కోటి కలలతో సాగే ఆ కుటుంబానికి ఊహించని పీడకల ఎదురైంది. ఉల్కిపడి తేరుకునే లోపే.. ఆ తల్లికి కడుపుకోత మిగిలింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అపఖ్యాతి మూటకట్టుకున్న కథల్లో బ్యూమాంట్ చిల్డ్రన్ మిస్సింగ్ కేసు ఒకటి. సరిగ్గా యాభై ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన.. ఎందరో తల్లిదండ్రులకు గుణపాఠం.
అది 1966 జనవరి 26. మధ్యాహ్నం 12 దాటింది. దక్షిణ ఆస్ట్రేలియా, అడలాయిడ్ శివారు ప్రాంతలోని 109 హార్డింగ్ స్ట్రీట్ బస్టాప్‌లో నాన్సీ అనే 39 ఏళ్ల మహిళ.. తన పిల్లల కోసం వెయిట్ చేస్తోంది. ఆరోజు ఆ దేశమంతా ఆస్ట్రేలియా డే సెలబ్రేషన్ లో ఉంటే ఆమె మాత్రం టెన్షన్‌లో ఉంది. ‘ఇంకా బీచ్‌లోనే ఆడుకుంటున్నారేమోలే.. తర్వాత బస్‌కి వస్తారు’ అనుకుంటూ 2 గంటలయ్యేదాకా ఎదురు చూసింది.
ఆ బస్టాప్‌లో ఆగిన ప్రతి బస్సు ఆమెని నిరాశపరుస్తూనే ఉంది. గడిచే ప్రతి నిమిషం ఆమె గుండె వేగాన్ని పెంచుతూనే ఉంది. ‘ఒకవేళ ఆటపట్టించడానికి ఇంటికి వెళ్లాపోయారేమో?’ అదే అనుమానంతో ఇంటికి పరుగుతీసింది. తలుపు తీసి ఉండటంతో.. పట్టలేనంత ఆనందంగా లోపలికి నడిచింది. కానీ లోపల పిల్లల్లేరు. డ్యూటీ నుంచి ముందే వచ్చేసిన భర్త జిమ్ బ్యూమాంట్ ఉన్నాడు. పొంగుకొచ్చే దుఃఖం ఆపుకోలేక భర్తని హత్తుకుని.. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. వెంటనే బీచ్‌కి వెళ్తే.. అక్కడా పిల్లల్లేరు.
జిమ్, నాన్సీలు ఆ ముందురోజే తమ ముగ్గురు పిల్లలతో కలిసి.. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెనెల్గ్ బీచ్‌కి వెళ్లారు. అయితే పిల్లలకు సముద్ర తీరాల్లో ఆడుకోవాలనే ఆశ తీరలేదు. అందుకే మరునాడు (జనవరి 26) ఉదయం లేవగానే.. గ్లెనెల్గ్ బీచ్‌కి వెళ్తామని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాస్తా పేచీ అయ్యింది. నిజానికి పెద్దమ్మాయి జెన్(9) తెలివితేటల మీద.. జిమ్ దంపతులకు చాలా నమ్మకం. సముద్రం లోపలికంటా వెళ్లకూడదని.. అపరిచితులతో మాట్లాడకూడదని.. ఇలా చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో జెన్.. 15 ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తించేది.
అందుకే రెండో కూతురు అర్నా(7)ని, కొడుకు గ్రాంట్(4)ని.. జెన్ కి అప్పగించి.. బస్సు టికెట్స్‌కి కొంత డబ్బులిచ్చి.. ఉదయం పదయ్యేసరికి బీచ్‌కి వెళ్లే బస్సు ఎక్కించింది నాన్సీ. 12 అయ్యేసరికి తిరిగి వస్తామన్నారు పిల్లలు. కానీ రెండైనా రాలేదు. బీచ్‌లోనూ లేరు. తెలిసిన ప్రతి వీధిలోనూ వెతికారు. ఎక్కడా దొరకలేదు. దాంతో పోలీసుల్ని ఆశ్రయించారు. కిడ్నాప్ భయంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్స్, అంతర్రాష్ట్ర రహదారులు ఇలా అన్నీ వెతికారు అధికారులు. సముద్రంలో కొట్టుకు పోయారేమోనన్న అనుమానంతో బీచ్ పరిసరప్రాంతాలనూ గాలించారు. 24 గంటల్లోనే దేశం మొత్తం ఈ కేసు గురించి తెలుసుకుంది. కానీ ఏ ఆధారం లభించలేదు.
గ్లెనెల్గ్ బీచ్ సమీపంలోని.. సుమారు ముప్ఫై ఏళ్ల వయసున్న ఆరడుగుల సన్నటి వ్యక్తితో ఈ పిల్లల్ని చూశామని.. పిల్లలు అతడితో చాలాసేపు.. బీచ్‌లో నవ్వుతూ ఆడుకున్నారని.. కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ‘ఆ ముగ్గురు పిల్లలు డబ్బులు పోగొట్టుకున్నారు, మీలో ఎవరైనా చూశారా?’ అంటూ ఆ సన్నటి వ్యక్తి సాక్షుల్లో కొందరిని అడిగాడట. పిల్లలు సముద్రంలోకి దిగినప్పుడు ఆ వ్యక్తే కావాలని వాళ్ల డబ్బులు తీసేసి.. పిల్లల నమ్మకాన్ని సంపాదించడానికి.. సాయం చేసే వ్యక్తిలా నటించి ఉంటాడనే వాదన బలపడింది. సాక్షులు చెప్పిన పోలికలతో ఊహాచిత్రాలు కూడా గీయించి పత్రికల్లో ప్రచురించారు.
పిల్లలు అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఒక మహిళ పోలీసుల్ని కలిసి.. ‘జనవరి 26 రాత్రి 7 గంటలకు పటావాలోంగా బోట్ హెవెన్ లో బ్యూమాంట్ పిల్లల్ని పోలిన ముగ్గురు పిల్లలతో నేను మాట్లాడాను’ అని చెప్పింది. దాంతో ఆ ఏరియా మొత్తం ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. కానీ ఫలితం లేదు. ఇక బీచ్ సమీపంలోని వెంజెల్స్ బేకరీ యజమాని.. ఆరోజు జెన్ తన దగ్గరకు 1 పౌండ్ నోట్ తెచ్చిందని.. మీట్ పఫ్స్ కొని తీసుకెళ్లిందని చెప్పాడు.
నాన్సీ.. నేనంత డబ్బు ఇవ్వలేదని కేవలం 6 షిల్లింగ్స్ చిల్లర మాత్రమే ఇచ్చానని చెప్పింది. దాంతో బీచ్‌లో ప్రత్యక్షసాక్షుల మాటకు బలం చేకూరింది. ఎవరో ఒక వ్యక్తి పిల్లలతో కావాలనే స్నేహం చేసుకున్నాడని.. తెలివిగా మోసం చేసి వాళ్లని తీసుకుని వెళ్లాడని నిర్ధారించుకున్నారు పోలీసులు.
కొన్ని నెలల గడిచాయి. డాఫ్నే గ్రెగరీ అనే స్థానికురాలు.. పోలీసుల్ని కలిసి ఓ షాకింగ్ విషయం చెప్పింది. జనవరి 26 రాత్రి.. ఖాళీగా ఉన్న పక్కింట్లోకి ఒక వ్యక్తి ఇద్దరు ఆడపిల్లల్ని, ఒక చిన్న పిల్లాడ్ని తీసుకొచ్చాడని.. కాసేపటికి ఆ పిల్లాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి పట్టుకున్నాడని.. ఆ మరునాడు ఆ ఇల్లు ఖాళీగానే కనిపించిందని చెప్పింది. ముందే ఎందుకు చెప్పలేదంటే భయపడ్డానని బదులిచ్చింది. అయితే ఆమె చెప్పినదానికి ఏ ఆధారం లేదు.
రెండేళ్ల తర్వాత.. జిన్ దంపతులకు ఓ లేఖ వచ్చింది. అది స్వయంగా జెన్ రాసినట్లు ఉండటంతో వాళ్లు నివ్వెరపోయారు. ‘నన్ను(జెన్), తమ్ముడ్ని, చెల్లెల్ని దిమెన్ (కిడ్నాపర్) బాగా చూసుకుంటున్నాడు.. మేము సంతోషంగా ఉన్నాం’ అనేదే దాని సారాంశం. నెల తిరగకుండానే మరో లేఖ వచ్చింది. ఈసారి దిమెన్ స్వయంగా రాశాడు. తనని తాను పిల్లలకు గార్డియన్‌గా ప్రకటించుకున్న ఆ వ్యక్తి.. ‘మీ బాధ చూడలేక పిల్లల్ని తిరిగి ఇవ్వాలని దిమెన్ భావిస్తున్నాడు. ఫలానా చోటికి రండి.. ఎవరికీ చెప్పొద్దు’ అని రాశాడు. చెప్పినట్లే జిన్ దంపతులు.. రహస్యంగా ఓ డిటెక్టివ్‌ని నియమించుకుని.. దిమెన్ చెప్పిన చోటికి వెళ్లారు. కానీ పిల్లలు రాలేదు.
కొన్ని రోజులకి మూడో లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది. ‘పిల్లల్ని తీసుకెళ్లేందుకు మీరు మాత్రమే కాకుండా.. మారువేషంలో డిటెక్టివ్‌ని తీసుకొచ్చారు. అందుకే దిమెన్ నమ్మకాన్ని కోల్పోయారు. ఇక పిల్లలు మీ దగ్గరకు రారు’ అని ఉంది. అన్ని ఉత్తరాల మీద విక్టోరియాలోని డాండెనాంగ్ పోస్టల్‌మార్క్ ఉంది. 1992 నాటికి లేఖలపైనున్న వేలిముద్రల సాయంతో ఫోరెన్సిక్ పరీక్షలు జరిపి.. 41 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్నారు. కానీ అతడు వాటిని ఫన్ కోసం రాశానని చెప్పడంతో.. ఆధారాలు లేక, ఆ లేఖలను బూటకపు లేఖలుగా కొట్టిపారేశారు.
చాలామంది అనుమానితుల్ని.. సీరియల్ కిల్లర్స్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరు మతిస్థిమితం కోల్పోయిన పాత నేరగాళ్ల మాటలు విని.. పిల్లల మృతదేహాలైనా దొరుకుతాయనే ఆలోచనతో.. అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు కూడా జరిపారు. ఎక్కడా ఏ ఆచూకీ దొరకలేదు.
నాన్సీ 2019లో తన 92 ఏళ్ల వయసులో నర్సింగ్‌హోమ్‌లో.. పిల్లల్ని తిరిగి చూడకుండానే చనిపోయింది. జిమ్ ఇంకా అడలాయిడ్‌లో జీవిస్తున్నాడు. అయితే ఈ జంట పిల్లల గురించే గొడవపడి.. విడాకులు తీసుకుంది. నాన్సీ తన చివరి జీవితంలో పిల్లల్నే కాదు భర్తని కూడా దూరం చేసుకుని బతికింది. ఏది ఏమైనా పిల్లల్ని తీసుకుని వెళ్లింది ఎవరు? అసలు పిల్లలు ఏమయ్యారు? ఆరోజు పిల్లల్ని కలిసిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు నేటికీ తేలలేదు.
కదిలించిన తల్లి ప్రేమ
1967లో ఆస్ట్రేలియా ‘డైలీ టెలిగ్రాఫ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాన్సీ మాటలు అందరి హృదయాలను కదిలించాయి. ‘మీకు తెలుసా? నేను సాధారణంగా కలలు కనేదాన్ని కాదు. కానీ పిల్లల గురించి కలగన్నాను. వాళ్లు రాత్రి ఇంటి వెనుక తలుపు తట్టారు. వెళ్లి చూస్తే ‘హలో అమ్మా’ అన్నారు. ’మీరు ఎక్కడ ఉన్నారు?’ అని నేను అడిగాను. వెనుక లాబీస్‌లో నిలబడి నవ్వుతున్నారు. వాళ్లని పట్టుకుని చాలా ఏడ్చాను. ఇదే నేను కన్న మొదటికల’ అంటూ తన మదిలోని ఆవేదనను పంచుకుంది.
ప్రధాన నిందితుడు
హ్యారీ ఫిప్స్ 2004లో చనిపోయాడు. అతడి మరణం తర్వాత 2007లో అతడి కుమారుడు హేద్న్.. తన తండ్రిపై ఆరోపణలు చేశాడు. స్థానిక ఫ్యాక్టరీ యజమానిగా, అడలాయిడ్ సామాజిక శ్రేణిలో అప్పటి సభ్యుడిగా గౌరవమర్యాదలతో బతికిన ఫిప్స్ మంచివాడు కాదని.. 1966లో బ్యూమాంట్ పిల్లలను అతడే కిడ్నాప్ చేశాడని, అప్పటికి తన వయసు 15 ఏళ్లని, తన తండ్రి తనను కూడా లైంగికంగా వేధించాడని చెప్పాడు. పైగా ఫిప్స్‌కి 1 పౌండ్ నోట్లను పంచే అలవాటుందని చెప్పాడు. గ్లెనెల్గ్ బీచ్‌కి 300 మీటర్ల దూరంలోనే ఫిప్స్ జీవించాడు. 2013 నాటికి హేద్న్ తన నమ్మకాన్ని.. చిన్నప్పుడు తను చూసినదాన్ని కలిపి.. ‘ది శాటిన్‌మెన్’ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. హేద్న్ చెప్పిన విషయాలన్నీ కేసుకు సరిపోలడంతో.. ఫిప్స్‌నే నేరగాడని చాలా మంది నమ్ముతారు. అయితే ఫిప్స్ ఇతర కుటుంబ సభ్యులు హేద్న్ వాదనని తప్పుబట్టారు.
- సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment