డెన్మార్క్ రాజధాని కోపన్‌హేగన్‌కు చేరువలో ఉన్న పిల్లల వినోద కేంద్రం బకన్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అమ్యూజ్‌మెంట్ పార్కు. నాలుగు శతాబ్దాలకు పైగా ఇది కొనసాగుతోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అమ్యూజ్‌మెంట్ పార్కులో పిల్లల వినోదానికి అన్ని రకాల ఏర్పాట్లూ ఉన్నాయి. పచ్చని చెట్లు చేమలతో కళకళలాడుతూ కనిపించే ఈ పార్కు విస్తీర్ణం 75 వేల చదరపు మీటర్లు.
ఇందులో ఐదు రోలర్ కోస్టర్లు, నాలుగు లిటిల్ ట్రెయిన్స్, ఒక వాటర్ రైడ్ సహా పిల్లల కోసం 33 క్రీడాకర్షణలు ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కారణంగా దీనిని చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఏటా ఈ పార్కుకు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వస్తుంటారు. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. రకరకాల రైడ్స్, ఇతర వినోద క్రీడా సాధనాలను ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం విడి విడిగా కూపన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో పలురకాల క్రీడాసాధనాల కోసం డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తరచుగా ఇక్కడకు వచ్చే కోపన్‌హేగెన్ వాసులకు సీజన్ పాస్‌లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.
నీటిబుగ్గతో మొదలైంది..
ప్రస్తుతం ఈ పార్కు ఉన్న ప్రాంతానికి అతి చేరువగా ఒక నీటిబుగ్గ ఉంది. పదహారో శతాబ్దిలో కిర్‌స్టెన్ పీల్ అనే స్థానికుడు ఒకరు ఈ నీటిబుగ్గను గుర్తించాడు. కోపన్‌హేగెన్ శివార్లలో పచ్చని అడవి మధ్యనున్న ఈ నీటిబుగ్గ అనతి కాలంలోనే జనాలను ఆకర్షించింది. కోపన్‌హేగెన్ నగరంలో సరఫరా అయ్యే నీటి నాణ్యత అప్పట్లో బాగుండేది కాదు. అందువల్ల ఎక్కువమంది జనాలు ఈ నీటిబుగ్గ నుంచి నీరు తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చేవారు. పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉండటంతో 1583లో నీటిబుగ్గకు చేరువగా అడవిలోని కొంతభాగాన్ని శుభ్రం చేసి, పార్కుగా మార్చారు.
ఆ తర్వాత డెన్మార్క్, నార్వే ప్రాంతాలను పరిపాలించిన రాజు ఫ్రెడెరిక్–ఐఐఐ 1669లో ఇక్కడి అడవిలో జంతువుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన కొడుకు క్రిస్టియన్–V ఈ పార్కును దాదాపు నాలుగు రెట్లు విస్తరించి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రూపొందించాడు. అప్పట్లో ఇక్కడ రాచవంశీకులు, కులీనుల పిల్లలు మాత్రమే ఆడుకునేవారు. ఫ్రెడెరిక్–V కాలంలో 1756 నుంచి ఇందులోకి సాధారణ ప్రజలకు కూడా అనుమతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ వస్తున్నా, ఏనాడూ దీని తలుపులు మూసుకోలేదు. ‘కోవిడ్–19’ కాలంలో కలిగిన తాత్కాలిక అంతరాయం మినహా ఇది నేటికీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment