప్రదేశాన్ని బాగుచేసేందుకు వెళ్లాడు. పని అయ్యేసరికి అతను పూర్తిగా తడిసిపోయాడు కాని అతనికి ఏదో తృప్తి మిగిలింది. ఖాన్ మంచం మీద కూర్చునేటప్పుడు ఓ తుమ్ము తుమ్మాడు. ఐనా, దాన్ని గురించేమీ పట్టించుకోక నిద్రపోయాడు. మరుసటి ఉదయం రహీమ్ తీవ్రమైన జ్వరంతో లేచాడు. కొన్ని రోజుల నుంచి ఖాన్ పొలం వెళ్లకపోవడం చూసేసరికి గ్రామస్తులు కంగారుపడ్డారు. కొందరు అతనింటికి వెళ్లారు. రహీమ్ మంచం మీద పడుకొని, ‘‘ఓ నురూ, బుందూ! నేను పోయాక మిమ్మల్నెవరు చూస్తారమ్మా?’’ అని అంటూ వుంటే తలుపు కన్నం ద్వారా చూసేరు. ‘‘పాపం, నిర్భాగ్యుడికి పిచ్చిపట్టింది’’ అని రైతులు జాలిగా తల తాటించారు. ఆ రోజే అతన్ని చూసుకొనేందుకు అతని భార్యకు కబురంపారు. మర్నాడు రహీమ్‌ఖాన్ భార్య ఏడుస్తూ తన కొడుకులతో సహా వచ్చింది. తలుపులు లోపల గడవేసి వున్నాయి. గట్టిగా తలుపు కొట్టినా ఎవ్వరూ తీయలేదు. తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు. భయంకరంగా కనిపిస్తున్న రహీమ్ భారీ దేహం నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో నిర్జీవంగా వున్నది. దానిచుట్టూ ఎగురుతున్న పిచ్చుకలు మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, రోదిస్తున్నాయి. ఆంగ్ల మూలం: కె.ఎ.అబ్బాస్ అనువాదం: జమ్ము సత్యనారాయణ -
ఓడిపోయిన సంస్కారం
క్లాసిక్ కథ సుందరమ్మకంతా కలలో వున్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం మొదలైవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లియే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమెకెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే చాలా సిగ్గుపడింది. పునర్వివాహానికి ఆమె మొదట తీవ్రంగా వ్యతిరేకించినా తన యిద్దరి అన్నగార్లూ యెడతెగకుండా చేసిన హితోపదేశాల వల్లా, విధవ ఐన ఈ రెండేండ్లలోనూ తాను గడించిన జీవితానుభవం వల్లా, ఆమె యీ రెండవ పెండ్లికి ఒప్పుకుంది. ఐనా ఒక సంవత్సరం పాటు భర్తతో కాపురం చేసిన తాను సిగ్గు పెండ్లికూతురుగా పదిమందిలోనూ ఎట్లా ప్రవర్తించడమూ అన్న భయసంకోచాలు ఆమె మనస్సును పీడిస్తూనే వుండినాయి. అందువల్ల ఈ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుందని తెలిసినప్పుడు ఆమె సంతృప్తితో నిట్టూర్చింది. తీరా యిప్పుడు చూస్తే ఆ పాత ఆచారాల ఆర్భాటమే మేలనిపించేటట్లుంది ఈ కొత్త వ్యవహారమంతా. పెండ్లేమో పది నిముషాల్లోనే అయిపోయింది. వచ్చిన బంధువులంతా, పురోహితునితో గూడా కలిసి యిరవై మంది కంటే యెక్కువ లేరు. తనకు సిగ్గుపడాల్సిన ఘట్టాలేవీ లేకుండానే పెండ్లి ముగిసిందని ఆమె సంతోషిస్తూ వుండగానే - అంతలోనే ఉపన్యాసాల కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్కరే లేచి పెండ్లికొడుకును అభినందించడం, అతని సంఘ సంస్కరణాభిలాషను పొగడడం, అతని ఔదార్యాన్ని మెచ్చుకోవడం, ఆఖరులో ఆశీర్వదించడం - ఆమెకంతా అయోమయంగా వుంది. సుమారు గంట నుండి ఉపన్యాసాలు సాగుతున్నాయి. ఇప్పటికి ఐదారు మంది మాట్లాడినారు. ఇంకా యెంత మంది మాట్లాడుతారో? విధవను పెండ్లి చేసుకోవడానికి యెవరైనా సిగ్గుపడతారని మాత్రమే ఆమెకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో అదేమీ తప్పుకాదనీ, అందువలననే విధవా వివాహాలు జరుగుతున్నాయనీ ఆమె అనుకుంది. కాని ఇందులో ప్రశంసించవలసిందేముందో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఒక యువకుడు లేచి, అందరూ పెండ్లికొడుకైన రామనాథాన్ని మాత్రమే మెచ్చుకోవడం అన్యాయమనీ, సుందరమ్మ ధైర్య సాహసాలే యెక్కువగా మెచ్చుకోతగినవనీ ఉపన్యాసం మొదలుపెట్టినాడు. ఇదేదో మరీ విపరీతంగా కనపడిందామెకు. ఇందులో ధైర్య సాహసాలేమున్నాయి? జీవితమంతా సుఖపడాలనే ఆశతోనే తానీ పెండ్లికి సిద్ధపడింది. అందులో తన్ను అంత పెద్దగా పొగడవలసిందేముంది? యితరుల కోసం తాను చేసిందేమీ లేదే? ఆ ఉపన్యాసం అయిపోయినంత వరకూ ఆమెకు ముండ్లమీద కూర్చున్నట్లే వుంది. అదృష్టవశాత్తు అది ఐన వెంటనే కాఫీ ఫలహారాల కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత 20 నిముషాల్లోనే ఆమె భర్త గృహం చేరుకుంది. రాత్రి భోంచేసిన వెంటనే పడక గదిలో మంచం మీద కూర్చుంది సుందరమ్మ. భర్త యెటువంటివాడా అని ఆలోచించడానికి పూనుకుంది ఆమె. వెంటనే మూడేండ్లనాడు తనకు కార్యం అయిన నాటి పరిస్థితులకూ ఈనాటి పరిస్థితులకూ వున్న తేడా ఆమె మనసులో మెదిలింది. ఆనాడు తన పెద్ద వదినె తన్నెంతో ఆప్యాయంగా అలంకరించి, గదివరకూ తన్ను పిలుచుకొని వచ్చి వాకిలి దగ్గర వదిలిపెట్టిపోయింది. ఆనాడు భర్త తన కొరకు ఎదురుచూస్తూ వుండినాడు సిగ్గుతో, వుత్సాహంతో, ఉత్కంఠతో. తానానాడు పడక గదిలో ప్రవేశించింది. ఆనాడు వదినెల పరిహాసంతో తన సిగ్గు నూరంతలు పెరిగినా, యేదో అపూర్వమైన సౌఖ్యం. అనంతమైన ఆనందం తన కందబోతున్నదని అర్థంకాని ఉత్సాహం కూడా తన్నావేశించింది. ఈనాడు తనను అలంకరించేవాళ్లూ లేరు. పరిహసించేవాళ్లూ లేరు. ఆ సిగ్గూ లేదు, ఉత్సాహమూ లేదు. ఈనాడు తానేవచ్చి పడక గదిలో భర్త కొరకెదురుచూస్తూ కూర్చుంది. ఈనాడు తనకు కలగబోయే సుఖం యొక్క స్వరూపం తెలుసు. అందువలన ఆనాటి ఉత్కంఠ లేదు. ఆనాడు తన ఉద్దేశాలతో నిమిత్తం లేకుండా యితరులు తన్నొక సుఖసముద్రంలో త్రోసినారు. ఈనాడు తాను బుద్ధిపూర్వకంగా స్వప్రయత్నంతో ఆ సుఖ సముద్రాన్ని సమీపించింది. ఈ సుఖం తాను విధినెదిరించి సంపాదించుకున్న సుఖం. ఇది తన జన్మహక్కు. తన జన్మహక్కు కొరకు యెదురుచూడడంలో సిగ్గుపడవలసిందేమీ లేదు. తన హక్కు లభ్యమైనప్పుడు తానెవ్వరికీ కృతజ్ఞురాలు కానక్కరలేదు. ఈ రామనాథం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఔను - భర్త గుణగణాల మీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే... ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో! మొదట మంచివాళ్లగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినటం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో? తన బ్రతుకంతా యితని స్వభావ సంస్కారాల మీదనే యేర్పడుతుంది. సుందరమ్మకు యింకో విషయం జ్ఞాపకం వచ్చింది. మూడేండ్ల నాడు యిదే పరిస్థితిలో భర్త యెటువంటివాడు అన్న ప్రశ్న తనకు తట్టనేలేదు. ఆనాడు తనకు కలగబోయే సుఖాన్ని గురించే తాను ఊహించుకుంది. తన భవిష్యజ్జీవితాన్ని గురించే గాలి మేడలు కట్టుకుంది. ఆనాడు తన భర్త అందచందాలను గురించైనా కొంతవరకు తనలో తాను వితర్కించుకుంది గాని, అతని స్వభావ సంస్కా రాలను గురించిన ఆలోచనే తనకు రాలేదు. ఈ విషయం జ్ఞాపకం వచ్చి ఆమె ఆశ్చర్యపడింది. వెంటనే కారణం స్ఫురించి తనలో తాను నవ్వుకుంది. పురుషుల స్వభావ సంస్కారాలే స్త్రీ సుఖ సంతోషాలను నిర్దాక్షిణ్యంగా నిర్ణయిస్తాయని ఆనాడు తనకు తెలియదు. ఆనాడు తెలియనివి యీనాడు తనకెన్నో తెలుసు. ముఖ్యంగా స్త్రీలు సుఖపడడానికి పురుషుల ఆకారాల కంటె పురుషుల మనస్సులే ప్రధానం అన్న విషయం తనకు బాగా తెలుసు. అందుకే యీ పెండ్లి ఖాయమైనప్పటి నుండి ఈ ప్రశ్న యెడతెగకుండా తనకెదురౌతూనే వుంది. ఈ రామనాథం యెటువంటివాడు? ఇతని మనస్సు యెటువంటిది? వాకిలి దగ్గర చప్పుడౌతూనే ఆమె తలయెత్తి చూసింది. భర్త కనబడగానే లేచి నిలబడింది. ‘‘సుందరీ! పెండ్లిలో నీకేమీ కష్టం కలుగలేదు కదా?’’ అంటూ రామనాథం ఆమెను సమీపించి, మంచం మీద కూర్చొని, ఆమెను గూడా కూర్చోమన్నట్లు ఆమె భుజం మీద చేయి వేసి బరువుగా నొక్కినాడు. సుందరమ్మ అతని ప్రక్కనే కూర్చుంటూ - ‘‘లేదండీ’’ అన్నది. రామనాథం ఉత్సాహంగా అందుకున్నాడు: ‘‘ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చేయించినాను తెలుసా? నీ మనస్సుకేమీ ఆయాసం కలగకూడదని నేనెంత శ్రద్ధ తీసుకున్నాననుకున్నావ్?’’ ‘‘ఊ’’ అన్నది సుందరమ్మ నిరుత్సాహంగా. రామనాథం మరింత ఉత్సాహంగా అన్నాడు: ‘‘ఊ అనడం గాదు సుందరీ! నీ సుఖం కొరకు జీవితమంతా ధారపోయడానికి సిద్ధంగా వున్నానంటే నమ్ము. ఈ పెండ్లిని గురించి యెంతమంది బంధువులకు దూరమైనాననుకున్నావ్? అంతెందుకూ - రేపు పత్రికలో చూస్తావుగా నేను నీకొరకెంత త్యాగం చేసిందీ.’’ ఇంతవరకూ నేలకేసి చూస్తూ వున్న సుందరమ్మ తలయెత్తి రామనాథం ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో వంచన యెక్కడా కనబడలేదు. అతని కన్నుల నిండా ఆత్మసంతృప్తి తప్ప మరే భావమూ లేదు. ఆమె మెల్లగా అడిగింది: ‘‘నా కొరకు అంత త్యాగం చేయవలసిన పనేముంది మీకు?’’ అది ప్రశ్నగా కాక తన అభిప్రాయం చెప్పినట్లు శాంతంగా చెప్పబోయింది ఆమె. కానీ, మధ్యలో అప్రయత్నంగా కంఠం వణికి అది ప్రశ్నగా ధ్వనించింది. తనకు తెలియకుండానే తనలో కలిగిన ఆవేశానికి సిగ్గుపడి ఆమె మళ్లీ తలవంచుకుంది. రామనాథం యివన్నీ గమనించకుండానే వెంటనే జవాబు చెప్పినాడు. ‘‘అదేం మాట సుందరం? మానవులన్న తర్వాత ఆదర్శాల కొరకు త్యాగం చెయ్యకపోతే యెట్లా? నీబోటి యువతులందరూ నిష్కారణంగా జీవిత సౌఖ్యాలకు దూరమై ఉసూరుమంటుంటే మన సంఘం బాగుపడేదెట్లా?’’ సుందరమ్మ మౌనంగానే వుంది. అతని మనస్సును అర్థం చేసుకోడానికి ఆమె ప్రయత్నిస్తూ వుంది. ఈ మనిషికి నన్ను సుఖపెట్టాలని యింత తాపత్రయమెందుకో? తాను సుఖపడాలనే ఆశ యితనికే కోశానా లేదా? ఆమె ఆలోచనల్ని రామనాథం సాగనివ్వలేదు. రెండు చేతులతోనూ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని అతనన్నాడు: ‘‘యిటు చూడు సుందరం, యీ పెండ్లి కాకుండా వుంటే నీ జీవితమంతా యెట్లుంటుందో ఊహించుకున్నావా? నేను త్యాగం చెయ్యకపోతే నీ బ్రతుకులోని చీకటంతా తొలగిపొయ్యేదెట్లా?’’ అతని కన్నుల్లోకి చూస్తూ వున్న సుందరమ్మ కనురెప్పలు వాల్చి విచారంగా చిరునవ్వు నవ్వింది. రామనాథం ఆమె చిరునవ్వు మాత్రమే చూసినాడు. ఆ చిరునవ్వులోని విచారాన్ని గమనించే స్థితిలో లేడు అతను. ‘‘చూడు - యిప్పుడు నీ బ్రతుకంతా వెన్నెల అయింది. నా త్యాగమంతా నీ చిరునవ్వు రూపంలో ఫలించినందుకు నాకెంత ఆనందంగా వుందనుకున్నావ్’’ అని అన్నాడు సంతృప్తీ, సంతోషం నిండిన కంఠంతో. సుందరమ్మకు ఒక్కసారిగా భవిష్యత్తంతా అంధకారమయమైంది. ‘‘ఇంత త్యాగం జీవితమంతా మోసే శక్తి నాకు లేదు’’ అని బిగ్గరగా అరవాలనుకుంది. ఆమె దిగ్గున లేచి నిలబడింది. అంతలోనే తన అసహాయత మెరుపు వలె ఆమె మనసులో తోచింది. కండ్లు తుడుచుకుంటూ రామనాథం పాదాల దగ్గర నేలమీద కూర్చొని, ‘‘మీ త్యాగానికి తగిన యోగ్యత నాకు కలిగేటట్లు ఆశీర్వదించండి’’ అని గద్గద కంఠంతో పలికింది. - రాచమల్లు రామచంద్రారెడ్డి -
సంధ్యాసమయం
క్లాసిక్ కథ మాకు వివాహమైన ఆ మరుసటి రోజునుంచే, నేను ఆమె కలిసి ఒకసారి బొంబాయి వెళ్లి రావాలని నా భార్య చెప్పసాగింది. అక్కడే ఆమె మాతామహుడు, మాతామహి ఉన్నారు. పెద్దతనం మూలాన వాళ్లు బెంగుళూరులో జరిగిన మా వివాహానికి రాలేకపోయారు. అందువల్ల మేమైనా తప్పకుండా వాళ్లని చూసి, వాళ్ల ఆశీస్సులు పొంది రావాలని మా శ్రీమతి అభిలాష. నాకూ అభిలాషగానే వుంది. డెబ్భై అయిదేళ్లు దాటిన వారంటే నాకెప్పుడూ అభిమానమూ ఆకర్షణా ఉండేవి. ప్రత్యక్ష పోటాపోటీలు వాదోప వాదాలంటే నాకు భయం. అందువల్ల వాటికి ఒదిగి సంచరించే నా స్వభావం ఒక కారణం కావచ్చు. సమవయస్సు వారితోనే - అంతెందుకు సొంత సోదర సోదరీమణులతో కూడా - పోటీలు, ఈర్ష్యలు, అభిప్రాయ భేదాలు కలుగుతూవుండడం వల్ల సుహృద్భావపూరితమైన సంబంధానికి విఘాతం ఏర్పడుతున్నది. కాని నా కంటె ముప్పయి అయిదు, నలభైయేళ్ల పెద్దవాళ్లతో నాకెలాంటి స్పర్ధ లేదు. విరోధమూ లేదు. తమ కాలపు ధోరణులకూ విలువలకూ సాధకంగానూ, వర్తమానకాలపు ధోరణులకు బాధకంగాను వీళ్లు మాట్లాడుతుంటే, నా తరానికి చెందిన విజయ సాధకుల తలమీద మొట్టికాయలు మొట్టినట్లుగా కనిపిస్తుంది నాకు. అది నాకెంతో సంతోషం కలిగిస్తుంది. కాని మా బొంబాయి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి గత సంవత్సరానికి మా వివాహమై దగ్గర దగ్గర అయిదేళ్లు కావస్తుంటే - మేము బొంబాయి వెళ్లాము. ఆ వృద్ధులు సహజంగానే మరీ వృద్ధులయ్యారు. మేము బొంబాయి వెళ్లేటప్పటికి తాతగారికేమో తొంభై తొమ్మిదేళ్లు; అవ్వగారికేమో దాదాపు డెబ్భై నాలుగేళ్లు. వి.టి., మరీన్డ్రైవ్, మలబార్ హిల్స్ ప్రాంతాలతో పోల్చి చూస్తే, డొంబివిలీ-అంటే ఆ వృద్ధులు నివసించే ప్రాంతం - ఎనభై ఒకటిలోనూ గ్రామంగానే కనిపించింది. ఆ వృద్ధులకు మా శ్రీమతి తల్లితో కలుపుకుని నలుగురు కుమార్తెలు; ఒకే పిల్లవాడు. ఈ పిల్లవాడు సకుటుంబంగా మలబార్ హిల్స్‌లో ఒక ఆధునిక ఫ్లాట్‌లో కాపురముంటున్నాడు. తల్లిదండ్రుల్ని తనతోపాటే ఉండమని ఆయన పిలుస్తున్నాడట. కాని తాతగారు డొంబివిలీ విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదట. ఈ అయిదేళ్లలో నా భార్య ఆ వృద్ధుల్ని గురించి వివరంగానే చెప్పింది. వాళ్ల తాతయ్య ఆ కాలపు నిక్కచ్చి మనిషి అట; ఆయన్ని చూసి అందరూ గజగజ వణికిపోయేవారట, ఆఫీసులోనూ ఇంట్లోనూ కూడా. రైల్వేలో స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాడు. నిర్వహణ యంత్రాంగాన్ని రాజకీయవాదులు దిష్టిబొమ్మగా తయారుచేసిన యీ రోజుల్లో జెనరల్ మేనేజర్లకు కూడా గౌరవం కాని మర్యాద కాని లేదు. కాని ఆ రోజుల్లో, అంటే ఇంగ్లీషువాడి రోజుల్లో అన్నమాట, మామూలు సూపరింటెండ్లకు కూడా ఆత్మాభిమానమూ హోదా ఉండేవట. (అని వాళ్ల తాతయ్య చెప్పినట్లుగా నా భార్య చెప్పింది). సమర్ధుడైతే దొరలతో సరిసమానంగా సంచరించే అవకాశం ఉండేదట. ఇలాంటి అవకాశాలు పొందినవాడట ఆ తాతగారు. అందువల్ల డిపార్టుమెంటే తనకు నమస్కారం చేసేలా ఆయనవల్ల వీలయిందట. ఆయన యింటి పనులన్నీ కూడా వుద్యోగులే సలాం పెడుతూ వచ్చి చేసి వెళ్లేవారట. ఇంక చెప్పాలా? ఇంట్లోనూ ఆయన ఒక నియంత... ఆమె అవ్వగారు కూడా మన పరంపరాగతమైన ప్రత్యేకతల్ని యింకా సరిగా తెలుసుకోలేని స్త్రీత్వపు ఉత్తమ ప్రతినిధి. సూటిగా వెళ్లే రకం. సూక్ష్మబుద్ధి, వివేకం కలది. వాటికి తోడుగా సహనం కలది. గృహకృత్యాలు, బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తూ వచ్చింది ఆవిడే. ఈ విషయంలో తాతగారు పెద్ద జీరో. ఉన్నట్టుండి కోపం తెచ్చుకోవడం, మండిపడడం, ఇంట్లో సామాన్లు ఎడాపెడా విసిరివెయ్యడం ఆయనకి మామూలు. తమ నలుగురు కుమార్తెలకు (మా అత్తగారితో సహా) వివాహాలు జరిగింది ఆవిడ వల్లనే; ఆమె చాలామంది స్నేహితురాండ్ర వల్లనే. తాతగారికి అందుకు కావలసిన సామర్ధ్యమో సాహసమో లేదు. (నా భార్య స్త్రీ కావడం వల్ల, తన అవ్వగారిని గురించి కొంచెం ఎక్కువగానే పొగడింది. కేవలం శాంపిల్ మాత్రమే తెలియజేశాను.) కాగా ఆ జూన్ మిట్టమధ్యాహ్నమప్పుడు డొంబివిలీలోని నా భార్య తాతగారి యింటిని సమీపిస్తుంటే నాలో ఒకటే తహతహ. చారిత్రక వ్యక్తుల్ని కలుసుకునే ఒక ఆదుర్దా. అవ్వగారే తలుపు తెరిచారు. క్షణంలో మమ్మల్ని గుర్తుపట్టి ఆహ్వానించారు. ఆ ఆహ్వానంలో ఒక సంకోచం కనిపించింది. దానికి కారణం నేనే అనుకుని బాధపడ్డాను. అవ్వగారికీ మనుమరాలికీ మద్య నేనొకణ్ని అవతరించాను! ఆవిడ ముఖంలో ‘లక్ష్మీకరమైన’ (శుభప్రదమైన) అంటారు చూడండి, అలాంటి కళ. ఊరికే వింత చూసేవారిని స్పందింపజేయని కళ... నేనే కనక మగవాణ్ని కాకపోతే, యింకా కొంచెంసేపు ఆ ముఖాన్ని చూస్తూ వుండవచ్చు; ఆ శోభలో లీనమైపోయి వుండవచ్చు. ఆవిడ మా మూడేళ్ల అమ్మాయిని తనవద్దకు రమ్మని పిలవగా, యిదియేమో బెదురుతూ నన్నే చూడగా, బిస్కెట్లు వెతకడానికి ఆవిడ లోనికి వెళ్లింది. ఆ పాతకాలపు పెంకుటింటిని నేను పైకీ కిందకీ చూశాను. ఆ నాలుగు గోడల మధ్య జరిగిన జీవిత నాటకాన్ని కల్పన చేసుకుంటూ కూర్చున్నాను. నా భార్య, ఆమె తల్లి - యిద్దరూ యీ యింట్లోనే పుట్టారు... ఉన్నట్టుండి నా భార్య ఒక పాత్రతో వచ్చింది. ‘‘డయరీ నుంచి పాలు తీసుకురావడానికి అమ్మమ్మ బయలుదేరింది. నాకు చోటు తెలుసుగదా. నేనే వెళ్లి వస్తానన్నాను. ఇప్పుడే వస్తాను’’ అంటూ నా భార్య వెలుపలికి వెళ్లింది. ఆమెతో పాటు మా అమ్మాయి కూడా బయటికి పరుగెత్తింది. నేనూ ఆవిడా మాత్రమే మిగిలాము. ఆవిడతో మాట్లాడడానికి నాకేవేవో విషయాలున్నట్లుగా అనిపించింది. అయితే దేన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆవిడ కూడా నాతో ఏదో మాట్లాడదలచినట్లు... ‘‘ఈ ఇంజనీర్లంతా వచ్చారు యివాళ...’’ అంది ఆవిడ హఠాత్తుగా. నాకేమీ అర్థం కాలేదు. ‘‘ఇక్కడ లోపల సిగ్నలింగ్ సిస్టం, ట్రాక్ ఎత్తులు వాలు ప్రదేశాలు అవన్నీ సరి చూసి, కొత్త సాధనాలు సిఫారసు చెయ్యడానికి ఫారిన్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు...’’ ‘‘ఓ!’’ అన్నాను. అవ్వగారు ఇంగ్లీషు మాటలు బోలెడు అనాయాసంగా వాడడం నాకు ఆశ్చర్యం వేసింది. ‘‘జపాన్‌లో అంతా వేగంగా రైళ్లు వెడుతున్నాయి గదా! అందుకు తగినట్టుగా ట్రాక్, సిగ్నలింగ్ అంతా మాడర్నైస్ చేసి వుంచారు... ఇక్కడ మాదిరిగానా?’’ ఈ విధంగానే ఆవిడ మాట్లాడసాగింది. నాకదంతా సరిగా జ్ఞాపకం లేదు. ఆశ్చర్యంలో మునిగిపోయి నోరు మూసుకుని కూర్చున్నాను. అప్పుడే నా భార్య తిరిగి వచ్చింది. ఆమె రావడంతో ఆవిడ మాట్లాడడం ఆపివేసింది. మేమందరం కాఫీ తాగుతున్నప్పుడు తాతగారు వచ్చారు. పోస్టాఫీసులో ఆలస్యమైపోయిందని క్షమాపణ చెప్పుకున్నారు. ఇంగ్లాండులో ఉన్న తన సహాధ్యాయుడికి ఉత్తరం వ్రాసి వచ్చారట. ‘‘నీకూ కాఫీ కలపనా తాతయ్యా’’ అని అడిగింది నా భార్య. ‘‘నాకు టీయే.’’ ‘‘సరే’’ అంటూ ఆమె లేచింది. కాని, ‘‘నువ్వు కూర్చో, నువ్వు కూర్చో’’ అని ఆయన ఆమెను కూర్చోబెట్టాడు. ‘‘ఇప్పుడు నేనిటువంటి పనుల్లో ఎక్స్పర్ట్నయ్యా. నీకు తెలుసా?’’ అన్నాడు. వంటింటికి వెళ్లి, తానే టీ తయారు చేసుకోసాగాడు. నేనూ లేచి అక్కడికి వెళ్లాను. వెంటనే ఆయన వంటింట్లో టైము మిగిల్చే నిమిత్తం తాను చేసిన కొత్త ఏర్పాట్ల గురించి సంతోషంగా వివరించాడు- తోమి బోర్లించిన పాత్రల నుంచి త్వరగా నీళ్లు కారేందుకు గాను ఏటవాలుగా ఉండే ఒక కొయ్య పలక, పొయ్యిమీద ఎక్కువ కాంతిపడేందుకు ఒక కొత్త లైట్ పాయింట్... ఇదంతా నాకు కొత్తగా కనిపించలేదు. ఈయనేనా నా భార్య వర్ణించిన నియంత అని ఆశ్చర్యపడ్డాను... ఆ రాత్రి మేము బస చేసిన యింటికి (ఇది నా భార్య పిన్నిగారిల్లు, తాతగారి మరొక కుమార్తె) తిరుగు ముఖం పట్టిన తర్వాత, డొంబివిలీ తాతయ్య అమ్మమ్మలు గురించి చాలా విషయాలు తెలియవచ్చాయి. అమ్మమ్మకు చిత్తభ్రమ మొదలయిందట; ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నదట; పాత విషయాలు ఏకరువు పెడుతున్నదట. మునుపు తాతగారో - మరెవరో ఆవిడతో మాట్లాడిన మాటలో లేకపోతే వినిపించేలా మాట్లాడిన మాటలో... ఓ! అలా అయితే ఆవిడ నాతో ఆ రోజు మధ్యాహ్నం మాట్లాడిన మాటలన్నీ... నాకు అదోలా అయిపోయింది. ఆవిడ చదువుకున్నదీ కాదు. అయినా కూడా ఎప్పుడో విన్నది అలాగే ఒప్ప చెప్పుతున్నదంటే మేధావిగా ఉండాలి! ఈ మేధావి తన కాలమంతా వంటింట్లోనే గడిపి వేసింది. ఛీ... ఆవిడ ప్రస్తుత పరిస్థితినీ చిత్తభ్రమనూ యితరులు వర్ణించడమూ నాకు చికాకు కలిగించింది. ఇందుకు మరో అందమైన వివరణ ఉండకూడదా అనిపించింది. ఆ తర్వాత కూడా కొన్ని తడవలు ఆ వృద్ధుల్ని చూడడానికి వెళ్లాము. ఒకసారి తాతగారే భోజన పాత్రల్ని తోమి బోర్లిస్తున్నారు. ఆ రోజు అమ్మమ్మకు ఏమీ బాగోలేదట! తాతగారే వంట చేశారట. ఇంకో రోజు. తాతగారప్పుడు ఇంట్లో లేరు. మమ్మల్ని చూసి అమ్మమ్మ తన ఇంగ్లీషు పాండిత్యాన్ని దులిపి వేసింది. రైల్లో మేము మా ఊరికి ప్రయాణమైనాము. నా భార్యకు ఆ వృద్ధుల జ్ఞాపకం వచ్చింది. ఉన్నట్టుండి ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ‘‘ఏడవకు, ఏడవకు’’ అన్నాను ఓదారుస్తూ. కాని నాకు కూడా ఏడుపు వచ్చేంత పని అయింది. ‘‘తాతయ్య, అమ్మమ్మ - ఆ యిద్దర్లో ఎవరు ముందర పోయినా సరే మరొకరికి ఎంత దుఃఖంగా వుంటుందో! అది అనుకోడానికే బాధగా వుంది...’’ అంటూ మళ్లీ ఏడవసాగింది. నా మనస్సులో ఏదో తళుక్కుమంది. ఇదే సంగతి - అనుకున్నాను. తాతగారూ అవ్వగారూ తమకు తెలియకుండానే తరువాతి వారి మరణానికి తమను సిద్ధం చేసుకుంటున్నారు. తాతగారు అవ్వగారుగా మారిపోయి వంట చేస్తున్నారు. అవ్వగారేమో తాతగారై ఆంగ్లంలో... తాము బ్రతికినన్నాళ్లూ ధరించిన సాంఘిక వేషాల కోసం ఒకరిని చూసి మరొకరు పరితపిస్తున్నట్టుగా కనిపించింది. ఈ వేషాలు కల్పించిన గీతల్ని మచ్చల్ని యిద్దరూ ఒకరికొకరు సానుభూతితో తడవి చూసుకుంటున్నట్టుగా తోచింది. అవ్వగారు తల్లిగా, వంటింటి రాణిగా మెలిగిన పరిస్థితిని తాతగారూ, తాతగారు తండ్రిగా బయట తిరిగే వ్యక్తిగా మెలిగిన పరిస్థితిని అవ్వగారూ గ్రహిస్తున్నట్టుగా కనిపించింది. ఈ భావాన్ని శ్రీమతికి విశదీకరించాలని నాకనిపించింది. కాని వెంటనే ఒక సందేహం - తనకు పవిత్రంగా కనిపించిన దేనిమీదనో నేను ముదురు రంగులు పులిమి పాడుచేస్తున్నానని ఆమె భావించదు గదా! ఆమెతో నేనేమీ చెప్పలేదు. మేము ఢిల్లీ చేరుకున్న రెండు నెలలకల్లా డొంబివిలీ అవ్వగారు కాలధర్మం చేసినట్టుగా కబురు వచ్చింది. వెంటనే నాకు తాతగారు పాత్రలు తోమి బోర్లిస్తున్న ఆ దృశ్యమే స్ఫురణకు వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఆయన్ని గురించి అనుకునేటప్పుడు, మునుపటికంటె ఆయన ఎక్కువగా వంటింట్లోనే మసులుతూ వుండవచ్చుననే స్ఫురిస్తుంది. మరొకటి కూడా స్ఫురిస్తోంది. ఆయన ఆంగ్లం మాట్లాడడం మానివేసి వుండవచ్చు. - కె.యస్.సుందరం (‘మొదట రాత్రి వస్తుంది’ సంకలనం నుండి) -
తుపాన్ రాత్రి
క్లాసిక్ కథ అతణ్ని చూస్తూ ఉంటే అతనో పెద్ద మాటకారిలాగానే ఉన్నాడు. చెప్పిన విషయం చెప్పకుండా చెప్పుకుపోతున్నాడు. ఇంట్లోంచి కాఫీ తెప్పించాడు. తాగుతూ కూర్చున్నాను. అతను విషయం మార్చాడు. తనకు ఉద్యోగం దొరికిన తొలిరోజుల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎలాగైతేనేం చివరికి విశాఖపట్నంలో ఉద్యోగం దొరికింది. ఒక పెద్ద వ్యాపారస్తుడు సముద్రపు ఒడ్డున బీచ్‌రోడ్‌లో వరుసగా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాడు. అతను నన్నక్కడ సూపర్వైజర్గా నియమించుకున్నాడు. మంచి జీతం, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. పని జరుగుతున్న చోటుకు నాకిచ్చిన ఇల్లు చాలా దగ్గర. సూపర్వైజర్ అన్న డిజిగ్నేషన్ నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించేది. కాని అందులోని లోతుపాతులు తెలిసిన తర్వాత, అదే బావుందనిపించింది. కాని మొదట్లో ఉద్యోగం నిలదొక్కుకోవడం కష్టమే అయ్యింది. కాంట్రాక్టరు, రాళ్లు కొట్టేవాళ్లు, వడ్రంగి పనివాళ్లూ అందరూ... అనవసరంగా నేను వాళ్ల పనుల్లో జోక్యం కలిగించుకుంటున్నట్లు బాధపడిపోయేవారు. కాని కొద్దికాలంలోనే ఎవరిని ఎప్పుడు బెదిరించాలో, ఎప్పుడు ఎలా పని చేయించుకోవాలో తెలుసుకున్నాక ఇక ఏమాత్రం కష్టమనిపించలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. అది మీ ఇష్టం. కాని నా అంతటి అదృష్టవంతుడు అసలు దేశంలో ఉన్నాడా అనిపించేది అప్పట్లో - ఎందుకంటే చెప్తాను వినండి. అదృష్టం నంబర్ వన్-సూపర్వైజర్గా నా పని అతి సులభంగా ఉండేది. సామాన్యంగా నా పర్యవేక్షణంతా ఇంట్లో పడుకుని కిటికీ గుండా చేస్తూ ఉండేవాడిని. అదృష్టం నంబర్ టు - నేనూ, నా భార్య అందమైన ఊహా ప్రపంచంలో బతికేవాళ్లం. ఎందుకంటే అప్పటికింకా మా అబ్బాయి పుట్టలేదు. వాడు పుట్టడానికి ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. అదృష్టం నంబర్ త్రీ - మా ఇల్లు ప్రశాంతమైన పరిసరాల్లో అధునాతనంగా ఉండేది. ఇక సముద్రమా? వాకిట్లోకి సరిగా పది అడుగులే. అట్లా అన్నీ కలిసొచ్చాయి. అది నవంబర్ నెల. ఒకరోజు ఉదయమే మామూలు ప్రకారం తొమ్మిదిన్నరకు నిద్రలేచాను. బయటంతా కారుమబ్బులు కమ్ముకుని నల్లగా ఉంది. పనివాళ్లు నాకోసం కాచుకుని ఉన్నారు. విషయమేమిటని తెలుసుకుంటే, ఆ రోజు వాతావరణం బాగోలేదు కాబట్టి పనిలోకి పంపించవద్దని అభ్యర్ధించారు. అలాంటి పిచ్చివేషాలు వేయగూడదని, మాట్లాడకుండా పనిలోకి వెళ్లమని గద్దించాను. కొద్దిసేపటి తర్వాత వీధిలోకి వెళ్లాను. ప్రపంచమంతా స్తంభించినట్లుంది. అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. ఎక్కడా చైతన్యం లేదు. అప్పటికి పది కావస్తోంది. అయినా దుకాణాలు తెరవలేదు. మామూలు రోజు పగటిపూట దుకాణాలు మూసి ఉంచడం విడ్డూరంగా అనిపించింది. ఒక్కసారిగా ఘొల్లుమని గోల వినిపించి అటూ ఇటూ చూశాను. పక్కనే ఉన్న పాఠశాల విడిచిపెట్టారు. పిల్లలందరూ కేకలేస్తూ గేట్లోంచి బయటికొస్తున్నారు. సెలవు దొరికిందన్న సంతోషం కాబోలు! ఒక పిల్లవాడు మాత్రం బరువైన సంచీని బలవంతంగా మోస్తూ ఏడుస్తూ నడుస్తున్నాడు. ఏమైందని నేనా పిల్లవాణ్ని దగ్గరికి తీసుకున్నాను. వాడు ఏడుపుతోనే చెప్పాడు. ‘‘మరండీ... ఈ రోజు ప్రపంచం మునిగిపోతుందాండీ. అట్లా అని మా టీచరుగారు చెప్పారు’’ అని అన్నాడు. నేనింటికి వెళ్లగానే నా భార్య అలాగే చెప్పింది. భయం భయంగా ముఖం పెట్టి వణుకుతున్న గొంతుతో, ‘‘ప్రపంచం ఈ రోజుతో ముగుస్తుందటండీ’’ అని చెప్పి, నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉండబట్టలేక బొలబొలమని ఒక ఖాళీ నవ్వు నవ్వింది. ప్రపంచం అంతమవడం అన్న విషయమ్మీద నేనూ కొన్ని పిచ్చి జోకులు వేసి తనని నవ్వించాను. నిజంగానే ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తే మంచి మంచి చీరెలు ఏరుకుని వెంట తీసుకుపొమ్మని... ఆమెకు సలహా ఇచ్చాను. మిట్ట మధ్యాహ్నానికి చూద్దును కదా సైట్మీద ఎవరూ లేరు. పనివాళ్లంతా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. అంతా నిర్మానుష్యంగా తయారైంది. వాళ్లలా వెళ్లిపోవడం నాకెంతో కోపం తెప్పించింది. ప్రపంచం మునిగిపోతుందన్న వార్త ఎవరు ఎప్పుడు పుట్టించారో గాని, వాతావరణం అందుకు తగినట్లుగానే భయంకరంగా మారిపోయింది. పగలు మూడు గంటలకే అన్ని దిక్కులకు చీకటి వ్యాపించింది. కొబ్బరిచెట్లు హోరుగాలికి నిలవలేకపోతున్నాయి. ఒక్కోసారి కింద ఇసుకను తాకి లేస్తున్నాయి. జానపద కథల్లో దెయ్యాల నృత్యాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి. చల్లని వేళల్లో నాలో కవిత్వాన్ని పుట్టించే సముద్రం అప్పుడు ప్రళయరూపాన్ని దాల్చింది. సముద్రపు నీరు ఎర్రగా మురికి రక్తంలాగా అయ్యింది. ఒక్కొక్క కెరటం ఎత్తులో సగం కొబ్బరి చెట్టంత ప్రమాణంతో ఉంది. ఈ భూమండలాన్ని ఈ క్షణమో, మరో క్షణమో కప్పివేయాలన్నట్లు కెరటాలు ఒకదాని కంటే మరొకటి వేగంతో ఉధృతంగా లేచి పడుతున్నాయి. విపరీతమైన సముద్రపు హోరు మానవ నాశనాన్ని కోరుతున్నట్లుగా ఉంది. నా శ్రీమతి నా పక్కనే చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. తర్వాత ఒంట్లో నలతగా ఉందని పోయి పడుకుంది. ఆమె ఉదయం ఉన్నంత ఉత్సాహంగా లేదు. ముభావంగా, బలహీనంగా ఉన్నట్లు కనిపించింది. దీపం వెలిగించి, ఆమె పక్కనే వెళ్లి కూర్చుని ఆరోజు వార్తాపత్రికలోని వింతల్ని, ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపించాను. ఎలాగైనా ఆమె మనసుకు ఉల్లాసం కలిగించాలని నా ప్రయత్నం. ఆ సమయానికి బయట సముద్రం రాక్షసిలా ఘోషిస్తోంది. ఈదురుగాలి రక్తదాహంతో కేకలేస్తున్నట్లుగా ఉంది. దానికితోడు యింటి కప్పును సమ్మెటలతో బాదుతున్నట్లు వర్షం మొదలైంది. నేను చదువుతున్న వింత వింత వార్తల్ని మా ఆవిడ నిశ్శబ్దంగా వింటోంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా మూలగడం మొదలుపెట్టింది. మరికొంతసేపటికి తనకు నొప్పులు మొదలయినాయని ప్రకటించింది. రాత్రి ఎనిమిదయ్యేసరికి ఆమె పరిస్థితి మరీ విషమించింది. నాకేం చేయాలో తోచలేదు. అంత బాధలో కూడా ఆమెకు నా ఆకలి జ్ఞాపకం ఉంది. వెళ్లి వంట చేసుకొమ్మని సలహా ఇచ్చింది. నిజంగా అప్పటికే ఆకలితో కడుపు కాలిపోతూ ఉంది. వంటింట్లోకి ప్రవేశించాను. పొయ్యి అంటించే ప్రయత్నం చేశాను. నేర్చుకోలేక నేను ఓటమిని అంగీకరించిన విషయాల్లో సైకిలు తొక్కడం, తర్వాత ఈ పొయ్యి అంటించడం ఒకటి. మన ఆడవాళ్లు అంత సులభంగా నిమిషంలో ఎలా పొయ్యి అంటిస్తారోనన్నది నాకు అంతుపట్టని విషయమే! ఈ విషయంలో వాళ్లకు జోహార్లు అర్పించాల్సిందే. పొయ్యి నిండా కట్టెలు పేర్చాను. అగ్గిపెట్టె కోసం వెతికాను. తెరిచివున్న కిటికీ పక్కగా తడిసిన అగ్గిపెట్టె కనిపించింది. ఒకదాని తర్వాత ఒకటి యాభై పుల్లలు గీశాను. ఒక్కటీ వెలగలేదు. అనుకోకుండా యాభై ఒకటవ పుల్ల కాబోలు వెలిగింది. దాంతో పక్కనే ఉన్న పాత దినపత్రిక అంటించాను. అది పూర్తిగా కాలిపోక ముందే వార్తాపత్రిక పేజీలు ఒక్కొక్కటే కాలుస్తూ పొయ్యాను. కాని పొయ్యిలోని కట్టెలు మాత్రం ఇంకా అంటుకోలేదు. నా వేళ్లు అప్పటికే చాలాసార్లు అంటుకున్నాయి. అప్పుడు నాకు అనిపించింది. ఈ ఇళ్లు, దుకాణాలు ఉత్తుత్తగా ఎలా తగలబడిపోతాయో నాకు అర్థం కాలేదు. వంటింటి నిండా పొగ నిండింది. ఊపిరి ఆడడం కష్టమైపోయింది. అప్పటికే కళ్లూ, ముక్కూ పొగను పంచుకున్నాయి. వంటిల్లు విడిచిపెట్టి లోన గదిలోకి వెళ్లాను. ‘‘ఏమైనా తిన్నారా?’’ శ్రీమతి అడిగింది. ‘‘హూ! ఇంకా అది కూడానా? తుపాను వచ్చినా బతికి బయటపడొచ్చు కానీ, ఈ ఆకలితో బతికేట్లులేను’’ అని కోపంతో అరిచినట్లే చెప్పాను. అప్పుడు నాలో పొయ్యి అంటించడం చేతకాలేదన్న ఉక్రోషం ఉంది. అందుకే మూతి ముడుచుకుని కోపంగా కూర్చున్నాను. సామాను గది అంటే మరేదో కాదు, వంటింట్లోనే ఓ మూలకు సామాను గది అని గౌరవప్రదమైన పేరు. పాలు ఉన్నాయనగానే ముఖం బల్బులా వెలిగించుకుని సామాను గదిలోకి వెళ్లాను. ఒక్క గుటకలో పాలు స్వాహా చేసేవాడినే. కాని మళ్లీ ఆలోచించాను. శ్రీమతి పరిస్థితి బాగా లేదు. ఆమెకు ఏ సమయంలోనైనా వీటి అవసరం రావొచ్చు. మరేదైనా తిని కడుపు నింపుకుందామనుకున్నాను. సామాను గదిలోని, కుండలు, బుట్టలు, డబ్బాలు అన్నీ వెతకడం ప్రారంభించాను. ఒక కుండలో మెత్తగా, జిగటగా ఏదో తగిలింది. బహుశా చింతపండు అయివుంటుందని చేయి వెనక్కి తీసుకునే లోపలే వేలికి ఏదో కరిచింది. కంగారుపడి కుండ బోర్లించి చూస్తే అందులోంచి నల్లగా, పెద్దగా, లావుగా ఉన్న తేలు బయటపడింది. దాన్ని చూడగానే పైప్రాణాలు పైనే పోయాయి. కొద్దిసేపటికే మంటలు మొదలయ్యాయి. విషం - ప్రభావం చూపుతోందన్న మాట! బాధతో ఎగిరాను. గంతులేశాను. కిందపడి దొర్లాను. ముందు గదిలోకురికాను. పెనుగాలి ఇంకా తీవ్రమైంది. ముందు గది పైకప్పు పెంకులు కొన్ని ఎగిరిపొయ్యాయి. వర్షపు నీళ్లతో ఇల్లు నిండిపోయింది. నిలుచుండే చోటు ఎక్కడా లేదు. ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునన్నంత ఘోరంగా ఉంది పరిస్థితి. కొట్లాటల్లో విసురుకునే కత్తుల్లాగా ఇంట్లోని క్యాలెండర్లు, పటాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎగిరిపడుతున్నాయి. వీటికి తోడు తేలు విషం! మంటలు, పోట్లు భరించలేకుండా ఉన్నాయి. నీళ్లలోంచి కాళ్లను లాక్కుంటూ శ్రీమతి ఉన్న గదిలోకి వెళ్లాను. ఆ గది కొంత మెరుగ్గా ఉంది. మంచంమీద ఆమె బాధతో మూలుగులతో మెలికలు తిరిగిపోతోంది. నేనక్కడే నిశ్చేష్టుణై్నపోయి నిలబడ్డాను. ఏం చేయాలో తోచలేదు. అవి పురిటి నొప్పులే అని ఆమె స్పష్టం చేయడంతో శపించేద్దామన్నంత కోపం వచ్చింది. లేకపోతే ఇలా పరిస్థితులన్నీ ఒకేసారి విషమించిన రోజే ఆమె ఈ నొప్పులు తెచ్చుకోవాలా? బాధలోనే మధ్యలో చెప్పింది, ‘‘మిమ్మల్ని బాధ పెట్టదలచుకోలేదు గానీ ఏం చేయనూ? తప్పదు - వెళ్లి ఎవరినైనా సహాయం పిలుచుకు రండి.’’ సహాయం..? ఎవరొస్తారు ఇంత రాత్రి తుపానులో? అయినా నాకిక్కడ ఎవరు తెలుసుననీ? అంతా కొత్త. ఇక తప్పదని, లాంతరు ఒక చేత, గొడుగు మరో చేత పట్టుకుని సిద్ధమయ్యాను. వెళ్తున్నట్టు ఆమెతో చెప్పి, చిర్నవ్వొకటి విసిరేసి బయలుదేరాను. మా ఇంటి ముందు రోడ్డు కొంత భాగం చెడిపోయి గుంటలయ్యాయి. వాటిలో సముద్రపు నీరు వచ్చి చేరింది. అక్కడ ఇళ్లు దూరందూరంగా ఉన్నాయి గనుక, మా పక్కింటికి వెళ్లాలంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అందుకు దగ్గరి తోవ వెతుకుతున్నాను. ఇంతలో గాలికి గొడుగు లేచిపోయింది. ఎటు పోయిందో కనిపించలేదు. వెనువెంటే లాంతరు ఆరిపోయింది. నేనిక చీకట్లోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాళ్లతో తోవలోని రాళ్లను పుణుక్కుంటూ పుణుక్కుంటూ చెట్లను, పొదలను తప్పించుకుంటూ నడిచాను. వీటికితోడు వీపులో వెన్నుపూస మీద చల్లని వర్షపునీరు పారుతున్న సంతోషమొకటి. కనిపించని దయ్యాల చేతిలో నలిగిపోతున్నట్లు అనిపించింది. చెట్లు కుడికి, ఎడమకు కొట్టుకుంటున్నాయి. ఈదురుగాలి మృత్యు సంకేతంలా ఉంది. కాళ్లు కోసుకుపోయి రక్తం కారుతున్నట్లుంది. అప్పటికి గాని నేను పక్కింటికి చేరలేదు. అందులో ఒక విదేశీయుడు ఉంటున్నాడు. తను పోలీసు అధికారి. అతని ఇంటిముందు క్రూరమైన పెంపుడు కుక్కలుంటాయని జ్ఞాపకం వచ్చింది. అడుగు వెనక్కి వేశాను. ఆలోచిస్తూ కొద్దిసేపు నిలబడ్డాను. ఆ ప్రాంతానికి నేను కొత్త. ఎవరూ తెలియదు. అసలు ఎవరు ఎక్కడుంటారో తెలియంది ఎవరింటికని వెళ్లడం? ఆకాశంలో మెరుపు మెరిసింది. నా మనసులో కూడా మెరిసినట్లయింది. వెంటనే అక్కడి నుండి కదిలాను. అదే రోడ్డులో మరో పదడుగులు పోతే ఒక డాక్టరుగారిల్లుంది. అతని యింటికి ‘సాగర దృశ్యం’ అనే పేరు కూడా ఉంది. తేలుకుట్టిన వేలు నోట్లో వేసుకుని చీకుతూ పరిశీలించుకుంటే తెలిసిందేమంటే - నేనప్పుడు చిన్నపిల్లాడిలా భోరుమని ఏడుస్తూ నడుస్తున్నాను. మిట్టలూ, పల్లాలూ జాగ్రత్తగా దాటుతూ ‘సాగర దృశ్యం’ అనే డాక్టరుగారి యింటి వరండా చేరుకున్నాను. సుమారు యిరవై నిమిషాలు తలుపు బాదాను. తర్వాత యింటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కేకలు పెట్టాను. అప్పుడుగాని ఒక మూల కిటికీ తెరుచుకోలేదు. అందులోంచి ఒక స్త్రీ కనిపించింది. ‘‘ఎవరు మీరు?’’ అని ఒక పనికిరాని ప్రశ్న వేసింది. నేనెవరో, నా వివరాలేమిటో ఆమెకు అన్నీ ముందే తెలిసినట్టు, నా పేరు చెప్పగానే ఆమె అంతా అర్థం చేసుకోబోతున్నట్టూ! గత్యంతరం లేక నా పేరు, వివరాలు గొంతు పెద్దగా చేసి చెప్పాను. ఆ క్షణంలో నేనెన్ని కష్టాల్లో వున్నానో కూడా టూకీగా చెప్పాను. అంతా బూడిదలో పన్నీరులాగా కొద్దిసేపైన తరువాత ‘‘మీరెవరూ?’’ అని ఆమె మళ్లీ కేకేసింది. నేనూ కేకేశాను బదులు చెప్పడానికి - విపరీతమైన తుపాను చప్పుడులో ఎవరి మాట ఎవరికీ విన్పించడం లేదు. ఒక్కో ప్రశ్న ఆమె రెండు మూడుసార్లు అడగడం, నేను చెప్పడం జరిగింది. కిటికీలోంచి వచ్చిన కొద్ది వెలుగులో ఆమెకు నేనో భూతంలాగా కనిపించి ఉంటాను. వర్షంలో తడిసి ముద్దయిన బట్టలు, బురదైపోయిన కాళ్లూ, చేతులూ, ముఖం నిండా అతుక్కుపోయిన వెంట్రుకలు... నా వాలకం చూసి ఆకలి భరించలేక అడుక్కునే బిచ్చగాడని ఊహించుకుందేమో గాని, గౌరవంగా ఉద్యోగం చేసుకునే పెద్దమనిషి అనుకుని ఉండదు. ఆకలితో ఒళ్లు తేలిపోతున్న మాట నిజమే. చివరికి శక్తినంతా కూడదీసుకుని గొంతెత్తి అడిగాను డాక్టరుగారి గురించి. ఆమె కూడా ఎంతో కష్టపడి బిగ్గరగా అరిచి చెప్పింది. డాక్టరుగారు యింట్లో లేరని, బొంబాయి వెళ్లారని, ఇంటి నిండా బంధువులు ఉన్నారని, అందరూ పడుకున్నారని, వాళ్లంతా లేస్తారేమోనని తను తలుపు తీయలేకపోతున్నానని, ఎంతో మర్యాదగా చెప్పింది. నాకు సాధ్యమైనంత వరకు నేను దయ్యాన్నో, భూతాన్నో కాదని, ఒక కుటుంబీకుణ్నని, ఎంతో విషమ పరిస్థితినెదుర్కొంటున్నానని చెప్పాను. ఆమె కొంత జాలి కనబరిచింది. అయినా అది ఏం చేసుకోను? నాకు డాక్టరుగారు కావాలి. వైద్యం ఏమాత్రం తెలియని ఆమో, గాఢనిద్రలో ఉన్న ఆమె బంధువులో అక్కరలేదు. అదృష్టం బాగుండి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాను. ఒకరిని సహాయం రమ్మన్నాననీ, వాళ్లొస్తున్నారనీ శ్రీమతికి అబద్ధం చెప్పాను. ఆ చిన్న అబద్ధంతో ఆమె ముఖంలో కొత్త వెలుగు కనిపించింది. తర్వాత సముద్రం వైపున్న కిటికీ తెరవమని అడిగింది. అందుకు నేనొప్పుకోలేదు. అప్పటికే ఇల్లు పగుళ్లు బట్టి ఉంది. కిటికీ తెరవడమంటే తుపానుని గదిలోకి ఆహ్వానించడమేనని చెప్పాను. అదే విషయం మేం వాదులాడుకుంటూ ఉండగా వెనక వంటగది అంతా కుప్పకూలిపోయిన శబ్దమైంది. వెనువెంటనే మేమున్న గదిలో ఏదో పేలుడు సంభవించినట్లయ్యింది. మేం తెరవాలా వద్దా అని చర్చించు కుంటున్న కిటికీ ఉధృతమైన గాలికి ఊడిపోయి కిందపడిపోయింది. గదిలోని దీపం ఆరిపోయింది. స్థాణువునైపోయి కుప్పగా కూలబడిపోయాను. లేచి చీకట్లో కిటికీ వెదికి దాని స్థానంలో దాన్ని పెడదామని ప్రయత్నించాను. అది అడ్డంగా ఉంటే పెనుగాలి బారి నుండి కొంతవరకు తప్పించుకోవచ్చని నా అభిప్రాయం. కిటికీని అదిమిపెట్టానే గాని చేతి తేలు మంటల్ని అదిమి పెట్టలేకపోయాను. అదే సమయంలో నన్ను భయకంపితుడ్ని చేసే విధంగా నా శ్రీమతి పెడబొబ్బలు పెట్టింది. కేకలు వేసింది. మంచం మీద లేచి లేచి పడింది. నాకు పిచ్చిలేచినంత పనైంది. ధైర్యంగా ఉండమని, సహించి ఊరుకోమని చెప్పాను. కోప్పడ్డాను. చివరకు అడ్డమైన తిట్లన్నీ తిట్టాను. ఇంతలో కెవ్వుమని శిశువు కేక వినిపించింది. అనాలోచితంగా కిటికీని విడిచిపెట్టి ఆశ్చర్యంగా నిలబడ్డాను. కొత్తగా పుట్టిన శిశువు కేక తుపాను గాలినీ, చీకటిని ఛేదిస్తున్నట్లుగా ఉంది. ఈ జీవం సమాప్తం కాదు. కొత్త జీవం పుడుతూ ఉంటుందన్నట్లుగా ఉంది. ఆయన అకస్మాత్తుగా నిలబడి ‘‘బాబూ ఇలారా’’ అని ఇంట్లోకి కేకేశాడు. కథల్లోలాగా ఆయన అనుభవం ఇంత విచిత్రంగా ఉండటం నాకు గమ్మత్తుగా అనిపించింది. ‘తర్వాత ఏమైంది? అంతటి భయానకమైన పరిస్థితుల్లో ఆ పసివాడు ఎలా బతికాడు?’ ఇలా అనేక రకాల ఆలోచనలు నా మెదడులో తిరుగుతున్నాయి. లోపలి నుండి ఓ చిన్న కుర్రాడొచ్చాడు. ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. వాడి కళ్లూ, వాడి చూపులూ చూడగానే మహాగడుసువాడేననిపించింది. వాడిలో చురుకుదనం, చలాకీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘‘అయ్యా! వీడేనండి! ఆ తుపాను రాత్రి మమ్మల్నాడుకోవడానికి మా ఇంటికొచ్చిన పెద్దమనిషి’’ అని బొలబొలా నవ్వుకుంటూ కొడుకును వొళ్లో కూచోబెట్టుకున్నాడు అతను. తెలుగు అనువాదం: దేవరాజు మహారాజు - ఆర్.కె.నారాయణ్ -
అడవి
క్లాసిక్ కథ మొగుడున్న రోజుల్లో సుందరమ్మకు సమస్యల్లేవు. జీవితాన్ని గురించీ, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించీ ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మొగుడు కన్ను మూయగనే అన్ని సమస్యలూ తనవే అయ్యాయి. మొగుడు పోతూ పోతూ - పెళ్లాం బతికున్నన్ని రోజులూ గడపదాటకుండా కాలుమీద కాలు వేసుకొని తిని బతకడానికి ఆస్తిపాస్తులు మిగిల్చి వుంటే - అది వేరే విషయం. సుందరమ్మ విషయంలో అలా జరగలేదు. అందుకనే సుందరమ్మ హృదయం పని చెయ్య వలసిన సమయంలో మెదడు పనిచేసింది. పట్టుమని పదేళ్లన్నా కాపరం చేయందే కన్నుమూసిన మొగుడి శవం మీదపడి ‘‘నా దారి యేమిటి దేవుడా?’’ అని ఏడ్చింది. దారి అంటూ ఒకటి వుంటే ఆమె ఏడుపు మరోరకంగా వుండేదేమో! ‘‘నారు పోసిన దేవుడు నీరు పోయకపోతాడా వూరుకో తల్లీ!’’ అని వచ్చినవారు ఓదార్చారు. ఆ క్షణం సుందరమ్మకీ అలాగే అనిపించింది. ప్రపంచంలో అందరు ఆడవాళ్లకీ మొగుళ్లున్నారా? అందరికీ ఆస్తిపాస్తులున్నాయా? అందరూ యేదో రకంగా బతకటం లేదా? తను మాత్రం బతకలేకపోతుందా? అనే ధైర్యం కలిగింది. ఆ ధైర్యమే కలక్కపోతే ఆ క్షణాన్నే ఆమె గుండె ఆగిపోయివుండేది. సుందరమ్మకి ఎవరూ లేరు. తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు. భర్త చనిపోయాడని తెలిసి అన్న మటుకు వచ్చాడు. వచ్చిన అన్న అందరిలాగే వేదాంతం చెప్పాడు. రెండు రోజులుండి మూడోరోజు ‘‘వస్తానమ్మా! ఇంటి దగ్గర ఎక్కడి పనులక్కడే వున్నాయి’’ అని ప్రయాణమయ్యాడు. సుందరమ్మ దుఃఖం ఆపుకోలేక బావురుమంది. ‘‘ఊరుకో అమ్మా! ఏడిస్తే పోయినవాళ్లు వస్తారా! ఎలా జరగాల్సివుంటే అలా జరుగుతుంది’’ అంటూ ఓదార్చాడు. పోయినవాని కోసం ఏడ్వడం లేదు. ఉన్న ఒక్క అన్నా చచ్చినవానితో సమానమయ్యాడే అని ఏడుస్తున్నాను అని చెప్పాలనిపించింది. కాని ఏడుపు దిగమింగి ‘వెళ్లిరా’ అంది. సుందరమ్మ వారం పదిరోజుల్లో మామూలు మనిషి కాక తప్పలేదు. అన్నం ముందు కూకున్నప్పుడో రాత్రి పడుకున్నప్పుడో మొగుడు జ్ఞాపకానికి వస్తూనే వున్నాడు. అదో బాధ. అంతకంటే బాధాకరమైంది - ఎలా జీవించడం అన్నది. ఖర్మకొద్దీ తనొక్కతే కాదు, ముగ్గురు పిల్లలున్నారు. ఈ పసిబిడ్డల్ని నెత్తినేసుకొని సంసారం ఎలా యీదడమా అన్నది అనుక్షణం మెదడ్లో తొలుస్తూనే వుంది. ఎంత గింజుకున్నా దానికి సమాధానం రాదు. ఏడుపు వస్తుంది. తనబాధ ఒకరితో చెప్పుకుంటే తీరేది గనకనా? సుందరమ్మ ఒకవైపు యిలా కుములుతూనే వుంది. మరొకవైపు బాకీ ఆసాములు ఇంటిచుట్టూ తిరగడం ప్రారంభించారు. ఎద్దుపుండు కాకికి ముద్దా? వచ్చినవాళ్లు కాస్త పరామర్శించి బాకీ విషయం కదుపుతున్నారు. సుందరమ్మకు ఏం చెప్పడానికి నోరు రాదు, మొగానికి చెంగు అడ్డం వేసుకొని వెక్కి వెక్కి యేడ్చేది. ఎంత బాకీ ఆసాములయినా వాళ్లలోనూ మానవత్వం అంతో యింతో మిగిలే ఉన్నట్లుంది. పోనీ పాపం ఇంకా బాధలో వున్నట్లుంది, ఇంకో నెల ఆగి చూద్దాం అనుకొని వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ వడ్డీ మొదలూ తమకెంత రావాలో చెప్పిపోతున్నారు. సుందరమ్మ అన్నీ లెక్క వేసుకొంది. దాదాపు పదివేలు. మొగుడు పోతూ పోతూ తనకు మిగిలించిందేమిటి? యేడెకరాల మెట్ట, అది అమ్మకానికి పెడితే పదివేలు రావచ్చు. లేదా ధరలు బాగున్నాయి గనుక మరో రెండు, మూడు వేలు ఎక్కువే రావచ్చు. బాకీలు పోను రెండు వేలు, మూడు వేలు మిగిలితే దాంతో జీవితాంతం ఎలా బ్రతకడం? కష్టం సుఖం ఎరిగిన లౌకికుడు ఒకడు సుందరమ్మకు ఈ విషయంలో ఒక సలహా యిచ్చాడు. ‘‘పెద్దవాడు మీ బావ వున్నాడు. ఆయనతోనన్నా మాట్లాడు. ఆయనే యేదో ఒకటి చేస్తాడు’’ నిజమే ఊళ్లో బావగారున్నమాట వాస్తవమే. సుందరమ్మ భర్త వున్న రోజుల్లో ఆ అన్నాతమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అన్నాతమ్ముళ్ల మధ్యనే ఆపేక్షలు లేకపోయాక తోటికోడండ్రకు వుంటాయా? సుందరమ్మకీ తోటికోడలికీ కూడా పడేది కాదు. తమ్ముడు పోతే అన్న అందరిలాగే వచ్చి అందరిలాగే వెళ్లాడు. అట్లాంటివాళ్ల దగ్గరికి వెళ్లి సాయం అర్థించటమంటే సుందరమ్మకు మొదట మనస్కరించలేదు. తర్వాత ఆలోచిస్తే వెళ్లడమే మంచిదనిపించింది. తను మగదక్షత లేనిది. పంతాలు పట్టింపులు తనకెందుకు? అనుకుంది. చీకటిపడ్డాక నెత్తిన ముసుగేసుకొని పిల్లల్ని వెంటబెట్టుకొని బావగారింటికి వెళ్లింది. వెళ్లేసరికి బావగారు, తోటికోడలు ఇద్దరూ ఇంట్లోనే వున్నారు. ‘‘ఏమ్మా ఎందుకొచ్చావు?’’ అన్నాడు సుందరమ్మ బావ. సుందరమ్మ, తను వచ్చిన పనేమిటో విడమర్చి చెప్పింది. ‘‘బాకీ ఆసాములు నాలుగణాల వంతో ఐదణాల వంతో తీసుకుంటే, వాళ్ల కొంపలు కూలవు - నా కొంప నిలుస్తుంది. నాకు, నా పిల్లలకు యింత నిలవనీడ దొరుకుతుంది. ఈ విషయంలో మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీకన్నా నాకు అయినవాళ్లు ఎవరున్నారు’’ అంది దీనంగా. ‘‘రామ! రామ. ఇవేం బుద్ధులు సుందరమ్మా? ఫలానా రామకృష్ణ చచ్చి పోగానే, అతని పెళ్లాం బాకీలు ఎగవేసి ఆస్తి అట్టే పెట్టుకుందంటే ఎంత నామర్దా. లోకులు మొగాన ఉమ్మెయ్యరూ?’’ అంది గుక్క తిప్పుకోకుండా తోటికోడలు. ‘‘నీకెవరో బుద్ధిలేనివాళ్లు యిచ్చారు యీ సలహా. అప్పులు ఎగవేయడం, ఐ.పి.లు పెట్టడం మన యింటా వంటా లేదు. ఏది బడితే అది చేయడమేనా? పరువు, ప్రతిష్టా విషయం ఆలోచించన వసరం లేదా?’’ అని బావగారు ఛీ కొట్టారు. సుందరమ్మకి కాళ్లకింద భూమి తొలుచుకుపోతున్నట్లనిపించింది. ఇట్లా జరుగుతుందని వూహించలేదు. ఆ పెద్దమనిషికి పరువు ప్రతిష్టలు పట్టాయి. తన బ్రతుకు తెరువు విషయం పట్టలేదు. ఉన్న ఆస్తి అప్పులవాళ్లు రాబందుల్లా తన్నుకుపోయాక, తను కూలో నాలో చేసుకుంటూ బజార్నపడితే ఆయన పరువు ప్రతిష్టలు ఇనప్పెట్టెలో వున్నట్టు భద్రంగా వుంటాయా? ఛీ ఛీ ఏం మనుషులు! అనుకుంది సుందరమ్మ. సుందరమ్మ యింటికి వచ్చి భోరున యేడ్చింది. బాగా చీకటి పడింది. దీపం కూడా వెలిగించాలనిపించలేదు. అలాగే యేడుస్తూ పడుకుంది. తలుపు దగ్గర యేదో అలికిడి అయినట్లుంటే లేచి దీపం వెలిగించి వాకిట్లోకి వచ్చింది. వాకిట్లో రంగరాజు నిలబడి వున్నాడు. చిత్రం! సుందరమ్మ ఇన్నాళ్లూ మరో బాకీ ఆసామిని మర్చేపోయింది! ‘‘ఏం రాజూ! నువ్వూ బాకీ అడగటా నికే వచ్చావా?’’ అంది సుందరమ్మ. రాజు గతుక్కుమన్నాడు. అసలే నోట్లో నాలుక లేని మనిషి. ‘‘లేదు. చూచి పోదా మని వచ్చాను’’ అన్నాడు నత్తినత్తిగా. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు యేదో అలా అంది కానీ, రాజు పరామర్శించిపోవడానికే వచ్చాడని సుందరమ్మకి తెలుసు. ‘‘చూసేదేముంది నాయనా! దిక్కు లేని దానిగా మిగిలాను’’ అంది కళ్లు వత్తుకుంటూ. సుందరమ్మ కంటతడి చూసి రాజు కంటతడి పెట్టాడు. తన కోసం కంట తడిపెట్టే ప్రాణి ఒకటి వుందని సుందరమ్మకు యిప్పుడే తెలిసింది. ‘‘ఈ పదిహేను రోజుల్నుంచి ఎక్కడ భోంచేస్తున్నావ్?’’ అంది సుందరమ్మ. ‘‘సర్పంచ్గారింట్లో భోంచేస్తున్నా’’ అన్నాడు రాజు. ‘‘పోనీ రేపట్నుంచి యిక్కడికే రారాదూ’’ అంది సుందరమ్మ. ‘‘నా భోజనానికేంలే యిపుడు’’ అన్నాడు రాజు. రాజును సుందరమ్మ భోజనానికైతే పిల్చింది కాని - తన పరిస్థితి జ్ఞాపకం వచ్చి మళ్లీ సంకోచమూ కలిగింది. ఇన్నాళ్ల పరిస్థితీ వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. సుందరమ్మకు మూడేళ్లనాటి విషయం జ్ఞాపకానికి వచ్చింది. రాజును సర్పంచ్ వెంటబెట్టుకుని వచ్చాడు. ఆయన సుందరమ్మ భర్త రామకృష్ణను ‘‘ఒరే రామకృష్ణా! ఈ అబ్బాయిని మనవూరి హైస్కూలుకు టీచరుగా వేశారు. వెనకా ముందూ ఎవరూ లేరట. తిండీ తిప్పల విషయం చూడటానికి మన వూళ్లో హోటళ్లు లేకపోయే! మీ ఇంట్లో యీ అబ్బాయికి అన్నం యేర్పాటు చూడు. పడుకోటానికి స్కూలు వుండనే వుంది’’ అన్నాడు. సుందరమ్మని పిలిచి, ‘‘నా మొగం చూచి అయినా ఈ అబ్బాయికి వండిపెట్టాలి సుందరమ్మా! తప్పదు’’ అన్నాడు సర్పంచ్. పెద్దమనిషి ప్రాధేయపూర్వకంగా అడుగుతూంటే కాదనడానికి సుందరమ్మకు మనసొప్పలేదు. ‘‘అలాగే పెదనాన్నా!’’ అంది. ఆ రోజు నుంచి రాజు తనింట్లోనే భోంచేస్తున్నాడు. తిన్నదానికి ఋణం వుంచుకోకుండా నెలకి అరవై రూపాయలిస్తున్నాడు. అవసరమొస్తే మూడొందలు అప్పుగా కూడా యిచ్చాడు. ఇన్నాళ్లూ రాజుకు అన్నం పెట్టడంలో లాభనష్టాలను బేరీజు వెయ్యలేదు. రాజు యిచ్చే అరవై రూపాయలూ సుందరమ్మకు పెన్నిధిలా కనిపించాయి. రాజు తనింట్లో భోంచేయడం వల్ల అంతో యింతో మిగులుతుంది. తనున్న స్థితిలో అదైనా మేలే, సంకోచిస్తే లాభం లేదు. అందుకని సుందరమ్మ, రాజు లేచి వెళ్తుంటే మళ్లా చెప్పింది. ‘‘రేపట్నుంచి భోజనానికి ఇక్కడికే రా రాజూ!’’అని. రాజు వస్తానన్నట్టు తల తిప్పాడు. బావగారు, తోటికోడలు పెట్టిన చీవాట్లు తిన్నాక, అప్పులవాళ్లతో పేచీ పెట్టుకోవడానికి సుందరమ్మకు ధైర్యం చాల్లేదు. ముందు ముందు ఎలా జరగాల్సివుంటే అలా జరుగుతుంది. లోకులతో మాటలు పడటం యెందుకు? అని భూముల్ని అమ్మకానికి పెట్టింది. చిత్రమేమిటంటే - కొంటామని ఒక్కరూ ముందుకు రాలేదు. భూమి కొనమని ఒకరిద్దరిని తనే ప్రాధేయపడింది. ‘‘చేలో చేను - మీ బావగారు కొంటామంటున్నారు. మేం కొంటే యేం బాగుంటుంది ఆయనకే యివ్వడం న్యాయం’’ అన్నారు వాళ్లు. దోపిడీ చేసేవాళ్లకి కూడా సర్దుబాట్లుంటాయని సుందరమ్మకేం తెలుసు. బావగారు కొంటారంటే మంచిదే అనుకుంది. వెళ్లి ఆయన్నే అడిగింది కొనమని. ఆ మహానుభావుడు కాబట్టీ కాబట్టనట్టు ‘‘ఎనిమిది వేలిస్తాను. ఇష్టమైతే అమ్ము. కష్టమైతే మానుకో. బలవంతం లేదమ్మాయ్’’ అన్నాడు. ఈ స్థితిలో తను యేమి చెయ్యగలదు? కంఠ దగ్ధంగా శోకం ముంచుకొచ్చింది. ‘‘మీ యిష్టం. ఎంత న్యాయమని తోస్తే అంతే యివ్వండి’’ అని తన నిస్సహాయతను వెల్లడి చేసింది. ‘‘న్యాయమైన ధరే చెప్పాను. కావాలంటే నలుగుర్నీ విచారించుకొనే వచ్చి అమ్ము. తొందరేమొచ్చిందమ్మా!’’ అన్నాడు సౌమ్యంగా. ఎవరున్నారు తనకు విచారించటానికి? ఆయన అడిగిన ధరకే ఖాయం చేసింది. బాకీలకు పోను ఒకటి రెండు వేలు మిగులుతాయనుకొంది. అలాంటిది బాకీలకే సరిపోవడం లేదు. బాకీలు నెత్తిమీద పెట్టిపోయిన మొగుడిమీద సుందరమ్మకు కోపం వచ్చింది. ఒకటికి పదిసార్లు మనసులో తిట్టుకుంది. ఇలా సుందరమ్మ మనసులో కుళ్లి చస్తుండగానే మరో సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి రాజు భోజనం చేస్తూ, ‘‘మీ బావగారు ఇకమీదట నన్ను యిక్కడికి భోజనానికి రావద్దన్నారు’’ అన్నాడు దీనంగా ముఖం పెట్టి. సుందరమ్మ యీ మాట విని దిగ్భ్రాంతి చెందింది. ‘‘ఎందుకంటా?’’ అంది కోపంగా. వివరించాల్సిన పనిలేదనుకున్నాడో ఏమో రాజు ఏం మాట్లాడలేదు. ‘‘నేనూ, నా బిడ్డలూ పూటకింత తింటున్నామో లేదో ఎవరికీ పట్టదు. నా మానమర్యాదల్ని గురించి మట్టుకు జాగ్రత్తలు తీసుకుంటారు’’ అని సుందరమ్మ యేడవటానికి మొదలుపెట్టింది. రాజుకు ఇక భోంచెయ్య బుద్ధి పుట్టలేదు. తింటున్న పళ్లెంలో చెయ్యి కడిగి లేచాడు. ఆమెను ఎలా ఓదార్చాలో బోధపడలేదు. యేడుస్తున్న ఆమెను వదిలి, చెయ్యి తుడుచుకుంటూ వెళ్లడానికి కాళ్లు రావటం లేదు. అలాగే స్థాణువులా మంచంమీద కూర్చున్నాడు. ఎంతసేపు చూచినా సుందరమ్మ అలాగే యేడుస్తూ కూచుంది. లాభం లేదనుకొని రాజు వెళ్లడానికి లేచాడు. ‘‘రాజూ!’’ అంది సుందరమ్మ యేడుపు దిగమింగి. రాజు నిలబడి యేమిటన్నట్లు చూచాడు. ‘‘ఇక్కడే పడుకో’’ అంది. రాజు తికమకపడ్డాడు. మనసులో వుండాలనే వుంది. కానీ భయంతో గుండెలు కొట్టుకుంటున్నాయి. ఈ మనిషి తటపటాయింపు చూస్తుంటే వళ్లు మండింది. రాజుకు మొదట్నుంచి తనమీద మనసున్న విషయం సుందరమ్మకు రూఢిగా తెలుసు. ఈమాత్రం తెలుసుకోడానికి పెద్ద అతీంద్రియ జ్ఞానం అవసరం లేదు. ‘‘భయమా?’’ అంది సుందరమ్మ. ‘‘అది కాదు నలుగురికీ తెలిస్తే...’’ అంటూ నీళ్లు నమిలాడు. ‘‘తెలియనీ. యేం చేస్తారో చూద్దాం’’ అంది సుందరమ్మ. రాజు ఇక యేమీ మాట్లాడలేదు. పల్లెల్లో నిప్పు లేకుండానే పొగ వస్తుంది. నిప్పు వుంటే వేరే చెప్పాలా! వారం రోజులన్నా గడవందే ఊరంతా గుప్పుమంది. నిమ్మకు నీరెత్తినట్లు సుందరమ్మ యేమీ లెక్కచెయ్యలేదు. సుందరమ్మ బావ సుందరమ్మను ఇంటి దగ్గరకు పిలిపించి, నయానా భయానా కూడా మందలించాడు. సుందరమ్మ మొండికెత్తింది. ‘‘నా బతుకు నాది. మీకెందుకు బాధ’’ అంది నిర్మొహమాటంగా. దాంతో సుందరమ్మ బావగారు ఇటు నుంచి లాభం లేదనుకొని అటు నుంచి నరుక్కురావడానికి ప్రయత్నించాడు. అంటే రాజును బెదిరించాడు. రాజు సుందరమ్మతో మొరపెట్టుకున్నాడు. ‘‘నాకేదో భయంగా వుంది. మీ బావగారు నా కాళ్లూ చేతులూ విరిపిస్తానంటున్నాడు. యేం చెయ్యను?’’ అన్నాడు. సుందరమ్మకు సహనం చచ్చింది. రాజును చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. ‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’ సమర్థించుకో బోయాడు. ‘‘నోరు మూసుకో! పరాయి ఊళ్లో గవర్నమెంటు ఉద్యోగులు పౌరుషం లేకుండా బతకాలని రాసిపెట్టి వుందా?’’ అని నోటిమీద కొట్టినట్టు మాట్లాడింది సుందరమ్మ. ఇక నోరెత్తి మాట్లాడటానికి రాజుకు ధైర్యం చాల్లేదు. ఇక రెండు మాటలు గట్టిగా అంటే, కంటతడి పెట్టడానికి కూడా సిద్ధంగా వున్నాడు. సుందరమ్మకు జాలి కలిగింది. ‘‘భయపడకు రాజూ! నేనున్నాను’’ అని ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకుంది. తన బాధ్యత రాజు మోయవలసింది పోయి తనే రాజు బాధ్యత మోయవలసి వస్తుందని సుందరమ్మ వూహించలేదు. తీరా ఇట్లా పరిణమించిన తర్వాత చేతులు ముడుచుకు కూర్చుంటే లాభం లేదు. ఏదో చెయ్యాలి. సుందరమ్మకు సర్పంచ్ జ్ఞాపకం వచ్చాడు. ఆయనకు రాజుమీద కూడా అభిమానమే. ఆయన తలచుకుంటే యేమైనా చెయ్యగలడు. సుందరమ్మ సర్పంచ్ ఇంటికివెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ‘‘నా బతుకు నేను బతుకుతూ వుంటే చూడలేక అంతా కళ్లల్లో నిప్పులు చల్లుకుంటున్నారు. మీరు ఊరికి పెద్దలు. మీరు కూడా చూస్తూ ఊరుకుంటే, యే నుయ్యో గొయ్యో చూసుకుంటాను’’ అంది. ఆయన అంతా విని ‘‘నాకు సవాలక్ష పనులు, తలమునకలుగా వున్నాను. తీరిక చేసుకొని నీ విషయం ఆలోచిస్తాను’’ అన్నారు. ఒకవైపు కొంపలంటుకున్నాయి. ఈయనకు తీరిక దొరికేదెపుడోనని సుందరమ్మ భయపడింది. సుందరమ్మ వూహ కరెక్టు కాదు. ఆ రోజే దీపాలు వెలిగించే సమయానికి సర్పంచ్ సుందరమ్మ ఇంటికి వచ్చాడు. సర్పంచ్ తన విషయం మరచిపోనందుకు సుందరమ్మకు సంతోషం కలిగింది. మంచం వాల్చి కంబళీ పరచి కూర్చోబెట్టింది. ముసలాడు మీసాలు సవరించి అసలు విషయం బయటపెట్టాడు. ‘‘మీ ఇద్దరికీ యే భయమూ లేదని హామీ యిస్తాను. నన్నూ ఒక కంట చూడాలి’’ అని. సుందరమ్మ నిర్ఘాంతపోయింది. ఆయనకు, వయసులో తన కన్నా పెద్దదయిన కూతురు వుంది. ఆయన తన్ను కోరుతున్నాడు. గుండెల్లో మంటలు లేచాయి. స్పృహ తప్పి ఎక్కడ పడిపోతానో అనుకుంది. కానీ స్పృహ తప్పలేదు. ‘‘యేమంటావ్?’’ అన్నాడు సర్పంచ్. యేమంటుంది సుందరమ్మ? తలవాల్చి శ్వాస బిగబట్టి - ‘‘సరే’’ అంది. - సొదుం జయరాం