ఈ నగరానికి ఏమైంది? | What happen to this city | Sakshi
Sakshi News home page

ఈ నగరానికి ఏమైంది?

Published Sun, May 22 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

ఈ నగరానికి ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది?

- ఒక్క గాలివానకే హైదరాబాద్ అతలాకుతలం
- పెద్ద తుఫాను వస్తే జరిగే అనర్థం ఊహాతీతం

 
 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే ఇంత బీభత్సం  సగానికిపైగా నగరంలో అంధకారం
 వాతావరణ మార్పులతోనే తీవ్రగాలులు, జడివాన  ఇక ముందు మరింత తీవ్రంగా ఉండే అవకాశం
 భూగర్భ కేబుల్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి  డ్రైనేజీలను విస్తరించాలి.. రహదారులను మెరుగుపర్చాలని సూచనలు

(చూడండి: హైదరాబాద్ లో వర్ష బీభత్సం ఫొటోలు)
 
సాక్షి, హైదరాబాద్: కేవలం అరగంట పాటు కురిసిన గట్టి గాలివానకే భాగ్య నగరం అతలాకుతలం అయిపోయింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుకే విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, చెట్లు కూలిపోయి, తీగలు తెగిపోయి అంతా బీభత్సంగా మారింది. నగరంలో చాలా భాగం ఒకటిన్నర రోజులుగా అంధకారంలో మునిగిపోయింది. కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతిన్నది. ఎక్కడికక్కడ గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారులు, మురుగునీటి కాల్వలన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి... అరగంట పాటు ఈదురుగాలులతో కురిసిన జడివాన ధాటికే ఇలా ఉంటే... హుద్‌హుద్ వంటి తుఫాను వస్తే, 150 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఓ గంట తర్వాత హైదరాబాద్‌లో చూడడానికేమీ ఉండదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగిన చర్యలు చేపట్టకపోతే... హైదరాబాద్ విశ్వనగరం కాదని, అసలు ఎవరూ ఉండలేని దుర్భర నగరంగా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు.


 
తేమ ఎక్కువగా ఉండడంతోనే తీవ్రత
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పడిన మేఘాల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే గంటకు 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలితో తేమ ఎక్కువగా ఉండడం వల్లే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80 శాతానికిపైగా గాలిలో తేమ ఉంది. దీనికి ఉష్ణోగ్రత పెరుగుదల తోడైతే వాతావరణంలో అస్థిరత ఏర్పడుతుంది. హైదరాబాద్‌లో మూడు రోజుల కింద 35 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 38.6కు పెరిగింది. దీంతోపాటు గాలిలో తేమ శాతం పెరగడంతో మేఘాలు తీవ్రరూపం దాల్చాయి. ఇలాంటి సమయంలో అధిక శక్తితో గాలి నెట్టబడుతుంది. అందుకే మేఘం ఆవరించిన ప్రదేశమంతా గాలి విధ్వంసం చోటు చేసుకుంటుంది.
 - రాజారావు, హైదరాబాద్ వాతావరణ అధికారి
 
భూగర్భ కేబుల్ వ్యవస్థ అవసరం
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా భవిష్యత్తులో మరింత వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని, ఒక్కసారిగా మేఘాలు ఏర్పడి జడివానలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలా జరిగితే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోతాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల హైదరాబాద్‌లో భూగర్భ కేబుళ్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తే మేలని సూచిస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే ముందు ముందు సమస్యలు మరింత తీవ్రమవుతాయని స్పష్టం చేస్తున్నారు. చిన్న గాలివానకే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని... ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇరవయ్యేళ్ల కిందే భూగర్భ కేబుల్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

రోడ్లు, డ్రైనేజీలు మెరుగుపడాలి
హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లడం, రోడ్లు జలమయం కావడం, ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించి పోవడం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. దాంతో పలు చోట్ల రహదారులు గుంతలుగా తయారయ్యాయి. ఇది వాహనదారులకు నరకం చూపించింది. ఇలాంటిది ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే నగరంలో జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అప్పుడు విశ్వనగరం కాదుకదా.. అభాగ్య నగరంగా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీరు వేగంగా వెళ్లిపోయే స్థాయిలో డ్రైనేజీలను నిర్మించాలని.. ఆక్రమణలను తొలగించి విస్తరించాలని సూచిస్తున్నారు. రహదారులను కూడా సరైన స్థాయిలో అభివృద్ధి చేయాలని స్పష్టం చేస్తున్నారు.

హోర్డింగ్‌లతో వ్యాపారం వద్దు
హైదరాబాద్‌లో ఏ మూలన చూసినా కనిపించే భారీ హోర్డింగ్‌లతో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనేదానికి శుక్రవారం నాటి పెనుగాలులతో వాటిల్లిన విధ్వంసమే ఉదాహరణ. ఎడాపెడా హోర్డింగ్‌లకు అనుమతిస్తున్న జీహెచ్‌ఎంసీ... వాటి ఏర్పాటుకు ఏజెన్సీలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయా, లేదా అన్నది పట్టించుకోవడం లేదు. నాసిరకంగా, తక్కువ ఖర్చుతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి... భారీగా ఆదాయం ఆర్జించుకుంటున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వంగానీ, జీహెచ్‌ఎంసీగానీ పట్టించుకోలేదు.

వాస్తవానికి శుక్రవారం నాటి పెనుగాలులు హైదరాబాద్‌వ్యాప్తంగా వీచి ఉంటే.. పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు కూలిపోయి భారీగా ప్రాణనష్టం ఉండేదని అధికారులే పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లకు అనుమతులు రద్దు చేసి నిర్ణీత నిబంధనలతో తిరిగి అనుమతిచ్చే విషయాన్ని జీహెచ్‌ఎంసీ పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలపై ఎడాపెడా ఏర్పాటవుతున్న మొబైల్ టవర్లకు సంబంధించి కూడా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బ్యాంకులకు తిప్పలు..
పెనుగాలుల ధాటికి కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో హైదరాబాద్‌లోని అనేక బ్యాంకులు శనివారం కార్యకలాపాలు నిర్వహించలేదు. ఆన్‌లైన్ వ్యవస్థ పని చేయకపోవడంతో చాలా చోట్ల ఏటీఎంలు కూడా పనిచేయలేదు. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు.

వణికిపోయిన విమానం
శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెనుగాలులకు వణికిపోయింది. విమానం తీవ్రంగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ఏ మాత్రం తేడా వచ్చినా విమానం కూలిపోయి, అందులోని ప్రయాణికులంతా బలయ్యేవారే. దీనిపై పౌర విమానయాన శాఖకు ఫిర్యాదు అందింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతించడం వల్లే తమ విమానం టేకాఫ్ అయిందని... అందులో పైలట్ తప్పిదమేమీ లేదని శుక్రవారం రాత్రే స్పైస్‌జెట్ సంస్థ పౌర విమానయాన శాఖ డెరైక్టర్ జనరల్‌కు వివరణ ఇచ్చారు. అయితే స్పైస్‌జెట్ విమానం తీవ్ర కుదుపులకు లోనైనట్లు గుర్తించిన ఏటీసీ అధికారులు ఆ తరువాత దాదాపు 30 నిమిషాల పాటు విమానాల ల్యాండింగ్‌కు, టేకాఫ్‌కు అనుమతించలేదు. పెనుగాలులను ఏటీసీ అంచనా వేయలేకపోవడం, వాతావరణం బాగా లేని సమయంలో విమానం టేకాఫ్‌కు అనుమతించడంపై పౌర విమానయాన శాఖ విచారణ జరుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement