
పర్యాటకులు ఎక్కడకు వెళ్లినా ఖర్చుపెట్టడమే తప్ప సంపాదించుకునే అవకాశం ఉండదు. ఆస్ట్రేలియాలోని టాస్మానియా దీవి మాత్రం పర్యాటకులకు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ అవకాశం ఆస్ట్రేలియన్లకు మాత్రమే పరిమితం. ‘టూరిజం టాస్మానియా’ పర్యాటకులకు వింత వింత ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తోంది.
‘కోవిడ్’ తర్వాత టాస్మానియాకు పర్యాటకుల రాక గణనీయంగా తగ్గిపోవడంతో స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ‘టూరిజం టాస్మానియా’ సీఈవో వెనీసా పింటో తెలిపారు. రొటీన్ ఉద్యోగాలతో విసిగిపోయిన వారికి ఈ ఉద్యోగాలు కొంత ఆటవిడుపుగా ఉంటాయని చెప్పారు. ‘టూరిజం టాస్మానియా’ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ప్రకటించిన ఉద్యోగాలు ఇవీ..
పారానార్మల్ ఇన్వేస్టిగేటర్– అతీంద్రియశక్తులను అన్వేషించే పని, వైన్ విస్పరర్– వైన్‌యార్డుల్లో తిరుగుతూ రకరకాల వైన్‌లను రుచిచూసి, వాటి నాణ్యతను నిగ్గు తేల్చడం. ఓయ్‌స్టర్ ఆర్గనైజర్– సముద్రంలో పట్టిన ఆల్చిప్పలను ఒక క్రమపద్ధతిలో వేరు చేయడం, కేవ్‌కండక్టర్– పురాతన గుహలను సందర్శించే వారికి వినోదం కల్పించేందుకు సంగీత కచేరీలు నిర్వహించడం, సోనా స్టోకర్– కట్టెల మంటపై వేడిచేసిన నీళ్లతో స్నానాలు చేసే వారికోసం తగిన ఉష్ణోగ్రతలో నీళ్లు వేడిచేయడం, సోక్‌స్మిత్– స్నానానికి ఉపయోగించే బాత్‌సాల్ట్స్ తయారు చేయడం, స్టార్ సీకర్– రాత్రంతా టెలిస్కోప్‌తో నక్షత్రాలు చూస్తూ గడపడం, ట్రఫల్ స్నఫర్– ట్రఫల్ అనేది ఒకరకం పుట్టగొడుగు.
మిగిలిన పుట్టగొడుగుల నుంచి ఈ రకం పుట్టగొడుగులను వాసన చూసి వేరు చేయడం, వోంబాట్ వాకర్– వోంబాట్ ఆస్ట్రేలియాలో కనిపించే జంతువు. కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లినట్లే వోంబాట్‌ను వ్యాహ్యాళికి తీసుకెళ్లడం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చలికాలం. ఆస్ట్రేలియాలో ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉండే చలికాలంలో ఎక్కువమంది పర్యటనలకు వెళుతుంటారు. ‘టూరిజం టాస్మానియా’ ప్రకటన చూశాక చాలామంది టాస్మానియాకు వెళ్లడానికి పెట్టాబేడా సర్దుకుంటున్నారు. టాస్మానియాకు వెళితే, ఖర్చులు పోను ఎంతో కొంత మిగలేసుకు రావచ్చనేదే వారి ఆశ.
ఇవి చదవండి: కాలానికి కళ్లెం!
Comments
Please login to add a commentAdd a comment