శేషమ్మ | Seshamma story | Sakshi
Sakshi News home page

శేషమ్మ

Published Sat, Feb 13 2016 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

శేషమ్మ

శేషమ్మ

క్లాసిక్ కథ
శేషమ్మకి ఈ లోకంలో ఏ మాత్రమూ ఆనందమూ సౌందర్యమూ కనపడడం మానేసి ముప్ఫై యేళ్లయింది. ఇతరులు నవ్వుతున్నా, తింటున్నా, పాడుతున్నా, ఆమెకి విచారమో లేక, అసహ్యమో కలుగుతుంది. పిట్టల కూతలూ, పిల్లల నవ్వులు కూడా ఆమెని ‘ఇరిటేట్’ చేస్తున్నాయి.
 ‘‘పాడు పిట్టలు - పనిలేదు వీటికి. వెధవ అరుపులూ, గోలలూ, అంతకన్న చస్తేనేం?’’
 ఆమెకి ప్రపంచం దుఃఖమయం, పాపభూయిష్టం, అపవిత్రం.

దీన్నంతా విడిచిపోవాలని, మృత్యువుని తలుచుకుని అందరూ వినేట్టుగా ఆహ్వానిస్తూ వుంటుంది. ‘‘ఆ ఈశ్వరుడు యెప్పుడు దయ తలుస్తాడో, ఎప్పుడు పిలిపించుకుంటాడో, యీ నరకంలోంచి నన్ను!’’
 ఆ ఈశ్వరుడు తన తండ్రిలాగూ, తనని భూలోకమనే అత్తవారింటికి పంపినట్టూ మాట్టాడుతుంది. నాలుగేళ్ల క్రిందట కలరా తగిలినప్పుడు మాత్రం -
 ‘‘ఒరే చస్తానురా. చస్తానురా. డాక్టరేమన్నాడూ? ఆస్పత్రి పెద్ద డాక్టర్ని పిలుచుకురా. ఆ పెరుగు తోడుకుందో లేదో చూచావుటే. మా అమ్మ యెనభై యేళ్లు బతికిందిరా. ఇంత చిన్నదాన్ని నాకప్పుడే యేం చావు? అవునులే ఈ ముసలిముండ చస్తే ఎవరికేం? అందరికీ పీడ విరగడైపోతుంది’’ అంది మళ్లీ.
 
ఆమె మొహాన నవ్వు చూసిన వాళ్లెవరూ లేరు. చిన్నపిల్లలు గంతులేస్తోవుంటే, ‘‘ఈ గంతులెన్నాళ్లు? మీ కాళ్లు విరగా. ఇదేం పోయేకాలంరా. సరిగా కూచుని యాడవలేరూ?’’ అన్నట్టు చూస్తుంది. ఎంత విచారంగా కనపడితే యీ లోకం మీద, యీ మాయమీద ఎంత అసహ్యం కనపరిస్తే, ఎంత సౌందర్యాన్ని ద్వేషిస్తే ఈశ్వరుడికి అంత సన్నిహితురాలూ, ప్రియతమురాలూ అయి వుంటుంది. యీ లోకంలో తన వంటి సన్మార్గులకు కష్టాలు తప్ప యింకేమీ లేవు కనక సుఖపడేవాళ్లంతా దుర్మార్గులే అయి వుండాలి. తను కష్టాల కోసం ఎంత ప్రయత్నించి ఏరుకుంటుందో ఆమెకి తెలీదు.
 
‘‘అదేమిటి ఆ కామాక్షి అట్లా పాడుతోవుంటుంది యెప్పుడూ! దేన్ని చూసుకునీ! మొగుడి వుద్యోగం వూడినప్పుడు తెలుస్తుంది, అమ్మగారి అదిరిపాటు!’’
 ఆమెని ‘‘యెట్లా వున్నారమ్మా!’’ అని అడిగితే యెప్పుడూ ‘‘బాగానేవున్నా’’నని అనలేదు.
 అసలు యీ దేశంలో ఆ మాట అనేవాళ్లే తక్కువ. నిజంగా బాగా వుండేవాళ్లే తక్కువ. బాగా వున్నా కూడ. బాగా వున్నామని తెలుసుకున్నవాళ్లు చాలా తక్కువ. తెలుసుకున్నా, ‘‘బాగా వున్నా’’మని అంటే దిష్టి తగిలి, అదృష్టం మారుతుందని ఆ మాట అనరు. అంతేకాక బాగా వుండడం దోషమనీ, పాపాత్ములే బాగా వుంటారనీ, మూర్ఖులు మాత్రమే బాగా వున్నామనుకుంటారనీ నమ్మకం.
 
‘‘ఏం బాగుండడమమ్మా! కుర్రాడికి నిన్నటి నుంచి జలుబు కదా! ఇంతవరకు కన్ను తెరచి యెరుగడు. ఆవు పాలివ్వడం మానేసింది. మొన్ననేగా మా తాతగారి సవతి తల్లి మేనమామ పొయినాడు. వాడి మనుమడు మూడో క్లాసు తప్పిపోయినాడా! రాచ్చిప్ప చిల్లిపడ్డది. నిక్షేపం లాంటి రాచ్చిప్ప! ఇట్లావుంది మాగతి. ఏమోనమ్మా ఈ కాలంలో అంతా మాయ మాయ రాచ్చిప్పలూ! మాయ మనుషులూ! అవునులే అమ్మా! ఏం శాశ్వతం? ఈ దేహమూ అంతేకద, వూరికే పట్టుకు పాకులాడుతారు గానీ.’’
 
ఈ వాక్యాలే ఏ దేశాభిమాని ఐనా విన్నాడా, అక్కడే మూడు పల్టీలు కొట్టి ‘‘హా భారతమాతా! ధన్యురాలిని. ఇట్లాంటి ఆధ్యాత్మికులైన ముసలమ్మల్ని కన్నావు’’ అని ఆనందంలో మూర్ఛపోతాడు.
 ఎవరన్నా - ‘‘అదీ, ఆ రత్తమ్మ! మొన్న రాత్రి పారిపోయిందటమ్మా!’’ అంటే - శేషమ్మ ‘‘ఛీ ఛీ, అట్లాంటి మాటలు నా చెవిని పడనీకు. నాకెందుకూ? నా రామ నామమేమో, నేనేమో! ఇంతకీ యెవడితో?’’
 ‘‘అక్క యింటికి.’’
 ‘‘ఇంతేనా? పారిపోయిందంటావేం?’’
 
‘‘ఏమో వాళ్లంటే నేనన్నాను.’’
 కొంచెం ఆగుతుంది శేషమ్మ ఇంకా యేమన్నా చెపుతారేమోనని. చెప్పకపోతే -
 ‘‘నాకెందుకమ్మా! కానీ అక్క యింటికి ఎవరు తీసుకెళ్లారూ? ఎవడో మొగాడు వుంటాడు. బాగా చూడమను. వాతలు పెడితే యిద్దర్నీ పట్టుకుని - నాకెందుకులే. వద్దన్నా నాకెందుకు చెపుతావు! అక్క యింటికి వెళ్లిందో, ఇంకెక్కడికి వెళ్లిందో! ఆ అక్క సంగతి తెలుసుగా! దాని షోకులూ, రవ్వల దుద్దులూ - నాకెందుకమ్మా! బండెడు చాకిరీ! చస్తున్నాను.’’
 
‘‘మీ కోడలు పనిచెయ్యదా?’’
 ‘‘అయ్యో దాని చేతులు పువ్వులట, దాని కాళ్లు తామరాకులట!’’
 ‘‘మీ కూతురో?’’
 ‘‘మా కూతురుకి గంపెడు రోగమమ్మా! అదేం చేస్తుంది దాని ముఖం!’’
 ‘‘అట్లానమ్మా! బాగానే తిరుగుతో వుంటుందే!’’
 ‘‘మీ కంటికి అట్లానే కనపడుతుంది. పై పుస్టేగానీ లోపలంతా గుల్ల. ఒకటే ఆయాసం.’’
 ‘‘మరి ఎపుడూ అలా చిరుతిళ్లు తింటే...’’
 
‘‘అయ్యో యేం తింటుంది? అన్నం అసలే తినదు. ఆ చిరుతిళ్లు కూడా లేకపోతే ఎట్లా?’’
 ‘‘మా కూతురమ్మా, మా సుబ్బలక్ష్మి! దానికొక్కరోజు జబ్బు చెయ్యదు కదా!’’
 ‘‘చెయ్యకేమమ్మా! అట్లా తిరిగేవాళ్లు గభాలున పడతారు. మా మామ మనుమడు అంతే, పిడిరాయి లాగు-’’
 శేషమ్మ ప్రపంచం పనీ, ఆచారమూ. తెల్లవారకట్ట నాలిగింటికి లేచి, రాత్రి పదకొండింటి వరకు (మధ్యాహ్నం రెండు గంటలు విశ్రాంతితో) పనిచేయడం, ముప్పై యేళ్లనించి, ప్రతి దినమూ ఆ విధంగా పనిచేస్తోంది.
 
ఆమె పని చేసినంతసేపూ, ఆమె నోరు పనిచేస్తోవుంటుంది, మాటలతో తిట్లతో. తెల్లవారకట్టే రాత్రి అల్లరి చేసిన పిల్లుల్నీ, యెలకల్నీ తిట్లు, తరవాత పదింటిదాకా దాసీదాన్ని తిట్లు, అల్లరి చేసే పిల్లుల్నీ కాకుల్నీ తిట్లు. కానీకి వీశడు బీరకాయ లివ్వని కూరలదాన్నీ, మజ్జిగదాన్నీ, తిట్లు. ఈ ముపై యేళ్లలోనూ ఒక్కరోజు కూడా చిక్కని మజ్జిగ పొయ్యలేదు కదా, పుచ్చుపోని కూరలివ్వలేదు కదా?
 
మధ్యాన్నించి యిరుగు పొరుగు వాళ్లనీ, కోడల్నీ, కొడుకు అనాచారాన్నీ కృతఘ్నతనీ, దేవుణ్ని, పిచికల్నీ, తోవన పొయ్యేవాళ్లనీ తిట్టుకోవడం ప్రారంభిస్తుంది. పని చెయ్యకుండా వుండలేదు. అదే ఆమె మతం, ఆమె శరీరమే పనిచేసే మర అయిపోయింది.
 ఆమె ‘ఇంటెలిజిన్స్’ ఎప్పుడో మానింది పని చెయ్యడం. ‘రొటీన్’ తప్ప ఇంకేమీ ఆమె చేతకాదు. ఒక్కరవ్వ ప్రోగ్రామ్ మారిందా యిల్లు పడుకుంటుంది. అంట్ల శుభ్రం, యిల్లు కడగడం, పేడ చల్లడం, మెతుకులూ, ఎంగిలీ మైల మైల అని అరవడం యిదే బతుకు? ఒక కొత్తపనీ, కొత్త యోచనా రెండూ ఆమె చేతకాదు, గానుక్కి కట్టిన యెద్దు నయం.
 
అందువల్లనే మార్పు అంటే గుండెలు పగిలి చస్తారు. బెత్తం లేకుండా పాఠం చెప్పమంటే, ముసలి స్కూలు మాష్టరికి యెట్లా వుంటుందో, యింగువ లేకుండా వంట చెయ్యటమంటే ఆమెకట్లా వుంటుంది. టేపు లేకుండా పని చెయ్యమంటే తాలూకా గుమాస్తాకి యెట్లా వుంటుందో మడి కట్టుకోకుండా వండమంటే ఆమె కట్లావుంటుంది. ప్రపంచం ముక్కలైనా ఆమెకి ఆశ్చర్యం కలగదు. ఇంత పని యిన్నేళ్లు చేసిందా యెవరికా వుపయోగమంటే యేమీ కనపడదు.

అందరూ ఆమెని చూసి విసుక్కునేవాళ్లే గాని కృతజ్ఞత కనబరిచేవాళ్లు లేరు. నలుగురికి భోజనం పెడుతోంది. తను తింటోంది. ఇంటిని మురికి చేస్తుంది, ఎందుకు? కడగడానికి. కడగడమెందుకు? మళ్లీ మురికి చెయ్యడానికి. అంతకాలం వంట చేస్తే మూడు వందల మందికి భోజనం పెట్టవొచ్చు వొక మనిషి. స్వర్గంలో అంట్లు తోమడమూ, బట్టలారవెయ్యడమూ లేకపోతే యేం చేస్తుందో యీ మనిషి!
 
పాపం, ఏ కొత్త కాంతినీ, ఆశనీ, ఆనందాన్నీ, కోర్కెనీ, అన్నిటినీ త్యజించి, ఆ వంటిల్లే తన ప్రపంచంగా తన బాధే తన ఆనందంగా, తన చేతికి చిక్కిన అయిదారుగురు దాసీలతో సహా, తన నోటి తీటను తృప్తిపరచగల సాధనాలుగా, తన ఆచారాన్నీ, తులసికోటని చూసుకుని గర్వపడి బతుకుతోంది. భూకంపాలు రానీ, దేశాలు దేశాలు తగలపడనీ, సామ్రాజ్యాలు పడిపోనీ, ఆమెకేమీ సంబంధం లేదు. తన యింటికి వంద గజాలు దాటి ఆమె మనసు పనిచెయ్యదు.
 
కాపురము, పిల్లలు, ప్రేమ, ఏమీ లేక తనది, స్వంతంగా తనది అనే ఆస్తిగాని మనిషి గాని లేక, క్రమంగా క్రమంగా మనసు మోడైపోయి నిలిచింది ఆమె. ఇంకే ఆసక్తీ లేక ఆ పాత పురాణాలలో విన్న అక్కడక్కడి వచనాలని పట్టుకుని, వాటి వాస్తవత్వం పైన తన ఆత్మ పురోభివృద్ధిని ఆధారంగా చేసుకుని కన్నంలో యెలిక వలె బతుకుతోంది. ఎవరికైనా ప్రేమించడం కన్నా ద్వేషించడం సులభం. ప్రేమ మనిషిని తన స్వంతంగా చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ పేద వితంతువు స్వంతం కావడానికి ఎవరంగీకరిస్తారు?

తన కోడలికి ఒక్కొక్క బిడ్డే పుడుతోవుంటే తన స్వంతం చేసుకోవాలని చూసింది. ఆ తల్లి ప్రతి నిమిషమూ జ్ఞాపకం చేసేది ఆ పిల్ల తనదని - చూపుచాతా, నడవడిచాతా. ఆ పిల్లలే మూడేళ్లు రాగానే అందరి కన్న లోకువ గనక కర్రలు తీసుకుని బాదేవారు ఆమెని. ప్రేమ లేక, సంతోషం లేక, జీవితంలో ఇంటరెస్టు లేక, తను ఏ బాధపడ్డా కరుణించేవారు లేక, తిట్లలో తన ఆనందాన్ని సార్థకం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది.

ఇట్లా ఎందరు యీ దేశంలో యిట్లా కొయ్యబారిన ఆత్మలతో తమ జీవితాన్నీ యితరుల జీవితాల్నీ క్షోభపెట్టి చివరికి మృత్యువులో తప్పించుకునే స్త్రీలు! కానీ మృత్యువులోనైనా తప్పించుకుంటారా? వాళ్ల జన్మలో వుందా యీ లోపం? వాళ్లనిట్టా చేసిన సంఘం పరిస్థితులలో వుందా? వాళ్లు సంఘాన్నిట్టా ఎండపెడుతున్నారా, సంఘం వాళ్లని కొయ్యల్ని చేస్తోందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement