గాలి, వాన బీభత్సం | Huge Rainfall in several districts across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గాలి, వాన బీభత్సం

Published Sun, Apr 26 2020 3:01 AM | Last Updated on Mon, Apr 27 2020 5:32 PM

Huge Rainfall in several districts across Andhra Pradesh - Sakshi

తిరుమల ఆలయం ముందు నిలిచిన వర్షపు నీరు

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో  ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా కొన్ని చోట్ల కొంత మేర పంట నష్టం వాటిల్లింది. అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో విద్యుత్‌ లైన్లు ధ్వంసమయ్యాయి. 

విశాఖ జిల్లాలో ఇద్దరు మృతి
విశాఖ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. అటు ఏజెన్సీ ప్రాంతంలోనూ భారీ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఇళ్ల మీద విరిగిపడడంతో ఇళ్లు దెబ్బతిన్నాయి. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం కలిగింది. 

రెంటచింతలలో గరిష్ట ఉష్ణోగ్రత 43.1 డిగ్రీలు
గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 43.1 కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రెంటచింతలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది. 

విజయవాడలో శనివారం రాత్రి భారీగా వర్షం కురుస్తున్న దృశ్యం 

పొలాల్లో 35 మేకలు మృతి
► కడప, అనంతపురం జిల్లాల్లో గాలి, వాన భీభత్సం కారణంగా ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ లైన్లు, పోల్స్‌ దెబ్బతిన్నాయి. 
► చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. తిరుమలలో వర్షం కురిసి ఆలయం ముందు నీరు నిలిచింది. 
► విజయనగరం జిల్లాలో ఎస్‌.కోట, సాలూరు నియోజకవర్గాల్లో వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి, మొక్క జొన్న పంటలకు స్వల్ప నష్టం వాటిల్లింది. జిల్లాలో రెండు సెంటీ మీటర్ల వర్షం పడిందని అంచనా. పాచిపెంట మండలంలో పిడుగు పడి అరకుకు చెందిన ఒక మహిళ మృతి చెందింది. 
► శ్రీకాకుళం జిల్లాలో కురుసిన అకాల వర్షం, పిడుగుల కారణంగా జలుమూరు మండలం హుస్సేనుపురం సమీపంలోని తంపర పొలాల్లో 35 మేకలు మృత్యువాత పడ్డాయి. 
► తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మూడేళ్ల చిన్నారి మడదా శ్రీధరి పిడుగుపాటు కారణంగా మరణించింది.

మూడ్రోజుల పాటు ఉత్తరాంధ్రకు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : ఛత్తీస్‌గఢ్, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా దక్షిణ తమిళనాడు, తూర్పు మధ్యప్రదేశ్, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో  తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి ఈనెల 27 వరకూ గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కోస్తాంధ్రతో పాటు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వైపు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement