సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సికింద్రాబాద్, కుత్బులాపూర్, తిరుమలగిరి, ఉప్పల్, మేడిపల్లి, బొల్లారం, ముషీరాబాద్, కాప్రా, కొత్తపేట, చైతన్యపురి, నాచారం, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్‌లలో సోమవారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ కుప్పకూలింది. టవర్ రోడ్డు మీద పడటంతో దాని కింద చిక్కుకున్న ఒకరు మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం కాగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతున్ని ఆయాకర్ భవన్‌లో పనిచేసే సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. గాయపడినవారిని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డిలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ షెడ్ కూలిపోయింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరుగుతున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఆదేశించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment