కరోనా వల్ల పిల్లల స్కూళ్లకు సెలవులొచ్చాయి. ఒక్కరోజు స్కూల్‌కి వెళ్లక్కర్లేదంటేనే చాలు పిల్లలకు పెద్ద పండగే. అలాంటిది పదిహేను రోజులంటే... వాళ్ల ఆనందం మాటల్లో వివరించ లేనిది. రెండు, మూడు, నాలుగు రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు బోర్ ఫీలవ్వడం మొదలుపెడుతున్నారు. కొందరు పిల్లలు తమ తోబుట్టువులతో గొడవలు పెట్టుకొని పెద్దలకు తలనొప్పులు తెస్తున్నారు. అలాగని వాళ్లనీ తప్పు పట్టలేం. బయటకెళ్లి తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి లేదు. సినిమాలకు వెళ్లడానికి లేదు. ఇక షాపింగ్‌లు, షికార్లు సరేసరి. ఫంక్షన్లకు వెళ్లేది లేదు. బంధువుల ఇళ్లకు వెళ్లేది లేదు. ‘అమ్మా! బోర్ కొడుతోంది...’ ఇదీ పిల్లల ఫిర్యాదు. ఎంతసేపూ టీవీ,సెల్‌ఫోన్లతో కాలక్షేపం. ‘ఏంటి చేయడం...’ తల్లిదండ్రులకు ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. దీనిని అధిగమించడానికి ఇంట్లోనే ఓ చిన్న సమ్మర్ క్యాంప్‌ను ముందస్తు క్యాంప్‌గా మార్చేశారు హైదరాబాద్ తార్నాకలో ఉంటున్న డాక్టర్ శిరీష ముఖేష్. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఇన్ని పాయింట్స్, ఈజీ కుకింగ్‌కు సంబంధించిన ఐటమ్స్ నేర్చుకుంటే ఇన్ని పాయింట్స్, గార్డెనింగ్ చేస్తే ఇంకొన్ని పాయింట్స్.. అంటూ రోజూ ఏదో ఒక ఇంటి పనిలో తన ఇద్దరు పిల్లల్ని ఇన్‌వాల్వ్ చేస్తున్నారు. పిల్లలు చేస్తున్న... నేర్చుకుంటున్న ఇంటిపనులు, వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సప్ ఫ్యామిలీ గ్రూప్‌ల్లో పోస్ట్ చేస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారు. దీంతో పిల్లలు బోర్ ఫీలవకుండా, పెద్దవారిని విసిగించకుండా టైమ్‌ని ప్లానింగ్‌గా మార్చేస్తున్నారు. ‘ఇలాగే మనమూ చేయచ్చు కదా!’ అని మిగతా తల్లిదండ్రులకూ ఆలోచన అందిస్తున్నారు. కరోనా అంటూ భయంతో ఇంట్లోనే ముడుచుకు కూర్చోవాల్సిన పనిలేదు. పిల్లలకు ఎన్నో అంశాల్లో నైపుణ్యాలకు సంబంధించి తరగతులు ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇలా ఇంట్లోనే కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment