ముంచెత్తిన గాలివాన  | Heavy Rain In Telangana | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన గాలివాన 

Published Tue, Jun 4 2019 1:34 AM | Last Updated on Tue, Jun 4 2019 1:34 AM

Heavy Rain In Telangana - Sakshi

సోమవారం కురిసిన వర్షానికి జలమయమైన అమీర్‌పేటలోని ఓ రహదారి

సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవా రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు నెలకొనగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలముకొని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు, నిర్మల్‌ జిల్లాలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మరణించగా చాలా ప్రాంతాల్లో వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగిపడటం, రేకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో వివిధ జిల్లాల్లో ఆస్తి నష్టం సంభవించింది. 

గాలివానకు ఎల్బీనగర్‌లో విరిగిపడిన చెట్టు  

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి... 
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈదురుగాలులకు తాటిచెట్టు మధ్యకు విరిగిపోవడంతో ఆ సమయంలో చెట్టుపైనే ఉన్న శిఖ చంద్రయ్య (47) అనే గీత కార్మికుడు కిందపడి మృతి చెందాడు. దేవరకొండకు చెందిన ఏలే ఓంకారం (49) ఓ చెట్టు కింద కూర్చోగా ఈదరుగాలులకు ఆ చెట్టు కూలి మీద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాళ్ల జనగాం, మల్లాపురం, ధాతార్‌పల్లి, లప్పానాయక్‌ తండా, జంగంపల్లి గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చలిమెడ గ్రామంలో ఓ రైతు కోళ్ల ఫారం కూలిపోవడంతో 10 వేల కోళ్లు చనిపోయాయి. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం కోలాంగూడకు చెందిన సీడాం వనిత (18) మొక్కజొన్న పంట చేను కాపలాకు వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించింది. వికారాబాద్‌ జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలంలో కురిసిన వడగళ్ల వానకు మామిడి, వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రాలతోపాటు కల్వకుర్తిలో గంటసేపు భారీ వర్షం కురిసింది. కల్వకుర్తిలో వందేళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది. 

యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురంలో తాటిచెట్టు పడటంతో మరణించిన గీత కార్మికుడు ​​​​​​​

విరిగిపడ్డ టెలిఫోన్‌ టవర్‌... 
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం టీజీపల్లిలో గాలివాన తీవ్రతకు గ్రామ టెలిఫోన్‌ టవర్‌ కూలిపోయింది. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కేజీబీవీ సమీపంలో ఈదురుగాలులకు పెద్ద చెట్టు విరిగి విద్యుత్‌ తీగలపై పడటంతో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు, తొమ్మిది విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. పార్‌పెల్లిలో 12 విద్యుత్‌ స్తంభాలు, నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు పడ్డాయి. మండల కేంద్రానికి చెందిన చాంద్, రాజ్‌ అనే వ్యక్తులు పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేటలో ఏకంగా 8.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అదే జిల్లా మహేశ్వరం మండలం మంకాల్‌లో 7 సెంటీమీటర్లు, వికారాబాద్‌ జిల్లా తొర్రూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  

మంచిర్యాల జిల్లా టీజీపల్లిలో గాలివానకు కూలిన టెలిఫోన్‌ టవర్‌   ​​​​​​​

బోధన్‌ హైవేపై స్తంభించిన రాకపోకలు... 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గాలివాన తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్ల రేకులు ఎగిరి పోయాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. బోధన్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో రాకపోకలు స్తంభించాయి. బోధన్‌ మండల కేంద్రంలో చెరుకు రసం విక్రయించే దుకాణాదారుని గల్లా పెట్టెలో నుంచి సుమారు రూ. 3 వేలు గాలికి కొట్టుకుపోయాయి. మెదక్‌ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురిసింది. 

యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ఈదురుగాలికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పు  
 
రాజధానిలో జోరువాన... 
ఉపరితల ఆవర్తన ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు చోట్ల భారీ ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వర్షపునీరు పోటెత్తి ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించింది. నగరంలోని ఎస్సార్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శివాజీ (18) అనే బీటెక్‌ విద్యార్థి విద్యుత్‌ షాక్‌కు గురై మరణించాడు. ట్యూషన్‌కు వెళ్లిన తన సోదరుడిని తీసుకొచ్చేందుకు గొడుగు వేసుకొని బయటకు వచ్చిన అతను ఓ స్కూలు సమీపంలో నిలబడగా అక్కడి విద్యుత్‌ స్తంభానికి గొడుగు పైభాగం తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గరిష్టంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా సాయంత్రం కురిసిన వర్షంతో నగరవాసులకు ఉపశమనం లభించింది. బీహెచ్‌ఈఎల్‌లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

బంజారాహిల్స్‌లో కురుస్తున్న భారీ వర్షం 

మరో ఐదు రోజులు ఇంతే: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం 
నైరుతి రుతుపవనాల రాకకు ముందు రా ష్ట్రంలో వచ్చే 5 రోజులపాటు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వడగాడ్పులు వీస్తాయని, సాయంత్రం 4 గంటల తర్వాత అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement