ఊరి దారిలో టూరిజం | Rural tourism: A slice of countryside | Sakshi
Sakshi News home page

ఊరి దారిలో టూరిజం

Published Sun, Oct 20 2024 9:23 AM | Last Updated on Sun, Oct 20 2024 9:27 AM

Rural tourism: A slice of countryside

చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలనుకున్నా, ఇంజినీరింగ్‌ అద్భుతాలను చూడాలనుకున్నా ఈఫిల్‌ టవర్‌కో, లండన్‌ బ్రిడ్జ్‌కో ప్లాన్‌ చేసుకోవచ్చు! లేదంటే బుర్జ్‌ ఖలీఫానో, సిడ్నీ ఒపేరా హౌస్‌నో సందర్శించొచ్చు! స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీనీ చుట్టి రావచ్చు, డిస్నీల్యాండ్‌తో అబ్బురపడొచ్చు!దూరభారం అనుకునేవాళ్లు తాజ్‌మహల్, ఎర్రకోటతో సరిపెట్టుకోచ్చు! కాని, చల్లటి గాలిలో, పచ్చటి నేలమీద సేద తీరాలనుకుంటే, ట్రెడిషనల్‌ లైఫ్‌ స్టయిల్‌ని పరిచయం చేసుకోవాలనుకుంటే, పలు యాసలను వినాలనుకుంటే, స్థానిక రుచులను ఆస్వాదించాలనుకుంటే మాత్రం పల్లెలే ద బెస్ట్‌ హాలీడే స్పాట్స్‌! ఇప్పుడు చిన్నా పెద్దా అందరి వీకెండ్స్‌ను, సెలవులను అవే ఆక్యుపై చేస్తున్నాయి! వీళ్లకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానికులూ ఉత్సాహపడుతున్నారు. పరాయి ఊళ్లో సొంతింటి భావనను కలిగిస్తున్నారు!ఆ జర్నీనే రూరల్‌ టూరిజం. ఆ హాస్పిటాలిటీయే హోమ్‌ స్టేస్‌! ఆ ట్రెండ్‌ మీదే ఈ కథనం!

సెలవుల్లో ఇదివరకైతే అమ్మమ్మ వాళ్లూరో, నానమ్మ వాళ్లూరో వెళ్లేవాళ్లు. చెట్లు– పుట్టలు, చేనులు– చెలకలు, చెరువులు– బావులు, కొండలు– గుట్టలు తిరగడం వల్ల ఆ ఊరి భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వనరుల మీద తెలియకుండానే ఒక అవగాహన ఏర్పడేది. అలాగే అక్కడి సంస్కృతీ సంప్రదాయాలూ తెలిసేవి. అక్కడి పిల్లలతో ఆటలు, ఈతలు, సరదాలు, కబుర్లు, కాలక్షేపాలతో రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ప్రత్యేకతలు, వైవి«ధ్యాలు అర్థమయ్యేవి. తెలివిడి వచ్చేది. 

నగరీకరణ పెరగడం, చదువుల ఒత్తిడి, మొదటి తరానికి, మూడో తరానికి కనెక్టివిటీ తగ్గడం వల్ల గ్రామీణ భారతం కథల్లో, సినిమాల్లో వినిపించే, కనిపించే ఫిక్షన్‌గా మారిపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు రోబోటిక్‌ లైఫ్‌ స్టయిలే లా ఆఫ్‌ లైఫ్‌గా మారిపోయింది. ఫీడ్‌ చేసిన ప్రోగ్రామింగ్‌లా వారంలో అయిదు రోజులు ఆఫీస్‌ పనితో కుస్తీ, వీకెండ్‌ షాపింగ్‌ మాల్స్‌లో వ్యాహ్యాళి. ఏడాదికి ఒకసారో, రెండుసార్లో లాంగ్‌ డెస్టినేషన్‌ టూర్స్‌ తప్ప ఆ షరా మామూలులో మార్పు లేదు. 

కోవిడ్‌ పుణ్యమా అని 
సూర్యోదయాలు, సూర్యాస్తమయాలతో ఇంట్రడక్షన్‌ లేని, ట్రాఫిక్, టార్గెట్స్, ప్రాజెక్ట్స్‌తోనే డీప్‌ రిలేషన్‌షిప్‌లో పడిపోయిన నగర జనాభాలో కోవిడ్‌ ఒక రియలైజేషన్‌ను తెచ్చింది. పని, పొల్యూషనే కాదు ప్రకృతి, పల్లెలతో ఇంటరాక్షన్‌ చాలా అవసరమని, ఆ సమయం ఆసన్నమైందని! అందుకే కోవిడ్‌ ఇంట్రడ్యూస్‌ చేసిన (అంతకుముందు అరుదుగా ఉండే) వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. లాప్‌టాప్, బ్యాక్‌ప్యాక్‌తో పల్లెలకు చేరుకున్నారు. పచ్చని ఆవరణం, స్వచ్ఛమైన గాలితో సేదతీరారు. పని ఒత్తిడిని తగ్గించుకున్నారు. 

కొత్త ఉత్సాహాన్ని నింపు కున్నారు. ‘బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి? పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి? పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది? కూరగాయలను ఏ మార్కెట్‌లో తయారు చేస్తారు?’ లాంటి ప్రశ్నలు వేసే పిల్లలకూ పల్లెలతో ప్రత్యేక పరిచయం అవసరమని గుర్తించారు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టాక పల్లె సందర్శనను జీవనశైలిలో భాగం చేసుకున్నారు. వీకెండ్స్‌ నుంచి వెకేషన్స్‌ దాకా ప్రతి సందర్భాన్నీ రూరల్‌ టూర్‌కే రిజర్వ్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. 

సకుటుంబ సమేతంగా! క్యాంప్‌లు వేసుకునేవాళ్లు, ట్రెకింగ్‌ని ఇష్టపడేవాళ్లు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలనుకునే వాళ్లు, సాగు నేర్చుకోవాలనుకునే వాళ్లు, పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ను కోరుకునేవాళ్లు, నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్నవాళ్లు, గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు.. ఎట్‌సెట్రా ఎట్‌సెట్రా అభిరుచికి తగినట్టుగా గ్రామీణ పర్యటనకు సంబంధించి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రావెల్‌ గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మొత్తంగా రూరల్‌ టూరిజాన్ని ఓ ఒరవడిగా మార్చారు. వాళ్లందరికీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు, వనాలు, నదీ, సముద్ర తీరప్రాంతాలు ఆతిథ్యమిస్తున్నాయి.

ముందుగా ఉత్తరాంధ్రకు వెళితే.. 
శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి, కొబ్బరి తోటలకు ఆలవాలమైన ఉద్దానం, సైబీరియా వలస పక్షుల విడిది కేంద్రాలు తేలుకుంచి, తేలినీలాపురాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా స్టడీ టూర్‌ పేరిట ఈ ప్రాంతాల్ని సందర్శిస్తుంటారు. తేలినీలాపురంలో సైబీరియ¯Œ  పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. వారాంతాల్లో ఈ కేంద్రాలు టూరిస్ట్‌లతో బిజీగా ఉంటాయి. మన్యం పార్వతీపురం జిల్లా పరిధిలోని పాలకొండ ఏజెన్సీలో జలపాతాలకు, హిల్‌ వ్యూ పాయింట్లకు కొదువ లేదు. ఇది అరుదైన జంతుజాతులకూ నెలవు. దీనికి పరిశోధకుల తాకిడీ అధికమే!

ఆంధ్రా ఊటీ అందాల అరకు..
పచ్చటి లోయలు, అబ్బురపరచే గుహలు, అలరించే థింసా నృత్యాలు, వెదురు బొంగులో చికె¯Œ  ఘుమఘుమలు, మైమరపించే కాఫీ కమ్మదనం, మేఘాలను ముద్దాడే పర్వతాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుతమైన ప్రదేశం. కోవిడ్‌లో కూడా బాగా కట్టడి చేస్తే తప్ప సందర్శకుల తాకిడి ఆగని ప్రాంతం. అరకు వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానిక గిరిజనులు రిసార్ట్స్‌ మాదిరి అతిథి గృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. మంచు ముసుగేసుకునే లంబసింగి, పాడేరు కూడా సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడికి అక్టోబర్‌ చివరివారంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. 

కోస్తాకు వస్తే.. 
ఆంధ్రా కేరళగా పిలుచుకునే కోనసీమ రూరల్‌ టూరిజానికి అసలు సిసలైన కేంద్రం. ప్రకృతి అందాలు, పసందైన రుచులకు ఈ ప్రాంతాన్ని మించింది లేదు. సువిశాల గోదావరి, అది సముద్రంలో కలిసే అంతర్వేది, ఓడల రేవు, మడ అడవుల కోరంగి, ఫ్రెంచ్‌ కల్చర్‌తో ఆసక్తి రేకెత్తించే యానాం, పట్టునేత ఉప్పాడ, పూల వనాల కడియం, ప్రకృతి సోయగాల పాపికొండలు, ధవళేశ్వరం, మన్యప్రాంతాల రంపచోడవరం, మోతుగూడెం, మారేడుమిల్లి, సూర్యోదయాల గుడిసె, గలగలపాడే సెలయేరుల పింజరకొండ.. ఇలా అన్నింటినీ చుట్టిరావాల్సిందే.. పనసపొట్టు కూర నుంచి పులసల పులుసుదాకా, పూతరేకుల నుంచి కాకినాడ కాజా దాకా అన్నింటినీ రుచి చూడాల్సిందే! ఇంకా ఆంధ్రలో కృష్ణా పరీవాహక ప్రాంతాలు, హార్సిలీ హిల్స్, బెలూం కేవ్స్, గండికోట, కొండవీడు, ఉదయగిరి, ఒరవకల్లు, చంద్రగిరి, పెనుకొండ లాంటివాటినీ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. 

దక్షిణ భారతంలో కేరళ, ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య భారతంలో ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో మేఘాలయాలో రూరల్‌ టూరిజం ఎక్కువగా ఉంది. మనదేశంలో రూరల్‌ టూరిజం ద్వారా రూ. 4,300 కోట్ల అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇది గ్రామీణ భారతానికి, పట్టణ భారతానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందని, అందుకే దీన్నో ఇండస్ట్రీగా, భారీ ఆదాయ వనరుగా పేర్కొనవచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.  

తెలంగాణకు చేరితే.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లక్నవరం, రామప్ప, పాండవులగుట్ట, వాజేడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తే రాచకొండ, భువనగిరి ఫోర్ట్, కొలనుపాక, వైజాగ్‌ కాలనీ, మెదక్‌లో నర్సాపూర్, ఏడుపాయల ప్లాన్‌ చేసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నల్లమల ఉండనే ఉంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో రోజంతా గడపాలనుకునేవారికి ‘టైగర్‌ స్టే ప్యాకేజీ’ అందుబాటులోకి వచ్చింది. ఇదే దారిలో వటవర్లపల్లి సమీపంలో మల్లెలతీర్థం, ఆక్టోపస్‌ వ్యూపాయింట్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన్ననూర్, ఈగలపెంట ఊళ్లల్లో తిరిగి అక్కడివారి జీవన శైలిని పరిశీలించవచ్చు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లోని సుందర ప్రదేశాలనూ సందర్శించొచ్చు. వారాంతాల్లో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలూ రద్దీగా ఉంటున్నాయి. ఉత్తర తెలంగాణకు చేరితే..  వరంగల్‌ మినహా మిగిలిన ప్రాంతమంతా  తెలంగాణ– ఆంధ్ర– మరాఠీ సంస్కృతి, గోదావరి ప్రవాహం, పచ్చని చేలతో భలే ఆకట్టుకుంటుంది. నిజామాబాద్‌లో నిజాంసాగర్, కందకుర్తి, శ్రీరాంసాగర్, పసుపు పంటల అంకాపూర్, ఆర్మూర్‌ ప్రాంతాలను చూడాల్సిందే.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రత్యేకం ..
ఇది వైవిధ్యాలకు నెలవు. పచ్చని ప్రకృతి, ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు, మహారాష్ట్ర ప్రభావం.. ఇవన్నీ కలిసి దీనికి స్పెషల్‌ అపియరెన్స్‌ను ఇస్తున్నాయి. ఈ వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి, అబ్జర్వ్‌చేయడానికి జనాలు ఇక్కడికి వస్తుంటారు. చలికాలంలో జీరో డిగ్రీకి వెళ్లే తిర్యాణిలాంటి ప్రాంతాలను చూసేందుకు, ఆ మంచు వాతావరణాన్ని ఎంజాయ్‌ చేసేందుకు భ్రమణకాంక్ష కలవారు ఇక్కడికి క్యూ కడుతుంటారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్, కుంటాల, పొచ్చెర, సప్తగుండాలతో పాటు 30కి పైగా చిన్నా పెద్దా జలపాతాలు మరచిపోలేని అనుభూతులను పంచుతున్నాయి. వీటితోపాటు గోదావరి, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా, వెన్‌గంగా తీరాలు, సమీప గ్రామాలు, జోడే ఘాట్, ఇం్రదవెల్లి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గిరిజన కోటలు, పూర్వయుగం నాటి ఆనవాళ్లున్న ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి దేశవిదేశాల అధ్యయనకారులూ వస్తుంటారు. 

ఇలా రూరల్‌ టూరిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో డెస్టినేషన్స్‌ ఉన్నాయి. గ్రామీణ పర్యాటకం ఎన్నో ప్రాక్టికల్‌ లెసన్స్‌ను నేర్పుతుంది. ప్రకృతి వనరుల మీద అవగాహన కల్పిస్తుంది. వాటి మీద గౌరవాన్ని  పెంచుతుంది. శ్రమ విలువను చూపిస్తుంది. నిరాడంబర జీవన శైలి అవసరాన్ని తెలియజేస్తుంది. పరిణతినిస్తుంది. రూరల్‌ టూర్‌ని ఇంకా మొదలుపెట్టని వాళ్లు ఐటినరీ ప్రిపేర్‌ చేసేసుకోండి ఇక! 
ఇన్‌పుట్స్‌: కడారి రాజా, కిషోర్‌ కుమార్‌ పెరుమాండ్ల, పాదం వెంకటేశ్, తాండ్ర కృష్ణగోవింద్, ఆకుల రాజు

పెద్దగా ఖర్చులేనిది..
రూరల్‌ టూరిజాన్ని ఇష్టపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా! ఇలాంటి పర్యటనకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ప్రకృతికి నష్టం చేయకుండా గ్రామీణ, నేచర్‌ బేస్డ్‌గా ఉండే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రాల ఆర్థిక వృద్ధికీ మేలు కలుగుతుంది. 
–  శ్యామ్‌సుందర్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్, యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైహెచ్‌ఏఐ) తెలంగాణ చాప్టర్‌

పల్లెల గురించి తెలియాలి
నాకు రకరకాల భాషలు, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్కిటెక్చర్‌ను తెలుసుకోవడం, పరిశీలించడం ఇష్టం. అందుకే చాలా తరచుగా దేశీ, విదేశీ యానాలు చేస్తుంటా. వీకెండ్స్‌లో కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటా. కరోనా తర్వాత రూరల్‌ టూర్స్‌ పెరిగాయి. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రిటైర్డ్‌ ఎంప్లాయ్సే ఎక్కువగా రూరల్‌ టూర్స్‌ని ఇష్టపడేవాళ్లు! ఇప్పుడు ఫ్యామిలీస్, యూత్, స్కూల్‌ పిల్లలూ వస్తున్నారు. శుభపరిణామం. మనదేశ సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అర్థంకావాలంటే మన గ్రామాల గురించి తెలియాలి. కాబట్టి పల్లెటూళ్లకు వెళ్లాలి. 
– గిరిజ పైడిమర్రి, విహంగ (వైహెచ్‌ఏఐ) వైస్‌ ప్రెసిడెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement