గాలివాన | Classic story of Rainstorm | Sakshi
Sakshi News home page

గాలివాన

Published Sat, Feb 20 2016 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

గాలివాన

గాలివాన

క్లాసిక్ కథ
ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయోజనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది.
 
మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండోతరగతి పెట్టె ఎక్కుతుంటే తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచి వుంటుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దాని మీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలు గుతూ ఉంటుంది.

ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పట్టాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ. వాళ్లని చూస్తే ఆయనకు ఎంతో గర్వం.
 రైలు పెట్టెలో మూడు మెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచు కున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు చిరాకు పడుతున్నట్టు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు.

ఇంకో పెట్టి లోకి వెడితే బాగుంటుందని అనిపించింది. కాని రైలు కదిలిపోయింది. కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించాడు. కిటికీల పక్కనివున్న రెండు మెత్తల మీదా ఇద్దరు పెద్ద వయసువాళ్లు కూర్చున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆ యువకుని భార్య అయివుంటుంది. సిగరెట్టు పొగ మెల్లని ఘాటు రావుగారి నాసికా రంధ్రాలలోకి తెలియకుండానే ప్రవేశించి ఒక క్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.

రైలుపెట్టెలో సిగరెట్టు పొగ గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయా లున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలు న్నాయి. ఆయన వేదాంతి. వేదాంతం జీవితం తోటీ, జీవన విధానం తోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ అనుబంధించి వుంటుం దని ఆయన వాదము. ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచి వక్తగా కూడా ప్రఖ్యాతి పొందాడు. ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడం కోసం.
 
రావుగారు యువ దంపతుల వేపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగా వుంది. ఆమెకు కాస్త వుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా ఏదో అతను ఉద్యోగంలో వున్న దూరదేశానికి మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది.
 
గాలి పెరిగింది. బలంగా కిటికీ తలు పుల మీద ఒత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టిలో చీకటిగా అయిపోయింది ఎంచేతో. ఇంకా సాయంత్రం అయివుండదు. రావు గారి పక్కన కూర్చున్న పెద్దమనిషి కని పించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుకున్నారు. ఆయనకు రావుగారి వయస్సు వుంటుంది ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది.

ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్ట కాలుస్తూ దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. ఆయన రావుగారికంటె పెద్దవాడై యుంటాడు. కాని ముఖంలో చురుకు ఉంది. అయినా జారిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి.
 
తాను చాలా అదృష్టవంతుడని రావు గారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటె పెద్దదిలా కన్పిస్తుంది. ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే యిద్దరు పిల్లలున్నారనీ, అతను ఈమధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ చూసుకోవడం ప్రారంభించా డనీ వాళ్లెవ్వరూ అనుకోరు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించా లని నిశ్చయించుకున్నాడు.

మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని, కోరికలు వాళ్ల ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన యింట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టాడు. ఆ పద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికీ కూడా ఎంతో శాంతీ, సుఖం సమకూరుస్తోంది.
 
గాలి అరుస్తోంది. జల్లు కూడా ప్రారం భించింది. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి అటూ ఇటూ చూచి దూరంగా జరిగింది. చక్కగా దువ్విన తలకట్టులోనించి ముంగురులు విడిపోయి ఆమె నుదురుమీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తల దువ్వుకునే పద్ధతి రావుగారు నిర్ణ యించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ రావుగారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి.
 
గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీ వానా పెట్టెలోకి చొచ్చుకు వచ్చాయి. చినిగి పోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ నిలబ డింది. ముసలాయన ‘ఇది పరుపుల పెట్టి అని తెలియదూ’ అన్నాడు. ‘బాబ్బాయి! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాక సోటివ్వరా బాబుగారూ. దయగల బాబులు! బిడ్డలున్నాతండులు! ఓ కానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతంది బాబులు...’
 
రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లల్లో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయో జనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చ మెత్తుకోడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం.

ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్లి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు. ‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది.

ఆ బాబుగారికి యింత మాత్రం జాలి లేదు. ‘ఫో’ అంటాడు’.
 తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. ఇష్టం లేకపోయినా ఆమె వేపు చూస్తూ కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తే పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం.

ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడస్తుందోనని భయం. ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ‘డబ్బున్న దొరలున్నా రని, నాబోటి ముష్టిముండని ఆకలితో సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేముడ! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్లుంటారు. ఆళ్లకే ఎక్కువ జాలి. డబ్బున్నా బాబులంతా రాతిగుండె లని తెలుసుకోలేక పోయాన్రా దేముడా!
 
రావుగారి పక్కనున్న పెద్దమనిషి విచిత్రంగా ఆమెవేపు చూశాడు. ‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు.‘ఓ వూరేటి, ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్లకి. తమబోటి పెభువులకి వూళ్లుంటాయి. పెద్ద పెద్ద లోగిళ్లుంటాయి. గేటు ముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్లని రానీకుండా తరిమేయిత్తారు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’
 
‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని ఉద్దేశించి, ఇంగ్లీషులో. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకు తోంది. ముష్టిది పెట్టెలో యువ దంపతు లకు ఎదురుగా కూర్చుంది. యువకుడు అన్నాడు: ‘మాతో కూడా వచ్చేయ కూడదూ నువ్వు? పనీపాటా చేస్తూ వుందుగాని తిండీ గుడ్డా యిస్తామ్.’

 ‘ఏదో యిచ్చి దాన్ని పంపెయ్య కూడదూ?’ అంది యువతి భర్తని ఉద్దేశించి. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారి మనస్సు ఇతర విష యాలతో నిండిపోయింది. ఆయన గాలి వానను గురించీ, తను రైలులోంచి దిగడాన్ని గురించీ ఆలోచిస్తున్నాడు.

 రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో బట్టుకు లేచాడు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. తూలిపోయారు. ముష్టిమనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావు గారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలో చించడానికి అవకాశం లేదు. ఆమె సహా యాన్ని అంగీకరించక తప్పలేదు.

కాని ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లం ఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ. కాని రైలు దిగి స్టేషనులోకి పరుగెత్తి వెళ్లిపోయారు. ముష్టి ఆమె సామానుల బరువుతో తూలుతూ వెనకాల వచ్చింది. సామానులు వెయిటింగు రూములో పెట్టింది. ఎక్కడా ఒక్క దీపం లేదు. రావు గారు కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబో యాడు. ఆమె వద్దనలేదు గాని, ఏదో విన బడకుండా అని మాయమైపోయింది.
 
రావుగారు కూర్చున్నాడు. గింగురు మనే ఆ గాలిలో కళ్లు పట్టు తప్పిపోతు న్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమాడు. బాటరీ లైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. తడిబట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నాడు. స్వెట్టరు తొడుక్కున్నాడు. మఫ్లరు చెవులకు, తలకు చుట్టుకున్నాడు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు ఉండి తీరాలని బయటికి వచ్చాడు.

ఇద్దరు ప్లాట్ ఫారం దాటివెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషను మాష్టరనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు. ‘నేను వూర్లోకి వెళ్లాలి’ అన్నారు రావుగారు ఆదుర్దాగా. ‘చాలా కష్టం. రోడ్డుమీద అంగుళం అంగుళానికీ చెట్లు పడి వున్నాయి. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.’
 
‘కాని స్టేషన్‌లో యింకెవరూ లేరు.’
 ‘నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.’
 స్టేషను మాష్టరు వెళ్లిపోయాడు. రావు గారు వెయిటింగ్ రూంలోకి వెళ్లిపోయారు. మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావు గారికి  తోచలేదు. క్రమశిక్షణ, నియ మాలు, విలువలు అన్నీ కూడా మానవా తీతమైన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితాలైపోతాయని ఆయనకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది.

ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడా మానవ హృదయమన్నది లేదు. గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ గదిలో యింకో వస్తువేదో వున్నట్టు రావుగారికి కనిపించింది, తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వేపు చూశాడు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ వొక మూల నిలబడివుంది. ఆమె తడి వెంట్రు కలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది.
 
‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా ఉంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్లీ తలుపులు మూసి గదిలో వున్న కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు.

తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ‘‘ఏం గాలివానండి బాబుగారు. నేను పుట్టిన్నాటినుండి యింత గాలివాన నేను చూడలేదు’’ అంది ముష్టి ఆమె. ఆమె గొంతులో బెదురులేదు. అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడకల్గుతూందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశాడు. మూలగా వొణుకుతూ కూచున్నది. రావుగారు తన పంచ ఒకటి తీసి ఆమె వేపు విసరి ‘యిది కట్టుకో’ అన్నారు. కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్న చోట కూర్చుంది.
 
రావుగారికి ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది. బిస్కట్ల పొట్లం తీశాడు. ఒకటొ కటి చొప్పునా నమలడం ప్రారంభించాడు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని కొన్ని బిస్కట్లిచ్చాడు. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె వుండడం కొంత నయం. ఆమె దేన్ని గూర్చీ బాధ పడదు గాలీ వానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా ఆమెకు అనుభవమై వుంటాయి.
 
రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. ‘ఈ యిల్లు కూలిపోదు గదా?’ అని ఆయన అడిగారు. ‘ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువైతే ఏది ఆగుద్ది?’... ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం. ఆయన పెట్టె దగ్గరకు పోయి కూర్చు న్నాడు. ఆయన కూర్చున్న మూలకు ఆమె కూడా చేరింది. అక్కడ కూచుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది.
 
‘గాలివాన యింత ముదిరిపోతుందని నేననుకోలేదు.’
 ‘బాబుగారు ఎందుకలా భయపడతా’ రందామె. ‘ఒక్కరుండేకంటె యిద్దర మున్నాం గదా! టిక్కెట్టు కలెక్టరు రైలు కదులు తూంటే నన్ను దింపేశాడు, ఏం చేయను! ఇక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టుమెట్టుకోనాకి ఓ పొడి గుడ్డ యిచ్చారు. ఆకలికి మేత పడేశారు. వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అది లేదనీ, యిది లేదనీ సీకాకు పడితే ఏం లాభం?’
 
ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ మన మనస్సుకీ ఎంతో అంతరం వుంది. అయినా ఆ భయంకరమైన రాత్రివేళ తనకు తోడుగా ఆమె వున్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది.
 
‘నీకెవరూ చుట్టాలు లేరా?’ అన్నా రాయన. వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. రైలులో ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. కాని ఆమె మాటల్లో గానీ చేతల్లో గానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆయన దగ్గరగా జరిగింది.

 ‘సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగు తాడు. ఆడే మా అమ్మని సంపేశాడం టారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగ ముండావాడితో సేవితం కలిగింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటైపోయాయండి. ఇంట్లో తిండికీ తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి.
 
‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు?’
 ‘ఒక్కొక్కరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒక్కొక్కరోజు కానీ కూడా ఉండదు.’
 రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపిం చింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు గానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలు గానీ ఆమెకు లేవు.

ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకేసలా చూత్తారు?’ అంది. ‘మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.’
 వెంటనే ఆయన తనలోకి ముడుచుకు పోయారు. తన మనస్సులో అశ్లీలైన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచిం చినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది.
 ‘నీవేపు చూడ్డం లేదు’ అన్నారాయన గట్టిగా. ‘దీపం ఆర్పడం మరచిపోయాను.’
 
అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచు కున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదురైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీమీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలలోకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగలించు కున్నాడు. వెంటనే సిగ్గుపడ్డాడు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టి నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లాడు మూలలోకి.

ఆమె ఆయనను ఆ మూలలో కూచోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతు లాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన జరుగుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావ సరం. అంచేత ఆయన కాదనలేదు.
 ఆమె మరీ దగ్గరగా జరిగి వొళ్లోకి వాలింది. ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనా పరంపరలో మునిగిపోయాడు.

ఆమె మాట్లాడుతూనే వుంది. ‘ఈ మూల భయం లేదండి. బాబుగారికి చక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుచు కుంటున్నారు. మా గుడిసి ఎగిరిపోయుం టది. పిల్లేమైయుంటారో! ఇరుగు పొరు గోళ్లు సూత్తుంటార్లెండి. మావోడు చిత్తుగా తాగి పడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలు సుకంగా వున్నారో లేదో?’
 
ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆమెను గట్టిగా అదుముకున్నాడు క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానివేసింది. గాలి చేసే గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. కాలం అతి మెల్లగా జరుగుతోంది. కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలివల్ల వాన వారిద్దరినుంచీ దూరంగా రెండో పక్కకి పడుతోంది.

కొంతసేపటికి రావుగారి మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశాడు. అమాయికంగా, నిశ్చింతగా వుంది. స్వచ్ఛమైన, నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింప జేసింది.
 గాలివాన జోరు హెచ్చింది. కాని ఆయన మనస్సులో అమితమైన ప్రశాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మరచిపోయి నిద్రలో మునిగిపోయాడు. మళ్లీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది.

గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టి ఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం చూచుకున్నారు. ఐదుగంటలయింది. అనుకోకుండానే జేబులు తడుము కున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట ‘దొంగ ముండ’. కాని ఆమె అల్లా దొంగతనం చేసి వుంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గు మూలలా వెతికారు. కనబడలేదు. గదిలో నుంచి బయటికి వచ్చారు.

భీభత్సంగా వుంది. ప్లాట్‌ఫారం తప్ప చుట్టుపక్క లంతా నీటిమయం. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. ఏదో హాస్పిటల్‌లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టి నప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనెప్పుడూ చూడలేదు. వికారం వచ్చింది. వెనక్కు తిరిగాడు.
 టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది.

వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నాడు. ఆ కల్లోలాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ సామాను కింద ఏదో శరీరం ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టి ఆమె.
 తట్టుకోలేకపోయాడు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయి నట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది.

రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరా వుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి తొందరగా యింటికి పోయుంటాడు.
 రావు చిన్నపిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించాడు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నాడు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ శాంతినీ గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడి పోయి వుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రం లాగా ఆవేదనతో పొంగిపొరలింది.

తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు అనిపించింది. తన పర్సును దొంగలించినందుకు గాని, అంత గాలి వానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చు నని టిక్కట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసును. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్య గాని ఆయన పిల్లల్లో ఎవరుగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు.

ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం... అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే.
 అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకుని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందులోంచి డబ్బు తీసి తెరచి వున్న డ్రాయరులో వేసి డ్రాయరు మూశాడు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయన మనస్సు వొప్పలేదు.

తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేడు. అంతచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్నించి వెళ్లిపోయాడు.
 (స్థలాభావం కారణంగా కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది)
 - పాలగుమ్మి పద్మరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement