ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది విహారయాత్రకు వెళ్లగా ఘటన
భారీ వర్షానికి పొంగిన జలతరంగిణి.. జలపాతంలో ప్రవాహం పెరగడంతో ప్రమాదం
స్నానాలు చేస్తుండగా కొట్టుకు పోయిన ఐదుగురు మెడికోలు
ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో కల్వర్టు వద్ద రక్షించిన స్థానికులు.. వారిలో ఓ విద్యార్థిని పరిస్థితి విషమం
మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.
మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్‌లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు.
జలపాతం మధ్యలో చిక్కుకుపోయి..
జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్.హరిదీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత ఉన్నట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment