Rainstorm
-
గజం గాలిలో 25 కిలోల నీళ్లు..
మనకు నీళ్లు లేనిదే జీవితం గడవదు. భూమ్మీద మూడో వంతు నీళ్లే ఉన్నా.. మనం ఉన్నచోట కరువు ఉంటే మాత్రం బతుకు కష్టమే. ఉన్న నీళ్లలో చాలా వరకు సముద్రాల్లో, కొంతవరకు మంచు రూపంలో ఉన్నాయి. మనకు దిక్కయ్యే నీళ్లు చాలావరకు సరస్సులు, నదులు, ఇతర వనరుల్లోని నీళ్లే. అవీ వాతావరణం నుంచి వాన రూపంలో పడే నీళ్లే. మరి భూమ్మీద వాతావరణంలో మొత్తంగా ఎన్ని నీళ్లు ఉంటాయో, అంతా ఒక్కసారిగా వానలా కురిస్తే ఏమవుతుందో తెలుసా.. ఎక్కువ.. తక్కువ.. భూవాతావరణంలో నీళ్లన్నీ ఆవిరి, అతి సూక్ష్మమైన బిందువుల రూపంలో ఉంటాయి. మొత్తంగా భూమి అంతటా వాతావరణంలో నీళ్లు ఉన్నా.. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, పీడనం, ఇతర వాయువుల శాతం, సమీపంలో జల వనరులు, సముద్రమట్టంతో పోలిస్తే ఎత్తు వంటివాటికి అనుగుణంగా నీటి శాతంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కారణంగానే ఓ చోట ఎక్కువగా, మరోచోట తక్కువగా వానలు పడతాయి. - భూమిపైన వాతావరణం వందల కిలోమీటర్ల ఎత్తువరకు ఉన్నా.. నీటి ఆవిరి గరిష్టంగా 16 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే చేరగలుగుతుంది. ఇందులోనే మొత్తంగా 138.6 కోట్ల ఘనపు కిలోమీటర్ల పరిమాణంలో నీళ్లు ఉన్నట్టు అమెరికా జియాలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) అంచనా వేసింది. - ఒక ఘనపు కిలోమీటర్ నీళ్లు అంటే.. కిలోమీటర్ పొడవు, వెడల్పుతో, కిలోమీటర్ లోతు ఉన్న సరస్సులో పట్టేటన్ని నీళ్లు అనుకోవచ్చు. మరి 138.6 కోట్ల కిలోమీటర్ల నీళ్లు అంటే వామ్మో అనిపిస్తుంది కదా.. భూమి అంతటా 3 సెం.మీ. వాన మరి వాతావరణంలోని నీళ్లన్నీ ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా వానలా కురిస్తే.. మొత్తం భూమి అంతటా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. 3 సెం.మీ. అంటే తక్కువే అనిపించొచ్చు. కానీ అంతటా వాన అంటే.. అతిభారీ వరదలతో చాలా ప్రాంతాలు మునిగిపోయి, ఊహించలేని నష్టం జరుగుతుందని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఫాబ్రీ తెలిపారు. కిలోమీటర్ మేఘం 500 టన్నులు వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ఒకచోట చేరి మేఘాలు గా మారుతుంది. ఆ మేఘాలు చల్లబడి వాన పడుతుంది. మరి గాల్లో తేలిపోతూ ఉండే ఆ మేఘాల బరువెంతో తెలుసా? అమెరికాలోని కొలరా డోలో ఉన్న వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మార్గరెట్ లీమోన్ ఈ లెక్కను శాస్త్రీయంగా తేల్చారు. మేఘాల్లో ని నీటి ఆవిరి బరువు సగటున క్యూబిక్ మీటర్‌కు అర గ్రాము ఉంటుందని గుర్తించారు. ఒక క్యూబిక్ కిలోమీటర్ పరిమాణం ఉండే క్యుములో నింబస్ తరహా మేఘం బరువు ఏకంగా 500 మెట్రిక్ టన్నులుంటుందని తేల్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
స్వయంకృతాపరాధం!
చేసిన పాపం... శాపంగా మారడమంటే ఇదే! పట్టణాభివృద్ధి పేరిట కొన్నేళ్ళ విశృంఖలత్వానికి ఫలితం ఇప్పుడు భారత సాఫ్ట్వేర్ రాజధాని బెంగళూరులో కనిపిస్తోంది. వరుసగా రెండురోజులు రాత్రివేళ కురిసిన వర్షాలతో ప్రాథమిక పౌర వసతుల వ్యవస్థ కుప్పకూలి, అతలాకుతలమైన మహానగరం అంతర్జాతీయ వార్తగా మారింది. సంపన్నులు నివసించే ఖరీదైన ప్రాంతాలు సైతం నీట మునిగిపోయాయి. చుట్టూ నీళ్ళున్నా, అనేకచోట్ల రెండు రోజులుగా తాగునీరు రాని దుఃస్థితి. కరెంట్ కోత సరేసరి. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కోటీశ్వరులు సైతం పడవల్లో విలాస వంతమైన విల్లాలు వదిలి పోయిన పరిస్థితి. ప్రపంచ శ్రేణి సంస్థలు, వ్యాపారాలకు నెలవైన నగరంలో కనీస పౌర వసతులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే, వర్షాలు ఆగి, గంటలు గడిచినా పలు ప్రాంతాలు ఇప్పటికీ నడుము లోతు నీళ్ళలో నిస్సహాయంగా నిరీక్షిస్తున్నాయి. పట్టణ ప్రణాళిక లోపభూయిష్ఠమై, రియల్ ఎస్టేట్ దురాశ పెరిగితే, వాతావరణ మార్పుల వేళ మన నగరాలకు సంక్షోభం తప్పదని మరోసారి గుర్తుచేస్తున్న ప్రమాద ఘంటిక ఇది. వరుస వర్షాలతో బెంగళూరులోని కీలక ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)లో ప్రయాణ, వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ‘భారత సిలికాన్ వ్యాలీ’లోని ఆ రోడ్డులోనే మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మోర్గాన్ స్టాన్లీ లాంటి బడా అంతర్జాతీయ సంస్థల ఆఫీసులన్నీ ఉన్నాయి. వాన నీటితో అంతా స్తంభించి, స్థానికంగా కోట్ల రూపాయల మేర ఉత్పత్తి పడిపోయింది. రోడ్లపై నీళ్ళు నిలిచిపోవడంతో బడా బడా సీఈఓలు సైతం చివరకు ట్రాక్టర్లు ఎక్కి వచ్చిన పరిస్థితి. ఆధునిక టెక్నాలజీ కారిడార్లోనే ప్రాథమిక వసతులు ఇలా పేకమేడలా ఉన్నాయంటే, మిగతా నగరంలో ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఆదివారం నాటి వర్షపాతం బెంగళూరు చరిత్రలోనే సెప్టెం బర్‌లోకెల్లా మూడో అతి భారీ వర్షపాతమని నిపుణుల మాట. అందుకు తగ్గట్టుగా పౌర వసతులను తీర్చిదిద్దుకోకపోవడమే పెను సమస్య. బెంగళూరులోని మొత్తం 164 చెరువులూ నిండిపోయాయి. ఇంత భారీ వర్షాల తర్వాతా పాత బెంగళూరు నిలకడగా ఉన్నా, వైట్‌ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఆఫీసులకు నెలవైన ఖరీదైన కొత్త బెంగళూరు ప్రాంతం చిక్కుల్లో పడడం తప్పు ఎక్కడ జరిగిందో చెబుతోంది. ప్రస్తుత దుఃస్థితికి పాత కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీజేపీ, ప్రస్తుత కాషాయ ప్రభుత్వ అసమర్థత – అవినీతి మూలమని కాంగ్రెస్ పార్టీ పరస్పర నిందారోపణల్లో పడ్డాయి. నిజానికి, ఈ తిలాపాపంలో తలా పిడికెడు భాగం ఉంది. రెండు నదుల మధ్య లోయలా, అనేక చెరువులు, నీటి పారుదల వ్యవస్థలు, ఉద్యానాలు నిండిన నగరం బెంగళూరు. ఐటీ విజృంభణతో పట్టణాభివృద్ధి పేరిట ఇష్టారాజ్యంగా చేసిన భవన నిర్మాణాలు చెరువులను ఆక్రమించాయి. నీటి పారుదలను అడ్డగించేశాయి. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన నగర పాలక సంస్థ, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు కళ్ళు మూసుకొని, భవన నిర్మాతల అత్యాశను అనుమతించారు. చివరకు పకడ్బందీ ప్రణాళిక లేని మైసూరు – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం సైతం పౌర వసతులపై ఒత్తిడి పెంచేస్తుండడం విషాదం. నిజానికి, ఇది ఒక్క బెంగళూరు పరిస్థితే కాదు. పట్టణ ప్రణాళికలోని లోపాలు, నియమ నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం, అధికారుల అలసత్వం, పెను వాతావరణ మార్పులతో తలెత్తిన సంక్షోభం – ఇవన్నీ మన దేశంలోని అనేక నగరాలను పట్టి పీడిస్తున్నాయి. వాటి ఫలితం 2005లో ముంబయ్, 2015లో చెన్నై, 2016లో గురుగ్రామ్, 2020లో హైదరాబాద్, 2021లో కోల్‌కతా, ఢిల్లీ – ఇలా అనేకచోట్ల చూశాం. కొండలు గుట్టల్ని మింగేసి, చెరువుల్ని కబ్జా చేస్తే భారీ వర్షం కురిసినప్పుడల్లా ‘ఆకస్మిక వరదలు’ తప్పవని హైదరాబాద్, చెన్నై సహా అన్నీ పదే పదే గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికీ శరవేగంతో సాగుతున్న పట్టణీకరణ వల్ల నగరాలపై భారం పెరుగు తోంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలైన మన నగరాలు మరో దశాబ్దంలో ప్రతి 10 మంది భారతీయుల్లో నలుగురికి ఆవాసమవుతాయని అంచనా. ఈ పరిస్థితుల్లో పదే పదే ముంచెత్తుతున్న వరదలు, వాతావరణ మార్పుల రీత్యా ఇటు అభివృద్ధితో పాటు, అటు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని తీరాలి. పటిష్ఠమైన అభివృద్ధి, పర్యావరణ రక్షణ ప్రణాళిక లేకపోతే, కొన్నేళ్ళుగా వివిధ నగరాల్లో చూస్తున్న వరదలు, ఉష్ణతాపాలు అన్నిచోట్లా నిత్యకృత్యమవుతాయి. ఇకనైనా పరిస్థితులు మారాలంటే, పట్టణాలలో కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. చెరువులు, నదీతీరాల్లో ఆక్రమణలను అడ్డగించాలి. పంటలు పండే మాగాణి నేలల్నీ, పర్యావరణానికి కీలకమైన మడ అడవుల్నీ రియల్ ఎస్టేట్ మూర్ఖత్వానికి బలి చేస్తే, దాని దుష్ఫలితం అనుభవిస్తామని గ్రహిం చాలి. ఇవాళ్టికీ అనేక నగరాల్లో బ్రిటీషు కాలం నాటి ఏర్పాట్లే ఉన్న మనం వర్షపు నీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులనూ, వాటి నుంచి నీళ్ళు పోయే మార్గాలనూ కాపాడుకోవాలి. అంతులేని ఆశతో, అజ్ఞానంతో వాటిని ధ్వంసం చేస్తే, మన చెత్తతో వాటిని నింపేస్తే ఆనక తాజా బెంగళూరు లాంటి అనుభవాలతో చింతించాల్సి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే, పాలకుల్లో నిజాయతీ, చిత్తశుద్ధి ముఖ్యం. అన్నీ సవ్యంగా ఉంటేనే అప్పుడది సుపరిపాలన. ప్రభుత్వాలు అది గుర్తించాలి. చైతన్యవంతమైన పౌర సమాజం సైతం తన వంతుగా బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రయోజనం. ‘నమ్మ బెంగళూరు’ చెబుతున్న పాఠం ఇదే! -
‘మహా ప్రళయమే’ ముంచుకొస్తోందా? అనే స్థాయిలో ప్రచండ గాలులు
టోక్యో: ఈ ఏడాదిలో అత్యంత శక్తివంతమైన గాలివాన తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్.. ఇప్పుడు దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. మహా ప్రళయమే ముంచుకొస్తోందా అనే రేంజ్లో ముందుకొస్తోంది తుపాను. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్ దీవుల దూసుకువస్తోంది. దీంతో తూర్పు చైనా, జపాన్ సహా పలు దేశాలు, దక్షిణ దీవులు భయాందోళనలకు లోనవుతున్నాయి. సూపర్ టైపూన్ హిన్నమ్నోర్గా నామకరణం చేసిన ఈ శక్తివంతమైన తుపాను.. 50 అడుగుల ఎత్తులో.. గంటకు 160 మైళ్లు(257 కిలోమీటర్ల) వాయువేగంతో దూసుకొస్తోందని అమెరికా జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ ప్రభావంతో గాలులు గంటకు 195 మైళ్ల (314 కిలోమీటర్ల) వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ఈ ప్రభావం.. చైనా, జపాన్‌తో పాటు ఫిలిప్పీన్స్‌పైనా తీవ్రంగా చూపించనుంది. చిన్న చిన్న ద్వీపాలపై దీని ప్రభావం మరింతగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు, భారత్ తీర ప్రాంతాలపై ప్రభావం తక్కువగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2.5-minute rapid scan #Himawari8 Infrared images showing Super Typhoon #Hinnamnor as it reached Category 5 intensity while approaching the island of Minamidaitōjima, Japan (station identifier ROMD): https://t.co/oPnRJDgHbY pic.twitter.com/zIkcWGDrEG — UW-Madison CIMSS (@UWCIMSS) August 30, 2022 ఈ ఏడాదిలో వేగం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దూసుకొచ్చిన 11 తుపానులలో.. హిన్నమ్నోర్ అత్యంత శక్తివంతమైన తుపానుగా పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు జపాన్ ఒకినావా నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం తుపాను కేంద్రీకృతమై ఉందని, గంటకు 22 కిలోమీటర్ల వేగంతో రియూక్యూ ద్వీపాల వైపు దూసుకొస్తోందని హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఇప్పటికే జపాన్ తీర ప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్రమక్రమంగా పశ్చిమం వైపు కదులుతూ ఈ తుపాను బలహీన పడొచ్చని అంచనా వేస్తున్నారు. BREAKING: TY #Hinnamnor is now a SUPER TYPHOON in PAGASA. This was based on their 4 PM Daily Weather Update. It will retain its "super typhoon" status as it enters PAR tomorrow, becoming the first storm to do so since #OdettePH (#Rai) in 2021, and the fourth overall since 2015. pic.twitter.com/2TCLDZRlKS — Matthew Cuyugan (@MatthewCuyugan) August 30, 2022 ఇదిలా ఉంటే.. ఆఫ్రికా, కరేబియన్ మధ్య ఉండే అట్లాంటిక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రశాంతత వాతావరణం నెలకొంది అక్కడ. సాధారణంగా ఆగస్టు నెల తుపాను సీజన్ అయినప్పటికీ.. దాదాపు 25 తర్వాత ఈ రీజియన్‌లో ఇలా ప్రశాంత వాతావరణం కనిపిస్తుండడంపై వాతావరణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Super Typhoon #Hinnamnor has rapidly intensified in the Western Pacific Ocean with sustained winds of 150 mph and gusts up to 185 mph and could impact Miyakojima of the Miyako Islands of Okinawa. @JaneMinarWX with the latest. pic.twitter.com/V6Cp4UqDCS — FOX Weather (@foxweather) August 31, 2022 ఇదీ చదవండి: అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన చిన్న ద్వీపం -
ముంబైకి తీవ్ర తుపాన్ ప్రభావం
సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపాన్‌గా మారనుంది తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా అల్పపీడనం జూన్ 3న తీరం తాటుతుందని పేర్కొంది. కాగా, తుపాన్ మహారాష్ట్రను దాటే క్రమంలో ముంబై నగరంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్రా పేర్కొన్నారు. సోమవారం ఉదయం అల్పపీడనం ఉధృతంగా మారినట్లు తెలిపారు. (నీతి ఆయోగ్‌లో కోవిడ్-19 కలకలం) ఇక ముంబైకి 700 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 105 నుంచి 110 కిలో మీటర్ల వేగంగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్ ప్రాంతాల్లో ఓ మోస్తర్ వర్షం కురిసింది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. సముద్రంలోకి వెళ్లే మత్సకారులను మూడు, నాలుగు రోజులు వెళ్లవద్దని కోరారు. రానున్న రెండు రోజుల్లో త్రీవ తుపాన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
గాలి, వాన బీభత్సం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా కొన్ని చోట్ల కొంత మేర పంట నష్టం వాటిల్లింది. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. విశాఖ జిల్లాలో ఇద్దరు మృతి విశాఖ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. అటు ఏజెన్సీ ప్రాంతంలోనూ భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఇళ్ల మీద విరిగిపడడంతో ఇళ్లు దెబ్బతిన్నాయి. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. రెంటచింతలలో గరిష్ట ఉష్ణోగ్రత 43.1 డిగ్రీలు గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 43.1 కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రెంటచింతలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది. విజయవాడలో శనివారం రాత్రి భారీగా వర్షం కురుస్తున్న దృశ్యం పొలాల్లో 35 మేకలు మృతి ► కడప, అనంతపురం జిల్లాల్లో గాలి, వాన భీభత్సం కారణంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ లైన్లు, పోల్స్ దెబ్బతిన్నాయి. ► చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. తిరుమలలో వర్షం కురిసి ఆలయం ముందు నీరు నిలిచింది. ► విజయనగరం జిల్లాలో ఎస్.కోట, సాలూరు నియోజకవర్గాల్లో వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి, మొక్క జొన్న పంటలకు స్వల్ప నష్టం వాటిల్లింది. జిల్లాలో రెండు సెంటీ మీటర్ల వర్షం పడిందని అంచనా. పాచిపెంట మండలంలో పిడుగు పడి అరకుకు చెందిన ఒక మహిళ మృతి చెందింది. ► శ్రీకాకుళం జిల్లాలో కురుసిన అకాల వర్షం, పిడుగుల కారణంగా జలుమూరు మండలం హుస్సేనుపురం సమీపంలోని తంపర పొలాల్లో 35 మేకలు మృత్యువాత పడ్డాయి. ► తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మూడేళ్ల చిన్నారి మడదా శ్రీధరి పిడుగుపాటు కారణంగా మరణించింది. మూడ్రోజుల పాటు ఉత్తరాంధ్రకు వర్షాలు సాక్షి, విశాఖపట్నం : ఛత్తీస్‌గఢ్, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా దక్షిణ తమిళనాడు, తూర్పు మధ్యప్రదేశ్, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి ఈనెల 27 వరకూ గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కోస్తాంధ్రతో పాటు, ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. -
ముంచెత్తిన గాలివాన
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవా రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు నెలకొనగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలముకొని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మరణించగా చాలా ప్రాంతాల్లో వందలాది విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగిపడటం, రేకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో వివిధ జిల్లాల్లో ఆస్తి నష్టం సంభవించింది. గాలివానకు ఎల్బీనగర్లో విరిగిపడిన చెట్టు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈదురుగాలులకు తాటిచెట్టు మధ్యకు విరిగిపోవడంతో ఆ సమయంలో చెట్టుపైనే ఉన్న శిఖ చంద్రయ్య (47) అనే గీత కార్మికుడు కిందపడి మృతి చెందాడు. దేవరకొండకు చెందిన ఏలే ఓంకారం (49) ఓ చెట్టు కింద కూర్చోగా ఈదరుగాలులకు ఆ చెట్టు కూలి మీద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాళ్ల జనగాం, మల్లాపురం, ధాతార్పల్లి, లప్పానాయక్ తండా, జంగంపల్లి గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చలిమెడ గ్రామంలో ఓ రైతు కోళ్ల ఫారం కూలిపోవడంతో 10 వేల కోళ్లు చనిపోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కోలాంగూడకు చెందిన సీడాం వనిత (18) మొక్కజొన్న పంట చేను కాపలాకు వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించింది. వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలో కురిసిన వడగళ్ల వానకు మామిడి, వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాలతోపాటు కల్వకుర్తిలో గంటసేపు భారీ వర్షం కురిసింది. కల్వకుర్తిలో వందేళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురంలో తాటిచెట్టు పడటంతో మరణించిన గీత కార్మికుడు విరిగిపడ్డ టెలిఫోన్ టవర్... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం టీజీపల్లిలో గాలివాన తీవ్రతకు గ్రామ టెలిఫోన్ టవర్ కూలిపోయింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కేజీబీవీ సమీపంలో ఈదురుగాలులకు పెద్ద చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో మూడు ట్రాన్స్ఫార్మర్లు, తొమ్మిది విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. పార్‌పెల్లిలో 12 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పడ్డాయి. మండల కేంద్రానికి చెందిన చాంద్, రాజ్ అనే వ్యక్తులు పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్పేటలో ఏకంగా 8.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అదే జిల్లా మహేశ్వరం మండలం మంకాల్‌లో 7 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా తొర్రూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా టీజీపల్లిలో గాలివానకు కూలిన టెలిఫోన్ టవర్ బోధన్ హైవేపై స్తంభించిన రాకపోకలు... నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గాలివాన తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్ల రేకులు ఎగిరి పోయాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బోధన్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో రాకపోకలు స్తంభించాయి. బోధన్ మండల కేంద్రంలో చెరుకు రసం విక్రయించే దుకాణాదారుని గల్లా పెట్టెలో నుంచి సుమారు రూ. 3 వేలు గాలికి కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈదురుగాలికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రాజధానిలో జోరువాన... ఉపరితల ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల భారీ ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వర్షపునీరు పోటెత్తి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. నగరంలోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శివాజీ (18) అనే బీటెక్ విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ట్యూషన్‌కు వెళ్లిన తన సోదరుడిని తీసుకొచ్చేందుకు గొడుగు వేసుకొని బయటకు వచ్చిన అతను ఓ స్కూలు సమీపంలో నిలబడగా అక్కడి విద్యుత్ స్తంభానికి గొడుగు పైభాగం తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గరిష్టంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా సాయంత్రం కురిసిన వర్షంతో నగరవాసులకు ఉపశమనం లభించింది. బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్‌లో కురుస్తున్న భారీ వర్షం మరో ఐదు రోజులు ఇంతే: హైదరాబాద్ వాతావరణ కేంద్రం నైరుతి రుతుపవనాల రాకకు ముందు రా ష్ట్రంలో వచ్చే 5 రోజులపాటు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వడగాడ్పులు వీస్తాయని, సాయంత్రం 4 గంటల తర్వాత అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. -
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం
-
ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్‌లైట్ టవర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సికింద్రాబాద్, కుత్బులాపూర్, తిరుమలగిరి, ఉప్పల్, మేడిపల్లి, బొల్లారం, ముషీరాబాద్, కాప్రా, కొత్తపేట, చైతన్యపురి, నాచారం, తార్నాక, దిల్సుఖ్నగర్లలో సోమవారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ కుప్పకూలింది. టవర్ రోడ్డు మీద పడటంతో దాని కింద చిక్కుకున్న ఒకరు మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం కాగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతున్ని ఆయాకర్ భవన్లో పనిచేసే సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. గాయపడినవారిని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డిలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ షెడ్ కూలిపోయింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరుగుతున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఆదేశించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్ఆర్డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. -
భారీ వర్షాల ధాటికి ముంబై అతలాకుతలం
-
భారీ వర్షాలు : మరో వంతెనకు పగులు
ముంబై : భారీ వర్షాల ధాటికి ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రెండు బ్రిడ్జిలకు పగుళ్లు రాగా, తాజాగా ఘట్కోపూర్ రైల్వే స్టేషన్లో ఉన్న పాదచారులు వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదకర స్థాయిలో పగుళ్లు ఏర్పడటంతో దీన్ని మూసి వేశారు. 40-50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు పలుమార్లు మరమ్మత్తులు చేశారు. అయితే, భారీ వర్షాల కారణంగా వంతెన పూర్తిగా దెబ్బతిని పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. మహారాష్ట్రలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గోవా, దక్షిణ గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
బాన్సువాడలో గాలివాన బీభత్సం
సాక్షి, నిజామాబాద్ : బాన్సువాడ సబ్ డివిజన్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు పలు ఇంటి రేకుల షెడ్లు ఎగిసి పడ్డాయి. గాలివానకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, ఇళ్లపై ఉన్న వాటర్ ట్యాంక్‌లు, మామిడి చెట్లు, విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలతో పాటు వైర్లు కూడా తెగిపడడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
వణికిన గ్రిడ్
- ఒక్కసారిగా సగానికి పడిపోయిన విద్యుత్ డిమాండ్ - రాత్రంతా అంధకారంలోనే హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్: గాలివాన రేపిన దుమారంతో విద్యుత్ గ్రిడ్ వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అకస్మాత్తుగా పడి పోయింది. దాంతో, బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 7,177 మెగావాట్లున్న విద్యుత్ డిమాండ్ కాస్తా అర్ధరాత్రి 11.59 గంట ల ప్రాంతంలో ఒక్కసారిగా 3,459 మెగావాట్లకు పడిపోయింది. ఇలా డిమాండ్ ఒక్కసారిగా సగా నికి పైగా తగ్గిపోవడంతో విద్యుత్ గ్రిడ్ కుప్ప కూలి రాష్ట్రమంతటా చీకటయ్యే ప్రమాదం ఏర్ప డింది. ట్రాన్స్‌కో, జెన్కో అప్రమత్తంగా వ్యవ హరించడంతో గండం గడిచింది. బొగ్గుతో నడి చే థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తిని ఒక్కసా రిగా 70% మించి తగ్గించే అవకాశం ఉండదు. దాంతో థర్మల్ కేంద్రాలను బొగ్గుకు బదులు ఆయిల్‌తో నడిపి అప్పటికప్పుడు విద్యుదుత్ప త్తిని తగ్గించినట్టు ట్రాన్స్‌కో ఇన్చార్జి సీఎండీ సి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ డిమాండ్‌కు సమానంగా సరఫరా ఉంటేనే గ్రిడ్ సురక్షితంగా ఉంటుంది. హెచ్చుతగ్గులుంటే గ్రిడ్ కుప్పకూలి రాష్ట్రమంతటా అంధకారం నెలకొనే ప్రమాదముంటుంది. అంధకారంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని దక్షిణ రాష్ట్రం లో పలు ప్రాంతాల్లో అం«ధకారం నెలకొంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) పరిధిలో మంగళవారం మధ్యాహ్నం గరిష్టంగా 5,003 మెగావాట్లుగా నమో దైన విద్యుత్ డిమాండ్ అర్ధరాత్రి వర్షం కారణం గా 2,160 మెగావాట్లకు పడిపోయింది. ప్రధా నంగా హైదరాబాద్‌లో రాత్రంతా చీకట్లు నెలకొ న్నాయి. పాత మహబూబ్‌నగర్, మెదక్, నల్ల గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ జిల్లాల పరిధిలో 405 విద్యుత్ స్తంభాలు, 22 ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. రంగారెడ్డి నార్త్ సర్కిల్ పరిధిలో 100, రంగారెడ్డి సౌత్, హైదరాబాద్ నార్త్ సర్కిళ్ల పరిధిలో మరో 120 స్తంభాలు కుప్పకూలాయని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం దాకా 3,000కు పైగా ఫిర్యాదులందాయి. హైదరాబాద్‌లో కూకట్పల్లి, మేడ్చల్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, గ్రీన్లాండ్స్, ద్వార కాపురి కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీల్లో సరఫరాకు అంతరాయం కలిగింది. మొత్తంగా గ్రేటర్లో 340 విద్యుత్ ఫీడర్ల పరిధిలో అంతరా యం కలిగింది. యుద్ధప్రాతిపదికన బుధవారం సాయంత్రంలోగా 324 ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్ధరించినట్టు టీఎస్ఎస్పీడీ సీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి పేర్కొన్నారు. నగరంలో ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ‘‘సంస్థ పరిధిలో దాదాపు 99 శాతం సరఫరాను పునరుద్ధరించాం. గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లకు దాదాపుగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాం. వ్యవసాయ కనెక్షన్లకు ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరిం చలేదు. అయితే వర్షం కారణంగా వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ కూడా లేదు. సరఫరా నిలిచిపోయిన పేదల గృహాలకు ఉచితంగా సర్వీసు వైర్లు బిగించి తక్షణం సరఫరా పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించాం’’ అని వెల్లడించారు. సమస్యలుంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌తో పాటు 9490619846, 7382071574, 7382072104, 7382072106 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
ఈ నగరానికి ఏమైంది?
- ఒక్క గాలివానకే హైదరాబాద్ అతలాకుతలం - పెద్ద తుఫాను వస్తే జరిగే అనర్థం ఊహాతీతం 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే ఇంత బీభత్సం సగానికిపైగా నగరంలో అంధకారం వాతావరణ మార్పులతోనే తీవ్రగాలులు, జడివాన ఇక ముందు మరింత తీవ్రంగా ఉండే అవకాశం భూగర్భ కేబుల్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలను విస్తరించాలి.. రహదారులను మెరుగుపర్చాలని సూచనలు (చూడండి: హైదరాబాద్ లో వర్ష బీభత్సం ఫొటోలు) సాక్షి, హైదరాబాద్: కేవలం అరగంట పాటు కురిసిన గట్టి గాలివానకే భాగ్య నగరం అతలాకుతలం అయిపోయింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుకే విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, చెట్లు కూలిపోయి, తీగలు తెగిపోయి అంతా బీభత్సంగా మారింది. నగరంలో చాలా భాగం ఒకటిన్నర రోజులుగా అంధకారంలో మునిగిపోయింది. కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతిన్నది. ఎక్కడికక్కడ గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారులు, మురుగునీటి కాల్వలన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి... అరగంట పాటు ఈదురుగాలులతో కురిసిన జడివాన ధాటికే ఇలా ఉంటే... హుద్‌హుద్ వంటి తుఫాను వస్తే, 150 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఓ గంట తర్వాత హైదరాబాద్‌లో చూడడానికేమీ ఉండదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగిన చర్యలు చేపట్టకపోతే... హైదరాబాద్ విశ్వనగరం కాదని, అసలు ఎవరూ ఉండలేని దుర్భర నగరంగా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉండడంతోనే తీవ్రత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పడిన మేఘాల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే గంటకు 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలితో తేమ ఎక్కువగా ఉండడం వల్లే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80 శాతానికిపైగా గాలిలో తేమ ఉంది. దీనికి ఉష్ణోగ్రత పెరుగుదల తోడైతే వాతావరణంలో అస్థిరత ఏర్పడుతుంది. హైదరాబాద్‌లో మూడు రోజుల కింద 35 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 38.6కు పెరిగింది. దీంతోపాటు గాలిలో తేమ శాతం పెరగడంతో మేఘాలు తీవ్రరూపం దాల్చాయి. ఇలాంటి సమయంలో అధిక శక్తితో గాలి నెట్టబడుతుంది. అందుకే మేఘం ఆవరించిన ప్రదేశమంతా గాలి విధ్వంసం చోటు చేసుకుంటుంది. - రాజారావు, హైదరాబాద్ వాతావరణ అధికారి భూగర్భ కేబుల్ వ్యవస్థ అవసరం వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా భవిష్యత్తులో మరింత వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని, ఒక్కసారిగా మేఘాలు ఏర్పడి జడివానలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలా జరిగితే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోతాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల హైదరాబాద్‌లో భూగర్భ కేబుళ్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తే మేలని సూచిస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే ముందు ముందు సమస్యలు మరింత తీవ్రమవుతాయని స్పష్టం చేస్తున్నారు. చిన్న గాలివానకే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని... ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇరవయ్యేళ్ల కిందే భూగర్భ కేబుల్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు మెరుగుపడాలి హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లడం, రోడ్లు జలమయం కావడం, ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించి పోవడం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. దాంతో పలు చోట్ల రహదారులు గుంతలుగా తయారయ్యాయి. ఇది వాహనదారులకు నరకం చూపించింది. ఇలాంటిది ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే నగరంలో జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అప్పుడు విశ్వనగరం కాదుకదా.. అభాగ్య నగరంగా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీరు వేగంగా వెళ్లిపోయే స్థాయిలో డ్రైనేజీలను నిర్మించాలని.. ఆక్రమణలను తొలగించి విస్తరించాలని సూచిస్తున్నారు. రహదారులను కూడా సరైన స్థాయిలో అభివృద్ధి చేయాలని స్పష్టం చేస్తున్నారు. హోర్డింగ్‌లతో వ్యాపారం వద్దు హైదరాబాద్‌లో ఏ మూలన చూసినా కనిపించే భారీ హోర్డింగ్‌లతో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనేదానికి శుక్రవారం నాటి పెనుగాలులతో వాటిల్లిన విధ్వంసమే ఉదాహరణ. ఎడాపెడా హోర్డింగ్‌లకు అనుమతిస్తున్న జీహెచ్ఎంసీ... వాటి ఏర్పాటుకు ఏజెన్సీలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయా, లేదా అన్నది పట్టించుకోవడం లేదు. నాసిరకంగా, తక్కువ ఖర్చుతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి... భారీగా ఆదాయం ఆర్జించుకుంటున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వంగానీ, జీహెచ్‌ఎంసీగానీ పట్టించుకోలేదు. వాస్తవానికి శుక్రవారం నాటి పెనుగాలులు హైదరాబాద్‌వ్యాప్తంగా వీచి ఉంటే.. పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు కూలిపోయి భారీగా ప్రాణనష్టం ఉండేదని అధికారులే పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లకు అనుమతులు రద్దు చేసి నిర్ణీత నిబంధనలతో తిరిగి అనుమతిచ్చే విషయాన్ని జీహెచ్ఎంసీ పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలపై ఎడాపెడా ఏర్పాటవుతున్న మొబైల్ టవర్లకు సంబంధించి కూడా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకులకు తిప్పలు.. పెనుగాలుల ధాటికి కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో హైదరాబాద్‌లోని అనేక బ్యాంకులు శనివారం కార్యకలాపాలు నిర్వహించలేదు. ఆన్లైన్ వ్యవస్థ పని చేయకపోవడంతో చాలా చోట్ల ఏటీఎంలు కూడా పనిచేయలేదు. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. వణికిపోయిన విమానం శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెనుగాలులకు వణికిపోయింది. విమానం తీవ్రంగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ఏ మాత్రం తేడా వచ్చినా విమానం కూలిపోయి, అందులోని ప్రయాణికులంతా బలయ్యేవారే. దీనిపై పౌర విమానయాన శాఖకు ఫిర్యాదు అందింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతించడం వల్లే తమ విమానం టేకాఫ్ అయిందని... అందులో పైలట్ తప్పిదమేమీ లేదని శుక్రవారం రాత్రే స్పైస్‌జెట్ సంస్థ పౌర విమానయాన శాఖ డెరైక్టర్ జనరల్‌కు వివరణ ఇచ్చారు. అయితే స్పైస్‌జెట్ విమానం తీవ్ర కుదుపులకు లోనైనట్లు గుర్తించిన ఏటీసీ అధికారులు ఆ తరువాత దాదాపు 30 నిమిషాల పాటు విమానాల ల్యాండింగ్‌కు, టేకాఫ్‌కు అనుమతించలేదు. పెనుగాలులను ఏటీసీ అంచనా వేయలేకపోవడం, వాతావరణం బాగా లేని సమయంలో విమానం టేకాఫ్‌కు అనుమతించడంపై పౌర విమానయాన శాఖ విచారణ జరుపుతోంది. -
అతలాకుతలం గాలివాన బీభత్సం
♦ ఈదురు గాలులకు కూలిన పెంకుటిళ్లు, ♦ చెట్లు, విద్యుత్ స్తంభాలు ♦ సిర్గాపూర్‌లో పిడుగుపాటుకు రైతు మృతి ♦ పలుచోట్ల వడగళ్ల వాన జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలులు, వడగళ్ల వానకు అపార నష్టం జరిగింది. గజ్వేల్, తొగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, సంగారెడ్డి, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. పలుచోట్ల పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలగా... వరి పంట నేలవాలింది. అక్కడక్కడా విద్యుత్ తీగలు తెగిపోవడంతో అంధకారం నెలకొంది. కల్హేర్ మండలం సిర్గాపూర్‌లో పిడుగుపాటుకు రైతు మృతి చెందగా నారాయణఖేడ్‌లో పెంకుటిల్లు కూలడంతో చిన్నారితోపాటు వృద్ధురాలి గాయాలయ్యాయి. కంగ్టి మండలం నాగన్‌పల్లిలో తొమ్మిది పశువులు మృత్యువాత పడ్డాయి. దౌల్తాబాద్‌లో వడగళ్ల వానకు పలు సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. - సాక్షి నెట్వర్క్ నారాయణఖేడ్‌లో నారాయణఖేడ్‌లోని మంగల్‌పేట్‌లో మంగళవారం భారీ వర్షానికి గంగాధర్‌కు చెందిన పాత పెంకుటిల్లు ఒక్కసారిగా కూలిపోయింది. ఇంట్లో అద్దె కు ఉంటున్న మల్లవ్వ (65), అమ్ము లు(5)కు స్వల్ప గాయాలయ్యాయి. మల్లవ్వ అంధురాలు కావడంతో కూతురు సుజాత తన ఐదేళ్ల పాపను ఇంట్లో పెట్టి సుజాత తాళం వేసి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికి ఇల్లు కూలిపోయింది. స్థానికులు గమనించి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి గాయపడిన వృద్ధురాలు, బాలికను 108లో నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తొగుటలో తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం కురిసిన గాలి వానకు దళితవాడలో చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడ్డాయి. భారీ వృక్షం ఇంటిపై పడడంతో పాక్షికంగా దెబ్బతింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వెంకట్రావ్పేట, పల్లెపహడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామా ల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. గజ్వేల్‌లో గజ్వేల్ నియోజకవర్గంలో మంగళవారం భారీ వర్షం పడింది. గాలి తీవ్రతకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కొన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది. గజ్వేల్ మార్కెట్‌యార్డులో ధాన్యం తడిసిపోయింది. పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చెట్టు విరిగిపడింది. ప్రజ్ఞాపూర్‌లో హోర్డింగ్‌లు నేల కూలింది. పలు గ్రామాల్లో రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి దౌల్తాబాద్‌లో దౌల్తాబాద్ మండలంలో వడగళ్ల వాన పడింది. మంగళవారం సాయంత్రం కురిసిన వానకు పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. తిమ్మక్కపల్లి, అనాజీపూర్, మంతూరు గ్రామాల్లో వరి పంట దెబ్బతింది. మంతూరులో చెట్లు నేలకొరిగాయి. అనాజీపూర్, రాయపోలు, దొమ్మాట, ముబారస్పూర్, దౌల్తాబాద్, మహ్మద్‌షాపూర్ 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలకు సరఫరా నిలిచిపోయింది. -
గాలివాన
క్లాసిక్ కథ ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయోజనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండోతరగతి పెట్టె ఎక్కుతుంటే తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచి వుంటుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దాని మీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలు గుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పట్టాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ. వాళ్లని చూస్తే ఆయనకు ఎంతో గర్వం. రైలు పెట్టెలో మూడు మెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచు కున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు చిరాకు పడుతున్నట్టు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టి లోకి వెడితే బాగుంటుందని అనిపించింది. కాని రైలు కదిలిపోయింది. కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించాడు. కిటికీల పక్కనివున్న రెండు మెత్తల మీదా ఇద్దరు పెద్ద వయసువాళ్లు కూర్చున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆ యువకుని భార్య అయివుంటుంది. సిగరెట్టు పొగ మెల్లని ఘాటు రావుగారి నాసికా రంధ్రాలలోకి తెలియకుండానే ప్రవేశించి ఒక క్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. రైలుపెట్టెలో సిగరెట్టు పొగ గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయా లున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలు న్నాయి. ఆయన వేదాంతి. వేదాంతం జీవితం తోటీ, జీవన విధానం తోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ అనుబంధించి వుంటుం దని ఆయన వాదము. ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచి వక్తగా కూడా ప్రఖ్యాతి పొందాడు. ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడం కోసం. రావుగారు యువ దంపతుల వేపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగా వుంది. ఆమెకు కాస్త వుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా ఏదో అతను ఉద్యోగంలో వున్న దూరదేశానికి మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. గాలి పెరిగింది. బలంగా కిటికీ తలు పుల మీద ఒత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టిలో చీకటిగా అయిపోయింది ఎంచేతో. ఇంకా సాయంత్రం అయివుండదు. రావు గారి పక్కన కూర్చున్న పెద్దమనిషి కని పించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుకున్నారు. ఆయనకు రావుగారి వయస్సు వుంటుంది ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్ట కాలుస్తూ దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. ఆయన రావుగారికంటె పెద్దవాడై యుంటాడు. కాని ముఖంలో చురుకు ఉంది. అయినా జారిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి. తాను చాలా అదృష్టవంతుడని రావు గారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటె పెద్దదిలా కన్పిస్తుంది. ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే యిద్దరు పిల్లలున్నారనీ, అతను ఈమధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ చూసుకోవడం ప్రారంభించా డనీ వాళ్లెవ్వరూ అనుకోరు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించా లని నిశ్చయించుకున్నాడు. మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని, కోరికలు వాళ్ల ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన యింట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టాడు. ఆ పద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికీ కూడా ఎంతో శాంతీ, సుఖం సమకూరుస్తోంది. గాలి అరుస్తోంది. జల్లు కూడా ప్రారం భించింది. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి అటూ ఇటూ చూచి దూరంగా జరిగింది. చక్కగా దువ్విన తలకట్టులోనించి ముంగురులు విడిపోయి ఆమె నుదురుమీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తల దువ్వుకునే పద్ధతి రావుగారు నిర్ణ యించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ రావుగారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీ వానా పెట్టెలోకి చొచ్చుకు వచ్చాయి. చినిగి పోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ నిలబ డింది. ముసలాయన ‘ఇది పరుపుల పెట్టి అని తెలియదూ’ అన్నాడు. ‘బాబ్బాయి! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాక సోటివ్వరా బాబుగారూ. దయగల బాబులు! బిడ్డలున్నాతండులు! ఓ కానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతంది బాబులు...’ రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లల్లో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయో జనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చ మెత్తుకోడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్లి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు. ‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి యింత మాత్రం జాలి లేదు. ‘ఫో’ అంటాడు’. తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. ఇష్టం లేకపోయినా ఆమె వేపు చూస్తూ కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తే పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడస్తుందోనని భయం. ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ‘డబ్బున్న దొరలున్నా రని, నాబోటి ముష్టిముండని ఆకలితో సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేముడ! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్లుంటారు. ఆళ్లకే ఎక్కువ జాలి. డబ్బున్నా బాబులంతా రాతిగుండె లని తెలుసుకోలేక పోయాన్రా దేముడా! రావుగారి పక్కనున్న పెద్దమనిషి విచిత్రంగా ఆమెవేపు చూశాడు. ‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు.‘ఓ వూరేటి, ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్లకి. తమబోటి పెభువులకి వూళ్లుంటాయి. పెద్ద పెద్ద లోగిళ్లుంటాయి. గేటు ముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్లని రానీకుండా తరిమేయిత్తారు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’ ‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని ఉద్దేశించి, ఇంగ్లీషులో. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకు తోంది. ముష్టిది పెట్టెలో యువ దంపతు లకు ఎదురుగా కూర్చుంది. యువకుడు అన్నాడు: ‘మాతో కూడా వచ్చేయ కూడదూ నువ్వు? పనీపాటా చేస్తూ వుందుగాని తిండీ గుడ్డా యిస్తామ్.’ ‘ఏదో యిచ్చి దాన్ని పంపెయ్య కూడదూ?’ అంది యువతి భర్తని ఉద్దేశించి. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారి మనస్సు ఇతర విష యాలతో నిండిపోయింది. ఆయన గాలి వానను గురించీ, తను రైలులోంచి దిగడాన్ని గురించీ ఆలోచిస్తున్నాడు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో బట్టుకు లేచాడు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. తూలిపోయారు. ముష్టిమనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావు గారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలో చించడానికి అవకాశం లేదు. ఆమె సహా యాన్ని అంగీకరించక తప్పలేదు. కాని ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లం ఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ. కాని రైలు దిగి స్టేషనులోకి పరుగెత్తి వెళ్లిపోయారు. ముష్టి ఆమె సామానుల బరువుతో తూలుతూ వెనకాల వచ్చింది. సామానులు వెయిటింగు రూములో పెట్టింది. ఎక్కడా ఒక్క దీపం లేదు. రావు గారు కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబో యాడు. ఆమె వద్దనలేదు గాని, ఏదో విన బడకుండా అని మాయమైపోయింది. రావుగారు కూర్చున్నాడు. గింగురు మనే ఆ గాలిలో కళ్లు పట్టు తప్పిపోతు న్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమాడు. బాటరీ లైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. తడిబట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నాడు. స్వెట్టరు తొడుక్కున్నాడు. మఫ్లరు చెవులకు, తలకు చుట్టుకున్నాడు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు ఉండి తీరాలని బయటికి వచ్చాడు. ఇద్దరు ప్లాట్ ఫారం దాటివెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషను మాష్టరనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు. ‘నేను వూర్లోకి వెళ్లాలి’ అన్నారు రావుగారు ఆదుర్దాగా. ‘చాలా కష్టం. రోడ్డుమీద అంగుళం అంగుళానికీ చెట్లు పడి వున్నాయి. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.’ ‘కాని స్టేషన్లో యింకెవరూ లేరు.’ ‘నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.’ స్టేషను మాష్టరు వెళ్లిపోయాడు. రావు గారు వెయిటింగ్ రూంలోకి వెళ్లిపోయారు. మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావు గారికి తోచలేదు. క్రమశిక్షణ, నియ మాలు, విలువలు అన్నీ కూడా మానవా తీతమైన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితాలైపోతాయని ఆయనకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడా మానవ హృదయమన్నది లేదు. గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ గదిలో యింకో వస్తువేదో వున్నట్టు రావుగారికి కనిపించింది, తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వేపు చూశాడు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ వొక మూల నిలబడివుంది. ఆమె తడి వెంట్రు కలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది. ‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా ఉంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్లీ తలుపులు మూసి గదిలో వున్న కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ‘‘ఏం గాలివానండి బాబుగారు. నేను పుట్టిన్నాటినుండి యింత గాలివాన నేను చూడలేదు’’ అంది ముష్టి ఆమె. ఆమె గొంతులో బెదురులేదు. అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడకల్గుతూందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశాడు. మూలగా వొణుకుతూ కూచున్నది. రావుగారు తన పంచ ఒకటి తీసి ఆమె వేపు విసరి ‘యిది కట్టుకో’ అన్నారు. కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్న చోట కూర్చుంది. రావుగారికి ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది. బిస్కట్ల పొట్లం తీశాడు. ఒకటొ కటి చొప్పునా నమలడం ప్రారంభించాడు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని కొన్ని బిస్కట్లిచ్చాడు. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె వుండడం కొంత నయం. ఆమె దేన్ని గూర్చీ బాధ పడదు గాలీ వానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా ఆమెకు అనుభవమై వుంటాయి. రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. ‘ఈ యిల్లు కూలిపోదు గదా?’ అని ఆయన అడిగారు. ‘ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువైతే ఏది ఆగుద్ది?’... ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం. ఆయన పెట్టె దగ్గరకు పోయి కూర్చు న్నాడు. ఆయన కూర్చున్న మూలకు ఆమె కూడా చేరింది. అక్కడ కూచుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది. ‘గాలివాన యింత ముదిరిపోతుందని నేననుకోలేదు.’ ‘బాబుగారు ఎందుకలా భయపడతా’ రందామె. ‘ఒక్కరుండేకంటె యిద్దర మున్నాం గదా! టిక్కెట్టు కలెక్టరు రైలు కదులు తూంటే నన్ను దింపేశాడు, ఏం చేయను! ఇక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టుమెట్టుకోనాకి ఓ పొడి గుడ్డ యిచ్చారు. ఆకలికి మేత పడేశారు. వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అది లేదనీ, యిది లేదనీ సీకాకు పడితే ఏం లాభం?’ ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ మన మనస్సుకీ ఎంతో అంతరం వుంది. అయినా ఆ భయంకరమైన రాత్రివేళ తనకు తోడుగా ఆమె వున్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. ‘నీకెవరూ చుట్టాలు లేరా?’ అన్నా రాయన. వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. రైలులో ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. కాని ఆమె మాటల్లో గానీ చేతల్లో గానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆయన దగ్గరగా జరిగింది. ‘సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగు తాడు. ఆడే మా అమ్మని సంపేశాడం టారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగ ముండావాడితో సేవితం కలిగింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటైపోయాయండి. ఇంట్లో తిండికీ తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి. ‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు?’ ‘ఒక్కొక్కరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒక్కొక్కరోజు కానీ కూడా ఉండదు.’ రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపిం చింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు గానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలు గానీ ఆమెకు లేవు. ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకేసలా చూత్తారు?’ అంది. ‘మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.’ వెంటనే ఆయన తనలోకి ముడుచుకు పోయారు. తన మనస్సులో అశ్లీలైన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచిం చినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. ‘నీవేపు చూడ్డం లేదు’ అన్నారాయన గట్టిగా. ‘దీపం ఆర్పడం మరచిపోయాను.’ అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచు కున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదురైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీమీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలలోకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగలించు కున్నాడు. వెంటనే సిగ్గుపడ్డాడు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టి నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లాడు మూలలోకి. ఆమె ఆయనను ఆ మూలలో కూచోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతు లాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన జరుగుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావ సరం. అంచేత ఆయన కాదనలేదు. ఆమె మరీ దగ్గరగా జరిగి వొళ్లోకి వాలింది. ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనా పరంపరలో మునిగిపోయాడు. ఆమె మాట్లాడుతూనే వుంది. ‘ఈ మూల భయం లేదండి. బాబుగారికి చక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుచు కుంటున్నారు. మా గుడిసి ఎగిరిపోయుం టది. పిల్లేమైయుంటారో! ఇరుగు పొరు గోళ్లు సూత్తుంటార్లెండి. మావోడు చిత్తుగా తాగి పడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలు సుకంగా వున్నారో లేదో?’ ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆమెను గట్టిగా అదుముకున్నాడు క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానివేసింది. గాలి చేసే గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. కాలం అతి మెల్లగా జరుగుతోంది. కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలివల్ల వాన వారిద్దరినుంచీ దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశాడు. అమాయికంగా, నిశ్చింతగా వుంది. స్వచ్ఛమైన, నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింప జేసింది. గాలివాన జోరు హెచ్చింది. కాని ఆయన మనస్సులో అమితమైన ప్రశాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మరచిపోయి నిద్రలో మునిగిపోయాడు. మళ్లీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టి ఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం చూచుకున్నారు. ఐదుగంటలయింది. అనుకోకుండానే జేబులు తడుము కున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట ‘దొంగ ముండ’. కాని ఆమె అల్లా దొంగతనం చేసి వుంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గు మూలలా వెతికారు. కనబడలేదు. గదిలో నుంచి బయటికి వచ్చారు. భీభత్సంగా వుంది. ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్క లంతా నీటిమయం. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టి నప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనెప్పుడూ చూడలేదు. వికారం వచ్చింది. వెనక్కు తిరిగాడు. టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నాడు. ఆ కల్లోలాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ సామాను కింద ఏదో శరీరం ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టి ఆమె. తట్టుకోలేకపోయాడు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయి నట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరా వుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి తొందరగా యింటికి పోయుంటాడు. రావు చిన్నపిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించాడు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నాడు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ శాంతినీ గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడి పోయి వుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రం లాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు అనిపించింది. తన పర్సును దొంగలించినందుకు గాని, అంత గాలి వానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చు నని టిక్కట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసును. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్య గాని ఆయన పిల్లల్లో ఎవరుగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం... అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే. అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకుని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందులోంచి డబ్బు తీసి తెరచి వున్న డ్రాయరులో వేసి డ్రాయరు మూశాడు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయన మనస్సు వొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేడు. అంతచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్నించి వెళ్లిపోయాడు. (స్థలాభావం కారణంగా కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది) - పాలగుమ్మి పద్మరాజు -
గాలివాన బీభత్సం
కెరమెరి, న్యూస్‌లైన్ : కెరమెరి మండలం అంతా కూడా గాలివానతో అతలాకుతలం అయింది. హట్టి, సాకడ, గోయేగాంలోని ప్రధాన రహదారులతో పాటు పోలీస్‌స్టేషన్ ఎదుట చెట్లు విరిగిపడ్డాయి. ఆయా దారుల్లో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. హట్టి, మోడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రూపాం తరం కింద నిర్మించిన భవనాల పైకప్పులు గాలికి లేచిపోయి పంట పొలాల్లో పడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు కానీ, ఇతర పాఠశాల సిబ్బంది కానీ ఆ గదుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఝరిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న జొన్న పంట నేలవాలింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు 30 ఇన్సులేటర్లు పాడైపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.