జలపాతం గట్టున... | Somu as Classic story | Sakshi
Sakshi News home page

జలపాతం గట్టున...

Published Sat, Apr 9 2016 11:55 PM | Last Updated on Mon, Oct 22 2018 8:57 PM

జలపాతం గట్టున... - Sakshi

జలపాతం గట్టున...

క్లాసిక్ కథ
ఈ సంవత్సరాంతంలో ఎదురుచూడని ఒక మంచి ఉత్తరం వచ్చింది మాకు. అది ఎంతో సంతోషం కలిగించింది. జన్మస్థలం మీది అభిమానమూ, పొదిగై కొండ చరియల మీది సౌఖ్యమూ ప్రతి యేడూ మమ్మల్ని కుట్రాలానికి లాక్కుని వెడతాయి. ప్రతి యేడూ మేమక్కడికి వెళ్లేముందు, మా మిత్రులూ మా కుటుంబ వైద్యులూ అయిన డాక్టరు ముత్తుకుమారస్వామి గారిని సకుటుంబంగా వచ్చి మాతో పాటు కాలం గడపవలసిందిగా కోరుతాము. ఆయనా ప్రతిసారి మా ఆహ్వానాన్ని పెడచివిని పెడుతూ ఉంటాడు.
 
‘‘రెండు నెలలూ మీరు మాతో వుండవద్దు. రెండు వారాలైనా వుండండి’’ అని బలవంతం చేసేవాణ్ని.
 ‘‘అమ్మో! రెండు వారాలే! రెండు రోజులు  కూడా నేనీ చెన్నపట్టణం విడిచిపెట్టి రాలేను’’ అని చెప్పేవాడు డాక్టరుగారు. ముత్తుకుమారస్వామి అలా అనడానికి ప్రబలమైన కారణం లేకపోలేదు. ఈ మహానగరంలో నూర్లకొద్ది డాక్టర్లున్నా ఎడింబరో వెళ్లి ఇంగ్లీషు భాషలోని యిరవై అక్షరాలను తమ పేర్లకు చివర తగిలించుకున్న వైద్యులున్నా, ఈ అరవై ఏళ్ల వృద్ధుడు డాక్టరు ముత్తుకుమారస్వామి వద్దకే రోగులు వెతుక్కుంటూ వెడతారు.

అందులోనూ కోయడం, కత్తిరించడం, అతికించడం, కలిపి కుట్టడం వంటి శస్త్ర చికిత్సలంటేనూ, పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలంటేనూ తప్పకుండా కుమారస్వామి చేతి మీదుగా జరగాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రముఖుల శరీరాలు ముత్తుకుమారస్వామి కత్తికోసం ఎదురుచూస్తూ వుంటాయి. ఆయనకి భోజనం చేసేందుకు కూడా తీరిక వుండదు. ఆయనకి భోజనానికి కూర్చునే సావకాశం కూడా లేదని ఆయన భార్య అంటూ ఉంటుంది.

నిజానికి ఆమె సాంబారూ అవియలూ అన్నంలో కలిపి ఒక పళ్లెంలో ఉంచుతుంది. డాక్టరు నిలబడే భోజనం ముగించుకుని త్వరత్వరగా ఒక శస్త్ర చికిత్స కోసం బయలుదేరుతారు. ఈ దృశ్యం నేను చాలాసార్లు చూశాను. ‘ఇటువంటి డాక్టర్ని రెండు నెలలపాటు రోగుల నుంచి వేరుచేసి, కుట్రాలంలో బంధిస్తే, అంతమంది రోగుల వుసురు మనకు కొడుతుందండి’ అని నా భార్య చాలాసార్లు నాతో చెప్పింది.
 
ఈ డాక్టరు ముత్తుకుమారస్వామిగారి వద్ద నుంచే ఆ అపూర్వ లేఖ వచ్చింది. మేము కుట్రాలం చేరుకున్న రెండు వారాలకు ఆ జాబు వచ్చింది. సంతోషమూ ఆశ్చర్యమూ మమ్మల్ని ఆవహించాయి. సంతోషం ఎందుకంటే, సకుటుంబంగా వచ్చి డాక్టరుగారు మాతో ఉంటామని వ్రాశారు. ఆశ్చర్యం ఎందుకంటారేమో: రెండు నెలలూ మాతో ఉంటామంటూ ఉత్తరంలో వ్రాశారు.
 
2
కుట్రాలంలో మేము బస చేసిన యిల్లు మా బంధువులది. కొండ చరియా గుడిని ఆనుకుని వున్న మిట్టా కలిసే చోటు నుంచి జలపాతానికి వెళ్లే అందమైన బాట చివర, చెట్టు చేమలూ పూల మొక్కలూ దట్టంగా పెరిగిన ప్రదేశంలో ఉంది ఆ యిల్లు. చిన్న జలపాతం నుంచి గలగల పారే చిన్న వాగులలో ఒకటి ఈ యింట్లోకి ప్రవేశించి, యింటినంతా ఒక్కసారి ప్రదక్షిణం చేసి, వెనక వాకిలికి దగ్గరగా వున్న సరస్సు గుండా ప్రవహించి, చివ్వరికి ఒక చిన్న నదిలో కలిసింది. ఇంటిని అలా నిర్మించాడు ఆ గృహ యజమాని.
 
ఇల్లు పెద్దది. దాని చుట్టూ మామిడి, పనస, కొబ్బరి - అలా రకరకాల ఫల వృక్షాలు గల ఒక తోట. ఆ తోట నానుకుని దక్షిణం వైపు ఒక గది వుంది. దానిని దానికి పక్కనే వున్న భాగాన్నీ డాక్టరుగారి కుటుంబానికి కేటాయించాము. ఈ ప్రశాంతమైన గదిలో దక్షిణం వైపు కిటికీని కనక తెరిస్తే చాలు కమ్మని తెమ్మెర వీస్తుంది. రోగాలనూ రొప్పులనూ తరిమివేసే యీ దక్షిణానిలం చాలా ఆరోగ్యకరమైంది. పొదిగై కొండమీది మూలికల మీదుగా, పూల మొక్కల సువాసనలను లీనం చేసుకుని వీచే యీ గాలి ఎక్కడ లేని హాయినిస్తుంది.

పొద్దుటి వేళల, బాలభానుని కిరణాలలో వజ్రాలు చెదిరినట్లుగా జలపాతం తెల్లగా కనిపిస్తుంది. రాత్రివేళ, ఆ తెల్లని వెన్నెట్లో వెండి కరిగినట్లుగా జలపాతం దర్శనమిస్తుంది. డాక్టరుగారికీ గది బాగా నచ్చుతుందని అనుకున్నాము. ఆయన రాకకోసం మేము ఎదురు చూడసాగాము.
 
డాక్టరుగారు తమ భార్యతోనూ, ఢిల్లీలో ఉద్యోగం చేసే కొడుకుతోనూ, మదరాసులో మేరీ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే కూతురితోనూ వచ్చారు. వాళ్ల రాక మాకెంతో సంతోషం కలిగించింది. డాక్టరుగారి కొడుకూ కూతురూ జలపాతం వద్దకు వెళ్లి స్నానం చెయ్యడం, ఆకలితో ఇంటికి తిరిగి వచ్చి, దోసెలు తిని మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం, మళ్లీ యింటికి వచ్చి తిరునెల్వేలి ‘ఆనైకొంబన్’ (శ్రేష్ఠమైన వరి జాతి) అన్నంలో పులుసు పోసుకుని భోజనం చెయ్యడం, మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం - ఇలా కుట్రాలం జీవితాన్ని బాగా అనుభవించసాగారు.

డాక్టరుగారి భార్య మొదటి రెండు మూడు రోజులు పొద్దుటిపూట జలపాతంలో స్నానం చెయ్యడం, మిగిలిన వేళల్లో ఆడవాళ్లతో కలిపి తెన్ కాశి, సెంగోట - మొదలైన ఆ చుట్టుపక్కల వూళ్లకు వెడుతూ హాయిగా కాలం గడపసాగింది. ఆ తర్వాత ఒక చిక్కు యేర్పడింది ముత్తుకుమారస్వామి వల్ల. అవును. కుట్రాలానికి వచ్చిన ఆ రోజే డాక్టరులో ఒక మార్పుని చూశాడు.

ఎప్పుడూ నలుగురితో గలగలమంటూ నవ్వుతూ మాట్లాడే డాక్టరిప్పుడు మూగనోము పట్టాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. పొద్దునపూట జలపాతంలో స్నానం చేసేవాడు. తర్వాత ఫలహారం చేసి గదిలోకి వెళ్లేవాడు. అంతే. మధ్యాహ్నం భోజనానికి ఆయన్ని పిలవాలి. అంతవరకూ ఆయన ఆ గదిలోనే ఒంటరిగా కూర్చునేవాడు. బయటికి వచ్చేవాడు కాదు. ఆ తర్వాత సాయంకాలం నాలుగింటికి చేతికర్ర తీసుకుని జలపాతం బాట వెంబడి గాని, లేకపోతే చంపకాటవి వైపుగా గాని ఒంటరిగా? నడిచి వెళ్లేవాడు. మాట వరసకైనా తోడు రమ్మని ఎవ్వరినీ పిలిచేవాడు కాదు. చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది చూచి నేను చాలా ఆశ్చర్యపోయాను.
 
నాలుగైదు రోజులు గడచిన తర్వాత నా ఆశ్చర్యం మరీ ఎక్కువయింది. ఒకరోజు జలపాతం వద్ద నుంచి వచ్చి, ఫలహారం చేసి, మళ్లీ బయటికి వెళ్లాడు. చేతిలోని అల్యూమినియం పెట్టెలో ఒక దోసె మడిచి పెట్టుకున్నాడు.
 ‘‘ఇవాళ నేను కొండమీద కొంచెం దూరం వెళ్లి వస్తాను’’ అని వెళ్లిన మనిషి సాయంకాలం బాగా చీకటిపడ్డ తర్వాత గాని ఇంటికి తిరిగి రాలేదు.
 
ఒక వారంపాటు ప్రతిరోజూ డాక్టరు ఒంటరిగా ఎక్కడికో వెళ్లి చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది డాక్టరుగారి భార్యకు విచారహేతువయింది. ఒకరోజు ఆమె మాటల సందడిలో తన విచారహేతువుని వివరించింది.
 రాజస్థాన్ నుంచి తమిళనాడుకి వచ్చిన ఒక కళాకారుల బృందం తలవని తలంపుగా భయంకరమైన రైలు ప్రమాదానికి పాల్పడడం, ప్రభుత్వం ఆసుపత్రిలో వాళ్లకు డాక్టరు ముత్తుకుమారస్వామి కొన్ని ముఖ్యమైన చిక్సితలు చేయడం మొదలైనవాటిని గురించి నేను కుట్రాలానికి వచ్చిన మరునాడు పత్రికా ముఖంగా తెలుసుకున్నాను. ఈ చికిత్సల తదనంతరం డాక్టరుగారి వైఖరిలో ఏదో ఒక మార్పు ఏర్పడిందని ఆయన భార్య ఇప్పుడు చెప్పింది.
 
‘‘బాబూ! ఆ రోజు మొదలుకొని మీ డాక్టరుగరు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడం మానివేశారు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించేవారు. కుట్రాలానికి వెడదామని ఆయన చెప్పడం కూడా ఈ మార్పు ఫలితమే. మొదట్లో నేను ఆశ్యర్యపోయాను. కాని కుట్రాలానికి వచ్చిన తర్వాత, ఈ మార్పూ మౌనమూ తగ్గిపోతాయని అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా ఆయన ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఆయన ఏకాంతంగా వుండడం, కొండలకూ కోనలకూ వెళ్లడం చూస్తుంటే నాకేదోలా ఉంది. మీరు కొంచెం ఆయన్ని కనిపెట్టుకుని వుండండి’’ అంది డాక్టరుగారి భార్య.
 
3
ఒకరోజు డాక్టరుగారిని అనుసరించి వెళ్లాను, ఆయనకు తెలియకుండా. చేతికర్రను టక్ టక్‌మని నేలమీద మోపుకుంటూ గబగబా నడిచి వెడుతున్నాడు డాక్టరు. వంపులు తిరిగిన దోవ కావడం వల్ల, ఆయన నన్నెక్కడ చూస్తాడో అని పొదల్లోనూ బండరాళ్ల మధ్యగానూ ఒదిగి ఒదిగి నేను ఆయన వెనకాలే వెళ్లాను.
 మిట్టమధ్యాహ్నం వేళ ఆయన చంపకాటవిని చేరుకున్నాడు. ఒక పొద మాటున చేరి ఆయన్ని నేను పరీక్షగా చూశాను.

చంపకాదేవి ఆలయం పక్కన వున్న కొండ చరియలో అందమైన గుహ ఒకటుంది గదా! గలగలమంటూ కిందికి ఉరుకులు వేసే జలపాతం దగ్గర భగవదనుగ్రహం కోసం నిరీక్షించే భక్తుని నిండు మనస్సులా దర్శనమిచ్చే ఆ గుహ చాలామందికి తెలుసు. ఇంకా కొంచెం పైకి నడిస్తే ఆ ప్రాంతంలో అటువంటి చిన్న చిన్న గుహలు మరికొన్ని కనిపిస్తాయి. ఆ కోవకు చెందిన ఒక గుహలో మన డాక్టరుగారు కళ్లు రెండూ మూసుకుని ఆసీనుడయ్యాడు.
 
తంబురా శ్రుతిని స్ఫురణకు తెచ్చే కొండవాగుల మృదు ధ్వని, ఆ ఆధార శ్రుతిలో తమ వివిధ కంఠాలను మేళవింపు జేసి గానం చేస్తున్న పక్షుల కిలకిల రావాలు, ఆ గానానికి మృదంగం వాయిస్తున్నట్లుగా జలపాతం చేసే సవ్వడీ - మధుర గానంలా వినిపిస్తున్నాయి ఆ కొండ మీద. ఆ గానం వింటూ మైమరచి డాక్టర్ ముత్తుకుమారస్వామి కళ్లు మూసుకున్నాడా? లేకపోతే ఆయన అంతరంగం లోలోపలి వాగురలో చిక్కుకుపోయిందా?
 
పొదమాటు నుంచి బయటపడి తొందరగా నడిచాను.
 ‘‘డాక్టర్... డాక్టర్!’’
 సరాసరి డాక్టరు వద్దకు వెళ్లి, ఆయనకెదురుగా కూర్చున్నాను.
 బెదిరిపోయినవానిలా, ఆయన కళ్లు తెరిచాడు. నా రాక ఆయనకు నచ్చలేదు. ఆయన చూపులు తీక్షణంగా ఉన్నాయి.
 ‘‘నన్ను క్షమించాలి డాక్టరుగారూ! మీరిలా యిక్కడ ఒంటరిగా కూర్చోవడం, మాటా పలుకూ లేకుండా మౌనముద్ర దాల్చి మీరు సంచరించడం, చూస్తే మాకందరికీ దిగులుగా వుంది. ఇందువల్ల మీ భార్య కూడా దిగులుపడుతోంది.’’
 
‘‘మీ దిగులుని అర్థం చేసుకుంటున్నాను. కాని నన్ను విసిగించననీ, నా ప్రయత్నాన్ని వారించననీ మీరు కనక మాట యిస్తే మీతో మాట్లాడతాను. లేకపోతే...’’
 ‘‘మిమ్మల్ని విసిగించను. మీరు చెప్పినట్లే మాట యిస్తున్నాను. మీరు చెప్పండి డాక్టరుగారూ...’’ అన్నాను నేను. డాక్టరు చెప్పాడు.
 ‘‘రాజస్థాన్ నుంచి ఒక కళాకారుల బృందం తమిళదేశం రావడం, తలవని తలంపుగా ఆ బృందం వారికి రైలు ప్రమాదం సంభవించడం, వాళ్లను ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్చడం, వాళ్లకు నేను చికిత్స చేయడం, మొదలైనవి మీరు పత్రికలలో చదివే వుంటారు.

ఆ కళాకారుల్లో ముగ్గురికి బలమైన గాయాలు తగిలాయి. వాళ్లకు చికిత్స చేసే బాధ్యత నామీద పడింది. ఇందులో ఒక పెద్ద చిక్కు యేమిటంటే, ముగ్గురిలో ఒకామె స్త్రీ. ఆమెకు కాలు తీసెయ్యాలి. కోసి తీసెయ్యాలి. ఒక యువకుడి కళ్లల్లో గాజు ముక్కలు లోతుగా నాటుకున్నాయి. అందుకు ఒక కంటి డాక్టరు శస్త్ర చికిత్స చేయాలి. అదీ నా పర్యవేక్షణలోనే జరగాలి. మరొకతనికి కుడి చెయ్యి పూర్తిగా తీసివేస్తేనే, అతను బతుకుతాడు. నా సంగతి మీకు తెలిసిందే గదా! శస్త్ర చికిత్స విషయంలో తూర్పు పడమరలు చూస్తూ కాలక్షేపం చేయను. మనుషులు అరటికాయలు, వంకాయలూ అని అనుకునే స్వభావం నాది.’’
 
ఇలా డాక్టరు చెపుతున్నప్పుడు, నాకు ఆశ్చర్యం కలిగింది.
‘‘ఏవిటండీ డాక్టరుగారూ! మీరలా మాట్టాడుతున్నారు? మీరు శస్త్ర చికిత్స కనక చెయ్యకపోతే, మొదటికే మోసమవుతుంది కదా! అందుకని శస్త్ర చికిత్స చేస్తారు. ఇందులో తప్పేముంది.’’
 ‘‘అంతవరకూ, ఆ ముగ్గురికీ శస్త్ర చికిత్స చేసేంతవరకూ, నేనూ అలాగే అనుకున్నాను.’’
 ‘‘ఏం! వాళ్లు ముగ్గురూ బతకలేదా?’’
 ‘‘వాళ్లు బతికారు. అందుకే నేను విచారిస్తున్నాను. చచ్చిపోయివుంటే, యింతగా విచారించి వుండేవాణ్ని కాను’’ ఇలా అంటున్నప్పుడు డాక్టరుగారి కళ్లు చెమ్మగిల్లాయి.
 
‘‘డాక్టరుగారూ! మీరు నన్ను తికమక పెడుతున్నారు.’’
 ‘‘బాబూ! ఆ ముగ్గురు కళకారులకు స్పృహ తెలిసిన తర్వాత, ఆ మరు క్షణంలోనే వాళ్లు పడ్డ బాధను చూసి, నేనెంత బాధపడ్డానో నీకెలా చెప్పగలను? నేను పడ్డ బాధ, పడుతున్న బాధ, పడబోయే బాధ - వీటికి హద్దులేదు. ఎందుకంటే, నేను కాలు తీసివేసిన స్త్రీ రాజస్థానంలో ప్రసిద్ధికెక్కిన నాట్యగత్తె అట! కళ్లు తీసివేసిన ఆ కళాభిజ్ఞుడు ప్రముఖ చిత్రకారుడు.

దయాదాక్షణ్యాలు లేకుండా కుడిచెయ్యి తీసివేసిన వ్యక్తి సుప్రసిద్ధ సారంగి విద్వాంసుడట! రాజస్థాన్ నుంచి వచ్చిన ఆ బృందంలో వీళ్లు ముగ్గురే ముఖ్యులట. నాట్యగత్తెకు కాలే పంచప్రాణాలు; చిత్రకారుడికి కళ్లే ప్రాణం; సారంగి విద్వాంసుడికి జీవితం అతని వాద్యం; వాయించడానికి చెయ్యి-చేతివేళ్లు చాలా అవసరం. వాటినే నేను తీసివేయవలసి వచ్చింది.’’
 
చెప్పడం పూర్తయిందో లేదో ఆయన కళ్ల వెంబడి ధారగా కన్నీళ్లు జారాయి. ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు.
 ‘‘నాయనా! మనుషుల్ని బతికిస్తున్నాననే వుద్దేశంతో, నేను నా శక్తిలోనూ సేవలోనూ తృప్తి చెందుతున్నాను. మదరాసు నుంచి కుట్రాలానికి వచ్చినా, ఈ సంఘటనను ఆధారం చేసుకుని యముడు నామీద పగ తీర్చుకుంటున్నాడా అనిపిస్తుంది. నేను చేసిన పనికి ఇదొక శిక్ష. ఆ ముగ్గురు కళాకారులకు ప్రాణదానం చేసి, వాళ్లను జీవచ్ఛవాలుగా చేశాను గదా! ఆ దుఃఖం నన్ను మాడ్చివేస్తోంది. నాకు ప్రాణం పోతున్నట్లనిపిస్తోంది. ఆ ముగ్గురు తమ ప్రాణ ప్రాణమైన అంగాలు కోల్పోయినందుకు కన్నీరు మున్నీరుగా దుఃఖించారు.

ఆ కన్నీటి వేడిని యీ కుట్రాలం జలపాతం కూడా తగ్గించలేకపోతోంది. ఈ చల్లని తెమ్మెరలు కూడా వేడెక్కిన నా మనస్సుకి చల్లగా తగలడం లేదు. మనస్సులో ఏదో బాధ. దేహ ప్రాణాలలో శక్తి లేదు. ఈ అడవులూ కొండలూ తిరిగి, ఈ ఒంటరితనంలో కళ్లు మూసుకుని నా బాధ నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మధురం, మధురం ఏకాంతం’’ అంటారు గద. ఆ ఏకాంతాన్ని వెతుక్కుంటూ యిక్కడికి వచ్చాను. కళ్లు బాగా మూసుకుంటేనైనా, ఆ ఏకాంతం లభిస్తుందేమోనని అనుకుంటున్నాను. కాని అందువల్లా లాభం కలిగించలేదు. కుమిలిపోతున్నాను; కుమిలిపోతున్నాను’’ అన్నాడు డాక్టరు.
 
4
ఈ సంఘటనకు తర్వాత డాక్టరుగారి వైఖరిలో యింకా గొప్ప మార్పుని చూశాను. అడవిలోకి వెళ్లి, కళ్లు మూసుకుని, ప్రశాంతత కోసం ప్రయత్నించాడు. ఇప్పుడేమో యింట్లోనే కళ్లు మూసుకుని, మౌనముద్ర దాల్చి, ఏకాంతంగా కాలం గడపసాగాడు. ఇది అందరి దిగులునీ యినుమడింపజేసింది. అందువల్ల నేనెక్కడికైనా వెడితే చాలు, బలవంతంగానైనా, డాక్టరుగారిని నాతోపాటు పంపించసాగారు. మదరాసుని గురించి గాని, రోగుల్ని గురించి గాని ఆయన కొంచెమైనా అనుకునేవాడు కాదు.

మాకందరికీ ఆయన ఒక మనో వ్యాధిని సంక్రమింపజేయడమే కాక, ఆయన కూడా మహా బాధపడేవాడు. ఇలా ఉండగా, పాళయం కోట నుంచి ఒక వార్త వచ్చింది. రాత్రులలో మదరాసు నగరంలో ఇళ్లల్లో ప్రవేశించి, తుపాకులు చూపి కొల్లగొట్టే గజ దొంగల్లో ముగ్గురు ముఖ్యులు పాళయం కోటలో పట్టుబడ్డారనీ, వాళ్ల వద్ద ఉన్న వస్తువుల్ని సోదా చేయగా మదరాసులో మా యింట్లో ఐదేళ్లకు మునుపు పోయిన కొన్ని వెండి సామాన్లు వాళ్ల వద్ద కనిపించాయనీ, నేను పాళయం కోటకు వెళ్లి ఆ దొంగల్నీ సామాన్లనీ గుర్తుపట్టాలనీ నాకు కబురు అందింది. కారులో బయలుదేరి వెళ్లి, మధ్యాహ్నానికల్లా తిరిగి వచ్చేద్దామనుకున్నాను. బలవంతం చేసి, ఎలాగో డాక్టరుగారిని కూడా బయలుదేరదీశాను.
 
పట్టుబడిన ముగ్గురు దొంగలూ ఘటికులే. తుపాకి గురి చూచి పేల్చడంలో ఒకడు మహా నేర్పరి. అతని కంటిచూపు అటువంటిది. మారు తాళాలతో తాళాలు తీసి, లోపలికి వెళ్లడంలో యింకొకడు సిద్ధ హస్తుడు. మూడోవాడు ఎన్ని బస్తాలనైనా సరే బుజాల మీద మోసుకుని కొన్ని మైళ్లు నిమిషంలో పరిగెత్తగల ఘటికుడు. ఈ ముగ్గురి దర్శన భాగ్యం కలిగింది మాకు పాళయం కోటలో. కాని ఆశ్చర్యమేమిటంటే, నాతోపాటు వచ్చిన డాక్టరుగారిని చూడగానే, వాళ్లు ముగ్గురూ చేతులు జోడించి, ఆయనకు నమస్కరించారు. కాని డాక్టరు నిర్లిప్తంగా ఉండిపోయాడు.

అంతసేపూ ఆయన అడవులూ కొండలూ మరిచిపోయి నాతోపాటు వుండడం గొప్ప విషయమనుకున్నాను. ఇక అక్కడ కాలక్షేపం చెయ్యకుండా, మేము కుట్రాలానికి తిరిగి వచ్చేశాము. ‘‘ఈ డాక్టరుగారిని మీరింతకు మునుపే ఎరుగుదురా?’’ అని అడగ్గ, ఈ కింది విషయాలు బయటపడ్డాయి.
 
పెక్కు సందర్భాలలో రకరకాల చిక్కులలో రకరకాల పేర్లతోనూ రకరకాల వంకలతోనూ ఈ ముగ్గురు దొంగలు ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందారు. ముఖ్యంగా చెప్పవలసిన సంఘటన యేమిటంటే; కన్నాలు వేసే దొంగ కణ్ణుస్వామి ఒకసారి పైనుంచి కిందపడి, చెయ్యి విరిగిన స్థితిలో ఆసుపత్రికి వచ్చాడు. అతని చేతిని సరిచేసి, బాగుచేసి, చేతిని మళ్లీ పెకైత్తేటట్లు చేసిన ఘనత డాక్టరు ముత్తుకుమారస్వామికి దక్కింది. ఆ చెయ్యే యిప్పుడు కన్నాలు వెయ్యడానికి ఉపకరిస్తూంది.

తుపాకీ వీరుడు దొరసామి ఎటువంటి వాడనుకున్నారు! ఒకసారి జరిగిన ఘోర ప్రమాదంలో వాడి కంట్లో ఒక సూది గుచ్చుకుంది. కన్ను పాడు కాకుండా, చూపు చెడిపోకుండా, ఆ కంటిని బాగుచేయడం జరిగింది. ఎవరనుకున్నారు? ఇంకెవరు? డాక్టరు ముత్తుకుమారస్వామీ, ఆయనకు తోడ్పడ్డ ఒక కంటి డాక్టరూను. బస్తాలు అనాయాసంగా మోసే పహిల్వాన్ ముత్తుపక్కిరి? ఆ మూడో దొంగ ఎలాంటివాడని! ఒకప్పుడు తిండికి గతిలేక, నల్లుల మందు తిని, ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. ముత్తుకుమారస్వామి మనుషుల్ని చావనిస్తాడా మరి! వాడికి ప్రాణ దానం చేసి కాపాడడమే కాకుండా, వైటమిన్ మాత్రలతో వాడి కడుపు నింపి, వాణ్ని లోకంలోకి పంపించాడు.
 
కంటిచూపు పొందిన తుపాకీ వీరుడు దొరసామి యిప్పుడు బాగా గురిచూసి తుపాకీ పేలుస్తున్నాడు. చెయ్యి బాగయిన కణ్ణసామి కన్నాలు వేయడంలో ఘటికుడనిపించుకున్నాడు. పహిల్వాన్ పక్కిరి డాక్టరిచ్చిన ఉత్సాహంతో తన వృత్తిని మహా నేర్పుగా సాగిస్తున్నాడు. ఈ ముగ్గురి వద్దా కనిపించిన వెండి సామాన్లు మావని తేలాయి.
 
5
పోలీసుల వద్ద నుంచి యీ విషయాదికం తెలుసుకున్న ఆ మరునాడే డాక్టరు ముత్తుకుమారస్వామి మదరాసుకి ప్రయాణమైనాడు.
 ‘‘ఏవిటి డాక్టరుగారూ! ఉన్నట్టుండి ప్రయాణమయ్యారు?’’ అని అడిగాను ఆశ్చర్యంగా, ఆశగా.
 ‘‘ఒక్క నెలరోజులుగా నేను నా రోగుల్ని మరిచిపోయి, నేనే జబ్బుపడ్డాను. ఇప్పుడు నా జబ్బు నయమయింది. ఇక నా రోగుల వ్యాధుల్ని పరిశీలించాలి. నా కోసం ఎందరు ఎదురుచూస్తున్నారో మదరాసులో!’’
 
‘‘ఏమంటున్నారు మీరు?’’
 ‘‘నాట్యగత్తె కాలు తీసివేసినందుకూ, చిత్రకారుని కళ్లు తీసివేసినందుకూ, సారంగి విద్వాంసునికి చెయ్యి తీసివేసినందుకూ నేనింతవరకూ చాలా బాధపడ్డాను, దుఃఖించాను. కానీ యిప్పుడు నేను విన్నదేవిటి! కష్టపడి కళ్లిచ్చాను ఒకడికి. కాళ్లూ చేతులూ బాగు చేశాను మరి యిద్దరికి. వాళ్లిప్పుడు ఏం పనులు చేస్తున్నారో విన్నావుగా? వాటిని తీసివేసినందుకూ నేనే బాధ్యుణ్ని; అలాగే బాగుచేసినందుకూ నేనే బాధ్యుణ్ని. ఏమంటారు?’’
 డాక్టర్ ఒక్క క్షణం కళ్లు మూసుకుని మళ్లీ ఇలా అన్నాడు.
 
‘‘నాయనా, నా వృత్తి శస్త్ర చికిత్స చెయ్యడం. అంతకుమించి నా మెదడు పనిచెయ్యకూడదు. నా బాధ్యత నా వృత్తి నిర్వహణతో పూర్తయినట్లే. దేవుడు చేసే పనిని నేను చేస్తున్నట్టు అనుకోవడం అవివేకం. కళ్లూ కాళ్లూ చేతులూ తీసివెయ్యడం, బాగుచెయ్యడం వైద్య శాస్త్ర రీత్యా చేసే ఒక చికిత్స; పని. ఈ అంగాలను సద్వినియోగమో దుర్వినియోగమో చేసుకోవడం, దేనికి ఎంత కాలం వినియోగించాలో - ఇటువంటివి నా చేతిలో లేవు. అదంతా లలాట లిఖితం’’ అన్నాడు డాక్టరు.
 
‘‘లలాట లిఖితాన్ని మార్చడమే గదా మీ పని?’’
 ‘‘కాదు. కాని అలా అనుకున్నాను కొన్ని రోజులు. అది తప్పు. చావు పుట్టుకలు, రోగాలు రొప్పులూ అవి లేకపోవడం - ఇవన్నీ వైద్య శాస్త్రానికి భిన్నంగా పరిశోధించడం అవివేకం. భగవల్లీలలను పరిశీలించడానికి పూనుకుంటే, డాక్టరుకే జబ్బు చేస్తుంది. ఆ తర్వాత దానికి మందు లేదు. రండి. జలపాతంలో స్నానం చేసి నేను మదరాసుకి బయలుదేరాలి. రోగులెంతమందో నాకోసం ఎదురుచూస్తూ వుంటారు. నా విద్యుక్త ధర్మం నన్ను పిలుస్తోంది.’’
 ఇలా అంటూ కాల ప్రవాహమైన జలపాతం గట్టు వెంబడి నడక సాగించాడు డాక్టరు ముత్తుకుమారస్వామి.        
 - సోము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement