వనరుల బంగారం.. బయ్యారం | Bayyaram Waterfall Attracts Tourists With Flood Flow | Sakshi
Sakshi News home page

వనరుల బంగారం.. బయ్యారం

Published Sun, Dec 1 2024 9:01 AM | Last Updated on Sun, Dec 1 2024 9:02 AM

Bayyaram Waterfall Attracts Tourists With Flood Flow

బయ్యారం ఊళ్లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే 
ఆ గుడులు  ఇప్పుడు వాడుకలో లేవు.

బయ్యారం.. ప్రకృతి వనరుల భాండాగారం..సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమాలకు ఆలవాలం! ఆ ఊరి గురించే ఈ కథనం.. 
తెలంగాణలోని, మహబూబాబాద్‌ జిల్లాలో.. మూడు వైపుల నీళ్లు, ఒకవైపు గుట్టలను హద్దులుగా చేసుకుని ఉంటుంది బయ్యారం. ఇక్కడి పెద్దచెరువు కట్టపై తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్న శిలాశాసనం కాకతీయుల వంశవృక్షాన్ని, వారి పాలనాదక్షతను తెలియజేస్తుంది. కాకతీయ వంశస్థురాలైన మైలమాంబ.. తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజల సంక్షేమార్థం ఈ చెరువును తవ్వించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. సాగునీటి రంగంపై కాకతీయుల పరిజ్ఞానానికి నిదర్శనంగా బయ్యారం చెరువు నిలిచింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదటగా నీరు నిండి అలుగు పోసేదిగా బయ్యారం పెద్దచెరువు రికార్డులో ఉంది. ఇది 15,000 ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. 

చెరువు మట్టి మహత్యం
బయ్యారం చెరువు మట్టి మహిమ అంతా ఇంతా కాదు. గతంలో బెంగుళూరు పెంకులు, ఇప్పుడు అలంకరణ వస్తువులు, టైల్స్‌ తయారీకి ఈ మట్టే కీలకం. మహబూబాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని టైల్స్‌ ఫ్యాక్టరీల్లో తయారయ్యే డెకరేటివ్‌ టైల్స్‌ మన దేశంలోనే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి దట్టమైన అడవులను దాటుకుంటూ వచ్చే వరద నీరు ఈ చెరువులో చేరుతుంది. నీటి ప్రవాహంతోపాటు వచ్చే ఒండ్రు మట్టి చెరువు అడుగుకు చేరి రేగడి మట్టిగా మారుతుంది. దీంతో తయారయ్యే పెంకులు, డెకరేటివ్‌ టైల్స్‌ నాణ్యతకు మరోపేరుగా నిలుస్తున్నాయి. అయితే ఆర్‌సీసీ కప్పుతో పోటీ పడలేక పెంకు ప్యాక్టరీలు మూత పడే దశకు చేరుకున్నాయి. వాటి స్థానంలో డెకరేటివ్‌ టైల్స్‌ తయారీ మొదలుపెట్టారు. ఇక్కడ తయారయ్యే జేడీ డచ్, హెచ్‌బీటీ, ఎస్సెమ్మార్, మోడర్న్‌ బ్రాండ్, ప్లోయింగ్‌ బిట్స్, సెంటర్‌ టైల్స్‌ ఇలా కస్టమర్లు ఏ విధమైన డిజై¯Œ  కావాలన్నా ఇట్టే తయారుచేసి ఇస్తారు. బయ్యారం చెరువు మట్టితో తయారు చేసిన పెంకులు, టైల్స్, కటింగ్‌ డిజైన్లను బొగ్గు, ఊకతో కాలుస్తారు. అప్పుడు ఎర్రటి అందమైన వర్ణం వస్తుంది. వందలు, వేల ఏళ్లు గడచినా ఇది చెక్కు చెదరదు. వీటికి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు మలేషియా, జపాన్‌  వంటి దేశాల్లోనూ డిమాండ్‌ ఉంది.

ఇనుపరాతి గుట్ట
తెలంగాణకే తల మానికంగా బయ్యారం ఇనుపరాతి గుట్ట ఉంది. దాదాపు 42వేల ఎకరాల  విస్తీర్ణంలో వ్యాపించిన ఈ గుట్టలో దొరికే ఇనుపరాతి ముడిసరుకు నాణ్యమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఈ ముడిసరుకును గతంలో పాల్వంచ, విశాఖ ఉక్కు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. 

పరిసర ప్రాంతాల్లో ఖనిజాలు
బయ్యారం పరిసరాల్లోని నామాలపాడు, ఇతర ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా బైరటీస్, డోలమైట్, అభ్రకం, బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వానికి గతంలో నివేదిక కూడా పంపినట్లు సమాచారం. 

ఉద్యమాలకు నెలవు
నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ పోరు దాకా.. సామాజిక స్పృహకు, ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు నెలవుగా ఉంది బయ్యారం. 1948లో నిజాం వ్యతిరేక పోరులో ఈ ప్రాంతానికి చెందిన 30 మంది పోరాట వీరులు నిజాం సైన్యం తూటాలకు అసువులు బాశారు. వారి స్మృత్యర్థం స్థూపం కూడా ఉందిక్కడ. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బయ్యారం ముందుంది. మలి దశ ఉద్యమంలోనూ చైతన్య శీలురు, కవులు, కళాకారులతో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. 

∙ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్‌
బండారి వీరన్న, సాక్షి, బయ్యారం
మురళీ మోహన్, ఫొటోగ్రాఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement